May 1, 2024

‘తరం-తరం నిరంతరం’

రచన: వాలి హిరణ్మయీదేవి

తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉన్న లలిత ఉలిక్కిపడి లేచింది. తలుపు తెరచి నిశ్చేష్టురాలై నిలిచిపోయిన భార్యను చూసి, “ఏమిటి లలితా?” అంటూ వచ్చిన మధుమూర్తి పూలదండలలో ఉన్న కొడుకుని, అతని పక్కన నవవధువుని చూసి నోట మాట రాకుండా అయిపోయాడు.

ఆగ్రహంతో కళ్ళు ఎర్రబడిన లలిత “ఛీ వెధవా! ఏం మొహం పెట్టుకుని వచ్చావురా? పెద్దలం మేమింకా బ్రతికి ఉండగానే ఒక్క మాటైనా చెప్పకుండా తగుదునమ్మా అంటూ పెళ్లి చేసుకొచ్చావా? నీ కన్నా ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలుండగా పెళ్ళికెందుకంత తొందర వచ్చిందిరా? ఏమ్మా – మా వాడికెలాగూ బుద్ధి లేదూ, ఆడపిల్లవి నీకుండక్కర్లా? ఏనాడూ నా మాట కెదురు చెప్పలేని వాణ్ణి నీ కొంగుకు ముడేసుకుంటావా? రేపు నీకూ ఓ కొడుకు పుట్టి, వాడూ ఇలాంటి వెధవపని చేసిన నాడు గానీ…”

లలిత ఇంకా ఏదో అనబోతూ ఉండగానే మధుమూర్తి, “లలితా, వాళ్ళిద్దరినీ తక్షణమే ఇంట్లోంచి పొమ్మని చెప్పు… అంతే కానీ ఇంకేమీ అనకు. ఆ తలుపులు మూసెయ్ ముందు…” అంటూ లోపలి వెళ్ళిపోయాడు. నిద్రకు నోచుకోని అతని కళ్ళ ముందు గతం గిర్రున తిరిగింది.

***

“లోకం మారిపోతోంది. మా కాలంలో మేమెప్పుడూ ఇలాగ పెద్ద వాళ్ళనెదిరించి మాట్లాడలేదు. పెళ్ళి కెదిగిన అక్క వుండగా నువ్విలా ఆ అమ్మాయినిప్పుడు పెళ్లి చేసుకుంటానని అనటం ఏమీ సమజసంగా లేదు.. నిదానంగా ఆలోచించు” అన్నారు రామారావుగారు. కొడుకు తనను ఎదిరించి మాట్లాడటం ఆయన్ని చాలా కలవరపెట్టింది.

“ఏం అక్క పెళ్లి ఈ ఏడు చేసేస్తున్నారా? మరో ఐదేళ్ళకో పదేళ్ళకో గాని అక్కకి పెళ్లి చేసే తాహతు రాదు మీకు. అందుకని అంతవరకూ లలితను పెళ్లి చేసుకోకుండా మడి గట్టుక్కూర్చోవాలా?” తల ఎగరేస్తూ విసురుగా అన్నాడు మధు.

“చూశారా వాడెంతెంత మాటలంటున్నాడో? అయినా ఆస్తంతా వీళ్ళకే పెట్టాం కదా… పెళ్లి కావలసిన పిల్ల బజార్న పడి దాని పొట్ట అది పోసుకోవడమే కాక, వీడిని చదివించినా వీడికి మాత్రం అక్క అన్నీ చేసిందే అన్న విశ్వాసం లేదు.

అరేయ్ మధూ, నువ్వేది కావాలంటే అది ఒక్కగానొక్క మగపిల్లాడంటూ అమర్చాం గదరా! ఈ పెద్ద వయసులో మమ్మల్ని పోషిస్తూ ఇంటి బాధ్యత తీసుకోవలసింది పోయి ఇలా నాన్నగార్ని నిలదీస్తావేంట్రా?” గొంతు జీరపోతూండగా అన్నారు సావిత్రమ్మ గారు.

“ఏంటి మీరమర్చింది? నాకు ఊహ తెలిసిందగ్గర్నుంచి ఇదే పేదరికం – ఇదే వెధవ బ్రతుకు. ఉన్న ఆస్తినంతా మీ వయసులో మీ సుఖాలకు, విలాసాలకు ఖర్చు పెట్టుకున్నారు. పిల్లల్ని కనగానే సరి కాదు – వారి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మీది. పెద్దవాళ్ళిద్దరికీ ఉన్న ఇల్లు అమ్మి పెళ్లి చేసారు. ఇప్పుడు అక్కకి, ఇద్దరి చెల్లెళ్లకి ఎలా చేద్దామనుకుంటున్నారు? ఇపుడు ఆయనేదో దయతలచి, పిల్లనిచ్చి పెళ్లి చేసి ఉద్యోగమిస్తానని అనగానే నా తలకు మించిన భారం మీరు వేస్తే ఎలా భరించాలి? మీకు ఎల్లకాలం కష్టాలు తప్పవు. అందుకని నేనూ ఇలాగే కష్టాల్ల్లో మగ్గిపోవాలనా మీ ఉద్దేశం?

నా బ్రతుకు నా చేతుల్లో ఉంది – మీరు చెప్పినట్టే చేయాలంటే ముసలాణ్ణయి పోయినా నాకీ బాధ్యతలు వదలవు. అందుకే అమ్మా నాన్నా గుడ్ బై…” చర చరా బయటకు నడిచాడు మధుమూర్తి.

***

అప్పుడు తను పెళ్లి చేసుకుంటానని మాత్రమే తండ్రిని అడిగాడు. ఇప్పుడు తన కొడుకు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చాడు. ‘తరం-తరం నిరంతరం’ ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుందన్న మాట! అనుకున్నాడు బాధగా కణతలు రుద్దుకుంటూ మధుమూర్తి.

***
(సమాప్తం)

ది.21.12.1984 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక నుండి

1 thought on “‘తరం-తరం నిరంతరం’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *