April 30, 2024

‘వెన్నెల్లో గోదారి అందం’

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి

Rail-Road_bridge_Godavari

‘వెన్నెల్లో గోదారి అందం’

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి

దక్షిణ భారతం లోనే అతి పెద్ద నది గోదావరి… ఎక్కడో మహారాష్ట్రం లోని నాసిక్ దగ్గర త్రయంబకం అనే ప్రదేశంలో పుట్టి, అక్కడ, తెలంగాణా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి, చివరికి గౌతమిగా, వశిష్టగా బంగాళాఖాతంలో సంగమించే పవిత్ర నది గోదావరి. ఎందఱో రైతులకు పూజ్యురాలై దేవతగా పూజలందుకునే ఈ నదీమాతకు పుష్కరాల సందడి జులై నెల పధ్నాలుగో తారీఖు నుండి మొదలవబోతోంది.

ఈ సందర్భంగా చిత్రజగతిలో ఈ నదీమతల్లిని చిత్రీకరించే అపూర్వ అవకాశాలు ఎన్నింటినో  మన దర్శకులు పొందారు. ‘ఉయ్యాల-జంపాలా’, ‘మూగమనసులు’ వంటి సినిమాలే కాక, బాపూగారు తీసిన ‘అందాలరాముడు’ చిత్రం నాలుగింట మూడు వంతులు గోదావరి మీదనే చిత్రీకరించారు. పాపికొండల అందాలను ఒడిసిపట్టి మనకి సెల్యులాయిడ్ మీద అందించారు దర్శకులు బాపు. ఆ తర్వాత ఆ ఖ్యాతి యువదర్శకులు  ‘శేఖర్ కమ్ముల’ గారికే దక్కింది. ‘గోదావరి’ చిత్రం రసహృదయులైన ప్రేక్షకులకు పూర్తి కన్నుల విందు… తొంభై శాతం చిత్రం అంతా గోదావరి మీదనే… అందుకనే ఎన్ని సార్లు ఈ చిత్రాన్ని వీక్షించినా విసుగు కలగదు… ఆ తరువాత వంశీ గారు దర్శకత్వం వహించిన ‘గోపీ గోపిక గోదావరి’ చిత్రం కూడా గోదావరి అందాలను మనకు చూపిస్తుంది. ఇవి కాక, ఎన్నో చిత్రగీతాలలో మనం గోదావరి నదీ సుందరిని చూస్తాము… మరి అటువంటి కొన్ని పాటల గురించి ఒక్కసారి అవలోకనం చేసుకుందామా?

‘వేదంలా ఘోషించే గోదావరి – అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ… శతాబ్దాల చరితగల సుందర చరితం… గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం…’ ఎంత కమ్మని పాటో కదండీ… గోదావరి అందాలను, పురాతన చారిత్రక  పట్టణం అయిన రాజమహేంద్రవరాన్ని, వీరేశలింగం గారిని కనుల ముందు నిలుపుతుంది ఈ గీతం. చిన్నారి ప్రకాశం (టంగుటూరి ప్రకాశం పంతులు) తన తల్లిదండ్రులతో గోదావరి మీద పయనించే దృశ్యాలు మనసును దోచుకుంటాయి. ఈ పాటను ఆరుద్ర గారు వ్రాయగా, సత్యం గారు స్వరపరచగా ‘ఆంధ్ర కేసరి’ చిత్రం కోసం శ్రీ బాలూ గారు ఎంతో హృద్యంగా గానం చేసారు.

శేఖర్ కమ్ముల గారి ‘గోదావరి’ చిత్రం టైటిల్ పాట, గోదావరి అందాలను ఎంతో అందంగా చూపిస్తూ ఇలా మొదలవుతుంది. ‘ఉప్పొంగెలె గోదావరి – ఊగిందిలే చేలో వరి… భూదారిలో నీలాంబరి…మా సీమకే చీనాంబరి…” (గోదావరి – 2006) ఈ గీతంలో సాహిత్యం చాలా బావుంటుంది. మాటల మాంత్రికుడు వేటూరి రాయగా, సంగీతం శ్రీ కే.యం.రాధాకృష్ణన్ అందించారు. సుమంత్, కమలిని ముఖర్జీ తదితరులు అభినయించారు. యస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేయం రాధాకృష్ణన్ గానం చేసారు.

‘ఎదురీత’ చిత్రంలోని ఈ గీతంలో ఎంతో లోతైన భావం, తాత్వికత ఉంటాయి… ‘గోదారి వరదల్లో, రాదారి పడవల్లే నీ దారి నీదేనన్నా…ఉయ్యాలలూగే ఈ జగమంతా ఊహలకందని వింతా, ఈ లాహిరిలో నీవెంతా?” ఉదయసంధ్య గోదారి కెరటాల మీద ఉయ్యాలలూగే దృశ్యాలు టైటిల్స్ పడుతూ ఉండగా చిత్రీకరించిన విధానం అత్యద్భుతం…అంతర్లీనంగా ఎంతో వేదాంత పరమైన అర్థాన్ని తెలుపుతున్న ఈ గీత రచన వేటూరి గారు, సత్యం సంగీతంలో బాలూ గారు గానం చేసారు.

‘గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే…ఈ కుర్రదానికి ఏ వైపైనా అందమొక్కటే… కొంగులు రెండూ వేరైనా కోక ఒక్కటే… ఈ కుర్రాడికి ఏ పొద్దూ కోరికొక్కటే’ (మన ఊరి కథ – 1976) కృష్ణ, జయప్రద అభినయించగా యస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడగా జేవీ రాఘవులు గారి స్వర రచనలో ఆత్రేయచే రచింపబడిన గీతం ఇది.

‘పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు… పొడిచే తొలిపొద్దులా…’ అంటూ సాగే ఈ గీతం ‘రాధమ్మ పెళ్లి’ చిత్రం లోనిది. సినారె గారి గీతానికి రమేష్ నాయుడు స్వరాలను కూర్చగా, ఎంతో హుషారుగా జానకి గారు పాడారు.

 

‘పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది, పుష్కరమల్లే  వచ్చి పొమ్మనీ గోదారడిగింది… నువ్వు రావాలా, పువ్వు పూయాలా, రావేలా జడ గంటమ్మా… రతనాల మా జానకమ్మా…’ ఈ పాట వింటుంటే, గోదారి గట్టున అలా అలా నడచి పోతున్న ఎలనాగ కనుల ముందు కదులుతుంది. చక్కని ఈ పాటను రచించింది కమ్మని మాటల వేటూరి గారైతే సంగీత సృష్టి చేసింది మామ అనుంగు శిష్యుడు శ్రీ పుహళేంది గారు. యస్పీ బాలు, శైలజ గానం చేయగా, నటుడు సురేష్, అభినేత్రి విజయశాంతి అభినయించారు (జడగంటలు – 1984).

‘వయ్యారీ గోదారమ్మ వళ్ళంతా ఎందుకమ్మా కలవరం? కడలి ఒడిలో కరిగిపోతే కల-వరం…’ వేటూరి సాహిత్యానికి సంగీత విదుషీమణి ఇళయరాజా గారి సంగీతంతో యస్పీ బాలు, జానకి పాడిన ఈ పాటకి రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ అభినయించారు. ఈ పాటలో ఇళయ రాజా గారు చేసిన చిత్ర విచిత్ర స్వర ప్రయోగాలు ఎన్నో… (ప్రేమించు-పెళ్ళాడు 1985)

‘ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి… సొగసులై బృందావని విరిసే నా సిగలోనికి…జత వెదుకు  హృదయానికి శృతి తెలిపే మురళి… చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి… రస మయం జగతి…’ ఆత్రేయగారి చక్కని పదాల పొందికకు ఇళయరాజా గారి స్వర సౌరభం తోడైతే ఇదిగో ఈ పాటౌతుంది… చిరంజీవి, రాధికల మీద చిత్రీకరించబడిన ఈ గీతం పాడింది యస్పీ బాలు, యస్ జానకి గారలు… (అభిలాష – 1983).

దర్శకులు కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎంత భావుకత, ఆర్ద్రత, ప్రకృతి అందాలు ఉంటాయో అందరికీ తెలుసు. ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలోని ఈ పాట ‘గోదారల్లే, ఎన్నెట్లో గోదారల్లే, ఎల్లువ గోదారల్లే, ఎన్నెట్లో గోదారల్లే…’ ఒక మూగ పిల్ల హృదయం పాడే ప్రకృతి గీతం ఇది. జయప్రద, చంద్రమోహన్ ఎంతో హృద్యంగా అభినయించిన ఈ గీతరచన వేటూరి, స్వరరచన మహదేవన్ గారు. పాడింది మధురగాయకులు బాలూ, సుశీలలు (సిరిసిరిమువ్వ – 1978).

‘గోదారీ గట్టుందీ… గట్టు మీనా సెట్టుందీ…సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది?’ గోదారి ఒడ్డున ఆడుతూ పాడుతూ గడిపే ఓ మరదలు తన బావను తలచుకుంటూ పాడే చక్కని గీతం. సుశీల గారు పాడగా జమున గారు అభినయించారు. రచన ఆత్రేయ, సంగీతం మహదేవన్. ఇదే సినిమాలో మరో పాటలో ‘తల్లీ గోదారికీ ఎల్లువొస్తే అందం…’ అని జమునారాణి గారితో కూడా పాడించారు (మూగమనసులు – 1964).

‘కొండగాలి తిరిగిందీ… గుండె ఊసులాడింది… గోదావరి వరద లాగా కోరిక చెలరేగింది… ఆ… ఆ… ఆ…ఆ…’ పాట వింటూ ఉంటేనే నదిలో నావలో కూర్చుని జలవిహారం చేస్తున్న భావన రావటం లేదూ? ఈ పాటలోని సొగసంతా సుశీల గారి ఆలాపనలే… ఘంటసాల గారి గాత్రమాధుర్యం ఏం చెప్పాలి? ముఖ్యంగా ఒకరు పల్లవి పాడుతూ ఉంటే బేస్ లో మరొకరు ఆలాపన పాడటం ఈ పాటలోని అద్భుతమైన విషయం. పాటంతా గోదావరి వర్ణనయే… ప్రకృతి తో పరవశమే… ఇంత చక్కగా ఈ పాటను వ్రాసిన వారు ఆరుద్ర గారు., ఇంత చక్కగా బాణీ కూర్చిన వారు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు. జగ్గయ్య, కృష్ణకుమారి అభినయించారు… (ఉయ్యాల-జంపాల 1960).

‘చుక్కల్లో పెద్ద చుక్క చందామామ, ఎలుగులకే ఎలుగంట ఎన్నేలమ్మా… ఆ చందామామకి, ఈ ఎన్నేలమ్మకి చల్లని గోదారి ఒడిలో పెళ్ళంటా, ముత్యాల జల్లంటా…’ తాను ప్రాణంగా ప్రేమించిన చెలికాడికి మరొకరితో మనువు జరిగిపోతుంటే, గుండె రాయి చేసుకొని, ఆ పెళ్ళికి పెద్దరికం వహించి, తన దుఃఖాన్ని గుండెల్లోనే గోదారి తల్లిలా అదిమేసుకుంది ఈ నాయిక. చక్కని ఈ గీతాన్ని ఆలపించింది మన కోయిల సుశీల అయితే సంగీతం రమేష్ నాయుడు గారు చేయగా సినారె గారు రచించారు. అభినయం జయచిత్ర (చిల్లరకొట్టు చిట్టెమ్మ – 1977). ఇదే చిత్రంలో రమేష్ నాయుడు గారు ఆలపించిన ‘తల్లిగోదారికే ఆటు పోటుంటేను తప్పుతుందా మడిసికీ కడదాకా తప్పుతుందా మడిసికీ’ అనే పాటలో కూడా జీవిత సత్యాన్ని, వేదాంతాన్ని వినవచ్చు.

రాఘవేంద్రరావు రావు గారి సినిమాలు బాక్సాఫీసు హిట్టు… వాటిల్లో పాటలు ఎంతో రిచ్… అలాంటి ఈ పాట ‘దేవత’ సినిమాలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా…’ అనే గీతం. ఎన్నో ఇత్తడి బిందెలను ఎంతో కళాత్మకంగా అమర్చి, చక్కగా చిత్రీకరించిన గీతం ఇది. ఇందులో శోభన్ బాబు, శ్రీదేవి అభినయించగా, సుశీల, బాలూ ఈ గీతాన్ని ఆలపించారు. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. (దేవత – 1982).

వీరిదే మరో సినిమాలోని ఈ పాట అచ్చంగా పుష్కరాల గురించే సుమా… ‘పన్నెండేళ్ళకు పుష్కరాలు, పదహారేళ్ళకు పరువాలు…’ రాధిక, కృష్ణంరాజు  అభినయించిన ఈ గీతాన్ని ఆత్రేయ గారు రాయగా, చక్రవర్తి గారు స్వరాలు కూర్చగా, బాలూ సుశీల పాడారు. (త్రిశూలం – 1982).

‘కురిసే వెన్నెల్లో, మెరిసే గోదారిలా… మెరిసే గోదారిలో విరబూసిన నురగలా… నవ్వులార బోసే పడుచున్నది…’ ఈ ప్రేమగీతాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారు, లతా పాడుకున్నారు… సినారె గారు రచించగా కేవీ మహదేవన్ గారు సంగీత దర్శకత్వం చేసారు. వి.రామకృష్ణ, సుశీల గానం చేసారు. ఈ గీత వీక్షణలో హృద్యంగా చిత్రీకరించబడిన – అందమైన వెన్నెలరేయిలో గోదావరి అందాలను ఆస్వాదించవచ్చు… (అందాలరాముడు – 1973).

‘అదిగో అదిగో భద్రగిరి… ఆంధ్రజాతికిది అయోధ్యాపురి…’ గీతంలో భద్రాద్రి చరిత్రను, గోదావరి సౌందర్యాన్ని చూసి తరించవచ్చును… గీతరచన వేటూరి, సంగీతం కీరవాణి. గానం బాలూ… అభినయం, శరత్ బాబు, సుమన్, అర్చన (వేదా), సమీర్ అభినయించారు. ‘హైలెస్సో… హేలెస్సో… ఏటయిందే గోదారమ్మ, ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు? ఎవ్వరో వస్తున్నట్టు, ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు?’ గిరిజనులైన పోకల దమ్మక్క తనవారితో కలిసి గోదావరి మీద పడవపై వెళుతున్నప్పుడు, కంచర్ల గోపన్న (రామదాసు-నాగార్జున) ఆగమనాన్ని సూచిస్తూ పాడే గీతం ఇది. ఇందులో కూడా పాపికొండల సౌందర్యాన్ని ఆస్వాదించ వచ్చు. ఈ పాటను శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు రచించగా యం యం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక ఆలపించారు. (శ్రీరామదాసు-2006).

‘గలగల పారుతున్న గోదారిలా… రెపరెప లాడుతున్న తెరచాపలా… ఈ చల్లనీ గాలిలా, ఆ పచ్చనీ పైరులా… నీ జీవితం సాగనీ… హాయిగా… హే…’ ఇది ఘట్టమనేని కృష్ణగారు అభినయించిన పాట. పంట పొలాలను, ప్రక్రుతి సౌందర్యాన్ని, యువత బాధ్యతను చక్కగా వివరించిన పాట ఇది. దాశరథి గారి గీతానికి సత్యం గారి సంగీతం…  బాలూగారి గళం తొలిన్నాళ్ళలో పలికిన మధురిమలు ఎన్నెన్నో… వాటిల్లో ఇదీ ఒకటి… (గౌరి – 1974).

మళ్ళీ 32 సంవత్సరాల తర్వాత అదే పాట… ‘గలగల పారుతున్న గోదారిలా… జలజల జారుతుంటే కన్నీరలా…  నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా…నాకెందుకో ఉన్నదీ హాయిగా…’ ఇది ఘట్టమనేని మహేష్ బాబు ఇలియానాతో కలిసి అభినయించిన పాట. కందికొండ గారి సాహిత్యానికి సంగీతం అందించిన వారు మణిశర్మ గారు. గానం చేసినవారు శ్రీ నిహాల్. (పోకిరి-2006).

‘గోదారి రేవులోన రాదారి నావలాగ నా మాట చెప్పుకుంటూ ఉంటారంట…నా నోట చెప్పుకుంటే  బాగోదో ఏమో కాని నా అంత అందగత్తె నేనేనంట…’ అభినేత్రి శ్రీమతి మంజుల కుమార్తె రుక్మిణి అభినయించిన ఈ చలాకీ గీతం వినటానికి ఎంతో బాగుంటుంది. ఈ గీతరచన సిరివెన్నెల, సంగీతం విద్యాసాగర్, పాడినవారు సుజాత. (రుక్మిణి – 1997).

‘నిండు గోదారి కదా ఈ  ప్రేమా… అందరికీ బంధువుగా ఈ ప్రేమ…’ గోదావరి ఒడ్డున చిత్రీకరించిన చక్కని ప్రేమగీతం ఇది. దీనిని తరుణ్, ఆర్తి అగర్వాల్ అభినయించారు. కులశేఖర్ రచించిన ఈ ప్రేమగీతాన్ని ఆర్పీ పట్నాయక్, కౌసల్య ఎంతో మధురంగా పాడారు. సంగీతం ఆర్పీ పట్నాయక్. (నువ్వు లేక నేను లేను – 2001).

‘రారామ్మని, రారా రమ్మని… రామచిలుక పిలిచెను ఈ వేళా…’ ఈ పాట కూడా గోదావరి నేపథ్యంలో చిత్రీకరించబడినదే. రచన చంద్రబోస్, సంగీతం చక్రీ… గానం కౌసల్య, బాలూ… అభినయం రవితేజ, కల్యాణి. (ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు – 2002).

ఇక ఎంతో తీయని ఈ గీతాన్ని గురించి చెప్పుకుందామా? ‘వెన్నెల్లో గోదారి అందం… నది కన్నుల్లో కన్నీటి దీపం… అది నిరుపేద నా గుండెలో… చలి నిట్టూర్పు సుడిగుండమై… నాలో సాగే మౌన గీతం…’ ఎంత చక్కని సాహిత్యం? మరెంత చక్కని అభినయం… ఎన్నెన్ని సంగీత విన్యాసాలు? వాయిద్యాల మేళవింపులు? వేటూరి గారి కలం కవనామృతాన్ని వెదజల్లితే దానిని మాస్ట్రో ఇళయరాజా ఒడిసిపట్టి, గానామృతాన్ని చేస్తే, మన జానకమ్మ మనసును మీటేలా పాడితే, భానుప్రియ అభినయిస్తే… ఈ మధురగీతంగా మారింది. ఈ గీతాన్ని అభ్యాసం చేస్తే చాలు వర్థమాన గాయకులు  చేరలేని స్వరతీరాలు ఉండవు. అంత చక్కని గీతం ఇది. ఇళయరాజాగారి గొప్ప సంగీతాన్ని తెలుగునాట మనకి అందించేందుకు ఇతోధికంగా కృషి చేసిన దర్శకులు వంశీ గారిని అభినందించి తీరాల్సిందే మనమంతా… (సితార-1986).

మరి చక్కని గీతాల గురించి చర్చించుకున్నాం కదా, ఇక చల్లని ఆ గోదారమ్మ నీటితో పుష్కర స్నానం ఆచరించి ఆనంద పరవశులమౌదామా?

***

 

 

 

 

1 thought on “‘వెన్నెల్లో గోదారి అందం’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *