May 6, 2024

నిషాదుల మధ్య ఒక బ్రాహ్మణుడు. (మొదటి భాగం)

రచన: తాడిగడప శ్యామలరావు.

అది ఒక అడవి.
అడవి అనగానే మనకు చప్పున గుర్తుకు వచ్చే సంగతులు కొన్ని ఉన్నాయి.
అడవి నిండా రకరకాల వృక్షాలు పొదలు లతలు విస్తారంగా ఉంటాయన్నది గుర్తుకు వస్తుంది.
అడవిలో బోలెడు మృగపక్షిసంతతి ఉంటుందన్నది గుర్తుకు వస్తుంది.
వాటిలో పులులవంటి క్రూరమృగాలూ లేళ్ళ సాధుమృగాలూ ఉంటాయని గుర్తుకు వస్తుంది.
పురాణాల వాసన కాస్త తగిలి ఉన్న మనస్సులకి అడవుల్లో మునులనే వాళ్ళు ఉంటారని గుర్తుకు వస్తుంది.
నాగరికజీవనులకు కొంచెం ఆలస్యంగానూ, పర్వతారణ్యప్రాంతాలతో కొద్దోగొప్పో పరిచయమో అనుబంధమో ఉన్న వారికి తొందరగానూ అడవుల్లో వనేచరులైన మనుష్యజాతులవారూ నివసిస్తూ ఉంటారని కూడా గుర్తుకు వస్తుంది.
ఈ మునులూ ఆ వనచరులూ కూడా నాగరకప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవిస్తూ ఉంటారు.
వనచరులు నాగరికప్రపంచంలోకి వచ్చి జీవించటానికి ఇచ్చగించరు. నాగరికుల కుత్సితాలూ డాంబికాలూ గజిబిజి కోరికలూ వారికి ఊపిరాడకుండా చేస్తాయి. కావలసినదంతా వనమే సమకూర్చుతూ ఉంటుంది. అసలు వారికి అవసరాలే తక్కువ. ప్రశాంతంగా జీవిస్తారు.
మునులు నాగర ప్రపంచాన్ని వదిలివచ్చి ప్రశాంతతకోసం వనాలను ఆశ్రయించిన వారు, కొందరు మునులు తమజీవితకాలంలో అలా చేస్తే మరికొందరి తండ్రులో తాతలో వచ్చి వనాల్లో తపస్సులను ఆరభించినది సంప్రదాయంగా స్వీకరించి అక్కడే ఉండిపోయిన వారు. నాగరికుల కుత్సితాలూ డాంబికాలూ గజిబిజి
కోరికలూ వారికిఉండవు. అసలు వారికి అవసరాలే తక్కువ. దాదాపు లేవనే చెప్పవచ్చును. ప్రశాంతంగా జీవిస్తారు.
ఇలా మునులూ వనచరులూ రెండురకాల మనుష్యులూ అడవులను ఆశ్రయించి జీవిస్తున్నా, వీళ్ళ మధ్యన ఏ సంబంధబాంధవ్యాలూ ఉండవు. వారు వారే, వీరు వీరే.
******
ఆ అడవిలో ఒక ముని. ఎప్పుడు తన పూర్వీకులు అడవిలోనికి వచ్చి జీవించటం మొదలు పెట్టినదీ ఆయనకు తెలియదు.. మునులు నిరంతర పరబ్రహ్మాను సంధానశీలురే కాని వారు లౌకికప్రపంచంతో ఈషణ్మాత్రమూ మానసిక సంబంధం కలవారు కారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ముని ఒక నవయువకుడు. మనం యువముని అందాం ప్రస్తుతానికి.
యువమునీ ఆయన తండ్రీ కలసి తమ ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉండి ఉంటారు? బహుశః ఎవరన్నా వేరొక ముని ప్రక్క మునిపల్లెలో ఏదైన యజ్ఞం కాని చేసాడేమో. లేదా తమ యాజ్ఞికమైన అవసరం కోసం ఇధ్మాల కోసం అడవిలోనికి వెళ్ళి తిరిగివస్తున్నారేమో ఆశ్రమానికి. ఏదైతేనేమి. వారు అప్పుడు ఆశ్రమంలో కాక అడవిలో ఉన్నారు.
తండ్రిగారు వృధ్ధు. ఆయనకు విశ్రాంతి అవసరం ఐనది. ఇద్దరూ ఒక చెట్టునీడను ఆశ్రయించారు. పెద్ద చెట్టు. మంచి నీడ. కుమారుడు కొన్ని ఫలాలు కోసుకొని వచ్చాడు. తిన్నారు. వారు మార్గమధ్యంలో ఒక చర్చ చేస్తూ వస్తున్నారు. అది ఇప్పుడు చెట్టుక్రింద ఇలా కొనసాగింది.
భగవన్. జీవుడు వేరు శరీరం వేరు. జీవుడు శరీరాన్ని ఆశ్రయించి కొన్నాళ్ళు ఉండి తిరిగి వెడుతున్నాడు అన్నారు కదా, అ జీవుడు ఎక్కడినుండి వస్తున్నాడు శరీరం లోనికి? మరి తాను శరీరాన్ని వదలిన తరువాత ఎక్కడికి వెడుతున్నాడు? అన్నింటికంటే మొదట ఈ జీవుడు ఎవరో చెప్పండి?
తండ్రిగారికి సంతోషం కలిగింది. అబ్బాయీ వేయవలసిన ప్రశ్నలే వేసావు. అందరూ ముందుగా వీటిని గురించి తెలుసుకోవాల్సిందే. సరే, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. ఆకాశంలో ఎంతమంది సూర్యుళ్ళు ఉన్నారు?
భగవన్. ఆకాశంలో ఉన్నది ఒక్కడే సూర్యుడు.
నిజం నిజం. నీకు ఇందాక మడుగు వద్దకు మంచినీటి కోసం వేళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లో సూర్యుడు కనిపించాడా?
భగవన్. కనిపించాడండి.
నీవు తామరాకు దొన్నెల్లో నీళ్ళు పట్టుకున్నావు కదా? ఆ దొన్నెల్లో నీకు సూర్యుడు కనిపించాడా?
భగవన్. కనిపించాడండి. మీకోసం నీళ్ళు నింపి తెస్తున్న దొన్నెల్లో సూర్యుడిని చూసాను. ఒక దొన్నె సరిగా కుదరక నీళ్ళు జారిపోతే మరొక దొన్నె చేసి నీళ్ళు నింపాను కాదా. దానిలోనూ సూర్యుడిని చూసాను.
ఐతే నువ్వు చెప్తున్న ప్రకారం ఆకాశంలో ఒక సూర్యుడు, చెఱువులో ఒక సూర్యుడు, నీటి దొన్నెల్లో మరికొందరు సూర్యుళ్ళు ఇల్లా వివిధంగా ఉన్నారా?
భగవన్. ఉన్నది ఒకే సూర్యుడు. చెఱువులో కనిపించినా దొన్నెల్లో కనిపించా అవన్నీ ఆ సూర్యభగవానుడి ప్రతిబింబాలే.
నీ చేతిలోని నీళ్ళ దొన్నె జారిపోయినప్పుడు దానిలోని సూర్యుడు ఎక్కడికి పోయాడు? నేను నీళ్ళు త్రాగినప్పుడు దానిలోని సూర్యుణ్ణీ గ్రాగటం జరిగిందా?
భగవన్. ఈ ప్రశ్నలకు జవాబులు నాకు తెలుసునండి. నేనూ మీరు చూసేది దొన్నెలోని సూర్యుడి ప్రతిబింబాల్నే కదా. అవి మిద్యలే కదా. ప్రతిబింబం కళ్ళకు కనిపించినా అది సత్యవస్తువు కాదు. సత్యవస్తువు కేవలం ఆకాశం లోని సూర్యుడే. మిధ్యావస్తువులైన ప్రతిబింబాలకు నిజమైన ఉనికి లేదు కాబట్టి వాటివలన జనించే ఇంద్రియానుభవాలూ మిధ్యలే. కాబట్టి కళ్ళకు కనిపించే ప్రతిబింబం కాస్తా మనం మన కళ్ళను కదపగానే కనుమరుగైపోతుంది. అద్దంలో కనిపించే ప్రతిబింబం ఐనా, మనం కదిలి వెళ్ళినప్పుడు అదీ పోతున్నది కదా. కాని ఈ ఉపమానం జీవులకు ఎలా వర్తిస్తున్నదీ తెలియటం లేదు.
ఎలా వర్తిస్తుందో చూదాం. కాని ఈ ప్రశ్నకు కూడా జవాబు ఆలోచించు. అద్దం ప్రసక్తి వచ్చింది కదా. దాని గురించి కూడా విచారిద్దాం. సూర్యుడి కాంతి అద్దంపై పడితే, అందులో సూర్యుడి ప్రతిబింబం ఏర్పడుతున్నదా? లేదా?
ఏర్పడుతోందండి.
మంచిది. ఆ అద్దం మీదనుండి కాంతి మళ్ళి ఎదురుగా ఒక గోడమీద పడిందనుకో. అక్కడ గోడ మీద కూడా సూర్యుడి ప్రతిబింబం వస్తున్నదా లేదా?
భగవన్. తప్పకుండా వస్తున్నదండీ. తరచూ చూస్తూనే ఉంటాం అలా జరగటం.
సంతోషం నాయనా. ఇప్పుడు మొదట ఆకాశంలో ఒక సూర్యుడు, దానిని నువ్వు సత్యవస్తువు అన్నావు. బాగుంది. చాలా బాగుంది. నిజం అదే. అద్దంలో సూర్యుడి ప్రతిబింబం ఏర్పడుతోందీ అన్నావు. అవునా?
అవునండి.
మరి గోడ మీద కూడా ప్రతిబింబం ఉందే అది అద్దంలో ఉన్న సూర్యుడికి ప్రతిబింబమే కాని సత్యమైన సూర్యుడికి ప్రతిబింబం కాదు కదా? ఏమంటావు?
నిజమేనండి. అద్దంలో సూర్యుడి ప్రతిబింబానికి మరొక ప్రతిబింబం.
అద్దంలో ఉన్న సూర్యుడి ప్రతిబింబానికి ఆధారం ఏమిటీ?
ఆకాశంలో ఉన్న సూర్యుడేనండి.
గోడమీద ఉన్న సూర్యుడి ప్రతిబింబానికి ఆధారం ఏమిటీ?
అద్దమండి. అంటే అద్దంలో ఉన్న సూర్యుడి ప్రతి బింబం.
అలాగా. సరే. బాగుంది బాగుంది. అద్దాన్ని అక్కడినుండి ఎవరైనా తీసేస్తే ఆ గోడమీది ప్రతిబింబం మాయం కదా. అందుచేత నేనా?
భగవన్. అంతే నండి. అందుకేనండి.
సంతోషం నాయనా. ఇది చెప్పు. మబ్బులు వచ్చి సూర్యుణ్ణి కప్పేసాయి. ఇప్పుడు గోడమీద ప్రతిబింబం కనిపిస్తుందా?
భగవన్. ఆకాశంలో సూర్యుడు మబ్బుల వలన కనుపించకుండా పోయినప్పుడు అద్దం ఇంక దేనిని ప్రతిఫలిస్తుంది? గోడమీద దేని ప్రతిబింబం పడుతుంది? అది అసాధ్యం కదా. గోడ మీద సూర్యుడి ప్రతిబింబంబం పడాలంటే ముందుగా ఆకాశంలో సూర్యుడు ఉండాలి.
నాయనా సరిగ్గా చెప్పావు. ఆకాశంలో ఉన్న సత్యవస్తువు అని నీవు చెబుతున్న సూర్యుడి కంటే అసలు సిసలు సత్యవస్తువు వేరే ఉంది. సాంకేతికంగా దానిని బ్రహ్మం అని అంటారు. ఆ బ్రహ్మమే సృష్టికి మూలం. దానికి ముందు అంటూ ఏమీ లేదు, అన్నింటికీ అదే మూల బిందువు అనుకో. అదే అన్నింతి ఉనికికీ మూలకారణం కూడా. అందుచేత దాని లక్షణాలు అంటూ వర్ణించి చెప్పటం అసాధ్యం. శ్రతులు ఇంచుమించుగా మనకు అవగాహన కోసం, ఆదిత్యవర్ణం సువర్ణ జ్యోతీః అని చెప్పాయి. లోకవ్యవహారంలో అన్ని వెలుగులకీ మూలమూ అత్యంతప్రకాశమానమూ సూర్యుడి వెలుగు అని ఎలా అంటామో అలాగా సృష్టి మొత్తానికి వెలుగైనదీ మూలమైనది అదే, ఆ బ్రహ్మమే అని చెప్పటం అన్నమాట.
అది అంటే ఆ బ్రహ్మము ‘బహు స్యాం ప్రజాయే యేతి’ అని నేను వివిధంగా విస్తరిస్తాను అని సంకల్పం చేసింది. ఆ సందర్భాన్ని ఈక్షణకాలం అని వ్యవహరిస్తారు. అలా సంకల్పం చేసిన బ్రహ్మమే తననుండి ఆ ఈక్షణకాలంలో సృష్టిని ఎలా చేయాలి, అది ఎలా ఉండాలి అన్న వ్యవహారం కల జ్ఞానశక్తిని కలిగించింది.
బ్రహ్మము స్వయం. దాని ఉనికికి కారణం ఏదీ లేదు. దీనినే మాట వరసకు సూర్యుడు అనుకో.
జ్ఞానశక్తికి బ్రహ్మము కారణం. ఈ జ్ఞానశక్తి ఒక అద్దం వంటిది అనుకో. దీనికే సాంకేతికంగా సాక్షి అనిపేరు. కూటస్థుడు, అంతర్యామి అని కూడా ఈ సాక్షికే పేర్లు.
ఈ రెండే శివుడూ శక్తీ అని కూడా వ్యవహారంలో అర్థం చేసుకోవాలి. జగత్తు ఉధ్బవించటానికి ఈ రెండూ కూడా కారణమే. బ్రహ్మము స్వయంగా సృష్టి చేయదు కాబట్టి అది సృష్టికారణం కాదు. బ్రహ్మము లేకుండా అంతర్యామి అనబడే ఆ సాక్షీ సృష్టి చేయలేదు. ఎందుచేతనంటే ఆ శక్తి దానికి బ్రహ్మం వలనే వచ్చింది కాబట్టి.
ఈ జీవులంతా ఈ సాక్షి ఏర్పరచిన ప్రతిబింబాలేను.
భగవన్ బ్రహ్మము సాక్షి అనే ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరచింది కదా. ప్రతిబింబం ఉండాలంటే దానికి అధారం కావాలి కదా మరి? ఆ ఆధారం ఏమిటి.
అది శుధ్ధసత్యం. అందుకే ఒకే ప్రతిబింబం.
మరి సాక్షి జీవుళ్ళనే అనేక ప్రతిబింబాలని ఎలా ఏర్పరుస్తోంది? దానికి ఏమిటి ఉపాధి (అంటే అధారం)?
దానిని కలుషసత్యం అంటారు. అదే అవిద్య. ఆకారణంగానే అనేక ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. అవే జీవులు.
ఐతే భగవన్… నాకో సందేహం వస్తున్నది..
******
తండ్రితో బాటే కూతురూ వేటకు బయలు దేరింది. కొన్నాళ్ళ నుండీ ఇలాగే జరుగుతోంది, ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు తండ్రి ఒక్కడే వేటకు పోయేవాడు. ఇప్పుడు అతడు ముసలివాడైపోతున్నాడు. కాబట్టి కూతురు కూడా అతడితో వేటలకు వెళ్ళక తప్పని పరిస్థితి. లేకుంటే ఇంటిల్లిపాదికీ బువ్వెట్టాగు మరి?
ఒకప్పుడు ఆమెకు అన్న ఒకడు ఉండేవాడు. అప్పట్లో తండ్రీకొడుకులు కలిసి వెళ్ళేవారు తమ జట్టుతో బాటు. అప్పటికి ఆమెకు ఊహ తెలియదు. ఆమెకు ఊహతెలిసి వచ్చేసరికి ఆ అన్న లేకుండా పోయాడు.
నడివయస్సులో అతడికి పుత్రశోకం అనే పెద్దదెబ్బే తగిలింది. కాని వేటగాళ్ళ జీవితాల్లో తామే వేట ఐపోవటమూ మామూలు విషయమే. అతడి అన్ననూ అలాగే ఒక పులి అలాగే పొదలమాటు నుండి దూకి ఈడ్చుకు పోయింది. అది అతడు స్వయంగా చూడలేదు. కాని కొడుకును ఒక చిరుత పొట్టన బెట్టుకోవటం మాత్రం అతడి కళ్ళ ముందే జరిగింది. పాతగాయం కొత్తగా తెరచుకున్నట్లయ్యింది. కొన్నాళ్ళు తెగఏడ్చాడు. ఆ తరువాత కసి పెంచుకున్నాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వేటకు దిగటం నిత్యకృత్యం అయ్యింది. ఒక చంతువును ఎంత క్రూరంగా వధించవచ్చునో అంతకంటే భయానకంగా హింసపెట్టి మరీ చంపటం అతని వినోదం. ఎదుగుతున్న పిల్లకు ఈ వినోదం బాగానే పట్టుబడింది. ఆ గూడెంలో ఉన్న వేటగాళ్ళకే ఈమె క్రూరత్వం అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించేది.
ఆరోజున వాళ్ళకు ఎందుచేతనో కాని ఒక్క వేటా చిక్కలేదు. మధ్యాహ్నసమయానికి గూడెం వదలి అడవిలోపలికి చాలా దూరం వచ్చారు. అంతా పట్టుదల మాహత్మ్యం. తాము మునిపల్లెలకేసి పోతున్నామన్న స్పృహ వాళ్ళకు రాలేదు. దానిని తరుముతూ దీనిని తరుముతూ బోలెడు దూరం పరుగులు పెట్టారు. ఈ పరుగుల్లో మంద అంతా చెల్లా చెదరై తిరుగుతున్నారు.
ఈ ఇద్దరూ అంటే తండ్రీ కూతుళ్ళు ఎప్పుడూ కలిసే తిరుగుతారు. కూతుర్ని ఎట్టి పరిస్థితిలోనూ ఆ తండ్రి ఒంతరిగా వదలడు. ఒకటి రెండు అనుభవాలు అయ్యాయి కదా మరి అతడి జీవితంలో . చివరికి ఇద్దరూ అలసి పోయారు. ఆడది కాబట్టి ఎంత అడవిపిల్ల ఐనా చివరకు దాహంతో ముందు తానే చతికిల బడింది. మరేదైనా కారణం కూడా ఉందేమో ఆమెకు ఎవరికీ చెప్పుకోలేనిది. ఏదైతేనేం ఇద్దరూ ఒక చెట్టుకిందకి చేరారు. సొరకాయ బుఱ్ఱల్లో నీళ్ళకోసం చూస్తే అవికాస్తా అప్పటికే నిండుకున్నాయి. దగ్గరలో ఏదో నీటిపక్షి ఎగురుతూ కనిపించింది. నీళ్ళు వెదకి తెస్తానని, తనని జాగ్రత్తగా ఉండమని చెప్పి, తండ్రి బయలుదేరాడు. అలసిన అమ్మాయికి చెట్టుక్రింద చల్లటి గాలికి కొంచెం కునుకు వచ్చింది. అలా నిద్రపోవటం మహా ప్రమాదం అని ఆమెకు తెలియకపోలేదు. అందుకని బలవంతాన తమాయించుకొని కూర్చుంది చెట్టుబోదెను ఆనుకొని. ఐనా కళ్ళు మూసుకుంటూనే ఉన్నాయి.
ఆమెకు తెలియదు నిద్ర కమ్మిందని. మాటలు వినిపించి మెలకువ వచ్చింది.
భగవన్ మరి అహింసా వ్రతం అంత గొప్పదా? అని ఒక కుఱ్ఱవాని గొంతు పలికింది. ఆ తరువాత ఒక పెద్దాయన కంఠస్వరం గంభీరంగా వినిపించింది. అది అచ్చం తన తండ్రి గొంతులాగేనే ఉంది!
మంచి ప్రశ్న వేసావు నాయనా. అది అన్నింటి కంటే గొప్ప వ్రతం. అహింసలో సుప్రతిష్ఠితుడైన వానికి ప్రకృతిమాయ తొలగిపోతుంది. తత్సన్నిధౌ వైరత్యాగః అని అహింసావ్రతుని వధ్ద ప్రకృతిసిధ్ధమైన జాతివైరాదులు నశించి సమస్తప్రకృతి శాంతమౌతుంది. అహింసావ్రతుడు చివరికి బ్రహ్మాన్నే తెలుసుకుంటున్నాడు.
ఉన్నటుండి తండ్రి కొంచంగా తలపంకించి మందహాసం చేసాడు. ‘అలాగే’ అని అన్నాడు.
కొడుక్కి ఈ మాట వింతగా అనిపించింది. ఇంతలో తండ్రి తన సమాధానాన్ని వివరించటం ప్రారంభించాడు.
నాయనా మొదట వివరించినట్లుగా జీవులంతా మాయలో ఏర్పడిన ప్రతిబింబాలు. జీవుడి కర్తవ్యం తనకు మూలమైన అంతర్యామిని తెలుసుకోవటమే. అది జరిగిన నాడు అతడు ఆ అంతర్యామి ఏర్పరచిన అన్ని ప్రతిబింబాలనూ అవన్నీ తనవంటివే అని స్పష్టంగా తెలుసుకుంటాడు.
అప్పుడు అతడు అంతర్యామితో సమత్వం పొందటం వలన మాయ అతడిని వదిలిపెట్టి పోతుంది. అటువంటి స్థితిని పొందిన వాడు ఏ ఇతర జీవిని ఎందుకు బాధిస్తాడు? ఈ మాయతో ఏర్పడిన జీవులలోకంలో అతడికి అవసరాలు అంటూ ఏమీ ఉండనే ఉండవు కదా?
అవునండి భగవన్. కాని ఆ స్థితిని పొందని వారి సంగతి వేరు కదా?
నాయనా. అది వేరుగానే ఉంటుంది. కాని అనుభవంలోనికి ఇంకా రాకపోయినా ఎవరైతే సమస్త జీవులూ తనవంటివే అని భవన చేతనైనా గ్రహించి వాటిని బాధించరాదని వ్రతం పెట్టుకుంటారో వారినీ మాయ బాధించదు.
ఈ ప్రకృతి ధర్మం ఏమిటంటే నీవు సత్యంగా అహింసలో స్థిరంగా ఉండగలిగితే నీ శాంతచిత్తం సకల జీవుల అంతఃకరణాలమీదా ప్రభావం చూపుతుంది. నీపై ఏ జీవీ కూడా హింసకు దిగదు. అంతే కాదు నీ సాన్నిధ్యంలో జీవుల మధ్య ఉండే జాతివైరాలూ మాయం అవుతాయి. అంటే పులీ లేడి కూడా కలిసిమెలిసే ఉంటాయి. అందుకు కారణం నీలో ఉన్న ప్రకృతి అనేదీ, బయట ఉన్న ప్రకృతి అనేదీ కూడా నీకు తెలిసినా తెలియక పోయినా నిజంగా ఒక్కటే. నీ అహింసా వ్రతం దానిని నీకే ఋజువు పరుస్తుంది.
జీవులన్నీ ఒకే అంతర్యామి ఏర్పరచిన ప్రతిబింబాలు. కాబట్టి బుధ్ధిమంతులు అన్ని జీవులనూ తనతో సమానంగానే భావించుకుంటారు. నీ వేలికిగాయమైతే నీకు నొప్పి కలిగినట్లే ఒక పులి కాలికి గాయమైతే అలాగే అదే నొప్పి కలుగుతుంది. కాబట్టి ఏ జీవినీ హింసించకూడదు.
కాని భగవన్. ఇతరజీవులకు ఇటువంటి విజ్ఞానం ఉండదు కదా?
ఉండకపోతేనేం?
మరి అటువంటి జీవి అహింసా వ్రతం ఏమీ పాటించదు కదా. ఒక ముని అహింసలో స్థిరంగా ఉన్నాడు. అతడికి పులి ఎదురైనది అనుకుందాం. ముని చేతిలో ఆయుధం ఉండదు కాబట్టి అతడిని పులి తినివేస్తే!
పిచ్చివాడా, శరీరం పడిపోవలసి వస్తే అది పులి వచ్చేదాకా ఎదురుచూస్తుందా. ఆశ్రమంలో ఉన్నవారికి చావు రాదా? పులి చంపితే పోయేది ఒక శరీరమే కదా. ఒక మిధ్యాబింబం నశిస్తే సృష్టికి లోటేమన్నా ఉందా? అంతర్యామికి ఇబ్బంది ఉందా? పరబ్రహ్మానికి ఇబ్బంది ఉందా? శరీరం మీద అభిమానం ఉన్నవాడు ముని కాదు. అతడు ఉండవలసినది పులులుండే అడవిలోనూ కాదు.
నాయనా ఈ అహింసావ్రతం పరబ్రహ్మానుసంధానమే. ఎవరు అహింసావ్రతం ద్వారా తనలోని అంతర్యామిని గ్రహిస్తున్నారో వారి ఆ అంతర్యామిలో ప్రతిఫలిస్తున్న బ్రహ్మాన్ని కూడా అలాగే తెలుసుకుంటున్నారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శ్రుతి. అంటే ఎవరు బ్రహ్మను తెలుసుకుంటున్నారో వారు బ్రహ్మమే అవుతున్నారు. ఇదే బ్రహ్మవిద్య.
*****
ఇంతలో తండ్రి తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? వంటినిండా గాయాలతో. నీళ్ళ మడుగు చెంతనే కనిపించింది కాని దాని సమీపంలో ఒక ఈనిన పంది ఉంది. అది ఈ తండ్రిమీద దాడి చేసింది. ఇతడు దానితో తలపడి నిలబడ్డాడు. హోరాహోరి పోరాటంలో గాయపడ్డాడు. చివరికి చచ్చి చెడి బయటపడి కూతురున్న చోటికి వచ్చాడు.
తండ్రిని మెల్లగా నడిపించుకొంటూ ఆ పిల్ల గూడానికి బయలుదేరింది.
ఆమె మనస్సులో ఒక ఆరాటం. ఒక ఆందోళన. ఒక విచికిత్స. తనకు ఆ చెట్టు బోదెకు ఆవల కూర్చున్న వారి మాటలు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. అందుకే కొంచెం అర్థం ఐతే బాగుండును అనుకుంది. వెంటనే ఒక చిన్న నవ్వు వినిపించింది. ‘అలాగే’ అన్న మాటా వినిపించింది. ఆ మాట ఆయన తనని ఉద్దేశించేనా అన్నది? అదెలా? ఆయన తనని చూడనైనా చూడనే లేదుకదా? ఐనా తన మనస్సులోని మాట ఆయనకు ఎలా తెలిసిందీ?
ఎందుకంటే ఆతరువాత అన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థం అయ్యాయి తనకు.
ఆయన ఎవరో మహానుభావుడు. హింస మంచిది కాదు అంటున్నాడు. వేటగాళ్ళకు హింస తప్పు ఎందుకు అవుతుందీ? కాని ఆ మాట తాను ఆయన ఎదుట పడి ఎలా అడగగలదు? అందుకే తాను మాట్లాడకుండా వింటూ ఉండిపోయింది.
అహింసా వ్రతం ఎంత గొప్పది. ప్రపంచాన్నిపుట్టించే శక్తిని తానే అవుతుందా ఈ అహింసావ్రతంతో? ఆ శక్తికి మూలం ఐన పరబ్రహ్మమూ తానే అవుతుందా ఆ వ్రతంతో.
తనలాంటి ఒక వేటకత్తెకు ఆ అహింసావ్రతాన్ని పట్టటం సాధ్యపడుతుందా?

1 thought on “నిషాదుల మధ్య ఒక బ్రాహ్మణుడు. (మొదటి భాగం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *