May 6, 2024

మన వాగ్గేయకారులు – (భాగము -1)

రచన: సిరి వడ్డే

vaggeya

“సంగీతం” పాడటమే ఒక కళ అంటే, పాటలను వ్రాసి, వాటికి స్వరాలను కూర్చటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. నేడు పాటలు వ్రాసే కవులు, ఆ పాటలకు బాణీలు అంటే స్వరాలని కూర్చే సంగీత విద్వాంసులు వేరు, వేరుగా ఉన్నారు. కానీ సంగీతం ప్రాణం పోసుకున్ననాటి నుండి ఈ రెండు ప్రక్రియలను చేయగలిగిన వారే “సంగీతకారులు”గా ప్రసిద్ధికెక్కారు. ఇలా సంగీతం, కవిత్వం రెండింటిపై పట్టుగలిగి, ఆశువుగా గానం చేసే కళాకారులని “వాగ్గేయకారులు” అంటారు. జయదేవుడు, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తి వంటి మహానుభావులు ఈ కోవకు చెందినవారే. సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అలాంటి మహానుభావుల జీవిత విశేషాలను మనం తప్పక తెలుసుకోవలసిందే.

దైవత్వ అనుభూతిని అతి సులభంగా కలుగజేసే దివ్యమైన వరం సంగీతం. మాటరాని పసిపాపడైనా, పశువులైనా, చదువుకోని పామరులైనా, సంగీతం విని అలౌకిక అనుభూతికి లోనవుతూ ఉంటారు. అందుకే,

“శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః
కో వేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవా”…అన్నారు పెద్దలు.

భారతీయ సంగీతానికి మూలం సామవేదం. ఎందరో గొప్ప తెలుగు వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని సుసంపన్నం చేశారు. ” పాట దేవుని సన్నిధికి తిన్నని బాట” అని భాగవతులు విశ్వసిస్తారు. తమ వాక్కును గేయరూపంలో వెలిబుచ్చేవారిని “వాగ్గేయకారులు” అన్నారు. అంటే వారు వాక్కుల రూపంలో చెబుతున్నా అది గేయ రూపంగా ఉంటుంది. ఓంకారనాదానుసంధానమైన గానాన్ని ఉపాసించి, వాక్కును, గేయాన్ని భక్తి రసామృత ధారలుగా పోసి, పరమాత్మ పాదాలను కడిగిన పుణ్యజీవులు వాగ్గేయకారులు. సంగీత, సాహిత్య రచన చేసి గాత్రజ్ఞులై దానిని గానం చేసే వారే ఈ వాగ్గేయకారులు. ఒక్కరూ, ఇద్దరూ కాక వందల సంఖ్యలో వాగ్గేయకారులు ప్రభవించి, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్మికతతో, భావజాలంతో తమ వాక్కులను గేయాల రూపంలో వెలిబుచ్చారు. తాళ్ళపాక అన్నమాచార్య, క్షేత్రయ్య, త్యాగయ్య, నారాయణ తీర్థులు, రామదాసు వంటి ఎందరో వాగ్గేయకారులు తమ ఇష్టదైవాలను తమ వాగ్రూప గేయాలతో కీర్తించి తరించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి. అలతి అలతి పదాలతో తమ భావాలను పేర్కొంటూ పండిత పామర జనులను విజ్ఞానవంతులుగా మార్చే మహోత్తమ పుణ్యమూర్తులు వాగ్గేయకారులు.

తెలుగు సాహిత్య చరిత్రలో వాగ్గేయకారులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. క్షేత్రయ్య, అన్నమయ్య వంటివారు శృంగార, భక్తిరస ప్రధానములైన రచనలు చేసి, గానం చేయడంలో ప్రసిద్ధులైన వారు. అలాగే జయదేవుడు, నారాయణ తీర్థులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి వంటి ఎందరో మహానుభావులు మన సాహిత్యాన్ని, సంగీత శాస్త్రాన్ని ఉత్కృష్టమయిన స్థితిలో నిలిపిన వాగ్గేయకారులు. పద కర్తలై, సాహితీ ఉద్యానవనంలో తులసి మొక్కలనెన్నో పాదుగొల్పిన, తోటమాలులు. తమ స్వర ఝురితో సంగీత సరస్వతిని ఓలలాడించిన గానగంధర్వులు. అజరామరమైన సంగీత సాహిత్యాలను సృష్టించి, నాదోపాసన విద్యతో తమ ఇష్టదైవాలను మెప్పించిన “మన వాగ్గేయకారులు” ముక్తికి మార్గం చూపించిన మహనీయులు.

తెలుగువారమై పుట్టినందుకు మనకు, మన పెద్దలు ఇచ్చినవి రెండు గొప్ప ఆస్తులు, ఒకటి పద్య కావ్య సాహిత్యం. రెండోది కర్నాటక సంగీతం. మాట కంటే ముందే మనిషి పాట నేర్చుంటాడు. ఎందుకంటే, మాట మనం కనిపెట్టుకొన్నది, కాని పాట ఈ సృష్టిలో అనాదిగా, అంతర్లీనంగా ఉన్నదే కదా! చెట్లమీద చిరుగాలి సవ్వడులూ, పక్షుల కిలకిలలూ, జలపాతాల అలజడులూ, మేఘాల దుందుభి స్వరా(నా)లు, కడలి కెరటాల మృదంగ ధ్వానాలు, ఇలా చరాచర జగత్తంతా సంగీతమయమే కదా!

మాటనేర్చిన మనిషి, గలగలలతోను, కిలకిలతోనూ సరిపెట్టుకుంటాడా? సృష్టిలోని సంగీతాన్నంతా తన గుప్పెడు గుండెలో పట్టేసి, తన గుక్కెడు గొంతుతో పలికంచడానికి ప్రయత్నించడూ? కొన్ని వేల సంవత్సరాలనుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రతి జాతీ, ప్రతి నాగరికత, ప్రతి సంస్కృతీ, ప్రతి సంప్రదాయమూ, విశ్వంలోని ఈ లయ విచిత్రాన్ని అర్థం చేసుకొని, అందుకొని, ఆనందించే ప్రయత్నం చేసాయి. ఎన్నో రీతుల సంగీతాన్ని సృష్టింసాయి. కర్ణాట సంగీతాన్ని ముఖ్యంగా తెలుగులో రచించిన, వాగ్గేయకారులంతా సుమారుగా తమిళులు, సంగీతాన్ని ఆదరించి, పోషించి, పరిరక్షించి, పెంపొందిచిన వారు మైసూరు సంస్థానాదీశులు.

కర్ణాట సంగీతంలో ఎంత మంది చెప్పుకోదగ్గ వాగ్గేయకారులున్నారో, పాశ్చాత్య సంగీతానికీ తు.చ. తప్పకుండా అంత మందీ ఉన్నారు. పదమూడో శతాబ్దంలో “సంగీతరత్నాకరాన్ని” రచించిన సారంగదేవుడు, అహోబిలుడు, గోవింద దీక్షితులు, పురందర విఠలదాసు, తాళ్ళపాక అన్నమయ్య, మేళకర్త స్రష్ఠ వేంకట ముఖి, రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి – కైలాస పర్వతం మీద మహాదేవుని ఢమరుక నాదంలోంచి, ఆయన కాలి గజ్జెల సిరిమువ్వల సవ్వడిలోంచి పుట్టిన రసగంగా భవానిని భూమికి దించిన భగీరథులు.

భారతీయ శాస్ర్తియ సంగీతాన్ని భక్తితో మేళవించి కీర్తి, కాంత, కనకాలను దరిచేరనీయక భగవంతుడిని కీర్తిస్తూ ప్రసన్నం చేసుకుని మోక్షప్రాప్తి పొందిన పరమ భక్తాగ్రేసరులు మన వాగ్గేయకారులు. వారిలో స్వర ప్రపంచానికి అధిపతిగా నిలిచిన సంగీత త్రిమూర్తులలో ఒకరైన సద్గురు శ్రీ త్యాగరాజస్వామి గారు, వారి శిష్య పరంపరలో వరుసగా, మానాంబు చావడి వెంకట సుబ్బయ్య, సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తీ, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గార్లు వంటి వారు ముఖ్యులుగా ఉన్నారు.

ఒక జాతి తన సంపదగా భావించే వాటిలో సంగీతము, సాహిత్యము, సాంస్కృతిక వారసత్త్వ సంపద ప్రధాన అంశాలు. సంగీతము దానిని అలా పాడగలిగిన గాయకుడు ఉన్నంత వరకే అలా నిలిచి ఉంటుంది. అంటే త్యాగరాజస్వామి వారు పాడిన కృతులను మనము మరలా త్యాగరాజస్వామి వారి గొంతులో వినలేము. కానీ అయన సాహిత్యాన్ని ఇప్పటికే కాదు సృష్టి నిలిచి ఉన్నంత కాలమూ రుచి చూడగలము. ఆయన శిష్య, ప్రశిష్య బృందాలు ఆయన కృతులను, ఆయన బాణీలో పాడి, ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవను చేసిన, ముగ్గురు సుప్రసిద్ధ వాగ్గేయకారులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు గార్లు, “కర్ణాటక సంగీత త్రిమూర్తులు”గా వర్ణింపబడతారు.

తరువాత భాగంలో, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో మొదటి వారైన “శ్రీ త్యాగబ్రహ్మ” అనిపించుకున్న మన త్యాగరాజస్వామి వారి గురుంచి తెలుసుకుందాం…

1 thought on “మన వాగ్గేయకారులు – (భాగము -1)

  1. Sir,
    I am requesting you to kindly give me the list of vaggeyakarulu in India.
    Thank you Sir
    Kota Phani Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *