May 3, 2024

దీపతోరణం – పుస్తక సమీక్ష

రచన: ఝాన్సీ మంతెన

mail.google.com

మానవత్వపు విలువలను మానవ సంబందాలను అందమైన కధల రూపంలో చెప్పిన కన్నెగంటి అనసూయగారి దీపతోరణం కధా సంకలనం. ఇది ఆమె కలంలో నుండి వచ్చిన మూడవ కధాసంకలనం. మొత్తం పదిహేను దీపాలతో పేర్చి మనకందించారు. కొన్ని కళ్ళు చెమరింపచేస్తే కొన్ని ఆలోచింపచేస్తాయి.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆర్. శాంతసుందరి గారు తన ముందు మాటలో మానవీయ విలువలను ఆహ్లాదంగా కధల్లో పొందుపరిచి సమాజానికి అందించడమే కాదు, తన జీవితంలో కూడా వాటిని పాటిస్తారు అని రాశారు.

“గురజాడ చెప్పినట్లు ఇవి తప్పక మంచిని పెంచే కధలు, గట్టి మేలు తలపెట్టిన కధలు.” ఇవి వాడ్రేవు వీరలక్ష్మిగారు కధల గురించి రాసిన మాటలు.

“వీరి కధల సౌలభ్యం ఏమిటంటే పాఠకుణ్ణి తేలికగా ఆకర్షిస్తాయి” అని చివరి పేజీలో మునిపల్లె రాజుగారు రాశారు.
విషయ వివరణ టూకీగా ఉండడం, ఉపోద్ఘతాలు ఎక్కువ లేకుండా చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడం, ఆసక్తికరంగా చదివించే కధనం, చక్కటి రచనాశిల్పమ్, అవసరమైన చోట అందంగా ఉపయోగించిన పలుకుబడులు, యాస, ఉత్తమమైన శైలి అన్ని కలసి ఉన్న అనసూయ గారి కధలు పాఠకులను ఆసాంతం చదివిస్తాయి.

ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి పలు సేవా కార్యక్రమంలో తనకు ఎదురైన వివిధ రకాల మనస్తత్వలున్న మనుషులను పరిశీలించడం వల్ల కావచ్చు కధల్లో ఎక్కడా కృత్రమత్వం కనిపించదు. అంతా చాలా సహజంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి కధలోని విషయాలు మన చుట్టూ జరిగెవే. మనం రోజు చూసిచూడనట్టున్న అంశాలే. రచయిత్రి కేవలం కవి హృదయం తోనే కాదు, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి గా అంతా అక్షరబధ్దమ్ చేశారు.

ఆ చల్లని నీడలో కధలో ఒక స్వచ్ఛంద సంస్థ తరుపున ఉచితంగా వచ్చే గొడుగులు వద్దని పారిపోతున్న స్కూలుపిల్లలు చెప్పిన కొంటె సమాధానం గొడుగుంటే తడిసే వీలుండదని వాన వంకతో బడి ఎగ్గొట్టి తిరిగే అవకాశం పోతుందని. ఐతే వీళ్ళని చెవులు వినబడని, మాట రాని బుశవ్వ అనే అమ్మాయి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నించడం, వాళ్ళు ఆమెను తప్పించుకు పోయే ప్రయత్నంలో కొట్టడం గిచ్చడం. ఆ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తోందని అడిగితే వాళ్ళు గొడుగులు తీసుకోక పోతే తనకు కూడా ఇవ్వరని, వానలో తడిసి వస్తే బడి మానవలసి వస్తుందని వాపోవడం. కధ ముగింపుకొచ్చేసరికి మనసు, కళ్ళు రెండూ తడి అవుతాయి.

మధ్యాన్న భోజన పధకం కింద స్కూల్ పిల్లలకు పెట్టే భోజన వినియోగంలోని అవకతవకలే కాకుండా, పిల్లలు తినే ఆ ఆహారం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని, ఏమాత్రం వృధా కానీయకుండా పొదుపుగా సరుకులను వాడుకోవడం, అలా పొదుపుచేసిన దాంతో ఇంకో కూర అదనంగా వండించడం, పిల్లలు తృప్తిగా ఇంకో ముధ్ధ ఎక్కువగా తినేటట్టూ చూడడం ఇలాంటివన్ని ఎంతో చిత్తశుధితో చేసే ఓక అంకిత భావమున్న హేడ్మస్టర్ గారిని ఈ కధలో మనకు పరిచయం చేశారు రచయిత్రి.

మానవ సంబంధాలని అత్యున్నత స్థాయిలో చూపించిన మరో చక్కటి కధ జ్ఞాపకం జీవించిన వేళ. మనిషై పుట్టిన ప్రతివాడు ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టాలట అనే మూలసూత్రంగా రాసిన కధ. చిన్నప్పుడు సీతాఫలప్పళ్లు అమ్మే తాతను, అతను తెచ్చే పళ్ళ రుచిని ఆ అమ్మాయి మరిచిపోలేదు. పళ్ళు కొనే అమ్మగారిని, వాటిని ఆప్యాయంగా తినే అమ్మాయిగారిని, పళ్ళు కొన్న తరువాత అమ్మగారు రోజు పెట్టె అన్నాన్ని తాత మరిచిపోలేదు. అందుకే ఏళ్ల తరువాత పాపని వెతుక్కుంటూ వస్తాడు వూళ్ళు దాటి, వాగు దాటి తాత , పాపగారు తన గొంతు గుర్తు పడుతుందని ఆశతో.
పరాయి సొమ్ము ఎంత దొరికితే అంత ఆనందం అనుకునే ఈ రోజుల్లో కాలనీ లో దొరికిన బంగారు గొలుసు నిజాయితీ గా పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇచ్చేసిన సత్యవతమ్మ గారి కధ ‘మనవి కానివి’, చిన్నప్పుడు దీపావళి సిసీంద్రీలు తయారుచేసుకునేటప్పుడు పొరపాటున ప్రమాదం జరిగి స్నేహితుని కంటిచూపు పోతే దీపావాళి పండుగ చేసుకోవడమే మానేసిన రామారావు కధ ‘దీప తోరణం’, ‘కొబ్బరి బొండాలు’ పల్లెల నుండి పట్టణాలకూ తరలించే ప్రక్రియలో ఉండే సాధక బాధకాలు, కులపిచ్చిని తూర్పార బట్టిన కధ ‘ఏది మురికి? ఎవరు మురికి?’, ఎదుటి వాళ్ళకు ఏది చేస్తే బాగుంటుందో అదే చేయాలనే ‘అమ్మమ్మ కానుక’, తండ్రి ప్రేమ దొరకక ఆ తండ్రి పై పగపెంచుకున్న కొడుకు కధ “పితృదేవోభవ”, అనాధ పిల్లలకు ఆసరాగా నిలువ వలసిన సామాజిక బాధ్యతను గుర్తు చేసే కధ “వంద చేతుల తోడు”, పట్టుదలతో ఏదైన సాధించవచ్చు అని తెలిపే “రాజముద్ర” ( ఇది రచయిత్రి స్వీయానూభవం) ఇలా ప్రతి కధలో ఏదో ఒక సందేశంతో, చక్కటి కధనంతో సాగుతాయి.

మొత్తం కధా సంపుటిలో హైలైట్ గా ఉన్న చివరి మూడు కధల్లోఒకటి ‘జీవితాలను శాసించేవి’. అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్న ఇళ్ళు మానవ సంబంధాలను ఎలా శాసిస్తున్నాయో చెప్తూ, ఉన్న ఇంటికంటే పెద్ద ఇల్లు కావాలని గంగవెర్రులెత్తి, పరుగెత్తే ప్రహసనంలో కుటుంబ బంధాలను పోగొట్టుకుంటున్న ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెంపపెట్టు లాంటి కధ.

“ఏదైన అంతే” కధ ఎంతో సాధారణంగా కనబడినా లోతైన సమస్యను చర్చించిన కధ. ప్రతి ఇంట్లోనూ ఉండే నీటి కొరత. నీరు పొదుపుగా వాడాలని తాపత్రయపడే మధ్య తరగతి ఇల్లాలు ఈ ప్రహసనంలో నీరు పొదుపుగా వాడని పనిమనుషులను తరుచుగా మార్చటం, .ఈ విషయాన్ని అలుసుగా తీసుకొని ఆమె భర్త హేళన చేయడం, మానేసిన ప్రతిపనిమనిషి కి నంబర్లు ఇవ్వడం. ఇదంతా చూసి విసిగి పోయిన ఇల్లాలు ” నీళ్ళని వృధా చేయవద్దని ఎంత చెప్పినా వినకపోతే పనివాళ్లను మార్చగలుగుతున్నాను. కానీ ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండి ఇలా మానసికంగా నన్ను వేధించవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినని మిమ్మల్ని మార్చట్లేదు సంతోషించండి” అంటుంది. నీటిని స్త్రీల స్వాభిమానాన్ని రక్షించాలని తాపత్రయపడ్డ రచయిత్రికి అభినందనలు. ఈ కధలోని నీటి పొదుపు గురించిన ప్రతి వాక్యం చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
చివరగా నన్ను బాగా ఆకర్షించిన కధ ‘ఆ మాత్రం చాలు’ . వినియోగ దారుల హక్కుల గురించి అవగాహన కలిగించే కధ. ఏ విషయమైనా కధలరూపం లో చెప్తే ఆసక్తిగా చదివినాట్టు మామూలుగా చెప్తే వినరు. రచయిత్రి ఈ విషయంలో పూర్తిగా సఫలీకృతమయ్యారు. వస్తువు పైన అసలు ధర చీటిని తీసేసి ఎక్కువ ధర వసూలు చేసిన వ్యాపారిని నాటకీయంగా ఎలా తప్పును ఒప్పించింది చదువుతుంటే వినియోగ దారుల హక్కుల గురించిన అవగాహన కలుగుతుంది.
విలువైన సమయాన్ని వెచ్చించి కధలు చదువుతున్నప్పుడు, ఆ కధవల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండాలని పాఠకులు ఆశిస్తారు. ( ఇది నా వ్యక్తిగత అభిప్రాయం). ఈ విషయంలో రచయిత్రి నూటికి నూరుపాళ్లు సఫలీకృతమయ్యారు. చాలా కధలు ఏదో ఒక పోటీలో బహుమతి పొందిన కధలే.

కధలన్ని చదివిన తరువాత పుస్తకానికి శీర్షికగా దీపాతోరణం కాకుండా “ఆ చల్లని నీడలో” కానీ “జ్ఞాపకం జీవించిన వేళ” కానీ ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. శీర్షిక ఏదైన ఇది తప్పకుండా చదువవలసిన పుస్తకం.

5 thoughts on “దీపతోరణం – పుస్తక సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *