May 3, 2024

మన వాగ్గేయకారులు – 2

రచన: సిరి వడ్డే

శ్రీ త్యాగరాజ స్వామి :

thy-main

శ్రీ త్యాగరాజ స్వామి(మే 4, 1767 – జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. “త్యాగయ్య”, “త్యాగబ్రహ్మ” అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.

బాల్యం, విద్యాభ్యాసం :

శ్రీ త్యాగరాజ స్వామి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామము నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించారు. వీరు శ్రీ కాకర్ల రామబ్రహ్మం, శ్రీమతి కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఈయన జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు. త్రిలింగ వైదీకులు. వీరి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం గారు తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరిని గురించి త్యాగయ్య గారు తన బంగాళరాగ కృతిలో “గిరిరాజసుతా తనయ” అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము గారు తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.

జీవిత విశేషాలు :
త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామలక్ష్మణుల విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. అయ్యగారు ఉంఛవృత్తి నవలంబించి సర్వసామాన్యముగా జీవనం చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన ఇష్టదైవమైన “శ్రీరాముడి” పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య గారు 96 కోట్ల శ్రీరామ నామములు జపించి, వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి. అయ్యగారు మంచి శారీరము కలిగియుండిరి. అయ్యగారు వైణికులు కూడా.
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుగారికి పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడారు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుగారికి ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి వీరికి ఖచ్చితమైన వారసులెవరూ లేరు, కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

సంగీత ప్రతిభ :
త్యాగరాజు గారు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే వీరు “నమో నమో రాఘవా” అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచారు . గురువు శొంఠి వేంకటరమణయ్య గారి ఇంటిలో చేసిన కచేరీలో “ఎందరో మహానుభావులు” అనే కీర్తనను స్వరపరచి పాడారు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే “నిధి చాల సుఖమా” అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించారు. సంగీతంలోని రాగ,తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసారు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసారు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందారు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా వీరికి సంగీతంలోని రహస్యాలను చెప్పి,”స్వరా ర్ణవ”మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన “సాధించెనే” అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని “స్వరరాగ సుధారసము” అను కృతిలో ఈ గ్రంథమును గురించి త్యాగయ్య పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. “దివ్యనామ సంకీర్తనలు” , “ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు” అను బృంద కీర్తనలు కూడా రచించెను. “ప్రహ్లాద భక్తి విజయము”, నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.
త్యాగరాజు గారి జీవితంలో కొన్ని సంఘటనలు :
త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
వీరు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, “తెరతీయగరాదా” అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన “వేంకటేశ నిను సేవింప” అనే పాట పాడినారట.
త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము
త్యాగరాజ ఆరాధనోత్సవాలు:
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన “పంచరత్న కృతులను” కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు, కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.
రచనలు :
రామేతి మధురం వాచం’ అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో ‘స్వరార్ణవం’ ‘నారదీయం’ అనే రెండు సంగీత రహస్యార్ధ ‘శాస్త్ర గ్రంథాలు రచించారు.
పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో “ఘనరాగ పంచరత్న కీర్తనలు” ముఖ్యమైనవి.శ్రీత్యాగరాజస్వామి. రామభక్తామృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.
కీర్తనలు:
త్యాగయ్య గారు దాదాపు 800 కీర్తనలను రచించారు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలో కంటే కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన “జగదానందకారక” అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది.
త్యాగయ్య గారు క్షేత్రములకు వెళ్ళునపుడు, ఆయా క్షేత్రము మీదను, క్షేత్రములోని దేవుని మీదను కృతులు రచించెను. అవి ఏమనగా,
కొవ్వూరు పంచరత్నములు
(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామి పై వ్రాసిన ఐదు కృతులు)

1 నమ్మివచ్చిన… కల్యాణి….రూపకము
2 కోరిసేవింప… ఖరహరప్రియ… ఆదితాళము
3 శంభోమహదేవ… పంతువరాళి… రూపకతాళము
4 ఈ వసుధ… శహాన…. ఆదితాళము
5 సుందరేశ్వరుని… కల్యాణి ….ఆదితాళము

తిరువత్తియూరు పంచరత్నములు
(తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీ దేవిపై రచించిన కృతులు)

1 సుందరి నన్ను… బేగడ… రూపకము
2 సుందరీ నీ దివ్య… కళ్యాణి…. ఆదితాళము
3 దారిని తెలుసుకొంటి…. శుద్ధ సావేరి…. ఆది
4 సుందరి నిన్ను…. వర్ణింప… ఆరభి చాపు
5 కన్నతల్లి నిన్ను… సావేరి… ఆదితాళము

పంచరత్నములు :
(త్యాగయ్య గారిచే రచింపబడిన ఘన రాగ కృతులు)

1 జగదానంద… నాట…. ఆది
2 దుడుకుగల…. గౌళ…. ఆది
3 సాధించినే… ఆరభి…. ఆది
4 ఎందరో…. శ్రీ… ఆది
5 కనకనరుచిరా…. వరాళి…. ఆది

“పంచరత్న కృతులు” శ్రీ త్యాగరాజు గారు కర్ణాటాక సంగీతానికి అందించిన ఐదు రత్నాల వంటి కీర్తనలు. శ్రీత్యాగరాజ స్వామి స్వరపరచిన ఈ ఐదు కృతులను పంచరత్న కృతులను “త్యాగరాజ పంచ రత్నాలు” అనడం కూడా కద్దు. 19వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకరైన శ్రీ త్యాగయ్య అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి. ఈ వేలాది కీర్తనలలో 750 కీర్తనలు లభించుచున్నాయి. త్యాగరాజ స్వామి వారి కీర్తనలు అన్నీ తేలికైన తేట తెలుగున పండిత పామురులకు అర్థం అయ్యే రీతిన కూర్చిన శ్రీరామ కీర్తనలు. ఈ ఐదు పంచ రత్న కీర్తనలు ఆది తాళానికి కూర్చబడ్డాయి. పంచరత్న కీర్తనలు పాడే రాగం, వాటి సాహిత్యం మరియు భావాన్ని అనుసరించి ఉంటాయి. ఈ ఐదు కీర్తనలు సంగీత కచేరీలోని రాగం, తానం, పల్లవి పాడేందుకు వీలుగాను, సంగీత ఉద్ధండులు కల్పనా స్వరాలు పాడేందుకు వీలుగాను ఊంటాయి. పంచ రత్న కృతులు పాడే నట, గౌళ, అరభి, వరళీ, శ్రీ రాగాలను “గాన పంచక రాగాలు” అని పిలుస్తారు. వీటిసి సంబంధించిన తానం వీణపై వాయించడానికి చాలా అనువుగా ఉంటాయి. నట, వరాళి రాగాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.
పంచరత్న కృతుల ప్రత్యేకతలు :
జగదానంద కారక: పంచరత్నాలలో మొదటిది – నాట రాగకృతి. ఇది 36వ మేళకర్త రాగమైన చలనాట జన్యం. శారంగదేవుని సంగీత రత్నాకరం పేర్కొన్న గొప్ప రాగాలలో ఇది ఒకటి. ఈ రాగంలో షడ్జ, పంచమాలతో పాటు షట్ శృతి దైవతం, కాకలి నిషాదం ఉన్నాయి.
ఈ కృతికి ఎన్నుకున్న భాష – సంస్కృతం.
భావం: జగదానంద కారకుడైన శ్రీరాముని వర్ణనం. ధీరోదాత్త గుణశోభితుడైన శ్రీరాముని సంబోధనాత్మక కృతి ఇది. నాట రాగ అనువుగా – ఎంతో హృద్యంగా అమరింది.
దుడుకుగల నన్నే: పంచరత్నాలలో రెండవది – గౌళ రాగంలోని కృతి. ఇది 15వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం. షడ్జ, పంచమాలతో పాటు శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం గల రాగం. దీనిలో రిషభం రాగచ్ఛాయగల ఏకశృతిరిషభం. పాడేటప్పుడు దీన్ని ప్రత్యేకంగా పలుకుతారు. కనుక దీనిని గౌళ రిషభం అని అంటారు.

సాహిత్యం చూస్తే, దుడుకు చేష్టలున్న అనే పద ప్రయోగం; ఆ వెంటనే ఏ దొర కొడుకు బ్రోచు? అనే పదప్రయోగం నవ్వు పుట్టిస్తాయి. కాని, ఇదొక ఆత్మ విమర్శా జ్ఞానం. దీనిలో చరణాలు కూడా అదే ధోరణిలో సాగుతాయి.
తమిళసీమలో, కావేరీతీరములో పుట్టి వికసించిన తెలుగు పువ్వు, కర్నాటక సంగీత ప్రపంచములో త్యాగరాజస్వామి కీర్తన లేకుండా కచేరీ, ఆయన కీర్తనరాని సంగీత విద్వాంసుడు లేడనటం అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. తనెక్కడున్నా తన మాతృభాషను మరువకుండా తెలుగున ఆయన వ్రాసిన కీర్తనలు అజరామరాలు, తెలుగు తల్లికి భుజకీర్తులు. నీ నవ్వు ముఖము కనిపించటము లేదయ్యా, నా మీద జాలి చూపించి నీ దర్శన భాగ్యము కలిగించు, నీ వాహనమైన గరుడుడు దూరాభారమని చెబుతాడేమో వైకుంఠమునుంచి వేగముగా రా అని ఆర్ద్రతతో నిండిన ఆఙ్ఞను భగవంతునికి ఇవ్వగలిగిన భక్తి సామ్రాజ్య చక్రవర్తి.
క్షీరసాగర శయన….
రచన: శ్రీ త్యాగరాజ స్వామి
తాళం: ఆది
రాగం: దేవగాంధారి

పల్లవి:
క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ ।। క్షీర ।।

అనుపల్లవి:
వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది
విన్నానురా రామ ।। క్షీర ।।

చరణము:
నారీమణికి జీర లిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది
విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారకనామ త్యాగరాజనుత దయతో నేలుకోర రామ ।। క్షీర ।।
ప్రపంచం మొత్తం శ్రీ రామ తత్త్వంతో నిండి వుందని భావించి సర్వత్రా శ్రీ రాముడినే దర్శించిన కారణ జన్ముడు, కర్ణాటక సంగీత జగద్గురువు… సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యడు త్యాగయ్య. సంగీత సాహిత్యాలను గంగా యమునలుగా మలచుకుని అంతర్వాహినైన సరస్వతిగా భక్తిని జోడించి తేట తెలుగు మాటలతో జనరంజకమైన కీర్తనలు రచించి, తెలుగునాట చిరంజీవిగా నిలిపిన సంగీత భక్తి కీర్తనల వాగ్గేయకారులు శ్రీ త్యాగయ్య అంటూ సంగీత రసజ్ఞులు, పండితులు చెబుతారు. సంగీత విద్వాంసురాలైన తల్లి అన్నమయ్య కీర్తనలను, భద్రాచల రామదాసు కీర్తనలను, క్షేత్రయ్య పదాలనూ పాడుతుంటే ఒకరోజు తను ఆశువుగా ”నమో నమో రాఘవాయ ” అనే కీర్తనను దేశి తోడి రాగంలో పాడి ఆనాటినుండి మొదలుకొని, 24000 కీర్తనలను రచించారని ప్రతీతి, కానీ ఇప్పుడు అవన్నీ లభ్యములు కావు. త్యాగరాజస్వామి వారి కీర్తనలు బహు వేదాంత రహస్యాల సారాలు.

తెర తీయగరాదా లోని:

తిరుపతివెంకటరమణ!మచ్చరమను
పరమపురుష ! ధర్మాదిమోక్షముల
పారద్రోలుచున్నది నాలోని
ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులు రీతి యున్నది
హరిధ్యానము సేయు వేళ చిత్తము
అంత్యజు వాడకుబోయిన ట్లున్నది
మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధి మరు
గడ్డ బడి చెఱచిన ట్లున్నది
వాగురమని తెలియక మృగగణములు
వచ్చి తగులు రీతి యున్నది
వేగమె నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సరమను

భావము :
ఓ తిరుపతి వెంకటరమణా ! నాలో ఉండే మాత్సర్యమనే తెర – నీ దర్శనానికి ఆటంకం కలిగిస్తుంది. దీన్ని తొలగించు. ఓ పరమపురుషా! ధర్మ, అర్ధ, కామ, మోక్షాలను స్వానుభవానికి రానీకుండా నాలోని ఈ మాత్సర్యమనే తెర – దూరం చేస్తుంది. స్వామీ! స్థిమితంగా భోజనం చేసే సమయంలో నోటిలో ఈగ అడ్డం వచ్చినట్లూ, స్థిర చిత్తంతో శ్రీహరిని ధ్యానించే వేళలో మనస్సు అనాచార అసభ్య స్థలాలకు వెళ్ళినట్లూ, నీటిలోని చేప ఆకలితో ఆహారంగా అనుకొని గాలానికి తగులుకొన్నట్లూ, స్వచ్చమైన దీపకాంతిలో ఏదో మరుగు ఏర్పడి, కాంతిని చెరచినట్లూ, లేళ్ళు తమను పట్టుకోవడానికి వల పన్నిన గోయి అని తెలియక అందులో పడినట్లూ, ఏ జన్మలోనిదో అయిన మదమాత్సర్యాల తెర నీ దర్శనభాగ్యానికి అడ్డుగా నిల్చి ఉంది. దయతో ఈ తెరను తొలగించి నీ దివ్య దర్శన భాగ్యాన్ని కల్గించవా ?

‘సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే ‘ అన్న కీర్తనలో ఆయన సీతనూ, రాముణ్ణీ వేరు వేరుగా పేర్కొన్నా ఇందులో ఒక వైచిత్రి ఉంది. ఆరు చరణాలలో 24 రకాలుగా రాముణ్ణి అభివర్ణిస్తూ చివరిగా ‘త్యాగరాజ నుత’ అన్నారు. ఇవే 24 గంటలై ఒక దినమయితే, అది ‘ సీతనూ,రాముణ్ణీ’ కలిపిన ‘పెళ్ళి రోజు’ . అంతటి మహనీయుని కళ్యాణ వీక్షణం నిజంగానే వైభోగమే.

మరో కీర్తన – బంటు రీతి కొలువు ‘విరోధి’ నామ సంవత్సరానికి అన్వయించ తగ్గది. ఈ కీర్తనలో త్యాగయ్య ఒక చిన్న కోరిక, అంటే శ్రీ రామ కొలువులో తానొక భటుడైతే చాలు అన్నది, కోరుతున్నట్లున్నా నిజానికి అది మనందరిలో ఉన్న కోరిక అని చెప్పవచ్చు. మన విరోధులు మన మనసులో ఉన్న ‘అంతశ్శత్రువులు’ అనదగ్గ కామం,క్రోధం మొదలైనవే. వీటిని నిరోధించాలంటే ఒక భటునికున్నంత శక్తి కావాలి. కంచుకం, ఖడ్గం, ముద్ర బిళ్ళ ఇవీ ఉండాలి. అవి ఏవో కావు-రామ స్మరణతో కలిగే పులకింత, రామ నామం, రామ భక్తీ – అని త్యాగరాజ స్వామి వారు మనల్ని జాగృతం చేస్తున్నారు.
కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజు వారి కీర్తనలు అన్నీ కావేరీ నదీ తీరములోనే రచించబడ్డాయి. కావేరీ నదీ తీరం అందరిలోను భక్తి సామ్రాజ్యం నెలకొల్పి సంగీత సాహిత్యాలను అజరామరం చేసింది. సాయం సంధ్య వేళలో కావేరి నదీ తీరములో కూచుని మాయామాళవ గౌళ రాగములో త్యాగ రాజ స్వామి విరచిత కీర్తన పాడుతూ కావేరీ నదీ ప్రవాహ తరంగాలను చూస్తూ, చుట్టు ఉన్న పచ్చని చెట్ల మీద పక్షుల కిలకిల రావాలను వింటూ ఉంటే కలిగే అద్భుతమైన భావన దైవికమే.
అది మాటలకు అందని అనుభూతి కదా? ఈ జీవ నదీ తీరములోనే కదా అంతకు ముందు ఎన్నడూ లేని భక్తి సంగీతం, అద్భుతమైన సాహిత్యం వెలువడినది.. త్యాగరాజ స్వామి వారు పాడిన కీర్తనలు బహుశా ఇంకా ఈ నదీ తీర పిల్ల తెమ్మెర గాలిలో లీనమై మనకు మంద్రంగా వినబడుతూనే ఉంటాయేమో.
త్యాగరాజ స్వామి వంటి భక్తి సామ్రాజ్యమునేలే రారాజులు, వేల వేల ఏళ్ళకు గానీ ఒకరు జన్మించరు. అదీ వారు మన తెలుగు వారు కావడం మనకు ఎంతో గర్వకారణం మరియు వారిని గూర్చి తెలుసుకోవడం మన భాగ్యవశమేమో. ఈ కావేరీ పరీవాహక ప్రాంతములోనే సుశాస్త్రీయమైన కర్ణాటక సంగీతాన్ని వారు అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు తన మధుర భక్తి కీర్తనలతో. నేటికీ ప్రతి ఇంటా, వాడవాడలా ఈ కావేరి నదీ తీరములో వినబడేవి స్వామి వారు రచించిన కీర్తనలే.
నాదోపాసన చేసిన స్వామి వారు పండిత పామర జనరంజకముగా ఎన్ని అద్భుత కీర్తనలు రచించారు. వారు రచించిన అన్ని కీర్తనలు మనకు ఈనాడు అలభ్యం.. కానీ వారి శిష్య , ప్రశిష్యుల ద్వారా మనకు లభ్యమైన కీర్తనలు అన్నీ మేలిమి ముత్యాలే. కావేరీ నదిని గూర్చి వారు ఆసావేరి రాగములొ ఆది తాళములో రచించిన ఈ కీర్తన కావేరి నదీమ తల్లిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప జేస్తుంది.
పల్లవి: సారి వెడలిన ఈ కావేరిని జూడరే ||
అనుపల్లవి: వారు వీరనుచు జూడక తా న వ్వారిగాభీష్టముల నొసగుచు చరణం దూరమున నొక తావున గర్జన భీ కరమొక తావున నిండు కరుణ తో నిరతముగ నొక తావున నడచుచు వర కావేరి కన్యకామణి ||
చరణం: వేడుకగా కోకిలలు మ్రోయగను వేడుచు రంగేశుని జూచి మరి ఈ రేడు జగములకు జీవనమైన మూడూ రెండు నది నాధుని జూడ ||
చరణం రాజ రాజేశ్వరి యని పొగడుచు జాజిసుమముల ధరామర గణములు పుజ లిరుగడల సేయగ త్యాగ రాజ సన్నుతురాలై ముద్దుగ ||
కావేరీ నదీమ తల్లి, పండిత, పామరులను, ఉన్నవారిని లేని వారిని , పాపిని పుణ్యాత్ముని అందరినీ ఒకలాగే ఆదరించి వారి కోరికలు ఈడేరుస్తుంది. స్వామి వారు రచించిన కీర్తనలు పండితుని గొంతులో ఎంతటి మాధుర్యాన్ని ఒలికిస్తాయో.. పామరుని గొంతులో సైతం అలవోకగ భక్తి రాగం కురిపిస్తుంది.
ఇక సంగీత గోష్టిలో పాడితే ఇక దైవ సన్నిధి మన చెంతకు దిగివచ్చినట్టే. అసావేరి రాగాన్ని ఈ పాటకు స్వామి వారు ఎంచుకున్న తీరు అద్భుతం. ఈ రాగం కావేరి నదీమ తల్లిని తలపింప చేస్తుంది. పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యూరు నదీ తీరములో సకల సంగీత పండితులు కలసి ఆ నదీ తీరములోని స్వామి వారి ఆరాధనోత్సవాలలో ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా తారతమ్య భేధము లేకుండా కలసి పాడే సంగీత గాన ఘోష్టి అద్భుతమే. పైన స్వామి వారు రచించిన పాటలో కావేరి నదీమ తల్లి ఒక చోట ప్రచండ గర్జన చేస్తూ, మరొక తావున భీకరముగ ప్రవహిస్తూ, మరియొక తావున నిండు కరుణతో మెల్లగా సాగుతూ, పక్షుల కిల కిల రావాలు వింటూ, శ్రీ రంగని పాదాలు తాకుతూ ఈ సకల జీవులకు ఆధార భూతమైన స్వచ్చ జలాన్ని అందించే కావేరిని తొండరపూడి ఆళ్వార్ లేదా విప్రనారాయణుడు కావేరి నదీమతల్లిని “గంగయిర్ పునీతమాయ కావేరి” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *