May 3, 2024

మాయానగరం – 17

రచన: భువనచంద్ర

“నువ్విక్కడెందుకున్నావ్? ” ఆశ్చర్యంగా అడిగింది సుందరీబాయి ఆనందరావ్ ని .
“ఏక్సిడెంట్ అయ్యింది !” కొంచం సద్దుకుని అన్నాడు ఆనందరావు.
“అయితే? “అర్ధం లేని ప్రశ్న వేసింది సుందరి.
చిన్నగా నవ్వాడు ఆనందరావు , “సుందరి గారు! ‘అయితే’ అనే మీ ప్రశ్న కి నా దగ్గర సమాధానం లేదు. కొందరు వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు. వాళ్ళ సుఖము వాళ్ళ స్వార్ధము తప్ప మరేమీ వాళ్ళకు పట్టవు. కొందరు అంటే మాధవిగారిలాంటి వాళ్ళు సమాజం కోసం బ్రతుకుతారు. ఎవరికి బాధ కలిగినా, కష్టం కలిగినా వారికే కలిగినంతగా చలించిపోతారు. నేనూ ఓ ఒంటరి వాడిని. నాకు ఏం జరిగినా ఏడ్చేవాళ్ళో, అయ్యో అనే వాళ్ళో ఎవరూ లేరు. కింద పడ్డాను, వేలు చితికిపోయింది. మానవత్వంతో మాధవి గారు నన్ను తీసుకొచ్చి నాకు సేవ చేస్తున్నారు. జరిగింది ఇంతే. ఇంతకు మించి మీరేమీ వూహించుకోనక్కరలేదు. ” అన్నాడు.
లోపలకి వచ్చిన శోభ చివరి మాట మాత్రం విన్నది. “అవునండి … మాధవి అక్క నిజంగా గ్రేట్ . నేను అనాధని. నావాళ్ళెవరో నాకు తెలియదు. అయినా నన్ను సొంత చెల్లెలాగా చూస్తుంది. అక్క పరిచయం కాక ముందు నేను ఏడవని రోజు లేదు. ఇప్పుడు ఎంత హాయిగా వుందో… అయ్యో మరచిపోయాను .. ఇదిగో స్వీట్స్ తెచ్చాను .. ప్లీజ్ హావ్ ఇట్! ” స్వీట్ పాకెట్ లోంచి చెరో మైసూర్ పాక్ తీసి ఇద్దరికీ ఇచ్చింది శోభ. శోభ రాక ఆనంద రావుకి ఆనందం కలిగించింది.
“ఓహో.. మాధ్వీ అనాధాశ్రమం ఓపెన్ చేసిందన్న మాట” వంకరగా నవ్వి అంది సుందరి, స్వీట్ తినే ప్రయత్నం చేయకుండా.
“హ..హ.. హా.. అలాగంటారా? ఏమో ఇది మాత్రం నిజంగా ఆశ్రమమే. ఇక్కడ ఎవరేనా, ఎవరికైనా అయాచితంగానే ఆశ్రయం లభిస్తొంది. నన్నే చూడండి .. దెబ్బ తగిలిందన్నమాటే కానీ రాజభోగాలు అనుభవిస్తున్నాను. ” అన్నాడు ఆనందరావు.
“ఇంతకాలం మాధవి కూడా మనిషే అనుకున్నాను. మీరిద్దరూ ఆవిడని దేవత చేశారే! అదీ మంచిదేలెండి. నేనూ గొప్పగా చెప్పుకోవచ్చు… ఓ దేవత నాకు ఫ్రండ్ అని ” అక్కసుగా అంది సుందరి.
ఆనందరావు సైలెంటయ్యాడు. ఎప్పుడో..చిన్నప్పుడెప్పుడో వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట సడన్ గా అతనికి గుర్తొచ్చింది. “ఒరేయ్ ఆనందు! కోపానికి కారణం వుంటుంది. ద్వేషానికి కారణం వుంటుంది. మదానికి, లోభానికి, కామానికి కూడా కారణాలు వుంటాయి. ‘అసూయ ‘ కు మాత్రం అసలు కారణమే వుండదురా. లోకంలో అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనది అసూయ ఒక్కటే , ఎందుకంటే అది తెలిసిన వాళ్ళ మీదే కాదు , అసలు ఏ పరిచయమూ లేనివాళ్ళ మీద కూడా వస్తుంది. ఒక్కసారి అది గుండెల్లోకి వస్తే కారుచిచ్చులాగా మనసుని కాల్చిపారేస్తుంది. అందుకే, అసూయాపరులకు మాత్రం దూరంగా ఆమడదూరాన వుండు ”
సుందరి వంకే చూశాడు ఆనంద రావు. అందమైన శరీరం వెనుక బుసలు కొడుతున్న ‘అసూయ ‘ కనిపించింది అతనికి.
“అవును సుందరి గారు! నేను మా స్కూల్ లో అదే చెపుతూ వుంటా… ఓ దేవత నాకు అక్కగా దొరికిందని ” అమాయకత్వంతో కూడిన ఆనందంతో అంది శోభ. మళ్ళీ తలుపు చప్పుడయ్యింది. కూరగాయలను తీసుకొని చిరునవ్వుతో లోపలకి వచ్చింది మాధవి.
“మీకు వెయ్యేళ్లు ” నవ్వాడు ఆనంద రావు.
“అవును ఖచ్చితంగా వెయ్యేళ్ళు, ” మాధవి భుజాన్ని తల ఆనించి అంది శోభ.
“యా.. ద హోల్ డాం థింగ్ యూజ్ సినిమాటిక్ ” వంకరగా నవ్వి అంది సుందరి.
“మీరేమంటున్నారో ఒక్క ముక్క నాకు అర్ధం కావటంలా ” చాప మీద కూర్చుంటూ అన్నది మాధవి. శోభ కూడా మాధవి పక్కన కూర్చుంది.
“నిన్ను వీళ్ళిద్దరు దేవతను చేసేశారు. … కోరిన వరాలని నువ్వు వీళ్ళకి ప్రసాదించడమే తరువాయి. ” కుర్చీలోంచి లేచి డైరెక్టుగా ఆనందరావు పడుకున్న మంచం మీద కూర్చొని అంది సుందరీబాయి. ఆమె కళ్ళల్లో ఒక రకమైన పంతము పట్టుదల, ఒక రకమైన తెగింపు కనిపించాయి ఆనందరావుకి. మాధవి కూడా ఆశ్చర్యపోయింది.
“సుందరీ జీ.. ఏ దేవుడు, ఏ దేవతా కూడా ‘నేను దేవత ‘ అని చెప్పుకున్న దాఖలు లేవు . ఎదుటివారిలో నున్న దైవత్వాన్ని మనమే గుర్తించగలగాలి గానీ ‘గుర్తించమని ‘ వారు మనకి చెప్పరు. మాధవిగారూ అంతే. దైవత్వం అంటే ఏ లోకంలో నుంచో యీ లోకాంలోకి రారు . స్వచ్ఛమైన మానవత్వమే దైవత్వము. ” సూటిగా సుందరినే చూస్తూ అన్నాడు ఆనందరావు.
“ఆనందరావు గారు, నన్ను కాస్త ‘నన్ను’ గానే వుండనివ్వండి. నేనూ మీ అందరిలాంటి దాన్నే, ఇదిగో సుందు .. ఆలూపరోట చేయడంలో ఎక్స్పర్ట్ ని అంటావు కదా, ఇవ్వాళ అది మాకు రుచి చూపించు ” చాప మీద నుంచి లేచి చనువుగా సుందరి భుజం మీద చేయ్యి వేసి అన్నది మాధవి.

**********

రాజకీయ పీఠాధిపతి ఎదురుగా కూర్చున్నాడు బోసుబాబు భక్తిగా గురువుగారిని చూస్తూ. గురువుగారు ఎందుకు పిలిపించారో తెలియదు. ‘కళ్ళు మనసు వాకిళ్ళు ‘ అంటారు పెద్దలు. గురువుగారు ఎప్పుడూ నల్ల కళ్ళద్దాలు వాడతారు గనక ‘మనసు ‘ లో ఏముందో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
“నిన్నెందుకు పిలిపించానో తెలుసా? “బాలీసుల మీదా విశ్రాంతిగా వాలి అన్నాడు గురూజి.
‘తెలీదు ” అన్నట్టు తలాడించాడు బోసు.
‘ఎదగాలనుకున్నవాడికి ఏమరుపాటు వుండకూడదు. ఎలక్షన్లు రాబోతున్నాయి. వాటి సంగతి నువ్వేనాడో మరచిపోయావని నాకు తెలుసు. అబ్బాయ్… అందలం ఎక్కాలనుకునేవాడు ఆడదాన్ని దూరంగా వుంచాలి. ఆడుకో.. పర్వాలేదు…ఆనందించు పర్వాలేదు…నో ప్రాబ్లం. ప్రాబ్లం ఎప్పుడొస్తుందో తెలుసా? నువ్వు ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు. ఒరేయ్ బోసు! రాజకీయానికి మించిన శక్తి ప్రేమకుంది. ఒక్కసారి అటువైపు వెళ్ళామనుకో…నిన్ను మామూలు మనుషుల్లో పడేయడం బ్రహ్మతరం కూడా కాదు. ” ఆగాడు గురువు గారు.
“అదేం లేదు స్వామీజీ! ” మామూలుగానే అన్నాడు బోసు.
“అదే మరి ప్రేమంటే..చూడు ఎంత చురుగ్గా అబద్ధం ఆడేశావో. ఒరేయ్ బోసు…లక్ష మందిని చూశా ! పాము కాటు నుండి తప్పించుకున్న వాళ్ళు బోలెడెంత మంది కనపడ్డారు కానీ , ప్రేమ కాటు నుండి తప్పించుకొన్న వాడు ఒక్కడు కూడా లేడు. సరే.. డిటైల్స్ కావాలా? పిల్ల పేరు శోభారాణి. చదువు బి. యసి. పని చేసేది శ్యామ్యూల్ రెడ్డి దగ్గర. ఉద్యోగం టీచర్. నా అనే వాళ్ళు లేని అనాధ. ఇవి చాలా? ” గ్లాసులోని విస్కీని చప్పరించి అన్నాడు గురూజీ. బోసుబాబు కి బుర్ర తిరిగిపోయింది.
“అదీ..అదీ..” నీళ్ళు నమిలాడు బోసు.
“అది..అదే…బోసు…కల్తీ చావులని కలరా చావులుగా చూపించాం. అది ఓకే. ఇప్పుడు అదే కేసు తిరగబడితే ఏమౌతుంది? ”
“అది క్లోజైపోయింది గదా గురుజీ ” ఆశ్చర్యంగా అన్నాడు బోసు.
“అవును క్లోజైపోయింది. కానీ మళ్ళీ ఓపెన్ కాకూడదని ఎక్కడా లేదుగా? ” నవ్వాడు గురుజీ.
“ఎవరు ఓపెన్ చేస్తారు? ” బోస్ గొంతుకలో తెంపరితనము.
“అదే.. ఆ ఓవర్ కాన్ఫిడన్స్ వుండకూడనిది. అరే బాబూ, ప్రేమ గుడ్డిదని నిరూపించావు! ఆ కేస్ ని ఓపెన్ చెయ్యాలని , ఆ డెత్ లన్నీ కల్తీ సారా వల్ల జరగాలేదనినీ, అసలు ‘కలరా ‘ అనేది కల్పించిందే తప్ప నిజం కాదని ఆల్రెడీ పత్రికలకీ, పోలీసులకీ అసెంబ్లీకి కంప్లైంట్ బ్లాక్ అండ్ వైట్ లో వెళ్ళింది. పైన వున్నోళ్ళు మన భక్తులు గనక వుప్పందించారు. లేకపోతే? ” కళ్ళజోడు తీసి బోసుబాబు వంక సూటిగా చూశాడు గురూజీ.
ఆ కళ్ళలో క్రూరత్వం చూసి బోసుబాబుకి ఒల్లు జలదరించింది. “గోడలు పడిపోతే నేను పట్టించుకోను, మళ్ళీ మళ్ళీ కట్టచ్చు, కానీ పునాదికే ముప్పొస్తే మాత్రం స్వపర భేదాన్ని చూడను. ఒళ్ళు దగ్గర పెట్టుకో! ” మళ్ళీ కళ్ళజోడు పెట్టుకున్నాడు గురుజీ.
“మీరేమి చేయమంటే అది చేస్తా” తల దించుకొని అన్నాడు బోసుబాబు.
“ఎర వేస్తే కానీ చేప చిక్కదు, నీళ్ళు పోస్తే కానీ మొక్క పెరగదు. పొలిటిషియన్లు అంటే వేటగాళ్ళలాంటోళ్ళు. వేచి వుండాల్సినప్పుడు ఎన్నేళ్ళైనా గమ్మునుండాలి. పని బడ్డప్పుడు మాత్రం పగలు రాత్రి అని చూడకూడదు. డబ్బు కోసం చూడకు. నిల్వ వున్న డబ్బు గబ్బు కంపు కొడుతుంది. రూపాయిలు కూడా విత్తనాల్లాంటివే. నాటాక నాలుగొందల రెట్లు ఫలసాయాన్నిస్తాయి. నిఖారసైన సారాని అమ్మించు. నిఖార్సైన కల్లుని ఇప్పుంచు. అవసరమైతే ఉదారంగా ‘మందు ‘ ని అప్పివ్వు. చిన్నపిల్లలుండే ఇంటికి ఇంటికో పాల డబ్బ , చదువుకునే పిల్లలకి పలకలు బలపాలు పుస్తకాలు, ఇంటికో ప్లాస్టిక్ బిందె, ఆడోళ్ళకో చీరా జాకెట్టు గుడ్డనీ చేతుల్తో నువ్వే పంచు. పసుపుతాళ్ళు, తాళిబొట్లు నువ్వే పంపిణీ చెయ్యి. ముసలోళ్ళకి హార్లిక్సు సీసాలు, కురోళ్ళకి ఆట సామాన్లు అందివ్వు. ఒక్కటి గుర్తుపెట్టుకో .. నీ గురించి ఏనా కొడకు ఒక్క కంప్లైంట్ ఇవ్వకూడదు. మందుకు లొంగనోడు మహిలో లేడు. మందుకి లొంగకపోతే డబ్బుకి లొంగుతాడు. దానికి లొంగనోడు ‘ కత్తి’కి లొంగి తీరాలి. ఒకవేళ ఇంకా ప్రేమా గీమా లాంటివి నిన్ను వదల్లేదనుకో .. పర్వాలేదు.. ఆ పిల్లనే పెళ్ళి చేసుకో. ఆర్నెళ్ళు తిరిగేసరికి ఆవేశం చల్లారి మత్తు వదలిపోద్ది. అంతే కానీ ప్రేమా పేరు మీదా పొలిటికల్ కెరియర్ ని మంట గలపమాక! “జ్ఞానబోధ చేశాడు గురూజీ. చాలా వినయంగా తల వొంచి గురువుగారి పాదాలకి నమస్కరించి బయట పడ్డాడు బోసుబాబు.
గురువు గారి స్పీచ్ బోసుబాబుకి కొత్తేం కాదు. కానీ అతనిని ఆశ్చర్యపరచినది ఏమంటే గురువుగారి నెట్ వర్క్. వివరాలన్నింటినీ పూసగుచ్చాడంటే ఓ కన్ను నిరంతరం తన మీదే పెట్టి వుండాలి. ‘అర్జంటుగా అ పిల్లని పెళ్ళి చేసుకో ‘ అన్న సజెషన్ కూడా బోసు బాబు కి తెగ నచ్చింది. నచ్చడమే కాదు… గిలిగింతలు పెట్టింది కూడా.

********

రెండు రోజులుగా మదాలస నిట్టూరుస్తూనే వుంది. కారణం సెల్ఫ్ పిటీ. అధికారంలో ఎవ్వరూ అభిమానం గెలుచుకోలేరు. ఇది నిజాతి నిజం. కానీ యీ సత్యం ఆ ‘మొగుడు ‘ అనే జఢపదార్ధానికి చెప్పేది ఎవరూ? నిజంగా ‘ చెడిపోదామనే ‘ ఆవిడ ఆనందరావు కోసం వెళ్ళింది . కానీ అతను దొరకలేదు.
“భగవంతుడా…కనీసం చెడటానికి కూడా అవకాశం ఇవ్వవు కదూ! ” అని నూట ఇరవై ఆరోసారి మనసులోని దేవుడ్ని ప్రశించింది మదాలస. మళ్ళీ జాలిగా నవ్వుకుంది. “అవును… నేను చెడాటానికి సిద్ధంగా వున్నా చెడగొట్టడానికి ఆ ఆనందరావు సిద్ధంగా వుండాలి కదా? అతన్ని చూస్తే అలాంటి మనిషి కానే కాదు. ” తనలో తానే అనుకుంది. ఆలోచనలలో పక్క మీద అటూ ఇటూ దొర్లుతోంది.
“వదినా ఒంట్లో బాగలేదా? “అడిగింది ఆడపడుచు. ఆ పిల్ల పేరు నీరజ. చాలా అందగత్తె. ఇంటర్ లో చదువు ఆపి వుండకపొటే యీ పాటికి ‘గొప్ప ‘ వుద్యోగం చేస్తూ వుండేదాన్నని అనుకుంటుంది.
“బాగానే వున్నా ” అని ముక్తసరిగా అన్నది మదాలస.
“ఏదో అనీజీగా వున్నావని తెలుస్తోంది. ఎందుకో మాత్రం నాకు తెలియదు. ఒకవేళ మా అమ్మ కనక నిన్నేమయినా అంటే క్షమించు. మా అమ్మ చాలా మూర్ఖురాలు. మా అన్నయ్యా అంతే. వదినగా నువ్వు వచ్చావు గనక కూడూ గుడ్డా అయినా సమయానికి సమకూరుతున్నాయి. వేరేదెవతైనా వచ్చి వుంటే యీ పాటికి గారంటీగా విడి కాపురం పెట్టించేది. యీ చిన్న విషయాన్ని మా అమ్మ అర్ధం చేసుకోదు. ఇంకోటి కూడా నాకు తెలుసు… నువ్వు అన్నయ్య కలిసి వుంటే మా అమ్మ చూడలేదు. బహుశా చిన్నతనంలోనే అంటే ఆవిడ మంచి వయసులో వుండగానే మా నాన్న పోవడం వల్ల కావచ్చు. ఆ అసంతృప్తి అధికారం రూపంలో నీ మీద చెలాయిస్తూన్నది. చాలా సార్లు చెప్పి చూశా. నా మాట వినదు. మా అన్నగారు కూడా నీతో అహంకారం తోటే ప్రవర్తిస్తునాడని నాకు అనిపిస్తోంది. అన్నం పెట్టేవాడిని అంత కంటే ఏమీ అనలేను. మా వాళ్ళ వల్ల కలుగుతున్న ఇబ్బందికి మాత్రం క్షమించు. ” మంచం మీదకు వంగి మదాలస ముఖాన్ని రెండు చేతులతోనూ పట్టుకొని అన్నది నీరజ. మదాలస షాక్ తింది. ‘ ఈ పిల్లలో ఇంత అర్ధ చేసుకొనే మనసు ఉందా? ‘ అని ఆశ్చర్యపోయింది.
‘ఆశ్చర్యం ఎందుకు వదినా? నేనూ ఆడదాన్నేగా. ఇంటర్ తో ఆపకుండా వుంటే నేనో గొప్ప వుద్యోగం చేసి యీ ఇంటి బరువు బాధ్యతల్ని నెత్తికెత్తుకుందామనుకున్నాను. అందుకే అర్ధం లేని కలలు కంటూ వుంటాను. కానీ ఎందుకో ఈవాళ నాకు వేదనగా వుంది. అసలు ఈ దేశంలో ఆడదాని విలువ గుర్తించేవారు ఎవరూ?
బయటకెళ్ళి నేను ఏదో ఓ పని చేసినా నా కాళ్ళ మీద నేను నిలబడొచ్చు. దానికి అన్నయ్య ఒప్పుకోడు. ఆడది గడప దాటితే చెడిపోతుందని లోలోపల అనుకుంటాడు. అమ్మా అంతే. సరే, ఎవరికో కట్టబెడతారు. వాడు నా నెత్తిన పాలు పోస్తాడని గ్యారంటీ ఏమిటీ? ఆడదాని బ్రతుకు లాటరీ అయిపోయింది…. ప్రతీ అణాకాణీ వెధవ కట్నం అడిగేవాడే. ప్రతీ అత్తగారు తనో ‘ చక్రవర్తి ‘ కి జన్మనిచ్చాననే ‘నిక్కు ‘ పోతుంది తప్ప కన్న కొడుకు ఎంత దౌర్భాగ్యుడో కళ్ళున్నా గుర్తించదు. మా అన్నయ్యకి సుఖపడటం రాదు. అందుకే నీలాంటి రత్నం దొరికినా వాడికి నీ విలువ తెలీదు. ఏమో వదినా దీన్నే అంటారా జీవితమనీ? ” బొటబొటా కన్నీళ్ళు కార్చింది నీరజ. అప్రయత్నంగా లేచి నీరజని గుండెకు హత్తుకుంది మదాలస. ఆమె కళ్ళలోనూ కన్నీరే.
“దేవుడా.. నువ్వు గొప్పవాడివి. చాలా చాలా మంచివాడివి. చెడాలని ఛండాలపు నిర్ణయం తీసుకొన్న నన్ను మంచిగానే వుంచావు. యీ పిల్ల ఇంత మంచిదని అనుకోలేదు. నామీద ఇంత ప్రేమ యీ పిల్లకుందని నిజంగా తెలియదు. భగవంతుడా యీ పిల్లకి ఆనందరావులాంటి వాడే తగినవాడు. నా నుదిటి రాతను పక్కన బెట్టి యీ పిల్లైనా సుఖపడే రాత రాయి. ” మనసులోనే భగవంతుడ్ని ప్రార్ధించింది మదాలస. కళ్ళు మూసుకొని వుండటంతో అత్తగారి రాక గమనించలేదు.
మదాలస తల నీరజ భుజం మీదా, నీరజ తల మదాలస భుజం మీదా అలాగే వీరి చేతులు వారిని వారి చేతులు వీరినీ హత్తుకొని వుండటం చూసిన ‘అత్తగారి ‘ కి ఛిర్రున కోపం ముంచుకొచ్చింది.
“ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ వెధవ ఏడుపులేంటి? ఎవరు చచ్చారని ఈ శోక ప్రదర్శన? ” ఒక్క అరుపు అరచింది.
నీరజ తల్లిని చూసి నవ్వింది. “ఒదినా చూశావా? అన్నట్టు ఈవిడ కూడా ఆడదే! ” అని నవ్వింది.. పగలబడి నవ్వింది.
ఇంకా వుంది….

1 thought on “మాయానగరం – 17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *