May 7, 2024

చిగురాకు రెపరెపలు – 8

రచన: మన్నెం శారద

పెదనాన్న మమ్మల్ని కొత్తగూడెం తీసుకురమ్మని ఒక కాన్‌స్టేబుల్ని పంపారు. మేం పిల్లలం మాత్రమే కొత్తగూడెం వెళ్లాం.
నాకు బాగా గుర్తు. అన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్. అన్ని ఇళ్లముందు మంచి గార్డెన్స్. అప్పుడే మొదటిసారి వెస్టర్న్ టాయిలెట్స్ చూశాను.
అంతా బాగానే వుండేది.
కాని.. మా దొడ్డమ్మ మాత్రం ఎప్పుడూ వణికిపోతూ వుండేది. అదంతా కమ్యూనిస్టు ఏరియా అట. ఎప్పుడు పెదనాన్నకి ఏం ప్రమాదమొస్తుందోనని. పెదనాన్న మాత్రం నిర్లక్ష్యంగా వుండేవారు. వాళ్లని నేరుగా ఇంటికి తెచ్చి పార్టీలిచ్చేవారు. ఏం చెప్పేవారో ఏమో కాని వాళ్లు చాలామంది పెదనాన్న మాటలకి ఇంప్రెస్ అయి మామూలు జనజీవితంలోకి వచ్చేసేరని.. ఆ తర్వాత కాలంలో చెప్పుకుంటుంటే విన్నాను. ఆ విషయం ఎలా వున్నా నాకు కొత్తగూడెం నచ్చింది.
అక్కడ బొగ్గుగనిలో పని చేస్తున్న ఒక ఫారినర్ వుండేవాడు. అతని క్వార్టర్స్ చాలా పెద్దది.
ఇంటిముందు, వెనుకల చాలా పెద్ద తోట.
అందులో అన్నీ గులాబీలే!
అందులోనూ ఎడ్వర్ట్స్ రోజా పూలే.
బేబీ పింక్ రంగులో మంచి సువాసనలు వెదజల్లుతూ వుండేయి. తోటంతా తుమ్మెదలు ఝంకారం చేస్తూ తిరుగుతుండేవి.
నేనెప్పుడూ అక్కడికెళ్లి నిలబడి ఆ పూలని చూసేదాన్ని!
తోటలో మాలి పని చేస్తుండేవాడు.
గాలిలో ఆ పూల వాసన కలిసి ఆ ప్రాంతమంతా ఒక వింత వాతావరణం సృష్టించేది.
మా అన్నయ్య దృష్టి కూడా ఆ తోట మీద పడింది.
ఇద్దరం అక్కడే నిలబడేవాళ్లం.
“నేను పూలు కోసుకురానా?” అనడిగేడు మా అన్నయ్య.
“వద్దురా, లోపల కుక్క వుంది. మాలి వున్నాడు” అన్నాను భయంగా.
“ఏం ఫర్వాలేదు” అంటూ చెబుతున్నా వినకుండా బార్బ్‌డ్ వైర్ ఫెన్సింగ్‌లోంచి లోపల దూరిపోయాడు.
నేను వణికిపోతూ బయట నిలబడ్డాను.
అన్నయ్య మాలికి కనపడకుండా గబగబా చేతికందినన్ని పూలు కోసి గబగబా వచ్చి నా వడిలో వేసి మళ్లీ తోటలో దూరేవాడు.
అలా ఎన్ని పూలో… నా ఫ్రాకులో పట్టనన్ని.
“చాలురా! వచ్చే” అంటే వినేవాడు కాదు.
చివరికి నేను భయంతో ఏడిస్తే కాని వచ్చేవాడు కాదు.
“చీ! పిరికిమొహమా! ఎందుకలా భయపడిపోతావ్?” అనేవాడు.
పూలన్నీ తెచ్చి వెనుక నీళ్ల తొట్టెలో వేసేవాళ్లం.
“ఎక్కడివన్నీ!” అని దొడ్డమ్మ అడిగింది.
“క్లబ్బులోనివి” అని అన్నయ్య అబద్ధం చెప్పేడు.
“అయితే మాత్రం! చెట్లకి వుంచాలి కాని ఇలా ఎందుకు కోయడం?” అని కోప్పడి దేవుడికి పెట్టేది.
చివరికి అది మా యిద్దరికీ వ్యసనమయ్యింది.
రోజూ వెళ్లడం పూలు కోసుకురావడం.
ఒకరోజు అన్నయ్య పూలు కోస్తుంటే కుక్క మొరిగింది. మాలి “ఎవరదీ?” అంటూ వెంటపడ్డాడు.
అన్నయ్య పరుగున రావడంతో బార్బ్‌డ్ వైర్ తగిలి షర్టు చిరిగిపోయింది. వళ్ళంతా చీరుకుపోయింది.
నేను గౌనులో పూలన్నీ అక్కడే పారేసి.. ఇద్దరం ఇంటికి ఒకటే పరుగు.
ఇదంతా తెలిసి మణక్క ఒకటే తిట్లు.
మేమిద్దరం మాత్రం దాన్ని వీరోచితంగా భావించి ఆనందపడ్డాం.
కొత్తగూడెం ఆఫీసర్స్ క్లబ్బులో మాంచి డ్రామాలు వేసేవారు.
ఒకసారి పెదనాన్న మమ్మల్ని కృష్ణలీలలు డ్రామాకి తీసికెళ్లేరు. మేము ముందు వరసలో కూర్చున్నాం. కంసుడు వచ్చినప్పుడల్లా నేను వణికిపోతున్నాను.
అది చూసి పెదనాన్న డ్రామా అయ్యాక గ్రీన్ రూంలోకి తీసుకెళ్ళేరు.
కంసుడు వేషధారి పెదనాన్నకి నమస్కారం పెట్టాడు.
“ఏవోయ్ గగ్గయ్యా, నిన్ను చూసి మా పిల్లలు భయపడిపోతున్నారయ్యా.. కాస్త ఆ మీసాలు తీసి నీ అసలు స్వరూపం చూపించు” అన్నారు.
అతను నవ్వుతూ విగ్, మీసాలు తీసి “చూశారా? ఇదంతా వేషం . రా . నా దగ్గరకు” అన్నాడు.
నిజమే, చాలా మామూలుగా వున్నాడు.
అతను తన గదని నా చేటికి ఇచ్చి “ఎత్తు” అన్నాడు.
“అమ్మో!” అన్నాను భయంగా.
పెదనాన్న దాన్ని తను తీసుకుని “పట్టుకుని చూడవే పిచ్చిమొహమా!” అన్నారు.
నేను పట్టుకున్నాను భయంగా. నిజమే అది చాలా తేలిగ్గా వుంది. పేపర్ మెష్‌తో చేసిందట.
నాకప్పుడు కంసుడంటే భయం పోయింది.
కాలగతిలో కొంచెం పెద్దయ్యేక అతను ప్రముఖ స్టేజి నటుడు వేమూరి గగ్గయ్యగారని తెలిసింది. నేను అప్పుడు గర్వంగా ఆయన్ని చూశానని చెప్పుకునేదాన్ని.
పెదనాన్నని మళ్ళీ నర్సీపట్నం ట్రాన్స్‌ఫరయింది.
పిల్లల చదువులు పాడవుతున్నాయని పెదనాన్న కుటుంబాన్ని కాకినాడలో వుంచడానికి నిర్ణయించుకున్నారు.
మణక్క, సౌదామిని కాకినాడలోని చాలా ఫేమస్ కాన్వెంట్‌లో జాయినయ్యేరు. అది కూడా చర్చి స్క్వేర్‌లోనే వుండేది.
అంతా చాలా డబ్బున్న వాళ్ల పిల్లలు అందులొ చదివేవారు.
నేను వాళ్లు యూనీఫారంలో కాన్వెంటు కెల్తుంటే అబ్బురంగా చూసేదాన్ని.
పెదనాన్న వాళ్ల ఆలనాపాలనా చూడటానికి ఆయన తమ్ముడి కుటుంబాన్ని ఇంట్లో పెట్టేరు.
మేం మళ్ళీ మాచర్ల వెళ్లిపోయేం.
పెదనాన్న అమలాపురంలో వున్నప్పుడు మాకు ముమ్మిడివరం బాలయోగిని, పెద్దమామయ్య ద్రాక్షారామం బాలయోగిని చూపించేరు.
“వాళ్లెలా అలా తపస్సు చేస్తారు? ఏం తినకుండా ఎలా కూర్చుని వుంటారు. వాళ్లకి దేవుడు కనిపిస్తాడా.. నిజంగానే?” అని నాకు చాల ఆశ్చర్యంగా వుండేది.
“అలా చేసి దేవుణ్ణి.. చూస్తే..” అని ఆశ కల్గేది.
నాకప్పటికి దేవుడిగురించి పెద్ద అవగాహన లేదు.
ఎలాగైనా దేవుణ్ణి చూడాలి అని కోరిక మాత్రం కలిగింది. ‘అందుకని ఏదైనా దేవుడి చరిత్ర చదవాలి’ అనుకున్నాను.
మ ఇంట్లో రూజ్వెల్ట్ చరిత్ర తెలుగు అనువాదం వుండేది.
నేను రూజ్‌వెల్ట్‌ని దేవుడే అనుకున్నాను.
చాలా జాగ్రత్తగా తోట మధ్యలో కూర్చుని రోజూ దాన్ని పారాయణం చేసేను.
అతను అమెరికా ప్రెసిడెంటని నాకసలు తెలియదు.
ఇంత బాగా చదివేను. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా అని ఎదురు చూసేదాన్ని.
చివరికిలా కాదు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాను.
మరి అంతసేపు కూర్చోగలనా? ఆకలి వేస్తుంది కదా అని సంశయంగా వుండేది.
నేను తపస్సు చేస్యాలనుకుంటున్నాను అని మా చెల్లెలు ఇందిరతో చెప్పేను.
అది అసలే పెద్దగా వున్న కళ్లని ఇంకా పెద్దవిగా చేసి “నువ్వా?” అంది.
అది చాలా ముద్దుగా, అందంగా, అమ్మాయకంగా వుండేది. దానికప్పుడు అయిదేళ్లు. అది మా అమ్మకూచి.
“ఏ? నేనే!” అన్నాను.
“అమ్మో! తపస్సంటే మాటలా? అడవిలో కెళ్తావా?” అంది.
“ఎందుకు?ఇంట్లోనే చేస్తాను”అన్నాను.
“ఎక్కడ చేస్తావు?” అనడిగింది.
“ఇదిగో, ఈ కిటికీలో కూర్చొని చేస్తాను. ఎవరూ నన్ను పలకరించకూడదు.” అని చెప్పి ఒక పెద్ద షాల్ తెచ్చుకుని కిటికీ ఎక్కి కూర్చుని షాల్ కప్పుకున్నాను నన్నెవరూ చూడకుండా.
పది నిముషాలు కూర్చున్నానో లేదో, తేళ్లొస్స్తాయని భయం పట్టుకుంది.
ఇంతలో మా హేమక్క వచ్చి “ఏయ్ శారదా! ఏం చేస్తున్నావే ముసుగులో” అంది.
“ష్! తపస్సు. ఎవరూ మాట్లాడించొద్దని చెప్పింది” అని చెప్పింది ఇందిర.
అంతే! మా అక్క నవ్వడం మొదలుపెట్టింది.
వెంటనే ఇందిర కూడా నవ్వు మొదలెట్టింది.
ఈ అల్లరికి అమ్మ వచ్చింది.
ఏంటీ గొడవ?ఆ ముసుగులో ఎవరూ?” అంది.
నాక్కూడా నవ్వు తన్నుకొస్తున్నది.
ఈ తేళ్ల భయమొకటీ..
“తపస్సంటమ్మా.. రూజ్‌వెల్ట్ చరిత్ర చదివిందంట కదా!”
“రూజ్‌వెల్టు దేవుడనుకుంటుందా? దాని మొహం! ఇప్పుడు భోజనం టైముకి దిగొస్తుంది. అదసలు అయిదు నిముషాలు తిన్నగా కూర్చోగలదా?” అంది అమ్మ వెళ్లిపోతూ.
నాకు పట్టుదల పెరిగింది. వాళ్లన్నందుకయినా తపస్సు చేసి తీరాలని. కాని.. అసలు కూర్చోలేకపోతున్నాను. అలా కూర్చోగల్గడం ఎంత నరకమో అర్ధమవుతోంది.
మద్యాహ్నం వరకు ఎలాగో భరించి కూర్చున్నాను. లోపల ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఏడుపొస్తున్నది. ఈపాటికి ఎన్ని చోట్లకి తిరిగొచ్చేదాన్నో కదా! ఎవరైనా బలవంతంగా నన్ను లేవదీస్తే బాగుండును. నేనే మానేస్తే నవ్వుతారేమో! అని తెగ బాధపడిపోతున్నాను.
మధ్యాహం భోజనానికి మా నాన్న ఇంట్లోకొచ్చెరు.
“ఈ బోడేడేడీ?” అనడిగేరు.
అంతా వింటూనే వున్నాను.
“అదిగో తపస్సట. ఆ కిటికీలో ముసుగేసుకుని కూర్చుంది.” మా అమ్మ చెప్పింది.
మా నాన్న నవ్వి “ఇక చేసింది చాలు రా! భోంచేద్దాం” అనారు.
నేను జవాబు చెప్పాలేదు.
వెంటనే దిగిపోతే గౌరవం పోతుంది అక్దా!
“ఏయ్! నిన్నే!” అన్నారు నాన్న.
వెంటనే లేచి పోతే లోకువయిపోతానని అలానే కూర్చున్నా.
నాన్న వచ్చి అమాంతం ముసుగు లాగి ఎత్తుకుని క్రిందకి దింపేరు.
“నాన్నా! నా తపస్సు చెడగొట్టేవ్!” అన్నాను కోపం వచ్చినట్లు నటిస్తూ.
“నీకీ వయసులో తపస్సేంటిరా? హాయిగా ఆడుకుని పాడుకోవాలి” అన్నారు.
“రా. ఇంక మింగుదువుగాని తపస్సయిందిగా!” అని అమ్మ.
హేమక్క వాళ్లు నవ్వుతున్నారు.
ఇందిర మాత్రం ఏవీ పట్టించుకోకుండా నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది.
భోజనాలయ్యేక “నీకు నిజంగా దేవుడు కనిపించేడా?” అని అడిగింది అమాయికంగా.
అది నిజంగానే పాపం రామ భక్తురాలు.
మా యింట్లో రాముడి విగ్రహాలుండేవి. చిన్నప్పటినుండి వాటి దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుతుండేది.
నేను కిటికీలోంచి చూసి నవ్వుతుండేదాన్ని.
అది కళ్లు పెద్దవి చేసి “అలా దేవుడిని చూసి నవ్వకూడదు. కళ్లు పోతాయి” అని చెప్పేది.
అదలా అనగానె నేనింకా పడీపడి నవ్వేదాన్ని.
“పాపం, రాముడేం చేస్తాడే! ఆయనకే బోళ్ళు కష్టాలు. నీకేం సాయం చేస్తాడు. క్రిష్ణుడ్ని పూజ చెయ్యి. చకచకా బోల్డు మహిమలు చేతాడు. సినిమాలు చూడలే!” అని చెప్పేదాన్ని.
కాని.. కాలగతిలో నేను రామభక్తురాలయ్యేను. అదే చిత్రం.
“ఏదీ మీరంతా నన్ను తపస్సు సరిగా చెయ్యనివ్వలేదు. కొంచెం మేఘాలు అలల్లా వస్తున్నాయి. కొద్దిగా మురళీగానం వినిపించింది. సరిగ్గా అప్పుడే లేవగొట్టేసేరు” అన్నాను నిష్టూరంగా.
మా ఇందిర నమ్మింది.
నన్ను ఎంతో ఆరాధనగా చూసింది,
“అయితే తపస్సు చేస్తే దేవుడు కనిపిస్తాడన్నమాట” అంది ఎందో సంతోషంగా.
పోస్టల్ బాగ్స్ తీసుకెళ్ళే ట్రాలీ మద్యాహ్నం పన్నెండు గంటల వరకు ఖాళీగా వుంటుంది. రైలు ఒంటి గంటకొస్తుందంగా దాన్ని బాగ్స్ వేసుకుని లాక్కుని స్టేషన్‌కి తీసుకెళ్ళేవారు. అతన్ని మెయిల్‌ప్యూన్ అని అనేవారనుకుంటాను.
నేను పదిగంటలకల్లా మా చెల్లెళ్లని ఇందిరని, లలితని ఎక్కించుకుని ఎదురుగా వున్న మండాది రోడ్డులో చాలా దూరం తీసుకెళ్ళేదాన్ని. రోడ్డుకటూ ఇటూ వేప, రాగి, మర్రి .. ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని చల్లని ఆకుపచ్చని పందిరిలా వుండేవి. బయలంతా తంగేడు పూలతో ఆకుపచ్చని తివాసీ మీద పసుపు ఒలకబోసినట్లు మనోహరంగా వుండేది. అక్కడక్కడా పున్నాగ పూలచెట్లు తెల్లని సన్నాయి బాకాల్లా గాలికి రాలి సువాసనలు వెదజల్లుతూ
సరిగ్గా నాకు ఏమీ తెలియకపోయినా.. నా మనసు ఆ వాతావరణాన్ని ఎంతగానో ఇష్టపడేది. చెప్పలేని పరవశం కల్గేది.
వీళ్లనిలా తీసుకెళ్లడం చూసి సబ్‌రిజిస్టారుగారి భార్య పార్వతత్త వాళ్ల కొడుకు జయసూర్యని, ఇంకా యిలా చాలా మంది వాళ్ల పిల్లల్ని ఎక్కించేసేవారు. ఆఖరికి “హేమక్క కూడా ఎక్కేది. అలా ఎన్ని మైళ్లు లాగినా “మీ వూరొచ్చింది. దిగండి” అంటే ఎవరూ దిగేవారు కారు.
“ఇంకా మా వూరు రాలేదు” అనేవారు మొండిగా. అలా లాగిలాగి నా చెతులు పడిపోయేయి.
నాకు ఎవరన్నా కాస్సేపు లాగితే నేను ఎక్కాలని వుండేది. కాని.. ఎవరూ ఒప్పుకునేవారు కాదు.
చివరకి ట్రాలీ రైల్వేస్టేషన్‌కి వెళ్ళే టైము వరకు.
అప్పుడు టెన్షన్ పడుతూ మెయిల్ ప్యూన్ దేవదాసు పరిగెత్తుకొచ్చేవాడు.
“ఏంటి తల్లి! రైలొచ్చే టైమయింది. అయ్యగారు బయటకొచ్చి నిలబడ్డారు. బాగ్‌లు రైలుకందకపోతే మా ఉద్యోగాలూడతాయి” అంటూ
అప్పుడు నాకు రిలీఫ్ దొరికేది.
నేను ఎక్కి కూర్చునేదాన్ని.
దేవదాసు గబగబా లాక్కెళ్ళేవాడు.
నిజంగానే మా నాన్న టెన్షన్‌గా బయటకొచ్చి నిలబడుండేవారు.
“ట్రాలీ ముట్టుకోవద్దని చెప్పానా లేదా?” అనేవారు కోపంగా.
మా నాన్నగారి కోపమంటే నాకు లెక్కలేదు.
నేను పళ్ళికిలించి నవ్వేదాన్ని.
దేవదాసు బాగ్స్ వేసుకుని స్టేషన్‌కి పరిగెత్తేవాదు.
“ఒకసారి కాకినాడ వెళ్లి పిల్లల్ని చూడు” అని మా దొడ్డమ్మ మా అమ్మకి లెటర్ రాసింది.
అంతే! చలొ కాకినాడ.
కాకినాడ పేరెత్తితేనే మా మనసు పులకించి పోయేది.
ప్రయాణం ఎంత కష్టమైనా ఏమీ అనిపించేది కాదు.
సామర్లకోట రాగానే ఎంత ఉత్సాహమో!
ఈసారి వెళ్లగానే మా దొడ్డమ్మగారిల్లు మా ఇల్లులా అనిపించలేదు. ఇల్లంతా మా పెదనాన్న తమ్ముడు కుటుంబం ఆక్రమించేసేరు.
మణక్క, సౌదా, కృష్ణక్క, అన్నయ్య దిగులుగా కన్పించేరు.
వాళ్లు అమ్మకి చెబుతుంటే విన్నాను.
“చిన్నమ్మా. వీళ్లు మమ్మల్నసలు సరిగ్గా చూడటం లేదు. నాన్న పంపిన డబ్బులన్నీ దాచేసుకుంటున్నారు. ఆయన పంపిన స్వీట్స్ తినేస్తున్నారు. ఏమైనా అంటే మీ నాన్నకి చెబుతామని బెదిరిస్తున్నారు” అని ఏడుస్తూ చెప్పేరు.
మా అమ్మ దిక్కు తోచనట్లు చూసింది.
“ఏం చెయ్యనే.. అటువాళ్లు మీ నాన్నకి అయినవాళ్లు. నేనేమన్నా బాగోదేమోనని”
అప్పటికీ మా అమ్మ వూరుకోదు.
“ఏవక్కయ్యగారూ! అప్పుడెప్పుడో చూశాను. సన్నగా చెప్పురు పుల్లలా వుండేవారు. ఇప్పుడు కండపట్టి ఇంటి దూలంలా తయారయ్యేరు. ఈ నీళ్లు బాగా పడినట్లున్నాయి” అంది ఆవిడతో.
ఆవిడ మా అమ్మని రుసరుసా చూసి వెళ్లిపోయింది.
తర్వాత సౌదా వాళ్లెలా ఏడిపిస్తున్నారో, పెదనాన్న పంపినవన్నీ ఎలా దాచుకు తింటున్నారో అన్నీ చెప్పి ఏడ్చింది.
ఆ రోజుల్లో ఎంత డబ్బునా పెద్దలంటే గౌరవముండేది. చాడీలు చెబితే పెద్దవాళ్లు తిరిగి మమ్మల్నే తిట్టేవారు.
అప్పుడు నాకొక అయిడియా వచ్చింది.
మాచర్ల టూరిగ్ టాకీసులో పదేపదే సినిమాలు చూసిన ప్రభావంతో నేను ఒక నాటకం రాశాను. దాని పేరు “మంత్రి చేసిన ద్రోహం”. అదే నా మొదటి రచన. అప్పుడూ నాకు సరిగ్గా ఆరేళ్లు నిండి ఏడవ సంవత్సరంలోకి వచ్చింది. నాకు ట్యూషన్ చెప్పిన చక్రపాణి మాస్టారి ప్రభావం నా మీద చాలా వుండేది. తెలుగంటే అంత మమకారం కల్గించేరాయన. ఇప్పటికీ ఎవరైనా అద్భుతంగా రాస్తే నేను ఏ మాత్రం హెజిటేషన్ లేకుండా పాదాభివందనం చేస్తాను. ఏ కొత్తవారినయినా వారు సాహిత్యరంగంలో నాకెంత జూనియర్సయినా నేను వారిని ఏ భేషజం లేకుండా అభినందిస్తాను. అది నేను చదువుకున్న గురువుల సాంగత్యంలో నేర్చుకున్న సంస్కారంగా భావిస్తాను.
ఆ నాటకం పూర్తిగా నేను చూసిన జానపద సినిమాల ప్రభావమే.
అందులో మా సౌ దా రాకుమార్తె. నేను మంత్రిని. విలన్‌ని. అందరం దొడ్లో జామచెట్టు క్రింద రిహార్సల్స్ వేసేం. మా చుట్టాలెవరూ చూడకుండా.
ఆ రోజుల్లో కాకినాడలో ఏ కొత్త సినిమా వచ్చినా రాత్రి పెట్రోమాక్స్ లైట్లతో సినిమా పోస్టర్స్‌ని అందంగా బళ్లలా తయారు చేసి వూరేగించేవారు. “ఏం సినిమా కావాలోయ్” అని ఒకరంటే అందరూ కోరస్‌గా ఆ సినిమా పేరు అరిచేవారు. చాలా ఆర్భాటంగా జరిగేది. అందరూ చాలా వినోదంగా బయటకొచ్చి చూసేవారు.
మేం కూడా మా డ్రామా బొమ్మలు వేసేం. అంటే నేను, మా హేమక్క. హేమక్క కూడా పెయింటింగ్స్ వేస్తుంది కొద్దిగా. వాటిని కొబ్బరి పుల్లలకి అతికించేం.
సాయంత్రం మేం కూడా వూరేగిస్తూ ఏం నాటకం కావాలోయ్.. మంత్రి చేసిన ద్రోహం కావాలోయ్! అని మా చుట్టాల వీధుల్లో అరుచుకుంటూ తిరిగేం. అప్పుడే మా క్రిష్ణక్కకి పెళ్లి కుదిరింది. వాళ్ల మామగారు రంగూన్‌లో లాయర్ చేసి వచ్చేరు. బావగారు ఇంజనీరు. వాళ్లంటే ఆ వీధిలో హడల్. అయినా మేం భయం లేకుండా వాళ్లింటికి వెళ్లి మా నాటకం గురించి చెప్పాం. ఆయన నవ్వి మాకు వందరూపాయిలిచ్చేరు.
ఇలా ముందుగానే డబ్బు కలెక్టు చేసుకున్నాం. ఇంట్లో చిన్న ఔన్సు గ్లాసులుండేవి. గాజువి. మెరుస్తూ చాలా ముద్దుగా వుండేవి. పార్సీ షాపుకెళ్లి కూల్‌డ్రింక్స్ తెచ్చి వాటిల్లో అందరికీ సర్వ్ చేయడానికి నిర్ణయించుకున్నాం.
ఇంట్లో చీరలు తీసి కర్టెన్సు చేసేం.
కాస్ట్యూమ్స్ తయారు చేసుకున్నాం
నాటకం మొదలైంది.
చుట్టాలు, చుట్టుపక్కలవాళ్లూ వచ్చి ఆసక్తిగా కూర్చున్నారు.
నాటకం మొదలెట్టేం.
మొదట సౌదా(రాజకుమార్తె) ఏడుస్తూ రంగప్రవేశం చేస్తుంది. నేను విలన్‌ని. దాన్ని ఏడిపిస్తుంటాను.
అది పొడవు. నేను పొట్టి.
నేను స్టూలెక్కి డైలాగులు చెబుతున్నాను.
రాను రాను మేం నాటకం వదిలేసి పక్కదారి పట్టాం.
చుట్టాలు ఇళ్లలో చేరి సొమ్మంతా ఎలా తినేస్తారో.. పిల్లల్ని ఎలా ఏడిపిస్తారోలో పడిపోయేం.
అందరికీ ఆ నాటకం ఎవర్ని ఉద్దేశించి వేస్తున్నారో అర్ధమయిపోయింది. వాళ్ల మొహాలు మాడిపోయేయి.
నేను అత్యుత్సాహంతో డైరక్టుగానే తిట్టేస్తున్నాను.
మా అత్త ఇదంతా చూసి “నాటకం ఆపుతారా.. మీ మావయ్యని పిలవనా” అని బెదిరించింది.
అంతే!!!!
ఎక్కడి మేకప్పులు అక్కడే పీకేసుకుని చంకలో పెట్టుకుని దొడ్లోకి పరుగు తీసేం.
నాటకం రసాభాసయ్యింది.
కాకపోటే.. ఆ చుట్టాలు ఎలా పీక్కుతింటున్నారో అందరికీ తెలిసిపోయింది.
రెండు రోజుల్లో వాళ్లు మూటాముల్లె సర్దుకున్నారు. ఇష్టం లేదంటే చెప్పాలిగాని, ఇలా నాటకాలు వేసి పరువు తీస్తారా?” అని ఆవిడ మా అత్త దగ్గర, అమ్మ దగ్గర చెప్పి ఏడ్చిందంట.
“పిల్లలెంత అసాధ్యులయిపోయారు. ఈ నాటకం మీ శారదే రాసిందంట. దాన్ని కాస్త అదుపులో పెట్టు” అని చెప్పి మరీ వెళ్లిపోయిందట ఆవిడ.
దాంతో మా మావయ్య నాకోసం రెండ్రోజులు గాలించేడు. ఆ వీధంతా మా వాళ్ల యిళ్లే కాబట్టి ఆయనకి దొరక్కుండా దాకున్నాను. నా బదులు మిగతావాళ్లంతా తిట్లు తిన్నారు.
అలా నా మొదటి రచన మంత్రి చేసిన ద్రోహం అయ్యింది.
ఇదంతా తెలిసి మా పెదనాన్న, దొడ్డమ్మ నర్సీపట్నం నుండి తిరిగొచ్చేరు.
పెదనాన్న అంతగా పట్టించుకోలేదు.
పిల్లల్ని అంత డబ్బిస్తే హీనంగా చూశారని దొడ్డమ్మకి కూడా కోపం వచ్చింది.
ఇంతలో క్రిష్ణక్క పెళ్లి పనులు వచ్చిపడ్డాయి.
ఎంత చిన్నతనమైనా ఆ పెళ్లి ఎంత ఆర్భాటంగా చేసేరో నాకిప్పటికీ గుర్తుంది.
ఎక్కడెక్కడి బంధువులు వచ్చారు.
వెనుక ముందు చాలా పెద్ద స్థలముండేది. అంతా పచ్చని తాటాకు పందిర్లు వేసారు. లైట్లతో, బొమ్మలతో కొబ్బరాకులతో, అరటిచెట్లతో అందంగా తయారు చేసేరు.
ఆ పెళ్లికి నాకు లంగా కుట్టించమని అడిగేను.
మా అమ్మదంతా వెస్టరన్ స్టయిలు.
లంగా ఏంటి చిన్నపిల్లవని ఒక అరడజను మంచి ఫ్రాకులు కుట్టించింది. నేను ఏడ్చేను. హేమక్కకి, సౌదాకి పట్టులంగాలు కుట్టించేరు. వాళ్లకి మరదలి కట్నం గురించి పెద్ద సూర్రత్నం పెద్దమ్మ పాట కూడా నేర్పించింది. తగరంతో వెండిసామానులా తయారు చేసి ఇచ్చేరు బావగారి చెల్లెలికి ఇవ్వడానికి.
నేను చాలా ఏడ్చేను.
అప్పుడు మా క్రిష్ణక్క పిలిచి నాకో చిన్న సలహా యిచ్చింది.
“అమ్మో” అన్నాను.
“అలా చెయ్యకపోతే నీ గతి అంతే!” అంది.
భయం వేస్తున్నా నాకు మహా కక్షగా వుంది.
నన్నెందుకిలా చిన్నచూపు చూడటం.
అందుకే కష్టపడి ఒక రాయి సంపాదించేను.
కాకినాడలో రాళ్లు ఒక పట్టాన దొరకవు.
నా గౌన్లన్నీ రహస్యంగా తీసుకెళ్లి అందులో రాయి పెట్టి గట్టిగా తాడుపెట్టి కట్టేను.
ఎవరూ లేకుండా చూసి మెల్లిగా బావిలో వేసేసేను. అవి తేలకుండా అడుక్కి వెళ్లిపోయేయి.
“హమ్మయ్యా” అనుకుని పిల్లిలా పారిపోయాను.
లోపల భయంగానే వుంది.
పెళ్లిరోజు దగ్గర పడుతోంది.
అమ్మ మా బట్టలు తీసి చూస్తూ “ఏవే నీ గౌన్లు” అంది. “ఎవడికి తెలుసు! అయినా నేను వాటిని వేసుకోను. పెళ్లికి రాను” అన్నాను మొండిగా.
“మరెక్కడికి తగలడతావు?” అంది అమ్మ.
చిరిగిపోయిన గౌనేసుకుని తిరుగుతాను. పనిపిల్లని చెప్పు” అన్నాను.
మా అమ్మ వాటి గురించి విసిగి విసిగి వేసారి చివరికి అర్జెంటుగా షాపుకి పరుగెత్తి పట్టులంగా తెచ్చింది.
నా సంతోషానికి అలవి కాదు.
పట్టులంగా కట్టుకుని పందిరంతా కలయ తిరిగేను.
పెళ్లి తెల్లవారుఝామున మూడుగంటలకి.
అంతసేపూ సందడిగా, సరదాగా తిరిగిన నేను తీరా ముహూర్తం టైముకి నిద్రపోయాను.
ఎవరో తట్టి లేపితే “పెళ్లి! పెళ్లి!” అంటూ హడావుడిగా నిద్ర లేచేను.
“నీ మొహం పెళ్లయిపోయింది. క్రిష్ణక్కని అత్తగారూ వాళ్లూ తీసుకెళ్లిపోయారు” అన్నారెవరో.
అంతే చెప్పలేని ఏడుపొచ్చింది.
వీధిలో పందిరి రాట పట్టుకుని తెగ ఏడ్చేను.
పెళ్లి చూడనందుకు కాదు.
క్రిష్ణక్కని వాళు తీసుకెళ్లిపోయినందుకు.
ఇప్పటికీ ఏ పెళ్లికెళ్లినా అప్పగింతలప్పుడు నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

ఇంకా వుంది..

4 thoughts on “చిగురాకు రెపరెపలు – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *