May 2, 2024

శోధన – 6

రచన: మాలతి దేచిరాజు

అర్థరాత్రి రెండు దాటింది… స్కూటీని వేగంగా డ్రైవ్ చేస్తోంది శోధన. సడెన్ గా తన స్కూటీ ముందు విశ్వక్ బైక్ ఆగింది.
సడెన్ బ్రేక్ తో ఆపి కోపంగా అతని వైపు చూసింది. తను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తోంది. ఈ టైంలో ఇతను ఇలా ఎదురు రావడం చికాకుగా వుంది. ఇన్నాళ్ళ తన నిరీక్షణ ఫలించే వేళ అది.
“హలో అర్థరాత్రి ఎవరి కోసం అన్వేషణ?” నవ్వుతూ అడిగాడు బైక్ స్టాండ్ వేసి ఆమె దగ్గరికి వచ్చి.
“నీకు అసలు సీరియస్ నెస్ లేదా? ఎవరెట్లా పోతే నాకేమిటి అనుకుంటావా? నా దారికి అడ్డురాకు” కోపంలో ముక్కుపుటాలు అదిరిపడుతుండగా అంది శోధన.
“అరె! కోపంలో నువ్వు చాలా అందంగా వున్నావు. పోనీ ఓ పని చేయ్ నీకు ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతాను. నువ్వు నాకోసం పిల్లల్ని కనిపెట్టు చాలు. క్రికెట్ టీంలా అవసరం లేదు. జస్ట్ చెస్ గేమ్ లో లా ఇద్దరు చాలు.”
శోధన చుట్టూ చూసింది. ఎడమ వైపు రోడ్డుకు ఓ పక్కగా ఇనుప రాడ్ వుంది. తను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే విశ్వక్ నుంచి బయట పడాలి. ఇప్పుడు సెంటిమెంట్ ముఖ్యం కాదు. అక్కడికి వెళ్ళింది. ఆ రాడ్ ని చేతిలోకి తీసుకుంది.
“ఏయ్ ఏం చేయబోతున్నావ్”అడిగాడు కంగారుగా
కానీ అప్పటికే ఆమె చేయి ఆ రాడ్ ని చేతిలోకి తీసుకోవడం చేసింది. బలమంతా ఉపయోగించి అతని తల మీద కొట్టింది. రక్తం చిమ్మింది.
ఒక్క క్షణం బాధగా కళ్ళు మూసుకుంది. అలానే విరుచుకు పడ్డాడు విశ్వక్
ఆమె గుండె తల్లడిల్లింది, ఆమెలోని ఆడతనం చెమ్మగిల్లింది.
చటుక్కున వెళ్లి అతని తలను తన ఒడిలోకి తీసుకుంది, తన చున్నీ చింపి అతని తలకు గట్టిగా కట్టింది.
వెంటనే 108 కు ఫోన్ చేసింది.
అది వచ్చే వరకూ అక్కడే పచార్లు చేసింది. అతడి నుదురు మీద ముద్దు పెట్టుకుంది.
“నన్ను క్షమించు నాకు మరో మార్గం లేదు” మనసులో అనుకుంది.
విశ్వక్ నేల మీద పడిపోతూ “జాగ్రత్త శోధనా “అన్న మాటలు వినిపించాయి. అంత బాధలోనూ అతను తన రివాల్వర్ శోధన చేతిలో పెట్టడం మర్చిపోలేదు.
108 వెళ్ళిపోయింది. శామ్యూల్ కు ఫోన్ చేసి విశ్వక్ గురించి చెప్పింది.
తర్వాత తన ఆలోచన మార్చుకుని వైదేహి వుండే ఆశ్రమం వైపు వెళ్ళింది. అక్కడైతే తనను విశ్వక్ డిస్ట్రబ్ చేయడు అనుకుంది.
అయితే విశ్వక్ వచ్చింది తనను డిస్ట్రబ్ చేయడానికి కాదని, తనను సేవ్ చేయడానికని ఆమెకు తెలిసేసరికి ఆలస్యమైంది. ఆమెను వెంటాడుతూ బయల్దేరారు చతుర్వేది నియమించిన కిరాయి హంతకులు.
తన స్కూటీని ఆగంతకులు ఫాలో అవుతోన్న విషయం అర్థమైంది. స్పీడ్ పెంచింది సడెన్ గా స్కూటీ స్లిపయ్య్ కిందపడి చేయి గీరుకు పోయింది. అయినా అలాగే పరుగెత్తింది. ఇప్పుడు వాళ్లకు ఎదురు తిరగడం కన్నా తన లక్ష్యాన్ని చేరుకోవడం ముఖ్యం. ఆమె వగరుస్తోంది .
సడెన్ గా గుర్తొచ్చింది విశ్వక్ తన చేతిలో పెట్టిన రివాల్వర్ అందరూ తనను రౌండప్ చేసారు. మెల్లిగా హ్యాండ్ బాగ్ లో నుంచి రివాల్వర్ తీసింది.
శోధన చేతిలోని తుపాకీ ఒక్కసారిగా గర్జించింది. వరుసగా ఆరు బుల్లెట్స్ బయటకు వచ్చాయి, ఊహించని ఈ పరిణామానికి వాళ్ళు ఖంగు తిన్నారు. వాళ్ళు తెరుకునేలోపు శోధన పరుగుపెట్టింది. అయితే రివాల్వర్ పేలిన శబ్దానికి పక్కనే దగ్గరలో వున్న ఆశ్రమంలోని వారు లేచారు. ముందుగా ప్రమాదాన్ని ఊహించి రెస్పాండ్ అయ్యింది వైదేహి. అంతే కాదు అందరినీ ఎలర్ట్ చేసింది. పలుగులు,పారలు, అరుపులు…
కిరాయి హంతకుల్లో ముందు కంగారు పుట్టింది. ఎక్కడ అంతా మేలుకుంటారో అని భయం..
ఒక్కసారిగా ఆశ్రమంలో వున్న వాళ్ళంతా వచ్చేసరికి కిరాయి హంతకులకు ఏం చేయాలో తోచలేదు వెనక్కి తిరిగిపోవడం తప్ప గత్యంతరం కనిపించలేదు.
శోధనకు మెల్లి మెల్లిగా స్పృహ తప్పుతోంది.
కాసేపటి తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచింది శోధన ఎదురుగా వైదేహి.
“ఇప్పుడు ఎలా వుంది తల్లీ ” ఆప్యాయంగా అడిగింది నుదురు మీద చేయి వేసి.
ఒక్క క్షణం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అక్క శోభన గుర్తొచ్చింది.
ఒక్క ఉదుటున లేచింది. టైం చూసుకుంది శోధన ఉదయం ఏడు రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
టైమ్ లేదు ఏ క్షణమైనా తన అక్కకు ప్రమాదం ఏర్పడవచ్చు.
ఏ క్షణమైనా మన దేశ రహస్యాలు యాష్కీ ద్వారా ఉగ్రవాదులకు చేరవచ్చు.
“మేడం మీ దగ్గర ల్యాప్ టాప్ ఉందా” అని అడిగింది.
క్షణాల్లో ల్యాప్ టాప్ అక్కడికి వచ్చింది.
క్లుప్తంగా జరిగిన విషయాలు చెప్పింది.
యాష్కీ కి సంబంధించిన విషయాలు చెక్ చేసింది. యాష్కీ మరణించిన వార్త, యాక్సిడెంట్ వార్తలు అన్నీ కలెక్ట్ చేసింది.
వెంటనే ఇన్స్పెక్టర్ శామ్యూల్ కు ఫోన్ చేసింది.
యాష్కీ కి సంబంధించిన ప్రత్యేక కథనం తయారు చేసింది.
యాష్కీ కి సంబంధించిన వీడియో క్లిప్స్ అపుడు గుర్తొచ్చింది అక్క యాష్కీ కేసు గురించి చెప్పిన విషయం…అప్పుడు తను అన్న మాటలు.
“ఏయ్ శోధన నేను డీల్ చేస్తున్న ఈ కేసు ఎవరిదో తెలుసా?” “యాష్కీ అని సుపారీ తీసుకుని హత్యలు చేసేవాడిది. అతను చేయని చట్ట వ్యతిరేకమైన పనులు లేవు. రిస్క్ చేసి..వీడి లావాదేవీలు షూట్ చేశాను. వీడికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్” ఇంకా చెప్పబోతుంటే రెండు చేతులు జోడించి
“అక్కా నీకో దండం, ఈ కేసులు గొడవలూ వద్దు నా మాట విని నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసేయ్”అంది.
“తప్పు శోధన అలా అనకు శోధన అంటే అర్థం ఏమిటో తెలుసా అసలు. నిరంతరం శోధిస్తూనే వుండాలి. నువ్వు మంచి జర్నలిస్ట్ వి కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను”
“అయితే నా పేరు నువ్వు తీసుకో నీ పేరు నాకివ్వు నేను సినిమా నటి శోభనలా హీరోయిన్ ని అయిపోతా.” అంది.
“నిన్ను మార్చాలంటే నేను కనిపించకుండా పోవాలి, పోనీలే ఈ యాష్కీ డిటేల్స్ నీ మెయిల్ లో పెడుతున్నా మంచి క్రైమ్ సినిమాలా వుంటుంది” నవ్వి చెప్పింది శోధన మెయిల్ లో సేవ్ చేస్తూ.
ఒక్కసారిగా చిన్నపాటి ఉద్వేగం శోధన చేతులు వణుకుతున్నాయి.
తన మెయిల్ ఐ డి గుర్తుచేసుకుంది ఇన్నాళ్ళు ఆ అవసరమే రాలేదు. తను ఆ విషయమే మర్చిపోయింది. తను మరో మెయిల్ ను క్రియేట్ చేసుకుంది.
పాస్ వర్డ్
పాస్ వర్డ్
శోభన
ఎనిమిది అక్షరాల పాస్ వర్డ్
కళ్ళు మూసుకుంది దేముడిని ప్రార్థించింది
మెయిల్ ఓపెన్ అయింది.
ఆమె కళ్ళు యాష్కీ మేటర్ ని వీడియో క్లిప్ ను వెతుకుతున్నాయి.
గాటిట్ …. గట్టిగా అరిచింది.
వైదేహి నవ్వుతూ చూసింది. శోధన ఆనందం తెలుస్తోంది. ఆ పరిస్థితిలో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు.
“మేడం అనుకున్నది సాధించాను” సంతోషంగా చెప్పింది.
వెంటనే శామ్యూల్ కు ఫోన్ చేసింది.
అరగంటలో యాష్కీ చీకటి చరిత్ర వెలుగులోకి రావాలి.

వైదేహి వేడి వేడి ఇడ్లీ తీసుకు వచ్చి ఇచ్చింది. ఇలా తృప్తిగా తినక ఎంత కాలమైంది. ఎందుకో ఆ క్షణం ఆమెకు విశ్వక్ గుర్తొచ్చాడు,అతను ఇచ్చిన రివాల్వర్ తన ప్రాణాలు కాపాడింది. తను ఎంత నిర్దాక్షిణ్యంగా అతడిని గాయపరిచింది.
శోధన ఆలోచిస్తూ ఉండగానే శామ్యూల్ వచ్చాడు.
అతను రాగానే శోధన అడిగిన మొదటి ప్రశ్న
“విశ్వక్ ఎలా వున్నారు?”
“సారీ మేడం అతను నేను వెళ్లేసరికి వెళ్ళిపోయారు ” చెప్పాడు శామ్యూల్.
“తీవ్రమైన గాయంతోనా” తనలో తనే గొణుక్కుంది శోధన.
“ఏంటి మేడం” అడిగాడు శామ్యూల్
“ఏమీ లేదు ఈ రివల్వర్ అతనికి ఇద్దామని” అంది ఏం చెప్పాలో తోచక విశ్వక్ ఇచ్చిన రివాల్వర్ శామ్యూల్ కు చూపిస్తూ.
ఆమె మనసంతా అతనే నిండి వున్నాడు.
ఒక గొప్ప భావం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
శామ్యూల్ ఆ రివాల్వర్ చూసి “ఈ రివాల్వర్ విశ్వక్ గారిదేనా?” అడిగాడు
“అవును అతనే ఇచ్చాడు ఏం?” అడిగింది శోధన.
“అంటే విశ్వక్ గారు సి బి ఐ ఆఫీసర్ అన్న మాట” అన్నాడు కాసింత ఎక్సయిట్ అవుతూ
ఉలిక్కిపడింది శోధన “ఏమన్నారు?”
“యస్ మేడం ఈ రివాల్వర్ కేవలం సి బి ఐ మాత్రమే ఉపయోగిస్తుంది.”
చిన్నపాటి ప్రకంపనం కలిగింది ఆమెలో
తన వెంట ఒక రోమియో లా వెంట పడ్డాడు.
తను తిడితే నవ్వేసాడు తను గెటవుట్ అన్నా చిరునవ్వే
చివరికి తను తెలివి తక్కువగా చావుదెబ్బ తీసినా తనను రక్షించడానికి ఈ రివాల్వర్ ఇచ్చాడు.
కాదు తన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు తన విశ్వక్ ఆ ఆలోచనే గొప్పగా వుంది.
శోధన కిటికీలో నుంచి ప్రపంచాన్ని చూస్తుంది తను రోజూ చూస్తూనే వున్న ప్రపంచం అయినా కొత్తగా కనిపిస్తోంది ఇవ్వాళ. ఆ కొత్తదనం విశ్వక్ వల్ల వచ్చింది అన్న ఆలోచన రాగానే ఆమె మనసులో చిన్న ఉలికి పాటు, చిన్న భావోద్వేగ కెరటం సునామీలా చుట్టేసింది. శరీరం రక్తాన్ని పంప్ చేసిన ఫీలింగ్ శరీరాన్ని మనసును విశ్వాక్ చుట్టేసిన అనుభూతి. అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు శోధనకు తెలీకుండానే బుగ్గల మీదినుండి జారి పడ్డాయి.
వి…శ్వ…క్
ఆమె పెదవుల మీద ఆ పేరు హత్తుకుపోయినట్టు అనిపించింది. బయట వెన్నెల దట్టంగా కురుస్తోంది తనలో తడవమన్నట్టు. రాత్రి పదకొండు దాటింది. ఒక్కసారి అలా బయటకు వెళ్లి రావాలన్న కోరిక బలంగా ఆమెలో మొదలైంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఆమె బయటకు నడిచింది.
వెన్నెల్లో ఆమ్మాయి ఇలానే ఉంటుందా అన్నంత అందంగా నడుస్తోంది. ఆమె నడుస్తొంటే ఒయ్యారం ఈర్షగా చూస్తోంది. నిర్మానుష్యమైన రోడ్డు. దూరంగా ఐస్ క్రీం అమ్మే బండి వుంది. బట్టర్ స్కాచ్ తినాలనిపించింది. తను, శోభన ఇష్టంగా తినే ఫ్లేవర్ అది ఢిల్లీ వీధుల్లో అల్లరి చేస్తూ, గంతులు వేస్తూ తిరిగిన దృశ్యాలు కనిపించి మనసు హిమపాతాన్ని వర్షించింది.
ఆ రోజు బాగా గుర్తు తనకు…
ఢిల్లీ
రాత్రి పదకొండు దాటిన సమయం…
“ప్లీజ్ అక్కా మనం స్కూటీ మీద వెళ్దాం?” శోధన అక్కను బ్రతిమిలాడుతోంది.
“ఏయ్ నీ అల్లరి ఎక్కువవుతోంది ఈ టైం లో స్కూటీ మీద ఢిల్లీ రోడ్ల మీద అదీ చలికాలం పైగా ఐస్ క్రీం కోసం వెళ్ళాలా? అయినా చలికాలం చల్లగా ఐస్ క్రీం ఏమిటే?” ముద్దుగా కోప్పడింది శోభన.
వెంటనే అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.
రెండు నిమిషాల తర్వాత కింది నుంచి శోభన గొంతు.
“నేను బట్టర్ స్కాచ్ కోసం బయటకు స్కూటీ మీద వెళ్తున్నాను ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు” అంటోంటే వెంటనే పరుగెత్తుకు వచ్చింది శోధన. అలానే నైట్ డ్రెస్ లో వస్తూనే అక్కను గట్టిగా పట్టేసుకుంది. ఏడుపు వచ్చేసింది “సారీ ” అంది.
“ఏయ్ పిచ్చీ సారీ ఎందుకు?”
“నేను అలిగి పైకి వెళ్ళిన రెండు నిమిషాల్లో నువ్వు పడ్డ బాధకు”అంది.
“కన్నీళ్లు దాచుకో నా కోసం ఎప్పుడైనా ఏడవడానికి పనికి రావచ్చు” శోభన అంది.

ఆ జ్ఞాపకం మదిలో ఒక్క క్షణం మనసు భారంగా మారింది.
ఆ రోజు అక్క అన్న మాటలు నిజమయ్యాయి కదా అనీ
“చిన్న పిల్లలు మాత్రమే ఏడుస్తారు?” అన్న మాటలు వినిపించి పక్కకుతిరిగి చూసింది.
విశ్వక్.
“నువ్వా? మీరా?” ఆశ్చర్యంగా అంది.
“నువ్వా? మీరా? ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి” అదే నవ్వు విశ్వక్ లో.
“మీరా? అంది.
“నేనే…”నీ నేనే” అనాలని ఉన్నా అనలేకపోయాడు కానీ ఎందుకో ఆ రాత్రి అతనికి అందంగా కనిపిస్తోంది ఆనందంగా అనిపిస్తోంది.
“మీరేమిటి ఇక్కడ?” కాసింత విస్మయం.
“హాయిగా చలిలో బట్టర్ స్కాచ్ తిందామని, అదీ అందమైన నీలాంటి అమ్మాయితో అయితే ఇంకా రొమాంటిక్ గా వుంటుందని.” ఆమె వంకే చూస్తూ అన్నాడు.
“నాతోనా…నో నెవ్వర్” బెట్టుగా అంది.
“ఐస్ క్రీం ను, లవ్ ఫ్లేవర్ ను ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. ముఖ్యంగా నీలాంటి మిస్ లు అందులోనో ఓ మిస్టర్ ఇండియా లాంటి జెంటిల్ మేన్ ఆఫర్ చేస్తున్నప్పుడు” ఆమె వంకే కొంటెగా చూస్తూ అన్నాడు విశ్వక్.
“దిసీజ్ టూ మచ్ నా గురించి మీకు తెలియదు నేను”
“ఆ నువ్వు సివంగివా? ఆడపులివా? ఏం సివంగి,ఆడపులి ఐస్ క్రీం లు తినవా?” అదే నవ్వు.
కోపం కన్నా ఉక్రోషం ఎక్కువ కనిపిస్తోంది శోధనలో ఇష్టం కాసింత బెట్టుతో కలిసి.
“శోధనా వెన్నెల చూడు ఎంతందంగా వుంది అచ్చు నీలా”
ఒక్క క్షణం శోధన మొహం ఎర్రబడింది.
“చూసావా సిగ్గులో మరింత అందంగా వున్నావు అయినా హాయిగా ఈ చలిలో ఈ వెదర్ ని, నీ ప్రజెన్స్ ని బట్టర్ స్కాచ్ తో సెలబ్రేట్ చేసుకుందాం.” బ్రతిమిలాడుతూ అన్నాడు విశ్వక్.
చిత్రంగా ఆమెకు అక్క గుర్తొచ్చింది ఇలానే మాట్లాడే అక్క.
ఆ క్షణం అతడిని ఆట పట్టించాలని, అందంగా ఇబ్బంది పెట్టాలని అనిపించింది.
విశ్వక్ వైపు చూసి…”నాకు బట్టర్ స్కాచ్ తినిపించాలని ఉందా?” అడిగింది.
“ఆఫ్ కోర్స్ “అన్నాడు విశ్వక్.
“అయితే ఒక కండిషన్ డబ్బులతో కాకుండా కొట్టుకొచ్చిన బట్టర్ స్కాచ్ కావాలి,ఎందుకంటే కొట్టుకొచ్చిన కాయలు రుచిగా వుంటాయి కదా అలానే బట్టర్ స్కాచ్ కూడా అన్న మాట. మరో విషయం ఐస్ క్రీం బండి వాడికి డబ్బులు ఇవ్వకూడదు. ఏం చేస్తారో, ఎలా చేస్తారో మీ ఇష్టం” అంది క్రీగంట చూస్తూ.
“సరే అన్నాడు” విశ్వక్ ఏ మాత్రం ఆలోచించకుండానే మళ్ళీ అనుమానంగా ఆమె వంక చూస్తూ “నన్ను జనంతో కొట్టించే మాస్టర్ ప్లాన్ ఏమైనా వేశావా ఏంటీ?” శోధన వైపు చూసి నవ్వుతూ అడిగాడు.
శోధన మాట్లాడలేదు.
విశ్వక్ ఐస్ క్రీం బండి వైపు వెళ్ళాడు.
ఆ క్షణం ఒక పెద్ద ప్రమాదం ఐస్ క్రీం బండివాడి రూపంలో ఉంటుందని ఆ ఇద్దరికీ తెలియదు.
ఐస్ క్రీం బండి ముందు నిలబడి వున్న కుర్రవాడు తలవంచుకొని లోపల ఐస్ క్రీం లు సర్దుకుంటున్నట్లు నటిస్తూ మధ్య మధ్య అటు ఇటూ చూస్తున్నాడు తనని ఎవరైనా గమనిస్తున్నారా అని చూస్తూ, లోపల ఐస్ క్రీమ్స్ వున్నాయి, వాటి పక్కన రివాల్వర్ వుంది అతను విశ్వక్, శోధనల వైపే చూస్తున్నాడు.
విశ్వక్ అటూ ఇటూ చూసాడు.
ఐస్ క్రీం బండివాడి దగ్గరికి వెళ్ళి “రెండు బట్టర్ స్కాచ్” అని చెప్పాడు.
ఐస్ క్రీం బండివాడు లోపలి వంగి ఐస్ క్రీమ్స్ తీస్తున్నాడు. విశ్వక్ తన గాగుల్స్ తుడుచుకుంటూ ఆగిపోయాడు ఐస్ క్రీం తీయడానికి చిన్న డోర్ ని ఓపెన్ చేసాడు బండివాడు గాగుల్స్ జేబులో పెట్టుకోబోతున్న విశ్వక్ ఆగాడు. గాగుల్స్ నుంచి ఐస్ క్రీం తీయడానికి ఓపెన్ చేసిన డోర్ కనిపిస్తోంది. అందులో నుంచి రివాల్వర్ పొజిషన్ కనిపించింది.
క్యాజువల్ గా బట్టర్ స్కాచ్ తీసుకుంటూ అతని వైపు చూసాడు. విశ్వక్ మెమొరీ పని చేయడం ప్రారంభించింది.
అతనో ప్రొఫెషనల్ కిల్లర్.. ఆ చూపులు అతన్ని పట్టిస్తున్నాయి.
విశ్వక్ దూరంగా వున్న శోధన వైపు చూసి చేత్తో సైగ చేసాడు రమ్మన్నట్టు.
“అదేమిటి పారిపోయి ఐస్ క్రీం తెస్తాడనుకుంటే తనను రమ్మంటున్నాడు. కొంపదీసి తనను ఇరికిస్తాడా ? అనుకుంటూనే అటువైపు నడిచింది.
శోధన దగ్గరికి రాగానే బట్టర్ స్కాచ్ లు రెండు ఆమె చేతిలో పెట్టి మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేలా “నువ్వు ఈ రెండు కప్పుల్లో వున్న బట్టర్ స్కాచ్ తినుకుంటూ ఇంటికి వెళ్ళిపో. మన ఐస్ క్రీం బండి ఫ్రెండ్ కు ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చి వస్తాను ” చెప్పాడు.
ఒక్క క్షణం ఆమెకు అర్థం కాలేదు. అప్పటికే ఆ బండివాడు లోపల వున్న రివాల్వర్ బయటకు తీసాడు. క్షణంలో వెయ్యో వంతు కాలంలో విశ్వక్ శోధన వంటి మీద వున్న చున్నీ ని లాగాడు.
కోపంగా శోధన ఏదో అనబోయింది. అప్పటికే బండివాడి చేతిలోని రివాల్వర్ శోధన వైపు తిరిగింది. ట్రిగ్గర్ మీద చేతులు బిగుసుకోకముందే విశ్వక్ చేతిలోని వున్న శోధన చున్నీ అతడిని తాకింది. మొహం మీద పడ్డ చున్నీ అతని గురిని మార్చింది.
పెద్ద శబ్దంతో బులెట్ మరో వైపు దూసుకు వెళ్ళింది.
“క్విక్ నువ్వు ఇంటికి వెళ్ళిపో” అంటూ ఆమెను ముందుకు నెట్టి ఐస్ క్రీం బండివాడిని ఒడిసి పట్టుకున్నాడు. అప్పటికే మరో నలుగురు వచ్చి చేరారు.
విశ్వక్ చేతిలో రివాల్వర్ ప్రత్యక్ష్యమైంది.
క్షణాల్లో ఆ ప్రాంతం బులెట్ శబ్దాలతో దద్దరిల్లింది.
అప్పుడే ఆమె ముందు ఓ వ్యాన్ ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆమెను వ్యాన్ లోకి తోసాడు.
ఆ వ్యాన్ ఆమె ఇంటి ముందు ఆగింది. అక్కడ శోధనను వదిలి వ్యాన్ వెళ్ళిపోయింది.
అంతా ఒక కలలా అనిపించింది. తన మీద జరిగిన హత్య ప్రయత్నం జరిగింది.
కానీ విశ్వక్ వల్ల తను సేవ్ అయింది. తన చేతిలో వున్న బట్టర్ స్కాచ్ ని అపురూపంగా చూసుకుంది.
జర్దార్, యాష్కీ ఇద్దరూ పాతబస్తీలోని పాడుబడిన ఆ ఇంట్లో సమావేశం అయ్యారు.
“యాష్కీ భయ్యా చాలా జాగ్రత్త. మా పోలీస్ లను తక్కువ అంచనా వెయొద్దు. పైగా నువ్వు రికార్డ్స్ లో చచ్చిపోయావు నీ ఐడెంటిటీ బయట పడకుండా జాగ్రత్తగా వుండు. ఆ శోభన బ్రతికి ఉన్నంత ఎప్పటికైనా మనకు ప్రమాదమే పైగా మా ప్రాణానికి మరొకర్తి తయారయింది అంటూ శోధన ఫోటో బయటకు తీసాడు. “ఫికర్ మత్ కరో…దాని ఫోటో ఇవ్వు.. అరగంటలో ఖతం చేస్తాను…”అన్నాడు.
జర్దార్ శోధన ఫోటో యాష్కీకి ఇచ్చాడు.
ఆ ఫోటో చూసి కంగారుపడిపోయాడు యాష్కీ.
“ఏమైంది భయ్యా” అడిగాడు జర్దార్.
“ఈమె శోభన. నన్ను ముప్ప తిప్పలు పెట్టిన సి బి ఐ ఆఫీసర్”
“కాదు శోధన అని ఈ మధ్య మాకు న్యూసెన్స్ గా తయారైంది. మనంచేస్తున్న ప్రతీ పని విడియో తీయడం దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం చేస్తుంది. ట్యాంక్ బండ్ దగ్గర మనవాళ్ళను తెలివిగా జనం చేత మర్డర్ చేయించింది కూడా ఈమె. సి ఐ దుర్జన రావ్ ని కూడా ఘోరంగా చంపేసింది” జర్దార్ చెప్పుకు పోతున్నాడు.
యాష్కీలో ఒక చిన్న అనుమానం పెరిగి పెద్దవ్వసాగింది.
అతను వెంటనే సిబి ఐ డిప్యూటీ చీఫ్ కు ఫోన్ చేసాడు.
అప్పటికే టీవీ చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్
“యాక్సిడెంట్ లో చనిపోయిన యాష్కీ బ్రతికే ఉన్నాడా? వుంటే ఎక్కడ?” యూట్యూబ్ లో శోధన సంచలనం.
శోభన అ వార్తను చూసి చతుర్వేది వున్న గ్రీన్ హిల్స్ వైపు కదిలింది. అక్కడే అతడిని ఎదుర్కోవాలి.
శివ వచ్చాడు, శోధన కెమెరా ముందుకు వచ్చింది. వెనుక గ్రీన్ మ్యాట్
యాష్కీకి సంబంధించిన వివరాలు చెబుతోంది. వెనుక క్లిప్స్ శోభన సంపాదించిన సాక్ష్యాలు.
అరగంటలో షూటింగ్ పూర్తయింది.
“మేడం మనం అర్జెంట్ గా హోం మినిస్టర్ ని కలవాలి.” అంది.
“అలాగే వెంటనే వెళ్దాం”అంది వైదేహి.
సి బి ఐ చీఫ్ వేదాచలం సెల్ రింగ్ అవుతోంటే ఎత్తి హల్లో అనగానే అవతలి వైపు యాష్కీ.
“సార్…శోభనకు చెల్లెలు ఉందా?”
“వుంది. ఇప్పుడా వంశ చరిత్ర పక్కకు పెట్టు శోభన, శోధన కవలలు. ఇద్దరూ చూడ్డానికి ఒకేలా వుంటారు. మన మనుష్యులను పోలీస్ డ్రెస్ లో సిటీ మొత్తం నింపు. శోభన అనుకునే శోధనను కాల్చినట్టు వుండాలి. మొత్తానికి ఇద్దరూ ఫినిష్ అవ్వాలి, నా దగ్గర వున్న మిలిటరీ రహస్య స్థావరాల వివరాలు వున్న పేపర్స్ నీకు అందిస్తాను. ఈ లోగా ఇక్కడ హోం మినిస్టర్ తో మాట్లాడి శోభన డెడ్ బాడీ ని ఢిల్లీ తరలిస్తాను” అని చెప్పేసి సెల్ ఆఫ్ చేసాడు.
అదే సమయంలో శోభన ఆ పరిసరాల్లోకి వచ్చింది.
హోం మినిస్టర్ రెసిడెన్సీ.
వైదేహికి ఎదురెళ్ళి ఆహ్వానం పలికాడు హోం మినిస్టర్
ఒక క్షణం అక్కడ నిశ్శబ్దం…శోధన చెప్పింది అంతా విన్నాడు.
ఒక్కో విషయం వింటున్న కొద్దీ అతను తీవ్ర ఉద్రేకానికి లోనయ్యాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా వుంది. ఒక క్రైమ్ సినిమా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు వుంది.
అతనికి శోధన అంటే గౌరవం ఆ రోజు అతను మర్చిపోలేదు.
“ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నిజానికి శోభన మీ అక్కయ్య అని, తను నిర్దోషి అని తెలియదు మీ అక్కయ్య మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి ”
“అవును సర్ కొంత మంది పోలీస్ లు డబ్బుకు అమ్ముడుపోయారు ఈ టైం లో అక్కయ్యకు రక్షణ కావాలి ”
“కానీ సరైన ఎవిడెన్స్ లేకుండా?” హోం మినిస్టర్ సందిగ్దంలో పడ్డాడు.
“ఈ ఎవిడెన్స్ సరిపోతుందా సర్?”
ఆ మాటలు వినిపించిన వైపు తలలు తిప్పారు అంతా..
తలకు కట్టుతో విశ్వక్.
“మీరు? మీరిక్కడికి ఎలా వచ్చారు?
“సిటీ ఆఫీసర్ గా శోభనలాంటి సిన్సియర్ అధికారిని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా నియమించబడిన అధికారిని”తన ఐడెంటిటీ చూపించాడు. తన దగ్గర వున్న పేపర్స్ హోం మినిస్టర్ కు ఇచ్చాడు.
శోభన నిర్దోషి అని చెప్పడానికి సాక్ష్యాలు. మీరు వెంటనే మీ పోలీస్ లను ఆదేశించండి. అంతే కాదు పోలీస్ ల రూపంలో వున్న యాష్కీ మనుష్యులను షూట్ చేయమని చెప్పండి. ఇట్స్ మై రిక్వెస్ట్ సర్.” అన్నాడు విశ్వక్.
“థాంక్యూ విశ్వక్! మీలాంటి వారు చెప్పేది ఆర్డర్. నేను వెంటనే ఇన్ ఫామ్ చేస్తాను” అన్నాడు శామ్యూల్ ని పిలిచాడు.
శామ్యూల్ నీకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. మొదటి నుంచి ఈ కేసులో వున్నావు కాబట్టి ఏం చేయాలో అది చేయ్”చెప్పాడు.
శోధన విశ్వక్ వైపే చూస్తోంది.
తలకు తన చున్నీతో కట్టిన కట్టు తన వైపే చూస్తున్నట్టు..
వెళ్లి గట్టిగా హత్తుకోవాలని అనిపించింది. మనం అర్జెంట్ గా గ్రీన్ హిల్స్ కు వెళ్ళాలి. అక్కడ విష సర్పాలు అన్నీ వుంటాయి. అంటూనే ముందుకు నడిచాడు విశ్వాక్ .
శత్రు సంహారం మొదలైంది.
అక్కడ గ్రీన్ హిల్స్ లో పోలీస్ ల వేషంలో వున్న యాష్కీ మనుష్యులను శామ్యూల్ ఊచకోత కోస్తున్నాడు.
శోధన ప్రత్యేక కథనం యూట్యూబ్ లో మొదలైన మొదటి అరగంటలోనే పదివేల మంది చూసారు. కేంద్ర హోం శాఖ కదిలింది. మరో అరగంటలో సి బి ఐ డిప్యూటీ చీఫ్ మన్మథ రావ్ ఇంట్లో చేసిన నిర్వాకం తాలూకు వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ అయింది.
ఆ సంచలనాలు దేశాన్ని కుదిపేసింది. సిబి ఐ లోని డొల్లతనాన్ని చూపిస్తున్నాయి ఆ వీడియోలు.
యూట్యూబ్ లో ట్రాఫిక్ పెరిగింది.
సి బి ఐ లో శోభన లాంటి నిజాయితీ పరురాలైన అధికారి గురించి బిబిసి హైలైట్ చేసింది. యాష్కీ ఎక్కడ కనిపించినా షూట్ చేయడానికి ఉత్తర్వులు వచ్చాయి. దేశభద్రత కోసం శోభన చేసిన సాహసం, శోధన చేసిన పరిశోధన ఒక గొప్ప సంచలనానికి నాంది పలికింది.
గ్రీన్ హిల్స్ లో యాష్కీ, జర్దార్, చతుర్వేది, అంతా ఒకే దగ్గర దొరికారు. పోలీస్ లు ఆ బిల్డింగ్ ను చుట్టుముట్టారు. యాష్కీ పారిపోయే ప్రయత్నం చేసాడు.
శోధన అతడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. విశ్వక్ వారించాడు.
“వాడికి శిక్ష విధించాల్సింది ది గ్రేట్ సి బి ఐ ఆఫీసర్ శోభన “అన్నాడు.
విభ్రాంతిగా చూసింది శోధన, యాష్కీ గుండెలో బుల్లెట్ దిగింది.
యుగాల నిరీక్షణ కాలంతో పాటు అలిసిన అలసట.
అక్కా…
అక్కడ ఆ దృశ్యం సప్తవర్ణాల సమ్మిళితం కనిపించిన ఎనిమిదవ వర్ణం శోభన.
ఆ ఇద్దరి కలయిక లలాట లిఖితం అయితే వారిని కలిపిన విశ్వక్ ఆ బ్రహ్మ సృష్టించిన ఓ అద్భుతం.
అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన వైదేహి కళ్ళు తృప్తితో వర్షించాయి. అక్షితలను భాష్పాలుగా కురిపించాయి.
విశ్వక్ కారు పార్క్ చేసి ముందుకు నడుస్తున్నాడు. అతని తలను చిన్న రాయి వచ్చి ముద్దాడింది.
కోపంగా వెనక్కి తిరిగి చూసాడు. ఎదురుగా శోధన.
“ఏయ్ ఎవర్నువ్వు?” అడిగాడు.
“లవ్వు ”
“ఏంటీ?
“ఏం…..అంత పెద్ద రాడ్ తో తల మీద కొట్టేసరికి మైండ్ దొబ్బిందా?
“ఏయ్ ఏంటా భాష?” కంగారుగా అన్నాడు.
“పెళ్లి చేసుకుందామా.. కబడ్డీ టీం ని తయారు చేద్దాం ”
“షటప్ “అన్నాడు చిరుకోపంగా
“అంటే?” అడిగింది శోధన
“నోర్ముయ్ ”
“ఓకే”
అతడిని గట్టిగా పట్టుకుని మునివేళ్ళమీద నిలబడి అతని పెదవులను మూసేసింది.
“రాక్షసి” అన్నాడు చుట్టూ ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని.
“కాదు వాంపయిర్ ని” అంది అతడి వైపే చూస్తూ
ఆ ఇద్దరినీ చూసిన విధాత తను రాయని రాతని వారే రాసుకున్నారని మురిసిపోయాడు.

******అయిపొయింది****

1 thought on “శోధన – 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *