May 7, 2024

ముఖారి

నిలువు దోచినవాడే దేవుడు, కొలువు చూసిన రేడే మనసైన దేవర లేకపోతే పురుగు ముట్టిన మునగ చెట్టు కానవసరం లేదు వీణ. కాలం ఎరుగని కధగా అడుగంటి వర్తమానం వశమై ఆమెకు ముడతల్లో ముడత పడింది. ఇప్పుడేముంది? ఎముకుల గూడు, గాలి. జవ్వనంలో ఆమె బిగించిన వీణల్లే, జాణల్లే ఉండేది. శృతి పెట్టిన తీగల్లె బాగా పలికేది. గొప్పేముంది? మీటాలనుకున్నా పలికేది. మీటకున్నా గాలికే పలికేది. ఇప్పుడా పలుకేది? కాలిపోయిన కాళుడు కటికచేత్తో ఆ వీణను తెగేదాకా వాయించాడు. ముఖారి మ్రోయించి బికారి శాయించాడు.
దేవరకోటన్న మాటే గాని దేవరకోటలో ఎన్నడైనా ఉండేనా? కోయిలున్న చోట కొమ్మున్నట్లు మనకున్న నేత మంతనమున్నట్లు అది ఉన్న తావునే అతగాడు జతగావటం, చాతకాని సజ్జు సణిగి చావడం- గడచిపోయిన కధ- వీణ కధ కంచికి వెళ్ళిపోయింది. అలనాడు గోడు గోడున గోల చేసిన బిళ్ళ గోచి రాయుళ్ళంతా తప్పులని తలో రకంగా సన్నాయి నొక్కులు నొక్కలేదా?కిన్నెరనా? సన్నాయికి మల్లే నొక్కేది? ఆ నొక్కులకది పలికేనా? ఉలికేనా? గట్టిగా నొక్కితే తీగ తెగేను. బెడిసి కొట్టి నా వేలే చిట్లేను. అంతే అయింది. తీగ తెగిపోయింది. వేలు తెగిన వారు వేలు అయినారు. తెగిన వీణ పలుకు మాని నా తళుకు మిగిలింది. పాట ఆగిన మాట మిగిలుంది. అట్లే కొన్నాళ్ళు ఎటూ కాకుండా బతికింది. కోరినవాడికోసం కోరినట్టల్లా తనువు తల్పం చేసి, చెలువు కల్పం దూసి వచ్చినట్లే నడుచుకుంది. అతన్నే నమ్మి తన్నే అమ్మింది. అప్పటికి దేవరకు వయసులో వలరాజు పలకరించాడు. సౌందర్య దిద్రుక్ష అంతకే ఎదిగింది. రాచరిక మర్యాద రంపపు కోత కోసింది. పాతికొచ్చేదాక వలపు పాతిపెట్టమంది. మర్యాదకు వయసు లేదు, వయసు రాదు. ఆడదానితో అవసరం అంతకంటే లేదు.
సంజవేళ హంసలదీవి తిన్నెలపై కాలు సాగి నీటి గాలి కెరటాలకు సోలి, తేలి, తూలి తెరచాప సొగసు చూసి ఈవల ఒడ్డుదిగి, మెరక లంకలెక్కి పల్లపు డొంకలపడి ఒంటరితనం వెంట పడకున్న దేవర జంట కొంటె జత గాళ్ళున్నా గుండెలో ఎవరూ లేరు. ఎందుకో ఖాళీగా ఉంది అన్నమాట అనిపించిన తొలిసంజెలో పిల్లగాలి చెవుల్లోన ఈల వేయబోయింది. చలి కొంచం కవ్వించింది. మునిమాపు మాగన్నును పెట్టి కొండంతను దాచింది. జాగిలాల వగర్పులో అలసట ఏదో తోచింది. వయస్సుకు, మనస్సుకు పుల్ల విరుపు జరిగింది. తిరునాళ్ళ మాట మనస్సులో తిరిగింది. ఆ దారీ కొత్త కాదు. దారి పక్కా కొత్త కాదు. అప్పటికే మనువు కుదిరింది వీణకు. ఆ వాడంతా మారింది. మనువులే తప్ప మనుగడకు వేరే జోలీ వద్దనుకుంది. జోక్యం లేదనుకుంది. సరసులమంటూ వచ్చి చెలిమినీ, బలిమినీ, కలిమినీ కలిసి సానబట్టే సానువుల పేటయింది సానిపేట- మానవులా మీరు సానువులన్న పేరూ గడపెక్కింది.
అయినోడికే ఇచ్చి, అందలం ఎక్కించి, ఊరేగించి వూరంతా వచ్చి దీవెనలు చేసే నాడూ దగ్గరపడింది. వీణ మనసు హంసలదీవి వేణుగోపాలుడికే అంకితం చేసింది. వయసు మాత్రం వలచిన వాడెవడో ఆ చినవాడికే ముడుపు కట్టింది. దేవ దాస్యంతో లాస్యం ఒలకపోసింది. ఆ నాడు కృష్ణాష్టమి. పసితనం, ముసల్తనం పడుచుతనాన్ని పట్టుకు వేళ్ళాడుతూ ఆ తిరునాళ్ళకు వచ్చి సముద్రంలో తానాలు, సామి ముందు దణ్ణాలు చేసి సాయంకాలానికి వీణసాని విలాసం చూడాలని మంటపం చుట్టూరా విడిది చేసినాయి. అక్కడే యువరాజు వీణ విలాసం చూశాడు. పంచేంద్రియాలు పరవశించాయి, పలకరించాయి. వెనుదిరిగినా కనుదిరగలేదు.
ఆ నాటి ఆ పాటా, ఆ ఆటా అతని డెందంలో చిందుతూనే ఉన్నాయి. కట్టుబడి రాజరికానికి కానరాని పెట్టుబడి గాన అందుకే కట్టుబడి పాతికొచ్చేదాకా మనస్సును పాతిపెట్టక తప్పదనుకున్నారు. కాని మనస్సు మాట విన్నదా? వూహూ అన్నది. ససేమిరా సరసుడా అన్నది. ఆ సానిదాని సరసజేరి సరసుడవనిపించుకోరా నీ సరదాలు తీర్చుకోరా అన్నది. కోరాలి గాని కొరతేముంది రాజులకు? కోరమీసం కోమలంగా దువ్వి కొంటెరూపుతో రువ్వి జతగాణ్ణి నవ్వద్దని ముందుగా తనే నవ్వనట్లు నవ్వి…
ఆ దారిపక్క సానివాడ చేరి దాని వైనమేమో తెలిసి రమ్మన్నాడు. అప్పటికీ వల్లమాలిన వసంతాలు వల్లకాటివరకూ సాగనంపితే గాని సాగనంటున్న దాని తల్లిని కృష్ణహరిని ఈ జతకాడు చేరి అడుగంగా- రాచరికం వెంటపడ్డదని చూచాయగానే సంతోషించి ‘ అయ్యా ఆయనదేమో కోడె వయస్సు, ఆవిడదేమో వెన్న మనసు. మనువు కుదిరినా మనసు రాజునే కోరింది. ఆన మీద అట్లాగే అక్కున చేర్చుకోండి అన్నది ఆ కన్నది.
ఆనయేమి ఆ వైనమేమి అన్నాడు వీడు- మనువు మన్నంత కాలమూ ఉండేది. మనసు మనకు చెప్పకుండానే మంచుకు మల్లే మాయమవుతుంది. ఆ మనువు మాపుకున్నందుమే, ఆ మనసు మార్చుకున్నందుకు ఆ మనువుకు మల్లే ఈ ప్రభువు కటాక్షం కూడా పదికాలాలపాటు, దాని బతుకు పండి పనిలేదనే వరకూ నిలిచేనా? దొరుకుసాని అయినా దొరసాని కాలేదు కదా. మరో దిక్కు లేనందుకు పోనందుకైనా మడికట్టుకోమన్నందుకైనా ఇదుగో యావజ్జీవితం ఈ మడి కట్టుకో అనే నా మారాజు మాటాడూ అని కృష్ణ హరి అనుభవం కలదేమో అంతా అడిగింది.
రాచరికం సరేనంది. కన్నెరికం మరేనంది. పెద్ద దొరకు తెలీకుండా వద్దకు జేరాలన్నారు చిందొర. అంతా గుట్టుగాడ మడికట్ట బెట్టటం నుంచీ మడికట్టుకోడం వరకూ జరిగాయి.
వీణ పాడుతుంది. ఏదీ ఓ పాట- అదే తొలి ఆట కూడా.
‘ఏం కావాలీ?’
‘ బలేజావళీ’
‘ బలేజావళీ’- అబ్బో సరసులే దొరవారు అన్నది ఆ చిన్నది.
‘ సరసం నీలోనూ ఉందిలే జవరాలా’ అన్నాడు మళ్లీ దొర
‘ లే జవరాలా ఇందునా సరసమేనే అయినా ఇప్పుడింత లేత అంటారు. తొలివలపు తొలకరి జల్లు కురిసి వెలిసిందీ అంటే అప్పుడూ చిరాకు చిత్తగిస్తారు దొరవారూ అన్నది ఆ సరస్వతి.
చిన్నవాడు దాని మాటకు మెలుపుకు కలుక్కుమన్నాడు. ‘జాణ నేను వీణా’ అన్నాడు.
‘ అందుకేకదా మీరందుకున్నదీ అంటూ మాటలో తళుకు చూపులో విసిరింది. ఇతగాడి లోపల కామన కసిరింది.
” అందుకోసం కాదే అల్లందుకోసం’ అన్నాడు. ఆపైన ఆమె మాటలు ఆపింది.
ఆపైన ఆమె మాటలు ఆపింది. ఆపక చేసేదేముంది? చూపులతో విరితూపులు దూసింది.
మరి ఇంతకీ ఉత్త మాట కచేరీయేనా?- పాట, ఆట కలిసి కచేరీ చేసి మమ్మల్ని ఉర్రూతలూగించవా అన్నాడు.
ఆమె మాటాడనైనా లేదు.అతను చూస్తూనే ఉన్నాడు. పరివేష్టించిన వాద్య బృందం ఎప్పుడు చేరిందో తెలియదు.
ఆమె మంచిగంధపు సువాసనలు విరజిమ్మే మత్తు హత్తే ఓ దండ అతని గళసీమను వేసింది.కాంబోది రాగఛ్ఛాయా రాగంలో రాగ ప్రస్థారం చేసింది. అక్షరాలా ఇలా పాడింది.
పలుకనేరని బాలను ఏ
అలుక సైపగ జాలను
కలికి వెన్నెల చిందె
చెలికి చందురుడందె
అందని అందాలు
అందినవను మాట
పొందుగా వినువిందు గాద ||పలుకు||
దొరకే సానినైతిని- నే
దొరసానిగానైతిని
అందుకే అల్లందుకే
తొందరించి కందళించె డెందమని ||పలుకు||
ఆమె వ్యంగ్య చమత్కార భాషా వైభవానికీ, శరీర విన్యాస విశేషానికి, శారీర మహోదార మధుర ప్రస్థారానికి సై గీతం సంకేతంగా నిలిచిపోయింది యువరాజు మదిలో, ఇతగాడికి ఆమె గులాబీల పూజ చేసింది. ఇతడే ఆ మాటే, ఆమెతో అన్నాడూ ‘ వీణా- దొరకు సానినైతిని, దొరసానిగానైతిని అని నీవు విసిరిన గులాబీ పూబంతులు నాకు గుచ్చుకోలేదనుకున్నావా,పూలవంటి మాటలవెనుక ముళ్ళు మాకు సోకలేదనుకున్నావా, అని అందుకు ఆ చమత్కారి కళ్ళింతగా అలనాటి వరూధినిలా చేసి ‘అటాగా స్వామీ గులాబీలు కదా అనుకున్నాను గాని గుచ్చుకుంటాయనుకోలేదు అని- ముల్లుకొక ముద్దుగా ముచ్చట తీర్చాలి అంటూ ఆమె అందించిన ఆకు చిలకను అందుకున్నాడు. ఆమె నవ్వింది. ఆ నవ్వులో యవ్వనం పొంగింది. వయస్సు అందగించింది. భయం మందగించింది. బొండు మల్లెల వాన కురిసినట్లే అయింది. విదియ నెల కళలీనినట్లే ఉంది. కోరిక తీరినట్లూ ఉంది. ఈరికలెత్తినట్లూఉంది. ఇక్కడ ఇలాగే ఇష్టం వచ్చినట్లు తెల్లవారిపోయింది కొన్ని వసంతాలు.
ఓనాడు తెల్లవారి లేచి చూస్తే కసవు లేదు, గుమ్మానికి తలుపూ లేదు. అడగడానికీ చెప్పడానికీ తనే మిగిలింది వీణ- కృష్ణ హరి లేదు, యువరాజు దేవరకోటలో తప్ప తెలుపు తూర్పున చూడలేడు, చూడరాదు. దేవర కన్నెరికం పట్టిన పిల్ల దేవులాటకు గడప దిగుతుమా? మరునాడూ కొంప బావురుమంటూ పొద్దు కూకింది. ఆహారం లేదు, ఆహార్యమూ వేసుకోలేదు. నెలరేడు పిలిచాడు, చలిగాడు గిచ్చాడు. తన రాజు వస్తాడని ఆమె అంతో ఇంతో అందం ఉన్న అందానికి హత్తుకుంది. ఎవరూ రాలేదు. ఊసు చెప్పే వారూ లేరు.
అద్దరేయి నిద్దరోయి మేలుకుంది. ఆమె కంటికి కునుకు పిలవనూ లేదూ. రానూలేదూ. అశ్వగమనధాటి గుండె గుబి గుబితో కదం తొక్కి లోగిలి ముందు ఆగింది. నిటారైన చీకటి ఒకటి గుర్రం దిగి తలుపు దాకా వచ్చి లేని తలుపు కొట్టకుండా లోనకే వచ్చింది. మనసులో ఆశను కళ్ళు వెక్కిరిస్తున్నాయి. అనురాగాన్ని ప్రాణ భయం మోసం చేయడం లేదు. ఆమె పెరటిలో అరటి బోదెల వంక వణుకుతున్న కాళ్ళతో నడిచింది. వెన్నెలైనా అతని వన్నె చెప్పాలని- రాచరికం తోడుక్కున్న ఎవరో ముది పెద్దపులి- ఆగుమన్నది. ఆమె ఆగింది. యువరాజునే దరిచేర్చి రాచమర్యాదను నేలరాచి కులికినందుకు శిక్ష అనుభవించు అన్నాడు. కాని ఆ వీణను కటిక కసాయిగా తెగేదాకా పలికించుకున్నాడు. ‘నీ జాతి నీ నీతి ఇంతే’- నీ కధా ఇంతే నన్నాడు. కెవ్వుమన్న తన కేక తనకే వినిపించింది. తరువాత తొలి మనువు కుదిరి తాళి కడదామనుకున్నవాడే తనను రాజు పక్కగా చేరి ఎగతాళి చేసినందుకు కక్ష కట్టాడు. అప్పటికే కృష్ణ హరి కృష్ణ లో కలిసిందని తెలిసింది. అనుభవించు అంటూ అనుభవించి పోయాడు.
కసి పట్టిన వాళ్ళంతా అనుభవించు అంటూ అనుభవించి వెళ్ళిపోయారు.
వసంతాలు వచ్చినా, చచ్చినా వీణ తీగెలు తెగి మూగపోయింది.
మనువు కుదిరినా మనసు దానమడిగితే దేవరు మాట దేవుడి మాటనుకుని యిచ్చినందుకా? నమ్మి చెడిపోయింది. పగిలిపోయింది వీణ.
సానివాడంతా చేరి ఈ చచ్చిందానిమల్లే ఈ వాడకంతా పరువు కరువై మొహం బరువైపోయిందని ఆడిపోసుకుంది. చిందొరకిదే మందు పెట్టిందని మతి విరిచిందని పాలు పోసినవారిని పామై కరిచిందని నోరాడిందల్లా నోరాడి జాలీ నీ దాని జోలినీ కూడా పోనాడి మరీ మాటాడింది బరి తెగించిన సానివాడ. రాజుకు లోకువై నమ్మి రాలుగాయిలకంతా లోకువైంది. సానివాడ వీణను తరిమివేసే నాటికి ఆమెకు ఈ అనుమానాలతో, అభిమానాలతో పనేలేదు. ఆమె పిచ్చి ఆమెకు ఆనందమైంది.
అటుపైన యువరాజును కట్టడి చేసి ఈమె పైన తొలి పగ తీర్చుకున్న కార్చిచ్చు అలనాడు యువరాజు కోసమే బేరమాడి కృష్ణహరితో మాట కుదుర్చుకున్నవాడేనని తన ముందే చెప్పుకున్నా వీణకు తెలియకుండా పోయింది.
ఆ కట్ట బెట్టిన మడి వాడి వరమే అయింది. వాడు ఇటు యువరాజుకు నమ్మకస్థుడూ, అటు పెదరాజుకూ నమ్మిన బంటు. చిందొర మీది విశ్వాసంతో మాట కలిపాడు. పెద్దొరకు విశ్వాసపాత్రుడు కనక మంట కలిపాడు. కొందర్ని తప్పు పట్టుకోవడం లోకం చాతకాదు. వాళ్ళు ఎప్పుడూ పెద్ద మనుషులే.
కృష్ణ ఒడ్డున హంసల దీవి తిరునాళ్ళకు పోతూ వస్తూ ఎందరో భారీ వాహ సార్ధ వాహులు ఆబాల గోపాలం తరిగొప్పుల హోరుగాలికి మల్లే గాలి గోపురం పడిపోతున్నట్లు పిచ్చిగా పరుగెత్తే అరువదేండ్ల అస్థిపంజరాన్ని చూసి కన్నీటి చుక్కలు రాల్చడం కద్దు.
అదీ వద్దు అన్నట్లు ఒక సంధ్యా సమయంలో హోరు గాలికి గత ప్రాణమైన వీణ ఆ కృష్ణలో ఒరిగి పోయింది.
సాగర సంగమం వద్ద అందుకే ఇప్పటికీ కృష్ణమ్మ వీణగా పలుకుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *