May 2, 2024

మన వాగ్గేయకారులు – (భాగము – 3)

రచన: సిరి వడ్డే

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు :

సంగీతం ఓ గలగలపారే ప్రవాహం. ఈ సంగీత సాగర ప్రవాహంలో, ఎందరో మహానుభావులు తమదైన ముద్రను వేశారు. వారు దివంగత లోకాలకు వెళ్లిపోయినా వారందించిన సంగీత స్వరాలు కొన్ని వందల సంవత్సరాలవరకు జనం నోళ్లల్లో నానుతూ చిరంజీవులవుతున్నారు. వారి ఖ్యాతి ఆచంద్ర తారార్కం వెలుగొందుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన త్రిమూర్తులుగా చెప్పబడే శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్ర్తిలలో రెండవవారైన ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీతంలోని “హంసధ్వని” రాగానికి ఆయువుపట్టుగా మారి తన గాత్ర సంగీతానికి ఊపిరిలూదారు. ‘వాతాపి గణపతిం భజే’ అనే కీర్తన నేటికీ ప్రతి ఇంటా మార్మోగిపోతూనే ఉంటుంది. ఆ కీర్తన రూపకల్పన చేసింది ముత్తుస్వామి దీక్షితులవారే. ఆ మహానుభావుని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం…
శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ “కర్ణాటక సంగీతత్రయం”లో ఒకరైన వాగ్గేయకారుడు. “వాతాపి గణపతిం భజే” అన్న కీర్తన విననివారుండరంటే అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. శ్రీ రామస్వామి దీక్షితర్, శ్రీమతి సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా 1735లో జన్మించారు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను బాల్యంలోనే వీరు ప్రదర్శించారు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించారు. సంగీతంపై వెలువడిన “వెంకటాముఖి” సుప్రసిద్ధ గ్రంధం “చతుర్‌దండి ప్రకాశికై”ను అధ్యయనం చేశారు. కావలసినమేరకు మన ధర్మగ్రంధాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగారు. ఈ భక్త శిరోమణి కాశ్యప సగోత్రీకుడు. చిదంబరనాధ యోగి ఒకరు ముత్తుస్వామి దీక్షితర్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ఈయనను ఉపాసనామార్గంలో అయన ప్రవేశపెట్టారు. వారణాసిలో ఉన్నప్పుడు శ్రీ ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నారు. “శ్రీనాధాధి గరుగుహోజయతి” అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను రచించి, రాగం కూర్చారు. తిరుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను రచించారు. ఆధ్యాత్మిక వెలుగులోనే ఈయన సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. శ్రీ ముత్తుస్వామి వారు తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుని వారికి తన కృతులను ఆలపించడం ఎలానో బోధించేవారు.
తన తమ్ముడు చిన్నస్వామివారు చనిపోయినప్పుడు ఆ దుఖంలో ఉన్నప్పుడు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించారు. అక్కడే “మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి” అన్న కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు. ధ్యానయోగం, జ్యోతిష శాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలైనవి దీక్షితర్ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్‌పై ఆయన వ్రాసిన, “నవవర్ణ కీర్తనలు”, నవ గ్రహాలపైన వ్రాసిన “నవగ్రహ కీర్తనలు” ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ఎన్నో కీర్తనలను రచించారు.
అటువంటి అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలో త్యాగరాజు గారి తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. వీరి తండ్రిగారైన శ్రీ రామస్వామి దీక్షితులు, సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. “గురుగుహ” ముద్రతో ఉన్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే ఉన్నవి. హిందూస్థానీ సంగీతం నుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి తెచ్చిన రాగాలు “సారంగ”, “ద్విజావంతి” మొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో ఉన్న దేవస్థానములను సందర్శించి ఆయా దేవతలపై కృతులు ఎన్నో వ్రాసారు. ఆయన రచించిన కృతులలో “కమలాంబా నవవర్ణ కృతులు”, “నవగ్రహ కీర్తనలు” ప్రత్యేక స్థానాన్ని కలిగివున్నాయి.

వీరి ఇతర ప్రముఖ రచనలు:
వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.
శ్రీ ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలో ఆరితేరినవారు. వారి తండ్రిగారు శ్రీ రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. ఆయన “హంసధ్వని” రాగమును కనుగొన్నారు. ముత్తుస్వామి దీక్షితులవారి గాత్ర సంగీతమును మాత్రమేగాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడేటప్పుడు వీణను కూడ వాయించేవారు. వీణతో కలిపిపాడటంచేత వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో ఉపయోగించేవారు. చివర…మధ్యమ కాలాలు సామాన్యముగా ఆయన కీర్తనలలో కనబడటం విశేషం. ముత్తుస్వామి వారు దాదాపు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపారు. అందుకని ఆయనకు హిందూస్తానీ సంగీతంతో బాగా పరిచయం ఉండేది.
హిందూస్తానీ రాగాలను తనకీర్తనలలో ఎక్కువగా వాడేవారు.(జంఝూటి, జయజయవంతి, యమన్‌, సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు) ముత్తుస్వామి వారు తన తండ్రిగారితో నాటి మదరాసు సమీపమున ఉన్న “మణలి”లో కొన్ని సంవత్సరములపాటు ఉన్నారు. మణలికి నాయకుడు శ్రీ వేంకటకృష్ణ ముదలియార్‌. ఆయన దుబాసి, సెయింట్‌ జార్జ్‌ కోటలో పని చేసేవారు. కాగా అప్పుడప్పుడు ముత్తుస్వామివారిని, ఆయన తమ్ముడైన బాలాస్వామివారిని, కోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్‌ మేళాన్ని వినేవారు. సి మేజర్కు సరిపోయే శంకరాభరణములో నోటు(ట్టు) స్వరములను వ్రాసినారు. సుమారు నలభైకు పైన సంస్కృతములో వ్రాసినారు. నేడు కూడ ఇట్టి నోటుస్వరాలు కచేరీల చివరలో తుకడలుగా పాడుతారు. ఇంగ్లాండ్ రాష్ట్రగీతమైన “గాడ్ సేవ్ ది కింగ్ మెట్టులో”, సంస్కృతములో వ్రాసినారు! వీరి తమ్ముడు బాలాస్వామి ఒక ఆంగ్లేయునిచేత ఫిడేల్ నేర్చుకొన్నారు. వారి తండ్రిగారి సలహా ననుసరించి ముత్తుస్వామివారి కచేరీలలో వయలిన్ వాయించేవారు. ఇదే కర్ణాటక సంగీతములో మొట్టమొదట వయలిన్‌ను పక్కవాద్యముగా ఉపయోగించుట. అంతకు ముందు వీణను ఉపయోగించేవారు.

ప: కమలాంబికే ఆశ్రిత కల్ప లతికే చణ్డికే
కమనీయారుణాంశుకే కర విధృత శుకే మామవ
అ.ప: కమలాసనాది పూజిత కమల పదే బహు వరదే
కమలాలయ తీర్థ వైభవే శివే కరుణార్ణవే
౧. సకల లోక నాయికే సంగీత రసికే
సుకవిత్వ ప్రదాయికే సుందరి గత మాయికే
వికళేబర ముక్తి దాన నిపుణే అఘ హరణే
వియదాది భూత కిరణే వినోద చరణే అరుణే
మధ్యమ కాల సాహిత్యం
సకళే గురు గుహ చరణే సదాశివాంత:హ్ కరణే
అకచట తపాది వరణే అఖండైక రస పూర్ణే!!
దీక్షితులవారు శ్రీ చక్రములోని తొమ్మిది ఆవరణలను గురించి, తొమ్మిది కీర్తనలు వ్రాసినారు. వాటికి, “శ్రీపుర కమలాంబికా నవావరణ కీర్తన”లని ప్రసిద్ధి. శ్రీపురమంటే శ్రీచక్రమే. అదీకాక – ముత్తుస్వామి దీక్షితుల జన్మ స్థలము తిరువారూరు. దానిని సంస్కృతీకరిస్తే ‘శ్రీపురము’ అవుతుంది. ఆ గ్రామమున వేంచేసియున్న అమ్మవారు కమలాంబిక. ఆమెయే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ కమలాంబికను గురించి దీక్షితుల వారు వ్రాసిన “నవావరణ కీర్తనలు” సంగీత ప్రపంచమున జగత్ప్రసిద్ధములు. ఆ కీర్తనలలో శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ప్రతిభ పతాకస్థాయినందు కొన్నది. ఆ కీర్తనలలో శ్రీచక్ర స్వరూప వర్ణనమే కాక, యంత్ర-మంత్రం-తంత్ర భావములు కూర్చబడినవి. ఆ కీర్తనలు మొత్తం పదకొండు.
అందులో మొదటిది – “కమలాంబికే ఆశ్రిత కల్పలతికే చండికే” అన్న ధ్యాన కీర్తన. తోడి రాగము – రూపక తాళములో నున్నది.
శ్రీ కమలాంబికా! ఆశ్రిత భక్తులకు కల్పవృక్షమా! చండికా! కమనీయ అరుణాంశుకధారిణీ! లీలాశుకహస్తా! బ్రహ్మాది పూజిత పాదపద్మా! వరదా! కమలాలయ తీర్థ వైభవా! శివా! కరుణా సముద్రా! సకలలోక నాయకీ! సంగీత రసికా! సుకవిత్వప్రదాయినీ! సుందరీ! గతమాయా! ముక్తిదాన నిపుణా! పాపహారిణీ! ఆకాశాది పంచభూత రంజిత చరణా! అరుణా! గురుగుహ కరుణా! సదాశివాంతఃకరణా! మాతృకా వర్ణ రూపిణీ! అఖండైకరససంపూర్ణా! జగడంబికే! నన్ను రక్షింపుము. – అని ఈ కీర్తన అర్థం.
ఈ కీర్తనలో ముత్తుస్వామి దీక్షితులు – జగన్మాత సాకార రూపమును, ఆమె దాక్షిణ్యాది లక్షణాలను ఘనంగా ప్రస్తుతించారు. మనోహరమైన ఎర్రని అంశుకమును ధరించి, చేతిలో లీలా శుకమును ధరించి, బ్రహ్మాది దేవతలచేత కూడా పూజింపబడే పాదపద్మములు కలది ఆ జగన్మాత. ఇది ఆమె సాకార స్వరూపము. తనను ఆశ్రయించిన భక్తకోటికి కల్పవృక్షము, కరుణార్ణవత్వము, సకల లోకాధిపత్యము, సంగీత రసికత్వము, సుకవిత్వ ప్రదాయిత్వము, మాయాతీత లక్షణము, పంచాశద్వర్ణ మాతృకా స్వరూపము., సదాశివ అంతఃకరణ తత్త్వము అనేవి ఆ తల్లి కరుణా లక్షణములు! ఇందులోని విశేషణములన్నీ ప్రథమావిభక్తిలో ఉన్నాయి.
సకుంకుమ విలేపనా మళిక చుంబి కస్తూరికాం|
సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం |
అశేషజమోహినీమరుణమాల్యభూషాంబరాం |
జపాకుసుమ భాసురాం జపనిధౌ స్మరేదంబికాం ||
ఎర్రని పూలమాలలు, ఎర్రని రత్నహారములు, ఎర్రని వస్త్రములు ధరించి, జపాకుసుమ కాంతితో విరాజిల్లుతూ, అశేష జనులను మోహింపజేసే ఆ దివ్య స్వరూపిణి పూజా సమయంలో స్మరిస్తూ భజించటం సంప్రదాయం! ఈవిధంగా ఆమె సాకార స్వరూపాన్ని ప్రత్యక్షీకరింపజేసి, భక్తుల హృదయాలలో పదిలపరచటానికి మహాకవివతంసులు చేసిన ప్రయత్నాన్నే దీక్షితుల వారు కూడా తమ ధ్యానకీర్తనలో చేసినట్లు స్పష్టమవుతుంది. ఇక ఈ కీర్తనలోని మిగిలిన విశేషణములు ఆ జగన్మాత నిరాకర స్వరూప వర్ణములు. అమ్మవారి స్వరూప స్వభావాలను అభివర్ణిస్తూ చేసిన శ్రీ లలితా సహస్ర నామావళి లోని భక్తిమత్కల్పలతికా, కరుణామృత సాగరా, కావ్యకళా, కైవల్యపదదాయినీ, సర్వారుణా, మాయాతీతా, వర్ణ రూపిణీ – అన్న నామములే ఈ కీర్తనలో చక్కగా పొదగబడినాయి. కీర్తన చివర – ‘అకచటతపాదివర్గే’ అని సంబోధించారు. వర్ణమాలలో అకచటతపయశ అనునవి ఆయా వర్గముల ఆద్యక్షరములు. అందువలన పంచాశద్వర్ణములు ధ్వనితమై ‘వర్ణరూపిణీ’ అన్న నామమును సార్థకము చేస్తున్నది. ఈవిధంగా దీక్షితుల వారు ఈ ధ్యాన కీర్తనలో అమ్మవారి బహిరంతస్స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు అభివర్ణించారు.

దీక్షితార్ కృతుల విశేషాలు :
తెలుగు సాహిత్యమందు విశేష ప్రజ్ఞగల ముత్తుస్వామి దీక్షితార్ తెలుగు కావ్యశిల్పాననుసరించి కృతులను రచించినట్టుగా మనకు గోచరిస్తుంది. అనగా విభక్తిపరంగా కృతులను రచించుట. ముత్తుస్వామి దీక్షితులు శైవ, వైష్ణవ, దేవీ, సుబ్రహ్మణ్య, గణపతి ఇలా అందరి ఆలయాలను దర్శించి వారిపై కృతులను రచించారు. ఆయన కృతులలో కాశీదేవతలైన విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, గంగాది మూర్తుల ప్రస్తుతేకాక నేపాలులోని పశుపతినాధుని ప్రస్తుతి, బదరీలోని నారాయణుని ప్రస్తుతి మనకు కన్పిస్తుంది. ఆయన విష్ణ్వీశభేద మెరుగని అద్వైత, స్వార్త మతస్ధుడు. శ్రీశంకరభగవత్పాదమతావలంబి, ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలలో భక్తి, జ్ఞాన, వైరాగ్య భావముల సమ్మేళనము సుందరముగా సమ్మిళితమై ఉంది.
రామాష్టపది అనే సంగీతరూపకాన్ని రచించిన ఉపనిషద్బ్రహ్మేంద్ర సరస్వతిల వారి వద్ద వేదాంతగ్రంథ అధ్యయనము చేయటం వల్ల ముత్తుస్వామివారిపై రామభక్తి ప్రభావం ప్రస్ఫుటం. మాంజిరాగంలోని ‘రామచంద్రేన సంరక్షితోహం’ అనే కీర్తనలో ఆయన శ్రీరాముడు త్రిమూర్తుల సమిష్టిరూపమని (రమా భారతి గౌరీరమణ స్వరూపేణ రామచంద్రేణ సంరక్షితోహం) వర్ణించారు. అలాగే శ్రీరాముని పరబ్రహ్మతత్త్వాన్ని మాహురి రాగంలో ‘మామవ రఘువీరా’ అనే కృతిలో తెలిపారు. ఈ కృతిలో శ్రీరాముని పామరపండిత పావనకర నామధేయుడని, గురుగుహనుతుడని ముత్తుస్వామి స్తుతించారు.

క్షేత్రదేవతా కీర్తనలు:
ముత్తుస్వామి వారు తన జీతకాలమంతా క్షేత్రాటన చేస్తూ తత్తద్దేవతా సంకీర్తనలు చేస్తూ కాలం గడిపారు. ఆయన దర్శించిన ప్రతీ క్షేత్రానికున్న విశిష్టత ఆయన చేసిన ప్రతీ కృతీలో ఇనుమడించింది. దీక్షితారు వారు ఆయా క్షేత్ర దేవతలపై చేసిన కీర్తనలలో కొన్ని మచ్చుతునకలు. తిరుపతి వేంకటేశ్వరునిపై, వరాళి రాగంలో ‘శేషాచల నాయకం భజామి’ అనే కీర్తన, కంచి కామాక్షిపై చేసిన అనేక కీర్తనలో, కమలా మనోహరి రాగంలో ‘కంజదళాయతాక్షి’, హిందోళ రాగంలో ‘నీరజాక్షి కామాక్షి’, శుద్ధసావేరి రాగంలో ‘ఏకామ్రేశనాయకీ’ ప్రసిద్ధాలు. కాంచీపురంలోని కైలాసనాథునిపై కూడా దీక్షితార్ పెక్కు కృతులు రచించారు. వీటిలో వేగవాహిని రాగంలోని ‘కైలాసనాథం’, కాంభోజి రాగంలో ‘కైలాసనాథేన’ ప్రసిద్ధమైనవి. చిదంబర సమీపంలోని గోవిందరాస్వామిపై ఆయన చేసిన కృతులకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా “మేచబౌళి” రాగంలో రచించిన ‘గోవింద రాజేన’ అనే కృతి కర్ణాటక సంగీత సముద్రంలో ఈ రాగంలో రాసిన ఏకైక కృతని సంగీతజ్ఞలు అభిప్రాయం. అలాగే చిదంబరం సమీపంలోని వైదీశ్వరన్ దేవాలయ దేవతలపై చేసిన పెక్కు కృతులలో బాలాంబికాదేవిపై రాసిన ‘భజరేరే చిత్త బాలాంబికాం’ అనే కల్యాణరాగ కృతి, వైద్యనాథస్వామిపై కూర్చిన, అఠాణ రాగంలోని ‘శ్రీ వైథ్యనాథం’ బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి.

పంచలింగ స్థల కీర్తనలు:
ఆకాశాది పంచభూతముల ప్రత్యేకాంశలతో పంచలింగ క్షేత్రములు దక్షిణభారతంలో ప్రసిద్ధిగాంచాయి. వీటిలో శ్రీకాళహస్తిలోని లింగం స్వాయంభువు, వాయులింగము. ఇక కాంచీపురంలోని ఏకామ్రనాథుడు పృథ్వీలింగము, శ్రీరంగ సమీపంలోని జంబుకేశ్వరుడు ఆపోలింగం, తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు తేజోలింగం, చివరగా చిదంబరంలోని శివలింగం ఆకాశలింగమని ప్రసిద్ధి. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని స్తుతిస్తూ, ‘శ్రీ కాళహస్తీశ’ అని, కాంచీపురంలోని ఏకామ్రనాధుని ప్రస్తుతిస్తూ, అనేక కీర్తనలు రచించినా, భైరవి రాగంలోని ‘చింతయ మాకంద’ అనే కృతి పంచలింగకృతులలో ఒకటి. ‘అరుణాచలనాథం స్మరామ్మనిశ’, ‘జంబూపతే మాంపాహి’, ‘ఆనందనటన ప్రకాశం చిత్సభేశం’ మిగిలిన మూడు పంచలింగ కృతులు. చిదంబర నటరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కేదార రాగంలో ‘ఆనందనటన ప్రకాశం’ కృతి నటరాజు ఆనందనృత్యానికి సంబంధించినదై ఎంతో రమణీయంగా నాట్యమునకు పనికివచ్చునట్టు సొల్లుకట్లు ఈ కృతికి అనుబంధంగా ఉండటం ఈ కృతి విశిష్టత.

అభయాంబ కృతులు:
వైదీశ్వరన్ దేవాలయ అధిష్టాన దేవన అభయాంబపై రాగప్రస్తార సౌలభ్యమునందేకాక, తాంత్రిక విషయస్ఫురణమునందు కూడా గణ్యమైనవి. ‘అంబికాయాః అభయంబికాయాః’ అనే కేదార రాగ కృతియందు కుండలినీశక్తి నిగూఢమై ఉన్నది. అభయాంబపై దీక్షితార్ అన్ని విభక్తులందు కృతులు రచించారు.

1. అభయంబ జగదాంబ – కల్యాణి రాగం – ప్రథమా విభక్తి
2. ఆర్యామభయాంబాం – భైరవి రాగం – ద్వితీయా విభక్తి
3. గిరిజయా అపజయ – శంకరాభరణ రాగం – తృతీయా విభక్తి
4. అభయాంబికాయై – యదుకుల కాంభోజి రాగం – చతుర్థీ విభక్తి
5. అభయాంబికాయాః – కేదారగౌళ రాగం – పంచమీ విభక్తి
6. అంబికాయాః అభయంబికాయాః – కేదార రాగం – షష్ఠీ విభక్తి
7. అభయాంబికాయాం – శహనా రాగం – సప్తమీ విభక్తి
8. దాక్షాయణి – తోడి రాగం – సంబోధన ప్రథమా విభక్తి
ఈ కృతులకు చివరగా మంగళహారతిగా పాడే ముగింపు కృతి ‘శ్రీ అభయాంబ నిన్ను’ అనునది తెలుగు పల్లవితో శ్రీరాగంలో రచించారు. అయితే తర్వాత కాలంలో సంస్కృత, తమిళ భాషలలో ఈ మంగళహారతి ప్రాముఖ్యం పొందింది. ఈ కృతి ముత్తుస్వామివారు రచించిన “మణిప్రవాళ శైలిలో” రచించిన అనేకానేక కృతులలో ఒకటి. మణిప్రవాళ శైలి కృతులలో బహుళప్రాచుర్యం పొందిన కృతి కాఫీరాగంలోని ‘శ్రీ వేంకటాచలపతే నిన్ను నమ్మితి’. ఈ మణిప్రవాళి శైలి కృతులలో ఆంధ్ర, తమిళ, సంస్కృత భాషలను ముత్తుస్వామి దీక్షితార్ వారు విశిష్టంగా వినియోగించినప్పటికీ, పల్లవికి మాత్రం తెలుగు భాషనే ఉపయోగించటం విశేషం. రాగప్రస్తారమునకు, పల్లవికున్న ప్రాముఖ్యాన్ని బట్టి సహజ సంగీత మాధుర్యయుక్త ప్రవాహమునకు తెలుగుభాషే అధికయోగ్యత కలదని పండితులు స్పష్టీకరించారు. మూడు సంగీత సంప్రదాయాలను అవగాహన చేసికొని అందులో ఘనతను సాధించారు దీక్షితులవారు. వీరి సంస్కృత కృతులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, యతి, గోపుచ్ఛయతి, బీజాక్షరములు, ముద్రాలంకరము (రాగము పేరు పాటలో వచ్చుట), ఇత్యాదులు ఎక్కువ. వీరికి భక్తి మాత్రమే కాదు, విభక్తి అంటే కూడ ఇష్టమే. వీరి విభక్తి పాటలు ఒక ప్రత్యేకత. ఒక్కొక్క పాటను ఒక విభక్తిలో వ్రాయుట ఇందులోని విశేషము. ఎనిమిది విభక్తులలో వీరు ఎన్నియో పాటలను వ్రాసియున్నారు. పాటలలో ఉదాహరణ లనవచ్చును వీటిని. మాత్రుష్కా బొమ్మలాగు పదములలో పదములుంచి వ్రాయుట వీరి కృతులలోని మరొక విశేషము. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, వసుప్రదే, శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే పదే, ఇత్యాదులు. దీనికి గోపుచ్ఛయతి అని పేరు.

నవావరణ కీర్తనలు అంటే ఏమిటి?
ఇవి శ్రీముత్తుస్వామి దీక్షితులు గారు రచించినవి. దీక్షితార్ లేక ముత్తుస్వామి దీక్షితులు దేవిభక్తుడు. శ్రీ విద్యను అర్చించినవారు. శ్రీ చక్రము (యంత్రము) నకు తొమ్మిది ఆవరణలు ఉంటాయి. ఈ తొమ్మిది (నవ) ఆవరణలు వర్ణించిన దేవీ ఉపాసన కృతులను నవావరణ కీర్తనలు అంటారు. త్యాగరాజు “పంచరత్న కీర్తనలు” ఎటుల ప్రసిద్ధి చెందినవో అట్లే దీక్షితుల వారి “నవావరణ” కీర్తనలు ప్రసిద్ధి. దేవీ నవరాత్రులందు అనగా దసరా పదిరోజుల పండుగలలో గానం చేస్తారు. ఈ కీర్తనలన్నీ మొత్తం పదకొండు. మొదటి ధ్యాన కీర్తన చివరది మంగళహారతి కీర్తన. ఈ రెంటినీ వదిలితే మొత్తం తొమ్మిది నవావరణ కీర్తనలు తెలుస్తాయి. అన్ని కీర్తనలు “కమలాంబికే” లేదా “శ్రీ కమలాంబికే” అని ప్రారంభింపబడతాయి.
ఈ 11 కీర్తనలు “రాగదేవతలకు దేవాలయములు” అంటారు. ముత్తు స్వామి దీక్షితుల వారి ప్రతిభ పతాకస్థాయి వీనివలన చేరినది. వీనిలో “శ్రీ చక్ర తంత్ర, మంత్ర, పూజా సాంకేతిక వైభవములు” ఉన్నవి. ఈ కీర్తనలు వరుసగా సంస్కృత వ్యాకరణమందలి విభక్తి ప్రత్యయము కల్గి ఉండుట వలన కర్ణాటక సంగీత లోకమున అత్యంత ప్రసిద్ధి కలిగి “ఓజస్సు” కల్గిన రచనలని ఉగ్గడింపబడినవి. త్యాగయ్య, శ్యామ శాస్త్రి, దీక్షితర్ ముగ్గురూ ఒకే గ్రామము “తిరువారూర్” లో ప్రభవించిన మహాభక్తులు. సమకాలీనులు. వాగ్గేయకారులు. ఇది ప్రపంచమునందెచటను కానరాని ఒక మహత్తర విశేషము. త్యాగయ్య తమ శిష్యులతోడి ప్రతివారము పంచరత్నకీర్తనలు గానంచేస్తూ వీధులవెంట సంకీర్తనము చేసి ప్రజలిచ్చిన సంబారములతో తాను జీవించి, శిష్యులను రూపొందించినాడు. శరభోజి మహారాజు ఇచ్చిన సువర్ణాభరణములను కూడా నిరాకరించిన మహా రామభక్తుడు. శ్యామ శాస్త్రి కామాక్షి దేవాలయ అర్చకునిగా సామాన్య జీవితము గడిపినాడు.
కాని, పాపము, ఈ ముగ్గురిలో దీక్షితర్ జీవితము ఆర్ధికముగ ఎంతో దుర్భరముగ ఉండెడిదట. ఏ దినమున కా దినము గడచుట కష్టదాయకముగ ఉండెడిదట. అట్టి దారిద్ర్యముననుభవించుచూ, ఇంతటి మేటి రచనలైన నవగ్రహ కీర్తనలు, నవావరణ కీర్తనలు మొ!! నవి రచించుట ఈ ఉత్తముని ఘనతకు తార్కాణము. వారి రచనా శిల్పము మేటి శ్రేణికి చెందినది.
౧. కమాలంబికే ………………………………………………… తోడి ( ధ్యాన కృతి. నవావరణములోనికి రాదు)
౨. కమలాంబా సంరక్షతు ……………………………….. ఆనందభైరవి ప్రధమా విభక్తి
౩. కమలాంబాం భజరే ………………………………… కల్యాణి ద్వితీయా విభక్తి
౪. శ్రీ కమలాంబికాయా ……………………………….. శంకరాభరణం తృతీయా విభక్తి
౫. కమలాంబికాయై ……………………………………….. కాంభోజి చతుర్ధీ విభక్తి
౬. కమలాంబికాయ: పరమ్ ………………………… భైరవి పంచమీ విభక్తి
౭. కమలాంబికాయాస్తవభక్తోహం ………………. పున్నాగ వరాళి షష్టి విభక్తి
౮. శ్రీకమలాంబికాయం భక్తింకరోమి …………. శహాన సప్తమీ విభక్తి
౯. కమలాంబాజయతి ……………………………….. ఘంటా సంభోధన ప్రధమావిభక్తి
౧౦. శ్రీకమలాంబా జయతి ……………………………. ఆహిరి సార్వవిభక్తికము
౧౧. శ్రీ కమలాంబికే ………………………………………… శ్రీ ( మంగళహారతి, నవావరణములోనికి రాదు)
అన్ని కీర్తనలును రాగ స్వరూపమున పండినవి.
ఇటులనే “నీలోత్పలాంబను” గూర్చి, ఇదియే ప్రధమపదముగ గౌళవర్ణరాగ కృతులు ఎనిమిది ప్రసిద్ధములు. నారాయణ గౌళ, రీతిగౌళ, కన్నడగౌళ, కేదారగౌళ, మాయమాళవగౌళ, పూర్వగౌళ, ఛాయగౌళ రాగ కీర్తనలు. వీనియందు కూడ విభక్తి ప్రత్యయములు వరుసగనున్నవి. “శివ పాహి ఓం శివే” అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నవేళ శ్రీ దీక్షితుల వారు 1875లో తనువు చాలించారు.
తరువాత భాగంలో, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో మూడవ వారైన శ్రీ శ్యామశాస్త్రులు వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం నేస్తాలు.

(సేకరణ – కొన్ని అంతర్జాల లింకుల నుండి…వారికి హృదయపూర్వక ధన్యవాదములు)

2 thoughts on “మన వాగ్గేయకారులు – (భాగము – 3)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *