May 6, 2024

వీసా వెతలు

రచన: వసంతలక్ష్మి అయ్యగారి

ఏంటీ???వసీ..!!!నీకు…నీ..కు…..వీసా….కావాలా???

సగటు మనిషి జీవనగమనంలో” వీ సా “ప్రహసనం …చూస్తూ చూస్తూ ఒక తప్పనిసరి ప్రశ్న కింద తయారైంది. ఆడైనా…మగైనా..!!మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో!!నాకెందుకో ఉన్నచోటినుండి ఊహ తెలిసాకా స్థాన చలనం కలగలేదు..ఉద్యోగం..వివాహం…రెండూ కూడా నన్నుకదపలేకపోయాయి..పైగా అటు ఇటు చుట్టాలు…. అపుడు ఇపుడూ… ఏరకం పనైనా హైదరాబాదుకు వేంచేసే వారే అవడంతో నా గ్రహాలు నన్ను..వాటిని నేనూ అంటిపెట్టుకునే సకల కార్యాలు ఇక్కడే ఉండి లాగించేస్తున్నాం..,ఆఖరికి…మా కోడలు పుట్టింటివాళ్ళూ ఇక్కడే అవడంతో పిల్లాడి పెళ్ళికీ అడుగు జరగలేదు ఈ ఊరుదాటి.. నా పెళ్ళై మూడు దశాబ్దాలైనా…నేను పెట్టె సర్దుకున్నది. వేళ్ళమీద లెక్కించే తిరుపతి,,షిరిడీ యాత్రలే…ఎల్.టి.సి సదుపాయం వాడుకోకపోవడానికి…నా ఆరోగ్యం బహు సున్నితం అవడమే కారణం….వెరసి..వసంత గడప దాటి ఇంకొక గుమ్మం ఎక్కిన సందర్భం సున్న అంటే సున్నే…ఇంకో బుజ్జి కారణం లేకపోలేదు…ఊరి పొలిమేర దాటుతూనే మున్ముందుగా గొంతు పట్టేస్తుంది ..అనేక ఇతర సమస్యలతో పాటు, అడ్డంపడితే చూసుకునే వారు లేకపోవడం ఒక కారణమైతే….గొంతు మారితే .. నా ప్రవృత్తి సరదాకి ఎసరన్నది మరో అడ్డంకి…జలుబు సంబంధ రోగాలు..మందువేసుకుంటే వారం…వేసుకోకపోతే ఏడురోజులు…మనతోనే, మనవెంటే అన్నట్టు. నాకు కదలాలంటేనే ఠారు…
ఈ క్రమంలో వెన్నెముక సంబంధ అరగుదలలుకూడా వెక్కిరించేసరికి…ప్రయాణం..అంటేనే ..ఒక ఫోబియాగా మారింది…అందులోనూ గిడ్డీనెస్ ఉందే…అది మహా చెడ్డ జబ్బు..పైగా కనిపించదు..అనుభవించేవారికే అర్థంకాని అవస్థ…వ్యక్తిత్వం కృంగి,ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, బతుకు అతలాకుతలంగా మారుతుంది. అతిశయోక్తికాదు. మందులేదా. అంటే ….”ఏమో “!అనవలసే వస్తుంది ఇన్నాళ్ళ వైవిధ్యభరిత వైద్యవిధానాలను విడవకుండా ఆశ్రయిస్తూనే ఉన్నందుకు… దీని గురించి తలచుకున్నా పాపమే…దైనందిన జీవితమే నరకప్రాయం దీనితో..! ఎందుకంటారేమో..లిఫ్టులు,,ఎలివేటర్లు..నిత్యకృత్యాలైనపుడు…గిడ్డీ గోడు తెచ్చిపెట్టే గడ్డు సమస్య…ఇంతా అంతా కాదు. అలాంటపుడు…ఒక్కసారి…ఫ్లైట్ లో దూరప్రాంతాలు స్వదేశంలోనైనా హడలు పుట్టిస్తాయి..కదా!!మాటవరసకి ఎవరితో ఈమాటన్నా…గాడిదగుడ్డు…అనేవారే…పైగా ఉన్నరోగాలు తక్కువైనట్టు…నీదంతా సైకలాజికల్….అని పారేస్తారు…” తిరుగుడు మేనియా “గాళ్ళకి నా “త ల తి రు గు డు”సంబంధిత ఫోబియా గురించి తెలియజేయాలంటే నాకు ఇంకోజన్మ కూడా చాలదు…ఇపుడు కొంచెం తెలిసిందనుకుంట..వసంత ఊరు విడవక పోవడానికి కారణం…!!మీరే చెప్పండి. బాసుగారు ఊళ్ళుతిరగడంలో భాగంమని పది రోజులు శలవిస్తే…వచ్చి మరో పదిదినాలు పడక వేయడం తప్పుఅని తెలిసినా ….తప్పనిపరిస్థితి!! ఇలా వేగలేకే లాగిలాగి…చివరకు జాబ్ కి గుడ్బై కొట్టి నాకు నచ్చినట్టు నా ఇంటికే పరిమితమౌతూ…ఊరు విడిచి సాముకి మాత్రం ఏనాడూ ఉవ్విళ్ళూరలేదు.. కోరి తెచ్చుకోవడం ఎందుకని?
నాకున్న ఒక్కగానొక్క కొడుకుకి ఊహ తెలిసినప్పటినుండీ ..ఆకాశయానం…అమెరికా పయనం మీదే ధ్యాస..బి.టెక్ అవగానే గొణుగుడు మొదలు…ఒక ఏడాదేమో…బుద్ధిగా నామాటవిని ఇక్కడే ఉద్యోగం చేశాడు..అంతలోనే కోరికలు తిరగబెట్టాయి..తండ్రిగారికీ పరోక్షంగా విదేశాలలో చదివించాలన్నవాంఛ ప్రగాఢంగా ఉండడంతో…వాడిని నేను ఆపలేక పోయాను..౨౦౧౨లో చక్కాపోయాడు…చదువు..పెళ్ళి ఒకదానివెనుక ఒకటి౨౦౧౪ లో జరిగాయి. సంతోషం.. ఎప్పటికైనా నాకూ తప్పదు ఈ వాయుయానం అని అంతరాంతరాలలో అర్థమవసాగింది…అందులోనూ కోడలుపిల్ల నాలాగే కలుపుగోలు అవడంతో ఈ ఊహ నానాటికీ బలపడింది..ఎపుడు ప్రయాణం మాటొచ్చినా “” ఆఁఆ వీ సా ఒకటేడిసిందిగా.. వచ్చినపుడు మాటలే..”అని నేననడం…”ఆహా…ఎవడికోసం రాదు” ఆని పిల్లలనడంతో సరిపోయేది.. పిల్లలిద్దరూ వారికి నచ్చినుద్యోగాల్లో మొత్తానికి స్థిరపడి రెండు నెలలైందో లేదో..అజెండా ప్రకారం..పేరెంట్స్ కి విజిట్వీసా కాగితాల కట్టలు పంపేశారు.
*****
నిజంగానే విసా ఆల్ దట్!! ఏం చూశామన్నదే నేను మీ ముందుంచుతున్న ముచ్చట్లు,. అన్నట్టు వీసా కి ముందుమెట్టు పాస్పోర్టు మాట చెప్పొద్దూ.. తొంభైలనాటికే మన జనాభా వీరలెవెల్లో అమెరికాకి ఎక్కువగా చెక్కెయ్యడం మొదలై రాను రాను ఊపందుకుంటూనే ఉంది. ఇంటికి ఒకడు ఎగిరివెళ్ళే రోజులు పోయి.. ఇప్పుడు ఇంటికి ఒకరు బిక్బిక్మంటూ ఇక్కడ ఆస్తుల పరిరక్షణకి, కాపలాకి అన్నట్టు..అటో కాలు…ఇటోవేలు గా కూడా ఉంటున్నకాలం వచ్చింది. అప్పట్లోనూ పాసుపోర్టు వరకు పనులు ఇక్కడ హైదరాబాదులోనే జరిగి పోయేవి..మావారు తరచూ ఆఫీసుపనులమీద ఇండియా అంతా తిరిగి..రెండువేల సం..లో లండన్ వెళ్ళినపుడు పాసుపోర్టు పని చేయించుకుంటూ.. ఎందుకనో నాకూ చేయించారు..
నాది మటుకు పదిలంగా బీరువాకే పరిమితమై కాలదోషం పట్టి రెండేళ్ళక్రితం రిన్యువల్కి నోచుకుంది…ఏదో ఎప్పటికైనాతప్పదని తెలిసిచేసిన పని.. అదైనా పనిలోపనిగానే సుమండీ..ఇక వీసా మాట..మా బాబు పెళ్ళయ్యాక ఈ సబ్జెక్టుకి ప్రాధాన్యంపెరిగిన మాట నిజం. అయినా దాటవేత ధోరణినే అవలంబించాను.. రిటైరు ఐతేగాని ఆ ఆలోచన అనవసరం అన్నది మావారి మైండ్ సెట్టు..ఈ వీసాల గురించిన విషయసేకరణ జ్ఞానసముపార్జన వద్దన్నా బుర్రలో బోలెడంత చేరికూర్చుంటోంది.. మీలాంటి వారిని గైడ్ చేసే స్థాయిలో!!మా వాడి గ్రాడ్ వాక్ కి వీసా కాయితాలు పంపుతాను మొర్రో అని గోల గోల చేసినా నేను అస్సలు లొంగలేదండోయ్. మనం వెళ్ళే వీసాని టూరిస్టు వీసా అని…”బి౨ “అని తెలిసింది. అలా చుట్టపుచూపుగా వెళ్ళి చుట్టుపక్కల చుట్టపక్కాలనీ.. సందర్శనాస్థలాలనీ చక్కపెట్టే స్థోమత మాకుంది…లేదా మాపిల్లాడికి ఉందహో అని చెప్పుకుని వెళ్ళేది ఒకమార్గం.. ఎవరివీసా ఎందుకు తిరస్కరిస్తారన్నఆ ఒక్క టీ ఎదురుప్రశ్నించే వీలు చట్టాలు కల్పించకుండా మంచి పనే చేశాయి, లేకపోతేనా ఎన్ని కోర్టులు సరిపోతాయండీ..ఇలాఉంటేనే… అమెరికా అంతా మనమేట..అంతమంది పోతుంటేనే ఇక్కడింకా అంతుపట్టని ట్రాఫిక్సమస్య..నిరుద్యోగం..కూడు,గుడ్డ,గూడులకు కటకట..!!సరే..నూటికి నూరుశాతం కళ్ళుమూసుకుని ధీమాగావెళ్ళి విసవిసా వీసా ఉచ్చుకుని బైటకు రావాలంటే …ఒక మార్గముందట..పిల్లల చదువు పూర్తయ్యాక డిగ్రీ ఇచ్చే కాన్వొకేషన్నే.. గ్రాడ్ వాక్ అంటారుట..ఆ ఫంక్షన్కి పిల్లల తల్లితండ్రులు లేదా అత్తమామలను ఆహ్వానిస్తూ కాలేజీ వారు పంపే ఇన్విటేషన్ ఆధారంగా వీసా కి వెళ్తే వీజీగా వీసా ఇస్తారట.. అక్కడ అడుగిడడానికి! పిల్లవాడి గ్రాడ్ వాక్ కి “ముందు సెటిలౌరా .. తర్వాతి మాట వీసాలు..మేం రావడాలూ”అని కొట్టిపారేసిన మేము… ఇపుడు కోడలు గ్రాడ్వాక్ కి వీసా పొందే అవకాశం జారవిడుచుకోదలచుకోలేదు.
చూపుకోవలసిన కాగితాల కట్టలు అటు ఫెడెక్సులో వాడు పంపగా ఇక్కడ మా ఇద్దరి కాగితాల సేకరణకీ తక్కువ శ్రమేమీ కాలేదు..అప్లికేషన్లు నింపే పనికూడా ఆనూ.. లైనూ అంటూ అంతా మావాడే చేసి సర్వం సిద్ధంచేసి డేటు బుకింగు…వగైరా…అబ్బబ్బే.. ఒకటి కాదనుకోండి,, అందివచ్చిన అవకాశాన్ని వీసా పొందడానికి వాడుకుంటున్నాం.. అంతేకదా… అర్జంటుగా టికెట్ కొని నిజంగా మే తొమ్మిది గ్రాడ్వాక్ కి వెళ్ళమనరు కదా…అన్న శంకను పదేపదే అడిగి తెలుసుకుని..నిబ్బరంగా మనసులో విదేశీయానం ఇప్పటిమాట కాదులే బేబీ సిట్టింగుకి…అది కూడా తప్పదు అన్న సీనుంటే. నలుగురూ నా బామ్మతనాన్ని ఎత్తిచూపితే… లేదా నాలోనే తెలియని ఉద్వేగపూరిత ఉత్సాహం ఏదైనా వచ్చేసి అసలు కంటే ఎక్కువ ముద్దొచ్చే వడ్డీ ..బరబరా ఈడుచుకెళ్తే చూద్దాం అని కూడా ఫిక్స్ అయ్యే వీసా ఇంటర్వ్యూకి సిద్ధమయ్యాను సుమండీ!!

*****

కొడుకూ కోడలూ ఇద్దరూ నానా తంటాలు పడి ఒక కట్టకాగితాలు…వాళ్ళ పే స్లిప్పులూ, ఖర్చులు, కార్డులు, ఒకటికాదు.. బోలెడు..ఫెడెక్సులో పంపడం జరిగింది.'”అది మరిచిపోయాం..ఇదుంటే బెటరు “అంటూ పంపిన స్కాన్డ్ మెటీరియల్ మరో అం..త! సరేసరి ఇక్కడ నావీ ఆయనవీ కలిపి కొన్ని, విడివిడిగా ఇంకొన్ని..!!ఇదంతా…ఆ అమెరికన్ కాంసులేట్ వారికి…”మే మేమీ అక్కడ ఉండిపోము సుమండీ” అని ధ్రువీకరణచేస్తూ..తెలుపగలిగే ఋజువులన్నమాట.. ఇంత బతుకూ బతికి.. అక్కడమేముండే కొద్దిరోజులు మాపిల్లలు మాకు తిండిపెట్టి తిప్పగల స్థోమత గలవారే మహప్రభో అంటూ విన్నవించుకునే వినతిపత్రాలూ..వేడుకోళ్ళూ….ఇక్కడ కి మేం తిరిగి రాకపోతే ఇండియా త్వరితగతిని అడ్రస్లేకుండా పోతుంది బాబోయ్…అంటూ పెట్టుకునే మొరకి చెందినవే ఈ ఫైళ్ళ మోతలు,,
మొత్తానికి వారం రోజులముందుగా అన్నికాగితాలు అమర్చుకుని,రెండు డేట్లు మా అబ్బాయి ఆన్లైన్లో బుక్ చేశాడు. మొదటిది ఫింగరుప్రింట్లకి, రెండోది అసలైన వీసా ఇంటర్వ్యూ డేటు.. రెండు సిట్టింగుల్లో ఈ ఇంటర్వ్యూకి మాతో వీర రిహార్సలు కూడాను, ఇద్దరికీ కలిపి తీసుకున్న కంబైన్డ్ టైమట.. ఎవరినడిగితే వారే మాట్లాడాలి, ఓవర్లాపు నో, ఆన్సర్ టు ది పాయింటు, ఏ కాగితం అడిగినా ఠక్కుమని చూపాలి… ఇలా ఎంత ట్రయినింగో. మొదటిసారి మా అబ్బాయిగాడికి దొరికిపోయామంటే నమ్మండి..
సరిగ్గా పాతికేళ్ళక్రితం.. సెంట్ పాల్స్ స్కూల్లో మా అబ్బాయికి మూడునిండగానే ప్రీ స్కూలు అడ్మిషనుకి వాడికి మేమిచ్చిన ట్రైనింగు అచ్చు ఇలాగే సాగింది. కనిపించిన ప్రతి వస్తువుని ఇంగ్లీషులో ఏమంటారో ముందు మేము నేర్చుకుని తరువాత వాడికి రుద్దేవాళ్ళం. అన్నీ బ్రహ్మాండంగా నేర్పితీసుకెళ్తే.. పన్నెండింటికి పిలవాల్సిన పెద్దలు సాయంత్రం ఐదింటికి లోపలికి రమ్మన్నారు..అంతా పైనుండి కింద దాకా తెల్లటి గౌనుల్లాంటి “ఫాదర్..బ్రదర్..సిస్టర్ ” డ్రస్సులు దిగేసుకుని టేబులుచుట్టూ కూర్చుని టేబుల్ మీద నిండా రకరకాల బొమ్మలు, కాయలు, పళ్ళూ,జంతువుల పటాలు పేర్చారు,అన్నీ మావాడికి తెలిసినవే.. అంత ఆలస్యం అవడంతో తిక్కపుట్టిందో ఏమో..ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా నోరు మెదపలేదు మావాడు..మొండిగా భీష్మించేసుకున్నాడు. మేమిద్దరం గందరగోళం పడడం బోర్డు మెంబర్లకి టైమ్పాస్!! ఇటీజ్ ఓ కే.. బైబై అని మర్యాదగానే పంపేశారు మమ్మల్ని పాపం…మూగపిల్లవాడు కామోసు అనుకొని!! ఇదంతా వీసా రోజు నాకు గుర్తొచ్చిన స్మృతి.
చక్కటి ఫైళ్ళలో విడివిడిగా మా ఉద్యోగాల ఇంటర్వ్యూలకంటే పద్ధతిగా అన్ని సెట్లుగా అమర్చుకుని ఫింగరు ప్రింటుకని వెళ్ళిన రోజే ఆ ప్రాంతానికి అలవాటుపడి,,కారుపార్కింగు గట్రా కుస్తీపడి ఎండమండుతుండగా అరగంటలోపే పని కానిచ్చేసి అమెరికా ఆఫీసువారే అయినా వాలంటీరు చేస్తున్న సిబ్బంది మొత్తం మన వారే. పద్ధతి, క్రమశిక్షణ, టైమింగు, ఎక్కడా ఎత్తి చూపే అవకాశం లేకుండా సాగింది.. మరునాడు అసలు పరీక్షన్నమాట.. అక్లమటైజేషన్ అయిపోయింది కనక పెద్దగా టెన్షన్ పడలేదు,,అప్పటికే ఎన్నెన్ని అబ్జర్వ్ చేశానో..!!ఒక క్యూ మాలాగ ఫింగరు ప్రింట్సు, ఇంకొకటి వీసా వచ్చేసిన వారికి సందేశం అందిన అనంతరం అవధిలేని ఉత్సాహంతో వచ్చి కలెక్టు చేసుకునే క్యూ లైను.. అసలైన వీసా పరీక్షలవారిది రోడ్డుమీదకొచ్చేసిన బారులు తీరిన క్యూ..లైన్ల గొలుసు..ఇక కారు పార్కింగు వద్ద టోకెన్లు హోరు, జోరు,హడావుడి చెప్పక్కర్లేదు,ఇంత హేలలోనూ ఎవరి గోల వారిదేనండోయ్..పక్కవాణ్ణి నాలాంటి చాదస్తపు మహిళ తప్ప పలకరించిన పాపానికి కూడా ఎవ్వరూ పూనుకోవడంలేదు..అదృష్టవశాత్తూ పూచిక పుల్ల కూడా ఎగస్ట్రా పట్టుకెళ్ళే వీలులేని రూలు. దాంతో ముందు సెల్లులకు కారే శరణ్యమైంది..అంచేత కనీసం మాటా మంతీ లేకపోయినా కనులారా ఒకరినొకరు చూసుకోవడం జరిగింది…
వీసా పరీక్షలో బిసిలనాడే…సునాయాసంగా ఉత్తీర్ణులై, కసితీరా అమెరికా తిరిగొచ్చిన మా అమ్మ,ఇటు మా ఆడబడచులు. ఎంత బాగా నెట్టుకుని,నెగ్గుకొచ్చారా అనిపించింది….అక్షరాస్యతకు అస్సలు నోచుకోకుండా!!
పెద్దపరీక్షలకి పెట్టుకున్నట్టు అలార్మ్ ఐదింటికే పెట్టుకుని మరీ లేచి కూర్చున్నాం వీసా పరీక్షకి,,మాకిచ్చిన టైము ఉదయం ఎనిమిదిన్నర,,అరగంట ముందుండాలి..అంటే ఇంట్లోంచి ఏడున్నరకే ఎక్జిట్టు…రెండు రౌండ్లు కాఫీలు.. స్నానంపానం. కనీస దీపారాధనయుక్త పూజ.. అన్నీ అయ్యాయి. పొద్దుటివేళ కనుక ట్రాఫిక్ చర్చనీయాంశం కాలేదు. లేకపోతే ఒక పేరా రాయక తప్పేది కాదు. బతికిపోయారు.. ఇండియా అంటేనే తిట్లదండకం అందుకునే వారికి చెంపపెట్టుగా జరిగాయి కాన్సులేటు ఆఫీసువద్ద అడుగడుగునా పనులన్నీ..ముందుగా ఆ చిరాన్ ఫోర్ట్ రోడ్డు ఇరువైపులా చెట్లు పచ్చగా ఏపుగా పెంచబడి రోడ్ మీద చెత్తాచెదారం వెయ్యాలన్నా భయమేసేంత స్వచ్ఛభారత్ ను తలపించింది..మరి ఆ మాటకూడా చెప్పుకోవాలిగా..ఉదయం వేళైనందుకు ఎంతో శ్రద్ధగా రాలిన చెట్లాకులు నిర్మూలిస్తున్నారు సఫాయిసిబ్బంది. అలాగే సెక్యూరిటీ వారు తమ పని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇవన్నీవచ్చిన జనాలను కూడా అత్యంత క్రమశిక్షణకి లోనుచేశాయేమో అనిపించింది..అయినా ఇతరత్రా ఎక్కడా కనిపించని నిశ్శబ్దం..సమయపాలన, నియమపాలన నాకు అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించాయి..ఎందుకంటారు అమెరికా అంటే అదీ?? ఆఫీసు అమెరికావారిదే అనుకోండి…అంతమాత్రాన సిబ్బంది , బయటి సెక్యూరిటీ ,అడుగడుగునా పాస్ పోర్టు..అపాయింటు కన్ఫర్మేషన్లెటరు చెకింగు వారు అంతా మనవారే.. అనుక్షణంవచ్చే అనౌన్సుమెంటు చదివేవారూ మనవారే.. కేవలం ఇంటర్వ్యూచేసేవారు తెల్లవారు లేదా విదేశీయులు….
విషయానికొద్దాం. వచ్చినవారంతా ఒకటే పని మీద వచ్చిఅక్కడ తచ్చాడేవారే. మళ్ళీ ఆ గల్లీలోకి తొంగి చూసేవారూ కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులను ఇవతలే వదిలి కార్యోన్ముఖులవుతున్న మగపిల్లలు లేదా ఆడపిల్లలు. వీరు పిజి అంటే ఎమ్ఎస్ కి వెళ్ళేందుకు ఉత్సుకతో ఉరకలువేస్తున్నవారు. తెలియని ఆందోళన వారి సొంతం. వీరిది ఎఫ్ కేటగిరీ వీసా అట.. తరువాత వర్గం. ఉద్యోగరీత్యా ఎంతో కొంత సాధించి ముందుకుపోతున్నాం సుమా అన్న సంకేతాన్నిస్తూ ఇరవై, పాతికేళ్ళ మధ్యవయస్కులు. వారికి జీవన్మరణ సమస్యే వీసా తెచ్చుకోవడం. ఎవరిదైనా ఎందుకైనా తిప్పికొట్టగల సర్వాధికారాలు అక్కడ అడిగే వారి సొంతం కదా మరి!! తరువాత వర్గం మాది. తల్లిదండ్రులు గ్రాడ్వాక్ లేదా పురుళ్ళకని వెళ్ళే” బి-టు”వారు.. టూరిస్ట్ వీసా అట.. ఎక్కడో మనసులో వీసా వస్తుందని,,రాకపోతే రాసిలేదని సమాధానపడే వయసుకలవారం…ఇంకో రకం బిజినెస్ పనులవారు,,అన్నట్టు…ఇంకో ముఖ్యకేటగిరీ.. నాలుగురోజుల ముందు పెళ్ళై . అర్జంటుగా వారి జీవితాల్లో అనూహ్యంగా గ్రహ స్థితిమారి పోయి పరదేశం చెక్కేస్తున్నవారు. వీరికి వీసా పక్కా అంటారు…పెళ్ళి తెచ్చిన ప్రత్యేక అర్హత కాబోలు.. ప్రతి పదిమంది ఆడవారికీ ఒక నలుగురు పెళ్ళికూతుళ్ళు ఇంచుమించు మోచేతి మీదివరకు మెహిందీ పెట్టించుకుని మెళ్ళో పసుపుపచ్చ తాళిని అలంకరించుకుని దర్శన మిచ్చారు.. అదోముచ్చట!! కేటగిరీ ఏదైనప్పటికీ..అందరూ యాంత్రికంగా కాన్సులేటువారి అనౌన్స్మెంట్లను అనుసరించేస్తూనే.. కడుపులో తితలీలను అదిమిపట్టుకుని ముఖంలో తెలియని ఆందోళన కనబరుస్తున్నారు..వివిధ దశల సీటింగులు చెకింగులు దాటి చిట్టచివరి దశలో ఒక గంట కదులుతూ మాట్లాడుకునే వీలు. మంచినీరు. కొనుక్కునేందుకు కాఫీ ఏర్పాటు కలిగియున్న ఓపెన్ స్పేస్ లో టోకెనునంబరు.. కౌంటర్ నంబరు గమనించుకునేలా పెద్ద డిస్ప్లే బోర్డు అరేంజ్ చేశారు.. ఎత్తే మెడ …దించే మెడ !!మధ్యమధ్య సుదీర్ఘ నిట్టూర్పులు.ప్చ్..ప్చ్ లు.నాకెందుకో కాస్త చికాకు తప్ప టెన్షన్ కలగలేదు. పైగా మా ఇద్దరిదీ కలిపి బుక్ చేసిన వైనం కనుక ఇంటర్వ్యూ కూడా ఒకేసారే కలిపేనన్నారు.. ఒకే టోకెనిచ్చారు. నంబరు రానే వచ్చింది .ఎనిమిదిన్నర స్లాటు వారికి కాల్ తొమ్మిదిన్నరకొచ్చినట్టు. రూములో మూడుకౌంటర్లు.. ఒకటి ప్రత్యేకించి ఇంగ్లీషురాక తెలుగులో ప్రశ్నలను అనువదించే ఒక తెలుగు మహిళ గొంతు మైకులో తెల్లదొరసాని ఇంగ్లీషుకు వెనువెంటనే తెలుగిస్తూ వినిపిస్తుంటే నాకు శరీరం తేలికై వచ్చినపని మర్చినంత పనైంది.. మాతృభాష మహత్యం!! క్యూలో ముగ్గురేసి చొప్పున మూడు క్యూలు ఒకే గదిలో. అందరు అందరి ప్రశ్నోత్తరాలు వినేలాగ ఉన్నఏర్పాటు నాకునచ్చలేదు..కాని తెలుగు కౌంటరు కామిడీ మిస్సయ్యేదాన్నికదా…
ఎత్తైన చోటికెళ్తే నాకు కళ్ళు, తల తిరిగిపోతాయి…ఇది “ఆక్రోఫోబియా”. అసలు ప్రయాణమే పడకపోతే దాన్నేమంటారో? ఇది చదివాక మీరంతా నాకు చెప్పాలట..సరేనా…తెలుగు అనువాదం కౌంటరులోని పృచ్ఛకురాలు తెల్లదొరసాని.. అంతా యాంత్రికంగా జరిగిపోతున్నాయి..అయినా ఇలా నాకు మల్లేనే.. ప్రతివారు తమ జీవితకాలం మననం చేసుకుంటూ తమ వారికి విధిగా వివరించుకునే వయక్తికమైన అనుభవం ఈ వీసా ప్రహసనం.. నాకు ఇచ్చిన కౌంటర్లో నాకంటే ముందు ఇద్దరు అభ్యర్థులున్నారు.. ఒకమగాయనతో ఆల్రెడీ సంభాషణ జరుగుతోంది..ఏమిటో ఇంగ్లీషులో ఒకటే ఫ్లోలో ఆయన వృత్తిని గురించి ఏకధాటిగా చెప్పుకుపోతున్నారు. నాకు అటు చూడగానే చివుక్కుమనిపించిన దృశ్యం అవతలి వైపు కూర్చున్న అనూహ్యంగా అగుపడిన నిగనిగలాడే నల్లని దొరసాని. కంటినిండా కాటుక, చెవులకు, మెడకు నిండుగా ఆర్టిఫిషియల్ ఆభరణాల అలంకరణ..కాస్త అదోలా అనిపించింది సుమండీ..ఆవిడ మాటేమీ వినపించటంలేదు. జస్ట్ నాలుగే అడుగులు వెనక్కి ఉన్నాం.. నా ముందు పెళ్ళైన ఆర్నెల్లకే ఆఫీసువారి సౌజన్యంతో అమెరికాకి వీసాకై వచ్చింది.. నవ్వుతూ వెళ్ళింది కనుక ఇచ్చినట్టే. వెంటనే మా వంతు..గాప్ అన్నదేమీలేదు.. కంప్యూటర్ లో ఏదో ఎంటర్ చేసింది..వెంటనే నెక్స్ట్ అన్నశబ్దం లీలగా వినిపించింది. గుడ్మానింగ్ చెప్పాలనుకుని రిహర్సల్ చేసి వృథా…ఆవిడే మాకు “గుడ్మార్నింగ్…హౌ డుయూ డూ..అని కూడా పలకరించింది..నా పాస్పోర్టు మీద ఆ నంబరేదో అతికించినందుకో. లేక స్వలింగిననో .. నన్నే చూస్తూ వరసగా నాలుగు ప్రశ్నలు టకటకా అడిగేసింది. ఎందుకు..ఎక్కడ..అమ్మాయిది.. ఏ రకం వీసా.. ఎందులో జాబ్..?? అంతే..యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అని గొణిగింది..మా బాబు ముందుగానే చెప్పాడులెండి… పాస్పోర్టులు వెనక్కి ఇవ్వకపోతే వీసా వచ్చినట్టు ..లేదా చక్కా పుచ్చుకుని మారుమాట్లాడకుండా వచ్చేయాలీ….అని…….ఇవ్వలేదు..ముందుకు పొమ్మనట్టు వెనకవారిని పిలిచింది,,
ఎంతో వెలితి…ఏ కాగితం చూపమనలేదే అని…పిల్లాడు బోల్డు ఖర్చుపెట్టి ఫెడెక్స్ లో కట్టలుకట్టలు పేపర్లు పంపాడే…అని ఏదో బాధ.. ఠకీమని నాకు మా చిన్నతనం సంఘటనొకటి పొడుచుకొచ్చేసింది. నేను నా చెల్లాయి పరీక్షలకి అలార్మ్ నాలుగింటికే పెట్టుకుని రాత్రి పెందరాళే తొమ్మిదికే పడుకునే వాళ్ళం..ఇప్పటి పద్ధతికి పూర్తి భిన్నంగా!! చాలాసార్లు చెల్లి లేచేది కాదు.. పైగా పరీక్ష అవగానే ఇంటికొచ్చి “థాంక్ గాడ్..నేను పొద్దున్నేలేవలేదు,,పేపర్ చాలాఈజీగా వచ్చింది.. ఇరగదీశాను. లేచుంటే వేస్టయ్యేది””అనేది.. సరిగ్గా ఇది గుర్తొచ్చింది..ప్రిపరేషను వేస్టైనందుకు!!
ధోబీకి మురికి బట్టలు వేస్తూ ఒక గడుసరి ఇల్లాలు. మాపు తక్కువగానున్న చొక్కాను వెనక్కు లాగి, గదిలో రెండు బల్బులు కసాబిసా తుడిచేసి మరీ ఉతుకుడుకి వేసి పద్దు రాయించిందట అలా ఈ ముచ్చటా గుర్తొస్తోంది.. జోకేఐనా!! ఇక్కడ నా కేసు వేరు, గిట్టుబాటైంది.. శ్రమ వేస్టైతే అయింది. కెలుక్కో దల్చుకోలేదు…ఆన్సర్ జస్ట్ టు ది పాయింట్ అని మరీ మరీ నేర్పాడాయె కుమారరత్నం!!!
చెప్పుకోవలసినదేంటంటే…వరుసగా ఎడతెరిపి లేకుండా మనవాళ్ళు అమెరికా నుండి ఫోను చేసి రిజల్ట్ క్యూరియస్ గా కనుక్కోవడం లేదా వాళ్ళకి మనం వాట్సప్ మెసేజ్ పంపడమే తప్ప…పక్కనున్న వారికేసి చూసే సంస్కారం పూర్తిగా అంతరించిపోయిందనే చెప్పాలి..నాకు ఇంతో అంతో ఆ ఎంక్వైరీ బుద్ధి ఉన్నా మా ఆయన అటువంటప్పుడు నా కిచ్చే లుక్కు తలచుకుని మూసుకుంటున్నాను ఈమధ్య,..”ఎవరిగోల వారిది” !ఈ టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ..!
వీసా కథలో నాకు దొరికిన మేత ఇంకొక్కటుంది….అంచెలంచెలుగా సాగిన ఈ యాత్రలో అక్కడక్కడ తెలుగు ఇంగ్లీషు రెండు భాషల్లోను వ్రాసియున్న నోటీసు బోర్డులలో…తెలుగు అనువాదం చూసి నాలో నేనే తెగ నవ్వేసుకున్న ఘడియలు..పంచుకునే వాతావరణం అస్సలు లేక కించిత్తు నిరాశకూడాను..అన్నీ గుర్తుకురావడంలేదు,నియమం అని ఉండాల్సిన చోట నియామకం…సంప్రదాదించవచ్చూ అంటూ మరో బాంబు…
ఇలా ఎన్నో..మళ్ళీ అక్కడికెళ్ళి కూల్మైండ్తో నోటు చేసుకొద్దామంటే…ఎక్కడా…ఫదేళ్ళకి ఇచ్చేసిన “వీసా ” ను ఇవాళే అందుకున్నాం..అందుకే అక్కడికి మీరెవరెళ్ళినా ఆ నోటీసులను కంఠస్థం చేసుకొచ్చి చెప్పాలని కోరుతున్నాను,,ఇంతకీ నా గోడు ఏమని చెప్పనూ…ఇన్నేళ్ళు నా మనసుకు నేను “వీసా లేకుండా విమాన ప్రయాణం ఊసేల?? “అంటూ దాటేశాను…మరిప్పుడు??ఎలా??
ఆ భగవంతుడిదే భారం…కాదండీ…వీ సా కి పుంఖాలకొద్దీ కబుర్లు కురిపించిన నేను రేపు అటువెళ్ళొస్తే ???వదన వచన గ్రంథం అక్కడినుండే పంపనూ!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *