April 27, 2024

సరస్వత్యష్టోత్తరశతనామావళిలో ఛందస్సులు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

god-saraswathi-images-and-wallpaper-29

దసరా సమయములో సరస్వతీదేవి అష్టోత్తరశతనామావళిని చదువుతున్నప్పుడు అందులోని కొన్ని పేరులు ఛందశ్శాస్త్రములోని వృత్తముల పేరులను జ్ఞప్తికి తెచ్చాయి. జాగ్రత్తగా పరిశీలించిన పిదప నాకు లభించిన నామములతో ఉండే వృత్తములను క్రింద లక్షణ లక్ష్యములతో అందిస్తున్నాను. పాఠకులు ఆనందిస్తారని ఆశిస్తున్నాను. యతి స్థానము ఒక అడ్డగీతతో (-) చూపబడినది.

సరస్వతీ అష్టోత్తరశతనామావళి – http://joyfulslokas.blogspot.com/2010/08/saraswati-ashtotara-stotram.html
పాటగా – https://www.youtube.com/watch?v=pAVsqGsvqgA

సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా …
సావిత్రీ – మ/లగ UUUIU 5 సుప్రతిష్ఠ 9
భావమ్మే గదా
రావమ్మే గదా
జీవమ్మే గదా
సావిత్రీ యిలన్

శివానుజా పుస్తకభృత్ జ్ఞానముద్రా రమా పరా …
రమా (ప్రియా) – స/లగ IIUIU 5 సుప్రతిష్ఠ 12
భవసారమా
నవతీరమా
కవిపారమా
అవికారమా

సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా …
సావిత్రీ (విదుల్లేఖా, శేషరాజ) – మ/మUUU – UUU 6 గాయత్రి 1
సావిత్రీ – సత్యార్థీ
శ్రీవిద్యా – చిద్రూపా
భావాబ్ధీ – వాగర్థా
కావన్ రా – కైమోడ్తున్

సౌదామినీ సుధామూర్తీ సుభద్రా సురపూజితా …
సుభద్రా (విలంబితా) – జ/ర/గ IUIUIUU 7 ఉష్ణిక్కు 22
సుభద్ర నిన్ స్మరించన్
శుభమ్ములే కలుంగున్
సుభాషిణిన్ దలంచన్
ప్రభాతముల్ వెలుంగున్

పీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ …
విద్యున్మాలా (విద్యుల్లేఖా) – మ/మ/గగ UU UU – UU UU 8 అనుష్టుప్పు 1
విద్యున్మాలా – వేదాంతార్థా
విద్యల్ నీవే – ప్రేమాంబోధీ
ఆద్యంతమ్మా – హంసారూఢా
పద్య మ్మీయన్ – బ్రార్థింతున్ నిన్

సర్వదేవస్తుతా సౌమ్యా సురాసుర నమస్కృతా …
సౌమ్యా – స/స/స IIU IIU IIU 9 బృహతి 220
కమలమ్ముల మాలలతో
కమనీయపు నవ్వులతో
విమలమ్మగు విద్యల సౌ-
మ్యముగా నియుమా దయతో

పీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ …
విమలా – స/స/జ/గగ IIUII – UIUI UU 11 త్రిష్టుప్పు 348
విమలమ్ముగ – వెల్గుచుండు తల్లీ
సుమరాశుల – సొంపులీను వల్లీ
రమణీయపు – రావ మొల్కు రాణీ
కమనీయపు – కావ్య కర్త వాణీ

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా …
మాయా (వైశ్వదేవి, చంద్రకాంతా, చంద్రలేఖా) – మ/మ/య/య – UUUUU – UIU UIUU
మాయూరాసక్తా – మాలికా భూషితాంగీ
మాయామోహమ్ముల్ – మాయఁగాఁ జేయలేవా
మాయాంభోరాశిన్ – మంథమై త్రచ్చ రావా
వ్రాయంగన్ నేర్పన్ – రమ్మిటన్ జంద్రలేఖా
(మాయా సార్థకనామ గణాక్షర వృత్తము)

చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా …
చండీ (కమలలోచనా, కమలాక్షీ) – న/న/స/స/గ – IIII IIII – UII UU 13 అతిజగతి 1792
తిమిరము తొలగఁగ – దీప్తుల నీయన్
భ్రమములు తొలగఁగఁ – బల్కులఁ జెప్పన్
శ్రమములు తొలగఁగ – శాస్త్రము దెల్పన్
రమణను వెలుగఁగ – రమ్మిట చండీ

చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా …
చంద్రికా (కుటిలగతి, క్షమా) – న/న/త/త/గ IIII IIU – UIU UIU 13 అతిజగతి 2368
లలితము స్వరముల్ – రాగిణీ చంద్రికల్
కళలకు నిరవుల్ – కావ్యముల్ గీతముల్
చెలువపు నెలవుల్ – చిత్రముల్ నృత్యముల్
తలి నిను గొలుతున్ – దారిఁ జూపంగ రా

కాంతా కామప్రదా వంద్యా విద్యాధరసుపూజితా …
కాంతా (ఇందువదనా, వనమయూర) – భ/జ/స/న/గగ UIII UIII – UIII UU 14 శక్వరి 3823
అందమగు వెన్నెలల – హాసముల వెల్గున్
జిందిడఁగ డెందమున – జెల్వములె కల్గున్
వందనము లిచ్చెదను – పద్మజుని కాంతా
ఛందముల నీయు మిఁకఁ – జక్కఁగఁ బ్రశాంతా

వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా …
వసుధా (పథ్యా, ప్రథితా, మంజరీ) – స/జ/స/య/లగ IIUI UIII – UIU UIU 14 శక్వరి 4844
అలరారు వెన్నెలల – యందమౌ సొంపులన్
వెలిఁగించు నాననము – వేదముల వంపులన్
మలవోలె నీవసుధ – మమ్ములను గావుమా
అలవోలె నా రసన – నాశువుగఁ బల్కుమా

మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా …
మాలినీ (నాందీముఖీ) – న/న/మ/య/య III III UU – UI UUI UU 15 అతిశక్వరి 4672
అమలకమలనేత్రా – ఆదిమధ్యాంతరూపా
విమలకవనపాత్రా – వేదవిద్యార్థదీపా
అమితమధురగాత్రా – ఆదిశక్తిస్వరూపా
మమత నొసగ రమ్మా – మాలినీ విద్య లిమ్మా

కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ …
కామరూప – మ/ర/భ/న/త/గగ UU UUI UUI – IIII UUI UU 17 అత్యష్టి 20369
కావ్యారంభమ్ము సేయంగఁ – గవితలతోఁ గామరూపా
భవ్యమ్మై యుండఁ బ్రార్థింతు – వరమియ సాహిత్యదీపా
దివ్యమ్మౌ దీధితుల్ చిందఁ – దెనుఁగునఁ బద్యమ్ము వ్రాయన్
నవ్యాకారమ్ములన్ నీదు – నగవుల శ్రీలిమ్ము వాణీ

కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సుపూజితా …
కాంతా – య/మ/న/ర/స/లగ IUUU – UUIIIU – IUIIUIU 17 అత్యష్టి 46530
అకారమ్మే – యానంద లిపిగా – ననాదిగ నాద్యమే
ప్రకాశించెన్ – రమ్యమ్ముగ రుచుల్ – బ్రమోద మొసంగగా
వికీర్ణమ్మౌ – వీణారవములన్ – బ్రియమ్ముగ మీటుమా
వికాసించున్ – బ్రేమాంబురుహముల్ – విరించికిఁ గాంతమై

సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా …
సురసా – మ/ర/భ/న/య/న/గ UU UUI UU – IIII IIU – UI IIU 19 అతిధృతి 237457
సాలంకారమ్ము నుండన్ – సవురు కనులకున్ – సంతసముగా
తాళమ్ముల్ మ్రోఁగుచుండన్ – తపిత హృదయమున్ – దన్మయతతో
లీలన్ గొల్తున్ వరాంగీ – రిపుదళదళనా – లెస్సగ నినున్
బాలించన్ గోరుచుంటిన్ – ప్రణవపు ప్రతిమా – భక్తి నెపుడున్
(ఇందులోని మొదటి రెండు భాగములు, స్రగ్ధరలోని మొదటి రెండు భాగములు ఒక్కటే)

భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా …
భారతీ – భ/భ/ర/త/త/త/త UII UII UIU – UUI UUI UUI UUI 21 ప్రకృతి 1198263 (కల్పితము)
భారము లేవియు లేవుగా – భావించ నీవుండ నెల్లప్డు నాచెంత
దూరము లేవియు లేవుగాఁ – దూఁగాడుచుండంగ డెందమ్ము నీచెంత
హారము లన్నియు నీకెగా – హర్షమ్ముతో పద్య వర్షమ్ము నీవీయ
కోరితి నీ దయ భారతీ – కుందేందు శ్వేతాంబరా నేను నీ ఛాయ
(భారతీ సార్థకనామ గణాక్షర వృత్తము)

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా …
సరస్వతీమనోహరి- జ/ర/జ/ర/జ/ర/జ/ర యతి (1, 9, 17) 24 సంకృతి 5592406 (కల్పితము)
విరించి హృద్వినోదినీ – విశాల విశ్వ మోహినీ – విశుద్ధ వేద మాతృకా
సురాగ్రణీ శుభంకరీ – సుభాషిణీ సుహాసినీ – సుమించ నిమ్ము విద్యలన్
సరస్వతీ మనోహరీ – స్వరప్రవాహ లోలినీ – సచిత్ర వాగ్వినోదినీ
వరమ్ము లిమ్ము ప్రేమతో – వరిష్ఠ భక్తి నిచ్చెదన్ – వరప్రసూన మాలలన్

సౌదామినీ సుధామూర్తీ సుభద్రా సురపూజితా …
సుభద్ర (కిరీటము) – ఎనిమిది భ-గణములు, UII UII – UII UII – UII UII – UII UII 24 సంకృతి 14380471
సుందర రూపము – సుందర హాసము – సుందర వేదము – శోభల వల్లిక
సుందర వస్త్రము – సుందర మాలిక – సుందర వాక్ఝరి – సొంపుల మల్లిక
సుందర గానము – సుందర రాగము – సుందర నాదము – సూనృత ఝుల్లిక
ఇందునిభానన – యిత్తును వందన – మెప్డు సుభద్రత – హృష్టిని గావుము

భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా …
భామా – త/భ/స/య // జ/భ/స/స UUI UII – IIUI UU / IUI UII – IIU IIU
సాహిత్య రూపపు – స్వరమూర్తి నీవే
మహీతలమ్మున – మముఁ గాతువుగా
దేహీ సరస్వతి – తృషఁ దీర్చుమమ్మా
సుహాసినీ కడు – శుభ మీయఁగ రా

శివానుజా పుస్తకభృత్ జ్ఞానముద్రా రమా పరా …
రమా – IUI(U / IUIU – IUIUIUIU; నాలుగవ అక్షరము పిదప ఒక గురువును రెండు లఘువులుగా మార్చవచ్చును; ఉదాహరణములో పదవ అక్షరమైన గురువుకు బదులు రెండు లఘువులు వాడబడినవి.)
సరస్వతీ మనోన్మనీ – సరసమతీ విలాసినీ
వరప్రదా యశఃప్రదా – ప్రణవధృతీ ప్రమోదినీ
సురాసురాదిసేవితా – సుషమగతీ వినోదినీ
విరించిహృత్ప్రమోదినీ – ప్రియరమణీ రమామణీ

మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా
ఉత్సాహ – సూ/సూ/సూ/సూ – సూ/సూ/సూ/గ
దేవతలకు దానవులకు – దేవి నీవె చదువులన్
రావణునకు రామునికిని – రావ మీవె గళములో
భావులకును బండితులకుఁ – బలుకు నీవె నాల్కపైఁ
బ్రోవుమమ్మ శారదాంబ – పూర్ణచంద్రవదన నన్

మొదటి ప్రతిని చదివి అక్కడక్కడ దొరలిన దోషములను ఎత్తి చూపిన శ్రీమతి సుప్రభ గారికి నా కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *