April 28, 2024

సహజీవనం

రచన: వై.ఎస్.ఆర్. లక్ష్మి

“ఏమాలోచించారు “అని అడిగాడు రామారావు గుడిలో తనను కలసిన జానకిని.
ఆమె కాసేపు ఏమీ మాట్లాడలేదు.
అసలు విషయం ఏమిటంటే రామారావుకి భార్య చనిపోయి సంవత్సరం గడిచింది. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అక్కడకు వెళ్ళి ఉండలేక ఇక్కడే ఉంటూ ఒకరోజు చెయ్యి కాల్చుకుంటూ వీలు కానిరోజు కర్రీ పాయింట్ కూరలతో కాలక్షేపం చేస్తున్నాడు. పనమ్మాయి వచ్చి పని చేసి వెళుతుంది. అలా రోజులు గడుస్తున్నాయి.
అనుకోకుండా ఒక రోజు జానకి పరిచయం చిత్రంగా జరిగింది. ఒకరోజు పని మీద బయటకు వెళ్ళి వస్తూండగా కాళ్ళకు పర్స్ తగిలింది. చేతిలోకి తీసుకొని తలెత్తి చూస్తే ముందు ఒకామె నడుచుకుంటూ వెళుతోంది. ఆ పర్స్ ఆమెదే అయి ఉంటుందని ఆమెను పిలిచి “ఇది మీదేనా?”అని అడిగాడు. ఆమె లాక్కున్నట్లుగా తీసుకొని వెళ్ళిపోయింది. కనీసం మర్యాద కోసమన్నా థాంక్స్ చెప్పలేదు చిత్రంగా అనిపించింది. అక్కడతో విషయం మరిచిపో టానికి వీల్లేకుండా ఆమె పక్క వీధిలోనే ఉంటుంది కాబోలు తరచు కనిపిస్తోంది. ఒకరోజు గుడిలో ప్రవచనాలు ఉంటే వెళ్ళినప్పుడు అక్కడ ఎదురు పడింది. రామారావే “బావున్నారా?”అని పలకరించాడు. “ఓ మీరా!ఆ రోజు హడావుడిగా వెళ్ళిపోయాను. థాంక్స్ అండీ”అన్నది ఆమె.
“మీ పేరు. . . . . ”
“జానకి. . . . . ”
అలా జరిగిన పరిచయం ఒకరి విషయాలు మరొకరు పంచుకొనే దాక పెరిగింది. ఆమె భర్త పిల్లల చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చనిపోయాడని తను జాబ్ చేయడం వలన ఆర్ధికంగా లోటు లేకపోయినా వారిని పెంచడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. అమ్మాయి పరవాలేదని ఇంజనీరింగ్ చదివిందని పెళ్ళి చేశానని అమెరికా వెళ్ళిందని, కొడుక్కి మాత్రం చదువు సరిగా అబ్బలేదని ఎలాగో డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు జాబ్ చేస్తున్నాడని, కోడలు కూడా చిన్న ఉద్యోగం చేస్తుందని, వేరే ఊర్లో ఉంటారని. , వారికిద్దరు పిల్లలు. డబ్బులు అవసరమైనప్పుడల్లా ఫోన్ చేస్తాడు కాని తల్లి గురించి పట్టించుకోడని చెప్పింది. ఆ రోజు కూడా అలా హడావిడిగా వెళ్తూనే ఆయనకు కనిపించినట్లు చెప్పింది.
రెండు రోజుల కొకసారి గుడిలో కలవడం మంచీ చెడు మాట్లాడుకోవడం అలవాటుగా మారింది. ఒక సారి పది రోజుల వరకు ఆమె కనిపించలేదు. మాటల మధ్యలో ఎప్పుడో చెప్పిన గుర్తులను బట్టి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. నీరసంగా కూర్చుని కనిపించింది. వైరల్ ఫీవర్ అని కొడుక్కి ఫోన్ చేసినా నేను వచ్చి ఏమి చేస్తానని రాలేదని పక్కింటి వారే డాక్టరును అడిగి మందులు తెస్తే వేసుకున్నానని చెప్పింది.
రామారావు ఇంటికి వచ్చినా నీరసంగా పీక్కుపోయిన ఆమె ముఖమే కనిపించింది. ఒంటరితనంలోని బాధ ఏమిటో ఆయనకు తెలుసు. ఏం చేయాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరునాడు జానకి దగ్గర తన నిర్ణయాన్ని చెప్పాడు.
“కలసి జీవిధ్ధామని” ప్రతిపాదించాడు. ఒంటరితనం నుండి విముక్తికి అదే మార్గమని తెలిపాడు. ఇప్పుడు ఆ విషయంపైనే ఆమె అభిప్రాయాన్ని అడిగాడు.
జానకి ఒక నిముషం మౌనంగా ఉండి “ఈ వయసులోనా?”అన్నది.
“ఇప్పుడే అవసరం. పిల్లలు ఎవరి దారిన వారు వెళ్ళిపోయాక, మనని పట్టించుకొనే వారు లేనప్పుడు ఒకరికొకరు తోడు అవసరం. మంచి కైనా చెడుకైనా మనసులో మాట చెప్పుకోవడానికి మనిషి అవసరం. చిన్న వయసులో ఉద్యోగం, పిల్లలు ఇంటి బాధ్యతలతో సమయమే తెలియదు. ఇప్పుడు రోజు గడవటమే కష్టంగా ఉంటుంది. ఏమీ చేయలేము. టీ. వి ఎక్కువసేపు చూడలేము, ఇంకే ఇతర కాలక్షేపాలు చేయలేము. మనం చేయ గలిగిందల్లా కబుర్లతో కాలక్షేపమే. భగవంతుని పిలుపు కోసం ఎదురుచూస్తూ పలకరించేవాళ్ళు లేక ఎన్నాళ్ళని ఒంటరిగా ఉండగలం. ఇది ఆర్ధిక సంబందమూ కాదు, భౌతిక సంబందమూ కాదు కేవలం మానవ సంబంధం మాత్రమే. ఆలోచించండి “అన్నాడు.
జానకి”పిల్లలు ఏమంటారో”?
“ఒంటరిగా వీళ్ళు ఎలా ఉంటున్నారో అన్న ఆలోచన లేని వారి గురించి మనం ఆలోచించడం వృధా. వాళ్ళ పిల్లలు వారి భవిష్యత్తు గురించి ,వారి కెరీర్ గురించి తపనపడే వారికి మన గురించి ఆలోచించే తీరికా ,ఓపిక ఎక్కడిది. పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక ఎంతమంది తల్లిదండ్రులు ఒక ఆప్యాయమైన పలకరింపు కోసం చకోర పక్షుల లాగ ఎదురు చూడటం లేదు. ఇద్దరూ ఉన్నంత కాలం ఒకరికొకరు తోడుగా ఉంటారు. అందులో ఒక పక్షి రాలిపోయినా రెండోవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటోంది. అటు పిల్లల దగ్గరకు వెళ్ళలేక, ఇక్కడ ఒంటరిగా ఉండలేక అవస్థ పడుతున్నారు. అందుకే ఊరికో వృధ్ధాశ్రమం వెలుస్తోంది. పిల్లలూ తల్లిదండ్రుల్ని అందులో పడవేసి బాధ్యత తీరింది అనుకుంటున్నారు. అందరూ అలా ఉంటారని కాదు. చాలా వరకు ఇంతే. ఎవరి పరిస్థితిని బట్టి ,అవకాశాన్ని బట్టి వారు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని జీవించడంలో తప్పు ఉందని నేను అనుకోను. తొందరేమీ లేదు. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. “అని చెప్పి వెళ్ళిపోయాడు రామారావు.
********.

ఆ రోజు ఉదయమే వాకిలి ముందున్న సన్నజాజి తీగ గాలికి ఒరిగితే దానికి కర్ర పాతి ఆసరా కల్పిస్తున్నాడు రామారావు.
“కాఫీ తీసుకోండి “అంటూ అందించింది జానకి.
ఆమె నిర్ణయాన్ని హర్షిస్తూ పారిజాతం పుష్పాభిషేకం చేసింది.
*******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *