April 27, 2024

వయోజనులతో వనభోజనాలు

00

‘కృష్ణ సదన్’ ఒక చక్కని ఆశ్రమం. పిల్లలకు దూరమైన అమ్మా నాన్నలు తమ వానప్రస్థాశ్రమాన్ని కొనసాగిస్తున్న తపోవనం.
ఈ రోజు కార్తీక మాస వనభోజనాల సందర్భముగా మేమంతా ‘మా ఆసరా’ తరఫున ఈ ఆశ్రమానికి వెళ్లి ఆ పెద్దవారితో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎంతో సంతోషంగా గడిపి తిరిగి వచ్చాము.
ఇక్కడ సుమారుగా పదకొండు మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారికి పడక సౌకర్యాలు, వాటిని ఆనుకునే పక్కగా వాష్ రూమ్ సౌకర్యం చక్కగా అమరి ఉన్నాయి. కన్న తల్లుల్లాగా వారిని చూసుకునే ఆశ్రమ సిబ్బంది, అధికారులు ఉన్నారు.
సుమారుగా ఐదు ఎకరాల స్థలములో చుట్టూ అందంగా పెంచిన తోట మధ్య, వరిపొలాల మధ్యన మున్యాశ్రమంలా చల్లగా ప్రశాంతంగా ఉన్నది కృష్ణ సదన్. ఇక్కడికి వచ్చేవారు ఏదైనా శుభ సందర్భాన్ని ఇక్కడ జరుపుకుంటారు. అనగా పుట్టినరోజు కాని, పెళ్లి రోజు కాని. అలాగే ఇక్కడ ప్రతీ పున్నమి రోజు ఆశ్రమం వారు సత్యనారాయణ వ్రతాలు జరుపుకునే సౌలభ్యాన్ని అందజేస్తారు. నామ మాత్రపు రుసుముతో, చక్కని ప్రసాదం వారే తయారు చేసి, ఎంతో చక్కగా పూజ జరిపిస్తారు. ఇక కార్తీక మాసంలో ప్రతీ ఆదివారం, హైదరాబాద్, చుట్టు ప్రక్కల ప్రదేశాల నుంచి ఎంతో మంది జనం వన సమారాధన జరుపుకోవటానికి ఇక్కడికి వస్తారు.
ఇక్కడ ఒక గోశాల, పంట పొలం, కూరగాయల తోట, మామిడి చెట్లు, దబ్బ చెట్లు, నిమ్మ చెట్లు ఉన్నాయి. వాటిని అంటే ఆ ధాన్యాన్ని, కూరగాయలను ఆశ్రమం కోసమే వాడుతున్నారు.
ఈరోజు ఉదయమే బయలుదేరి పికెట్ గణపతి దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన వాన్ లో పది మందిమి అనగా మాలతి, సుజాత, విమల సాయి గారు, పారుల్ గారు, ఉమాదేవి కల్వకోట, సుగుణ బొలిసెట్టి, ఆమె శ్రీవారు శ్రీ హరిబాబు గారు, చిన్నారి చెల్లి లక్ష్మీ యలమంచిలి, నేను, శ్రీవారు నాగేశ్వరరావు గారు బయలుదేరాము. భానక్క, (మంథా భానుమతి గారు), బావగారు మంథా రామారావు గారు, కర్రా లక్ష్మి గారు ఒక కారులోనూ, సుజల గంటి గారు, బాలా మూర్తి అక్కయ్య గారూ మరొక కారులోనూ అక్కడికి చేరుకున్నారు. మాలతి గారి అన్నగారు శ్రీ విజయ కుమార్ కోన, వదిన గారు శ్రీమతి ఝాన్సీ గారు మరొక కారులో వచ్చారు. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న ప్రియమైన చెల్లి మధు అద్దంకి (మాధవి) వచ్చి కలిసింది. వ్యాన్ లో వెళ్ళే టప్పుడు మేము ఎంతో బాగా ఉత్సాహంగా, ‘అంత్యాక్షరి’ ఆడుకున్నాం… చక్కని పాటలలో అసలు ప్రయాణ శ్రమ కానీ, అలసట కానీ తెలియలేదు… అలా అలా పాటల అలల మీద అలవోక గా సాగిపోయింది మా ప్రయాణం.
అక్కడికి చేరిన వెంటనే చల్లని మంచి నీళ్ళు, చక్కని వేడి వేడి కాఫీ ఏర్పాటు చేయబడ్డాయి. మేము ఆశ్రమవాసుల గదులు చూసాము. అక్కడి అమ్మలతో మాట్లాడాము. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి గురించి చెబుతూ కన్నీరు కార్చారు వారు.

2
మిత్రులారా… ప్రతీరోజు పంచ భక్ష్య పరమాన్నాలు తినేవారికి ఆకలి బాధ తెలియనట్టే, అయిన వారు దూరమైనా బాధ, మన చుట్టూ అందరూ ఉన్నప్పుడు తెలియనే తెలియదు. అందరూ ఉన్నా ఇలా ఇంటికీ, పిల్లలకీ (తమ వారికీ) దూరంగా ఉండవలసి వస్తున్నందుకు వారు ఎంతటి మనోవ్యధను అనుభవిస్తున్నారో కళ్ళారా చూసాము ఈరోజు…
97 సంవత్సరాల వయసున్న పండు ముసలి అమ్మ ప్రఫుల్ల గారు అక్కడ ఉన్నారు. మీకు తెలుసా, ఆవిడకి కోడలు వాతలు పెట్టి హింసిస్తూ ఉంటే ఆవిడ ఇల్లు వదలి వచ్చి ఇక్కడ చేరారట. ఈ వయసులో కూడా అస్సలు ఖాళీ గా కూర్చోకుండా, కూరలు తరిగి ఇవ్వటం, వంట పనిలో పాలు పంచుకోవటం వంటి పనులు చేస్తూ ఉంటారట. ఆవిడ మాట్లాడుతూ ఉంటే గుండె చెరువు అయిపోయింది.
నాన్నలు కఠినంగా ఉండటం పరిపాటి. ఎందుకూ? క్రమశిక్షణతో మనం పొందికగా ఉండాలని, చక్కగా చదువుకొని వృద్ధి లోనికి రావాలని. ఒక నాన్న అలా కఠినంగా ఉన్నందుకు ఆరుగురు పిల్లలు మంచి స్థాయిలో ఉండి కూడా ఆశ్రమవాసులే అయారు ఆ వృద్ధ దంపతులు. వారికి కోపమట తమ తండ్రి కాఠిన్యముగా ఉండటం… ఎంత దుర్భర స్థితి?
ఈరోజు అక్కడ ఒకరు సత్యనారాయణ వ్రతం జరుపుకున్నారు. ప్రముఖ రచయిత్రి ‘వసుంధర’ (శ్రీ జొన్నలగడ్డ రాజ గోపాల గారు, మరియ శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు) దంపతులలో రాజ గోపాల్ గారి చెల్లెలి పిల్లలు వారు. అలా అనుకోకుండా వసుంధర గారి దర్శన భాగ్యం మాకు లభించింది. ఎంతో చక్కగా, ఆదరంగా మాట్లాడారు వారు.
కాఫీలు అయిన తరువాత, మామిడి చెట్ల కింద వేసిన కుర్చీలలో హాయిగా కూర్చుని మా కార్యక్రమాలు మొదలుపెట్టాము. భానక్కయ్య ‘ఓంకారం పరమం శివం’ అనే కీర్తనను, సుజలక్కయ్య ‘నంద గోపాలా చేరగ రావా?’ అనే భక్తి గీతాన్ని, నేను ‘నీవు లేక వీణా’ అనే పాటనూ, లక్ష్మి కర్రా గారు ‘ఎక్కడి మానుష జన్మము’ అనే అన్నమయ్య కీర్తనను, లక్ష్మీ యలమంచిలి ‘ఏ కులజుడైన నేమి’ అనే అన్నమయ్య కీర్తనను, ఆశ్రమవాసి శ్రీమతి శకుంతల గారు ‘జయ జయ రఘురామా!’ అనే భక్తి గీతాన్ని గానం చేసారు.
భానక్క పెద్ద వారికోసం తయారు చేసిన క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు అందరూ ఎంతో చక్కగా జవాబులు ఇచ్చి, బహుమతులను గెలుచుకున్నారు. క్విజ్ కార్యక్రమానికి ముందు పాటలు పాడారు. ఎంతో ఉత్సాహంగా హాయిగా అనిపించింది. క్విజ్ కార్యక్రమంలో భార్గవి గారు, లలిత గారూ, శకుంతల గారు, హైమవతి గారూ చక్కగా జవాబులు ఇచ్చి బహుమతులు గెలుచుకున్నారు. శ్రీ అబ్బూరి కృష్ణ శర్మ గారు చక్కని పద్యాలను గానం చేసారు.
అప్పటికప్పుడు ఆశువుగా నేను ఈ క్రింది పద్యం వ్రాసి చదివాను.
‘కృష్ణ సదన మందు కూడియా డగనిట
హాయి గొలుపు పాట యాట లందు,
అక్క చెల్లె యాప్తు లందరు కలిసియు
మంచి చేసె దముగ మాన్యులార!’
ఈలోగా భోజనాలకు పిలుపు వచ్చింది. టేబుల్ మీల్స్… చల్లని చెట్ల క్రింద పచ్చని అరిటాకులలో కమ్మని భోజనాలు…ముందస్తుగా సత్యనారాయణ వ్రతం యొక్క తీర్థాన్ని, ప్రసాదాన్ని ఇచ్చారు. విస్తరిలో ముందుగా పూర్ణం బూరెలు, పచ్చి మిరపకాయ బజ్జీ, ఘుమ ఘుమలాడే పులిహోర వడ్డించారు. దోసావకాయ, టొమాటో పప్పు, గుత్తి వంకాయ కూర, దొండకాయ వేపుడు, ముక్కల పులుసు, పెరుగుతో పెళ్లి భోజనాన్ని మరపించే తెలుగింటి భోజనం – మృష్టాన్న భోజనం ఆరగించాము. ఎంత తృప్తి కలిగిందో మాటల్లో చెప్పలేను.
అందరి భోజన కార్యక్రమం ముగిసిన తరువాత భానక్క షూటింగ్ గేమ్ పెట్టారు. ఒక అట్ట మీద స్కోర్ నోట్ చేయబడి ఉంటుంది, దాని మీదికి బాణాలు విసరాలి.అవి పటానికి అతుక్కుంటాయి. అక్కడ స్కోర్ ఉంటుంది, ఎవరెంత స్కోర్ చేస్తే వారికి అన్ని పాయింట్స్ అన్న మాట. ఈ పోటీలో కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.
రెండున్నర నుండి మూడున్నర వరకూ అంత్యాక్షరి ఆడుకున్నాము. చరణం పాడితే పల్లవి చెప్పుకునే ఆట… గంట కాలం ఎంత త్వరగా గడిచిపోయిందో తెలియలేదు. ఆ తరువాత మళ్ళీ సదనం లోకి వెళ్లి అందరికీ (ఆశ్రమ వాసులకు) మేము తీసుకు వచ్చిన వస్త్రాలు, పుస్తకాలు ఇచ్చాము. వారి ఆనందానికి అవధులు లేవు. అందరికీ, చీరలు, పంచెలు, దుప్పట్లు, తువాళ్ళు, ఆడవారికి పెటీ కోట్స్, ఒక చిన్న బాబుకు బట్టలు తీసుకుని వెళ్ళాము. వారు చదువుకోవటానికి కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాము. ఇవన్నీ మన స్నేహితులు, హితులు వారికి అందజేశారు. మాలతక్క, భానక్క, సుజలక్క, సుజాత, ఉమక్క, పింగళి బాలాదేవి గారు, వడ్లమాని బాలామూర్తి గారు, జొన్నలగడ్డ ఇందిర గారు, మధు అద్దంకి (మాధవి), సుగుణ బొలిశెట్టి గారలు స్పాన్సర్ చేసారు. (ఇంకెవరి పేర్లయినా మరచి ఉంటే క్షంతవ్యను).
కృష్ణ సదనంలో ఉండే వారు ఎవ్వరూ కాలాన్ని వృధా చేయరు. చక్కగా పోటీలు పడి మరీ పూల మొక్కలు పెంచుతున్నారు. తోటమాలి ఉన్నా సరే, వీరు మొక్కలకు నీరు పెట్టటంలో పోటీ పడతారట…
1
తరువాత భానక్క బహుమతులను విజేతలకు అందజేసారు. వారు వ్రాసిన పుస్తకాలు, అందమైన మనీ పర్స్ లూ వారికి అందజేశారు. ఎంతో ఆనందంగా వారు తీసుకోవటం జరిగింది.
తరువాత ఇదిగో ఈ క్రింద కనబడుతోన్న గ్రూప్ ఫోటో తీసుకున్నాము. మళ్ళీ అందరినీ పలుకరించి, వారు ఎంతో ఆప్యాయంగా అందించిన తేనీరు సేవించి, ఇంటి ముఖం పట్టాము.
సెలవు వస్తే ఇలా సార్థకం చేసుకుంటే ఎంత బాగుంటుంది? అందుకే, ప్రతీ మూడు నెలలకి ఓ సారైనా కృష్ణ సదనాన్ని దర్శించి, అక్కడి వారితో ఒక రోజంతా గడపాలని దృఢ నిశ్చయం చేసుకున్నాం మేము.
ఇదీ మా (పా)వన భోజనాల కార్యక్రమ వివరాల కథ… మీకు నచ్చిందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *