May 7, 2024

మనోగతం – వ్యక్తిబాగుంటేనే సమాజం బాగుంటుంది….

Rajeswari-1 Rajeswari-2                                       డా. శ్రీసత్య గౌతమి

 

అమ్మాయిలకు పెద్ద చదువెందులకు, భర్తనెదిరించడానికా? ఆమెకి ఆర్ధిక స్వాతంత్ర్యమెందుకు… అత్తవారికుటుంబానికి అడుగులకుమడుగొలొత్తకుండా తప్పించుకోవడానికా? సంసారాల్లో వచ్చే సర్దుబాట్లు కేవలం ఇంటికివచ్చే కోడలికే పరిమి తం గానీ ఆమె ఇష్టాయిష్టాలకు సర్దుకోవలసిన అవసరం మిగితావారికిలేదు, అవన్నీపాటిస్తే ఆమె మీద పెద్దరికం ఎలా నిలుస్తుంది? అలా నిలవాలంటే ఆమెకి చదువుండకూడదు, ఆర్ధిక స్వాతంత్ర్యముండకూడదు. అలా అయిన నాడే ఇంటిల్లపాదికీ సుఖసౌఖ్యాలు ఆమె చూడగలదు. ఆమె భర్తని ఎన్నో వందలు, వేలు, లక్షలు, కోట్లు పెట్టి చదివించాం. ఆమేంచేసిందని కాలు మీద కాలేసుకొని అతని సంపాదన తినడానికి? అతని సంపాదన మా అందరికీ, మేము పెట్టిన ఖర్చుల బాకీ ఆమెకి… అనుకునేటువంటి ఒక సమాజం కూడా దాగి వుంది మన పెద్ద సమాజం లో. అలాగే ఒక్కసారి ఆర్ధిక స్వాతంత్ర్యము వచ్చేక స్వాభిమానం, అభిజాత్యం ఎక్కువపాలై మేమెందుకు సర్దుకొని బ్రతకాలి అన్న ధోరణులు కూడా అమ్మాయిల్లో తలెత్తుతున్నాయి. ఈ రెండు విపరీత ధోరణులకు కారణము మనిషిలో మనోవికాసము లోపిం చడమే. ఈ రెండుధోరణులకు భిన్నం గా మరొక ధోరణిని నేటి ఆధునిక మహిళ అలవరచుకొని మనోవికాసంతో బంగారు బాట వెయ్యగలిగితే ప్రతి ఊరూ, ప్రతివాడా బంగారమే. దీంట్లో పురుషుడు కూడా సమతుల్యమైన భాగమే సుమీ!

 

విద్య, ఉద్యోగం, ఆర్ధిక స్వాతంత్ర్యము ఆధునిక స్త్రీని బాధ్యతాయుతం గా తీర్చిదిద్దాలని చెబుతూ, సామాజిక సేవలో శాంతిని పొందుతూ తన ఆశయాలను, తన మనోగతం నుండి భావాలను మనముందు ఉంచుతున్నారు శ్రీమతి రాజేశ్వరి గారు… ….

 

నా  పేరు రాజేశ్వరి.  నేను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్ ష్యూరెన్స్ కార్పొరేషన్ లో విశాఖపట్నం బ్రేంచ్ కి డిప్యూటీ డైరక్టర్ గా  పని చేస్తున్నాను.  నాది చాలా సామాన్యమైన జీవితం. నలుగురు అమ్మాయిలలో మూడో అమ్మాయిగా మధ్యతరగతి కుటుంబం  లో పుట్టిన నేను చిన్నప్పటినుంచి పరిస్థితులను అర్ధం చేసుకుంటూ బాధ్యతాయుతంగా పెరిగాను. మా నాన్నగారు కానిస్టేబుల్ అయినా, పెద్దగా చదువుకోకపోయినా మాకు మాత్రం మంచి చదువులు చెప్పించాలని నిర్ణయిం చుకుని తన శక్తికి మించి కష్టపడ్డారు. స్త్రీ విద్య మీద సరైన అవగాహన లేని ఆ రోజుల్లో మా నాన్నగారు ఆడపిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా సమాజంలో ధైర్యంగా బ్రతకాలని, దానికి చదువే సరి అయిన మార్గమని నమ్మి మమ్మల్ని ఆ విధంగా నే చైతన్యపరచి అత్యంత క్రమశిక్షణతో పెంచారు.  మేం ఎవరికీ చేయి చాచకుండా నిజాయితితో విలువలతో బ్రతకాలని ఆశించి, తను అలాగే బ్రతికి, తన జీవన విధానాన్నే మా నడవడికగా నేర్పించిన మా నాన్నగారి ఋణం ఎప్పటికి  తీర్చుకోలేం. మా అమ్మ ఏమీ చదువుకోకపోయినా మా చదువులకు ఆటంకం కలగకూడదని అన్ని పనులు అత్యంత సహనంతో చేసేది. వారిద్దరి తపనను అర్థం చేసుకుంటూ బాగా చదువుకుని మేం నలుగురం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లో స్థిరపడ్డాము. ఆర్ధికంగా మా నాన్నగారి భారాన్ని కొంచెం అయినా తగ్గించాలని పదవతరగతి నుంచి ట్యూషన్లు చెప్తూ కాంపిటీటివ్ పరీక్షలకు చదివే వాళ్ళము. క్రమశిక్షణ, నిజాయితి, విలువలు మాత్రం ఎప్పుడు వీడలేదు. మా నాన్నగారి  మరియు మా ఆశయాలకు అనుగుణంగా మేం నలుగురం కట్నాలు ఇవ్వకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నాం. మా తల్లిదoడ్రులు చేసిన పుణ్యం వలన మా ఆశయాలను అర్ధం చేసుకున్నవాళ్ళకి అల్లుళ్ళుగా దొరికారు.

 

నా విషయానికి వస్తే నేను ట్రిపుల్ ఎం.ఏ. ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి సోషియాలజీ మరొకటి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లనుండి ఉత్తీర్ణత పొందాను. మొదటి డిగ్రీ చేస్తుండగానే ఉద్యోగమొచ్చింది. నా భర్త పేరు చంద్రశేఖర్. మా వైవాహిక జీవితాన్ని మా ఉద్యోగాలే ఆలంబనగా జీరో తో స్టార్ట్ చేసాం.   తను ప్రైవేటు ఉద్యోగం లో ఉంటూ తన శక్తి సామర్ధ్యాలతో అకు౦ఠిత దీక్షతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శ్రమే పెట్టుబడిగా ఈరోజు తను పని చేసే ఆర్గనైజేషన్  లోనే పార్టనర్ గా ఎదిగారు. దాని కోసం వ్యక్తిగతoగా చాలా త్యాగాలు చేశాం. మాకు ఒక పాప. పేరు సంహిత.

 

ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలలో మేం ఎంతో స౦తోషంగా ఉన్నాము. మా వంతుగా సమాజానికి ఏమైనా చెయ్యాలనే తలంపుతో మా దగ్గరలో ఉన్న అనాధాశ్రయములో ఒక పాపకు చదువు చెప్పిస్తున్నాం. ఆ పాప చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతను తీసుకున్నాం. ‘ఆసరా’ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో లైఫ్ టైం మెంబెర్ గా ఉన్నాను. పేద విద్యార్థులు  చదువుకోవడాని ఆర్ధిక సహాయం చేసే సంస్థ అది. మాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ అనాధాశ్రమం లో జరుపుకుంటాము. ఇది మా నాన్నగారు నేర్పించిన అలవాటు. మా పాప స్కూల్ లో ఎలాంటి సామజిక కార్యక్రమం జరిగినా తను పాల్గొనేలా ప్రోత్సహిస్తాం. విజయవాడలో ‘ఆపిల్’ అనే అనాధాశ్రమం లో కూడా మెంబెర్గా వున్నాను. మేం మెంబెర్స్ గా ఉన్న మరియు మాకు తెల్సిన ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఏ సహాయం కోరినా అందుబాటులో ఉంటూ తగిన విధంగా సహాయం చేస్తాం. మా దగ్గర పనిచేసే వాళ్ళకు ఏ సహాయం కావలసినా చేస్తాం కాని అది సహాయం అని ఎప్పుడు అనుకోము.  మాకు ఉన్నదాంట్లోనే కొంత అవసరమైన చోట విరాళాలిస్తుంటాము.

 

వ్యక్తి బాగుంటేనే సమాజం బాగుంటుందని నమ్మే నేను వ్యక్తిగతంగా నిజాయితిగా ఉంటూ, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ  మన చుట్టూ ఉండే సమాజం మరింత బాగా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. నాది గంభీరతత్వం కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఆనందం గా వుండడానికే ప్రయత్నాలు చేస్తుంటాను.  బుక్ రీడింగ్ మరియు ప్రదేశాలు చూడడం నా హాబీలు. ఆంథ్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్టు. నాలుగు గోడల మధ్య నేర్చుకునేది మాత్రమే ఎడ్యుకేషన్ కాదు అని బలంగా నమ్మే నేను మా పాపను అనేక ప్రదేశాలు తిప్పుతూ ఉంటాను. మా నాన్నగారు మాకు నేర్పించిన విలువలు మా పాపకు నేను నేర్పించగలగడమే నా ముందు ఉన్న ఏకైక లక్ష్యం. మన ఇల్లు, మన ఆఫీస్, మన సమాజం మన తర్వాత తరంలో మరింత బాగుండాలని, దాని కోసం మనం నిరంతరం శ్రమిస్తూ  సానుకూల దృక్పథంతో ముందుకు సాగిపోవడమే జీవితం అని నా నమ్మకం.

17 thoughts on “మనోగతం – వ్యక్తిబాగుంటేనే సమాజం బాగుంటుంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *