May 7, 2024

“అగ్గి పెట్టెలో ఆరు గజాలు” – పుస్తక సమీక్ష

సమీక్ష: పుష్యమి సాగర్ 

నేత పని చేసే వాళ్ళ బ్రతుకు చిత్రమే ఈ “అగ్గి పెట్టెలో ఆరు గజాలు”.  ఒక చిన్న అగ్గి పెట్టెలో ఆరు గజాల చీరని ఇమిడ్చిన కళా నైపుణ్యం ఎలా అబ్బిందీ, అందుకు వారు చేసిన కృషి ఏమిటీ మొదలైన విషయాలతో వస్త్రాల వెనుక వెలిసిపోయిన జీవితాల గురించి ఆకట్టుకునే కధనంతో రచయిత్రి మంధా భానుమతి గారు ఆసాంతం చదివింపజేశారు. మనిషికి కూడు, గుడ్డ, నివాసం కనీస అవసరాలు. మనం ధరించే వస్త్రాల తయారి, పద్మశాలీలు వస్త్రాన్నినేసే నైపుణ్యత మీదే ఆధారపడి వుంది. అసలు పద్మశాలీలు ఎవరు, వారి వంశ చరిత్రేమిటి ఇత్యాది అంశాలను ఈ పుస్తకములో చక్కగా పొందుపరిచారు. ఉపోద్గాతంలో చెప్పినట్టుగా పద్మశాలీలకు కులదైవం అయిన “భావనారాయణుడు” సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు అవతారం అని వివరించారు. వీరే భావనాఋషిగా పిలవబడ్డారు. మానవాళికీ, దేవతలకు మానరక్షకుడిగా మన్ననలు అందుకున్న భావనాఋషి, మార్కండేయుడు పుత్ర కామేష్టి యాగం చెయ్యగా అగ్నిలోంచి ఉద్బవించాడనీ, అతడు తన శరీర భాగాలనుంచి వస్త్రం తయారు చేసే పరికరం మగ్గాన్నితయారుచేశాడని వస్త్రకారుల నమ్మకంగా ఇతిహాసం చెబుతోంది.

 

వస్త్ర తయారీకి మిగతా పనిముట్లు ఎలా ఉద్భవించాయో కూడా సూక్ష్మంగా చర్చించారు. భావనారాయణుడి చేతులనుండి చట్రమును పట్టి ఉంచే “నిలువు రాట”, వక్షస్థలం నుంచి “అడ్డ కర్రలు”, కాళ్ళ నుంచి “ఆని” (కాళ్ళతో తొక్కేది) వచ్చేయని చెప్పారు. విష్ణు నాభి నుంచి ఉద్భవించిన పద్మకాండం నుండి దారాలు తీసి మార్కండేయుడు తన మోకాళ్ళని చుట్టి దారపు కండె తయారు చెయ్యగా, బ్రహ్మ ఇచ్చిన శాంభవి మంత్రం (నేత విధానం తెలిపేది) చదువుతూ భావనారాయణుడు ధవళ వస్త్రం తయారు చేసాడు. తను తయారు చేసిన వస్త్రాన్ని అందరికి ఇచ్చి, రుద్రుడికి ఇవ్వకుండా ఊరుకున్నప్పుడు, రుద్రుడు తనకి ఇవ్వలేదని అలుగుతాడుట. అలక ఎలా తీర్చాలి అని అడిగితే, శివుడు తనకు పులిచర్మం తీసుకు వస్తే ధరిస్తాను అన్నాడుట. సూర్యదేవుడు, ఛాయాదేవిల పుత్రిక అయిన భద్రావతి దగ్గర పులులు ఉండటంతో భావ నారాయణుడు భద్రావతి దగ్గరికి వెళ్లి పులి చర్మాన్ని కోరతాడు. అయితే దానికి తనని వివాహమాడాలని షరతును విధిస్తుంది. అలా భావనారాయణుడు మరియు భద్రావతి దంపతులకు నూటొక్కమంది ఋషులు పుత్రులుగా జన్మిస్తారు. ఆ ఋషుల సంతతే “పద్మశాలీలు” అని ఆ తెగ వారి నమ్మకం .

 

పద్మకాండం నుంచి వచ్చిన దారంతో నేసిన వస్త్రం తయారుచేసిన భావనా ఋషి సంతతికి  “పద్మ” అని పేరు, సాలెపురుగు అల్లినట్టు గా బట్ట నేస్తారు కనుక “సాలీ” అని వచ్చిందంటారు.  కాలక్రమంలో పద్మసాలీ కాస్త “పద్మశాలి”గా పిలవబడ్డారు. వారి గోత్రాలు మూల పురుషులు అయిన ఆ ఋషుల పేర్లే. ఇది ఇతిహాసం వెలువరించిన పద్మశాలి  వంశ పుట్టుక.  ఆ తరువాత జరిగిన క్రమాన్ని వివరిస్తూ 17వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం దాకా జరిగిన ఘటనలని వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. 16వ శతాబ్దంలో జహానార రాకుమారిని అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన మేలి ముసుగు చేసిన ఖాన్ సాబ్ పనితనాన్ని గొప్పగా వర్ణిస్తారు. 17వ శతాబ్దం అంతా కూడా చేనేత వస్త్రకారులకీ, వారి ప్రతిభకీ పట్టం కట్టిన స్వర్ణయుగమట. అక్బర్ కాలం నుండి వంగ, కాశ్మీర్, మణిపూరు వంటి రాష్ట్రములకు చేనేత వస్త్రాలు, రగ్గులు, పరదాలు, తివాచీలు ఎగుమతి అయ్యేవి. ప్రపంచం లో నలుమూలలకు మన నేత వస్త్రాలు ఎగుమతి చేసేవారని తెలిసినప్పుడు ఔరా అని అనిపించక మానదు. అంత అద్భుతమైన ఉన్నతిని చూసిన నేతకారులకు 18 నుంచి 19 వ శతాబ్దం వరకు చీకటి యుగం అని వివరిస్తూ బ్రిటిష్ వారు ధ్వంసం చేసిన నేత కార్మికుల జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు.

 

భారతదేశాన్ని వశపరుచుకోవాలి అంటే ముందుగా అక్కడి కులవృత్తులను ద్వంసం చేస్తే చచ్చినట్టు బానిసలుగా పడి ఉంటారన్న రాబర్ట్ క్లైవ్ దురాలోచన చూసినప్పుడు అయ్యో అనిపించక మానదు. అప్పట్లో నేత పనివారి బొటన వ్రేళ్ళని కత్తిరించి, నేత పనికి పనికి రాకుండా చేసే  క్రూర విధానాన్ని తలచుకుంటే ఆవేశం రాక మానదు. 18 వ శతాబ్దం లో బ్రిటిష్ వాళ్ళు సాగించిన దుర్మార్గాలు 20 వ శతాబ్దం వరకు కొనసాగాయి. మరల ఇంగ్లాడు మిల్లు వస్త్రాలే గతి అయ్యాయి.  స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చెయ్యాలని సంకల్పించి వంగ దేశంలో ఒక తంతి (వంగ దేశంలో నేత కార్మికులని తంతి అని పిలుస్తారు) సన్నని  మస్లిన్ బట్టతో ఆరు నెలలు శ్రమించి ఆరు గజాల చీరని నేసి దానిని అగ్గి పెట్టెలో పెట్టి విక్టోరియా రాణికి కానుకగా పంపాడు. దాన్ని చూసిన తరువాత అయిన మన నైపుణ్యాన్ని గుర్తించి జీవనాధారాన్ని చూపిస్తారని ఆశ పడతాడు.  దానికి ప్రతిఫలం గా అతనికి చరిత్ర పుటల్లో గుర్తింపు మాత్రమే దక్కింది కాని పేదరికాన్ని మాత్రం తీర్చలేకపోయింది. గాంధీ గారు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాక ఖాదీ బట్టలను నేయడం, అవే వేసుకోవడం మూలాన చాలా వరకు ఇంగ్లాండులోని బట్టల మిల్లులు మూత పడ్డాయి. ఇక 1946 నుంచి 2013 వరకూ కూడా చాలా మార్పులు వచ్చాయి అంటూ ఆ మార్పులని వివరించిన తీరు ఆకట్టుకొంటుంది. ఇతిహాసం, చరిత్ర కు సంబందించిన వాటిలో పద్మశాలీల ప్రస్తావన గుర్తు చేసుకోవడం అవసరమే.

 

ఇక ఈ నవలలో ప్రతి పాత్ర మనల్ని ఆలోచింపజేస్తుంది. శ్రీలంక గ్రామంలో నేత కార్మికుల కష్టాలని చదువుతున్నప్పుడు కన్నీళ్ళు రాక మానవు. యజమాని అంటే కేవలం అజమాయిషీ చేసే వాడే కాదు తన కింద పని చేసే కార్మికుల బాగోగులు చూసేవాడు కూడా.  సోమరాజు తన షాప్ లో పని చేసే ప్రతి ఒక్కరిని పట్టించుకోవడం, వరసగా వర్షాలు పడి మూడు రోజులు బేరాలు లేక, డబ్బులు రాక,  ఆకలితో అలమటిస్తుంటే తన ఇంటి దగ్గరనుంచి అందరికి అన్నం తెప్పించి పెట్టడం…అతని ఔదార్యానికి మచ్చుతునుక.  శ్రీలంక గ్రామంలో ఆడవారు లడ్జీ  (నూలు దారాల కట్టలు) నుంచి బాసిన్ (కండెలు) నేస్తారని లంక జీవన ముఖ చిత్రాన్ని చక్కగా వివరించారు. అల్లరి చిల్లరిగా తిరిగే సోమరాజు కొడుకు భద్రాన్ని లక్ష్మి ఎలా మార్చగలిగింది? పెద్ద చదువులు చదివి డాక్టర్ లు అయిన జగన్, జెన్నిఫర్ లు శ్రీలంక గ్రామాన్ని దత్తత తీసుకొని ఎలా బాగుపరిచారు? అనే విషయాలని చదువుతున్నప్పుడు నిజంగా ఇలాంటివారు మన చుట్టూ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా! వీర్రాజు కుటుంబం పేదవాళ్ళు అయినా ఆత్మాభిమానం తో అందరి మన్ననలు అందుకోవడం, లక్ష్మి చదువుకి సహకరించడం వంటి సంఘటనలను చదివినప్పుడు ఇంకా గ్రామాల్లో అభిమానం, ఆప్యాయత బ్రతికే ఉన్నాయి అనిపిస్తుంది. ఇక కధానాయకుడు భద్రం మొదట్లో లక్ష్యం లేకుండా తిరిగినా కూడా లక్ష్మి ని చూసాక ఇష్టపడటం  అయితే తనకి నచ్చేవిధంగా ఎలా మలచుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటే భద్రం తమ్ముడు దేవ్ సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు కొడుకులో వచ్చిన మార్పును చూసి మురిసిపోతాడు భద్రం తండ్రి.  ఇంకోవైపు నుంచి లక్ష్మి పేదరికం కారణంగా పదో తరగతి వరకు చదివి ఆపేస్తుంది. తల్లి రావమ్మ తనకు చీరలు నేయడంలో సహకరించమని పోరు పెడ్తుంది కానీ లక్ష్మికి చదువుకోవాలన్న తపనని మాత్రం వదులుకోదు. ఇది చదువు పట్ల, చదివిన తరువాత వచ్చే ఫలాల పట్ల అమెకి ఉన్న ఆశ అనుకోవచ్చు.  జిల్లాకి ఫస్ట్ వచ్చిన లక్ష్మి చదువు ఆగిపోవడం ఇష్టం లేని వీర్రాజు రావమ్మని ఓప్పించి ఇంటర్ లో చేర్పించడం, అటు నుంచి టెక్స్ టైల్ మేనేజ్ మెంట్ లో పట్టా కోసం కావాల్సిన డబ్బులని సమకూర్చుకొని ఢిల్లీలో సీట్ సంపాదించడం, ఈ ప్రక్రియలో భద్రం తమ్ముడు దేవ్ సహకరించడంవంటివి చక చకా సాగిపోతాయి. మరో వైపు లక్ష్మి ప్రేమని పొందడానికి ముంబై వెళ్లి అక్కడ విఫలం అయినా కూడా తమిళనాడులో సీట్ సంపాదించి మూడేళ్ళ డిప్లొమా కోర్స్ ని పూర్తి చేసుకొని ప్రయోజకుడై భద్రం తిరిగి వస్తాడు. ఆ తరువాత “స్టేట్ మాస్టర్ వీవర్స్ అసోసియేషన్” సంస్థలో  చురుకుగా పాల్గొంటూ చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ అందరి సలహాలు తీసుకొని ముందుకు సాగుతుంటాడు.  ఆల్ ఇండియా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ లో అందరిని పాల్గొనేలా చేసి కార్యక్రమాలని విజయవంతం చేస్తాడు. ఇక లక్ష్మి చదువులో వదిన ఉమ పాత్రని తక్కువగా చూడలేము. భద్రం పై ప్రేమని వ్యక్తపరిచే తీరులో లక్ష్మికి ఎన్నోరకాలుగా సహాయపడింది. భద్రం పాత్రని చిత్రకరించిన తీరు బాగుంది. వారి సహోద్యోగులు అయిన బాల మురుగన్, ప్రభాకరన్, మగ్గం బందువులు అయిన వీర్రాజు, సోమరాజు, బైర్రాజు, గోపి తదితరులు అబివృద్ధిలోకి రావడానికి మాస్టర్ వీవర్స్ ఎలా ఉపయోగపడిందీ చక్కగా చిత్రీకరించారు.

 

బెనారస్ లో ఉగ్రవాదులు జరిపిన ప్రేలుళ్ళు అక్కడి జీవితాలని ఎలా చిద్రం చేసాయి, ఖాన్ సాబ్, పుల్లు మియా ఇంకా నేత కార్మికులు కుల, మతాలకి అతీతంగా ఎలా సంఘటితం అయి అలాంటి స్థితిని ఎలా ఎదుర్కొన్నారు, దేశవ్యాప్తంగా నేత పనిగాళ్ళనీ, చేనేత కార్మికులనీ బాగు పరిచేందుకు భద్రం, వీర్రాజు, ఎలాంటి ప్రణాలికలను వేసారు? అప్పులు కట్ట లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలి అని  భద్రం, లక్ష్మిలు  జాతీయ స్థాయి సమాఖ్య దృష్టి కి తీసుకువెళ్తారు. చేనేత కార్మికుల సమస్యల కి జాతీయ సమాఖ్య ద్వారా పరిష్కార మార్గాన్ని సూచించారు రచయిత్రి గారు. ఆంధ్రప్రదేశ్ లో సిరిసిల్ల నుంచి బెనారస్ దగ్గరున్న గ్రామాల వరకూ, గుజరాత్ లో కచ్, ఇంకా అక్కడ ఇక్కడని కాదు అన్ని చోట్ల పెరిగిన ఆత్మ హత్యల గురించి విచార పడతారు. వంద సంవత్సరాల క్రితం ఒక స్త్రీ రెండు చీరలతో కాలక్షేపం చేస్తే, 50 ఏళ్ళ తరువాత అది పది కి పెరిగింది. ఇప్పుడు ఒక స్త్రీకి కనీసం పాతిక చీరలైనా ఉంటాయి అయినా చేనేత కార్మికుల్లో వెలుగు ఎందుకు నిండటం లేదు అన్న వాళ్ళ ప్రశ్నలని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే.

 

పాతాళం నుండి పైకి ఎగసి, టెక్స్ టైల్ పరిశ్రమలో డిగ్రీని పొంది, చేనేత పద్ధతుల పై పరిశోధన చేసి పేటెంట్లు పొందిన లక్ష్మి చేనేత కుటుంబాల్లో వెలిసిన ద్రువతారగా మనకి దర్శనమిస్తుంది. లక్ష్మి, దేవ్, మీనా, గోపిలాంటి యువత… అవరోధాలను అవకాశాలుగా మార్చుకొని ప్రగతిపధంలో పయనించడం ఆశావాదానికి సూచిక. సాటివారికి చేయూత నిచ్చే మంచిమనసున్నవారు ఎందరో ఈ నవలలో పాత్రలుగా మనకి కనిపిస్తారు. కుల వృత్తి కూడు పెట్టక, ఉపాధి అవకాశాలు లేక, ఎందరో చేనేత కార్మికులు ఆకలికి అలమటిస్తూ, అప్పుల్లో కూరుకుపోయి చివరికి ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యవస్థ ని మార్చాలని వాటి కోసం చక్కటి ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకు వెళ్ళాలని భద్రం, లక్ష్మి ల ద్వారా జాతీయ స్థాయి సమాఖ్య దృష్టి కి తీసుకు వెళ్లి సమస్యలను పరిష్కరించే మార్గం సూచించారు రచయిత్రి గారు. భద్రం, సోమరాజు, వీర్రాజు, లక్ష్మి, తదితరులు  “ఆల్ ఇండియా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్” లో చురుకు గా పాల్గొంటూ చేనేత పరిశ్రమ పురోభివృద్ధికి పూనుకుంటారు. పద్మశాలి వంశప్రారంభం, దేవాంగ, పట్టుశాలీ, శివంగి మొదలైన తెగలు, వారి పనిముట్లు, వాటి ఉపయోగం, అవి పనిచేసే తీరు, వారి సమస్యలు, పరిష్కార మార్గాలు మొదలైన అంశాలన్నీ పడుగు పేకల్లా అగ్గిపెట్టెలో ఆరు గజాలు నవలలో చక్కగా కుదిరాయి.

 

చివరికి భద్రానికీ, లక్ష్మికీ కళ్యాణం జరగటం, ఇంతింతై వటుడింతై అన్నట్టు గా వ్యాపారాన్ని విస్తరించి అందరి మన్నలు పొందుతూ “పద్మశ్రీ” లను దంపతులు అందుకోవడం దేవ్, బైర్రాజు, రామరాజు, వీర్రాజు ఇంకా అనేకులు సంతోషంగా చేనేత వ్యాపారుల బ్రతుకుల్లో వెలుగు నింపడానికి కృషి చెయ్యడంతో ఈ నవల ముగుస్తుంది.

 

చేనేత కార్మికుల సమస్యల పై వచ్చిన కధలు, నవలలు తక్కువే అయిన కూడా అందులో ఎన్నదగినదీ మొదటి వరుసలో వుండేదీ ఈ “అగ్గిపెట్టె లో ఆరు గజాలు” అని చెప్పవచ్చు. భానుమతి గారు నవల కోసం పద్మశాలి ల జీవితాన్ని దగ్గరగా పరిశీలించి రచన చెయ్యడం గొప్పగా ఉన్నది. ఇలాంటి మంచి పుస్తకం రావడం ఎందరికో స్పూర్తిదాయకం. వారు మరిన్ని సమస్యల పైన  పుస్తకాలు వెలువరించాలని నా అభిమతం.  చక్కని పుస్తకాన్ని పబ్లిష్ చేసి పాఠకుల కి అందించిన ‘జె.వి.పబ్లికేషన్స్” వారికి అబినందనలు. వారి నుంచి మరిన్నిమంచి పుస్తకాలను ఆశిస్తున్నాము.

 

అగ్గిపెట్టెలో ఆరు గజాలు

రచయిత్రి : మంథా భానుమతి

ధర: రూ. 150

అన్ని ప్రముఖ పుస్తక షాపులలో లభ్యం.

www.kinige.com

 

 

 

 

1 thought on ““అగ్గి పెట్టెలో ఆరు గజాలు” – పుస్తక సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *