May 3, 2024

యాత్రా మాలిక: భోపాల్

                                         వెంకట్ యస్. అద్దంకి

 

క్రొత్త క్రొత్త ప్రదేశాలకి వెళ్ళాలన్నా క్రొత్త క్రొత్త మనుషులని కలవాలన్నా ఉత్సాహం దానంతట అదే పుట్టుకొస్తుంది. క్రొత్త ప్రదేశాలలో అలా ఎంత దూరం నడిచినా కాళ్ళు నొప్పులుపుట్టవు. నాకు చిన్నప్పటినుండి అదే సరదా. అలా తిరిగిన మొట్టమొదట ప్రదేశం షిరిడి. పెళ్లయ్యాక ఫామిలీ తో తిరుగుదామనుకున్నా ఎప్పటికప్పుడు ఏవో ఆటంకాలు, శలవులు కుదరక, ఇంకా ఇలాంటి కారణాలే. అలా పెళ్లయిన పన్నెండేళ్లకి కుదిరిన అవకాశం 2012 దీపావళికి. ఉద్యోగ రీత్యా భోపాల్ రావడం, శలవలకి ఫామిలీ అక్కడకి రావడంతో భోపాల్ చుట్టుపక్కల ప్రదేశాలతో “పచ్ మరి” హిల్ ష్టేషన్ లో 3 రోజులు ఉండడం జరిగింది. బయలుదేరిన దగ్గర నుండి ఆద్యంతం ఉత్సాహమే పిల్లలకి మంచి సరదా. నవంబర్ నెల ప్రారంభం కాబట్టి మరీ అంత చలి పెరగ లేదుగానీ జీరో డిగ్రీలు నమోదయ్యే ప్రాంతం “పచ్ మరి”. భోపాల్ కి 190 కిలోమీటర్ల దూరంలో భోపాల్ కి జబల్పూర్ కి మధ్యన ఉన్న రమణీయ పర్యాటకప్రదేశం ఈ “పచ్ మరి”. ఇక్కడకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ పిపరియ. ఇక్కడనుండే ఘాట్ రోడ్ మొదలవుతుంది. ఈ ఘాట్ రోడ్ మీదకూడా ప్రయాణం తెల్లవారుఝామున అయితే కొన్ని వన్యప్రాణులని చూసే అవకాశం మనకి దక్కుతుంది. “సత్పురా” అడవుల మధ్యప్రదేశం ఈ హిల్ స్టేషన్.

 

చిన్న వాడికి రెండేళ్ళ వయసుకూడాలేదు. కాబట్టి వాడికి అంత వూహ తెలియదు. పెద్దవాడికి ఒక ఎడ్యుకేషనల్ టూర్ గా కూడా ఉపయోగపడింది. ముఖ్యంగా అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఒక పది దాకా ఉంటాయి. ఆ కొండల్లో గుట్టల్లో తిరగాలంటే 4X4 వీల్ డ్రైవ్ ఉన్న వాహనమయితే సరిగ్గా ఉంటుంది లేదంటే అక్కడ జిప్సీలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇంక తిరగడం అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. నడకా ఎక్కువే కొన్నిచోట్ల దాదాపు రెండు కిలోమీటర్లు వరకు దిగి మళ్ళీ పైకి ఎక్కాలి.

 

మొట్ట మొదట ప్రదేశం “పాండవా కేవ్స్”. ఇక్కడ పాండవులు అరణ్యవాస సమయంలో విడిది చేసారని చెబుతారు.  ఇక్కడ ఉన్న ఉద్యానవనం కూడా ఎంతో బాగా తీర్చిదిద్దారు. ఫోటోగ్రఫి మీద మక్కువ ఉన్నవారికి ఫోటోలు దిగాలనుకున్నవారికి మంచి గా ఉపయోగపడే ప్రదేశం. రక రకాల పుష్పాల తో విరజిల్లుతూ ఉంటుంది ఈ ఉద్యానవనం. ఇక్కడ ఒకరొకరంగా అందరం గుర్రపు స్వారీ కూడా చేసాము. అక్కడినుండి బయలుదేరి బైసన్ మ్యూజియం కి వెళ్ళాము, ఒక మంచి విజ్ఞాన కేంద్రం. ఈ కాలం పిల్లలకి తెలియని పనిముట్లూ, పాతకాలం మనుషుల రూపాలతో ఇక్కడి శిల్ప సంపద చూడ చక్కగా మన గతాన్ని గుర్తుచేస్తున్నట్లు ఉంటుంది. సత్పురా అడవుల విశిష్టతని తెలిపే మ్యూజియం ఇది. తప్పక చూడవలసిన ప్రదేశం. అక్కడినుండి మొదలయ్యి మిగిలిన ప్రదేశాలు చూడడానికి వెళ్లాము. రోజుకి మూడు నాలుగు ప్రదేశాలు చూసేసరికి చుక్కలు కనపడ్డాయి. అంటే మరీ అంత గాభరాపడవలసిన పనిలేదు. చిన్నవాడిని భుజాన వేసుకుని తిరగడంవల్లా గానీ మాములుగా కాదు.

 

పాండవా కేవ్స్:

పాండవా కేవ్స్

 

 

ఉద్యానవనం-పాండవా కేవ్స్:

ఉద్యానవనం-పాండవా కేవ్స్

 

 

ఇక ప్రదేశాల విషయంలోకి వస్తే “జటా శంకర్” ఆలయం-ఇది సన్నటి గుహలోకి తలలువంచుకుని వెళ్ళాలి. సరిగ్గా నడవకపోయామా రాళ్ళు శరీరాన్ని గీతలు గీసి వదిలిపెడతాయి. అలా లోపలకి వెళ్లడం ఒక మంచి అనుభూతినిస్తుంది.

 

“మహదేవ్ మందిర్” గుహలో 365 రోజులు నీటి ప్రవాహం మధ్యలో ఉండే శివలింగం, మొసలి, తాబేలు ఆకారంలో ఉండే రాళ్ళు కొండలమధ్యలోనుండి కిందకి దిగడమనేది మనలని వేరే ప్రపంచంలోకి తీసుకుపోతాయి అనడంలో ఆశ్చర్యంలేదు. ఆ గుహలోకి వెళ్ళాలంటే కొండ దిగాలి. అలాగే మేము దిగాక ఆ ఇరుకైన గుహలోకి, గుహగోడలు పట్టుకొని జాగ్రత్తగా లోపలికెళ్ళినప్పుడు పలుచోట్ల శివలింగాలు కనబడ్డాయి. అవి చాలా సహజంగా అంటే వాటికవే పుట్టినట్లుంటాయి. కొన్ని శివలింగాలు శివుని జటాజూటం ముడివేసి ఉన్న శివుని ముఖాల్లా కనబడుతూ పక్కనే వున్న కొండలోని భాగాలయి వుంటాయి.

 

 

మహదేవ్ మందిర్:


 

 

 

 

 

మహదేవ్ మందిర్ గుహ ద్వారం:


 

 

ఇక రెండవరోజు, మూడవరోజు జలపాతాల వీక్షణం ఎంతో ఆన్నందాన్నిచ్చింది. అప్సరా ఫాల్స్ అని, బీ ఫాల్స్ అని, డచెస్ ఫాల్స్ అని, జమున ప్రపత్ ఫాల్స్ అని, దువాదార్ వాటర్ ఫాల్స్ ఇలా నాలుగైదు రకాల వాటర్ ఫాల్స్ సైట్స్ ఉన్నాయి. అన్నీ చూడదగినవే ఒకటి రెండు దూరం నుండి కనపడతాయిగానీ మిగిలినవన్నీ మనం దగ్గరగా వెళ్ళవచ్చు. చూడదగిన ప్రదేశాలు, ఈ ప్రాంతం చాలా హింది సినిమాలలో కనపడుతుంది. ఒకొక్కసారి హొటల్స్ అన్నీ ఈ సినీజనం బుక్ చేసుకోవడంవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

 

దువాదార్ వాటర్ ఫాల్స్:
దువాదార్ వాటర్ ఫాల్స్

 

అలాగే సూర్యోదయ, సూర్యాస్తమయ ప్రదేశాన్ని”ధూప్ఘర్” పేరుతో చెప్తారు. ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం రెండు చాలా బాగా ఉంటాయి. జీవితంలో ఒక్క సారైనా చూడదగిన ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడ అన్ని మొబైల్ నెట్ వర్క్స్ ఉండవండోయ్. ఇదీ ఒకందుకు మంచిదే అంతటి మంచి ప్రదేశాన్ని దర్శించేటప్పుడు రోజువారీ తలనెప్పులు కొంచం తగ్గుతాయికదా.

 

 

 

 

 

ఇక అలాగే మేము చూసిన ప్రదేశాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది “సాంచి”.  భోపాల్ కి 80 కిలోమీటర్ల దూరంలో విదీషా వెళ్ళే రోడ్ మీద ఉంటుంది. చక్కటి బౌద్ధ స్థూపాలు అంటే చక్కటి ప్రశాంతత ముచ్చట కలిగిస్తాయి. అశోకా స్థంభం పీకి పక్కన పెట్టారనుకోండి అదివేరే విషయం. ఇక్కడకి వెళ్ళడానికి ముందు రహదారి మీద ఒక దగ్గర “కర్క రేఖ” మార్గం పెయింట్ చేసి ఉంచారు. అదికూడా పిల్లలకి చూపించడానికి బాగుంటుంది.

 

సాంచి:

సాంచి

 

భోపాల్ కి 30 కిలోమీటర్ల దూరంలో “భీం భేటికా” అని ఒకప్పుడు మధ్యతరగతి మానవులు వేసిన పేయింటింగ్స్ రాక్ పెయింటింగ్స్ పేరుతో ప్రసిద్ధిగాంచిన గుహలు కనబడతాయి. అన్ని గుహలమీదా చాలా రకాల చిత్రాలు గీసారు. అవి అప్పటి వారి జీవనశైలిని తెలియపరుస్తాయి. ఇవికూడా చూడదగిన ప్రదేశాలు.

 

భీం భేటికా:

 

 

 

 

 

భోపాల్ కి దగ్గరలో ఉన్న భోజ్ పూర్ శివాలయం, ఎన్నోవేల సంవత్సరాల క్రితం భోజరాజు నిర్మించిన ఆలయం. ఈ ఆలయ నిర్మాణం చూడదగినది. ఒకవేళ ఎవరైనా పచ్ మరి కి వెడదామనుకుంటే వాళ్ళ ప్రణాలిక ఇంకొక మూడు నాలుగు రోజులు పెంచుకొని ఈ ప్రదేశాలు కూడా చూస్తే మరింత బాగుంటుంది. భోపాల్ కి దగ్గరలో ఉన్న మరొక పుణ్యక్షేత్రం ఉజ్జైన్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఓంకారేశ్వర్ కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంది.అలా అన్నీ కలిపి చూడదలచుకుంటే ఒక పది పదిహేనురోజులు ప్లాన్ చేసుకుంటే జబల్పూర్ కూడా చుసిరావచ్చు అలాగే దగ్గరలో ఉన్న టైగర్ రిజర్వ్స్ కూడా.అలాగే అతి పెద్ద మస్జిద్, అతి చిన్న మస్జిద్ రెండూ కూడా భోపాల్ లో ఉండడం విసేషం. సిటీ ఆఫ్ లేక్స్ గా ప్రసిద్ధిగాంచిన వూరు భోపాల్.

 

భోజ్ పూర్ శివాలయం:

 

భోజ్ పూర్ శివాలయం

 

కాబట్టి ఈ సారి మీ ఫామిలీ ట్రిప్ భోపాల్ గా ప్లాన్ చేసుకోంది. అంతర్జాలంతో వచ్చిన మార్పులవల్ల మరిన్ని విశేషాలు మీకు ఆన్లైన్ లోనే దొరుకుతాయి , అలాగే హొటల్ బుకింగ్స్ కూడా.

 

సూర్యాస్తమయం

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *