May 7, 2024

యాత్రామాలిక – విశాఖపట్నం

పుష్యమీ సాగర్

 

మన రెండు రాష్ట్రాలలో నేను ఎంతో ఇష్టపడే ప్రదేశాల్లో వైజాగ్ ఒకటి, చిన్నప్పటి నుండి వేసవి కాలం సెలవులు వచ్చినప్పుడు చూసేవాడిని. అయితే ఉరుకుల పరుగుల జీవితం లో అవన్నీ వెనకబడి పోయాయి…ఇదిగో మా కమల (శ్రీమతి) పుణ్యాన మరల ఆ అదృష్టం దక్కింది ఎందుకంటే మా శ్రీమతి పుట్టిన వూరు వైజాగ్ మరి. ప్రతి సంవత్సరం సంక్రాంతి కి వారి వూరు వెళ్ళడం ఆనవాయితి. ఈ సారి కూడా వెళ్దామని నిశ్చయించి రిజర్వేషన్ చేయించాము. అయితే మా దురదృష్టం మూడు నెలలు ముందు గా చేయించిన కూడా గోదావరి, విశాఖ, ఇంకా పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళలో ఖాళి లేనందున “జన్మ భూమి ” సూపర్ ఫాస్ట్ కి రాను పోను చేయించాను. సరే నేను జనవరి 11 కి రిజర్వేషన్ చేయించిన ప్రకారం ఉదయం 7: 10 సికిందర్ స్టేషన్ లో రైలు ఎక్కాము. పండగ సీజన్లో రైలు ప్రయాణం అంత నరకం వేరొకటి ఉండదేమో….పేరుకు రిజర్వేషన్ అయినా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం. బాత్రూం లో కూడా కిక్కిరిసి వున్నారు … ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణం లో నే గడిచిపోయింది. ఆ రైలు ఆగుతూ ఆగుతూ 7 40 చేరాల్సినది 10 గంటలకు చేర్చింది. తిట్టుకుంటూ ట్రైన్ దిగి ఆటో ఎక్కాము. ఆటో చార్జీలు హైదరాబాద్ కు ఏ మాత్రం తీసిపోవు (మా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 350 అడిగాడు బాప్ రే) మా శ్రీమతి వాళ్ళ ఇల్లు మధురవాడ లో రైల్వే స్టేషన్ నుంచి మరి ఒక 40 మినిట్స్ జర్నీ. ఎలాగోలా ఇంటికి చేరాము. భోజనం చేసి నిద్ర పోయాను.

 

మరుసటి రోజు ఉదయన్న్నే స్నానం టిఫిన్ లు కానిచ్చి నేను, కమల సింహాచలం అప్పన్న దర్శనానికి బయలు దేరాము. అదేం మహాత్యమో తెలియదు. కాని హైదరాబాద్ కి చాల దగ్గరలో వున్నా యాదగిరి గుట్ట (ఇక్కడ కూడా లార్డ్ నరసింహ) నే చూడటం అస్సలు వీలు పడదు. చూడటం కుదరదు కాని ఎక్కడో ఉన్న సింహాచల స్వామి దర్శనం మాత్రం అవుతుంది. ఉదయాన వెళ్ళడం మూలాన దర్శనం ప్రశాంతం గా జరిగింది. చుట్టూ కొండ కోనలు, ప్రకృతి సిద్ధం గా ఏర్పడ్డ రాళ్ళు, చెట్లు ఉదయపు సంధ్యరాగాలు వాహ్… చూడటం తప్ప చెప్పలనవి కాదు. మరల ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి విశ్రాంతి తీసుకున్నాము. ఇక ఆ సాయంత్రం ఏమో మధుర వాడ లో నే ఉంటున్నసాహితీ మిత్రులు అయిన వాని వెంకట్ గారి ఇంటికి వెళ్దామని బయలుదేరాము తీరా వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి తాళం కప్పు వెక్కిరించిది. వాచ్మెన్ గారిని అడిగితే ఉరు వెళ్లారు అని చ్పెపారు. సరే లే అని ఇంటి దారి పట్టాము.

 

ముఖ పుస్తక మిత్రులు అయిన మితిల్ కుమార్, పోర్షియా దేవి గారికి కాల్ చేసాను వారిది కూడా విజయనగరం, శ్రీకాకుళం అయితే వారు కూడా బిజీ అని చెప్పారు. పోర్షియా గారు కొన్ని ప్రదేశాలు చెప్పారు చుట్టూ పక్కల వున్నవి సరే విజయనగరం బయలుదేరాం. రెండు ప్రదేశాలను చూడటం జరిగింది  మొదట “రామ నారయణ ” ప్రదేశం ఇది సుమారు గా 10 ఎకరాల్లో మానవ నిర్మితం అయిన క్షేత్రం. అయితే దీని ప్రత్యేకత ఏంటి అంటారా….ఇది ఒక ఉపరితలం నుంచి చూస్తే “రామ బాణం” లా కనిపిస్తుంది బాణం ఆకారం లో నిర్మించారు. ఆ నిర్మాణం లో రామాయణ సంపూర్ణ దృశ్య మాలిక ని ఉంచారు. వాటిని తిలకించడానికి రెండు కళ్ళు చాలవు. నిజంగా మన కళ్ళ ముందే జరిగిందా అన్నంత గా ప్రాణం పోసి చెక్కారు వాటిని అద్భుతం. వీటి మధ్యలో సుమారు 50 అడుగుల ఆంజనేయ విగ్రహం చూపులను తిప్పుకోనీయదు. ఇంకా ఈ క్షేత్రం లో వేద పాఠశాల, గ్రంధాలయం, ఆధ్యాత్మిక ఉద్యానవనం, కాన్ఫరెన్స్ హాల్, భజన మందిరం, అనంత పద్మస్వామి ధ్యాన మందిరం, తోట, నివాసం, అత్యాధునిక కాంటీన్ వంటి సౌకర్యాలు కలిగి వుండటం ఆశ్చర్యం అనిపించిది. ఇది విజయనగరానికి కేవలం మూడు కిలోమీటర్ దూరం లో వుండటం కలిసి వచ్చే అంశం. సరే ఇది దర్శించుకొని విజయనగరానికి వెళ్ళాము …ఇక ఇక్కడ నుంచి మరో పురాతన గుడి ని దర్శించుకున్నాము దాని పేరే “రామ తీర్థం” ఇది దాదాపు 600 ఏళ్ళ క్రితం నిర్మిచింది అని తెలిసింది.

IMG_20160112_113837 IMG_20160112_112047 IMG_20160114_110841 IMG_20160113_105634 IMG_20160113_101918 IMG_20160113_100942 IMG_20160113_095736 IMG_20160112_113837

విజయనగరం నుంచి “నేలిమర్ల” వరకు సెవెన్ సీట్ ఆటో లో వెళ్ళాము. అటు నుంచి మరో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే “రామ తీర్థ” ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే పెద్ద కొండ వున్నది ఏకశిల అని అనలేము కాని అలాంటిది దే (ఏకశిల మీద ఉన్న కట్టడం భువనగిరి, హైదరాబాద్ కి 30 కి.మీ. లో ఉన్నది). కొండ పైన కోదండ రామాలయం వుంది. కొండ కింద ఏమో రాములవారి ఆలయం. ఆ అద్భుతమైన ప్రాకారాలు, గుడి పరిసర ప్రాంతాలు నిజంగా ఎక్కడికో తీసుకు వెళ్ళాయి. అయితే కొండ మీదకు వేళ్దామన్న నా ప్రతిపాదన ను మా కమల రిజెక్ట్ చేసింది ఎందుకంటే అప్పటికే బాగా ప్రయాణం చేసి అలిసి పోయాము (కొండ మెట్లు సుమారు గా 500 వరకు వుంటాయి). సరే అప్పటికే లంచ్ టైం కూడా కవోస్తుండడం తో తిరుగు ప్రయాణం అయ్యాము.

 

విజయనగరం లో ఆగక ఓ ఆలోచన వచ్చింది పండగ షాపింగ్ వైజాగ్ లో కాకుండా ఇక్కడ చేస్తే అని, ఎలాగూ వచ్చాం కదా అని విజయనగరం లో షాపింగ్ చేసాము. ఏ మాట కి ఆ మాటే చెప్పుకోవాలి. వైజాగ్ తో పోల్చితే చాల అంటే చాల బెటర్ అండ్ చీప్. పండగ కదా రద్ది కూడా బాగానే వున్నది. అవన్నీ ప్యాక్ చేసుకొని మరల ఇంటికి బయలుదేరాము. ఇక భోగి పండుగ రోజు గొప్పగా అనిపించిది. నా చిన్నప్పుడు మా అమ్మ గారి ఊరులో భోగి నాడు చేసిన సందడి అంతా గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు పిడకలు, గడ్డి వాము, ఇంకా చెట్టు బెరడులు వేసేవారు ఇప్పుడు అవేమి లేవు కదా మా కమల వాళ్ళ ఇంటి ముందు వేసారు పెద్ద మంట తో బోగి మంటలు వేసారు. చలి చలి లో అల ఉదయాన్నే చలి కాచుకోవడం గొప్ప అనుభవం. అల్ఫారం తీసుకొని ఎటు వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. మా శ్రీమతి గారు వారి వంట పనులలో బిజీ. అయితే నేను మా శ్రీమతి బంధువు ఒకరు నాకు కంపెనీ ఇస్తాను అన్నారు. దగ్గరలోనే ఉన్న భీముని పట్నం (భీమిలి అసలు పేరు) కి బయలుదేరాము.

 

నేను, వారు ఆటో లో 40 నిమిషాలు భీమిలి ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నాము. నిజంగా అద్భుతమైన ప్రదేశం, పురాతన ఇల్లు, ఎవరో పెయింటర్ గీసినట్టు వుండే ప్రకృతి. చుట్టూ కొండలు, డచ్ వాళ్ళు వదిలేసినా పాత చరిత్ర నమూనాలు, ఇంకా అలా రోడ్ పై నడుస్తూ సముద్రం దగ్గరికి వెళ్ళాము. ఇది రామకృష్ణ బీచ్ అంత విశాలం గా పొడవు గా లేకపోయినా చాల చక్కగా ఉన్నదీ. ఇక అక్కడే సౌరిస్ ఆశ్రమం (ప్రఖ్యాత రచయత చలం గారు నివసించిన ఇల్లు) అక్కడే వున్నది అని తెలిసాక మరింత ఆశ్చర్యం. ఎలాగు వచ్చాము కదా అది కూడా దర్శించుకుందామని వెళ్లాను, బీచ్ కి సరిగ్గా ఒక కిలోమీటర్ దూరం లో నే వున్నది. ఆ పరిసరాలు, వారు నివసించిన ప్రదేశం, సౌరిస్ గారి రూం, చలం గారి చదువుకున్న ప్రదేశం, కుర్చీ, ఉయ్యాల ఇవన్ని చూసాక సాహితి లోకం లో గొప్ప గా వెలిగిన చలం నడయాడిన ప్లేస్ ని చూసామన్న సంతృప్తి కలిగింది. అయితే సౌరిస్ గారు అప్పట్లో పిల్లులను పెంచేవార అని విన్నాను. ఇప్పుడు వారి ఇంట్లో కాకుండా దాని కోసమే ప్రత్యేకం గా రెండు గదుల్లో దాదాపు 70 నుంచి 80 పిల్లుల ను పెంచుతున్నారు వాటి కోసం సంరక్షుకుడి ని కూడా నియమించడం వారికి జంతువుల పట్ల ఉన్న ప్రేమ ని తెలియచేసింది. చలం గారి గ్రంధాలయం నుంచి నేను రెండు పుస్తకాలు కొనుగోలు చేసాను అవి చలం ఉత్తరాలు, చలం జీవన్ కి రాసిన లేఖలు (ఇవి రెండు ఎక్కడ దొరకవని చెప్పారు). వాటిని పొందినందుకు ఎంతో సంతోషం కలిగింది. తిరుగు ప్రయాణం లో ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాము. ఇక సంక్రాంతి రోజు కొత్త బట్టలు వేసుకొని దగ్గరలోనే ఉన్న బాబా గుడి కి వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఇక బందువుల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి మరల ఇంటికి పయనం … సాయంత్రం ఎక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తుండగా మా కమల ఇంటికి దగ్గరలోనే “శిల్పారామం” కనిపించిది.

ఇంకాస్త ముందుకు వెళ్తే శిల్పారామం నుండి ” జూ పార్క్” మరియు వై.యస్.ఆర్ మ్యునిసిపల్ స్టేడియం. కాబట్టి సాయంత్రం పూట అది కూడా పండగ పూట కదా శిల్పారామం కి వెళ్ళాము. (హైదరాబాద్ లో లాగానే ఇక్కడ కూడా అనేక వస్తువుల అమ్మకం జరిగింది). ఇక అక్కడ తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలా నృత్యాలు, రూపకాలు, భోగి పళ్ళు తినుబండారాలు. వచ్చి పోయే వాళ్ళతో సందడి గా వున్నది. సంక్రాంతి సాయంత్రం ఆ రకము గా ఆనందం గా గడిచిపోయింది.

Shiparamam-1 shilparamam-5 shilparamam-4 shilparamam-2 shilparam-3

మిగలిన చివరి రోజు ను ఎలా గడపాలి అని అనుకున్నాము. సరే అని శనివారం ఉదయము దగ్గరలోనే ఉన్న “జూ పార్క్” ని సందర్శించడానికి వెళ్ళాము. హూదూద్ తుఫాను దాటికి మొత్తం కొట్టుకుపోయినా అనతి కాలం లో నే మరల కోలుకోవడం విశేషం. అక్కడ ప్రకృతి సిద్దమైన కొండలు, సెలయేళ్ళు, కొండలు, గుట్టలు, ఒక చిన్న అడవి ని తలపిస్తుంది. మొత్తం విస్తీర్ణం 10 కిలోమీటర్ లు వరకు ఉంటుంది. పొద్దునే బ్రేక్ ఫాస్ట్ తిని వెళ్ళాం కాబటి సరిపోయింది లేకుంటే అంతే సంగతులు. ఉదయం 9 గంటలకి వెళ్ళితే మరల 1 గంటకు ఇంటికి చేరాము. కాసేపు విశ్రాంతి తీసుకొని లోకల్ RK బీచ్ కి వెళ్ళాము.

Vizag-RK beach-2 Vizag-RK beach-1

సముద్రం వొడ్డున గడపటం అది కూడా సాయంసంధ్యా వేళల్లో RK బీచ్ లో గొప్ప అనుభవం. అయితే పండగ కావడం తో జనం పోటెత్తారు. బీచ్ నిండా ఎక్కడ పడితే అక్కడ జనం. జనం జన సంద్రం పతంగులు, తినుబండారాలు చిరు వ్యాపారాలు అబబ్బో గొప్ప గా వుంటాయి లెండి. పండగ సందర్బం గా ఏర్పాటు చేసిన సంత లో మనం మర్చిపోయిన నాటకం అంకం గొప్ప రసవత్తరం గా అనిపించిది నేను వెళ్ళినప్పుడు “రామాంజనేయ యుద్ధం ” నాటకం నడుస్తుంది హార్మోని పెట్టె, రంగు రంగు వలయాల మెషిన్, ఇంకా సెట్టింగ్. ఒకసారి నేను నగరం లో వున్నానా లేదు ఏదైనా ఊరి లోనే నా అన్న సందేహం కలిగింది. కాసేపు వాటిని చూసి ఎంజాయ్ చేసాను.  మొత్తానికి సముద్రాన్ని, సంత ని ఎంజాయ్ చేసాక ఇంటికి వచ్చేసాము. మరల ఆదివారం ప్రయాణం (17-01-2016). మరల అదే దిక్కుమాలిన జన్మభూమి కి ఎక్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొట్టుకు చచ్చి చివరికి హైదరాబాద్ కి చేరుకున్నాము.

 

ఇంకా వైజాగ్ లో నేను చూడని ప్రదేశాలు చాల నే ఉన్నాయి గంగవరం పోర్ట్, పాత పోస్ట్ ఆఫీసు దగ్గర మూడు మతాలకు చెందినా గుడులు, రుషి కొండ బీచ్, ఫిలిం సిటీ, కనకమహలక్ష్మి గుడి (లోగడ ఒకసారి చూసాను), డాక్ యార్డ్. ఇంకా చాలానే వున్నాయి లెండి అన్నవరం, అనకాపల్లి లో ని బుద్దుడి గుహలు, నూకంబింక గుడి …ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. నెక్స్ట్ ట్రిప్ లో ఇవన్ని కవర్ చెయ్యాలి. చూద్దాం మరి ఒకసారీ వీలు కుదిరితే ఉత్తరాంధ్ర అంతటా తిరిగి రావాలి. ఇది నా ప్రస్తుత లక్ష్యం.

 



























2 thoughts on “యాత్రామాలిక – విశాఖపట్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *