May 3, 2024

యూనీసెఫ్ అవార్డు గ్రహీత కెకెకె తో…

KKK award picture

ఇంటర్వ్యూ – శ్రీసత్యగౌతమి 

 

యూనిసెఫ్ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ) లేదా UNICEF (United nations children’s emergency fund) యొక్క హెడ్ క్వార్టర్స్ అమెరికా దేశం లో న్యూయార్క్ నగరం లో వున్నది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం, ఇంకా అభివృద్ది పూర్తి స్థాయిలో లేని దేశాల్లో వెనుకబడి వున్న పిల్లల మరియు వారి తల్లుల అభివృద్ధికి పాటుపడడం. అభివృద్ది చెందిన దేశాలన్నీ కలిసి ఒక సంస్థ గా ఏర్పడి అభివృద్ది చెందని దేశాలలో ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతున్నాయి, అందులో ముఖ్యమైనది ఈ బాలల అత్యవసర నిధి సంస్థ. ఈ సంస్థని నిలబెట్టేది ప్రభుత్వాలు మరియు ప్రయివేటు రంగాలు. ఈ సంస్థ పిల్లల ఆహారం, పెరుగుదల, వికాసం మరియు ఆరోగ్య పధకాలను చేపట్టి వారి అభివృద్దికి పాటుపడుతుంది. ఈ సంస్థ 1965 వ సంవత్సరం లో నోబుల్ పీస్ ప్రైజ్ మరియు 2006 లో ప్రిన్స్ ఆఫ్ ఆస్టరియస్ అవార్డుల గ్రహీత. ఈ సంస్థకు దాదాపు 190 దేశాలు, టెరిటోరీలు చేయూతనిస్తున్నాయి. యూనీసెఫ్ పిల్లల, వారి తల్లుల కోసం అమెరికా నుండి వాక్సిన్లు, యాంటీ వైరల్ డ్రగ్గులు మరియు విటమిన్లను పంపించడం, పుస్తకాలు సరఫరా చెయ్యడం, ఎమర్జన్సీ షెల్టర్లు ఏర్పాటు చెయ్యడం, అలాగే ప్రకృతివైపరీత్యాలవల్ల విడిపోయిన కుటుంబాలను వెతికించి మళ్ళీ దగ్గిరకి చెయ్యడం లాంటి సహాయాలు చేస్తుంది. దీని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్ వీటికి కావలసిన పాల్సీలను, ప్రోగ్రాముల అప్రూవల్స్ ను, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఆర్ధిక పరమయిన ఎత్తుగడలను తయారుచేస్తూ సంస్థ కార్యక్రమాలని సక్రమంగా నడిపిస్తుంటారు.

నేనుండే ఫిలడెల్ఫియా (న్యూయార్క్ కు దగ్గిర) నగరంలో ప్రతి సంవత్సరం ఆకులు రాలే కాలంలో వచ్చే ఒక స్థానిక ఉత్సవం “హాలోవీన్” అనే ఉత్సాహకరమైన రోజు సందర్భంగా స్కూల్ పిల్లలందరూ డబ్బులు కలెక్ట్ చేసి యూనిసెఫ్ కు స్కూల్స్ ద్వారా పంపుతారు. యూనిసెఫ్ ప్రతి స్కూల్ కి ఆరెంజ్ రంగు పెట్టెలను సరఫరా చేస్తుంది పిల్లలు ఫండ్ కలెక్ట్ చెయ్యడానికి.  ఈ ఫండ్ రెయిజింగ్ ప్రోగ్రాం ని “ట్రిక్-ఆర్-ట్రీట్ టు యూనిసెఫ్” అని పిలుస్తారు. ఈ ప్రోగ్రాం ని 1950 లో ఫిలడెల్ఫియా నుండి మొదలుపెట్టారు. ఇలా అమెరికా మొత్తం మీదా మరియు కెనడా, ఐర్లాండు, మెక్సికో, హాంగ్కాంగ్ మొదలైన దేశాలనుండి దాదాపు 190 మిలియన్ డాలర్ల వరకు ప్రపంచ వ్యాప్తం గా యూనిసెఫ్ కు విరాళాలు అందుతాయి.

యూనిసెఫ్ పిల్లల హక్కులను కూడా పరిరక్షిస్తుంది. 1994 నుండి యూనిసెఫ్ యానిమేషన్ స్టూడి యోలను ప్రపంచవ్యాప్తం గా ప్రవేశపెట్టి పిల్లల జాతీయ, అంతర్జాతీయ హక్కులగురించి కార్టూన్ల ద్వారా అవగాహన కలిగిస్తున్నది. అలాగే యూనిసెఫ్ పేరుమోసిన ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగివుండి పిల్లలకు వారితల్లులకు కావలసిన మందులను సరఫరా చేస్తుంది, అలాగే వారి సహాయం తో ఎన్నో రకాల బయోమెడికల్ ప్రోగ్రాం లను కండక్ట్ చేసి ఫండ్స్ ని పొందుతుంది. యూనిసెఫ్ 2013 లో అమెరికాలోని మెర్క్ అనే పెద్ద ఫార్మా కంపెనీతో కూడి సౌత్ ఆఫ్రికాలో హెచ్.ఐ.వి మరియు ట్యుబర్క్యులోసిస్ తగ్గుదలకు విపరీతం గా పాటుపడింది. దీనికి ముందర 2010 లో పిల్లల వాక్సిన్ల గురించి 110 మిలియన్ డాలర్ల అవార్డ్ ను క్రూసెల్(Crucell) బయోటెక్ కంపెనీ నుండి అలాగే 2004 లో మాంట్ బ్లాంక్ (Montblanc) అనే స్టేషనరీ సరఫరా చేసే కంపనీతో కూడి ప్రపంచవ్యా ప్తం గా పిల్లలకి కావలసిన స్టేషనరీ ని సరఫరా చేసింది. అంతేకాకుండా యూనిసెఫ్ తాను కంపెనీలయందు సామాజిక బాధ్యతను కలిగివుండి అంటే వాళ్ళ బిజినెస్ ప్రాక్టీసెస్ ని ఇంప్రూవ్ చేస్తూండడమే కాకుండా పిల్లలకోసం వారి సప్లయిస్ కోసం కంపనీలను ఒక ఆధారంగా చేసింది.  చైల్డ్ లేబర్ ఎక్కడైనా కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకొనగలిగే ఒక నైతిక బాధ్యతను కూడా అప్పగించింది.

ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలను వెనుకబడిన కుటుంబాల నుండి కష్టపడి పైకి వచ్చిన అమ్మయిల సాహస కధలను తీసింది ఈ డాక్యుమెంటరీ చిత్రాలు మరొకరికి ప్రేరణ కావాలనే ఉద్దేశ్యంతో.

యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తం గా పేరు మోసిన ఫిల్మ్ స్టార్స్ ని, స్పోర్ట్స్ స్టార్స్ ని, మ్యూజిక్ పీపుల్ ని అంబాసిడర్స్ గా ఎన్నుకొని ఫండ్ రెయిజింగ్ కు, పిల్లలను వారి పెద్దలను తగురీతిలో యూనిసెఫ్ కార్క్యక్రమాలమీద అవగాహన ఏర్పరిచేందుకు ఉపయోగిస్తున్నది. అలాగే ఇటీవలి కాలంలో పదవీ భారత్ నుండి విరమణ చేసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ని యూనిసెఫ్ తమ అంబాసిడర్ గా ఎన్నుకొన్నది.

ఇన్ని కార్యక్రమాలు యూనిసెఫ్ చేపడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తం గా కొన్ని వందల, వేల మంది పిల్లలు తమ కుటుంబాలకు దూరమవుతున్నారు, ఎన్నో శిశుమరణాల తిండిలేక ఆకలిచావుల కేకలు వినబడుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఫోస్టర్ కేర్ సెంటర్లు, పేదరికంతో బాధపడే మైనారిటీ (నల్ల, స్పానిష్ జాతులు) తెగలకు చెందిన పిల్ల ఒక్కింటికీ అని ఉచిత ధనము, సదుపాయాలు, చదువుకోవడానికి స్కాలార్షిప్పులు, ఉధోగాల్లో ముందడుగు వెయ్యడానికి రిజర్వేషన్లను ప్రభుత్వాలు ఈ యూనీసెఫ్ గుండా కలిగిస్తున్నది. అలాగే అనైతికం గా పిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆ పిల్లల్ని ఎవరి దగ్గరైనా వదిలేసే హక్కులేదు. కన్న తల్లులపై కఠిన చర్యలు తీసుకుంటారు, వారు సంపాదనా పరులు కానిచో తల్లి, పిల్ల ఇద్దరినీ ఆమె కన్నవాళ్ళు చూడా వలసిన బాధ్యత లేదా ఆ తల్లులే కష్టపడి పిల్లల్ని పెట్టి పోషినచ వలసిన బాధ్యత కోర్టు అప్పగిస్తుంది. అయినా చెదురుముదురుగా పిల్లలకు కొన్ని సదుపాయాలు అందలేకపోవడమో, అనైతికంగా పుట్టి ఎక్కడయినా వదిలివేయ్యబడడమో జరుగుతున్నది, కానీ చాలా తక్కువ భారతదేశం తో పోలిస్తే. మురికిగుంటలంట తిరుగుతూ చెత్త కుప్పల్లో ఆహారాన్ని ఏరుకొని తినే పిల్లల ఉదంతాలు భారతదేశంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే జూలై 1 వ తేదీనుండి అక్టోబర్ 8వ తేదీవరకు ఇటువంటి పిల్లల జీవితాలపై ఒక సమీక్ష లాగ రిపోర్టులను తయారుచేసి తమకు పంపమని భారత్ టి.వి. చానళ్ళన్నిటికీ యూనీసెఫ్ ఒక్క ఉత్తరువు ను ఝారీ చేసింది. టీ.వి. చానళ్ళవారు అందించిన కార్యక్రమాలకు యూనీసెఫ్ అవార్డులను కూడా అందించింది. జెమినీ టీ.వి నుండి అలా అవార్డునందుకున్న శ్రీ కళ్యాణ కృష్ణ కుమార్ (కెకెకె) గారు ఈ యూనిసెఫ్ భారతదేశం లో చేపట్టబోతున్న కార్యక్రమాలగురించి మరిన్ని వివరాలు మనముందు ఉంచబోతున్నారు. వారికి ధన్యవాదాలు.

ప్రశ్న: కెకెకె గారూ, యూనీసెఫ్ ప్రపంచ వ్యాప్తం గా ఎన్నో పిల్లల అభివృద్దిపధకాలను చేపట్టి విజయాలను పొందుతున్నది. కానీ విజయాలు ఎక్కువ గా అభివృద్ది చెందిన దేశాలకు పరిమతమవుతున్నాయి. కానీ భారత దేశం లాంటి ఇంకా అభివృద్ది చెందుతూ వున్న దేశాలలో మాత్రం ఎన్నో అనాధబాలల జీవితాలు రోడ్లమీద కనబడుతున్నాయి. భారతదేశంలో యూనిసెఫ్ అభివృద్దిపధకాలు వైఫల్యాన్ని పొందుతున్నాయంటారా?

 

సమాధానం: యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సేవా సంస్థ థర్డ్ వర్ల్డ్ దేశాల్లో ఒకటైన భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల ద్వారానే  తన ఫండ్స్ ని ఖర్చుచేస్తోంది..  ఫండ్స్ ని ప్రభుత్వానికి అప్పగించడం వల్ల ప్రభుత్వాన్ని మానిటరింగ్ చేసే స్థితిలో యునిసెఫ్ లేదనే చెప్పాలి. భారతదేశంలో యునిసెఫ్ వంటి సంస్థ బాలల కోసం అందిస్తున్న ఫండ్స్ ని శాసన కర్తలు, మంత్రులు క్రమ పద్దతిలో ఖర్చుచేయటం లేదనేది నిర్వివాదాంశం. .. అందువల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.

 

ప్రశ్న: పిల్లల అభివృద్దిపధకాలకు సరియైన పాలసీలను మనదేశం కలిగిలేదా? కలిగి వున్నా కూడా ఆచరణలో పెట్టడానికి కావలసిన ఆర్ధిక పధకాల లోపమంటారా? దీని పై మీ విశ్లేషణ?

 

సమాధానం: చైల్డ్ డెవలప్ మెంట్ కు సంబంధించి మనదేశం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో అనేకం నేటీకీ కొనసాగుతున్నాయ్ కూడ. ఉదాహరణకు ICDS, ICPS వంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  కానీ మనదేశంలో వీటిపై  ” రివ్యూ మెకానిజం” లేదు. అంటే పథకం ప్రవేశపెట్టి, ప్రవేశపెట్టిన ఆ పథకానికి కేటాయించిన నిధులు ఎంతవరకూ ఉపయోగపడ్డాయి..? పథకం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతున్నదా లేదా..?  క్షేత్ర స్థాయికి పథకాన్ని సక్రమంగా చేర్చగలిగామా లేదా..?  పధకాన్ని మార్పులు చేయాలా..? సమూలంగా తొలగించి మరో పథకం ప్రవేశపెట్టాలా ? అని శాసనకర్తలు ఒకటికి రెండు సార్లు రివ్యూ నిర్వహించాల్సిన అవసరం మనదేశం లో ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిధుల సక్రమ వినియోగం ఒకెత్తైతే, ఆ నిధులు దుర్వినియోగం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా శాసనకర్తలపై వుంది.

 

ప్రశ్న: 2013-2014 సర్వే ప్రకారం ప్రతియేటా 21,000 మంది పిల్లలు తల్లిదండ్రులనుండి ఎయిడ్స్ వ్యాధిని పొందుతున్నారు. ఈ వ్యాధినుండి పెద్దవాళ్ళని, వారి పిల్లల్ని రక్షించడానికి తగు ఆర్ధిక సహాయాలు మన ప్రభుత్వం చేస్తున్నప్పటికీ అదుపులో వుంచడం కష్టమవుతున్నది. దీనికి కారణం యూనిసెఫ్ ఫండ్స్ తక్కువగా కేటాయించడం వల్లనా లేక యూనిసెఫ్ కు సరియైన డేటా అందకపోవడం వల్ల ఈ వైఫల్యాలను చవి చూస్తున్నదా?

 

సమాధానం: యునిసెఫ్ సంస్థ సహాయంతో హెచ్ ఐవి సోకిన వారికి, వారి పిల్లలకు, హెచ్ ఐవి సోకిన చిన్నారులకు డబుల్ న్యూట్రిషన్ ఇవ్వాలి.  గతంలో కొన్నాళ్ళు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు కూడా..! కానీ ఇటీవల ప్రభుత్వం దాన్ని అసలు పట్టించుకుంటున్న పరిస్థితి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కనిపించడంలేదు.. దాదాపూ దేశంలో అధిక శాతం ఇదే విధంగా ఉందని నా అభిప్రాయం.  ఉదాహరణకు ఏఆర్‌టి (యాంటీ రిట్రైవల్ థెరఫీ డ్రగ్స్) ఇప్పుడు రాష్ట్రంలో అందుబాటులో లేవు. విస్తరిస్తున్న వ్యాధిని అరికట్టేందుకు అసలు ఇక్కడ ఎంతమంది బాధితులున్నారన్నది ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన లెక్కలూ లేవు.. యునిసెఫ్ సంస్థకి కూడా డేటా ఇస్తున్న దాఖలాలు లేవు. దానివల్ల సమస్య మరింత జటిలం అవుతున్నదని అభిప్రాయపడవచ్చు.

 

ప్రశ్న: అమెరికావంటి అభివృద్ది చెందిన దేశాలలో యూనిసెఫ్ ఫార్మా, బయోటెక్ కంపనీలతో సత్సంబంధాలను ఏర్పరచుకొని వాటి బిజినెస్ ఎక్స్పాన్షన్ కు ఉపయోగపడుతూ యూనిసెఫ్ కార్యక్రమాల్లో వాటికి సామాజిక బాధ్యతను పెడుతున్నది. అదేవిధం గా భారతదేశం లో జరగడం లేదు. ఈ వైరుద్యాలకి కారణం ఏమయ్యుంటుందంటారు?

 

సమాధానం:  డ్రగ్ కంపెనీలు భారతదేశంలో కార్పొరేట్ స్థాయిలో ఎదిగకపోవడం ఒక కారణం కావచ్చు.. పైగా భారతదేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా సంఖ్య వల్ల కూడా ఉన్న ఇక్కడి డ్రగ్ కంపెనీలు సహాయం అందించడానికి ధైర్యం చేస్తుండలేకపోవచ్చు. గతంలో కొన్ని ముఖ్యమైన హెపటైటిస్ బి వంటి వాక్సీన్ లు బాలలకు అతి తక్కువ ధరకు అందించిన శాంతా బయోటిక్స్ వంటి డ్రగ్ కంపెనీలు కూడా భారతదేశంలో ఉన్నాయ్.. అలాంటి వారిని మిగిలిన వారు కూడా ఆదర్శంగా తీసుకుని స్వఛ్చందంగా ముందుకి వస్తే భారతదేశ రేపటి పౌరుల ఆరోగ్యప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంది.  

 

 

ప్రశ్న: ఇతరదేశాలతో పోలిస్తే భారతదేశం లో కుటుంబ వ్యవస్థ పటిష్టం గా వున్న దేశం గా ఎంతో పేరుగాంచింది. అటువంటి దేశం లో పిల్లలు ఎంతోమంది చాలీచాలని కూడు, గుడ్డలతో బ్రతకవలసివస్తుంది.  కొంతమంది అనాధలుగా కూడా బ్రతకవలసివస్తుంది. అభివృద్దిచెందిన దేశాల్లో లాగ వెనుకబడిన కుటుంబాలకి భారతదేశం లో ప్రభుత్వ సహాయం వుండదు. అందువల్ల ఇంటిల్లపాదీ కష్టపడి డబ్బు సంపాందించవలసిందే. ఇది లోపించినప్పుడు ఆ కుటుంబం అనేక ఇబ్బందులకు, ఆత్మహత్యలకు లోనవుతారు. అప్పుడు పిల్లలు అనాధలవుతారు. ఇది ఈ దేశపు తలవ్రాత. దీన్ని మార్చడానికి పభుత్వ, ప్రయివేటురంగాలు ఇంకా ఎటువంటి సామాజిక బాధ్యతలను కలిగివుండాలి? పిల్లలకు రక్షణను ఎలా కల్పించాలి? దీనికి యూనిసెఫ్ ఎంతవరకు సహాయం చెయ్యగలదు? ముందు మనింటిని మనం అలుక్కోవాలి కదా, అ తర్వాత ఎవరైనా వచ్చి పేరంటానికి పిలువగలరు అని నా ఉద్దేశ్యము. దీని పైన మీ విశ్లేషణ.

 

సమాధానం: మీరు చెప్పింది వందశాతం వాస్తవమండీ..! ముందు మనింటిని మనం శుభ్రపరచుకోవాల్సిందే..!! కానీ ఇక్కడి వారి మానసిక స్థితి మీరు కోరినంత స్థాయికి ఇంకా ఎదగలేదనిపిస్తోంది. ఇక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీకి లోబడి పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. కానీ అవేవీ బాలల కోసం పాటు పడుతున్న దాఖలాలేదు.. కేవలం వాటికి ప్రచార మాధ్యమంగా ఉపయోగపడే కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం.. లేదా కంపెనీకి ఏదైనా సమస్య తెచ్చిపెట్టే పరిస్థితుల్లోనో మాత్రమే  ఆయా కంపెనీలు సామాజిక కార్యక్రమాలకి తెగువ చూపిస్తున్నాయి. అలాంటి ప్రైవేట్ కంపెనీల దృష్టిని బాలల అభ్యున్నతి, రక్షణ, పౌష్టికాహారం అందించడం వంటి సమస్యల వైపు మరల్చడంలో ప్రభుత్వం కనీస బాధ్యతను నిర్వర్తించటం లేదు. . కొన్ని చోట్ల బడా కంపెనీలు సైతం ఆయా కంపెనీల చుట్టూప్రక్కల ప్రాంతాల వరకు మాత్రమే తమ సేవలందిస్తున్నాయి.. వాటిలో కొంత పిల్లలకు కేటాయిస్తున్నప్పట్టికీ.. వాటి శాతం అత్యల్పం అనొచ్చు.  

ఇలాంటి పరిస్థితుల్లోనే యునిసెఫ్ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.. మీడియాని మధ్యవర్తిగా ఉంచి సమస్యలు గుర్తించి వాటిని ప్రభుత్వం దృషికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకూ కృషిచేయటం లేదా మరలా మీడియా ద్వారా సమాజం దృష్టిని అటువైపు మరల్చడంలో యునిసెఫ్ పాత్ర అవశ్యం. అవసరమైతే ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ హోదాలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతో కనబడుతోంది.. 

 

ప్రశ్న: మీకొక చివరి ప్రశ్న. మీరు రూపొంధించిన వీడియో కార్యక్రమం చూశాను. అనాధబాలలను గుర్తించి వారికొక నీడను కల్పించమన్న మీ ప్రధాన ఉద్దేశ్యం చాలా బాగుంది. దీనికి యూనిసెఫ్ పాత్ర ఎంత వుండాలని మీరనుకుంటున్నారు? మీరే గనుక ఒక పాలసీ క్రియేట్ చెయ్యవలసివస్తే మీ ప్రధాన ఉద్దేశ్యాన్ని సాధించడానికి మీ ప్రతిపాదనలు ఏమిటి?

 

సమాధానం: ముందు నేను అందించిన ఫీచర్ ని మీ విలువైన సమయం వెచ్చించి పూర్తిగా చూసినందుకు ముందు మీకు నా కృతజ్ఞతలండీ.  అభివృద్ధిలో పరుగులెడుతున్న భారతదేశంలో పార్లమెంట్, అసెంబ్లీలలో  అనేక కమీటీలను వేసి  సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు  చేయటం అనే మంచి ప్రక్రియ తొలినాళ్ల నుంచి వస్తూనే ఉంది.  ఇతర కమిటీల వలెనే ప్రజాప్రతినిధులతో ఒక కమిటీని బాలల కోసం వేయాల్సిన అవసరం వుంది.. ఆ ప్రతినిధులు పాలసీ చేయడమే కాక  దానిని రివ్యూ చేస్తూ అవసరమైన పగడ్బందీ మార్పులు చేస్తూ బాలల కోసం పనిచేయాల్సి వుంది. అందులో బాలలకు ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. 1989 లో మిగిలిన దేశాలు అన్నీ UNCRC (యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్ కన్వెన్షన్) లో సంతకాలు చేస్తే, ఒక్క భారతదేశం మాత్రమే ఈ బాలల హక్కుల ఒడంబడిక పై 1992 లో  సంతకం చేసింది. ఈ ఒడంబడిక లో  భాగంగా బాలలకి సంబంధించిన అన్నీరకాల కమిటీల్లో బాలల ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండలనేది ఒక రూల్. ఆ ప్రకారం ప్రజాప్రతినిధుల కమిటీలో బాలబాలికలకు ప్రాతినిధ్యం కల్పించి వారి నుంచి సమస్యలు వారి ద్వారానే అడిగి, తెలుసుకుని చక్కటి పథకాలకు రూపకల్పన చేయాలి . అదికూడా దూరదృష్టితో శాసనకర్తలు పనిచేస్తే బావుంటుంది. మంచి ఫలితాలు ఆశించవచ్చు కూడా..! అప్పుడే భారతదేశం పటిష్తమైన, ఆరోగ్యకరమైన మేథోసంపత్తి కలిగిన ముందుతరం దూతలను ప్రపంచానికి అందించగలుగుతుంది

 

శ్రీ కెకెకె గారు రూపొందించిన వీడియోని చూడడానికి క్రింద లింకు పై క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=EnS9peulYEw

 

20 thoughts on “యూనీసెఫ్ అవార్డు గ్రహీత కెకెకె తో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *