May 3, 2024

యశోధర

అనువాదం: వాయుగుండ్ల శశికళ 

 

నువ్వు అడిగి ఉంటే

చెప్పి ఉండేదాన్ని

ఒక్క క్షణం ఆగి అడిగి ఉంటే

తెలుసుకోవాలి అనుకోకుండానే

స్త్రీలందరూ తెలుసుకొనే నిజాన్ని

 

ఎక్కడ మీరు వదిలి ఎగిరిపోతారో

ఆ మనిషితనాన్ని మోసుకుంటూ

బంధాలు నిలుపుకుంటూ

మెలివేసే మనసు బాధను భరిస్తూ

రేకులు విప్పుకున్న మీ జ్ఞానతృష్ణ

వెంట మీరు కర్కశంగా వెళ్ళిపోయినా

అంతం లేని జనన మరణ చక్రాన్ని

ఇరుసుగా మారి తిప్పుతూ ఉన్న సంగతి ……

 

ఎంతగా ప్రేమించారు అప్పుడు నన్ను

యవ్వనపు హొయాలు నాలో ఉరకలు వేస్తూ

మీతో కలిసి తిరిగేటపుడు

ఇప్పుడు ఏమైంది

ఒక్క ఆనంద క్షణానికి

గొలుసు అల్లికలతో నన్ను అల్లి

సహజ పురుష నిరాకరణ తో మీరు

దాటి వెళ్లిపోయినపుడు

అప్పుడు ఏమైంది

 

 

నరాలు తెగే బాధతో నేను కేకలు వేస్తున్నపుడు

ఒక చిన్ని ప్రాణి జీవానికై వెలుగుకై మూలుగుతూ ఉంటె

అవిసిపోయిన గుండెలతో మీకు వేసే ప్రశ్నకు

సమాధానమే లేదు ఇప్పటి వరకు

 

అందరు అంటారు దానిని ప్రసవం అని

నాకు మాత్రం అది విముక్తి

దేని నుండి విముక్తి

కారణం ఏదైనా కాని

మనిషిగా మిగాలడమే కావాలి ఇప్పుడు

 

@@@@@@@

 

ఇది రేవతి గోపాల్ గారు వ్రాసిన ”యశోధర ” ఆంగ్ల కవితకు అనువాదం . వీరు మూంబై వాసులు. 1947 లో పుట్టారు,

చౌక్ వెబ్ సైట్ లో కాలమిస్ట్ గా పనిచేస్తూ ఎన్నో కధలు, వ్యాసాలూ, కవితలు రచించారు.

 

”యశోధర” కవితలో బుద్ధుడి ని జ్ఞాన్వేషణ లో ఇల్లు పిల్లలలను వదిలిపోయాడు అని నిందించినట్లు కనిపిస్తుంది, కాని కవిత లోతుల్లోకి వెళ్లి చూస్తే బంధాలను బాధ్యతలను విస్మరించే పురుషులను విమర్శించడం కనిపిస్తుంది. ఒక్క క్షణం ఆనందాన్ని పంచుకొని ఎన్నో సంకెళ్ళు బంధాలలో స్త్రీని ఇరుసుగా మార్చిన వైనం చక్కని చిన్న పదాలలో ఆర్ద్రత తో రచయిత్రి వర్ణించారు. ఒక్క క్షణం ఆగి తనకు ఇవన్నీ మొయ్యడం ఎంత కష్టమో అడిగి ఉంటె బాగుండును నరాలు తెగిపోయే బాధ పంచుకోవచ్చు అని తపన పడే యుగాల స్త్రీ తపన ఇందులో కనిపిస్తూ ఉంది. చివరి వాక్యాలు

కవితకే మకుటాలు.

 

”అందరు అంటారు దానిని ప్రసవం అని 

నాకు మాత్రం అది విముక్తి ” 

 

నిజంగా విముక్తి అంటే ఏమిటి జన్మకు ఉండే సఫలత్వాన్ని పూర్తి చేయడం. ఇంటి పనులు బాధ్యతలు ఇవన్నీ స్త్రీ కొరకు సమాజం నిర్ణయించినవి. కాని స్త్రీ జన్మకు ప్రకృతి నిర్ణయించిన పని ప్రతి సృష్టి. అందులో బాధతో నరాలు తెగిపోయినా సరే, ఊపిరి ఆగిపోయినా సరే మరో ప్రాణి కి జన్మ నివ్వడమే స్త్రీ కి సాఫల్యము, విముక్తి. కన్న బాధ తెలుసు కాబట్టే వదులు కోలేక బాధ్యత కు లొంగి జీవితాంతం జనన మరణ ఇరుసుగా తిప్పుతూనే ఉంటుంది. ఒక్కో వాక్యం చదువు తూ ఉంటే ఇల్లాలి బాధ కళ్ళ ముందు కదులుతూ హృదయాన్ని భారం చేస్తుంది. బాష్పాంజలి గా పదాలు రాల్చిన రచయిత్రి ధన్యురాలు.

**********

 

కొసరు:- 

అమ్మ చేతి ముద్దలు కడుపునింపే సాక వేళ్ళ పై ఆనుకొని 

నూగుగా మెరుస్తూ గిన్నె అంచుకు చేరి నాలుక పై వాలే 

కొసరు ఎంత బాగుంటందని……

ఏ భాషకు పూస్తేనేమిటి కలానికి అంటి మెరిసే నక్షత్రాలు

భావాల చల్లదనం తో సేద తీర్చినాక మెత్తగా ముక్కు నంటే 

అర్ధపు పరిమళపు కొసరు హృదయానికి హత్తుకుంటే ఎంత బాగుంటుందని …. 

 

కన్నీరో! పన్నీరో! వేదనో! నివేదనో! మైమరుపో! ప్రకృతి మెరుపో! వేరే బాష అందాలను మన తీపి తెలుగులో వడ్డిస్తే ఏ హృదయం ద్రవించదు, ప్రతిధ్వని వినిపించదు…అదే నా కలం నుండి జాలువారిన కొసరు. కలాల అలల పల్లకి లో సేద తీరండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *