May 7, 2024

సామరాగ లక్షణాలు

                                             భారతీప్రకాష్

 

సామ రాగం 28.వ. మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి పుట్టినది.

 

ఆరోహణ   : స రి మ ప ద స.

 

. ద ప మ గ రి స

 

షడ్జమ పంచమాలతో పాటు ఈ రాగం లో వచ్చే స్వరాలు :

 

చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం మరియు చతుశృతి దైవతం.

 

ఔడవ షాడవ రాగం ; “ గ, ని ” ఆరోహణలో వర్జితమైతే, “ ని ” అవరోహణ లో వర్జితం.

ఉపాంగ రాగం ; గమక వరీక రక్తి రాగం.

రిషభ, దైవతాలు కంపిత స్వరాలు మరియు జీవ స్వరాలు.

“రి, ప” –   న్యాస స్వరాలు;   “ మ ” అంశ స్వరం.

ఈ రాగం చౌకకాల ప్రయోగాలతో  బాగా రక్తి కడుతుంది.

త్రిస్థాయి రాగం ;  ఆలాపనకి ఎక్కువగా అవకాశము లేని రాగం.

“మ ద   సా.”  మరియు  “ స   రి   రి   గా   సా ”  అనేవి విశేష సంచారములు.

ఈ రాగం లో రచనలు ” ద,   స,   మ ” అనే స్వరాలతో మొదలవుతాయి.

శాంత రస ప్రధానమైన రాగం.  శాంతి సౌరభాలని పెంపొందించి,  ప్రశాంతతని కలిగిస్తుంది.

అన్ని వేళలా పాడదగిన రాగం. కాని సాయంత్రం వేళ, రాత్రి వేళ అనుకూలము.

 

ఈ రాగములోని కొన్ని ముఖ్య రచనలు:

 

1.  కృతి శాంతము లేక ఆదితాళం శ్రీ త్యాగరాజు.

 

2. కృతి ఎటులైన చాపుతాళం శ్రీ త్యాగరాజు.

 

3. కృతి మరవకవే రూపకతాళం శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్.

 

4. కృతి శరణను ఆదితాళం శ్రీ పల్లవి శేషయ్యర్.

 

5. కృతి కరుణాకర రూపకతాళం శ్రీ వీణ కృష్ణమాచారియార్.

 

6. కీర్తన మానస సంచరరే ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి.

 

సామ రాగ కృతి  ఆది తాళం శ్రీ త్యాగరాజు.

 

పల్లవి: శాంతము లేక సౌఖ్యము లేదు – సారస దళ నయన   //

 

అనుపల్లవి: దాంతునికైన వేదాంతునికైన //

 

చరణం:1 దార సుతులు ధన ధాన్యము లుండిన

సారెకు జప తప సంపద కల్గిన //

 

2 యాగాది కర్మము లన్నియు చేసిన

బాగుగ సకలహృద్భావము తెలిసిన //

 

3 ఆగమ శాస్త్రములన్నియు చదివిన

భాగవుతులనుచు బాగుగ పేరైన //

 

4. రాజాధిరాజ శ్రీరాఘవ త్యాగ

రాజ వినుత సాధు రక్షక తనకుప //

 

 

 

“శాంతము లేక సౌఖ్యము లేదు ” అనే కృతిలో శ్రీ త్యాగరాజ స్వామి వారు మనకందరికీ ఒక చక్కని హెచ్చరిక చేసారు. అదేమిటంటే….

శాంతము లేకపోతే ఎవరికైనా సుఖము లేదని.

శాంతము అంటే..

మామూలు మనుషులు అందరూ పడే తాపత్రయాలు, కష్టసుఖాలు వలన కంగారు పడకుండా స్థిమితంగా ఉండడం. అలాంటి శాంతము లేకపోతే ఎలాంటివారికైనా సౌఖ్యము లేదని స్వామి వారు మనల్ని హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి వారైనా అంటే…

దాంతులకైనా  ( బాహ్య ఇంద్రియములను జయించినవారు ),

వేదాంతులకైనా ( వస్తుతత్వమును తెలిసికున్నవారు ),

భార్య పిల్లలు, ధనసంపత్తి ఉన్నవారికైనా,

జపతపాలు చేసేవారికైనా,

యాగాది కర్మలన్నీ చేసి, తన లోపలవున్న ఆత్మ యొక్క మాహాత్యమును తెలిసికున్నవారికైనా,

ఆగమ శాస్త్రములన్నీ బాగుగా చదివి, భాగవుతులను పేరు గాంచిన వారికైనా,

శాంతము, చిత్త స్థైర్యము లేనివారికి ఇవన్నీ సార్ధకములు కావని ప్రభోదించారు.

 

ఈరాగములో వున్న కొన్ని తెలుగు సినిమా పాటలు:

 

1. జేబులో బొమ్మ జేజేల బొమ్మా శ్రీ ఘంటసాల రాజు-పేద

 

2. మౌనమె నీ భాష ఓ మూగ మనసా శ్రీ ఎం. బాలమురళీ కృష్ణ గుప్పెడు మనసు.

 

3. అబ్బబ్బా ఇద్దూ .. అదిరేలా ముద్దూ … శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చూడాలని వుంది.

& సుజాత

 

 

1 thought on “సామరాగ లక్షణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *