May 7, 2024

ఇలాక్కూడా మనుషులు…!                                     

డా. కోగంటి విజయబాబు

అరుణాచలం ఈ వూరు వచ్చి సంవత్సరం దాటింది. ఆర్నెల్ల క్రితం బాంక్ లో రిటైరై ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. రోజూ మేడపైన సాయంత్రంపూట తిరగటం బాగా అలవాటు. ఎదురింటి మేడ పైన రెండు పోర్షన్లు. ఈమధ్యనే వాటిలోకి ఎవరో చేరారు. తప్పకుండా వాటిలో ఒకదానిలో బాంక్ ఉద్యోగులు వస్తూఉంటారు. పరామర్శగా చేయి ఊపుతూ పచార్లు చేస్తూ ఉంటాడు. వారి ఇంటి ఓనరు పేరు విశాల. అరుణాచలం పనిచేసిన బాంక్ లోనే పనిచేస్తోంది. వాళ్ళాయన దుబాయ్ లో ఇంజనీరు. కలుపుగోలు మనిషి. కొడుకు వైజాగ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.అరుణాచలాన్నీ’బాబాయ్ గారూ’ అంటు మర్యాదగా పిలుస్తుంది. అరుణాచలానికి పనిలేకపోవడంతో దగ్గర్లోనే ఉన్న వృధ్ధాశ్రమంలో సహాయంచేస్తూ ఉంటాడు. వాళ్ళావిడ కోడలితో పాటు యూ ఎస్ వెళ్ళింది. ఇంకో నెలలో రావచ్చు.

ఆ రోజు ఆదివారమనుకుంటా. అర్జంటు పనిమీద బయటికెళ్ళొస్తుంటే విశాల, ఆ పై పోర్షన్లో ఉండే స్కూల్ టీచరూ బైకు మీద వస్తూ కనిపించారు. ‘వీళ్ళిద్దరు ఇప్పుడెక్కడికెళ్ళి వస్తున్నారూ? ఏమైనా సమస్యా?’ అనుకున్నాడు. అడుగుదామనుకుని వాళ్ళూ హడావిడిగా వెళ్ళుతుండడంతో అడగలేకపోయాడు. మర్నాడు రామమందిరం దగ్గిర కొమర్రాజు కనిపించి తన సహజమైన వ్యంగ్య హాస్యంతో ఈ ప్రస్తావన తేవడంతో కొంచెం బాధ వేసింది. విశాల చాలా మంచమ్మాయి. ‘ఇదిగో కొమర్రాజూ, నువ్వు ఆ అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.’ అనిచెప్పి వచ్చేశాడు. తనకవసరమా? లేదు. కానీ ఏమన్నా సహాయం కావాలేమో! అడుగుదామని అనుకుంటూండగానే రాజమండ్రీ వెళ్ళాల్సి వచ్చింది. వచ్చిం తర్వాత ఓ రోజు వీలు చూసుకుని విశాల వాళ్ళ ఇంటికెళ్ళాడు.  బెల్ కొట్టి నుంచున్నాడు. వాళ్ళ పనిమనిషి తలుపు తీసింది. ‘అమ్మగారు బైటికెళ్ళారండి. వచ్చేత్తారు.ఏమైన చెప్పాలాండి? అనడిగింది. ‘పరవాలేదు. నేను మళ్ళీ వస్తాలే’ అని చెప్పి వెను తిరిగేంతలో మెయిన్ గేట్ దగ్గరే ఎదురైంది విశాల. వెనకనే బ్యాంక్ ఆఫీసర్ లోపలకొచ్చాడు.  ‘ఓకే సర్ థాంక్ యూ’ నవ్వుతూ చెప్పి లోపలకొచ్చింది విశాల. ‘బాగున్నారా,బాబాయి గారు,రండిలోపలకు’ అంటూ లోపలకు నడిచింది. కాఫీ చేయమని పనిమనిషికి చెప్పి ‘రెండు నిమిషాల్లో వచ్చేస్తాం’టూ లోపలకు వెళ్ళింది. ఒకటి రెండు సార్లు ఈ ఇంటికొచ్చాడు కానీ ఇల్లు సరిగా చూడలేదు. చాలా అందంగా సర్ది ఉంది. విశాల రాగానే ‘ఈ రోజు కొంచెం లేటయిందనుకుంటా?’ అన్నాడు సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక.

‘అవునండీ, నేను ఫీల్డ్ ఆఫీసరూ కలిసి ఓ లోన్ అప్లికంట్ ప్రాపర్టీ చూసి రావడానికివెళ్ళాము. వచ్చేసరికి లేటయింది. ఇంకా పిన్నిగారు రాలేదా?’ అనడిగింది.

‘పైన పోర్షన్లోని వ్యక్తి ఫీల్డాఫీసరా? ఎప్పుడొచ్చారు?’ అడిగాడు అసందర్భమైనా సరే.  ‘క్రితం నెలలో, ఇంకా ఫ్యామిలీ ని తెచ్చుకోలేదు. పిన్ని గారెప్పుడొస్తారో?’ … అడిగింది

‘పైనెలలో రావాలి, ఆమెగారి దయ, కొడుకు పంపాలిగదా!’ నవ్వుతూ అన్నాడు. తానూ నవ్వింది. చాలా నిక్కచ్చిగా నవ్వే మనిషి.

‘మొన్నా, అదే క్రితం వారం మీరెక్కడినుంచో బైక్ మీద వస్తూ కనపడ్డారు?’  అడిగాడు, అవసరం లేక పోయినా. ఒక రకంగా కడుపుబ్బరం తీర్చుకునేందుకే.

‘నేనా, ఎప్పుడూ?’ అంది ఆలోచించి గుర్తుచేసుకొంటున్నట్లుగా.

‘అదే,మీరు, పై పోర్షన్లోని స్కూల్ టీచరనుకుంటా’ అన్నాడు ముక్తాయింపుగా.

‘ఓ అదా, ఆరోజు డ్రైవర్ రాలేదు, నాకా డ్రైవింగ్ రాదు. అతన్ని తీసుకు వెళ్ళాను.’ అంది.

‘అలాగా, ఏమన్నా ఇబ్బంది వచ్చిందేమో అడుగుదామని వచ్చాను’ అన్నాడు. ఇంతలో తనకు దుబాయి నుంచీ ఫోన్ రావడంతో, బయటకొచ్చాడు.

**************

‘అనవసరంగా ఆ కొమర్రాజు గాడు మనసంతా కెలికాడు. అయినా నా బుధ్ధికేమయింది? అంత మంచమ్మాయిని అనుమానించవచ్చా?’ అనుకుంటూ లైబ్రరీ వైపు బయల్దేరాడు అరుణాచలం.

కొమర్రాజు చాలా విచిత్రమైన మనిషి. నెమ్మదస్తుడిలా నవ్వుతూ మాట్లాడతాడు. కానీ మనిషికి కనిపించనంత అహం,అసూయ. బ్యాంక్ లో అతన్ని తిట్టుకోనివారు లేరు.

అయితే విశాలపట్ల ఉన్న అభిమానంతో విషయంతెలుసుకుని కొమర్రాజు నోరుమూయిద్దామని వెళ్ళాడు.

లైబ్రరీ బయట చెట్టుక్రింద ఎవరికో ఉపన్యాసం దంచుతున్నాడు కొమర్రాజు.

పెద్ద కళ్ళద్దాలు, వంకీల జుట్టు, స్ఫురద్రూపంతో ఇన్షర్ట్ చేసి గారడీ వాడిలా చెతులు తిప్పుతూ ఎవరితోనో ఏదొ వివరిస్తున్నాడు.

ఏ విషయమైనా తన శైలిలో వివరించడంలో వప్పించడంలో దిట్ట. మనిషి చాలామేధావిలాగనిపించడంతో మొదట్లో అతనంటే అందరికీ విపరీతమైన గౌరవభావం. రాను రాను ఇతను చేసే ముఠా రాజకీయాలతో అందరూ విసుగెత్తిపోయారు.  కొత్తగా మేనేజరు వస్తే చాలా వినయంగా చేరి అందరిమీదా చాడీలు చెప్పి బాసున్నంత కాలం చాలా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. వచ్చి మూడేళ్ళు దాటింది. ఎపుడు కదుల్తాడా అని అందరూ చూస్తున్నారు. అరుణాచలం కు ఇతని మీద ఏమీ సాఫ్ట్ కార్నర్ లేదు కానీ అతను చెప్పేజోకులకు లొంగిపోతాడు. స్కూల్ టీచరుగా చేసి రావడంతో కొమర్రాజు మంచి మాటకారి.

అరుణాచలం దగ్గరకెళ్ళగానే అవతలి వ్యక్తి కొమర్రాజుకు వినయంగా నమస్కరించి వెళ్ళిపోయాడు.

‘ఏంసార్, ఎలా ఉన్నారు? మీ అమ్మాయెలా ఉంది? అంటూ వ్యంగ్యంగా నవ్వాడు.

అరుణాచలం కు కోపం ఆగలేదు. ‘తప్పు అలా మాట్లాడకూడదు కొమర్రాజూ’, అంటూనే, తనకు తెలిసిన సందర్భాన్ని వివరించాడు.

‘అది నన్ను నమ్మమంటారు?’ వ్యంగ్యంగా అన్నాడు మళ్ళీ నవ్వుతూ.

‘అసలు ఆమె వ్యక్తిగత విషయాల్లో మనమెందుకు తలదూర్చాలి? మనకేమన్నా అవసరం ఉందా?’ అడిగాడు అరుణాచలం.

‘ నాకేమవసరం? నెను చూసిందిమీకు చెప్పానంతే! ‘వంకరగా   నవ్వాడు.

‘అవును, తాను అలాన్నంత మాత్రాన ఎందుకు స్పందించాలి?’ అనుకుని పైకి, ‘ ఇక ఇలాటి విషయాలు నాదగ్గర మాట్లాడకు, ముఖ్యంగా విశాల గురించి’ అని అక్కడ నుంచీ నడిచి వచ్చేశాడు అరుణాచలం.

*****************

రోజులు గడుస్తున్నా కొమర్రాజు వంకర మాటలు బాధపెడుతూనే వున్నై.  ఓ రోజు సాయంత్రం వర్షపు జల్లు పడుతూండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసే సరికి కొమర్రాజు. కొంచెం కంగారుగా ఉన్నాడు. ‘ఏమైందీ’ అంటూ చిరాగ్గానే లోపల కాహ్వానించాడు. ‘కొంచెం అర్జంటుగా ఓ రెండు లక్షలు కావాలి. మావాడు యూ యస్ వెళ్ళే హడావిడిలో ఉన్నాడు. ఉన్న డబ్బు మొన్న చెల్లి పెళ్ళికి అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చయింది. ఈ రోజు సెలవు. రేపాదివారం. ఫిక్సెడ్ డిపాజిట్ తీసి ఓ వారంలో తిరిగి ఇచ్చేస్తాను’ అన్నాడు. “నాక్కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి.  నా దగ్గర అంత డబ్బులేదు.’ అన్నాడు అరుణాచలం. వెంటనే అతను, ‘ఎక్కడైనా ప్రయత్నిస్తే..’ అన్నాడు. ‘నాకు తెలిసి అంత డబ్బు ఇవ్వగల పరిచయస్తులు లేరు.’ అన్నాడు. ‘ ఎదురింట్లో ఉండే ఆమెను…’ నసిగాడు కొమర్రాజు.

అరుణాచలం కు నోటిమాట రాలేదు. ‘నిన్నటిదాకా వంకర మాటలు మాటాడి ఈ రోజు…’ ‘సర్లే,ప్రయత్నిస్తాను. రేపు కలువు’ అన్నాడు. ‘కాదు. నే కూడా వస్తా. ఇద్దరం వెళదాం. కొంచెం అర్జంటు’ అన్నాడు కొమర్రాజు.

అయిష్టంగానే విశాల ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు అరుణాచలం. ఎవరూ రావట్లేదు. ఎవరూ లేరేమో!

కాలింగ్ బెల్ రెండు సార్లు అనాగరికంగానే నొక్కాడు. విశాల వచ్చి తలుపు తీసింది. ‘ఏమనుకోకమ్మా, కొంచెం అర్జంటు పని మీద రావలసి వచ్చింది’ అన్నాడు అరుణాచలం.

లోపలకొచ్చిన కొమర్రాజు ను చూసి కొంచం ఇబ్బందిగా చూసింది విశాల. అయినా ‘కూర్చోండి. మంచినీళ్ళు కావాలా? అడిగింది. లోపల ఎవరిదో ఒక మగ గొంతు పెద్దగా వినిపిస్తోంది. కొమర్రాజు మళ్ళీ నా వైపు వ్యంగ్యంగా, అనుమానంగా చూశాడు.

‘చెప్పండీ’ మంచినీళ్ళు తెచ్చి ఎదురుగా కూర్చుంది విశాల. ‘పర్లేదు. మీరేమనుకోకుంటే…’ నీళ్ళు నములుతున్నాడు కొమర్రాజు. ‘నాక్కొంచం అత్యవసరంగా డబ్బు కావాలి. మా అబ్బాయిని స్టేట్స్ పంపుతున్నాను. ఓ వారంలోఇచ్చేస్తాను.’ అన్నాడు. ఆమె ఓ నిమిషం ఆగి ‘ఎంత కావాలీ ‘అంది.

‘రెండు లక్షలు‘ … చెప్పాడు కొమర్రాజు.

‘అంత డబ్బా, ఇలా సడెన్ గా’, అంటూ ‘ఒక్క నిమిషం’ అంటూ లోపలకెళ్ళింది. లోపల కెళ్ళిన విశాల, ‘సురేష్, నువ్వేమైనా డబ్బు సర్ద గలవా?’ అంటోంది.

కొమర్రాజు అరుణాచలం వైపు చూసి,’ ఇప్పుడేమంటావ్? అన్నట్లు చూశాడు. అరుణాచలంకు ఆశ్చర్యం, అసహనంకలిగాయి. ‘ఏమిటీ మనిషి? డబ్బు సహాయంఅడగడానికొచ్చాడా? లేక నిరూపించడానికొచ్చాడా? అసలీమె మీద ఇతని నిఘా ఏమిటి? ‘ అరుణాచలానికి చాలాకోపంగా ఉంది.

అంతలో విశాల బయటకొచ్చి ‘నా దగ్గర కొంత డబ్బుంది. సురేష్ దగ్గర కూడా కొంత ఉంది. అయితే వచ్చే వారంఅతని నిశ్చితార్ధం.  పెళ్ళి కోసం కొంత ప్లాన్ చేసుకున్నాడు. ఫర్లేదు. మా ఆయన వచ్చే వారం వచ్చేస్తారు. ఎన్ని రోజుల్లో తిరిగి ఇవ్వగలరు?’ అనడిగింది.

కొమర్రాజు నా వైపు చూసి మరో వంకర నవ్వు నవ్వి ‘త్వరలోనే ఇవ్వటానికి చూస్తాను.థాంక్స్ అండీ’ అన్నాడు. అరుణాచలం కు చాలా ఆశ్చర్యం, అసహనం కలిగాయి.  కొమర్రాజు వైపు చూడలేదు. ‘ఈమె ఇతనికి ఎందుకు సహాయం చెయ్యాలి?’ అనుకున్నాడు. ‘ వస్తామండీ’ అని లేచేంతలో, ‘ఉండండి. కాఫీ తాగి వెళ్దురు గాని. అయ్యో మా తమ్ముడ్ని పరిచయం చేయలేదు కదూ’, అంటూ, సురేష్ ని పిలిచి, ‘వీడు మాపిన్ని కొడుకు. ప్రక్క ఊళ్ళో స్కూల్ టీచర్ గా చేరాడు’ అంటూ లోపలకెళ్ళింది.

అరుణాచలం రుసరుసగా కొమర్రాజు వైపు చూసాడు.

సురేష్ కూర్చుని తనను తాను పరిచయం చేసుకుని ‘ మా అక్క విశాలంటే మా అందరికీ చాలా ఇష్తం. ఎంతో కలుపుగోలు మనిషి. ఎవర్నీ కసురుకోదు. నన్ను చిన్నప్పటి నుంచీ చదివించి ప్రోత్సహించింది తానే. అలాటి వారు చాలా అరుదుగా ఉంటారు.’ అంటూ చెప్పుకెళ్తున్నాడు.

ఇంతలో విశాల కాఫీ తీసుకొచ్చింది. అందరికీ అందించి, ‘కొమర్రాజు గారూ, మీరేమనుకోకుంటే ఒక మాట. మీరు నా గురించి అంటున్న మాటలు తెలిసీ మీకు సాయం చేస్తున్నాను. మామూలు పరిస్థితుల్లో ఐతే ఇచ్చేదాన్ని కాదు. మీ వయసుకు ఇలాటి మాటలు సభ్యతకాదు కదా, ఆలోచించండి.’ అంది. వేరొకరైతే పశ్చాత్తాపంతో తల వంచుకు కూర్చునే వారు. కానీ నిర్వికారంగా, ఏ భావమూ లేకుండా కాఫీ తాగుతూ వింటున్న కొమర్రాజు ముఖం లోకి చూసి చాలా ఆశ్చర్యపోయాడు అరుణాచలం. బయటికి వచ్చిన తరువాత కూడా అతని ముఖం లో పశ్చాత్తాపం లేదు.

స్కూటర్ ఎక్కుతూ, ‘రేపు పదింటికి వస్తా, కొంచెం వీలుచూసుకోండి. మీరూ బేంక్ కు రావడానికి. గుడ్ నైట్’ అని వెళ్తున్న కొమర్రాజును చూస్తూ అలాగే ఉండి పోయాడు అరుణాచలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *