May 7, 2024

ఆలి కోసం అలికిడి

శ్రీధర

మా  వాడు మేధావి  అవునో కాదో  నేను చెప్పలేను కానీ, మేధావికి ఉండాల్సిన అవలక్షణాలు – అదే లెండి లక్షణాలు  పుష్కలంగా ఉన్నాయి. కొంచెం మతిమరుపు, కొంచెం బద్ధకం  కొంచెం నిర్లక్ష్యంలాంటి సద్గుణాలన్నీ ఉన్నసకల కళ్యాణ గుణాభిరాముడు మావాడు. ఇవన్నీ కలిసొచ్చి కళ్యాణానికి ఎప్పటి కప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాయి. జీవితం దాదాపు ఇంటర్వెల్  దాకా వచ్చినా పెళ్లి కాకపోవడానికి పైన చెప్పిన లక్షణాలే కారణం. ’నెట్’  లో ఎప్పటికప్పుడు అమ్మాయిలతో చాట్ చేస్తునే ఉన్నాడు. దురదృష్ట మేమిటంటే ఆ లిస్టులో ముగ్గురు విజయలు న్నారు. ఒక విజయకు ఒకే చెప్పాడు. అదే విజయ అనుకోని  రెండో విజయకు పెళ్లి మూహుర్తాలు  పెట్టించుకు న్నాడు. మూడో విజయతో వెడ్డింగ్ కార్డు వేయించాడు. అలా పీటలదాక వచ్చిన పెళ్లి ఫటేల్ మని సీమ టపాకాయలా పేలిపోయింది. వాడి తప్పేమీ లేదండీ. ఎందువలనా అంటే -దైవ ఘటన. గడ్డాలు మీసాలు పెంచాడు. అదేమిట్రా అంటే “గడ్డం పెరిగిందిరా” అన్నా ను. ‘నేను చూడలేదు” అన్నాడు.

అలా అని మా వాడు  తీసి పారేయల్సిన మనిషి కాదండీ!! మొన్నీమధ్య వాడి కంపెనీలో సగం మందిని తీసేసినా మా వాడిని తీసిపారేయ్య లేదు. అంటే వీడు తీసి పారేయల్సిన మనిషి కాదనేగా అర్థం. ఎటొచ్చీ వీడిలాంటి మేధావు లను లోకం  గుర్తించడంలో కొంచెం లేట్ అవుతుంది అంతే. అంతకన్నామరేం లేదు. అమెరికా లో ఒక పెద్ద కంపనీలో పనిచేస్తున్నాడు. లక్ష డాలర్ల జీతం అన్నాడు. నేను నేలకేమో అనుకున్నాను కానీ సంవత్సరానికట. క్రిందటిసారి ఇండియా వచ్చినపుడు నేనే కొన్ని మంచి సంబంధాలు చూసి పెట్టాను. ఒకాయనేమో రెడీమేడ్ షాప్ ఉందంట. తీరా సంబంధం మాట్లాడితే “మంచి ఆఫర్ ఉంది సార్ “ అన్నాడు. ఏమిటా ఆఫర్ అనడిగాను. బై వన్ గెట్ టూ ఫ్రీ అన్నాడు. అంటే ఏంటని అడిగాను. ఆయనకు ముగ్గురు జమా జట్టీలాంటి ఆడపిల్లలున్నారు. పెళ్ళిళ్ళు చేయలేక పోతున్నాడు. ఒకమ్మాయిని చేసుకుంటే ఇద్దరు ఫ్రీ అన్నాడు. మా వాడు ముగ్గురిని  మానేజ్ చేయడం కష్టమని వద్దన్నాను. ఇంకో సంబంధం చూశాను. ఆయన పురావస్తుశాఖలో శాస్త్రజ్ఞుడు. పెళ్లి చూపులకి వెళ్లాం. ఇంటినిండా ముక్కులు, మొహాలు విరిగిన శిలావిగ్రహాలున్నాయి. అమ్మాయిని చూపించారు. ఎదో తేడాగా అనిపించింది. ఆ అమ్మాయికి పాకి కనిపించని పార్ట్ విరిగిందేమోనని భయం. టిఫిన్ పెట్టారు. శాతవాహనుల కాలంనాటి ఇడ్లీలు, కాకతీయుల కాలం నాటి బూందీ  పెట్టారు. తినగానే మా వాడు బాత్రూంలోకి వెళ్లికక్కు కున్నాడు. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు  కదా ! పెళ్లైపోతుందేమోనని  భయమేసింది. ఇంతలో అమ్మాయికి కూడా వాంతి అయింది. అయితే ఇది ఆ టైపు వాంతా? మామూలు వాంతా? అనుమానం వచ్చింది. నిఘా వర్గాలను ఆశ్రయించాం. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఆ అమ్మాయి ఎవరితోనో స్కూటర్ మీద తిరుగుతున్నట్టు రిపోర్ట్ వచ్చింది.

మరో సంబంధం చూశాం. ఆ అమ్మాయి తెలుగు మాష్టారి కూతురు. భార్యా భర్తలిద్దరూ శబ్దార్థల్లా కలిసి ఉండాలని అన్నది. అంటే  కొంచం వివరంగా చెప్పమన్నాను. భార్య అనుమతి లేకుండా భర్త ఎవరితో ఏం మాట్లాడినా ఎలాంటి వాగ్దానాలు చేసినా అవన్నీ అర్థం  లేని శబ్దాలట. భర్త భార్యకిచ్చే మాటలు, మూటలు, డబ్బులు, నగలు  వగైరాలన్నీ శబ్దం లేని  అర్థం గా పరిగణించాలట. వామ్మో ఇదేదో కొంపలు ముంచే యవ్వారం లా ఉంది. వద్దు బాబోయ్ అన్నాడు మా వాడు.

ఇంకో సంబంధం చూశాం. పిల్ల పర్వాలేదు. బాగానే ఉంది. సంసారపక్షంగా ఉంది. ఎవరితో సంసారం అన్న విషయంలో ఆ అమ్మాయికి పెద్దగా పట్టింపు లేదట. ఇల్లూ వాకిలి  ఓకే. మా వాడు ఒక పాట పాడమన్నాడు . మనుషులు పెంచిన ఎలకల్లారా …ఎలకలు కరవాణి మనుష్యుల్లారా ..తిన్నది ఎవరో చెప్పండి  … నా టెన్త్  సర్టిఫికేట్  తిన్నది ఎవరో చెప్పండి …” అని పాడింది. ఆ అమ్మాయి టీవీలో పారడీ సాంగ్స్ పాడుతుందట. పైగా మా వాడిని మీరు ‘పాడువారా ?’ అని  అడిగింది. నేను పాడువాడిని కాదన్నాడు. మరో మాట మాట్లాడక ముందే “ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం …” అని ఎత్తుకుంది. ఇక అక్కడి నుండి లేచి వచ్చాం. అవన్నీ గత  అనుభవాలు“. ఈసారి అలా కాదు బాబాయ్ !! … విస్తృతంగా  విచారించి హైదరాబాద్ అంతా  సెన్సెస్ లెక్కలు తీసినట్లు తీసి పెళ్ళికాని ఆడపిల్లల లిస్టు తాయారు చెయ్. దాన్లోంచి షార్ట్ లిస్టు తయారు చేద్దాం“ అన్నాడు. అలాగే  అన్నాను.

వాడు ఇండియా వచ్చాక రెండు రోజులు నిద్రపోయి లేచి ఆదివారం మా ఇంటికి వచ్చాడు. మొత్తం లిస్టులోనుండి నలుగురిని  సెలెక్ట్ చేశాం. అందులో రంభ , ఊర్వశి  ,మేనక , తిలోత్తమలను తలదన్నే నలుగురు రమణీ మణులతో ఒక లిస్టు తయారైంది.

“ముందు నేను వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి మెమొరాండం  అఫ్ అండర్స్టాం డింగ్ – ఎం.వో.యు – కుదిరాక ప్రొసీడ్ అవుదాం“ అన్నాడు. ఇది ఇండియారా అన్నాను. అయినా వాడు వినలేదు. ఏం చేస్తాం సరేనన్నాను.

మొదటి అమ్మాయికి ఫోన్  చేశాడు. ముందు ఆ అమ్మాయి టీవీ యాంకర్ అని చెప్పారు. తరువాత కానీ తెలియలేదు ‘మీ గ్రహం అనుగ్రహం’ కార్యక్రమంలో యాంకర్ అని. ఫోన్ చేయగానే ఆ ఆమ్మాయి అడిగింది “మీరు  ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?“ అని. ‘మీ గురించే’ అన్నాడు. ’మీ డేటాఫ్ బర్త్ చెప్పండి’ అంది. ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఎందుకు పుట్టారు ….అన్నీ చెప్పమంది. చావడానికి తప్పా … అన్నింటికీ సమాధానాలు ఇచ్చాడు. అన్నీ చెప్పాక “మీ సమస్య ఏమిటో గురువుగారికి చెప్పండి” అన్నది, గురువుగారు వెంటనే అందుకున్నాడు. మీ ఇంట్లో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగతావన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. శివాలయంలో  రోజుకు మూడువేల చొప్పున ముప్పై ఏళ్ళు ప్రదక్షిణాలు చేయండి. మినుములు, కందులు. పెసలు, సజ్జలు. రాగులు, కొర్రలు ఇంకా గోదానం, భూదానం, సువర్నదానం చేయండి అని సెలవిచ్చారు. వివాహం అయ్యే అవకాశం ఉందన్నాడు.

రెండో అమ్మాయి  పత్రికా విలేకరి. “కొన్ని షరతులు ఒప్పుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు” అని  చెప్పింది. షరతులేమిటో చెప్పమన్నాడు. మొదటి షరతు ’ప్రత్యేక హోదా’ ఇవ్వాలంది. అంటే ఏమిటన్నాడు. భార్య చేసే ఖర్చుల మీద అజమాయిషీ  ఉండకూడదు. నూటికి నూరు శాతం గ్రాంటుగా పరిగణించాలి. రెండవ షరతు: స్థానికత గురించి ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు వారి అక్క చెల్లెళ్ళు , అన్నదమ్ములు, వారి పిల్లలు వారి వారి పిల్లలు వారి వారిని స్థానికులుగా గుర్తించాలన్నది. అంటే ఏమిటంటే  వారు ఎప్పుడైనా రావచ్చు. ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, పల్లెత్తు మాట కూడా అనకూడదు. ఇంకా ఏమైనా షరతులున్నయా? అని అడిగాడు. భర్త  చేసే ప్రతీ పనీ పారదర్శకంగా  ఉండాలన్నది. ప్రైవసీ ఉండదా, బాత్రూమ్లో కూడా పారదర్శకత అవసరమా? అని అడిగాడు. పనిమనిషి అక్కడే పనిచేస్తుంది అక్కడే మరీ పారదర్శకత అవసరం అంది.

మూడో అమ్మాయికి ఫోన్ చేశాడు. కొత్తగా డాక్టరుగా ప్రాక్టీసు పెట్టిందట. ”మీ హైట్ ఎంత? సైట్ ఉందా?“ అని అడిగింది. శంషాబాద్ దగ్గర వెయ్యి గజాలున్నది అన్నాడు. ఆ సైట్ కాదు కళ్ళజోడుందా? అని అడిగింది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ రిపోర్ట్, బీపి, ఈసీజీ, ఎకో టెస్టులు రిపోర్టులు అన్నీ తీసుకుని సాయంత్రం ఆరుగంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో క్లినిక్లో కలవమంది. ఇవన్నీచేయిస్తే నాకే తెలవని జబ్బులు ఏవైనా బయట పడతా యేమో ఒద్దులే బాబాయ్ అన్నాడు.

ఇంకో అమ్మాయి టాక్స్ కన్సల్టెంట్. ఇన్కం టాక్స్ కట్టారా? ప్రాపర్టీ టాక్స్ కట్టారా? ప్రొఫెషనల్ టాక్స్ కట్టారా? సర్వీస్ టాక్స్, కమర్షియల్ టాక్స్, సేల్స్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ అన్నీ కట్టారా? ఇండియాలో కట్టారా?అమెరికాలో కట్టారా? డబుల్ టాక్సేషన్ ఏదైనా ఉందా? గత మూడేళ్ళ నుండి కట్టిన ఇన్కం టాక్స్ రిటర్న్స్ కాపీలతో సహా ఉదయం పది గంటలనుండి సాయంత్రం 5 గం. ల లోపల ఆఫీసుకు వచ్చికలుసుకోమంది.

అన్నీఇలాంటి కేసులే వస్తున్నాయి. ఈ లెక్కన నాకు పెళ్ళయ్యే యోగం లేదేమో అన్నాడు ”దిగాలుగా దిగులు పడకురా … నిన్ను నిన్నుగా ప్రేమించుటకు … నీకోసం జీవించుటకు ఎక్కడో ఎవత్తో పుట్టే ఉంటుందిలే“ అన్నాను. అయితే వెతకాలి కొంచం టైం పడుతుంది. ఓ జీవితకాలం లేట్ అయినా అవ్వచ్చు … అంతే కానీ కళ్యాణం కాకుండా పోతుందా” అని ధైర్యం చెప్పాను.
————————————————————
…( ఏ వృత్తిలో వారిని నొప్పించే ఉద్దేశ్యం లేదు. సమయం సందర్భం లేని చెప్పే మాటల్లో తొణికిసలాడే హాస్యాన్ని వెతికే ప్రయత్నమే ఇది —రచయిత )

1 thought on “ఆలి కోసం అలికిడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *