May 7, 2024

ప్రసిద్ధ వాడపల్లి లక్ష్మీనృసింహ స్వామి

పుష్యమిసాగర్                                                      

మా చెల్లెలు ఎప్పటినుంచో అడుగ్తున్న “వాడపల్లి” టూర్ ని మొన్న మార్చ్ లో వెళ్ళడం జరిగింది. ఎండలు మండిపోతున్నాసరే వెళ్లి తీరాల్సిందే అన్నప్పుడు ఇంకో ఆప్షన్ లేదు కదా…ఓ వర్కింగ్ డే ని త్యాగం చేసి ఉదయాన్నే బయలుదేరాము … మావెంట అమ్మా నాన్న, పండు సర్, రూప (వీరు చెల్లెలి ఆఫీసు కొలీగు). ముందుగా మాట్లాడుకున్న మినీ బస్సు మా ఆపార్ట్మెంట్ కు వచ్చింది. ఉదయాన్నే 6 గంటలకు మొదలు అయ్యింది మా ప్రయాణం.

వాడపల్లి పూర్వ నామం “వజీరాబాద్”. నిజాం నవాబులు ఏలిన కాలం నాటిది. ఇక మద్యలోనే బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి సరిగ్గా 10.30 గంటలకు వజీరాబాద్ కి చేరుకున్నాము. ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే నరసిహ్మ స్వామి దేవాలయం, శివుడి గుడి రెండు కొద్ది దూరం లోనే వుండటం, అది కూడా శివుడి ఆలయం కృష్ణ,  మూసి నది సంగమం పాయింటులో ఉన్నది.

ఈ గుడి సుమారుగా 500 వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అని తెలుస్తుంది …చక్కగా దర్శనం చేసుకున్నాక అక్కడి ఆలయ ప్రాశస్త్యాన్నిచెప్పారు. స్వామి వారి ఎదుట నిత్యం వెలుగుతున్న రెండు జ్యోతులు రెండు విబిన్నతకి ప్రతీకలు అని చ్పెపారు … అవి రెండు కూడా ఉఛ్ఛ్వాస, నిశ్శ్వాసాలకు తార్కాణం అని సెలవిచ్చారు. నిత్యం వెలిగే ఆ జ్యోతి పైభాగం అచ్చం మనిషి గాలి పీలుస్తున్నట్లుగా కదులుతుంది. దీన్ని మేము స్వయం గా పరిశీలించాము కూడా. ఇక జ్యోతి క్రింది భాగము కదలకుండా నిశ్చలముగా ఉంటుంది. ఇది స్వామివారి మహాత్యంగా చెప్తారు. దేవాలయం ప్రాంగణంలో ఈ ఆలయ చరిత్ర తెలిపే పలు శాసన స్థంబాలను చూసాము. కంచి శంకరాచార్య గారు వేసిన శాసనం కూడా చూసాక అబ్బురమనినిపించింది.

ఆలయ ప్రాగణం లోని శాసనాలు:

ఆలయ ప్రాగణం లోని శాసనాలు క్రీ.శ 1377(శక సం.1299) నాటి శాసనం లో “అనవేమయ సామంతుడైన కడియం పోతినాయుడు స్వామి అన మాచయరెడ్డి గారికి పుణ్యం కొరకు శ్రీ కృష్ణ మూసీ సంగమమైన బదరికాశ్రమమందు అగస్ధేశ్వర దేవరకు పిల్లల మర్రి బేతిరెడ్డి కట్టించిన గర్భగృహము మీద శిఖర ప్రతిష్ట చేసి, భేరిశాలను కట్టించిరి.” అని తెలియ జేయ బడింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కుందూరు చోళులు,రేచర్ల పద్మ నాయకులు, రెడ్డి రాజులు, ఈ ప్రాంతాన్ని పాలించినట్లు శాసనాధారాలు లభించాయి. శిథిలమైన ఆలయాన్ని 13 వ శతాబ్దంలో అనవేమారెడ్డి పునర్నిర్మాణం చేసి, వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎరయ తొండయ చోళుడు క్రీ.శ 1050-1065 మధ్య అద్భుతమైన వాస్తు శాస్త్ర పరిజ్ఞానం తో వాడపల్లి దుర్గాన్ని దృఢ పరచి, అభివృద్ధి చేసినట్లు శాసనాలు లభించాయి. కాకతీయుల నిర్మాణం గా చెపుతారు. 12 వశతాబ్దం లో రెడ్డి రాజులు ఈ ప్రదేశం లో పట్టణ నిర్మాణానికై, తవ్వకాలు జరపు తుండగా శ్రీ స్వామి వారి విగ్రహం బయట పడిందని, అచ్చటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, క్రీ.శ.1377 లో ఆలయ నిర్మాణం గావించినట్లు శాసనాలు తెలుపుతున్నాయని ఆలయం లో వ్రాయబడి ఉంది. శక వత్సరం 1528 (క్రీ.శ. 1606) ప్లవంగ ఫాల్గుణ బహుళ పంచమి గురువారం నాడు వాడపల్లి కోమటి పెండ్లిండ్లకు వచ్చిన దేవర కొండ, కొండవీడు,నల్లగొండ— ఉండ్రుకొండ, కొండపల్లి, ఓరుగల్లు, అనంతగిరి, కారంపూడి, కేతవరం ,పేరూరు, దేవులపల్లి,గోగులపాడు మున్నగు ప్రాంతాలబట్లు కోమటి ఇళ్ల ల్లో వివాహానికి వచ్చిన కట్టడి ద్రవ్యాన్ని, శ్రీలక్ష్మీనరసింహుని సమర్పించి నట్లు గా ఈ ఆలయ ప్రాంగణంలోని శాసనం వలన తెలుస్తోంది.

 

Picture-1_Vadapalli swami

 

వాడపల్లి-లక్ష్మీ సమేత నృసిమ్హస్వామి పురాణ చరిత్ర:

పూర్వం ఆరువేల సంవత్సరాల క్రితం అగస్త్యేశ్వర మహాముని శివకేశవుల విగ్రహములను అన్నపూర్ణ కావడిలో ఉంచుకొని వారి ప్రష్టకొరకు ముల్లోకాలు తిరుగుతూ భూలొక చేరాడు. ఉత్తరకాసీకి వెళ్ళు క్రమములో కృష్ణా, మూసీ నదుల సంగమ స్థలాన్ని చేరుకుంటాడు. శ్రీలక్ష్మీనృసిమ్హస్వామివారు ఈ పవిత్ర ప్రదేశంలోనే ఉండదలచినట్లు ఆకాశవాణి పలుకుతుంది. అందుకు శ్రీలక్ష్మీనృసిమ్హ స్వామివారి విగ్రహాన్ని ఈ పవిత్ర స్థలములో ప్రతిష్టించియున్నారు.

ఆలయ చరిత్ర: పంచనృసిమ్హ క్షేత్రములలో ఒకటైన వాడపల్లిలో ఆలయ నిర్మాణముకై త్రవ్వకములు జరుపుచుండగా స్వామి వారి విగ్రహం బయటపడినది. అచ్చటనే క్రీ.శ. 1377లో ఆలయనిర్మాణముగావించినట్లు శాసనములు తెలుపుచున్నవి.

పంచనృశిమ్హక్షేత్రములు: 1. వాడపల్లి 2. మట్టపల్లి 3. కేతవరం 4. వేదాద్రి 5. మంగళగిరి.

మీనాక్షీ అగస్త్యేశ్వరాలయం

ఇక వాడపల్లి లో వేంచేసివున్న లక్ష్మీనరసింహ స్వామిని చూసాక, శివుడి గుడి కి వెళ్ళాము. ఈఆలయం తూర్పుదిక్కుగావుంటుంది. నిలువెత్తు శివలింగాన్ని చూసాక గొప్ప అనుభూతికి లోను కావడం జరిగింది. శివ లింగానికి చిన్న బొడిపె వుండటం అక్కడి ప్రత్యేకతగా చెప్తారు.

దీని క్షేత్రపురాణం:

శిభి చక్రవర్తి ఓ రోజు తప్పస్సు చేసుకుంటుండగా ఒక పావురం వచ్చిశిబి వెనుక దాకున్నదిట. వేటగాడు వచ్చి అది నా పావురం అని అడిగాడుట. శరణు కోరిన పావురాన్ని విడిపించడం కోసం వేటగాడితో నీకు ఎంత కావాలో నా శరీరంలో అంత మాంసం తీసుకో అన్నప్పుడు తల బాగాన్ని కొట్టి కొంత తీసుకువెళ్ళాడు అట. ఆ ప్రభావాన్ని శివుడు గ్రహించినట్లుగా ఇప్పటికీ శివలింగం పైభాగాన ఎవరో కోసినట్టుగా గుంత పడి ఉండటం చూడొచ్చు. ఇంకో మహిత్యం ఏమిటి అంటే ఆ గుంత లో నీరు ఊరుతుంది ఇది అన్ని కాలాలలో ఎంత తీసిన మిగులుతుంది అని తెలియజేసారు. ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు.

మరికొన్ని విశిష్టమైన స్థలపురాణాలు:

రెడ్డిరాజుల కాలంలో సుమారు 600 సంవత్సరాల క్రితం చెట్ట్లు, పుట్టలతో  కప్పబడిన శివలింగం. అనవేమారెడ్డి భీమారెడ్డి గార్లకి కనిపిస్తుంది. అప్పుడు వారియొక్క పరిపాలనలో స్వామివారి ఆలయం నిర్మించారు. ఒకనాడు శంకరాచార్యులవారు, వారి శిష్యబృందంతో ఈ ప్రాంతమును పర్యటించుచూ శివలింగముపై నీటిని చూసి వారికి నమ్మకం కలగక ఒక ఉద్దరిణికి దారం కట్టి శివలింగం పై గల బిలంలోలోకి వదులుతారు. దారము ఎంత వదిలిననూ ఆచూకి దొరకక ఉద్ధరిణిని వెలుపలికి తీస్తారు. అప్పుడు ఉద్ధరిణికి ఒక రకమైన రక్తపు మరకలు ఉండుట శంకరాచార్యులు వారు గ్రహించి, దేవుని పరీక్షించుటకు నేను ఎంతటివాడను అని గ్రహించి స్వామివారికి శాంతి పూజలు నిర్వహించి వెళ్ళినట్లు శాసనంలో వ్రాయబడి ఉన్నది. ఈ స్వామి చాలా మహిమగల స్వామిగా ప్రసిద్ధి చెందారు.

 

ఇక శివుడి దర్శనం అయ్యాక…కృష్ణా మరియు మూసి నదుల సంగమ స్థానానికి బయలుదేరాము. గుడికి దగ్గరలోనే నడక దారిలోనే వెళ్ళవచ్చు. ఎండాకాలం కదా కాళ్ళు కాలిపోతాయి. ఒక 100 మెట్లు దిగాక కనిపించిది ఒక అద్భుతం. ఇక అప్పుడే సాగర్ కెనాల్ నుంచి నీళ్ళు వదిలారు అని చెప్పారు. ఇంకా మాకు ఆశక్తి కలిగించిన అంశం బోటింగ్. అక్కడ కేవలం 20 రూపాయలకు అవతిలి వొడ్డు దాక తీసుకు వెళ్లి మళ్ళీ వెనక్కు తీసుకు వస్తారు. మేము అవతలి వొడ్డుకు వెళ్ళడమే కాకుండా నది మొత్తం తిరిగాము.

Picture-2_Krishna-Moosi

ఇటు నుంచి హైదరబాద్ కి ఇంకొక రూట్ కూడా వున్నది అది ఏమిటి అంటే …పెదవూర నుంచి నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్ కు చేరుకోవడం. ముందుగా వేసిన ప్రణాళిక ప్రకారం సాగర్ కి వెళ్దామని పయనం అయ్యాము. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఎర్రటి ఎండ లో సాగర్ కి బయలుదేరాము ఒక గంట తరువాత సాగర్ కి రీచ్ అయ్యాము. అయితే అక్కడ సాగర్ డాం ని చూడమన్న మా ఆశ ఆవిరి అయిపోయింది. ఎందుకంటే డాం కి ప్రమాదం పొంచి వున్నది అని 2 ఏళ్ళ క్రితమే నిషేధించారు అట..అది మాకు తెలియదు (నేను ముందు చూసినప్పుడు డాం మీదకు అనుమతించే వారు). మేము అతి కష్టం మీద బస్సును డాం మీదుగా పోనిచ్చాము అలా ఏరియల్ వ్యూ మాదిరిగా చూసాము అయితే చిక్కు ఏమిటి అంటే హిల్ కాలనీ వైపు సెక్యూరిటీ (తెలంగాణా) వాళ్ళది, విజయనగరం వ్యూ పాయింట్ ఆంధ్రా వాళ్ళది. వచ్చేప్పుడు మరల వెడదాం అంటే ఆబ్జెక్ట్ చేసారు (మళ్ళీ15 కిలోమీటర్ లు మాచర్ల బ్రిడ్జి నుంచి వచ్చాము).  కనీసం నాగార్జున కొండకి అయిన వెళ్దామనుకున్నాను … కాని అది కూడా 1. 30 కి ఆఖరి బస్సు అని చెప్పారు. ఇక చేసేది ఏమి లేక తిరుగు ప్రయాణం అయ్యాము. 3 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యాము ….తిరిగి 5 30 వరకు హైదరాబాద్ లో వచ్చి పడ్డాము …మొత్తానికి అలా చారిత్రిక ప్రదేశాన్ని, విహార ప్రదేశాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలని ఆస్వాదించి వచ్చాము.

సూచన: ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నవారు వర్షాకాలంలో వెళ్ళితే బాగుంటుంది. ఎందుకంటే కృష్ణానది పరవళ్ళు తొక్కుతూంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *