May 7, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 6

టేకుమళ్ళ వెంకటప్పయ్య  

శ్రీవేంకటేశ్వరుని అన్నమయ్య కీర్తించిన సంకీర్తనాలయంలో, వారి కుమారులు, మనవళ్ళూ ఆ ఆ”లయ” ప్రాకారాలైతే … శ్రీయుతులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గార్లు నాలుగు మూల స్థంభాలుగా భావించవచ్చు. అన్నముని వేవేల స్వరసంకీర్తనాజ్యోతులు అజ్ఞానాంధకారంలో మునిగిఉన్న భక్తులకు సదా ఆధ్యాత్మిక జ్ఞానమార్గాలుగా.. ఉషోదయ కిరణాలుగా.. ఎన్ని తరాలు మారినా … ఎన్ని శతాబ్దాలు గతించినా నిత్య నూతనంగా, మార్గదర్శకంగా, ప్రకాశిస్తూనే  ఉంటాయి.

మానవుడు ఏ దు:ఖమూలేని నిత్యమైన ఆనందం మాత్రమే కోరుకుంటాడు. కానీ, లభిస్తున్నది మాత్రం దుఃఖాలతో, క్లేశాలతో గూడిన అనిత్యమైన ఆనందం. దాని కారణంగానే అసంతృప్తి, అశాంతి, ఆవేదన, అలజడి. అయితే ఎందుకిలా జరుగుతోంది? కారణం నిత్యమైన ఆనoదం కావాలంటే నిత్య వస్తువునే వెదకి పట్టుకోవాలి. అనిత్యమైన ఈ ప్రాపంచిక విషయాలను పట్టుకుంటే అనిత్యమైన ఆనందమే గానీ నిత్యమైన ఆనందం లభించడం కల్ల. ఏమిటా నిత్యమైనటువంటి వస్తువు? “నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” – నిత్యమైన వస్తువు ఏకమైన బ్రహ్మమే. అదే పరమాత్మ. పరమాత్మ కన్నా వేరైనవన్నీ అనిత్యాలే అన్నారు     శ్రీశంకరభగవత్పాదులవారు ‘తత్త్వబోధ’ లో.  కనుక మనం ఎట్టి దుఃఖమూ లేశ మాత్రం కూడా లేని శాశ్వతమైన, అఖండమైన, అనంతమైన శాశ్వతమైన పరమానందాన్ని పొందాలంటే ఆ పరబ్రహ్మన్నే వెదకి పట్టుకోవాలి. ఆ పరమాత్మతో ఐక్యమైపోవాలి. దీనికి ఏ శాస్త్రాలూ ప్రమాణాలు అవసరం లేదు అని ప్రబోధిస్తునాడు అన్నమయ్య.

పల్లవి: ఇన్నియు జదువనేల యింతా వెదకనేల

కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటే!

చ-1: వలెననే దొకమాట వలదనేదొక మాట

సిలుగులీ రెంటికిని చిత్తమే గురి

వలెనంటే బంధము వలదంటే మోక్షము

తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే ||

చ.2. పుట్టెడిదొకటే పోయెడిదొకటే

తిట్టమై యీ రెంటికిని దేహమే గురి

పుట్టుట సంశయము పోవుట నిశ్చయము

వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే ||

చ.3. పరమనేదొక్కటే ప్రపంచమొక్కటే

సిరుల నీరెంటికిని జీవుడే గురి

యిరవై శ్రీవేంకటేశు డిహపరములకర్త

శరణాగతులకెల్ల సతమీత డొకడే ||

(రాగి రేకు 311 – కీర్తన 64)
వివరణ:

పల్లవి: ఇన్నియు జదువనేల యింతా వెదకనేల

కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటే!

ఇన్ని శాస్త్రాలు చదవనవసరం లేదు. ఎక్కడా ఏమీ వెదకనవసరం లేదు. సకల శాస్త్రాలు చదివి భూమండలానికి సార్వభౌముడిగా ఉన్న పురూరవుడు సాధించిందేమిటి?  అంత మూర్ఖంగా ప్రవర్తించటానికి కారణం ఏమిటి? స్త్రీ వ్యామోహంలో పడి హీనస్థితికి దిగజారిపోయి, కేవలం రక్తమాంసమయమైన రెండు శరీరాల కలయికే స్వర్గసుఖం అని అనుకోవడమే!  కొంతకాలానికి చాలా విచిత్రంగా అనిపించి, అసలీ శరీరం ఎవరిది? ఎవరు ఇచ్చినది? ఎందుకొసం? అనే ప్రశ్నలు ఆయన్ను పీడించాయి. మలమూత్రాలతో జుగుప్సాకరమైన దేహాలపై మనుషులు వ్యామోహం పెంచుకొని ఎందుకిలా జారిపోతున్నారు? అని ఎంతో ఆలోచించాక దానికి కారణం సజ్జన సాంగత్య లోపమేనని ఆయనకు అనిపించింది. వెంటనే శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి, కొన్నాళ్ళకు ముక్తుడయ్యాడు. కనుక పురూరవుని వలె ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు నా జన్మకు కారణం ఏమిటి? నేను ఎందుకు పుట్టాను?  నా జీవితచరమ లక్ష్యం ఏమిటి? అని తమ్ము తాము ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. అలాంటి మానవుడినే జ్ఞానిగా, వేదాంత వేత్తగా పరిగణిస్తుంది లోకం. అతడే  తదుపరి దశలో మహాత్ముడుగా పరిణతి చెంది జన్మను సార్ధకం చేసుకుంటాడు. కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం, మధ్య ఉన్న రెప్ప పాటు కాలమే మన జీవితం. అయితే ఏ కాలంలోనైనా సమాజంలో అధిక శాతం మానవులు మంచితనాన్ని, మానవత్వాన్ని, దాతృత్వాన్నీ, ఆధ్యాత్మిక దృష్టినీ.. విస్మరించి కేవలం స్వార్ధమే పరమావధిగా..అరిషడ్వర్గాలలో చిక్కి, విషయలోలురై పాపపంకిలమైన జీవితం గడపడం సహజం. దాన్ని అధిగమించ లేకపోతున్నారనేదే అన్నముని ఆవేదన! జీవితం అంతా వట్టి భ్రమ, మాయానాటకం అన్న పరమ సత్యాన్ని తెలుసుకుంటే చాలు తరించినట్లే… ఆ పరబ్రహ్మ ను చేరుకునే ఆలోచన వచ్చినట్లే.. అని బోధిస్తున్నాడు ఆధ్యాత్మికాచార్యుడు.

చ-1: వలెననే దొకమాట వలదనేదొక మాట

సిలుగులీ రెంటికిని చిత్తమే గురి

వలెనంటే బంధము వలదంటే మోక్షము

తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే ||

“వలెను” (కావలెను) మరియూ “వలదు” (కావలదు) అనే రెండు పరస్పర విరుద్ధ భావాలు నిరంతరం శరీరం లో ఘర్షణ పడుతూనే ఉంటాయి. ఈ రెండిటి మూలంగా మనిషి కష్టాలతో నలిగిపోతున్నాడు.  దానికి కారణం ఏమిటి? ఆరు గుణాలు మనిషిని నిత్యమూ వేధిస్తూ ఉంటాయి. చూసిన ప్రతి వస్తువునూ అందుకోవాలనే  కోరికలతో నిత్యం రగిలిపోయే కాముకుడు (కామం), స్వంత ఆలోచనలను ఖూనీ చేసి కోపంతో ఉగిపోయే క్రోధితుడు (క్రోధం), సంపాయించిన ఆస్తులతో తృప్తిగా అనుభవించకుండా భయంతో దాచేసే లోభి (లోభం), తన ఆనందాన్ని కూడా ఇతరుల చేతులలో పెట్టి వారిని సదా అనంద పరుస్తూ లోలోన దుఃఖించే మోహితుడు (మోహం), బలధనమదావికారాలతో నిత్యం విర్రవీగే మదాంధుడు (మదం), తోడివారి ఉన్నతినీ వైభవాన్నీ..చూసి ఓర్వలేని మాత్సర్యపరుడు (మాత్సర్యం) మనిషినీ..అతని మనసునూ చిత్రవధ చేసి అతను తీవ్ర మనో వేదన అనుభవిస్తూ ఉంటే చోద్యం చూస్తూ వుంటాయి.

“వలెను” (కావలెను) అంటే అన్ని బంధాలూ మనవే! తల్లీ..దండ్రీ..సుతులూ..అందరూ కావాలి మనకు. మరి “వలదు” (కావలదు) అంటే ఏ బంధాలూ మనిషిని బాధించవు. అది తెలిసికొన్నవాడే జ్ఞాని.

ఔరా! ఈ మానవుడు ఎంత అమాయకుడు. ఈ బంధాలన్నీ అశాశ్వతమైనవని, తన జీవితం ముగిసిపోగానే అవి కూడా అంతమైపోతాయన్న కఠోర సత్యము ఎప్పటికీ తెలుసుకోలేక బంధ మోక్షాలకు కారణమైన మనస్సును బంధాలలో బిగించుకోవడానికే ఇష్టపడతాడు. పంజరంలో ఉన్న పక్షి లాగా తనకు తానే ఊపిరాడని రీతిలో బంధాలలో చిక్కుకుని పరమాత్మ ధ్యాస లేకుండానే మరణిస్తాడు.  ఈ కష్టాలకు కారణం మనిషి మనస్సే! ఈ విషయం తెలిసిన విజ్ఞానులకు మాత్రమే సరియైన మార్గం కనిపిస్తుంది.

చ.2. పుట్టెడిదొకటే పోయెడిదొకటే

తిట్టమై యీ రెంటికిని దేహమే గురి

పుట్టుట సంశయము పోవుట నిశ్చయము

వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే ||

ఒక సారి జన్మించిన తర్వాత మరణం తప్పదు. పుట్టుక, గిట్టుట  రెండూ మానవ దేహానికి సంబంధించినవే! మనకు మరుజన్మ అంటే మళ్ళీ పుట్టుక సంశయమే అంటే మనం మళ్ళీ పుడతామో లేదో ఖచ్చితంగా తెలియదు కానీ పుట్టిన తరువాత చావటము  మాత్రం తప్పైనిసరిగా జరిగే పని, ఈ విషయం కేవలం విజ్ఞులకు మాత్రమే అర్ధమౌతుంది. విజ్ఞతతో కూడిన ఈ విషయాలు భక్తి, జ్ఞానవిశేషాలు తెలిసినవారికి మాత్రమే తెలుస్తాయి.  బాహ్యంలో జరుగుతున్న వాటిని చూడగలిగినట్లే లోపల జరుగుతున్న వాటినీ మనం చూడగలగాలి. ఆ విధంగా చూడడమే ‘సాక్షి’గా ఉండడమంటారు. సాక్షిగా ఉన్నప్పుడే సత్యమన్నది ఆవిష్కారమవుతుందని తెలిసిన విషయమే. బయటి ప్రపంచమొక్కటే నిజమైనదని బహిర్ముఖులను కుంటారు. లోపలి ప్రపంచమొకటే నిజమైనదని, అంతర్ముఖులనుకుంటారు. రెండు ప్రపంచాలని ఆమోదించిన వారే నిజమైన మనుషులు. ఏ ప్రపంచానికీ లొంగనివారే సత్యాన్వేషకులు. ఇక్కడ గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ గురించి చెప్పాలి. ఆయనకు మరణదండన విధించారని తెలిసి ఆయన హితులు, సన్నిహితులు ఆయన ఉన్న కారాగారం దగ్గరికి వచ్చారు. ఏడుస్తున్నవాళ్ళని చూసి సోక్రటీస్ ‘‘ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు?’’ అనడిగాడు. వాళ్ళు ‘‘మీకు మరణశిక్ష విధించారు. అందుకనే మేము రోదిస్తున్నాము” అన్నారు. సోక్రటీస్ నవ్వి ‘‘మీరు ఏడవాల్సింది ఇప్పుడు కాదు. నేను ఏరోజు పుట్టానో ఆరోజు ఏడవాల్సింది. ఎందుకంటే మనిషి పుట్టుక ఎప్పుడు మొదలైందో మరణం కూడా అప్పుడే మొదలయింది. పుట్టుకలోనే చావు దాగుంది అన్నాడు. వాళ్ళు సోక్రటీస్ మాటలకు విస్తుపోయారు. జీవితాన్ని ఎవడయితే సంపూర్ణంగా చూస్తాడో, అతనే మరణాన్ని కూడా చూస్తాడు. ఆ రెండిటినీ ఎప్పుడు ఎవరు చూస్తారో అతనికి అంతమంటూ ఉండదు” అన్నాడు సోక్రటీసు మరణశయ్యపై. నిజమైన జ్ఞానులకు చావు పుట్టుకల భేదం ఉండదు.

చ.3. పరమనేదొక్కటే ప్రపంచమొక్కటే

సిరుల నీరెంటికిని జీవుడే గురి

యిరవై శ్రీవేంకటేశు డిహపరములకర్త

శరణాగతులకెల్ల సతమీత డొకడే ||

పరము అనేది ఒకటే ప్రపంచం ఒకటే అంటాడు అన్నమయ్య. అసలు పరము అంటే ఏమిటి?  ఏ జీవుడైనా పుట్టడానికి తన పూర్వజన్మలో తాను చేసిన సుకృత, దుష్కృతకర్మలే ప్రధాన కారణం. అటువంటి జన్మలను ఎన్నింటినో అతను పొంద వలసి ఉంటాడు. అందుకే అన్ని జన్మలలో మానవ జన్మ విలువైనది గొప్పది. పరలోక సంబందమైన మోక్షప్రాప్తి కోసము కృషి చేసేందుకు మనిషికి మాత్రమే అవకాశం ఉంది. పరలోకాలు ప్రధానంగా నాలుగున్నాయి. వాటిలో మొదటిది స్వర్గం. దీనికి దేవేంద్రుడు అధిపతి. రెండోది బ్రహ్మలోకం, దీన్నే సత్యలోకమని అంటారు, బ్రహ్మ అధిపతి. మూడో లోకం కైలాసం, దీనికి ఈశ్వరుడు అధిపతి. నాలుగో లోకం పేరు వైకుంఠం. దీనికి అధిపతి శ్రీమహావిష్ణువు. ఈ అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించాక ఆ జీవుడు తిరిగి భూలోకంలో జన్మిస్తాడు. శాశ్వతంగా పరలోకాలలో భగవంతుడిలో లీనమై ఉండాలనుకుంటున్నవారు తమ జన్మంతా మంచిని ఆచరిస్తూ ముందుకు సాగాలని మార్కండేయ పురాణం లొ చెప్పబడింది.   భువిపై ఇహ పరాలకు కర్త శ్రీవేంకటేశ్వరుడున్నాడు. శరణాగతులైన వారికి శాశ్వత పరమపధమునిచ్చే దేవుడు శ్రీవేంకటేశ్వరుడొక్కడే!  మ్రొక్కండి అంటాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు:

సిలుగు = కష్టము; తెరువు = మార్గం; సతము = శాశ్వతము; తిట్టము = ఆశ్రయం; ఇరవు = నెలవు;  తెలిసే విజ్ఞానులు = గమనించగలిగే వివేకులు;  వలెను = కావలెను (కావాలి); వలదు = వద్దు;   సిరుల = విశిష్టమైన.

2 thoughts on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 6

  1. పుట్టెడిదొకటే పోయెడిదొకటే / తిట్టమై రెంటికిని దేహమే గురియౌను / పుట్టుట సంశయము పోవుట నిశ్చయము /
    వొట్టి విజ్ఞానులకు వుప మిది వొకటే ||ఇన్ని

    ||Implied meaning: The material body is subjected to transformation from Birth to death. Death is certain, but not rebirth. Therefore the learned KNOWS THAT THERE IS ONLY A WAY i.e. to escape rebirth. (Such a person would want to avoid this vicious cycle of life and death). Verily, the learned can clearly see this truth.

    Comments: Annamacharya used the word ఒట్టి విజ్ఞానులు (voTTi vij~nAnulu) to indicate pure, unaldultrated, disinterested viewer. Of course such persons are very rare. (Refer to books of Jiddu Krishnamurti, who also stressed most of his time on pure, unadulterated observation)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *