May 7, 2024

“వరాళి” రాగ లక్షణములు

భారతీప్రకాష్

 

ఈ రాగం 39.వ. మేళకర్త రాగం. కటపయాది సంఖ్య కోసం ఈ పేరుకు ముందుగా “ఝాల” అని పెట్టారు.

ఈ రాగం ఏడవ చక్రమైన “రిషి” లోని మూడవ మేళకర్త రాగం.

వివాది మేళ రాగాలలో ఇది ఒకటి.

అమూర్చనకారకమేళరాగం.

ఆరోహణ:సరిగమపదనిస.

సగరిగమపదనిస.

అవరోహణ:స. ని ద ప మ గ రి స

ఈరాగం లో “స రి గ మ” అనే ప్రయోగం వివాదిత్వం కాబట్టి ” స  గ  రి  గ  మ ” అనే ప్రయోగం ఎక్కువగా వాడుతారు.

మేళకర్త రాగం కాబట్టి క్రమ సంపూర్ణ ఆరోహణ అయినా వాడుకలో వక్ర సంపూర్ణమే; “స  గ  రి  గ  మ  ప  ద  ని  స”

షడ్జమ పంచమాలతో ఈ రాగం లో వచ్చే స్వరాలు :- శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ దైవతం, మరియు కాకలి నిషాదం.

ముఖ్యమైన ప్రతి మధ్యమ రాగం;   సంపూర్ణ రాగం; సర్వ స్వర గమక వరీక రాగం; ఘన రాగం;  ఘన పంచక రాగాలలో ఆఖరుది.

రాగ విస్తారానికి బాగా అనుకూలమైన రాగం.

రాగ చాయా స్వరాలు : గ మరియు మ;

ఆధార స్వరం : ప ;

కంపిత స్వరాలు : గ మరియు మ ;

న్యాస స్వరాలు : గ మరియు మ ;

గాంధారం అపురూపం గా పలికే పద్ధతి వలన ఈ రాగం యొక్క వివాదిత్వం తగ్గుతుందని చెప్పవచ్చు. ఈ రాగం లో గాంధారాన్ని చతురిశ్ర రిషభానికి దగ్గరగా పలుకుతారు.

ఈ రాగం లోని రచనలు “గ, మ, ప” స్వరాలతో మొదలవుతాయి.

కరుణరస ప్రధాన రాగం.

ఈ రాగం లోని మధ్యమం మామూలు ప్రతిమధ్యమం కన్న కొంచెం ఎక్కువగా పలుకుతారు. అందుకే ఈ స్వరాన్ని “వరాళి మధ్యమం” అని పిలుస్తారు.

పూర్వకాలంలో ఈ రాగాన్ని “వరాటి” అని పిలిచేవారు. ఈ రాగం గురించి ఒక మూఢనమ్మకం ప్రచారం లో ఉంది. అదేమిటంటే … “ఏ గురువైనా తన శిష్యులకి ఈ రాగం లో ఏ రచన నేర్పించినా ఆ గురు శిష్య సంబంధం చెడిపోతుంది” అని. అందుకునే ఈ రాగాన్ని గురువుగారు పాడుతుంటే విని శిష్యులు నేర్చుకుంటారు.

ఈ మూఢనమ్మకం వలన ఈ రాగం లో ఎక్కువగా రచనలు రాలేదు. ఈ రాగం లోని కొన్ని ముఖ్య రచనలు:

1. తాన వర్ణం – తామరసాక్షి   – ఆది తాళం –   శ్రీ తిరువొత్తియూర్ త్యాగయ్యర్

2. తాన వర్ణం – వనజాక్షి     –   అట తాళం –  శ్రీ రామ్నాద్ శ్రీనివాస్ అయ్యంగార్

3. పంచరత్న కీర్తన – కనకన –   ఆది తాళం –   శ్రీ త్యాగరాజు

4. కృతి – మరకతమణి   –   ఆది తాళం –   శ్రీ త్యాగరాజు.

5. దరు – ఇందుకేమిసేతు – చాపు తాళం – శ్రీ త్యాగరాజు.

(నౌకాచరితం)

6. దరు –   ఏటి జన్మమిది – చాపు తాళం – శ్రీ త్యాగరాజు.

(ప్రహ్లాదభక్తివిజయం)

7. కృతి – మామవ మీనాక్షి – మిశ్ర ఏక – శ్రీ ముత్తుస్వామి దీక్షితార్.

8. కృతి – కరుణ జూడవమ్మ – ఆది తాళం – శ్రీ శ్యామ శాస్త్రి.

ఈ రాగం లో శ్రీ త్యాగరాజు రాసిన పంచరత్న కీర్తన :

వరాళిరాగం- ఆది తాళం- పంచరత్న కృతి- శ్రీ త్యాగరాజు.

పల్లవి:

కనకన రుచిరా కనక వసనా నిన్ను//

అనుపల్లవి:

దినదినమును మనసున చనవున నిన్ను//

చరణం:1.

పాలుగారు మోమున శ్రీ యపార మహిమ దనరు నిన్ను//

చరణం:2.

కలకలమను ముఖకళగలిగిన సీత

కులుకుచు ఓర కన్నుల జూచే నిన్ను //

చరణం:3.

బాలార్కాభసుచేలామణిమయ

మాలాలంకృత కంధర సరసిజాక్ష వరక

పోల సురుచిర కిరీటధర సతతంబు మనసారగ//

చరణం:4.

సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాట వీనుల

చురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు//

చరణం:5.

మృగమద లలామ శుభనిటల వర జటాయు మోక్ష ఫలద

పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప

సీత తెలసి వలచి సొక్క లేదారీతి నిన్ను//

చరణం:6.

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహమానస

విహారాప్త సురభూజ మానిత గుణాంక చిదానంద

ఖగ తురంగ ధృతరధాంగ పరమ దయాకర

కరుణరస వరుణాలయ భయాపహరా శ్రీ రఘుపతే//

చరణం:7.

కామించి ప్రేమమీర కరముల నీదు పాదకమలముల

బట్టుకొనువాడు సాక్షి రామనామ రసికుడు కైలాస

సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక

పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్షిగాద

సుందరేశ సుఖ కలశాంబుధి వాసా శ్రితులకే//

చరణం:8.

సతతము ప్రేమపూరితుడగు త్యాగరాజ

నుత ముఖజిత కుముదహిత వరద నిన్ను //

అర్ధాలు:

కనకవసన = బంగారు వర్ణముగల వస్త్రము కలవాడు.

బాలార్కాభ సుచేలా = బాలసూర్య కాంతిగల వస్త్రము కలవాడు.

మణిమయమాలాలంకృత కంధర = మణులుగల హారములచే అలంకృతమైన కంఠము గలవాడు.

సాపత్ని మాత = సవతి తల్లి.

విముఖాంబుధర పవన = దైవవిముఖలనెడిమేఘములకు గాలివంటివాడు.

విదేహమానసవిహార=విదేహులైనయోగులమనసులందువిహరించువాడు.

ఆప్తసురభూజ = ఆప్తులగువారికి కల్పవృక్షము.

ఖగతురంగ = గరుడవాహనుడు.

కరుణారస వరుణాలయ = కరుణకు సముద్రమువంటివాడు.

ధృతరధాంగ = చక్రమును ధరించువాడు.

ముఖజిత కుముదహిత = ముఖకాంతిచే చంద్రుని జయించినవాడు.

భగవంతుని అనుగ్రహమును సంపాదించుటకు ఎన్నో సాధనములు. విశ్వసుందరమైన భగవత్సౌందర్యవిభూతియందే రక్తులై, సౌందర్యార్చన చేసి,

భగవంతునితో తాదాత్మ్య మందిన భక్తులెందరోవున్నారు.

సమస్త జగత్తునకు జీవమే సౌందర్యము. ఏది సత్యమో, ఏది మంగళప్రదమో అదియే సుందరం. ఈ ప్రపంచమునందలి సర్వవస్తు సౌందర్యమునకు కేంద్రము భగవంతుడే.

శ్రీ త్యాగరాజస్వామి వారు శ్రీరాముని తన నేత్రములచే దర్శించిన మహానుభావు డగుటచే ఈకీర్తనయందు ఆ దివ్యమూర్తి దర్శనమందు తన అనుభవమును, ఆనందమును కీర్తించుకొనుచూ, పల్లవిలోనే “రామా! నిన్ను కనకన రుచిరా…. “అంటూ ఆ భగవంతుని రూపలావణ్య శోభను వర్ణించారు.

ఆయన బాల సౌందర్యమునకు ఉదాహరణగా “పాలుగారు మోమున…“ అని,

కలకలమను ముఖకళగల సీత, ఇంతటి సౌందర్యవంతుడు, మహావీరుడు తనకు భర్తగా లభించెనని ఆనందముతో, సిగ్గుతో, ఓరకన్నులచే చూసినట్లుగా వర్ణించారు.

సవతి తల్లి మాటలు బాధపెట్టగా, ధృవకుమారుడు శ్రీహరిని ధ్యానించి దర్శించినాడు.

పక్షి రాజైన జటాయువునకు అవసానకాలమందు దర్శనమిచ్చి, మోక్షమిచ్చిన నీలోని కరుణ వలన నిన్ను కనకన రుచి ..

నారద, పరాశర, శుక, శౌనక, పురందర మొదలగు గురుతుల్యులైన ఎందరో రాముని  సౌందర్యానందానుభవమును అనుభవించిన వారిని కీర్తించి, ఆ విధముగా నాకు మోక్షమొసంగుమని పార్ధించినారు.

ఈ రాగములోని కొన్ని సినిమా పాటలు:

పాట-సినిమా

1. అదిగో భద్రాద్రీ – అందాల రాముడు

ఇదిగో భద్రాద్రి – రామదాసు ( కంచెర్ల గోపన్న) కృతికి మార్పు.

2. కావవే మమ్ము దేవి – విమల

———————————————–0—————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *