May 6, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 7

రచన:- టేకుమళ్ళ వెంకటప్పయ్య

Mumbai-Balaji-Mandir-Nachiyar-Thirukolam-2014-03

దైవీభావము నిండిన శరీరము మాత్రమే విషయవాంఛలకు దూరమై ఉంటుందన్న విషయం అందరూ ఎరిగినదే! వంచన, కపటము వంటి దుర్గుణములు మనిషికి సర్వ సాధారణం. మనము పంచ జ్ఞానేంద్రియముల ద్వారా.. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మముల ద్వారా అనుభవించే పంచతన్మాత్రలు అంటే చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శలు, మనస్సులో విషయాలుగా పరిణామం చెందుతాయి. ఈ జ్ఞానేంద్రియాలవల్ల కాక మనకు వేరే ఏ విధంగానూ బయటి విషయాలు లోపలికి చేరవు, మనస్సుకి అందవు. అలా మనలోకి ప్రవేశించే బాహ్య విషయాలను పట్టుకున్న మనస్సు వాటికి అలవాటు పడి మళ్ళీ మళ్ళీ అవే కావాలని పరితపిస్తుంది. వాటికోసమే ప్రాకులాడుతుంది. ఇంకా… ఇంకా.. కావాలని అడుగుతూనే ఉంటుంది. ఇలా ఎప్పుడూ విషయవాంఛలలో నిండిన మనస్సు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? భౌతికసుఖ ఆశ మనిషిని అంతకంతకూ సుఖరహితుణ్ణి చేస్తుంది. జీవితమంతా ఇలానే గడిచి అలాంటి దిగుళ్ళతోనే మరణించవలసి వస్తుంది. దీనికంతటికీ మూలం ఈ దేహం అశాశ్వతం అన్న ప్రకృతి సత్యాన్ని మానవుడు గుర్తించకపోవటమే! అది గుర్తించ గలిగిన రోజు అంతా బ్రహ్మానందమే! అలా గుర్తించగలిగే శక్తిని ప్రసాదించమని వేంకటేశ్వరుని ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.. జ్ఞానాన్ని ప్రసాదించమని సమస్త భక్తకోటి తరఫునా దీనంగా ఆర్తితో అర్ధిస్తున్నాడు.

పల్లవి: ఎన్నడు విజ్ఞానమికనాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా
చ.1. పాసిన బాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన దొలగవు కోరికలు
గాసిలి చిత్తము గలిగినన్నాళ్ళు ||ఎన్నడు||
చ.2.కొచ్చిన గొరయవు కోపములు
గచ్చుల గుణములు గలనాళ్ళు
తచ్చిన తలగవు తహతహలు
రచ్చలు విషయపు రతులన్నాళ్ళు ||ఎన్నడు||
చ.3. వొకటికొకటికిని వొడబడవు
అకట శ్రీవేంకటాధిపుడ
సకలము నీవే శరణంటే యిక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||ఎన్నడు||
(రాగిరేకు 358 – సంకీర్తన సం.343)

విశ్లేషణ:
పల్లవి: ఎన్నడు విజ్ఞానమికనాకు
విన్నపమిదె… శ్రీ వేంకటనాథా….

జీవితాంతం మనుష్యులు విపరీతమైన విషయవాంఛలతోనూ, భౌతిక దేహపువాసనలతోనూ మధనపడుతూనే ఉంటారు. అలాంటి జీవుల వేదనను గమనించిన అన్నమయ్య .. “ఓ శ్రీ వేంకటేశ్వరా! నాకు ఎప్పుడు నాకు జ్ఞానం గలుగుతుంది స్వామీ! ఎప్పుడు నేను ఉద్ధరింపబడతాను. జీవితాంతం ఇంతేనా? ఇది నా విన్నపం.. నా మొర విని నాకు జ్ఞానాన్ని సద్గతినీ ప్రసాదించలేవా స్వామీ” అని అంటున్నాడు అన్నమయ్య.

1. పాసిన బాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన దొలగవు కోరికలు
గాసిలి చిత్తము గలిగినన్నాళ్ళు
వాస్తవంగా బంధం లేని జీవితం ఏదీ వుండదు. వాటికి దూరంగా పారిపోవాలనుకోవడం కూడా అసాధ్యం. ఐతే తామరాకు మీది నీటిబొట్టులా బంధాలలో ఉండే తృప్తినీ అనుభవిస్తూ, ఆనందాన్ని పొందుతూ, పంచుతూ, ఏ క్షణాన్నైనా బంధాలను విడిచిపెట్టగలిగే మానసిక పరిపక్వత కోసం సాధన చేస్తూ, అంతిమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేయాలి. అపుడు బంధాల బరువులు తగ్గి మనస్సు తేలికై భగవంతుని చేరుకునే మార్గం సుగమమవుతుంది. నిజమే! పుట్టుకతోనే మనిషికి బంధాలు ఏర్పడుతాయి. తన ప్రాణం పోయేవరకు బంధాలను పెంచుకుంటూనే వుంటాడు. ఒక్కోసారి నేను లేకపోతే ఈ ప్రపంచమంతా ఏమైపోతుందో అన్న మాయలో పడిపోతాడు అమాయకుడైన మానవుడు. ఈ బంధాలు అశాశ్వతమని, తన జీవితం ముగిసిపోగానే అవి కూడా అంతమైపోతాయన్నది కఠోర సత్యమైనప్పటికీ బంధాలను తెంపుకోడానికి ఇష్టపడడు. అయితే గమనించవలసిన సత్యం ఏమంటే..బంధాలు పూల తీగెలలాగా ఆహ్లాదాన్ని పంచి యిచ్చేవిగా భావించాలి. ముళ్ళతీగెలాగా గుచ్చుకొని బాధించే స్థితిని తెచ్చుకోకూడదు. అందుకే మనిషి జీవితం నరకమయేది. ఆశ ఈ దేహాన్ని నడిపిస్తుంది. ఆ ఆశలను అణచగలిగితే సర్వం సుఖమయమే!జనక మహారాజు లాంటివారు సైతం తామరాకుమీద నీటి బొట్టు చందంగా బంధాల ధర్మాలను నిర్వర్తించారు. జీవిత బంధాలను ఏర్పరచుకునేది మనమే. మనం దీనికి కర్తలమనే విషయాన్ని గుర్తించక బంధాలను బిగించుకుంటూ పోతూ బాధపడిపోతూ, ముక్తినివ్వమంటూ భగవంతునితో మొరపెట్టుకోవడం సరియనదేనా? ఆ విషయాన్నే అలోచించమని భక్తులకు అన్నమయ్య వినతి.
మనిషి మనసు కోరికలకు పుట్టినిల్లు. మనిషి మనసులో ఉన్న సాధారణ అశ అత్యాశగా రూపాంతరం చెందుతుంది. శృతిమించిన అత్యాశ అన్నింటిని నట్టేట ముంచుతుంది. భావిలో తోడినకొద్దీ నీరు ఊరినట్టు కోరికలు తీరిన కొద్దీ కొంగ్రొత్తవి ఊరుతూనే ఉంటాయి.. సదా.. ఊరిస్తూనే ఉంటాయి. కోరికల్ని పెంచుకోవడం అంటే ఆగ్నికి ఆజ్యం పోసినట్టే. పెరగడమే కానీ, తరగడం ఉండదు. తృప్తి ఉండదు, శాంతి ఉండదు. కరుణ ఉండదు. దేవుని పట్ల భయముండదు. అవే ‘కామా తరాణాం న భయం న లజ్జ’ స్థాయి కి చేరుకుంటే మనిషిని కబళిస్తాయి, శాంతిని మింగేస్తాయి. జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేస్తాయి. కోరికలు తప్పుడు కోరికలు కానంత వరకు ప్రమాదం కాదు. పచ్చని సంసారాన్ని, చక్కని సంతానాన్ని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత హోదాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంలో తప్పులేదు. కానీ మితి మీరితే? చినుకు చినుకే వరదవుతుంది. కడవ..కడవా కలిసి కడలవుతుంది. మనం చేసే మంచికయినా, చెడుకయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనిషిని బంధించేవి ఆశామోహాలనే కోరికలే సర్పాలు. ఆశ విష సర్పం లాంటింది. పాము పడగమీద మణికోసం పుట్టలో చేయి పెట్టడం ఎంత ప్రమాదకరమో, దురాశతో విపరీతమైన కోరికలకోసం వెంపర్లాడటమూ అంతే ప్రమాదకరం. మానవులు ప్రధానంగా ఆశ్రయించాల్సింది బుద్దినే. ఆ బుద్దినే ప్రఙ్ఞ అనికూడా అనవచ్చు. ఆ ప్రఙ్ఞ ఉన్నప్పుడే తృప్తి లభిస్తుంది. అలాంటి చిత్త ప్రవృత్తి మనిషికి అవసరం.

2. కొచ్చిన గొరయవు కోపములు
గచ్చుల గుణములు గలనాళ్ళు
తచ్చిన తలగవు తహతహలు
రచ్చలు విషయపు రతులన్నాళ్ళు…

అబద్ధాలు, కపటాలు, మోసాలు మనిషికి సర్వ సామాన్యం ఈ లౌకిక ప్రపంచలో. అవి మనిషిని అన్ని విధాలా కోపతాపాలకు ఈర్ష్యా ద్వేషాలకు గురి చేస్తూనే ఉంటాయి. మనిషికి ఎంత వదిలించుకుందామన్నా తహతహ (ఉత్కంఠత) తగ్గదు. గుట్టు రట్టవుతున్నా కోరికలు అణగిపోవడంలేదు. ప్రతి మనిషీ రెండు ముఖాలతో కనిపిస్తాడు. ఆధ్యాత్మిక ముఖం ఒకటైతే రెండోది లౌకిక ముఖం. ఈ రెండూ పరస్పరాశ్రితాలు గా పైకి మనకు కనిపించినా లౌకికత కోరికలు ఆధ్యాత్మికతను పక్కకు నెట్టడం గమనించ వచ్చు. మనిషికీ అంతర ప్రపంచం మూడు స్థాయిలలో ఉంటుంది. అవి జీవేచ్ఛ-స్వభావం-సంకల్పం. జీవేచ్ఛ అంటే ఒక మనిషి ఎందుకు జీవిస్తున్నాడో, ఎందుకు మనుగడ సాగిస్తున్నాడో, అతని వాస్తవ జీవిత లక్ష్యమేమిటో అదే అతని జీవేచ్ఛ. ఇది దోషరహితమైనది. ఇది జీవుని స్వస్వరూపం. జీవేచ్ఛలో దోషం ఉండదు. జీవేచ్ఛ ఎంత స్వచ్ఛమైనదైనా మనిషి దాన్ని వెంటనే ఆచరించలేడు. దానినే స్వభావంగా కలిగి ఉండాలి. తరువాత ఆ స్వభావాన్నే సంకల్పించాలి. సంకల్పంగా అది మార్పు చెందినపుడే అది ఆచరణలోకి వస్తుంది. అంటే జీవేచ్ఛ స్వభావంగా మారి, ఆ స్వభావం సంకల్పమైనపుడే అది ఆచరణలోకి వస్తుంది. అంటే ఆ మూడింటి మధ్యన సమన్వయం ఉండాలి. ఈ ప్రక్రియలో జీవేచ్ఛనుండి స్వభావం విభేదిస్తే ఆ విభేదించిన స్వభావాన్నే ఆచరిస్తే జీవేచ్ఛ ఆచరణలోకి రాక దానితో విభేదించిన స్వభావం మాత్రమే ఆచరణలోకి వస్తుంది. కనుక ఆ మనిషి యొక్క వాస్తవ జీవన లక్ష్యం నెరవేరదు. మరో సందర్భంలోనైతే అలా విభేదించిన స్వభావాన్ని సైతం ఆచరించలేని అసమర్ధత కూడా కలిగి ఉండవచ్చు. అంటే స్వభావం ఒకటైతే సంకల్పం మరోటి అవుతుంది. అది ఇంకా హీనత్వానికి దారితీస్తుంది. అంటే జీవేచ్ఛననుసరించి స్వభావం ఉండదు. స్వభావాన్ననుసరించి సంకల్పం ఉండదు. జీవేచ్ఛ పరిధిలోకి వచ్చే కోరికలు నిరభ్యంతరంగా ఉండవచ్చు. జీవేచ్ఛకు ఇతరమైన కోరికలున్నపుడు జీవేచ్ఛకు, స్వభావానికి వైరుధ్యం ఏర్పడుతుంది. ఇది వాంఛనీయం కాదు. మనిషి యొక్క పారమార్ధిక భ్రష్టత్వానికి మరియు ప్రవృత్తి నివృత్తి చక్రానికి దారితీస్తుంది. జీవేచ్ఛకు ఇతరమైనటువంటి కోరికలేవీ లేనపుడు జీవేచ్ఛే స్వభావంగా ప్రతిబింబిస్తుంది. ఇది ఆదర్శస్థితి. జీవేచ్ఛకు ఇతరమైన కోరికలన్నీ అణగిపోవడానికి వైరాగ్యం ఒక్కటే మార్గం అని ఉపదేశిస్తున్నాడు అన్నమయ్య.

3. వొకటికొకటికిని వొడబడవు
అకట శ్రీవేంకటాధిపుడ
సకలము నీవే శరణంటే యిక
వికటము లణగెను వేడుక నాళ్ళు…

కోరికలు చావడం – మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగడం అనేవి పరస్పర విరుద్ధ విషయాలు. ఈ రెండిటికీ పొంతన కుదరడం చాలా కష్టం. అందువలననే మన రక్షణ బాధ్యతను మనం పరమాత్మకు అప్పగిస్తూ, ఆయన పాదాలచెంతన నిలచి చేసే ప్రార్థనే శరణాగతి. మన కష్టాలను ఈడేర్చే పరంధాముడు శ్రీవేంకటేశ్వరుడు. సకలమూ సర్వమూ నీవే అని ఆయనను శరణు వేడితే..మనకు సర్వ సుఖములూ కలుగుతాయి. ఆ సుఖము శాశ్వతమైనది.

అనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం/రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వ వరణం తథా /ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతిః ॥ అని శరణాగతి ఆరు లక్షణాలను కలిగి ఉంటుంది. ద్రౌపది, గజేంద్రుడు, విభీషణుడు మొదలైనవారు చేసిన శరణాగతి లోకంలో ప్రసిద్ధిని పొందినది. శ్రీమద్రామాయణంలో ఎన్నెన్నో శరణాగతి ఘట్టాలు మనకు సాక్షాత్కరిస్తాయి.. సర్వేశ్వరుడైన, సర్వజగద్రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరుని శరణు వేడుదాం. సకల శుభాలను పొందుదాం అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు. తహతహ = ఉత్కంఠత; రచ్చలు =రట్టులు; గచ్చులు = మాయలు; కొరయు= తొలగు; గాసిలి = బాధ; వికటము = నష్టములు; పాయవు = విడువవు.

******************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *