May 6, 2024

అన్వేషణ

రచన: సుపర్ణ మహి

చిగురు పచ్చని దుప్పటి కప్పుకుని పడుకున్న
కొండ సానువుల నడుమ
అలవాటుగా సుడులు తిరిగే
చల్లగాలిలా నడిచొస్తుంది డాబా మీదకి….

చెప్పడానికి నేను మాటలన్నీ సిద్ధం చేశాక,
మౌనం వొదిలిన యోగి
ఆర్తితో మోకరిల్లిన ఆరాధకుణ్ణి చూస్తున్నట్లుగా అంటుంది…
‘సారీ రా చాలా లేటయింది కదా…’

గడిచిపోయిన కాలమంతా
కూడబలుక్కుని మిగిల్చిన అద్భుతం కదా ఇది…
ఎవరికి గుర్తుంటుంది ఆలస్యం అనడానికి
యుగాల క్రితం మొదలయిన ఈ అన్వేషణకి
మొదటి నిముషం ఎప్పుడు మొదలయిందో…

చుట్టుకొచ్చిన స్కార్ఫ్ చుట్టేస్తూ… ‘చెప్పు.. ఇంకా…?.
అని…అడుగుతుంటే…
మధ్యలో నువ్వేంటని
మబ్బుతెరల్ని నెట్టేస్తున్న చందమామలాగే ఉంటుంది
తనచ్చంగా ఆక్షణాన…

‘…ఏదో ఒకటి నువ్వే మాట్లాడకూడదా…’ అంటే…
భక్తుడు అడగబోయే కోరిక
ముందే తెలుసుకున్న ఇష్ట దేవతలా నవ్వుతూ అంటుంది
‘ఏయ్ ఇక నువ్ మారవా..? అని…

ఆరోజే తనతో చెప్పుంటే బావుండేదేమో అని
లోపల ఇప్పుడనిపిస్తుంటుంది…
‘నువ్వు నా ఎదురుగా ఉంటే….
అనంత జన్మాలు ఈదులాడే ఈ కాలం కొలనొడ్డున కూర్చుండి
నన్ను నేనే తనివి తీరకుండా
ప్రతిబింబాన్నై చూసుకుంటున్నట్లుంటుందీ’… అని…

***********************************

11 thoughts on “అన్వేషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *