May 6, 2024

ఉగాది కవితలు – సాధారణ ప్రచురణ

ఉగాది సందర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన కవితలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైనవి:

జీవితం -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

జీవితం ఇంద్రధనుస్సులా
ఆకర్షణీయంగా కనిపించాలి
ఆనందాంబుధిలో అనుక్షణం ఓలలాడాలి
మధుర తాయిలాలని ఒక్కసారన్నా రుచిచూడాలి
సౌగంధికపుష్ప సుకుమారత్వం
అణువణువునా గోచరించాలి
పంచేంద్రియాలను మధురానుభూతుల
భావనలు ముప్పిరిగొనాలి
ఇలాంటి అందమైన అనుభూతులన్నీ
మనకి కావాలనుకుంటే ఎలా?
షడ్రుచుల కలయికే జీవితం అన్న
స్థితప్రజ్ఞత అలవడడానికే
వత్సరానికోసారి షడ్రుచులపచ్చడి సందేశం
వర్తమానం ఎలావున్నా..భవిష్యత్తుపట్ల
జాగరూకత ఎరకపరచేదే పంచాంగశ్రవణం
ఎండలు మండిపోతున్నా_
కమ్మని గొంతుతో సేదదీర్చే కోయిల..
లేచివుళ్లతో కళ కళ్లాడుతూండే చెట్లూ..
నిజమైన వ్యక్తిత్వ వికాసానికి చిరునామాలు
అన్నింటికన్నా ముఖ్యంగా
ఈ భూలోకం మనందరికీ కొంతకాలపు విడిది
వచ్చాం..ఆనందించాం..వెళ్లిపోతామనుకుంటే
అసలు ఏ ఇబ్బందీ ఉండదు
ఎటొచ్చీ..నేనూ..నాదీ అనుకుంటేనే చీకూ చింతా!

*****************************************

కొత్త రాగం – గొట్టిపర్తి యాదగిరి రావు

కోయిల
తన బాణీలను మార్చుకొని
సరికొత్త రాగం తీస్తోంది
మామిడి కాయ
వేప పూతలు
తమ సహజత్వాన్ని కోల్పోయి 
కృత్రిమత్వానికి
దారులు వెతుక్కుంటున్నాయి
దేశభక్తిని
తలపై టోపీలా పెట్టుకుని 
దేశమాతను
అవమానాల పాలు చేస్తున్నవాళ్ళను
పెంచి పోషించే రోజులు దాపురించాయి
చట్టసభలు
చుట్టాలను, ఆశ్రితులను
అక్కునజేర్చుకుని
అందలాలెక్కించే వనరులయ్యాయి
రాజకీయాలు 
అరాచకీయాలయ్యాయి
అయినా 
సరికొత్త ఉగాది వచ్చిందని
కోయిల
తన రాగాలకు
మెరుగులు దిద్దుకుంటోంది

**************************

ఏదీ, మన ఉగాది…? -సుజాత తిమ్మన…
సోయగాల బొండుమల్లి సుగంధాలు విరజిమ్ముతూ
ఆసాంతం విచ్చుకున్న వేళ…
అలుకలతో అసుర సంధ్య…పడమటింటి గడప దాటిన
సూరీడుకి వీడ్కోలు పలికిన వేళ…
గగన సీమ తన జేగురు వర్ణపు మోమున
నల్లని మేలిముసుగు కప్పుకునే వేళ…
చైత్రమాసపు ఆరంభానికి సూచనగా…
అలవోకగా నెలవంకయై దొర నవ్వులు కురిపిస్తూ…
పాడ్యమి నాటి చంద్రుడు…
చెంతనున్న తారకతో చిక్కని సరసాల తేలుతూ…
మింటి రథంలో…ఊరేగుతున్నాడు…

మాఘంలో మావి చిగురులు మేసి మేసి,
మంద్రమైన మధురమైన స్వరాన్ని సంతరించుకున్న
మత్తకోకిల…తన గొంతును సవరిస్తూ….
కుహు కుహూ రావాలతో…స్వాగత గీతాలాపనల ….
ఆహ్వానిస్తోంది మన వసంత రాజును…
కొమ్మల నిండుగా గుత్తులు గుత్తులలుగా వేప పూవులు…
ముత్యపు సరముల వోలె అగుపిస్తూ, మురిపిస్తున్నాయి….
పిందెల స్థాయిని దాటేసిన మామిడికాయలు
తల్లుల ఒడిలోంచి తొంగి తొంగి చూస్తూ..
పచ్చపులుపు వాసనలతో..మరీ మరీ పిలుస్తున్నాయి ఆమని రాణిని…

బొబ్బట్లూ, పులిహోరా, పాయసం, గారెలే కాక…
ఆరు రుచులూ మేళవించిన ఉగాది పచ్చడిని…
ఉదయానే ఆరగించిన తెలుగు ప్రజలు…
తీపిలోని మమతను, చేదులోని అసహనతను…సమంగా ఆస్వాదిస్తూ…
దేవాలయపు అరుగులపైకూర్చొని..పంతులు గారుచెప్పే..పంచాంగ శ్రవణం వింటున్నారు…

అయ్యయ్యో, అప్పుడే అయిపోయిందా ఈ ఉగాది?
లేదు లేదు… కాదు కాదు…
సమస్యలను సైతం నిర్భీతి గా ఎదుర్కొంటూ…
ఎదుటి మనిషిని మనవాడి గా ప్రేమిస్తూ…
దీన జనావళికి నీ చేయిని ఆసరాగా ఇస్తూ…
ఆత్మ విశ్వాసం అనే ఆభరణాన్ని అందంగా అందరం ధరిస్తే…
రాబోయే క్షణం మనదవుతుంది…అప్పుడు…ప్రతి రోజూ నవ్వుల పంటలే…
ఆనంద నందనాలు విరబూసి…… కురిపిస్తాయి విరిజల్లులను…..
ఇక ఆపై…..ఇంటింటా…ఊరూరా నిత్య ఉగాదులే!!!

*************************************

// ఉగాది // -వేంకటరమణ వెలపర్తి

అదిగదిగో వస్తున్నది
మంచు పూలలంకరిచిన కాలాన్ని తరిమివేయుచూ
సహజ లావణ్యానికి సరికొత్త వన్నెలద్డుతూ
వాసంత సమీరాల హాయిని తెస్తూ
శ్రావ్యసరాగాలు ఆలకింపజేయుచూ
యుగారంభపు గురుతుగా
వస్తున్నదదిగో
నిస్తేజ తరువులకు ఆమని సొగసులనద్దగ
తీపి, చేదుల జీవితసారాన్ని తెలియజేయగ
కాగల కార్యాలు విశదపరచగ
మామిడి రుచులను ఆస్వాదింప చేయగ
రామయ్య కల్యాణానికి కోలాహలము సేయ
చైత్ర రథంపై వస్తున్నది నూతన తెలుగు సంవత్సరాది !!

************************************

కొత్త తాయిలం -పి.వి.ఎల్.సుజాత

నిత్యం ఎగరడమే కాదు
పడిపోతుంటే॑..అదో అనుభవం
తీపి కాకుండా
చేదు నాలుకకు తగులుతుంటే
అదో అనుభూతి
నల్లేరు మీద బండి నడకేకాదు
పల్లాల్లోకి జారిపోతున్నా అదో గుణపాఠం
ఉగాది పచ్చడి చెప్పేదదే
చీకటి వెలుగుల్లో
కాంతి పుంజం వైపే చూపుసారించమన్న
ఆశావహధృక్పథం..పంచాంగ శ్రవణం
కర్ణ కఠోర శబ్దాలకు అలవాటైన చెవులకు
కోకిల కూజితమో సాంత్వన
ఉగాది అంటే మనసుకు కొత్త తాయిలమే
శరీరానికి సరికొత్త ఉత్సాహమే!

*********************

ఉగాది (తెలుగు ఘజల్) శ్రీనివాస్ ఈడూరి

కోకిలమ్మ కుహూ కుహూ అంటేనే ఉగాది
పచ్చడిలో ఆరు రుచులు ఉంటేనే ఉగాది

ఒకవర్గం బాగుపడితె ప్రగతికెలా చిహ్నము?
ముప్పొద్దుల సామాన్యుడు తింటేనే ఉగాది

ఇంటిలోన పోరుంటే నిదురెక్కడ కంటికి?
ఇల్లాలికి కొత్తచీర కొంటేనే ఉగాది

ఏడాదిలొ ఆదాయం ఎట్లుండునొ ఏమో
పంచాంగపు మంచిమాట వింటేనే ఉగాది

పచ్చదనపు సహవాసం మానవులకు మంచిది
చుట్టూతా చిగురాకులు కంటేనే ఉగాది

ఈడూరీ రోజంతా మోగుతుంటె టీవీ
కవితలన్ని వినాలంటె తంటానే ఉగాది

*****************************

“ఉగాదికి స్వాగతం”

సిరి.లాబాల 

రంగురంగుల పువ్వులను చూస్తూ
తన్మయత్వంతో నర్తించాలి అనుకున్న మయూరం
చిగురేసిన కొమ్మలను చూస్తూ
కుహుగానాలను తీయాలనుకున్న కోకిల
గుబురుగా ఉన్న మొక్కలను చూస్తూ
పచ్చని పైట వేసుకోవాలనుకున్న ప్రకృతి
కళా విహీనంగా ఉన్న పుడమితల్లిని చూసి
ఒక్క క్షణం బిక్కమొహం వేసాయి !!

బహుశా  తాము ఊహల్లో
ఊహించిన వాస్తవాలు కానరాక అనుకుంటా
నిజమే మరి మారుతున్న రోజులతో పాటు
మనిషి ఆలోచనల్లో మార్పులో
పాశ్చాత్య పోకడల అలవాట్లో మరి

కలికాలంలో మనిషి
తన చుట్టూ ఉన్న చెట్లను నరికేస్తూ
ఉర్వి గుండెల్లో అడుగడుగునా శిలువలు వేస్తూ
రాబోయే తరాల జీవితాన్నే
ప్రశ్నార్ధకం చేసుకుంటున్నారు
తెలిసి తెలిసి మనుషులనే
కబళించే సునామీలనే 
సృష్టించు కుంటున్నారు
తినాల్సిన తాగాల్సిన ప్రతి వస్తువును
కల్తీలతో  కలుషితం చేసి తన అయువునే
అర్దాయుస్సు గా మార్చుకుంటున్న  
మనుషుల జీవితాల్లోకి “ఉగాదికి స్వాగతం”…

2 thoughts on “ఉగాది కవితలు – సాధారణ ప్రచురణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *