May 5, 2024

ధీర – 4

రచన: లక్ష్మీ రాఘవ

IMG_1192
“జోలెపాలెం మంగమ్మ”
ఈ పేరు ఎక్కడో విన్నట్టు లేదూ?
ఎక్కడో ఏమిటండీ AIR [All India Radio] లో తెలుగు వార్తలు గుర్తుకు రాలేదూ??
“వార్తలు చదువుతున్నది జోలెపాలెం మంగమ్మ….” టంచనుగా పొద్దున్న ఏడు గంటలకు రేడియోలో వినబడే చక్కటి స్వరం, స్పష్టంగా పలికే పదాలు. ఎక్కడా తడబాటు లేకుండా సాగిపోయే తెలుగు వార్తలు…
ఎంతమందినో అలరించిన గొంతుక…చాలా మందికే గుర్తుండిపోయింది.
ఆవిడే మొట్టమొదటి తెలుగు మహిళా న్యూస్ రీడర్.

IMG_1190
కాలం మారింది…
ఇప్పుడు వార్తల కోసం రేడియో వినక్కరలేదు. నిర్ణీత సమయమూ అక్కర లేదు.
టి.వి. లు, న్యూస్ చానెళ్ళు, సోషియల్ మీడియాలు, గూగుల్ సర్చ్ లు ఎన్నో ఎన్నెన్నో…
అయినా పాత తరం వారికి గుర్తుకు వచ్చేది రేడియో వార్తలే.
అందరికీ సుపరిచితమైన ఆమె స్వరం ఏమైంది? ?
రేడియో నే కాక రిసెర్చ్ లోనూ, I and B ministry లో ఏంతో గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తీ
‘ధీర’ లో పరిచయమా ??…. సందేహం వద్దు…
ఏ వ్యక్తీ పుట్టుకతో గొప్ప వాడు కాదు. ఏంతో సంకల్పం, కృషి చేస్తేనే ఒక స్టేజి కి రాగలం.
ధీర అంటే ధైర్యవంతురాలు, ఆత్మవిశ్వాసం కలది అని అర్థం అయినప్పుడు మారుమూల ప్రాంతానికి చెందిన ఒక ఆడపిల్ల ధైర్యంగా, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా ప్రయాణించి స్థిరపడటమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేసి సాధించిన జయాలు అసాధారణ మైనవి. అంతేకాదు రిటైర్ అయి సొంతవూరు మదనపల్లె చేరినా విశ్రాంతి తీసుకోకుండా విద్యారంగానికి అవిరామంగా కృషి చేస్తూ వున్నారంటే ఆవిడ ఎంత కార్యసాధకురాలో అర్థం అవుతుంది. వయసు తొంబై ఏళ్లు దాటినా అందరికీ సాయపడాలన్న తాపత్రయమే ఆవిడను ఆరోగ్యవంతురాలిగా వుంచుతోందని అంటే అతిశయోక్తి కాదేమో!

IMG_1195
అంతటి వ్యక్తిత్వం గల ‘జోలెపాలెం మంగమ్మ’ జీవితం చదివితే ధైర్యం, పట్టుదల కృషి కలిపితే సక్సస్ ఎలా వస్తుందో తెలుసుకోవచ్చుననే చిన్న ప్రయత్నం ‘ధీర’ లో మంగమ్మ గారి పరిచయం.
చిత్తూరు జిల్లాలో చల్లని వాతావరణానికి పెరుగన్న మదనపల్లెలో జోలెపాలెం సుబ్బయ్య లక్ష్మమ్మల ఆరుమంది సంతానంలో రెండవ సంతానం మంగమ్మ 12-9-1925 లో పుట్టారు. నాలుగవ ఏటనే అమ్మినేని వీధిలో గుడి దగ్గర వున్న వీధి బడికి అన్నతో బాటు వెళ్లటం నేర్చుకుంది. తరువాత హోప్ హైస్కూల్ లో, థియోసాఫికల్ స్కూల్ లో చదివి, B.A. థియోసాఫికల్ కాలేజీ లో పూర్తి చేసుకున్న తరువాత పెద్ద చదువులు చదవని ఇంటి పెద్దలతో చర్చించి తనకు తానుగా గుంటూరు దాకా ప్రయాణం చేసి B.ed college లో admission తెచ్చుకుని బ్రాడీపేటలో హాస్టల్ లో వుంటూ చదువుకుని కాలేజీ ‘best student of the year’ Medal తీసుకున్నారు.
B.ed పూర్తి అయిన వెంటనే ఈమె ప్రతిభను గుర్తించి గుంటూరులోని “ secondary grade training school “ లో హెడ్ మిస్ట్రెస్ గా ఉద్యోగం ఇచ్చారు. అలా 22 ఏళ్ల వయసులో ఈ బాధ్యత స్వీకరించడం చక్కగా నిర్వర్తించడం జరిగింది
మదనపల్లెలో ఒక సారి కలిసిన విద్యావేత్త జి.వి. సుబ్బారావు గారు, జిడ్డు కృష్ణమూర్తి గారిచే ప్రారంబింపబడిన ‘రిషి వాలీ స్కూల్’ లో హాస్టల్ ఇంచార్జ్ గా వుండమని అడిగితే 1948- 49 ఒక సంవత్సరం పనిచేశారు. అప్పుడే హిందీ ‘మధ్యమ’ పరీక్ష పాస్ అయ్యారు
తరువాత రిషి వాలీ స్కూల్’ ఒక సంవత్సరం మూత పడటంతో మద్రాస్ లో జి.వి. సుబ్బారావు మరి కొంతమంది టీచర్స్ కలిసి స్టార్ట్ చేసిన ‘బాలభారత్’ స్కూల్ లో అన్ని సబ్జెక్ట్స్ నేర్పుతూ టీచర్ గా పని చేసారు. సిలబస్ అంతా తెలుగులో రాసి చెప్పడానికి చాలా కష్టపడ్డారు. అప్పుడే తమిళం లిపి నేర్చుకున్నారు.
తరువాత కాలంలో గాంధీజీగారు మొదలు పెట్టిన ‘వార్ధా బేసిక్ ఎడుకేషన్ ట్రైనింగ్’ స్కూల్స్ పల్లెల్లోనే పని చెయ్యాలనే ఉద్దేశంతో దమయంతి, లీలావతి అన్న ఇరువురు ఖమ్మం బార్డర్ లో ‘తిరువూరు’ అన్న పల్లెలో ఒక ట్రైనింగ్ స్కూలు మొదలు పెట్టారు. వారు మంగమ్మగారిని టీచర్ గా రమ్మని ఒత్తిడి చేసారు.
మద్రాస్ నుండి ఆంధ్రా వేరు పడ్డాక మంగమ్మ ఆంద్రాలో పని చెయ్యాలనే ఉద్దేశంతో ‘తిరువూరు’ లో టీచర్ గా చేరి హాస్టల్ ఇంచార్జ్ గా కూడా వున్నారు. ఇక్కడ టీచర్స్ తక్కువగా వుండటం వల్ల అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చెయ్యాల్సి వచ్చేది…తెలుగు పద్యాలతో పాటు సైకాలజీతో సహా అన్నీ చెప్పగలిగే ఈమెను ‘సవ్యసాచి’ అనేవారు. ఇక్కడ సుమారు పదేళ్లు పనిచేశారు మంగమ్మ.

1960 లో A.I.R. లో News reader ఢిల్లీ లో పోస్ట్ గురించి పేపర్ లో వస్తే అప్లై చేసి, రాత పరీక్ష హైదరాబాదు వెళ్లి రాసి వస్తే సెలక్షన్ వచ్చినాక వాళ్ళు బెజవాడలో అనౌన్సర్ పోస్ట్ ఇస్తామంటే వద్దని తిరువూరికి వెళ్ళిపోయినారు మంగమ్మ.
మళ్ళీ ఢిల్లీ నుండీ News reader గా రమ్మని 62 లో ఆహ్వానం వస్తే తిరువూరులో అకౌంట్ సెటిల్ చేసుకుని సామాన్లు బస్సు మీద వేసుకుని విజయవాడకు వెళ్లి “రామా ట్రాన్స్పోర్ట్ “ లో మదనపల్లెకు పంపించేసి రెండు సామాన్లతో విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. కానీ స్టేషన్ లో ఢిల్లీకి టికెట్లు లేవనేసరికి టి.సి.తో పోట్లాడి సీటు సంపాదించిన మనిషి ఆమె. ఒక కార్యాన్ని సాధించడానికి ఒంటరిగా పోరాడడానికి ఎప్పుడైనా రెడీ. ఆ కాలంలో ఇది అరుదైన క్వాలిఫికేషన్!
రైల్లో కూర్చున్నాకే తీరికగా తను ఢిల్లీ వెడుతున్నట్టు అందరికీ ఉత్తరాలు రాసి ఒక రైల్వే స్టేషన్ లో పోస్టు చేసారు.
ఢిల్లీ స్టేషన్ లో దిగాక ప్రభు అన్న బాలభారత్ విద్యార్థి సాయంతో వాళ్ళ బావగారు లక్ష్మణరావు ఇంట్లో వుండాల్సి వచ్చింది.
అక్టోబరు రెండవ తేదీన ఉద్యోగం చేరడంతో వర్కింగ్ వొమెన్ హాస్టల్ ల్లో వసతి ఏర్పాటు చేసినారు. అప్పుడు చేరిన రూములోనే 23 ఏళ్లు వున్నారు.
న్యూస్ రీడర్ గా ఎన్నో నేర్చు కున్నారు.
PBI News material నుండి ఆంధ్రాకు తెలుగులో బులెటన్ తయారు చేసుకోవాలి రోజూ.
న్యూస్ రీడర్ తో బాటు ఇద్దరు అసిస్టెంట్ లు వుండేవారు ట్రాన్స్లేషన్(translation) చెయ్యడానికి.
ఒకసారి కే. సుబ్రహ్మణ్యం అనే న్యూస్ రీడర్ ‘ స్పోర్ట్స్ ఐటమ్స్’ రాయగలరా అంటూ క్రికెట్ ఐటమ్ చెయ్యండి అని చెబుతూ వుంటే సరే నని తలవూపిన మంగమ్మతో “మీకు maiden over అంటే తెలుసా అని అడిగారుట.
ఆయనకేమి తెలుసు మంగమ్మ గారు 1941 లోనే కాలేజీ లో క్రికెట్ ఆడి వున్నారని!!
అతితక్కువ కాలం లోనే మంగమ్మ గారు చదివే తెలుగు వార్తలకు ఎంతో ఆదరణ లభించింది.
ఉద్యోగం తరువాత మిగులు సమయాన్ని ఎన్నోవిధాలుగా ఉపయోగించు కున్నారు మంగమ్మ.
National Archives of India, New Delhi లో రిసెర్చ్ చేసి P.hD పొందారు.
ఫ్రెంచ్ లో అడ్వాన్స్ కోర్స్ చేసారు.
IMG_1189
మిసెస్.ఆర్బిన్ దగ్గర Esperanto అన్న భాష నేర్చు కున్నారు. దీనితో మంగమ్మగారు ఆరు భాషలు ..తెలుగు, తమిళం, హిందీ, ఫ్రెంచ్ ఇంగ్లీషు తో బాటు Esperanto తెలిసిన వ్యక్తీ అయ్యారు .

ఇంకా ఇంగ్లీషులో Technical, industrial and agricultural education in Madras (1854-1921)మీద పేపర్ పబ్లిష్ చేసారు. కేంబ్రిడ్జ్ ఒంటరిగా వెళ్లి అగ్రికల్చర్ మీద పేపర్ ప్రజంట్ చేసారు.
Book printing in India [ 1746-1857] మీద రిసెర్చ్ చేసి బుక్ పబ్లిష్ చేసారు.
తెలుగులో కూడా Indian parliament , శ్రీ అరబిందో, సరోజినీ నాయుడు, అల్లూరి సీతారమారాజు మీద పుస్తకాలు రాసారు…
అల్లూరి సీతారామరాజు పైన రాయడానికి పూనుకున్నప్పుడు చింతపల్లెదాకా ప్రయాణించి సీతారామరాజును కట్టి చంపిన చెట్టును చూసి ఆపై కృష్ణదేవిపేటలో ఆయన సమాధిని కూడా చూసి వచ్చారు.. ఈ విషయాలు కళ్ళకు కట్టినట్టు నేటికీ చెబుతారు ఆవిడ!
ఉద్యోగరీత్యా ఒక గుర్తింపు రావడమే కాకుండా 1982 లో NAM conference, New Delhi లో chief editor గా ఉన్నారు.
Indian History Congress లో లైఫ్ మెంబెర్ గానూ,
Indian Redcross society లో Life member గానూ ఉన్నారు.
84లో రిటైర్మెంట్ తరువాత సొంతవూరు మదనపల్లె చేరాక ఐదు ఏళ్లు రిషివ్యాలీ స్కూల్ ల్లో టీచర్ గా పనిచేశారు.
స్థానిక ‘జ్ఞానోదయ స్కూల్ ‘ కమిటీ ప్రెసిడెంట్ గా వుంటూ లో సోషల్ మరియు ఇంగ్లీషు టీచర్ గా ఇప్పటికీ పని చేస్తున్నారు.
ఇంకా ములకల చెరువు ‘గాంధీ ఫౌండేషన్’ కు ప్రెసిడెంటుగా,
మదనపల్లి B.T. College Trust Vice president గానూ,
మదనపల్లె లోని Teachers training ‘Race College’ లో member of governing body గానూ,
మదనపల్లి రచయితల సంఘం [మ.ర.సం.] వైస్ ప్రెసిడెంట్ గా వున్నారు.
న్యూఢిల్లీ తెలుగు అకాడమీ వారు 2000సంవత్సరంలో ఉగాది పురస్కారం ఇచ్చారు.
వీరికి చిత్తూరు జిల్లాలోని “కుప్పం రెడ్డెమ్మ సాహితీ” అవార్డు వచ్చింది.
ఇలా చెప్పుకుంటూ పొతే మరో పేజీ నిండవచ్చు.
IMG_1197
ప్రతి ఒక్కరి జీవితంలోనూ వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అవివాహితగానే వుండిపోయిన ఆవిడ జీవితంలో అనుకొని సంఘటన తమ్ముడు కృష్ణమూర్తి చిన్నవయసులో చనిపోవడం. ఆయన పిల్లలు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి చాలా చిన్నవయసులో వుండటం..కొడుకు మరణం తట్టుకోలేని దశలోవున్నతల్లిదండ్రులు.
అప్పుడు మంగమ్మగారు తీసుకున్న నిర్ణయం ఆ పిల్లల బాధ్యత. ఈ రోజు వారు ముగ్గురూ మంచి చదువులతో గౌరవ ప్రదమైన ఉద్యోగాలతో వున్నారంటే ఆవిడ చలవే. ఇప్పటికీ వారికి అండగా వుండటమే కాదు వారి పిల్లలకు కూడా సాయపడుతున్నారు.

IMG_1191

ఇంటివారికే కాదు ఎవరు ఏ సహాయం అడిగినా ఆప్యాయింగా పలకరించి తనకు చేతనైన సాయం చేస్తూ నిస్వార్థంగా ఇతరుల కోసం జీవిస్తున్నారు
ఈ స్కూల్లో నైనా ఏ టాపిక్ అయినా అనర్గళంగా మాట్లాడగలిగిన ఆవిడను Living Encyclopidia అని ప్రశంసిస్తారు.
90 ఏళ్లు నిండినా, సీనియర్ సిటిజన్ గా వోటర్ల లిస్టులో సీనియర్ గా సత్కారాలు పొందుతున్న ఆవిడ నిరంతర కృషి సలిపే అద్భుతమైన వ్యక్తి…
జీవితంలో ఒంటరిగా పోరాడి గెలిచి అంచెలంచెలుగా పైకి ఎదిగిన వ్యక్తి, తనకు తానుగా ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి..ఇన్ని విశిష్టతలు కలిగిన ఈవిడ “ధీర వనిత” కాక మరేమిటం టారు??

IMG_1204

91 ఏళ్ల వయసులో కూడా అదే గంభీరమైన మంగమ్మగారి గొంతు విందామాఃః.

http://picosong.com/Z3pj/

5 thoughts on “ధీర – 4

  1. అద్భుతమయిన వ్యక్తి మంగమ్మగారు ,ఇంతటి విశిష్టమైన వ్యక్తిని గురించి తెలియజేసినందుకు మాలికకి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *