May 5, 2024

గానగంధర్వ శ్రీ ఇనుపకుతిక సుబ్రహమణ్యంగారితో ముఖాముఖి …

నిర్వహణ: శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి.

ఇనుప
సంగీతానికి ఉర్రూతలూగని మనసు ఉండదు, అది దేశీయ సంగీతమనుకోండి, విదేశీ సంగీతమనుకోండి. ఆ సంగీతానికీ, మనసుకీ ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది. అనారోగ్యాన్ని సైతం దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే శక్తి సంగీతానికి ఉంది. ఈ సంగీతానికి రాగాలు కట్టి శ్రావ్యంగా, ఖచ్చితమైన శృతిలో వినిపించడానికి కృషి సల్పిన వాగ్గేయకారులెందరో ఉన్నారు మన భారత సంతతిలో. మనభారతదేశంలోనే కాదు హిందూ దేవుళ్ళపై పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి సమ్మోహనంగా భజనసంగీతాన్ని అందించే కృష్ణదాస్ లాంటి అమెరికన్ వాగ్గేయకారులు కూడా ఉన్నారు. ఇది ఒక దైవ సంపద, ఈ సంపదని కలిగివుండడం ఒక వరం. ఎన్నో వందల భజన సంకీర్తనలు వింటున్నాం. తరువాతి తరం కూడా నేర్చుకొనే అవకాశాన్ని ఇస్తూ, ఆ సంపదని కాపాడవలసిన భాధ్యత కలిగివుండడం ఎంతయినా అవసరం. ఈ సంపదని కాపాడడంలో, భావితరాలకు అందించడమనే విషయంలో తమ జీవితాలనే ధారపోసిన త్యాగయ్య, పురంధరదాసు, ముత్తుస్వాని ఇలా ఎందరో మహానుభావులున్నారు. ఈ సంగీత ప్రియులందరూ చాలావరకు కీర్తనలన్నీ తెలుగులోనే రచించారు. అది మన తెలుగు గొప్పదనం. తెలుగు పద సాహిత్య కవులలో ఆదర్శమూర్తిగా నిలిచినది పద కవితా పితామహుడు “శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు”. ఆ ఏడుకొండలవానిపై ఈ 15వ శతాబ్దపు కవి వ్రాసిన వేల సంకీర్తనలు జనసాహిత్యానికి దగ్గరై ఆ తరువాత వచ్చిన వాగ్గేయకారులందరికీ మార్గదర్శకమై నిలిచాయి. నిరుత్సాహకరమైన విషయమేమిటంటే అన్నమయ్య దాదాపు 32,000 కీర్తనలను విరచిస్తే, ఆనాడు భద్రపరిచే పరిజ్ఞానం తక్కువవుండడం వల్ల కేవలం 12,000 కీర్తనలు మాత్రమే అదీ కూడా గత అర్ధ శతాబ్దంనుండే లభ్యమయ్యాయి. ఆ దొరికినవి కూడా అదృష్టవశాత్తూ రాయల వంశీకులు రాగిపత్రాలమీద లిఖింపజేసి భద్రపరచడం వల్ల మనకిప్పుడాభాగ్యం కలిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శోభారాజ్ వంటి సంగీత దిగ్గజాలు ఈ కీర్తనలకు బాణీలు కట్టడంలో కృషిచేస్తూనేవున్నారు.

Inupakuttika-1

దక్షిణాపధంలో భజనసంప్రదాయానికి, పదకవితాశైలికి వారధిని వేస్తూ పల్లవి, అనుపల్లవి, చరణాలు, అంకితముద్ర వంటి అంగాలతో కూడిన కీర్తనా స్వరూపాన్ని ఆవిష్కరించిన మొదటి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ అన్నమయ్య. భక్తి, సంగీతం, సాహిత్యం, శృంగారం, వేదాంతం ఇలా అన్ని విభాగాలను మన అన్నమయ్య తన రచనలతో కడు రమణీయంగా స్పృశించాడు. “అదివో, అల్లదివో శ్రీహరివాసము”, “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” అంటూ పరంధామాన్నిజూపిన అవతారమూర్తి, మానవాళిని ప్రేమించడం గూర్చి తెలియజేస్తూ “ఏ కులజుడైననేమి ఎవ్వరైననేమి” అన్న మానవతావాది అన్నమయ్య. “తందనానా ఆహి తందనాన” అంటూ ఐహిక అడ్డుగోడలను ఛేధించమన్న తర్కం, తత్వం ఆయన సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నమయ్య తన కీర్తనలద్వారా ఎన్నో ప్రశాంత జీవనరహస్యాలను తెలియబరిచాడు. అట్టి కీర్తనలకు క్రొత్త స్వరకల్పనలు చేస్తూ, ఆ కీర్తనల అర్ధాలనుబట్టి మరింత మార్దవాన్ని, ఆర్ద్రతని నింపగలిగే క్రొత్తరాగాలలో బాణీలు కట్టి భావితరాలకు అందజేసే వాగ్గేయకారులు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. వీరందరినీ చూస్తే ఆ వేంకటేశ్వరస్వామి ఇంకా తన సంకల్పాన్ని అన్నమయ్యతో సరిపెట్టుకోలేదనిపిస్తుంది. ఇంకా తన సంకీర్తనలను ఈ కలియుగమంతా పాడించుకోవడానికి అన్నమయ్యలను పుట్టిస్తూనే ఉన్నాడనిపిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణగా ఇనుపకుతిక సుభ్రమణ్యశాస్త్రి గారి గురించి నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తాను శ్రీవారి స్వరసేవకు ఎలా పూనుకున్నారో చెబుతూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మాలికకు తెలియజేశారు.

Inupakuttika-2Inupakuttika-3

“శ్రీవారి స్వరసేవ” అనే పేరుతో అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలలో 108 క్రొత్త సంకీర్తనలను స్వీకరించి వాటికి సంగీతం సమకూర్చి స్వరసహితంగా పుస్తకావిష్కరణ గావించారు. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాదు రవీంద్రభారతిలో విశిష్ట అతిధులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. రాళ్ళపల్లి కవితా ప్రసాద్ ఆధర్వ్యంలో జరిగింది.

సుబ్రహ్మణ్యంగారు అక్కడితో ఆగలేదు. తాను రెండేళ్ళు అవిరామంగా కృషిచేసి అన్నమయ్యదే కాకుండా మిగతా వాగ్గేయకారుల (శ్రీ త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, నారాయణతీర్ధులు) కీర్తనలకు కూడా క్రొత్త సంగీతరాగాలను అద్ది వాటికి మరింత మాధుర్యాన్ని తెచ్చారు. అట్టి 120 సంకీర్తనలను నిర్విరామంగా 12 గంటలసేపు హైదరాబాదు నగరంలో పలువురు స్థానికులమధ్య గానం చేసినందుకు “గానగంధర్వ” అనే బిరుదును పొందారు. తరువాత 2012 లో బాపట్లలో సంపత్ గణపతి పరివార్ వాళ్ళు “గానకళాప్రపూర్ణ” అనే బిరుదునిచ్చారు.

ఇక్కడితో తన ప్రయోగాలాగిపోయిందనుకొనేరు!!! లేదుగాక లేదు. ఇప్పటివరకూ కీర్తనల పై, లలితరాగాలపై సంగీతాన్ని సమకూర్చారు, ఇప్పుడు వర్ణాలపై కూడా చెయ్యవలెనని సంకల్పించి నడుంకట్టారు.

ఈ నేపధ్యంలో తన ఇంటిపేరు “ఇనుపకుతిక” గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. వారి ముత్తాతగారు ఆనాటి జమిందారీ వ్యవస్థ కాలంలో సప్తాహం చేశారట, అంటే ఏడు రోజులపాటు నిర్విరామంగా గానం చేయగలగడం. ఆనాటి జమిందారు ఎక్కడా వారా, జీరా రాకుండా ఏడురోజులపాటు పాడగలిగిన ఆతని గొంతుకు ఆశ్చర్యపోయి గొప్పగా అభినందిస్తూ తమిళంలో “ఆయక్కండం” అని బిరుదును ప్రసాదించారుట. ఆయక్కండం అంటే తెలుగులో ఇనుపకుత్తిక అని అర్ధం. కుతిక అంటే గొంతు. అప్పటినుండి ఈ కుటుంబీకులు ఆ బిరుదునే తమ ఇంటిపేరుగా స్వీకరించారుట.

మరో ఆసక్తికరమైన విశేషమేమంటే త్యాగరాజవారి సమాధి తిధి ఏముందో సుబ్రహ్మణ్యం గారు ఆ తిధిలోనే అనగా పౌర్ణమి, పుష్య బహుళ పంచమిన పుట్టారుట. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరూ సంగీతమంటే ఆసక్తిగలవారు. సంగీతంలో డిగ్రీలు పొందాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

1 thought on “గానగంధర్వ శ్రీ ఇనుపకుతిక సుబ్రహమణ్యంగారితో ముఖాముఖి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *