May 5, 2024

GAUSIPS – ఎగిసేకెరటం-4

రచన:-శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి

[జరిగిన కధ: పూనం, పాత్రో, రంజిత్ వాళ్ళు వచ్చేశారు, మొదటిరోజే వాళ్ళని బిశ్వాతో కలవనీయకుండా తెలివిగా తప్పించింది సింథియా. ఛటర్జీ దృష్టిలో బిశ్వాని ఒక నిర్లక్ష్యమయిన వైఖిరి వున్నవాడుగా ఒక ఇటుక పేర్చింది]

సింథియా అదృష్టమేమోగానీ, అన్నీ తాను కోరుకున్నట్లుగానే జరిగిపోతోంది. తన పధకాల ప్రకారమే మనుష్యులు కూడా టకటకా చేసేస్తుంటారు. సింథియాకున్నంత మ్యానేజ్మెంట్ స్కిల్స్ మిగితావారికి లేకపోవడమో లేక వారు తమకనవసరమయిన విషయయాలపై దృష్టి పెట్టకపోవడమో, ఎదుటివారికనవసరమయిన విషయాలని సింథియా తనకవసరాలుగా మార్చుకోవడమో … ఏదయితే ఏం? ఎప్పటికప్పుడు తనదే విజయం. ఈ విజయాలన్నీ సింథియాని ఎక్కడికి తీసుకువెళ్తుందో?

బిశ్వా, అతని సహ కొలీగ్ లంచ్ నుండి తిరిగి వచ్చేశారు. మళ్ళీ తన రూంలోకెళ్ళి లైట్ వేసుకొని కూర్చొని క్రొత్తవాళ్ళకోసం ఎదురుచూస్తున్నాడు. పాపం తనకు తెలియదు కదా, వాళ్ళు ఆల్రెడీ వచ్చి వెళ్ళారని? సాయంత్రం 5.30 అయ్యింది. ఛటర్జీకి ఈ-మెయిల్ ఇచ్చాడు, ఇప్పటివరకూ తాను ఎదురు చూసినట్లు, వాళ్ళు రానట్లు. ఛటర్జీకి మొదటిసారిగా బిశ్వా మీద కోపం వచ్చింది. వెంటనే ఛటర్జీ సమాధానమిచ్చాడు. వాళ్ళు వచ్చి, తనతో మాట్లాడి వెళ్ళారనీ, రేపయినా ఖచ్చితంగా ల్యాబ్ లో ఉండమని.

బిశ్వాకి చాలా ఆశ్చర్యమేసింది. ఈ-మెయిల్ చూసి, వెంటనే ఛటర్జీ దగ్గిరకి బయలుదేరాడు. ఈలోపు ఛటర్జీయే అట్నుండి బిశ్వా చాంబర్ కి వస్తూ కనిపించాడు, ఇద్దరూ ల్యాబ్ లోనే కలిసారు. ల్యాబ్ లోనే ఇద్దరి ఆఫీసు చాంబర్లు చెరికో మూలన ఉంటాయి. ఎవరు బయటకి రావాలన్నా లేదా ప్రవేశించాలన్నా ల్యాబ్ లోపలనుండే.

ఛటర్జీ ఏమాత్రం కూడా బిశ్వాని ఎక్కడికి వెళ్ళావనిగాని, తాను వాళ్ళతో ఏమి మాట్లాడాడనిగాని బిశ్వాని అడగలేదు, కనీసం జరిగింది చెప్పడానికి కూడా అతను ప్రయత్నించలేదు. కేవలం తాను తన కళ్ళతో చూసింది, సింథియా మరియు క్రొత్తవాళ్ళు చెప్తే విన్నది తప్ప…మరొకటి అతను నమ్మలేదు, వినడానికి ప్రయత్నించలేదు. ఆశ్చర్యం. ఇదే సింథియా విజయాలకి కీ పాయింటు.

మరి బిశ్వా మీద ఇన్నిరోజులనుండీ చూపిస్తున్నదేమిటి? అభిమానం కాదా? కాకపోతే మరి సింథియా ముందు అతని కెరీర్ ని టకటకా ఎందుకు చెబుతూ బిల్డ్ చేసేసాడు? ఎందుకు అనవసరంగా సింథియాలో బిశ్వాపై అసూయ రగిలించాడు, సింథియాలో నరాలు తెంపాడు?

ఇద్దరూ ల్యాబ్లో కలిశారు, వెంటనే బిశ్వా తన ధోరణిలోనే పలకరించబోయాడు ముందుగా. కానీ ఛటర్జీ వెంటనే …

యు షుడ్ లీవ్ ఎ మెసేజ్ టు పీపుల్ ఇన్ థ ల్యాబ్, వెన్ యు గో అవుట్ … అన్నాడు ఛటర్జీ.

బిశ్వాకి అర్ధం కాలేదు, తాను చెప్పసాగాడు… ఐ లెఫ్ట్ ఎ మెసేజ్ విత్ సూరజ్ వెన్ ఐ వెంట్ ఫర్ లంచ్. హీ స్టేయిడ్ ఫర్ సమ్ టైం ఇన్ థ ల్యాబ్ అండ్ హి లెఫ్ట్ ఫర్ లంచ్ టూ. డ్యూరింగ్ థట్ టైం నో వన్ కేం టూ ల్యాబ్. వియ్ ఆర్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్ ఫర్ థెం.

బిశ్వా వినే మూడ్ లో లేడు, చెప్పే మూడ్లో తప్ప. బిశ్వా చెప్పిందంతా పక్కన పెట్టేశాడు. “యు షుడ్ లెర్న్ టు గెట్ ఎలాంగ్ విత్ పీపుల్ ఇన్ థ ల్యాబ్, నవ్ ఎ డేస్ టాకింగ్ టు పీపుల్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టంట్” అని టక టకా అనేశాడు. అంతేగాని సింథియా కి చెప్పి వెళ్ళాలి నువ్వు, ఎక్కడికి వెళ్ళినా అని మాత్రం చెప్పలేకపోయాడు. ఎందుకంటే ల్యాబ్ లో పనిచేసే స్టూడెంట్లు గానీ, ఇతర సైంటిస్టులు గానీ సింథియాకి రిపోర్ట్ చెయ్యవలసిన అవసరంలేదు. అఫీషియల్ గా వీళ్ళ మీద అధికారి కాదు సింథియా. సింథియా కేవలం ఛటర్జీ వల్ల అక్కడ ఉంది. అందుచేత, తన మనసులోని మాటని బిశ్వాకి డైరక్ట్ గా చెప్పలేకపోయాడు. బిశ్వాకి అర్ధం కాలేదు తానేం చెప్పబోతున్నాడో. పైగా అంత పెద్ద బ్లేమ్ కూడా వేసేసాడు, తనకి అందరితో కలిసి మెలిసి పనిచెయ్యడం రాదని. బాస్ నోటినుండి అలాంటి మాట వస్తే అది తనకి మంచిది కాదు, అది డామేజ్డ్ స్టేట్మెంట్. ఇలాంటి స్టేట్మెంట్ ఒక్కటి చాలు, తను ఎంతో కష్టపడి, రాత్రీ పగలు పని చేసి తెచ్చుకున్న పేరుని సర్వనాశనం చెయ్యడానికి. రేపొద్దున్న తానేదన్నా క్రొత్త ఉద్యోగాలకి ధరఖాస్తులు పెట్టినా లేక ఫండింగ్ కోసం గ్రాంట్లు వ్రాసేటప్పుడు ఆఖరికి తన ప్రాగ్రెస్ రిపోర్ట్ లో బాస్ అనేవాడు ఇలాంటివి వ్రాస్తే, రికమండేషన్ అడిగినప్పుడు ఇలాగే చెప్తే తన ఎదుగుదల పూర్తిగా కుంటుపడుతుంది.

ఒక్కసారిగా బిశ్వా మానసిక సంక్షోభానికి గురయ్యాడు. ఛటర్జీ తను చె ప్పేది నమ్మలేదు, ఎవరికి రిపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాడో క్లారిటీ ఇవ్వలేదు. అనవసరంగా బిశ్వాకి తన సహకొలీగ్ మీదే అనుమానం వచ్చింది, ఒకవేళ తన వెనుక ఏదయినా తప్పుడు సమాచారం ఇస్తున్నాడేమో అని. దానికి కూడా చాలా బాధ పడడం మొదలుపెట్టాడు. కానీ ఇదంతా సింథియా ప్రణాళిక అయివుండొచ్చని బిశ్వా ఏ మాత్రం అనుకోలేదు, ఎందుకంటే ఆమెతో ల్యాబ్ వాళ్ళు చాలా తక్కువ మసులుతారు, ఎందుకంటే అవసరంలేదు, పైగా ఆమె ఏదో బాస్ పన్లు చేస్తుందని తెలుసే తప్పా… అసలామె ఏమి చేస్తుందో, ఆవిడ ఉద్యోగ ధర్మమేమిటో అసలు ఉద్యోగమే ఏమిటో వీళ్ళకి అసలు తెలియదు, తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. అటువంటప్పుడు బాస్ మాటల్లోని ఆంతర్యాన్ని ఏమి గ్రహిస్తాడు? అలాగే సింథియాని తన ల్యాబ్ విషయాల్లో చాలా తక్కువగా ఆమెని ఇన్వాల్వ్ చేస్తాడు, ఎందుకంటే ఎక్కువగా సింథియా విషయాలు మిగితావారికి తెలియడం ఛటర్జీకి ఇష్టం లేదు. కానీ ఇప్పుడిలా క్రొత్త మలుపు తిరిగాడేమిటి? అందుకు కారణం లేకపోలేదు.

సింథియా…ఆ సాయంత్రం వరకూ బిశ్వా … పాపం లేనివాళ్ళ కోసం ఎదురు చూస్తున్నప్పుడు బాస్ కి నూరిపోసింది. బిశ్వా రోజూ తనకి నచ్చినప్పుడు ల్యాబ్ కి వస్తాడని, టైం మెయింటెయిన్ చెయ్యడని, అందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని… కాకపోతే బిశ్వా మీద ఎంతో నమ్మకం ఉన్నప్పుడు తాను ఏమి చెప్పినా చేదుగా వుంటుందనీ, అందుకే తాను ఇన్నాళ్ళు చెప్పలేకపోయిందనీ వగలు పోయింది. దానికి ఛటర్జీ హృదయవీణ తంత్రి ఒకటి తెగిపోయింది. వెంటనే సింథియాయందు ఆర్ద్రమయిపోయి, బిశ్వాకి ఆ మాటలన్నీ చెప్పేశాడు. అంతేగాని బిశ్వా ఎంత బాధపడతాడని మాత్రం ఆలోచించలేదు, ఒకవేళ ఆ ఆలోచన వచ్చినా సింథియా కన్నానా? సింథియా ముందు ఏ మాత్రం? అందువల్ల అది నిజమా కాదా అని, బిశ్వాని గానీ, పోనీ బిశ్వా గురించి ల్యాబ్లో వేరేవాళ్ళనైనా అడిగి తెలుసుకోవాలని గాని ఛటర్జీ ప్రయత్నించలేదు. ఛటర్జీకి ఎప్పుడూ ఒకటే ఆలోచన, మిగితా ఎవరయినాగానీ వాళ్ళకోసం వాళ్ళు పనిచేస్తారు, కానీ సింథియా ఒక్కర్తే తనకోసం పనిచేస్తుంది, తనకోసం జీవిస్తుంది. ఈ టోకెన్ తోనే సింథియా సక్సెస్ ముడిపడివుంది. ఇప్పటినుండీ, ఛటర్జీ, సింథియా మనోభావాలను కాపాడడంకోసం బిశ్వాని టార్గెట్ చెయ్యడం మొదలుపెట్టాడు అదే అతని మొదటి కర్తవ్యంలాగ. అదుపుతప్పిన బిశ్వాని సింథియా ఏదో కరెక్ట్ చేసి తన ల్యాబ్ కి ఒక ఉజ్వలమైన భవిస్యత్తు తెస్తుందన్నట్లు కల్పన!!!

స్వార్ధపరుడయిన మగవాడి స్వార్ధానికి లింగభేదం లేదు. ఎవరయినా బలవ్వాల్సిందే !!!

కొంచెం తేరుకున్నాక బిశ్వా అడిగాడు సూరజ్ ని. బాస్ ఏమన్నా వచ్చి తన గురించి అడిగాడేమో అని. సూరజ్ అదేమీ లేదని చెప్పాడు. అయినా సూరజ్ మీద అనుమానం పోలేదు బిశ్వాకి. కానీ ఏమీ అనలేక అక్కడితో ఆగిపోయాడు.

సింథియా యధావిధిగా తన పనులు తాను చక చకా చేసుకుంటోంది, ఎందుకంటే తాను ఏమిచేసినా పర్వాలేదు అనే ధీమాతో ప్రతిరోజూ ప్రొద్దున్నే వచ్చేసి యధేచ్చగా అందరిముందూ తిరుగుతూ ఉంటుంది. తన వాత పడినవాళ్ళు మాత్రం…ఏదో ఒక ఆంధోళనతోనే వుంటారు, ఆ అంధోళనే ఛటర్జీ రూపంలో. ఆ రూపాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ, తను కీ ఇచ్చే బొమ్మగా వాడుకునే సింథియాకి ఏమీ పట్టదు సరికదా, వాళ్ళలో ఆ ఆంధోళన తనకి ప్రస్పుటంగా కనబడకపోతేనే చాలా వర్రీ అవుతుంది, తన పధకాలు ఎక్కడ పారలేదో అని!!

ఎలాగయితే ఏం? మొత్తానికి తెల్లారింది, పక్షులు బద్ధకంగా తమ గూళ్ళని విడిచి ఆహార సంపాదనకు బయలుదేరాయి. ఇక యూనివర్సిటీ పక్షులు కూడా పళ్ళు తోముకొని ఫలహారాలు చేసేసి, విజ్ఞాన సముపార్జనలకు బయలుదేరారు, సింథియా తన అమూల్యమైన పధకాలు అమలుచెయ్యడానికి బయలుదేరింది. ప్రొద్దున్నే మిగితా ముగ్గురూ కూడా ల్యాబ్ కి వచ్చేశారు బిశ్వాని కలవడానికి, కానీ అలవాటుప్రకారం తాము వచ్చేమన్న విషయాన్ని సింథియాకి చెప్పడానికి వెళ్ళిపోయారు. సింథియా వాళ్ళని సాదరంగా ఆదరించి… చక్కగా మాట్లాడి తానే స్వయంగా బిశ్వాకి ఫోన్ చేసి తాను స్టూడెంట్లతో కలిసి వస్తున్నట్లుగా, తనని తన చాంబర్ లోనే ఉండమని ఆర్డర్ చేసినట్లు చెప్పింది. సింథియా ఫోన్ సంభాషణ విన్న ముగ్గురికీ సింథియా అంటే ఆరాధనా భావం ఎక్కువయ్యింది. ఎందుకంటే బాస్ తర్వాత బాస్ ఈమెనే, అందుకే వాళ్ళన్నా, వాళ్ళ ప్రాజెక్ట్లన్నా ఆమెకి అంత జాగ్రత్త. దీని బట్టి చూస్తే సింథియాది చాలా పెద్ద పోస్టే అయ్యుంటుంది అక్కడ, ఎందుకంటే తమ ముందే ల్యాబ్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది, ఆవిడ చెప్పినట్లు అందరూ వింటున్నారు, కాబట్టి మేము కూడా మరింత విధేయలతో వుండాలి … అనే భావన కొచ్చేశారు. అలాగని బిశ్వామీద ఏదో నెగటివ్ అభిప్రాయం వాళ్ళకి ఉందని కాదు కాకపోతే బిశ్వాని కలవడానికి ముందరే సింథియా వాళ్ళ మనసుల్లో ఎన్నో మెట్ల పైన ఉంది, నిజానికి ఛటర్జీ కన్నా ఇంకా పైన. పాల ముంచినా, నీట ముంచినా అంతా సింథియాయే అన్నట్లున్నారు వాళ్ళు ముగ్గురూ. దీనికి కారణం వాళ్ళకీ కూడా జీవితానుభవం లేకపోవడం.

సింథియా ఫోన్ చేసి తనని ఎక్కడికీ వెళ్ళొద్దని చెప్పడం, తానే స్వయంగా స్టూడెంట్స్ ని తీసుకొని వస్తున్నాని కబురు చెయ్యడం, ఆశ్చర్యమేసింది. ఎందుకంటే … ఈ స్టూడెంట్ల ముగ్గురికీ తాను ఈ-మెయిల్ ఇచ్చాడు, తన ఆఫీసు రూం నెంబర్ కూడా ఈ-మెయిల్ లో వ్రాశాడు, ఎందుకంటే ముందురోజులాగ, తాను వాళ్ళని మిస్ అవ్వకూడదని, బాస్ కి మళ్ళీ ఆగ్రహం తెప్పించకూడదని. కాబట్టి వాళ్ళు డైరక్ట్ గా తనదగ్గిరికే వస్తారని తాను భావిస్తున్నాడు, మరి మధ్యలో ఈ సింథియా ఎంట్రీ ఏమిటి?????? అర్ధంకాలేదు, బిశ్వాకి.

సింథియా వాళ్ళని తీసుకొని బిశ్వా దగ్గిరకి వెళ్ళింది. బిశ్వా అందరినీ సాదరంగా ఆహ్వానించాడు. పాత్రో, పూనం వాళ్ళు మాత్రం నిర్మలంగా మాట్లాడారు. వాళ్ళని అప్పజెప్పేసి వెళ్ళిపోకుండా తాను కూడా వాళ్ళతోపాటే కూర్చొని బిశ్వా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో వింటోంది సింథియా. ఇది బిశ్వాకి నచ్చలేదు, కానీ ఆమెకి చెప్పలేడు కదా? తన పాత్ర ఎంతుందో అంతే వహించాలని సింథియా అనుకోదు కదా? సింథియా ఎప్పుడూ అనంతం.

బిశ్వా కాసేపు తన బ్రెయిన్ లోని సింథియా గొడవ వదిలేసి, సబ్జెక్ట్ లో లీనమయి… ప్రాజెక్ట్స్ కి చెయ్యాల్సిన ఎక్స్పెరిమెంట్లనీ, వాటి ఎందుకు చెయ్యాలని గానీ, ఎలా చెయ్యాలని గానీ వివరిస్తున్నాడు… బోర్డ్ మీద బొమ్మలుగీస్తూ మరి. అదంతా చూసేసరికి సింథియాకి మొహం జేవురుంచింది, ఎందుకంటే బిశ్వా చెప్పేదాంట్లో ఒక్క ముక్క కూడా తనకి అర్ధం కావడంలేదు. మరి తన లాంగ్ టెర్మ్ గోల్ – తను అమెరికా వెళ్ళేముందే పి. హెచ్. డీ. ని ఛేజిక్కించుకోవడం ఎలా? హు…పి. హెచ్. డీ. పట్టా కష్టపడి చదివి సాధించుకోవడం కాదు, ఛేజిక్కించుకోవడం!!!!

ఆ తర్వాత బిశ్వా వాళ్ళని ల్యాబ్లోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళ ముగ్గిరికీ వారి వారి ప్లేసులని చూపించాడు, ఎక్కడ వర్క్ చెయ్యాలన్న విషయం చెప్పాడు. అలాగే ల్యాబ్లోని ఇతర మనుష్యులను, ఇతర ఫెసిలిటీస్ ని కూడా చూపించాడు. ఇంకా, 3 గంటల సేపు వాళ్ళతోనే సమయం గడిపాడు. సింథియా కూడా అంతే ఓపిగ్గా వాళ్ళతోనే నడుస్తూ అన్నీ వింటున్నది. స్టూడెంట్లకు మాత్రం సింథియా యొక్క పాత్ర ఆ ల్యాబ్లో అదే అనుకున్నారు, ఆమె ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కూడా కాబోలు, బిశ్వా అన్నీ కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా చేస్తున్నాడా లేదా ఒకవేళ అలా లేని పక్ష్యంలో తాను అన్నీ దగ్గరుండి చెప్పి, చూసుకుంటుంది గాబోలు అని అనుకుంటున్నారే తప్పా…ఆమెకి ఏమీ రాదన్న విషయం మాత్రం అర్ధం కాలేదు. బిశ్వాకి మాత్రం సింథియా తన మీద, ఆ స్టూడెంట్ల మీద ఒక నిఘా వేసుకొని వుంటుందని మాత్రం అర్ధమయ్యింది. కానీ అలా ఎందుకు చేస్తుందో మాత్రం అర్ధం కాలేదు. అంతేకాదు, సింథియా చేస్తున్నదానికి, ఛటర్జీ చెప్పిన మాటలకు ఏదయినా దగ్గిర సంబంధం ఉందనికూడా అతని బుర్రకి తట్టలేదు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *