May 5, 2024

శ్రీ కృష్ణ దేవరాయవైభవం: 3

రచన: రాచవేల్పుల విజయ భాస్కరరాజు

krishna devaraya photo

వంశావళి

కర్ణాటక రాజ్యంలో తుళు జాతీయులు మాత్రమే నివశించే ప్రాంతం ఒకటి ఉండేది. ఆ రోజుల్లో ఉత్తర కెనరా జిల్లాతోపాటు సముద్రతీరం,దాని పరిసర ప్రాంతాలు తుళునాడుగా భాసిల్లాయి.శత్రువులకు సింహ స్వప్నమై, అరివీర భయంకరులుగాచక్రవర్తులను సైతం విస్మయానికి గురి చేసే యుద్ధ నైపుణ్యం తుళు జాతీయులకు పుట్టుకతోనే అబ్బింది. అలాంటి తుళు జాతికి మణిరత్నం అని చెప్పుకోదగినవాడు తిమ్మ భూపతి. మహా యోధానయోధుడు. తుళువంశ ప్రతిష్టకు మూల పురుషుడు. ఇతని సతీమణి దేవకీ దేవి. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి మొదటి దేవరాయల పరిపాలనా రోజుల్లో తిమ్మ భూపతి చక్రవర్తి దృష్టిలో పడ్డాడు. సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరులో మొదటి దేవరాయలు రెండవ బుక్కరాయలను జయించి తానే పట్టాభిషిక్తుడయ్యాడు. ఈయన క్రీ.శ.1406 నుండి 1423 సంవత్సరం వరకు పాలించాడు.

ఈ దేవరాయలు తన కుమార్తె హరిహరమ్మను సాళువ తిప్పరాజునకిచ్చి వివాహం జరిపించాడు. సాళువ తిప్పరాజు ప్రాపకంతో చక్రవర్తి దేవరాయల వద్ద తిమ్మ భూపతికి ఎదురులేని పలుకుబడి పెరిగింది. క్రీ.శ. 1423లో దేవరాయలు మృతి చెందాడు.

ఆ వెంటనే ఒకటవ విజయరాయలు, పిదప రెండవ దేవరాయలు చక్రవర్తులయ్యారు. అయినప్పటికీ తిమ్మ భూపతి పలుకుబడి చెక్కుచెదరలేదు. రాచరిక ప్రాముఖ్యత పెరగడంతో తిమ్మ భూపతి తమ స్వస్థలం నుండి కోలారుకు సమీపంలోని టెక్కల్ లో స్థిరపడ్డారు. ఆయన యుద్ధ రంగమున కాలు మోపాడంటే స్వైరవిహారమే. తన కరవాలంతో శత్రుమూకలను తుత్తునియలు గావిస్తూ ఎదురేగి వెళ్ళేవాడు. దీంతో ప్రతి చక్రవర్తి తిమ్మ భూపతిని ఆదరించేవారు. తన శక్తిసామర్థ్యాలకు చక్రవర్తుల ప్రాపకం కూడా తోడవడంతో తిమ్మ భూపతి ఇక వెనుదిరిగి చూడలేదు. తిమ్మ భూపతి, దేవకీదేవి నోముల పంటగా ఆ దంపతులకు ఈశ్వరనాయకుడనే కుమారుడు కలిగాడు. ఈశ్వరనాయకుడు కూడా తండ్రి వారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నాడు. యుద్ధవిద్యల్లో అసమాన ప్రతిభ కనబరుస్తూ వీరుడంటే ఇలా ఉండాలి అని పలువురు ప్రశంసించేలా పేరు తెచ్చుకున్నాడు. కుమారుని పేరుప్రతిష్టలకు పొంగిపోయిన తిమ్మ భూపతి ఈశ్వరనాయకుడికి రాజరిక వంశానికి చెందిన బుక్కమాంబతో వివాహం జరిపించాడు. అప్పటికే తిమ్మ భూపతి మరాట, వరాట, లాట, గాంధార రాజ్యాలను జయించాడు. ఫలితంగా రెండవ దేవరాయల ఘనకీర్తి పారశీక దేశాల వరకు ప్రాకెను.

ఈ విజయాలను వరాహ పురాణంలో పొందుపరిచారు.షిమోగాలో రాచకార్యాల్లో మునిగి తేలుతున్న ఈశ్వరనాయకునికి అచిర కాలంలోనే ఇద్దరు కుమారులు కలిగారు. అందులో పెద్దవాడికి నరసానాయకుడు అని నామకరణం చేయగా చిన్నవాడికి తన తండ్రి పేరు కలిసేలా తిమ్మనరేంద్ర అని పేరు పెట్టాడు. అప్పటికే ఈశ్వరనాయకుడి తండ్రి తిమ్మభూపతకీర్తి శేషులయ్యారు. ఈశ్వర నాయకుడి కుమారులిద్దరూ పోటాపోటీగా యుద్ధవిద్యల్లో ఆరితేరి తండ్రిని మించిన తనయులయ్యారు. ఈలోగా విజయ నగర సామ్రాజ్యం కేంద్ర ప్రభుత్వంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. క్రీ.శ.1446 సంవత్సరంలోరెండవదేవరాయలు దైవసన్నిధికి చేరుకున్నారు. అనంతరం ఏడాది పాటు రెండవ విజయరాయలు, ఆ తర్వాత మల్లిఖార్జునరాయలు చక్రవర్తులయ్యారు. క్రీ.శ.1447 నుండి 1464 వరకు మల్లిఖార్జునరాయలు పాలించాడు.అయితే ఈయన పరిస్థితి నానాటికీ ఇబ్బందుల్లో పడడంతో యుద్ధకాంక్ష నశించింది. శత్రువులు లేచికూర్చున్నారు. ఫలితంగా నెల్లూరు, కోస్తాంధ్ర, కందనవోలు, వరంగల్లు, కాంచీవరం, తిరుచురాపల్లి దుర్గాలను గజపతులు కైవశం చేసుకున్నారు. దీంతో వీరుల పలుకుబడి మూలన పడింది.

ఇంతలోనే క్రీ.శ.1464 లో మల్లిఖార్జునరాయలు మరణించాడు.మల్లిఖార్జునరాయల కుమారుడు బాలుడు అయినందున అతన్ని హత్య చేసి మల్లిఖార్జునరాయల పినతండ్రి కుమారుడు విరూపాక్షరాయలు రాజ్యాధికారం చేపట్టాడు. ఈయన నిరంతర తాగుబోతు, వ్యభిచారి, మహాక్రూరుడు. ఓ రోజు రాత్రి ఆ రాజు తన సైన్యంలోని దండనాయకుడొకరు తన మందిరంలో ప్రవేశించినట్లు కలగన్నాడు.అంతే ఆ సర్దారును రాచమందిరానికి పిలిపించి చంపించాడు. ఏ పాపం ఎరుగని ఓ దండనాయకున్ని అలా చంపించే సరికి విజయనగర సైన్య దండనాయకులంతా ప్రాణాలర చేతిలో పెట్టుకుని బ్రతకాల్సివచ్చింది. దీంతో ఎవరికి వారు చిన్న చిన్నగా తమతమ బాధ్యతల నుంచి తప్పుకుంటూ వచ్చారు. తత్ఫలితంగా ఎన్నో రాజ్య భాగాలు శత్రువుల వశమయ్యాయి. అనేకమంది సామంతులు తిరుగుబాటు లేవదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ మనుగడ కర్ణాటక రాజ్యంలో కొనసాగించడం సహేతుకం కాదని భావించాడు ఈశ్వరనాయకుడు. తమ భుజ బలాన్ని,శక్తియుక్తుల్ని నమ్ముకున్న ఈశ్వర నాయకుడు తెలుగు రాజ్యం వైపు దృష్టి సారించాడు. సాళువ తిప్పరాజు సలహాతో తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని చంద్రగిరి దుర్గం చేరుకున్నాడు.అప్పటికే చంద్రగిరి దుర్గ పరిపాలకుడు సాళువ నరసింగ దేవరాయలు ఒకసారి విజయనగర సామంతునిగా, మరోసారి స్వతంత్ర ప్రభువుగా తన రాజ్య విస్తరణపై ప్రధాన దృష్టి పెట్టాడు. ఖడ్గం చేతిలో ఉంటే చాలు కదనరంగంలో భీభత్సం సృష్టించే ఆ రాజుకు ఈ కారణంగా కఠారి సాళువ నరసింగరాయలు అనే పేరు సార్థకమైంది. అనేక యుద్ధాలు చేసి పొరుగు రాజ్యాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాడు. ఆక్రమించిన రాజ్యాలను తిరిగి కోల్పోతూ, పడుతూ లేస్తూ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో గజపతులను తన చిరకాల శత్రువులుగా భావిస్తూ వచ్చాడు. వారిని ఓడించేందుకు తనకు అండగా తన సాటి వీరులుంటే బాగుండునని ఎదురు చూస్తూ వచ్చాడు. అలాంటి వారి కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈశ్వరనాయకుడు తన ఇద్దరు కుమారులైన నరసానాయకుడు, తిమ్మ నరేంద్రలను వెంటబెట్టుకుని సాళువ నరసింగరాయలను దర్శించుకున్నాడు. ముందుగా తనను తాను పరిచయం చేసుకుని, తన కుమారులను కూడా పరిచయం చేశాడు. తమ వంశ చరిత్రతో పాటు తాము ఏ ఏ యుద్ధాల్లో పాల్గొన్నది, తమ ప్రభువులకు విజయాలను ఎలా సమకూర్చి పెట్టినది, ప్రస్తుతం తామెందుకొచ్చిందీ సవినయంగా, సవివరంగా తెలియజేశాడు. కాగా అప్పటికే సాళువ తిప్పరాజు ద్వారా వీరి ప్రతిభా పాటవాలను విని ఉన్న నరసింగరాయలు ఆ వెంటనే వీరికి తన కొలువులో సగౌరవ స్థానాలు కల్పించాడు. ఈశ్వర నాయకున్ని సర్వ సైన్యాధ్యక్షునిగానూ, నరసానాయకున్ని తన మంత్రాంగ ముఖ్య నిర్వాహకుని గానూ, తిమ్మనరేంద్రను తమిళనాడులోని ఒక ప్రాంత పాలకునిగానూ నియమించాడు. ఇంకేముంది అగ్నికి ఆజ్యం తోడైనట్లు చంద్రగిరి బలం దశదిశలా వ్యాపించింది.

ఇదిలా ఉండగా అక్కడ విజయనగర చక్రవర్తి విరూపాక్ష రాయలు నియంతగా మారాడు. నానాటికి ఆయన ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఒకానొక రోజు విజయనగర వేగుల ద్వారా రాజుకు ఓ సమాచారం అందింది. అదేమనగా తురుష్క వర్తకులు తమ గుర్రాలను విజయనగర రాజ్యానికి కాకుండా తమ శత్రురాజులైన బహమనీ సుల్తానులకు అమ్మారన్నది సమాచారం. ఇంకేముంది విరూపాక్ష రాయలు ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఇక ఉపేక్షించడం ఎంత మాత్రం సబబు కాదనుకున్నాడు. వెంటనే తురుష్క వర్తకుల నందరినీ మూకుమ్మడిగా హతమార్చమంటూ ఆదేశించాడు. తక్షణమే ఆదేశాలు అమలు జరిగాయి. వందలాదిమంది వర్తకులను, వారి అనుచరులను సైన్యం మట్టుపెట్టింది. ఇటు సొంత వారిని, అటు పరాయి వారిని ఇష్టమొచ్చినట్లు చంపించడమే కాకుండా ప్రజాశ్రేయస్సును పూర్తిగా విస్మరించాడు. నిరంతరం తాగితందానాలాడడంతో పాటు స్త్రీలోలత్వమే పరమావధిగా భావించాడు.ఈ చక్రవర్తి పేరు చెబితేనే ప్రజలు అసహ్యించుకునే స్తాయికి ఎదిగాడు. ఫలితంగా ఇతని పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. చక్రవర్తి వ్యసనత్వము, విపరీత, విచిత్ర మనస్తత్వము, బలహీనతల వల్ల సామంత ప్రభువుల్లో విజయ నగర సామ్రాజ్య ఆక్రమణ పట్ల ఆశలు రగిలాయి. ఈ మేరకు ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. తిరుగుబాటుదారులు స్వతంత్ర ప్రభువులుగా చలామణీ అవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ కన్న కొడుకే తన తండ్రి పోకడల పట్ల అసహనానికి గురి అయ్యాడు. అదను కోసం కాచుక్కూర్చున్న రాజు పెద్ద కుమారుడు ఒక రోజు తన ఖడ్గంతో తండ్రి తలను ఖండించాడు. ప్రజల పీడ విరగడై పోవడంతో నగరంలోని అనేకమంది పుర ప్రముఖులు, చాలామంది సామంత రాజులు రాజకోటకు వచ్చి ఆ రాకుమారున్నే సిమ్హాసనం అధిష్టించాలంటూ కోరారు. సత్యశీలుడైన ఆ రాకుమారుడు తన తండ్రిని చంపిన రక్తపు మరకలతో తాను విజయ నగర సిమ్హాసనాన్ని అధిరోహించే అర్హత కోల్పోయానన్నాడు. అందువల్ల తన తమ్ముడైన ప్రౌఢదేవరాయలను సిమ్హాసనంపై కూర్చోబెడుతున్నట్లు ప్రకటించి తనను మన్నించ మన్నాడు.

చక్రవర్తిగా ప్రౌఢదేవరాయలు సింహాసనంపై కూర్చోగానే ఇతను కూడా తండ్రి బాటనే అనుసరించాడు. దుర్వ్యసనాలకు లోనై రాజ్య పాలనను విస్మరించాడు. దీంతో తమ్ముని పాలన కూడా అన్నకు నచ్చలేదు.ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న ప్రౌఢదేవరాయలు తన అన్న పట్ల భయపడ్డాడు. తన తండ్రిని చంపినట్లే తనను కూడా హతమారుస్తాడేమో అని భయపడ్డాడు.ఆ భయంతో అన్నను చంపించి తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు చక్రవర్తి. ఇక తన ఇష్టాఇష్టాలకు అడ్డూ అదుపులేదనుకున్న ప్రౌఢదేవరాయలు విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ రాజ్య భద్రత విస్మరించాడు. ఫలితంగా శత్రురాజులు విజయనగరంపై దండెత్తి రావాలని ప్రణాలికా రచనలు రూపొందించి సిద్దంగా ఉన్నారు. మరోవైపు సామంత రాజులు ఎదురు తిరిగి కప్పం చెల్లించేందుకు నిరాకరించారు.

ఈ పరిణామాల వల్ల పాలన అస్తవ్యస్తంగా మారింది. దీంతో రాజ్యంలోని అనేకమంది ప్రముఖులు ఏకమై జరుగుతున్న పరిణామాల పట్ల కలత చెందారు. ఏదో ఒకటి చేయకపోతే విజయనగర రాజ్యాన్ని చేతులారా శత్రువులకు అప్పగించినట్లవుతుందని భయాందోలనలకు గురయ్యారు. రాజ్యానికి ముప్పు వాటిల్లిందనీ, ఈ ముప్పునుండి కాపాడి రాజ్యాన్ని రక్షించే ఏకైక సమర్థుడు సాళువ నరసింహుడే అని తలంచారు. అప్పుడు మచిలీ పట్నం సముద్రతీర ప్రాంత పాలకునిగాసాళువ నరసింహ రాయలు అక్కడే మకాం వేసారు. రాజుపట్ల విసుగు చెందిన ప్రజలు ఇంతవరకు జరిగిన,జరుగుతున్న పరిణామాలను సాళువ నరసింహుని దృష్టికి తీసుకు పోయారు. రాజ్యాన్ని కాపాడాలంటే నరసింహుడే రాజు కావాలనీ, అందుకు అవసరమైన మద్దతు ఇస్తామంటూరాజ్య ప్రముఖులు నరసింహునితో మొరపెట్టుకున్నారు.

ఇదే అదనుగా భావించిన నరసింహుడు రాజు బ్రతికి ఉండగా తాను సింహాసనాన్ని ఆక్రమించుకొని పాలన సాగించడం సహేతుకం కాదని తలంచాడు. అవసరమైతే రాజుపై తిరుగుబాటు చేయించి సింహాసనాన్నిఆక్రమించు కోవాలనుకున్నాడు.ఆ వెంటనే రాజ్యంలోని ఇతర సామంతులందరికీ లేఖలు వ్రాసాడు. సమర్థుడైన రాజు లేకుంటే రాజ్యానికి సంభవించే నష్టాలను వివరించాడు. రాజుయొక్క అసమర్థతను, దుర్వ్యసన ప్రవర్తనను తెలియజేసాడు. ఇలా అందరం చూసుకుంటూ మిన్నకుండిపోతే ఆయన తండ్రి కోల్పోయిన రాజ్యం కంటే అధికంగా కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాడు. ఆ లేఖలను పంపడంతో పాటు వాటి వెంట ఎంతో విలువైన వజ్రవైడూర్యాలను కూడా కానుకలుగా పంపాడు. దీంతో సామంతులందరూ సాళువ నరసింహునికి అండగా నిలిచారు. అప్పటికే శ్రీ కృష్ణ దేవరాయల జేజి నాయన ఈశ్వర నాయకుడు తన ప్రతిభాపాటవాలతో ఉదయగిరి, నెల్లూరు, ఆమూరు, కోవెల, కుందాణి, శ్రీ రంగపట్నం, నాగమంగళం, బెంగళూరు, పెనుగొండ, గండికోటలను జయించి సాళువ నరసిమ్హుని రాజ్యంలో కలిపేసాడు.

ఈ విషాయాన్ని ఆనాటి ప్రముఖ తెలుగు కవులు నంది మల్లన, ఘంటా సింఘనలు తమ వరాహ పురాణంలో పొందుపరిచారు. వీరిద్దరూ కర్నూలు ప్రాంతానికి చెందినవారు. కాగా పిల్లలమర్రి పిన వీరభద్రుడు అనబడే మరోకవిచే విరచితమైన జైమినీ భారతంలో భువన గిరి, చెంజి, కొంగు ధారాపురం దుర్గాలను కూడా ఈశ్వర నాయకుడు జయించినట్లు ప్రశంసించబడింది.

ఆ సమయంలో చంద్రగిరి దుర్గ అధికార ప్రతినిధిగా శ్రీ కృష్ణదేవరాయల తండ్రి తుళువ నరసానాయకుడు పరిపాలిస్తున్నాడు. పరిణామాలన్నింటిని బేరీజు వేసుకున్న సాళువ నరసింహుడు తక్షణమే వెళ్ళి విజయనగర సింహాసనాన్ని ఆక్రమించుకోవాలంటూ తన దూరపు బంధువు, బావమరిది వరసైయిన నరసానాయకున్ని ఆదేశించాడు. అలాగే మార్గమధ్యంలో ఎదురు తిరిగిన సామంతులను నిర్దాక్షిణ్యంగా అణిచి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసాడు.

ఆ మరుక్షణమేనరసానాయకుడు విజయ నగరంపై దండెత్తి వెళ్ళాడు. మార్గమధ్యంలోని కోటలను పట్టుకున్నాడు. వేగులవల్ల ఈ సమాచారం విజయనగర చక్రవర్తి ప్రౌఢదేవరాయలకు అందింది. సమాచారం అందించిన వేగులను అది అబద్దమంటూ అవమానించి పంపాడు చక్రవర్తి. నరసానాయకుడు నేరుగా విజయనగరంలో ప్రవేశించాడు. ఈ వార్త కూడా రాజు నమ్మలేదు.ఈ లోగా నరసానాయకుడు విజయనగరకోటలో ప్రవేశించాడు. రాజు సైన్యం నరసానాయకున్ని ఎదుర్కోలేదు. సరికదా స్వాగతం పలికాయి. నరసా నాయకుడు అంతః పురంలోని రాణులందరినీ, వారి సంతానాన్ని వధించి రాజును బంధించేందుకు వెళ్ళాడు. అప్పుడు అప్రమత్తమైన రాజు దొడ్డి దారిన పారిపోయాడు. పారిపోతున్న రాజును నరసానాయకుడు నిలువరించలేదు. రాజు నగరం విడిచి పారిపోయేదాక మిన్నకుండిపోయాడు. నరసానాయకుడు నగరాన్ని, కోశాగారాన్ని స్వాధీనం చేసుకున్నాడు.ఆ వెంటనే ఈ విషయాన్ని సాళువ నరసింహ దేవరాయలుకు కబురు చేశాడు. అనంతరం నరసింహ దేవరాయలు ఆఘమేఘాలపై విజయనగరం చేరుకుని తానే పట్టాభిషిక్తుడయ్యాడు.

క్రీ.శ.1485 ఆగష్టు నెలలో విజయనగర సామ్రాజ్య సర్వ సంరక్షకుడిగా పదవీబాద్యతలు చేపట్టాక సాళువ నరసింహ దేవరాయలు, తుళువనరసానాయకున్ని చంద్రగిరి సామంత రాజుగా, విజయనగర సామ్రాజ్య సర్వ సైన్యాధ్యక్షునిగా, ప్రధానమంత్రిగా నియమించాడు. దీంతో తుళువ వంశీయుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. క్రీ.శ.1487 లో తానే సర్వ స్వతంత్ర చక్రవర్తినంటూ సాళువ నరసింహుడు ప్రకటించుకున్నాడు. దీంతో అనేకమంది సామంతులు ఎదురు తిరిగారు. అందులో ఉదయగిరి దుర్గ పాలకుడు కూడా ఒకరు, మిగిలిన సామంతులందరినీ జయించుకుంటూ వెళ్ళిన సాళువ నరసింహుడు ఉదయగిరిపై దండెత్తి కోట ముట్టడికి బయలుదేరాడు. కోటకు అతి సమీపంలో యుద్ధ గుడారాలు వెలిశాయి. అయితే అప్పటికే సాళువ నరసింహుని అంతరంగిక భద్రతా దండనాయకుడు, మంత్రి అయిన గంగన్న అనే అధికారి గజపతి రాజులతో కుమ్మక్కయ్యాడు. ఉదయగిరి దుర్గ పాలకుడు, గజపతులు యుద్ధం చేసేందుకు సముఖంగా లేరని, రాజీ పడనున్నారని తప్పుడు సమాచారం అందించాడు సాళువ నరసింహునికి. అందువల్ల అతి ముఖ్యులైన కొంతమంది దండ నాయకులను వెంటబెట్టుకుని రాజీకి వెళితే సరిపోతుందన్నాడు గంగన్న.ఆ మాటలు నమ్మిన సాళువ నరసింహుడు సాదాసీదాగా ఉదయగిరి కోటలోకి అడుగు పెట్టాడు.

ఆ వెంటనే గజపతి సేనలు కోటలోనికి చేరుకోవడం, కోట తలుపులు మూసి వేయడం ఏకకాలంలో జరిగిపోయాయి. తక్షణమే సాళువను గజపతి సైన్యం చుట్టుముట్టింది. అయితే సాళువ నరసింహుని చేతిలో ఖడ్గమున్నంత వరకు ప్రాణాలకు తెగించైనా తనను తాను కాపాడుకుంటాడు. తమ రాజు ఆదేశాల మేరకు గజపతి సైన్యానికి ఎదురు తిరిగిన సాళువ భద్రతా దళం తెగించి పోరాడి రాజును రక్షించి కోట తలుపులు తెరిచారు. అప్పటికే సాళువ నరసింహునికి అనేక గాయాలయ్యాయి. తన సైన్యం రక్షణలో సాళువ నరసింహుడు కోట నుండి బయట పడి విజయనగరం చేరుకున్నాడు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశంతో రగిలి పోయాడు. అయితే నమ్ముకున్నవారే మోసం చేయడంతో మానసికంగా క్రుంగిపోయాడు. దీనికి తోడు గాయాలు మరింతగా ఆరోగ్యాన్ని క్షీణింపజేశాయి. ఫలితంగా ఇక తన కెలాగూ మృత్యువు తప్పదని భావించాడు. వెంటనే తన ప్రాణానికి ప్రాణంగా నమ్ముకున్న తుళువ నరసానాయకున్ని రప్పించి తను ఇక ఎంతో కాలం బ్రతకననీ, అందువల్ల తన తదనంతరం తనకుమారుల్లో యోగ్యుడైన ఒకరిని చక్రవర్తిగా చేసి రాజ కుటుంబ, రాజ్య సంరక్షకుడిగా ఉండి పాలన సాగించాలనీ మరణ శాసనం రూపొందించాడు. అలాగే రాయచూరు, ముద్గళ్, ఉదయగిరి దుర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాలని ఆ శాసనంలో పేర్కొన్నాడు. తనకు మరణం ఆసన్నం గాకుంటే ఆదుర్గాలను తానే జయించి ఉండే వాడినంటూ స్పష్టం చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అనగా క్రీ.శ. 1491 జూన్ నెలలో సాళువనరసింహ దేవరాయలు దివికేగిపోయారు.ఆ వెంటనే సాళువ నరసింహ దేవరాయల కుమారుల్లో ఒకడైన తిమ్మ భూపాల రాయలను చక్రవర్తిగా ప్రకటించాడు నరసానాయకుడు. తాను రాజ కుటుంబ సమ్రక్షకుడిగా, ప్రధాన మంత్రిగా, సర్వ సైన్యాధ్యక్షుడిగా పదవీ బాద్యతలు స్వీకరించాడు.అక్కడ నుండి తుళువ వంశం యొక్క ప్రాముఖ్యత ఎనలేని వంశంగా పేరొందింది.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *