May 3, 2024

!!నవరసాల చిత్ర సమాహారం జీవన శిల్పం !!

సమీక్ష: పుష్యమీ సాగర్

jeevana shilpam..

మనిషిలోని స్వార్ధం ఎంతగా పేరుకుపోయినా, మనిషి తన గురించే ఆలోచించుకున్నా అక్కడ …అక్కడ మంచితనం, మానవత్వం ఉంది. జీవితం లో ఆనందాలని, కష్టాలని, విషాదాలన్నిటిని చక్కని శైలితో ఆకట్టుకునే విధంగా కధానికలు రాసి సంపుటిగా మన ముందుకు తీసుకు వచ్చారు కన్నెగంటి అనసూయగారు.

పడమటి సంధ్య రాగం: మన చుట్టూ జరుగుతున్న వాటిని కథగా మలచడంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మొత్తం 20 కధలు ఉన్నా వీటిలో వేటికవే ప్రత్యేకం. ఓ గొప్ప రచయత్రి దీనావస్థని చూసి ఏమి చెయ్యలేని నిస్సయహత, చదువు విలువ తెలియని జనాలు చీత్కారాలతో, తిట్లతో రాళ్లతో కొడుతూ, ఓ గొప్ప రచయత్రికి జరిగిన అవమానాన్ని చెప్పిన తీరు జాలి గొలిపేదే. రచయతకి పుస్తకం అంటే ఎంత ప్రాణమో ఈ కధలో చూడొచ్చు అలాగే తను వచ్చిన పనిని మరిచి ఆ రచయిత్రకి జరిగిన అవమానాన్ని పోలీస్ వారికి రిపోర్ట్ చెయ్యడం ఇంకా ఈ దేశంలో బాద్యత బ్రతికే ఉంది అని అనిపిస్తుంది.

జీవన శిల్పం: పుట్టుకతోనే ఎవ్వరు మేధావులు అయిపోరు. తెలివి అనేది ఒక్కోరికి ఒక్కోలా ఉంటుంది. తెలివి తక్కువగా ఉన్నంత మాత్రాన చిన్న చూపు చూడనవసరం లేదు. శేఖర్ తన బార్య లక్ష్మి చాల నెమ్మది, జడ పదార్ధం అని కించ పరుస్తున్నప్పుడు స్నేహితురాలు అయిన జయంతి వారిస్తుంది. స్త్రీకి సిగ్గు, బిడియం ఎక్కువ. ఈ మధ్య కాలంలో వాటిని చేధించుకొని వస్తున్నప్పటికీ అవి ఆమె సహజ లక్షణాలే కదా అవి జడ పదార్థం ఎలా అవుతుంది అని నిలదీస్తుంది ..శేఖర్ చదువుకున్నవాడే కదా…తను తన భార్య లక్ష్మిని మంచిగా చదివించి ఆమెలోని నైపుణ్యాన్ని వెలికి తీసి చూడమంటుంది. జయంతి చెప్పిన మాటలతో తన నిర్ణయాన్ని మార్చుకొని చక్కగా చూసుకుంటాడు తత్పలితం గా రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయురాలిగా ఎంపిక కావడం “జీవన శిల్పం” లోని మధురమే అంటే అతిశయోక్తి కాదు.

వొడ్డుకు చేర్చిన కెరటం: రాజమండ్రి పుష్కరాలకు వెళ్తున్న ఓ కలెక్టర్ కి ఎదురు అయిన సంఘటనలు ఏమిటి… అమాయక పేద భ్రాహ్మణుడు పుష్కరాలకు పోకుండా విజయవాడకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. దాని వెనుక ఉన్న కారణం తెలిసుకున్నాక కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఏమిటి “వొడ్డుకు చేర్చిన కెరటం” లో ఎంతో బాగా చర్చించారు. అసూయ మనుషుల కళ్ళని కమ్మినప్పుడు అమాయకుల్ని ఉగ్రవాదులుగానే ముద్ర వేస్తాయి. ఈ కధలోని పేద భ్రాహ్మణుడు కొడుకుని అన్యాయంగా ఉగ్రవాది అన్న ముద్ర వేసి జైలుకు తీసుకువెళితే తోటి వారి లాగ పన్నెండు సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకు పైసలు సంపాదించుకోలేని దయనీయ స్థితిని, పేదవారిపై కూడా లంచం జులుం చేస్తూ పోలీస్ లు చేసిన వీరంగానికి కోపము, బాధ సమ్మిళితంగా మనలో కలుగుతాయి. ఏది ఏమైనా చివరకి నాన్నకి పిండప్రధానం చెయ్యాలన్న అమ్మ కోరికని పేద పురోహితుడితో పిండప్రధానం చేయించి వారికి జరుగుతున్న అన్యా యంపై జిల్లా కలెక్టర్ తీసుకోబోయే నిర్ణయం నిజంగా హర్షణీయమే. ఇంకా ఈ వ్యవస్థలో కాసింత మంచి మిగిలే ఉందని అనిపించింది.

చైతన్యం: నిరక్షరాస్యత మనిషిని నలుగురిలో సిగ్గుపడేలా చేస్తుంది. ఇంట్లో పనిచేసే పనిమనిషి లెక్కల్ని చింత గింజలతో, కుంకుడు కాయగింజలతో చేసి లెక్కల తిప్పలను ఎలా అధిగమించింది, మనవడు పొరపాటున వాటిని ఆడుకుంటూ పడేస్తే ..పని మనిషి లెక్క కరెక్ట్ గానే చెప్పి ఆశ్చర్యపరుస్తుంది?ఇది ఎలా సాద్యం అంటే..రాత్రి బడి (వయోజన విద్య ) వలెనే సాద్యం అని చెప్తుంది ..చదువుకు వయసుతో సంబంధం లేదు అన్న మాటని ఈ కధ చెప్తుంది.

అమ్మా ! నాకు పుట్టాలని లేదు: అమ్మ తన స్వార్ధం కోసం ఫాం హౌస్ లో కూతురిని వదిలి పెట్టి వెళ్తుంది. బంగారాన్ని లాకర్ లో పెట్టి భద్ర పరుస్తుంది కాని కూతురు శీలాన్ని మాత్రం కాపాడుకోలేకపోతుంది. పైగా శీలం సంగతి ఏముంది మనం చెప్పుకుంటేనే తెలుస్తుంది పోయింది అని ..అదేమైన వస్తువా పోవడానికి అని తక్కువ చేస్తుంది ..ఇక కూతురు అయిన హర్షిత తనపై జరిగిన దానికి బాధపడుకుండా ఆ ఘోరం తాలూకు ఫలితాన్ని వదిలించుకోవాలని చూస్తుంది. తన ఆనందానికి, సంతోషానికి, స్వేచ్చ కి అడ్డుగా వున్న “గర్బం” తీసేయాలి అనుకున్నప్పుడు లోపల ప్రాణం పోసుకుంటున్న బిడ్డ వేసిన ప్రశ్నలకు హర్షిత దగ్గర సమాధానం ఉండదు ..హర్షిత దగ్గరనే కాదు ఈ సమాజంలో చాలా మంది దగ్గర ఎలాంటి ఆన్సర్ దొరకదు ..ఇలాంటి స్వార్ధపూరిత సమాజంలో నాకు చోటు వద్దు ., అమ్మా నాకు పుట్టాలని లేదు అంటూ తన పుట్టుకని చిదిమేసుకోవడానికి సిద్దపడుతుంది. ఇది నిజంగా దారుణమే కదా…!!

రెండొందలు: తనకు వ్యాపారం రాకున్న ఎలాగోలా నెట్టుకొస్తున్న ఓ వ్యాపారిని ఇద్దరు మహిళలు ఎలా బోల్తా కొట్టించారు? “రెండొందలు” మాయాజాలం లో ఎంత మంది మోసపోయారో. చివరికి సుబ్బారావు అతని బార్య ఏమి చేసారు ..వాళ్ళు వచ్చిన ప్రతీసారి 200 లాస్ అయ్యారు, ఒక్కోసారి 400 ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇలా కాదు అని ఒక రోజు వీరి పని పట్టాల్సిందే అని సుబ్బారావు నిశ్చయించుకొని వెంబడిస్తే ఒక బేకరీలో వీరు ఇద్దరు కనిపిస్తారు. అక్కడ వీరి మోసం బయటపెట్టి పోలీస్ లకు పట్టించడం కోసమెరుపు.

వ్యసనం మనిషిని ఎంత దిగాజార్చుతుంది ..ఎంత మేధావి అయినా కూడా ఒకే ఒక్క వ్యసనం మనుషులని అందరిని దూరం చేస్తుంది గొప్ప గణిత మేధావి స్మోకింగ్ కి బానిస అయిన కూడా అతనిలో ఉన్న మేధాతనాన్ని కార్పొరేట్ కాలేజీ వాళ్ళు గౌరవిస్తార. ఆదరిస్తారు. అతని లోని వ్యసనం భరించినారంటే కేవలం అతని విద్వత్తు వల్లనే..అయితే అదే కాలేజీ కి వచ్చిన కెమిస్ట్రీ లెక్చరర్ ప్రతాప్ జీవితాన్ని పూర్తి గా మార్చేస్తుంది. తల్లి కూడా ఆ వ్యసనాన్ని మానిపించ లేకపోయినా కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి ఎలా మార్చ గలిగింది. అదంతా ప్రేమ మహిమ అని వేరే చెప్పనవసరం లేదు కదా..ఆమె ప్రేమ పొందడం కోసం తన అలవాటుని త్యాగం చేస్తాడు ..అతని విల్ పవర్ ని చూసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది చివరకి వ్యస్యనం నుంచి దూరంగా జరిగి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు ప్రేమ, విల్ పవర్ వుంటే ఏదైనా సాదించవచ్చు అనే భావాన్ని “ఆ మదురిమ” లో ఎంతో బాగా చెప్పారు.

ప్రోత్సాహం: జీవితంలో దెబ్బ తిన్న వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఉండదు. వ్యాపారంలో లాస్ వచ్చింది అని తను ఏ పని చేసినా కలిసి రాదూ అని పని మానేసి కూర్చుంటాడు ..అదే సమయంలో భార్యని మంచి చదువు చదివించి ముందుకు వెళ్ళేలా చేస్తాడు ..మనిషి కి ఏది అయిన ఉండొచ్చు కాని సెల్ఫ్ పిటి ఉండకూడదు ..ఈశ్వర్ న్యూనతలో కూరుకు పోయినప్పుడు ఈశ్వర్ భార్య ఎంతో మంచి మాటలతో, జీవితం పై ఆశ కలిగేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. పురుషుడి లో వుండే సహజమైన మేల్ ఇగో తో తను ఓపెన్ కావటానికి ఇష్టపడడు ..అప్పుడు భార్యనే సముదాయించి గొప్పగా ప్రేరణ కలిగించి ముందుకు వెళ్ళేలా చేస్తుంది ..ఇలా అందరి ఇళ్ళలో వుంటే ఎంత బాగుండునో కదా.

చిరునవ్వు: కాదేది ఉచితానికి అనర్హం: ఉచితం అంటే ఈ లోకం లో చాల మందికి లోకువ ..జన్మభూమి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన దంత వైద్య పరిక్షల కోసం వెళితే ఎదురు అయిన చేదు అనుభవాలు ఏమిటి? డాక్టర్ దేవుడి తో సమానం అంటారు. అలాంటి డాక్టర్ లు పేదరోగులకు, ఉచితంగా చేయించుకునే వారి పట్ల అసహనాన్ని, హేళనని మేళవించి చేసే వాఖ్యలు ఎలా గాయ పరిచాయి? ఆమె తన కింద పళ్లకు సపోర్ట్ చేసుకుందామని వెళ్ళినప్పుడు కుర్ర డాక్టర్ అన్న మాటలు విని కోపంగా క్లాసు పీకి వచ్చేస్తుంది. నవ్వు విలువ తెలియని డాక్టర్ రోగితో సమానం అని నిలదీసి వచ్చేస్తుంది. చిత్రంగా అదే కుర్ర డాక్టర్ ని పెళ్లి చేసుకుంటుంది. కధనం సాగుదలలో ప్రేమ అనే అంశాన్ని కూడా చొప్పించి రోగి కి ముందు గా మందు కన్నా డాక్టర్ చిరునవ్వే సగం రోగాన్ని నయం చేస్తుంది అని చెప్పారు. నేటి డాక్టర్ లు తెలుసుకోవాల్సిన అంశం ఇది.

మరల బడికి: విద్యని నేర్పించాల్సిన గురువు. అది కూడా మారు మూల ప్రాంతం, గిరిజన ప్రాంతంలో ఉన్న బాలుడి పట్ల టీచర్ కాత్యాయని ప్రవర్తించిన తీరు నిజంగా అమానుషం. క్లాసు లీడర్ ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తనే చెప్పడం. వినకపోతే అందరి ముందు తిట్టి బెంచి మీద నిలబెట్టడం వంటివి చేసాక సైదులు ఇక తను క్లాసు లీడర్ గా ఉండనని తెగేసి చెప్తాడు. ఏ తప్పు చెయ్యని తనని ఎందుకు దండిస్తారు అని నిలదీస్తాడు. చదువు లో చురుకు గా వున్నా అలాంటి విద్యార్ధిని బెదిరించి స్కూల్ మానిపించేలా చెయ్యడంలో కాత్యాయని యొక్క తప్పిదం ఎంతైనా వుంది ..హెడ్ మిస్ట్రెస్ వచ్చి జరిగినదంతా తెలుసుకోవడం, అలాంటి విద్యార్ధి ని మరల స్కూల్ కి తీసుకు రాకపోతే జరిగే నష్టం గురించి వివరించాక తన తప్పు తెలుసుకొని మసులుకోవడం ఈ కధ యొక్క సారాంశం, పిల్లల పట్ల టీచర్ ఎంత ప్రేమగా మెలగాలో వివరిస్తుంది. దెబ్బ కొట్టకుండా వాళ్ళని సరి అయిన దారి లో పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు.

ఇంకా ఈ సంపుటి లో “కొత్త మల్లెలు”, “వ్యాపారం”, “మధనం “, “గమ్యం “, “పెరటి మొక్క” లాంటి మంచి కధలు ఉన్నాయి. తను చూసిన జీవితాన్ని, తమ చుట్టూ ఉన్నమనిషి భావోద్వేగాలని వొడిసి పట్టుకొని కధగా మార్చడంలో అనసూయ గారు విజయం సాదించారు. “సూక్షం లో మోక్షం” అన్నట్టు కొన్ని కధల నిడివి తక్కువగా ఉన్నా సబ్జెక్టు పరంగా ఏ మాత్రం వన్నె తగ్గదు అని చెప్పవచ్చు. అనసూయగారు సమాజంలో ఉన్న భిన్న కోణాన్ని పరిచయం చేస్తూ “జీవన శిల్పం” ని మన ముందు ఉంచారు. బాపు గారి నవరసాలు”ఈ కధలకు సరిగ్గా సరిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా మంచి కధానిక సంపుటిని చదివిన తృప్తి ఇది చదివిన వారికి కలుగుతుంది . అనసూయ గారు మరిన్ని మంచి రచనలను అందించాలని కోరుకుంటూ ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *