May 4, 2024

శ్రీ కృష్ణ దేవరాయవైభవం -4

రచన: -రాచవేల్పుల విజయభాస్కరరాజు

sri-krishna-deva-raya
సాళువ నరసింహరాయలు మరణిస్తూ తన పసిబాలురైన కుమారులు రాజ్యభారాన్ని నిర్వహించడం ఇటు రాజ్యానికి అటు తన కుమారులకు క్షేమదాయకం కాదని భావించాడు. క్రీ.శ.1490 లో తన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇక తనకు మరణం తప్పదని ముందే పసిగట్టిన సాళువ నరసింహరాయలు తన అవసానదశలో తనకు నమ్మిన బంటుగా ఎదిగిన సర్వ సైన్యాధిపతి తుళువ నరసా నాయకున్ని రావించాడు. తన తదనంతరం విజయ నగర సామ్రాజ్య చక్రవర్తిగా తన కుమారుల్లో యోగ్యుడైన వారిని నియమించాలనీ, ఉదయగిరి,కొండవీడు, రాయచూరు దుర్గాలను స్వాధీనం చేసుకోవాలనీ, నరసా నాయకుడు రాజ కుటుంబ సంరక్షకుడిగా, రాజ ప్రతినిధిగా, ప్రధాన మంత్రిగా, సర్వసైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలనీ మరణ శాసనాన్ని రూపొందించాడు. తన ఇద్దరు కుమారులతో పాటు మరణ శాసనాన్ని, రాజ్య కోశాగారమును నరసా నాయకునికి అప్పగించాడు. ఇది జరిగిన కొద్ది నెలలకే అనగా క్రీ.శ.1491 జూన్ నెలలో నరసింహరాయలు మృత్యు వాత పడ్డారు. నరసింహరాయల కుమారులిద్దరిలో పెద్దవాడు తిమ్మ భూపాలరాయలు కాగా చిన్నవాడు ఇమ్మడి రెండవ నరసింహ రాయలు. ఈయనకు దమ్మ తిమ్మరాయలు అని మరో పేరు కూడా ఉంది. సాళువ నరసింహదేవ రాయలు బ్రతికి ఉండగానే తన పెద్ద కుమారుడైన తిమ్మ భూపాల రాయలను తన తదనంతర చక్రవర్తిగా ప్రకటిస్తూ యువరాజ పట్టాభిషేకం గావించాడు. అయితే అనుకోని సంఘటనల రీత్యా తాను అకాల మరణానికి గురవుతూ తన కుమారులిద్దరిలో రాజ్యార్హత వయస్సు వచ్చేసరికి ఎవరి గుణగణాలు ఎలా ఉంటాయో, ఎవరు చక్రవర్తిగా అర్హత పొందగలరోననే సందేహం ఉండింది. అందుకే యోగ్యుడైన వారిని మాత్రమే రాజును చేయాలంటూ మరణ శాసనం రూపొందించి తద్వారా నరసా నాయకునికి ఆ స్వేచ్చనిచ్చి ప్రశాంతంగా కన్ను మూశాడు. తన ప్రభువైన సాళువ నరసింగ దేవరాయల కోరిక మేరకు యువరాజైన తిమ్మ భూపాలుని విజయ నగర చక్రవర్తిగా ప్రకటించాడు తుళువ నరసా నాయకుడు.తాను రాజ కుటుంబ సంరక్షకునిగా, రాజ ప్రతినిధిగా, మహా ప్రధానిగా, సర్వసైన్యాధ్యక్షునిగా, ప్రధాన కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. తిమ్మ భూపాలునికి తన అండదండల్లో సకల విద్యల్లో ఆరితేరేలా శిక్షణ నిచ్చి రాజరిక వ్యవహారాలన్నింటిని ఉగ్గుపాలతో నూరిపోయాలనుకున్నాడు నరసా నాయకుడు. అయితే రాజ్యంలోని కీలక పదవులన్నీ తానే స్వీకరించడంతో నరసా నాయకుడికి సమాంతరంగా ఎదుగుతున్న తిమ్మరుసు అనే మరో సైన్యాధిపతికి కంటగింపుగా మారింది. అందువల్ల నరసా నాయకుడు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. చక్రవర్తి కుటుంబంతో బంధుత్వం ఉన్న కారణంగా తిమ్మరుసును ఏమనలేక ఎలాగోలా సహిస్తూ తన పని తాను చేసుకుపోతున్నాడు నరసా నాయకుడు. 

నరసా నాయకుని మౌనాన్ని చూసిన తిమ్మరుసు మరింత రెచ్చి పోయి రాజ్యంలోని కొందరు సామంత ప్రభువులను తనకనుకూలంగా మలచుకొని నరసా నాయకునికి వ్యతిరేకంగా తయారు చేసాడు. వీలు చిక్కితే ఏదో ఒక సంచలనం సృష్టించి నరసా నాయకున్ని దోషిగా నిలబెట్టి ఆ పదవుల నుండి తప్పించాలనే పన్నాగంలో ఉన్నాడు తిమ్మరుసు. నరసా నాయకుడు విజయనగర పరిరక్షణ బాధ్యతలు పూర్తి స్థాయిలో చేపట్టాక రాజ్యానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను,మిగులుబాటును సమీక్షించాడు. ప్రజలకు భారమైన పన్నులను పునఃపరిశీలించి భారమైన వాటిని తొలగించాడు. అలాగే తన దివంగత ప్రభువైన సాళువ నరసింగుని చివరి కోరికైన రాయచూరు, ఉదయగిరి, కొండవీడు దుర్గాలను స్వాధీనం చేసుకోవాలనే ఎత్తుగడలకు ప్రాణం పోసే పనిలో తలమునకలై ఉన్నాడు. అంతలోనే తుళువ నరసానాయకునికి వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. విజయనగర సామ్రాజ్యానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బహమనీ రాజ్యంలో చీలికలేర్పడి పరిస్థితులు తారుమారారయ్యాయి. బహమనీ రాజ్య సామంతుడిగా బీజాపూర్ ను పాలిస్తున్న యూసూఫ్ ఆదిల్షా క్రీ.శ.1489 లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. పరదేశీయుడైన ఆదిల్షా బీజాపూర్ సామంతుడి స్థాయి నుండి స్వతంత్ర ప్రభువుగా చలామణి కావడం బహమనీ సుల్తానులు జీర్ణించుకోలేక పోయారు. పైగా విజయనగర అధీనంలోని మానువ కోటను తమ అండదండలతో గెలిచి, రాజ్యంలో కామధేనువు లాంటి రాయచూరు అంతర్వేదిని , ముద్గల్ దుర్గాలను అట్టిపెట్టుకొని తమకే ఎదురు తిరగడం బహమనీలకు పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో ఆదిల్షామీద యుద్ధం ప్రకటించమంటూ బహమనీ సుల్తానులు తమ మహా ప్రధాన మంత్రి అయిన కాశిం బరీదును ఆదేశించారు మానువ కోట ఆక్రమణతో విజయనగర సామ్రాజ్యానికి ఆదిల్షా శత్రువుగా మారాడు. అందువల్ల జరగబోయే యుద్ధంలో విజయనగర రాజు సహాయం తీసుకొని ఆదిల్షాను చావుదెబ్బ కొట్టాలనుకున్నాడు కాశింబరీదు. అనుకున్నదే తడవుగా తాము బీజాపూర్ సుల్తాను యూసూఫ్ ఆదిల్ఖాన్ పై యుద్ధం ప్రకటించనున్నామనీ, ఆ యుద్ధంలో తమతో చేయి కలిపి ఆదిల్ఖాన్ ను మట్టి కరిపిస్తే రాయచూరు, ముద్గల్ కోటలను తిరిగి విజయనగరానికే అప్పజెప్పుతామంటూ విజయనగర రాజ ప్రతినిధి తుళువ నరసా నాయకుడికి లేఖ ద్వారా కబురు చేశాడు. లేఖతో పాటు అనేక కానుకలను పంపాడు. ఇదే అదనుగా భావించి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధంలో బహమనీలతో చేతులు కలిపేందుకు అంగీకరించాడు నరసా నాయకుడు. క్రీ.శ 1491 లో మొత్తం సైన్యాన్ని సమీకరించుకున్నాడు నరసానాయకుడు.

ఆరవీటి బుక్క రాజు మనుమడు రామరాజు తిమ్మరాజును సేనాధిపతిగా నియమించి తన సైన్యాన్ని రాయచూరు అంతర్వేదికి నడిపాడు. విజయనగర సైన్యం బీజాపూర్ రాజ్యంలోని అనేక ప్రాంతాలపై దాడి చేసి ఆ ప్రాంతాలను సర్వ నాశనం చేసింది. రాయచూరు, ముద్గల్ వరకున్న భూములను అల్లకల్లోల పరచి అతి సునాయాసంగా కోటలను స్వాధీనం చేసుకుంది. యుద్ధంలో చావుదెబ్బ తిన్న యూసూఫ్ ఆదిల్షా అవమాన భారంతో కుతకుతలాడి పోయాడు. అనుకోకుండా అకస్మాత్తుగా విజయ నగర సైన్యం తనపై ఎందుకు దాడి చేసిందో తెలియజేయాలంటూ వేగుల ద్వారా సమాచారం కోరాడు.అందులోఖాశింబరీదు పాత్ర ఉందని తెలుసుకొని మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. ఖాశిం బరీదు పాలిస్తున్న సామంతరాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రణాళిక రూపొందించి కొద్దికాలంలోనే ఖాశింబరీదుతో యుద్ధానికి దిగాడు ఆదిల్షా. ఆ యుద్ధంలో ఖాశింబరీదు ఓడిపోయాడు ఆదిల్షాలో విజయగర్వం తొణికిసలాడింది అదే స్ఫూర్తితో విజయనగరాన్ని ఓడించాలనిసంకల్పించాడు.

ఆ పిదప కొద్ది నెలల్లోనే అనగా క్రీ.శ.1493 లో విజయ నగరం పై యుద్ధం ప్రకటించాడు. తన సైన్యాన్ని కృష్ణానదీ పరీవాహక ప్రాంతం వెంట నడిపించాడు. పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలు చేసి విజయం కోసం అవసరమైన ఎత్తులు, ప్రత్యర్థుల ఎత్తులకుఎత్తులను చిత్తు చేసే యుద్ధ ప్రణాళికా రచనలో నిమగ్నమయ్యాడు. అంతలోనే ఉన్నట్లుండి ఆదిల్షా రోగగ్రస్థుడయ్యారు.దాదాపు రెండు నెలల పాటు ఆ రోగం ఆదిల్షాను పట్టి పీడించింది.యావత్ సైన్యం తమ ప్రభువు తిరిగి కోలుకోవాలని అల్లాను ప్రార్థించింది. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే అక్కడ విజయ నగరంలో నరసా నాయకునికి కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యాయి. రాజ్యంలో అంతః కలహాలు కొనసాగడం క్షేమం కాదని భావించాడు నరసా నాయకుడు. వాటన్నింటిని ఎంతో చాకచక్యంగా, లౌక్యంగా సర్దుబాటు చేశాడు. అదే సమయంలో వేగుల ద్వారా ఆదిల్షా యుద్ధసన్నాహాలు, కృష్ణా నది ఒడ్డున సైన్య మోహరింపు సమాచారం అందుకున్నాడు. వెంటనే తాను కూడా అందుకు సన్నద్దమై బాలుడైన చక్రవర్తిని వెంటబెట్టుకుని యుద్ధ రంగాన కాలు మోపాడు నరసానాయకుడు రాయచూరు సమీపంలో యుద్ధ గుడారాలు నెలకొలిపి ఏ క్షణం లోనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆదిల్షా జబ్బు పడిన కారణంగా ముందుగా తాను యుద్ధం ప్రారంభిస్తే విజయనగర వీరోచిత గౌరవానికి భంగమని తలచి ప్రత్యర్హి చర్యలకై ఎదురు చూస్తున్నాడు నరసా నాయకుడు.ఈ విషయం వేగుల ద్వారా ఆదిల్షాకు చేరింది. వెంటనే తన సైన్య సాధారణ పునఃసమీక్షకు ఆదేశించాడు. తన సైన్య విభాగాల పట్ల సంతృప్తి చెందాడు.ఈ లోగా ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో కుదుట పడింది. దీంతో కృష్ణా నది తీర ప్రాంతం నుండి ముందుకు సాగి విజయనగర సైన్యానికి తొమ్మిది మైళ్ళ దూరంలో తన సైన్యాన్ని మోహరించాడు ఆదిల్షా.కొద్ది రోజుల వరకు ఇరుపక్షాల నుండి ఏలాంటి యుద్ధ అలికిడి లేదు.

నిర్ణీత యుద్ధ ప్రకటన కోసం ఇరుపక్షాలు కాచుకుని ఉన్నాయి. అది క్రీ.శ. 1493 వ సంవత్సరము. మే నెల 19వ తేదీ శనివారము.ఆ రోజు తెల్లారిందొ లేదో ఇరు సైన్యాలు రెట్టించిన పౌరుషంతో శరవేగంగా దూసుకు వచ్చి ఢీ కొన్నాయి. నరసానాయకుడు అప్పటికే అనేక యుద్ధాల్లో ఆరితేరినందువల్ల తనదైన ఎత్తుగడలతో సైన్యాన్ని ముందుకు దూకించాడు. బీజాపూర్ సైన్యంలో వీరాధివీరులైన అయిదు వందలమందిని హతమార్చాడు. చాకచక్యంగా ఆదిల్షాను బంధించాడు. ఫలితంగా బీజాపూర్ సైన్యం చెల్లాచెదురైంది. ప్రాణ భయంతో “బ్రతుకు జీవుడా” అంటూ వెన్నుజూపి పారిపోయింది. కాగా నరసా నాయకుడు జాలిపడి ఆదిల్షాను బంధ విముక్తుడిని చేసి హెచ్చరించి పంపాడు.ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల విలువైన సొమ్ము నరసా నాయకుడి వశమైంది. యుద్ధ నియమం ప్రకారం విజయ నగర సైన్యం శత్రువును దోచుకోవడంలో నిమగ్నమైంది.ఈ లోగా బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా నరసా నాయకుడికి ఒక రాజీ లేఖ పంపించాడు. తనకు ప్రాణభిక్ష పెట్టినందువల్ల తాను విజయనగరంతో రాజీ పడి ఇక నుండి సఖ్యతగా మెలగుతానన్నాడు. అందువల్ల రాజీ నియమ నిబంధనలను రూపొందించుకొని ఆ మేరకు పరస్పర ఒప్పందం కుదుర్చుకుందామన్నాడు.ఒప్పందంపై పరస్పరం సంతకాలు చేసుకోవాలి కాబట్టి చక్రవర్తిని వెంటబెట్టుకొని తగిన రక్షణతో రావాలంటూ నరసా నాయకుడికి కబురు చేసి సంధికి ఆహ్వానించాడు.

చేతికి దొరికిన శత్రువుకు తాను ప్రాణభిక్ష పెట్టినందువల్ల తనకు భయపడి ఆదిల్షా తన పట్ల విధేయతతో సంధికి ఆహ్వానిస్తున్నాడని భావించాడు నరసా నాయకుడు. తన మొత్తం సైన్యాన్ని యుద్ధ క్షేత్రంలోనే వదలి అరివీర భయంకరులైన కొద్దిమంది వీరాధివీరులతో తన చక్రవర్తిని వెంటబెట్టుకుని బీజాపూర్ వెళ్ళాడు. ఇదే అదనుగా భావించిన ఆదిల్షా మొత్తం సైన్యంతో నరసా నాయకునిపై విరుచుకు పడ్డాడు. ఊహించని రీతిలో దొంగదెబ్బ తీసాడు. అయినా నరసా నాయకుడు భీతిల్లలేదు. తన కుర్ర చక్రవర్తిని కాపాడుకుంటూనే ఉన్న కొద్దిపాటి సైన్యంతో శత్రుసైన్యాన్ని చీల్చిచెండాడుతున్నాడు. తాము కొద్ది మంది మాత్రమే ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి మొత్తం బీజాపూర్ సైన్యాన్ని కొన్ని ఘడియల పాటు నిలువరిస్తామనీ, ఈలోగా చక్రవర్తిని తీసుకుని విజయ నగరానికి చేర్చాలంటూ అంతరంగిక భద్రతా దళం నరసానాయకుడిని అభ్యర్థించింది. ఇది సబబు గానే తోచడంతో ఒకవైపు శత్రువులను ఎదుర్కొంటూనే మరోవైపు చక్రవర్తిని తీసుకుని ఆఘమేఘాలపై బీజాపూర్ నగర శివార్లను దాటాడు నరసానాయకుడు.

ఈ లోగా బీజాపూర్ సైన్యం ఒక ప్రణాళికతో మున్ముందుకు దూసుకు వచ్చింది. ముందుగా చక్రవర్తిని హతమారుస్తే విజయనగర రాజ్యం తమ చేతిలో ఓడిపోయినట్లవుతుందని చక్రవర్తిని, నరసానాయకున్ని వెంటాడారు.అయితే విజయనగర వీరాధివీరులు కొద్దిమందే ఉన్నప్పటికీ మొత్తం బీజాపూర్ సైన్యానికి అడ్డుగోడలా నిలిచారు. తమ చక్రవర్తి, సర్వ సైన్యాధ్యక్షుని వైపు కన్నెత్తి చూడకుండా నిలువరించారు. ఇలా అయితే కుదరదనుకున్న బీజాపూర్ సైన్యం వ్యూహం మార్చి విల్లంబుల సైన్యం ద్వారా ఏనుగుల పైనుండి దాడి చెయించింది. దీంతో చక్రవర్తి వెన్నులో ఓ బాణం దిగబడింది. అయినా నరసానాయకుడు వెరవలేదు. చక్రవర్తిని తీసుకుని శరవేగంతో విజయనగరం చేరుకున్నాడు. ఇక్కడ బీజాపూర్ సైన్యాన్ని నిలువరించిన విజయ నగర వీరుల్లో డెబ్బై మంది వీర మరణం పొందారు. యుద్ధ క్షెత్రంలో శత్రువును దోచుకుంటున్న విజయనగర సైన్యానికి ఇదేమీ తెలియలేదు. దీంతో వారంతా ఏమరుపాటుగా ఉన్న సమయంలో బీజాపూర్ సైన్యం విరుచుకు పడింది. దొరికిన వారిని దొరికినట్లు నరికేస్తూ అల్లకల్లోలం సృష్టించింది. అప్పుడు యుద్ధరంగంలో విజయనగర సైన్యం తరపున ఏడు వేల గుర్రాలు, మూడు వందల ఏనుగులు, అయిదు లక్షల కాల్బలం ఉంది. రాజీకని వెళ్ళిన తమ చక్రవర్తి, సర్వసైన్యాధ్యక్షులపై బీజాపూర్ సైన్యం మోసంతో దాడి చేసిందనీ, చక్రవర్తికి ప్రాణాంతక గాయం కావడంతో చక్రవర్తిని తీసుకుని నరసానాయకుడు విజయనగరం పారిపోయాడన్న వార్త గుప్పుమంది. దీంతో అంతమంది సైన్యం ఉన్నప్పటికీ బీజాపూర్ సైన్యాన్ని ఎదుర్కోకుండానే విజయనగర సైన్యం వెన్నుచూపి పారిపోయింది. అలా పారిపోయేందుకు అవకాశం లేని రెండు వందల ఏనుగులను, వెయ్యి గుర్రాలను, అరవై లక్షల ఊన్లను అనగా పదునెనిమిది లక్షల పౌండ్ల నగదును వదిలేసింది. వాటితో పాటు లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలు, వజ్రవైడూర్యాలు, శత్రువుల చేతికి చిక్కాయి.

చక్రవర్తి తిమ్మభూపాలునికి తగిలిన బాణం దెబ్బతో ప్రాణాంతక గాయమైంది. తీవ్ర అస్వస్థతకు గురైన చక్రవర్తికి రాజవైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన తిమ్మరుసు అనబడే ఓ దండనాయకుడు చక్రవర్తి హత్యకు కుట్ర పన్నాడు. నరసానాయకుడు చేసే ప్రతిపనిని వ్యతిరేకించే కీలక దండనాయకుడు ఈయనే. చక్రవర్తి సమ్రక్షకులలో ఒకరికి లంచం ఇచ్చి తిమ్మభూపాలునిపై విషప్రయోగం చేయించాడు. ఫలితంగా తిమ్మభూపాలుడు దుర్మరణం పాలయ్యాడు. నరసానాయకుడే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు చక్రవర్తిని హత్య చేయించాడంటూ తిమ్మరుసు దుష్ప్రచారం ప్రారంభించాడు.. రాజకుటుంబ సమ్రక్షకుడు అయినందున తనకు తెలియకుండా రాజకోటలో చీమ కూడా అడుగు పెట్టలేదని, అందువల్ల నరసానాయకుడు చక్రవర్తిని మార్గమధ్యంలో చంపి, ఇప్పుడు విష ప్రయోగంతో మరణించినట్లు బుకాయిస్తున్నాడని తన అనుచరులతో ప్రచారం లేవదీసాడు. చక్రవర్తిని హతమార్చి తద్వారా రాజ్యం ఆక్రమించుకోవాలనుకుంటున్న నరసానాయకుడి కుట్రకు మరణ దండన విధించాలంటూ శిక్ష కూడా తానే ఖరారు చేసి నాటకీయంగా ఈ మాటలను కాబోయే చక్రవర్తి చెవిలో వేయించాడు.ఈ దెబ్బతో నరసానాయకుని అడ్డు తొలగిపోతుందని భావించాడు తిమ్మరుసు. తిమ్మరుసు కుట్రను పసిగట్టిన నరసానాయకుడు వెంటనే రెండవ నరసింహరాయలును విజయనగర చక్రవర్తిగా సింహాసనంపై కూర్చోబెట్టాడు. తన కుట్ర వల్ల ఏదో ఒకరోజు రెండవ నరసింహరాయలు చక్రవర్తి కాకతప్పదని
ఊహించిన తిమ్మరుసు ముందునుంచే రాయలును మచ్చిక చేసుకుంటూ వచ్చాడు పైగా చక్రవర్తి బంధువులందరూ తిమ్మరుసుకు వత్తాసు పలుకుతున్నారు. అదిగాక అనేకమంది రాజకుటుంబీకులు, రాజోద్యోగులు తిమ్మరుసుకు కూడాబంధువులు.ఈ కారణంగా తిమ్మరుసును ఏమీ చేయలేక నరసానాయకుడు తన ఆగ్రహాన్నంతా మనసులోనే దాచుకున్నాడు.

ఇంకా అణచి వేయాలన్న ఉద్దేశ్యంతో చక్రవర్తికి తిమ్మరుసు మరిన్ని చాడీలు చెప్పి నరసానాయకుని పట్ల ద్వేషం మరింత పెరిగేలా చేసాడు. దీంతో తిమ్మరుసు చేతిలో చక్రవర్తి కీలుబొమ్మగా మారాడు. పైగా కొన్ని లేనిపోని బలహీనతలకు అలవాటు పడ్డాడు. తన తమ్ముడైన గత చక్రవర్తిని చంపిన రాజద్రోహికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి కీలక బాధ్యతలు అప్పగించడం నరసానాయకుడు జీర్ణించుకోలేక పోయాడు. ఇందుకోసం ఒక పరిష్కార మార్గం ఆలోచించే లోగానే నరసానాయకుడిని అన్ని కీలక పదవుల నుండి తప్పించి, సాధారణ దండ నాయకుడిగా కొనసాగాలంటూ ఆదేశించాడు చక్రవర్తి.. దీంతో నరసానాయకుడు తీవ్ర కలత చెందాడు. కొద్ది నెలలు గడిచాక తాను ఆనెగొంది అడవుల్లో వేటకు బయలుదేరతానంటూ చక్రవర్తి నుండి అనుమతి కోరాడు. అనుమతి లభించాక ముందుగా ఆనెగొంది, అక్కడి నుండి పెనుగొండ చేరుకున్నాడు. ఇక విజయనగరం రాకుండా అక్కడే మకాం వేశాడు. తనకు అనుకూలురైన సామంత ప్రభువులందరినీ సమీకరించి జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు.ఈ సందర్భంగా సామంత రాజులందరూ నరసానాయకునికి అండగా నిలిచారు. ఆజ్ఞాపిస్తే ఏ క్షణం లోనైనా విజయనగరంపై దాడి చేస్తామంటూ భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఎన్ని రోజులైనా నరసానాయకుని జాడ లేదు. దీంతో చక్రవర్తికి అనుమానమొచ్చింది. నరసానాయకుని ఆచూకి తెలపాలంటూ వేగులను ఆదేశించాడు. ఎట్టకేలకు వేగులు నరసానాయకుని ఉనికిని కనుగొన్నారు. పెనుగొండ దుర్గంలో తలదాచుకున్నాడనీ, చక్రవర్తి పట్ల ఆగ్రహంతో ఉన్నాడని చక్రవర్తికి సమాచారమందించారు వేగులు.ఆ వెంటనే తగిన వివరణ ఇవ్వాలంటూ నరసానాయకున్ని ఆదేశించాడు చక్రవర్తి.ఆ మేరకు ఒక రాయబారిని పెనుగొండకు పంపాడు. ఇదే అదనుగా భావించిన నరసానాయకుడు తన వివరణ లేఖను రాయబారి వెంట చక్రవర్తికి పంపించాడు. మీ తమ్ముడైన గత చక్రవర్తి తిమ్మ భూపాలుని విషప్రయోగంతో చంపించి తిమ్మరుసు రాజద్రోహానికి పాల్పడ్డాడు. అలాంటి ద్రోహి పై చర్యలు తీసుకోకుండా అక్కున చేర్చుకోవడం చక్రవర్తిగా మీకు సబబు కాదు. మీ తండ్రి గారు ఏ పరిస్థితుల్లో నాకు ఈ రాజ్యాన్ని, మీ ఇద్దరు అన్నదమ్ములను అప్పగించారో మరోసారి మీరు తెలుసుకోవాలి. మీ తమ్మున్ని చంపిన తిమ్మరుసు మిమ్ములను కూడా చంపి ఈ సిమ్హాసనాన్ని ఆక్రమించుకునే ప్రమాదముంది. అందువల్ల తిమ్మరుసుకు తగిన శిక్ష విధించాలి. అలాగైతేనే రాజధానికి నేను తిరిగి వస్తాను. లేని పక్షంలో మీ తండ్రి గారు అప్పజెప్పిన మరణ శాసన బాధ్యతల ప్రకారం బలవంతంగానైనా విజయనగరంపై దాడి చేసి రాజ్యాన్ని,చక్రవర్తిని కాపాడుకోవాల్సి ఉంటుందని లేఖ ద్వారా హెచ్చరించాడు. ఆ లేఖను అతని మూలంగానే చదివిన రెండవ నరసింహ రాయలు తిమ్మరుసుపై ఎలాంటిచర్యలు తీసుకోలేదు.అతని మూలంగానే తాను చక్రవర్తి కాగలిగాననీ,మరింత అభిమానం చూపించడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగక నరసానాయకుడికి అనుకూలంగా ఉన్న రాజోద్యోగులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం మొదలెట్టాడు. ఇక లాభం లేదనుకున్న నరసానాయకుడు పెద్ద సైన్యంతో విజయ నగరంపై దాడి చేసాడు. నాలుగైదు రోజుల పాటువిజయనగర ముట్టడి సాగింది. నరసానాయకుని సేనలు రెట్టించిన ఉత్సాహంతో కోట ముట్టడి గావిస్తూ ముందుకు సాగారు. విజయ నగర సైన్యం నామ మాత్రంగా కూడా ప్రతిఘటించలేదు. పైగా నగర ప్రముఖులంతా నరసానాయకునికి అండగా నిలిచారు. దీంతో చక్రవర్తికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ప్రధాన దండ నాయకులను పిలిపించి తిమ్మరుసు శిరస్సు ఖండించి ఆ తలను నరసానాయకుడికి పంపించాలంటూ ఆదేశించాడు. తక్షణమే చక్రవర్తి ఆదేశాలు అమలు జరిగాయి. తిమ్మరుసు తలను ఖండించి నరసానాయకుడికి పంపారు. దీంతో నరసానాయకుడు ఎంతో సంతోషించాడు. తనసైన్యాన్నంతా వెనక్కు పంపాడు. కొద్దిపాటి సైన్యంతో రాజకోటలోకి అడుగు పెట్టాడు. వెనువెంటనే నగర ప్రముఖులువేలాదిమంది ప్రజలు నరసానాయకుడికి స్వాగతం పలికారు. న్యాయబుద్ధి కలిగిన నిజాయతీ పరుడంటూ కొనియాడారు. ఎంతగానో అభిమానం కురిపించారు. విజయనగరానికి ఏ అవసరమొచ్చినా తామంతా బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *