May 7, 2024

విజేత 

రచన-నాగజ్యోతీ సుసర్ల

వేకువెదురు చూసేనా వెలుగిచ్చే సూర్యుని కోసం
తారలెదురు చూసేనా నిశి తెచ్చే చీకటి కోసం
.
ఆకురాల్చు శిశిరానికీ తరువులన్నిజడిసేనా?
ప్రతి ఋతువూ వసంతమవగా ప్రకృతికాంత పరితపించునా?
కొండ కొనకు కంటగింపనీ ఏరు పరుగు నాపేనా? 
జలపాతమ్మై దూకీ తన ఉనికిని చాటుతుందిగా 
.
నలకనైనా, చినుకునైనా ఒడిసిపట్టి ముత్యపు చిప్ప 
ముత్యమల్లె మార్చి జగతికీ మంచి బహుమానమివ్వదా?
అవకాశము చిన్నదె అయినా అందుకునే రీతిని తెలిపీ
అందలముగ మార్చుకొమ్మనీ చక్కని సందేశమిచ్చుగా……
.
కష్టాలే కమ్ముకొచ్చెనని మనిషి క్రుంగి కృశించాలా?
ఆశయాన్ని సాధించుటకై అలుపెరగక శ్రమించవలెగా?
వెతల రాత విధి వ్రాసిందని నిందజేయు నిస్పృహేలనో
చేతనత్వమెరుగని శిలలా చేష్టలుడిగి నిలుచుటేలనో 
.
ఎవరో నీ కొరకై వచ్చీ, ఉద్ధరించవలెనని తలచీ
కౌముదికై వగచి వేచెడీ చకోరమౌరీతిని వదలీ 
నీరాతను చక్కదిద్దుకో, నీ దారిని నువ్వు మలచుకో
జీవితమొక వరమౌ విధమును ఓ మనిషీ నువ్వు తెలుసుకో…..
.
సంకల్పములో బలముంటే …స్పందనలో సమ దృష్టుంటే 
ప్రతి మలుపూ గెలుపు నిచ్చునోయ్ …విజేతగా నిన్ను నిలుపునోయ్….

(స్పందనలో సమ దృష్టి…కష్టాన్నీ, సుఖాన్నీ సమంగా ఎంచగలిగి నిలవాలని నా భావము) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *