May 4, 2024

వేదన బరువై

రచన: లయన్ విమల గుర్రాల

scan
“కంగ్రాట్స్..మాలతి గారూ.. మేల్ చైల్డ్” – స్కానింగ్ రూమ్ లోంచి చేతులు తుడుచుకుంటూ
వచ్చింది డాక్టర్ పద్మిని.
ఒకక్షణం ఆనందపు తరంగం ఉవ్వెత్తున లేచింది మాలతికి.
“థ్యాంక్స్ డాక్టరుగారూ .. మళ్ళీ నెక్స్ట్ సండే వస్తాను”.. లేచింది కుర్చీలోంచి.
“ఒ.కె.. నేనిచ్చిన టాబ్లెట్స్ జాగ్రత్తగా వాడండి – లక్ష్మీ,, ఉదయం వచ్చిన శాంపిల్స్ లోంచి వీరికి యివ్వు” నర్సుకి పురమాయించింది పద్మిని. ఇంతలో బయట కారు ఆగిన శబ్దమూ, ఆ వెంటనే ఒక పర్సనాలిటీ డాక్టర్ రూములోకి ఎంటరవ్వడమూ వెంటవెంటనే జరిగాయి”” హాయ్ పద్మినీ ” అంటూ.
మాలతి బయటకు వచ్చేసింది. బయట ఆయాతో కబుర్లు చెపుతున్న గోపమ్మ “అమ్మా-అయిందా”అంటూ వచ్చింది. “ఉండు – వెడదాం -టాబ్లెట్సేవో ఇమ్మన్నారు” అని బయట బెంచీ మీద కూచుంది మాలతి.
లోపలనించి పురుషకంఠం కొంత హెచ్చుస్థాయిలో వినిపిస్తూ ఉంది.
“ఎంతసేపూ పనేనా పద్మా- హాయిగా బ్లూమూన్ లో ఎంజాయ్ చేద్దాం- రాత్రంతా- రా”
“ప్లీజ్ మూర్తీ – ఈవాళ వదిలేయి – మూడ్ లేదు”
“మూడ్ కేంలే- ఈ హాస్పిటల్ నుండి బయటకు వస్తే అదే వస్తుంది. డోన్ట్ వేస్ట్ టైమ్. కమాన్- మనిద్దరం కలిసి గడిపి అప్పుడే టూ డేస్ -“.
“ఇవ్వాళ వదిలేయకూడదూ – కొంచెం తలనొప్పిగా వుంది కూడా”
నెమ్మదిగా బ్రతిమాలే స్వరంతో అడుగుతుంది డాక్టరు.
“నీకెన్నిసార్లు చెప్పాను – నేనడిగినప్పుడు కాదన్నావంటే నీగతి ఏమవుతుందో ఎవరికి తెలియదని “మూర్తి స్వరం హెచ్చింది.
“ప్లీజ్ – స్టాఫ్, పేషంట్లు ఉన్నారు – నెమ్మది – వస్తానులే” డాక్టరు గొంతులో కన్నీటిపొర మాలతికి స్పష్టంగా అర్ధమయింది.
బయట వున్న నర్సు, ఆయా వినీవిననట్లు పనిచేసుకుపోతున్నారు.
నర్సు ఇచ్చిన టాబ్లెట్సు తీసుకుని. ఆయాతో మాట్లాడుతున్న గోపమ్మని పిలిచి బయటకు వచ్చింది.
“ఎవరతను గోపమ్మా – డాక్టరుగారికి భర్త లేరనుకుంటాను”
నెమ్మదిగా అడిగిన మాలతికి సమాధానంగా చెప్పింది గోపమ్మ
“లేడమ్మా- ఈయన డాక్టరుగారి ప్రాణానికి కీచకుడమ్మా.. ఆయమ్మ ప్రాక్టీసుకు సాయంచేస్తాడు. ఆయమ్మ వ్రాసే పేపర్లకి ఈయన సంతకం పెడితే కాని పైవాళ్ళు తీసుకోరు. అదే లోకువ ఆయనకి – ఒంటది ఆడది – తనిష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంటాడట – ఆయమ్మ చెప్పింది – ఏంచేస్తాం తల్లీ – ఆడపుట్టుక – అది సర్లే గానింతకీ డాక్టరమ్మేం చెప్పింది”-
“మగబిడ్డట” పరధ్యానంగా చెప్పింది మాలతి.
“నిజంగానా – ఎంత మంచిమాట అమ్మా- దేముడు దయతలచి అయ్యగారు తిరిగొస్తారన్నమాట”.
“ఊ” – ఆలోచనలో వున్న మాలతి హఠాత్తుగా వినిపించిన కేకలకి ఉలికిపడి రోడ్డుపైకి చూచింది.
“ఏమమ్మాయి – చావాలనా రోడ్డు మధ్యలోకి వస్తావు” –
“మరీ అంత కలలు కంటూ మా పీకలమీదకు తేకపోతే ఏమయింది “
“పోనివ్వండి – చిన్నపిల్ల-” ఎవరో దయగా అంటున్నా
“అయితే మట్టుకు జాగ్రత్తొద్దటండి”
“వెళ్ళెళ్ళవ్వమ్మా – లేచినవేళ బాగుంది”
“దెబ్బలేం తగల్లేదు కదా”
“లేదులెండి – కాస్తుంటే ప్రాణమే పోయేది -అదృష్టం”
“నాది అదృష్టం – వెధవగోల – పడి చావడానికి నా కారే దొరికిందా”
మూగిన జనం కొద్దిగా చెదిరేసరికి మధ్యలో కనపడింది- పద్నాలుగు, పదిహేనేళ్ళుంటాయెమో తలదించుకుని ఏడుస్తున్న ఆ అమ్మాయి.
కారతను తిట్టుకుంటూ, తిట్టుకుంటూ – కారు స్టార్టు చేసుకుని వెళ్ళిపోయాడు.
మాలతికెందుకో జాలితో ఆ అమ్మాయిని పలకరించాలనిపించింది. గోపమ్మ అప్పుడే అక్కడికి చేరిపోయింది.
“ రా అమ్మా – యింటికెళదాం – ఎక్కడ మీ యిల్లు” దయగా అడిగిన ఆ స్వరానికి ఆ అమ్మాయి కళ్ళలోంచి
మరి నాలుగు బిందువులు రాలాయి – పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుంటూ జవాబివ్వలేదు.
“ఒంట్లో బాగుంది కదా- రోడ్డుకడ్డంగా ఎందుకు వచ్చావమ్మా” మళ్ళీ అడిగింది.
“కారు కింద పడితే తేలిగ్గా చచ్చిపోవచ్చు కదా మరి “
ఆశ్చర్యం మాలతిని ముంచెత్తింది.
పద్నాలుగేళ్ళ పిల్ల – తేలిగ్గా చచ్చిపోవాలన్న ఆలోచన – అసలు చచ్చిపోవాలన్న ఆలోచనే ఎందుకొచ్చిందో – అంతకష్టం ఆ అమ్మాయికేమి వచ్చిందో –
“మీ యిల్లెక్కడ” – “మా యింటికెళ్ళను”
ఈసారి మాలతి ప్రశ్నకు ఖచ్చితంగా జవాబిచ్చింది ఆ అమ్మాయి.
“పోనీలే – మా యింటికెడదాం – పద” అప్పటికి తమ యింటికి తీసుకుపోయి నెమ్మదిగా చూద్దాం అనే ఉద్ధేశంతో అంది మాలతి.
నాలుగడుగులు వేసాక అనునయంగా అడిగింది గోపమ్మ. “ఏమ్మా – ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు”
ప్రశ్న వింటుండగానే మరలా ఆ అమ్మాయి కళ్ళలోంచి నీళ్ళు వర్షించడం ప్రారంభమయింది.
కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది – “మరి మధ్యాహ్నం ఒక్కదాన్నే – చదువుకుంటూ ఉంటే తలుపేసి “ –
ఆ అమ్మాయి ఏడుపు చూసి ఏమి జరిగిందో పూర్తిచేయకుండానే మాలతికి అర్ధమయింది.
ఎవరయి వుంటారో – ఫ్రెండేమో – స్కూలు ఫ్రెండేమో – పక్కింటి వాడేమో.
“మరి – మీ అమ్మా – నాన్న”
“మా అమ్మ లేదు – చిన్నప్పుడే చచ్చిపోయింది”.
“మరి మీ నాన్నకి చెప్పవచ్చుగా-”
“మా నాన్నే తాగేసి-” ఎక్కిళ్ళ మధ్య ఆ అమ్మాయి సమాధానం మాలతికి ఎంత షాకిచ్చిందో గోపమ్మకీ అంతకంటే మతిపోగొట్టింది.
నమ్మశక్యంకాని విషయం – జరగడానికి ఎంతవరకు అవకాశం – నైతికవిలువల క్షీణతకు మరో నిదర్శనం ఈ నవ్య ప్రపంచంలో.
“సరే పదమ్మా – ఇంటికి పోవద్దు – నా దగ్గరే ఉందువు గాని – ఆడపుట్టుక ఎందుకు పుట్టించాడో భగవంతుడు”
గోపమ్మ చేతిలో ఆ అమ్మాయి ఒదిగిపోయింది.
ఇంటికి ఎలా చేరిందో – అత్తగారు ఏమి అడిగిందో – తానేమి చెప్పిందో మాలతి మెదడుకి ఎక్కలేదు.
భోజనం చేసి చేతులు కడుక్కుంటూ ఉంటే అంది అత్తగారు – “రేపు వాడికి ఉత్తరం వ్రాస్తావామ్మా”-
“వ్రాస్తాను లెండి” అని బయటకు వచ్చింది.
తొమ్మిదయింది. వంటిల్లు సర్దుకుని అత్తగారు హాల్లో మేను వాల్చింది.
నిద్రరాక బయట బాల్కనీలోకి వచ్చింది మాలతి.
నిరంజన్ కు ఉత్తరం వ్రాయాలా – వస్తాడా –
ఎందుకు రాడు – మగబిడ్డ కలిగితే అందే ఆస్తి కాదనేంత గొప్పవాడు ఏమికాదు అతడు,
మాలతికి నిరంజన్ కి పెళ్ళైన రెండేళ్ళవరకు సంతానం కలగలేదు.
తరువాత వచ్చిన గర్భం రెండుసార్లూ ఆడపిల్ల పుట్టిపోయింది. మూడోసారి ఆడపిల్ల పుట్టగానే అన్నాడు మామగారు -” మనింటికి వంశాంకురం మగబిడ్డ కలిగేలాగ కనపడటం లేదురా- మన వంశం ఏమవుతుందో” ..అని.
ఆ పాపకి కూడా రెండునెలలు గడిచీ గడవకుండానే నిరంజన్ సణగడం మొదలుపెట్టాడు –
“వెధవ సంత- ఆడపిల్ల తద్దినం – ఉన్నదంతా మింగేందుకే పుట్టింది -పెళ్ళిళ్ళూ- పెరంటాలు – ఎంత ఖర్చు – ఇదే మగపిల్లాడయితేనా – ఎంత దర్జా – ఎంత ఆదాయం” – యిలా సాగేది.
మామగారు పక్షవాతంతో చనిపోతూ “ మగబిడ్డ కలిగితేనే ఆస్తంతా అతనిది -గార్డియన్ లుగా తల్లిదండ్రి అనుభవించాలి – లేకపోతే అదంతా ధర్మకార్యాలకి ట్రస్టీలకి అని వ్రాసేసారు.. ఇంకో వంశానికి ఎక్కడ పోతుందో అని.
ఆ నాటి నుండి నిరంజన్ మనిషి పూర్తిగా మారిపోయాడు.
పాప అంతదూరంలో ఉన్నా భరించలేకపోయేవాడు. చివరికి మాలతి ఎంతవద్దన్నా వినకుండా తెలిసినవాళ్ళెవరో ఫారిన్ నుండి పిల్లలని దత్తు తీసుకుందామని వస్తే వాళ్ళకిచ్చేసాడు.
అంతే – తరువాత ఏడాది వరకూ మాలతికి గర్భం రాలేదు.
మొదట క్యాంపులకని వెళ్ళే నిరంజన్ క్రమంగా ఇంటికి రావడం మానేసాడు. వేరేవూరిలో ఇల్లు తీసుకున్నాడని వేరే సంసారం పెట్టాడని అపుడపుడూ మాలతి చెవిన పడుతూ ఉంటుంది. అయినా అతను వచ్చినప్పుడు నిలదీసి అడగలేకపోయింది. ఇపుడీ ప్రెగ్నెన్సీ -.
మగబిడ్డ కలగకపోతే తను అతనికి అక్కరలేదా – తనవసరం అంతవరకేనా – అన్న బాధే మాలతిది ఇంతవరకూ. ఆడపిల్లే అయినా తన రక్తం పంచుకున్న బిడ్డ నిర్ధాక్షిణ్యంగా పరాయివాళ్ళకి అప్పచెప్పబడితే ఏమిచేయలేని తన నిస్సహాయత – ఇపుడు ఎవరో ఒకరు మళ్ళీ తన కడుపులో ప్రాణం పోసుకుంటున్నారన్న ఆనందం ఇంతే మాలతికి మిగిలింది – కాని –
ఈ రోజు ఎక్కడినుండో ఏదో కోణం – ఒక కొత్త కోణమ్ – తన వ్యక్తిత్వం లోంచి – తనలోంచి
ఊపిరి పోసుకుంటున్న సంధి సమయంలో అశాంతిగా సతమతమవుతుంది ప్రస్తుతం.
—-
వీధిలైటు వాలుగా వారండాలో పడుతోంది.
వారండాలో చాపవేసుకుని పడుకున్న గోపమ్మ కడుపులో పిచ్చుకపిల్లలా ఒదిగిన ఆ అమ్మాయి – ఆమె చుట్టూ గోపమ్మ చేయి -. గోపమ్మ – భర్త చనిపోతే ధైర్యంగా నిలబడి, కూలి పనిచేసి – చదివించింది కొడుకుని. ఆ కొడుకు, రౌడీల సహవాసంలో శాడిస్టుగా తయారయి, తొలిసారి తల్లిమీద చెయ్యి చేసుకున్నరోజు- తాగిన మత్తులో ఒళ్ళెరుగక తల్లి ప్రాణం తీసి, తన ఉద్యోగం కోసమే దాచిన డబ్బు దొంగిలించాలన్న ప్రయత్నంలో తనే చనిపోయిన రోజు గోపమ్మ కూడా చనిపోయింది. శరీరమే మిగిలింది.
“నాకెందుకమ్మా ఈ వెధవ బతుకు – ఆయన పోయె – వాడు పోయె – యింకేం చూసుకుని బతకాలమ్మా” అని ఏడుస్తున్న గోపమ్మ- సబ్ ఇనస్పెక్టరు మాటతో మనిషయింది.
“లేదు గోపమ్మా.. నువు పుట్టింది వాళ్ళకోసం కాదు. మగబిడ్డే తలకొరివి పెట్టాలన్న సంప్రదాయాన్ని – బతికుండగానే తలకొరివి పెట్టే ఈనాటి మగపిల్లలు నిలపరని నువ్వు చెప్పాలి”.
గోపమ్మ నోటంట విన్న ఇదంతా మనసులో మెదిలింది మాలతికి.
“నిజమేనేమో – మగబిడ్డ అన్న ఉబలాటం – వచ్చే లాభాలు అంతే తప్ప – అతని ప్రవర్తనా వ్యక్తిత్వమూ – మనిషిగా మనుగడ ఇవ్వేమి ముఖ్యం కాదా కన్నవాళ్ళకు – కావాలనుకునే వాళ్ళకు.
ఒక మూర్తి – ఒక గోపమ్మ కొడుకు – ఒక తండ్రి – ఒక నిరంజన్ – యింకా చిన్నప్పుడు రాసుకు తిరిగి ఏడిపించే స్నేహితులు, ఏం చేస్తుందిలే అని ధీమాగా చిన్నచిన్న సరదాలు తీర్చుకునే అన్నవరస మగవారు – ఎందరో – పేపర్లలో – వార్తలలో మరెందరో. చెప్పలేక, ఏమి చేయలేక నిస్సహాయతలో, సిగ్గుతో వేదనతో వారిని, వారిని కన్నతల్లులని ఎంతగా శపించుకుంటున్నారో. వారి శాపాలు, వారి కన్నీళ్ళు ఎవరికి తగలవు. ఎవరికి తెలియవు. కన్నపాపానికి వారికి తల్లులయిన వారే ఆడపిల్లల కన్నీళ్ళకు, వారి ఆవేదనకు జవాబుకర్తలు.
అంతేనా – నిజమేనా- .
తల్లి కూడా స్త్రీ యే అయినా, ఆడపిల్ల పుడితే తను పడ్డ బాధలే తలుచుకుంటుంది కాని మగబిడ్డయితే తనలాగ ఇంకెందరో అనుకోదు. మగబిడ్డకు వచ్చే కట్నకానుకలు – వచ్చే ఉద్యోగ దర్జాలకు – వారి ప్రవర్తనతో వచ్చే అవేదన,
వారి ప్రవర్తనతో హింసింపబడే వారి మూగవేదన, మానసిక క్షోభ ఎంతవరకు సమతుల్యం -ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా, ఎన్ని నీతులు నేర్పినా , మగవాడ్నన్న ధీమా దేనినైనా త్రోసిరాజనదన్న పూచీ ఏ దేవుడూ ఇవ్వలేడు.
ఆడపిల్ల – ఎదిగినా, ఒదిగినా – తనవరకే.
మగవాడు – అన్నివైపులా పారదర్శకంలా తన ప్రభావాన్ని చూపిస్తునే ఉంటాడు.
నూరింట ఒక వంతు ఛాయిసా , నూటికి తొంభైతొమ్మిది ఛాయిసా – ఏది తల్లులు ఎంచుకోవలసింది.
ఆ రాత్రి మాలతికి నిద్రపట్టలేదు.
* * *
మరునాడు ఉదయమే పదిన్నరకు డాక్టరు పద్మిని చాంబరులో అడుగు పెట్టింది మాలతి.
“ఏమండీ – అప్పుడే వచ్చేరు – ఏమైనా ప్రొబ్లెమా- టాబ్లెట్సు తీసుకున్నారా”
ప్రశాంతంగా అడుగుతున్న డాక్టరును వారించింది.
“అదేమి కాదు లెండి. నేను వచ్చింది వేరే పనికి – దయచేసి అబార్షన్ కి ఏర్పాటు చేస్తారా -”
“అదేమిటండి – మగబిడ్డ కావాలని మీవారు అడిగారటగా మరి”
“ఇట్స్ ఒకె – డాక్టరు గారు- నా అనుభవసారంతో మనిషిగా ముఖ్యంగా స్త్రీగా నా బాధ్యతగా ఈ అబార్షన్ కి సిధ్ధపడుతున్నాను. అభ్యంతరపెట్టకండి ప్లీజ్”
మాలతి ప్రాధేయతకి, ఆమె స్వరంలో స్ధిరత్వానికి డాక్టరు పద్మిని మాట్లడలేకపోయింది.
“మరి మీ వారు”.. డాక్టరు మాట పూర్తి కాకుండానే అ న్నది మాలతి
“పోనివ్వండి డాక్టరు గారూ – స్త్రీగా, భార్యగా చూడలేని మనిషి – అతను లేకుంటే నాకు జన్మ ఏమీ వ్యర్ధం కాదు – కాని నా పాప ఎక్కడున్నా తిరిగి చూడగలిగితే వీలైతే నా దగ్గరకు తెచ్చుకుంటే అప్పుడు నా జన్మ సార్ధకం”
మాలతి హృదయంలో మమతకు డాక్టరు మనసు ఆర్ద్రమయింది.
“ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రువులు చిందిస్తూ రాస్తున్నా ఈనాడే మీకోసం మరో మహా భారతం”
వరండాలో ఆయా పెట్టుకున్న చిన్న ట్రాన్సిస్టర్ లో పాట వస్తోంది నెమ్మదిగా..

*************

2 thoughts on “వేదన బరువై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *