May 4, 2024

GAUSIPS – ఎగిసేకెరటం-5

రచన:-శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి

[జరిగిన కధ: సింథియా క్రొత్త క్రొత్త డ్యూటీలను తన కైవసం చేసుకుంటున్నది. మొన్నటిదాకా ఏవో చేసుకుంటూ ఛటర్జీకి ఒక పర్సనల్ సెక్రటరీలాగ కూర్చొనేది, తాను అమెరికాలో సెటిల్ ఆయ్యే టైం దగ్గరపడుతుంటే … క్రొత్త క్రొత్త పధకాలతో ఆ ల్యాబ్ స్వతంత్రాన్ని ఒక్కొక్కటి గా కైవసం చేసుకుంటున్నది. బిశ్వాకి ఆందోళనని కలిగిస్తున్నది]

సింథియా, ఛటర్జీలమీద వీసమెత్తు అనుమానం కూడా లేని బిశ్వా సింథియా, ఛటర్జీల కేలక్యులేషన్స్ ఏ మాత్రం అర్ధం చేసుకోలేడు. కానీ సింథియా యొక్క వింత చర్యలు అతన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోనీ ఎవరితోనైనా దీని గురించి చర్చిద్దామన్నా అమాంతం వెళ్ళి ఎవరితో చర్చిస్తాడు? పైగా ఈ మధ్యనే సూరజ్ ని కూడా నమ్మలేకపోతున్నాడు. మరుసటిరోజు ల్యాబ్ కి వెళ్ళాక చూస్తే పూనం, పాత్రో కనబడలేదు కానీ రంజిత్ మాత్రం ముందురోజు తాను చూపించిన ప్లేస్ లోనే కూర్చున్నాడు, ఏవో పుస్తకాలు రిఫర్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరు మాత్రం కనబడకపోయేసరికి ఇంకా రాలేదనుకొని సర్ది చెప్పుకున్నాడు బిశ్వా, తను వర్క్ చేసుకునే ప్లేస్ కి వెళ్ళిపోయాడు. రెండు మూడు గంటల తరువాత ఛటర్జీ బిశ్వాని తన రూంకి పిలిచాడు. బిశ్వా వెళ్ళాడు. ఛటర్జీ వాళ్ళ ముగ్గురికీ ఏం చెప్పాడు, ఏం సంగతన్నది అడిగి పంపించేశాడు. అతను అలా అడిగేటప్పుడు బిశ్వా సమాధానాలు చెప్తున్నాడే గానీ, అతనిలో మునుపటి సంతోషం లోపించింది. అది ఛటర్జీ గమనించకపోలేదు. అయినా సరే ఏమీ పట్టనట్లు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి వెంటనే బిశ్వా మరోమాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఇది మరింత బాధ కలిగించింది బిశ్వాకి. ఎందుకంటే ఛటర్జీ బిశ్వాతో ఒక స్నేహితుడిలా సన్నిహితం గా ఉండకపోయినా కనీసం ఒక కొలీగ్ ని ట్రీట్ చేసినట్లు ట్రీట్ చేశేవాడు.
కానీ ఆ రోజునుండి మాత్రం ఛటర్జీలో మార్పు వచ్చేసింది. ఆ మార్పును బిశ్వా గమనించకపోనూ లేదు. ఛటర్జీ మనసులో పశ్చాత్తాపమేమీ లేదు గానీ, సింథియా నొచ్చుకున్నందుకు బిశ్వాని తానారోజున అనిమాటలన్నాడని, వాటిని అక్కడితోనే వదిలేయకుండా …అతను అదే తలచుకుంటూ ఉన్నట్లుగా అనిపించి బిశ్వాని దూరంగా నెట్టేస్తున్నాడు. బిశ్వాకేంటీ … ఒక కొలీగ్ గా ట్రీట్ చేసే మనిషి తనని తక్కువ చేస్తున్నాడని, పైగా తనమీద డేమేజ్డ్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నాడని, అలా చేసినందుకు తానేమాత్రం పశ్చత్తాప పడలేదని. ఇలా బిశ్వా మనసులో నలిగితం అయిపోతున్నాడు. సూరజ్ ఎందుకో బిశ్వా మనసులో దేనికో బాధపడుతున్నాడని మాత్రం అర్ధం చేసుకున్నాడు. ఛటర్జీ ఏమన్నా అన్నాడేమో … అని అనుకున్నాడు, అయినా బిశ్వాని అనడమా? కాకపోయుండొచ్చు, అంటే గింటే మమ్మల్ని అంటాడు గానీ బిశ్వాని అనడే? ఏమయిందబ్బా ??? అని ఆలోచిస్తున్నాడు. ఇలా ఎవరి ఆలోచనలలో వారు అలా సాగిపోతున్నారు. ఈ లోపుల రోజులో సగమయిపోయింది. బిశ్వా తన పనేదో చేసి సూరజ్ తో కలిసి లంచ్ కి వెళ్ళాడు. అక్కడ పూనం, పాత్రో సింథియాతో కలిసి నవ్వుతూ, జోకులేస్తూ క్యాంటీన్ లో కూర్చొని ఉన్నారు. బిశ్వాని చూసి ఒకసారి హాయ్ అని చెప్పి, మళ్ళీ వాళ్ళ మాటల్లో మునిగిపోయారు. బిశ్వాకి చాలా ఆశ్చర్యం వేసింది. సింథియాతో వీళ్ళకంత పరిచయమేమిటి అని ???? అదే మొదటిసారి చూడడం. సూరజ్ అడపా దడపా చూసేవాడు వాళ్ళని ఇంతకు ముందునుండి. అలా లంచ్ అయ్యాక బిశ్వానే వాళ్ళ ముగ్గురి దగ్గిరకీ వెళ్ళి పలకరించాడు, సూరజ్ కూడా తనతోనే ఉన్నాడు.
హాయ్ … పూనం అండ్ పాత్రో ఏంటివాళ రాలేదా? రంజిత్ ఒక్కడే ఉన్నాడు ?
వాళ్ళతోనే సింథియా ఉండడం వల్ల ఆమెని కూడా ఒకసారి హాయ్ అని పలకరించాడు.
అప్పుడు పాత్రో చెప్పాడు, మేమిద్దరం ఎల్లుండినుండి వస్తాం.
మరి ఆ విషయమేదో నాకు చెప్పాలి కదా ??? అన్నాడు బిశ్వా.
మేము ఆల్రెడీ ఛటర్జీ సార్ కి, సింథియా మేడంకి ఈ-మెయిల్ ఇచ్చాం అని అన్నారు. దానితో బిశ్వాకి ఇక నీతో పని ఏమిటి అని అన్నట్లుగా అనిపించింది.
అక్కడినుండి వెళ్ళిపోయారు బిశ్వా అండ్ సూరజ్. మళ్ళీ తన పనిలో తాను మునిగిపోయాడు. సాయంత్రం ఆరింటికి ఛటర్జీ తన రూం నుండి వెళ్ళిపోతూ బిశ్వాని వర్క్ చేస్తుండగా చూశాడు. అప్పుడు బిశ్వానే ఛటర్జీ ని ఆపి చెప్పాడు. “ప్రొద్దున నాకు పూనం, పాత్రో క్యాంటీన్ లో లంచ్ చేస్తూ కనిపించారనీ, వాళ్ళతో జరిగిన సంభాషణ ని చెపుతూ … తనకి కూడా ఒక కాపీ ఈ-మెయిల్ చేసుంటే నేను అడగకపోయేవాడిని అన్నాడు. వాళ్లిద్దరూ సింపుల్ గా మీకు, సింథియా మేడం కి ఈ-మెయిల యిచ్చాం! అని అనేసారు”.
సింథియా పేరు వినబడగానే వెంటనే తాను తన విశ్వాసాన్ని చాటుకోవాలన్నట్లుగా అవసరం లేకపోయినా పరాయి మనిషిని చూడగానే మొరిగే విశ్వాసం గల కుక్కలా మారిపోయి “యస్ .. అందుకే నేను నీకు మొదటినుండీ చెబుతూనే ఉన్నాను, ల్యాబ్ లో అందరితో కలిసిఉండాలని, యు షుడ్ లెర్న్ గెట్ ఎలాంగ్ విథ్ పీపుల్”.
మళ్ళీ అదేమాట… మళ్ళీ అదేమాట… కృంగిపోయాడు బిశ్వా. ఏమాత్రం కూడా క్రొత్తవాళ్ళెందుకలా ప్రవర్తిస్తున్నారని గానీ, వాళ్ళు తనకి రిపోర్ట్ చెయ్యాలని గాని ఏమీ అనకుండా, తను చెప్పే వాటికి దేనికీ రియాక్ట్ కాకుండా … కేవలం “సింథియా” అన్న పదానికి మాత్రమే రియాక్ట్ అవుతున్నాడు ఛటర్జీ, పైగా నన్ను ల్యాబ్ లో సరిగ్గా ఉండడం లేదంటున్నాడు.
ఇది సూరజ్ గమనించాడు, అతనికి కధ అర్ధమయ్యింది. కానీ బిశ్వాకే అర్ధం కాలేదు, ఎందుకంటే ముందునుండే బిశ్వా దగ్గిర గేం ఆడాడు ఛటర్జీ. అతని తెలివితేటలకోసం, అతని సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ మీద ఆధారపడ్డాడు. అయినా ఇప్పటికీ బిశ్వానుండి ప్రాబ్లం ఏమీలేదు. కాకపోతే … ఇప్పుడు ఛటర్జీ కి కావలసినది ఏమిటంటే తన సింథియాని కూడా బిశ్వా అకామడేట్ చేసుకోవాలి, అందుకే ఒకటే పాట … పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని పాడుతున్నాడు.

బిశ్వాకి సైన్స్ ని చదివి చదివి బ్రెయిన్ కురచయిపోయింది, అతనికి ఇతర విషయాలు లోనికి వెళ్ళటంలేదు. ఇప్పుడు క్రొత్తవాళ్ళు సింథియా చుట్టూ తిరుగుతున్నారు, ఛటర్జీ సింథియా చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి బిశ్వా కూడా తిరగాలి. ఏమని తిరగాలి ??? అది అనవసరం ఛటర్జీ కీ. సింథియా సంతృప్తి పడేంతవరకు … తనకు మొరగక తప్పదు బిశ్వా మీద.
ఇది అర్ధం చేసుకోలేని బిశ్వా … ఎంతసేపూ తనలో ఏదయినా లోపముందా … ఎందుకు పరిస్థితులు తన చెయ్యి దాటిపోతున్నాయని బాధపడుతున్నాడు. ఛటర్జీకి అర్ధమవుతోంది బిశ్వా బాధ, ఆలోచనలు. అయినా సరే మొండిగా అతన్ని మాటలంటున్నాడు, మరో క్రొత్త విషయాన్ని కూడా అలవాటు చేసుకోమని. ఛటర్జీ ఆలోచనే గనుక బిశ్వాకి అర్ధమయితే ఏం చేసుండాలి? అలాగే పొద్దున్నే వచ్చి సింథియాతో అచ్చకాయ పుచ్చకాయ మాట్లాడుతూ, పూనం, పాత్రో లాగ టైం వేస్ట్ చేస్తూ కాలక్షేపం చెయ్యాలి. కాసేపు మాట్లాడి కాలక్షేపం చేసి వెళ్ళిపోతే సింథియాకి తెల్లారుతుంది గానీ, బిశ్వాకి ఎక్కడ తెల్లారుతుంది? అతను పని చేసి చూపించాలి కదా ?????
ఎంతటి దయనీయం? అంత వయసొచ్చాక, జీవితంలో తమక్కావలసింది ఎంతో కష్టపడి సంపాదించుకున్నాక … ఆ తర్వాత బ్రెయిన్ పదును పోతుందేమో … అవసరమయినవి, అనవసరమయినవి అనే విచక్షణ మానవుడు కోల్పోతాడేమో! ఛటర్జీకి ఇది చాలా చిన్న విషయం కావొచ్చు, అది బిశ్వా మీద గాఢమయిన ఎప్ఫెక్ట్ చూపిస్తున్నది, అంతేకాదు … అప్పటివరకూ ఉన్న ల్యాబ్ క్రమశిక్షణని తప్పుతున్నది. అది అర్ధం కావడంలేదు ఛటర్జీకి. అదుపుతప్పి నడుస్తున్న ల్యాబ్ ని సింథియానే ఒక త్రాటి మీద నడిపిస్తున్నదన్న ఒక వెర్రి భావనతో, అసలు ఆమె ప్రవేశం వల్ల … ఆ స్టూడెంట్ల ప్రోగ్రెస్, ఆరు రోజులు దెబ్బతిన్నదనీ, బిశ్వా వర్క్ వారం రోజుల్నుండీ ఎదురుచూపులతోనే దెబ్బతిన్నదని… అర్ధం కావడంలేదు.
ఈ లోపుల వీక్లీ ల్యాబ్ మీటింగ్ వచ్చింది. ఆ వీక్ లో చేసిన వర్క్ అంతా చూపించాలి లేదా చెప్పాలి. సూరజ్ చెప్పాడు. బిశ్వాకి ఆ వారం ప్రోగ్రెస్ పెద్దగా లేదు. ఎప్పుడూ లేనిది సింథియాకూడా ల్యాబ్ మీటింగ్ కి వచ్చి కూర్చున్నది. అంటే ఆమె కూడా ల్యాబ్ వర్క్ లో ఒక పార్ట్ అయిపోయిందన్నమాట. బిశ్వా తన టర్న్ రాగానే తన వర్క్ గురించి మాట్లాడి ఏవో ఎక్స్ పెరిమెంట్లు చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత స్టూడెంట్స్ ప్రోగ్రెస్ గురించి అడిగాడు బిశ్వాని. బిశ్వా చాలా ఆశ్చర్యపోయాడు. “ఇదేంటి? నన్నడుగుతాడు? వాళ్ళు రావటం లేదనీ, మూడు రోజుల తర్వాత వస్తామని అతనికే ఈ-మెయిల్ ఇచ్చారు కదా? మళ్ళీ ప్రొగ్రెస్ ఏమిటీ అని నన్ను అడుగుతాడేమిటి?”.
బిశ్వా ఆశ్చర్యంతో … యు న్యూ థట్ థే ఆర్ నాట్ కమింగ్ యాస్ థే సెడ్ థే గేవ్ ఈ-మెయిల్ టు యు. వాట్ ప్రొగ్రెస్ థే విల్ హేవ్, వెన్ థే డిడ్ నాట్ స్టార్ట్ ఎనీ వర్క్ ???
వెంటనే … ఛటర్జీ “యు షుడ్ నొ వెన్ థే కం, వెన్ థే గొ. నోబడీ ఈస్ ఎ సెక్రటరీ ఫర్ యూ టు కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ థింగ్స్”… అన్నాడు.

బిశ్వా షాక్ తిన్నాడు. ఆ ల్యాబ్ మొత్తం మీద ఆ ఛటర్జీ కి మాత్రమే అడ్మిన్ పన్లు చూడడానికి సెక్రటరీలు, హాస్పిటల్ పన్లు చూడడానికి సెక్రటరీలు, పర్సనల్ ప్లస్ ఏదో ఆఫీస్ పన్లంటూ చూడడానికి సెక్రటరీ సింథియా ఉన్నారు. అటువంటప్పుడు ఇంకెవరయినాగానీ సెక్రటరీని కావాలని ఎలా అనుకుంటారు? ఇలా రోజుకొక క్రొత్త మాట చెప్పి బిశ్వాని బాధపెడుతున్నాడు ఛటర్జీ. సింథియా మొహంలో ఒక తేజస్సు. ఈ లోపుల ఛటర్జీ … గొంతులో మార్ధవాన్ని కలుపుతూ … “సింథియా, వాట్స్ న్యూ విత్ యు?” అన్నాడు.
సింథియా అంతే మార్ధవంగా … ఆ వీక్ లో తాను చేసిన ఒకటి రెండు ఏవో పన్లు చెప్పి, ఆ తర్వాత నుండి … ఆ స్టూడెంట్స్ ని బిశ్వా దగ్గిరకి తెసుకు వెళ్ళినప్పటినుండీ, బిశ్వా ఏమేమి వాళ్ళకి ఎక్స్ ప్లెయిన్ చేశాడు, తాను ఏమి విన్నది? బిశ్వా వాళ్ళకి ఏ ఏ ప్లేస్ లు వర్క్ చెయ్యడానికి అసైన్ చేశాడన్నది మొత్తం చెప్పింది ఆశ్చర్యపోయాడు బిశ్వా. “అంటే ఆమె నా మీద నియమింప బడిందన్నమాట. ల్యాబ్ మీటింగ్ లో అందరూ సైన్స్ మాట్లాడితే, ఈవిడమాత్రం ఇక నుండి నా గురించి మాత్రమే మాట్లాడడానికి వస్తాదన్నమాట. పైగా ఇవన్నీ ఆల్ రెడీ తాను ఛటర్జీకి రిపోర్ట్ చేసినవే. మరి తనకేమీ తెలియనట్లు, మొదటి సారిగా ఆమె నోటినుండి వింటున్నట్లుగా వింటున్నాడేమిటి? ఏమిటీ ఈ నాటకం?
ఇది చాలా అసహ్యంగా ఉంది” అని మొదటిసారిగా అర్ధం చేసుకున్నాడు బిశ్వా. అంతే కాదు … ఆవిడ చివరిమాటగా బిశ్వా అసైన్ చేసిన ప్లేసులు వాళ్ళకి సరిగ్గా సూట్ కావని … వీలయితే వాళ్ళకి ఫలానా ప్లేస్ లు ఇవ్వమని రికమెండ్ చేసింది. “ఎందుకూ” అని ఛటర్జీ అనగానే ఆ యా ప్లేసెస్ లోకి తాను ఆర్డర్ చెయ్యబోయే ల్యాబ్ స్టఫ్ అక్కడికి వస్తాయని చెప్పింది. వెంటనే ఛటర్జీ ఎంతో సంతృప్తికరంగా నవ్వుకొని సింథియా ఎంతో గొప్పగా ప్లాన్ చేసిందని చెప్పుతూ, బిశ్వా కేసి తిరిగి … “యు ఫాలో థ తింగ్స్ గోఇంగ్ ఆన్ ఇన్ థ ల్యాబ్, థెన్ యు విల్ నాట్ హేవ్ ఎనీ డౌట్స్” అన్నాడు.
బిశ్వాకి అసహ్యం వేసింది. అప్పుడర్ధమయ్యింది ఛటర్జీ యొక్క మరో రూపం. సింథియాకి ఏదో కావాలి, దాన్ని ఆమెకు అప్పజెప్తున్నాడు. ఆ నేపధ్యంలో తనని ఆ సింథియా ముందు కించపరుస్తున్నాడు.
కానీ తననుండి, తనద్వారా సింథియాకి ఏమి కావాలన్నది అతనికి ఇంకా అర్ధంకాలేదు.
రానూ, రానూ సింథియా పధకాలకు ఛటర్జీ చేతులు కలుపుతున్నాడు ఎందుకంటే సింథియా సెట్టిల్మెంట్, సుఖ సంతోషాలు అతనికి చాలా అవసరం. ఆ నేపధ్యంలో బిశ్వానే కాదు, ఎవరు ఎలాపోయినా ఫర్వాలేదు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *