May 3, 2024

శుభోదయం -8

రచన: డి.కామేశ్వరి

శారద జీవితం నాశనం కాకుండా ఏం చెయ్యాలా ఆని రాత్రంతా ఆలోచించింది రాధ. కాని అప్పటికే శారద నిండా మునిగిందని గుర్తించలేకపోయింది.
ఆ మర్నాడే పార్వతమ్మ గుండెలు బాదుకుంటూ “రాధమ్మా.. చూశావమ్మా మీ ఆయన ఎంత ఘోరం చేశాడో.. మా పిచ్చిమొద్దు శారదని..” ఆవిడ యింక చెప్పలేనట్టు కింద కూలబడింది.
రాధ నిర్వీణురాలై చూసింది. పార్వతమ్మగారికి ఈ విషయం తెల్సిపోయిందన్నమాట. శారద చెప్పిందా! ఎలా తెలిసింది.. ఇప్పుడావిడకి ఏమని చెప్పడం.. రాధ మొహం పాలిపోయింది.”ఏం జరిగింది పిన్నిగారు..” అని మాత్రం అనగల్గింది,
“ఇంకా ఏం జరగడమేమిటమ్మా తల్లీ.. నిలువునా నా కొంప ముంచాడమ్మా మీ ఆయన. ఏదో బుద్ధిమంతుడను కున్నాను. చెల్లెలులా చూసుకుంటున్నాడనుకున్నాను. మన వెనకే ఇంత చేస్తాడనుకోలేదమ్మా.. ఇప్పుడు నాకేం దారి రాధమ్మా. దాన్నేం చెయ్యను. నాకు కాళ్ళు చేతులు ఆడ్డం లేదు..” ఆవిడ ఏడవసాగింది.
రాధ బిత్తరపోయింది. ఆవిడ మాటలకి అర్ధం తెలియగానే ఒక్కక్షణం గుండె ఆగినట్లయింది. “పిన్నిగారు సరిగ్గా చెప్పండి.. ఎవరు చెప్పారు మీకు.. ఏం జరిగిందో..”
“ఇంకేం చెప్పాలే అమ్మా.. శారద నెల తప్పిందే అమ్మా. నేనో పిచ్చిముండని. నీ పురుడు హడావిడిలో అదీ నెల బయటుండలేదనే గుర్తించలేదే పిచ్చి మొహాన్ని. వారం రోజులనించి శారద తిండి సయించడం లేదు అంటూ లేచిపోతుంది.మొన్న,నిన్న వాంతులయ్యాయి. పైత్యం చేసిందనుకున్నాను. ఇవాళ మళ్ళీ అయ్యాయి. ఎప్పుడూ పక్కమీదపడి నిద్రపోతూంది. దాని వాలకం చూసి చటుక్కున అనుమానం వచ్చిందే అమ్మాయి. శారదని అడిగానే..”
“శారద ఏమంది?” ఆరాటంగా అడిగింది రాధ.
“దానికంత తెలివి వుంటే దాని బతుకు ఎందుకలా తగలడుతుంది. బయటున్నావే అంటే నవ్వుతుందే, తిండి తినవేమే అంటె వికారం అంటుందే, రెండు గట్టిగా తగలనిచ్చి ఏం చేశావే పాడుమొహమా .. ఏం జరిగిందే అంటూ తలమొత్తుకుంటుంటే”
“నన్నడుగుతావేం మాధవ్‌గారి నడుగు” అందే అది”ఆవిడ తలపట్టుకుని చెప్పింది.”రాధమ్మా.. నీ యింట్లో పిల్లలా తిరిగింది. ఆ అబ్బాయి యింత పని చేస్తాడనుకోలేదమ్మా. అభశుభం తెలియని యీ పిల్లని లొంగదీసుకున్నాడు. యింట్లో వుండి నీ కళ్ళు మూసుకుపోయాయి. యింటిపక్కనుండి నా కళ్ళకీ గంతలు కట్టాడమ్మా..”
రాధ దిమ్మెరపోయినట్లుండిపోయింది. శారద నెలతప్పింది. మాధవ్ ఆమె బిడ్డకు తండ్రి. యిప్పుడేం చెయ్యాలి తను.. శారద గతేం అవుతుంది? మాధవ్ ఏం అంటాడు! తీసికెళ్ళి అబార్షన్ చేయించి చేతులు దులుపుకుంటాడా? ఒక్కక్షణంలో ఆమె మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.
పార్వతమ్మ ఏడుస్తూ ముక్కు చీదింది.”రాధమ్మా.. యివి చేతులు కావు. కాళ్లనుకో. నలుగురికి తెలిసేముందే ఏదో చేసి పుణ్యం కట్టుకో. దిక్కుమొక్కు లేనిదాన్ని నేనేం చేస్తాను? అసలే దానికి పెళ్ళికాలేదని బెంగెట్టుకు చస్తూ గుండెలమీద కుంపటిని భరిస్తున్నాను. యిదిలా నా గుండెలోనే మంట పెడుతుందనుకోలేదమ్మా. అయినా నాది బుద్ధి పొరపాటు. యీడొచ్చినపిల్లని అలా వదిలాను” ఆవిడ నెత్తిమొత్తుకుంది.
అప్పటికే రాధ తేరుకుంది. చటుక్కున ఆవిడ పక్కన కూర్చుని “పిన్నిగారూ మీరూరుకోండి. మాధవ్ రాగానే విషయం కనుక్కుంటాను. ఎందుకిలా చేశాడో అడుగుతాను. ఏం చెప్తాడో విందాం. వుండండి. ముందు నన్ను శారదతో మాట్లాడనీయండి.
గంటసేపు శారదతో మంచి మాటలాడి, లాలించి, బుజ్జగిస్తూ ఒక్కో విషయం ఏం తెలీనట్టు లాగింది. అంతా విని..”శారదా.. నీవు నీకు తెలియకుండా యిలాంటి పని చెయ్యచ్చా? మాధవ్ అలా నిన్ను అడిగినప్పుడు నాకెందుకు చెప్పలేదు. అక్కయ్యా అంటూ స్వంత చెల్లెలిలా తిరిగావు. నానించి ఇదంతా దాస్తావా?” అంది రాధ బాధగా.
“బావగారు నీకు ఏమీ చెప్పద్దన్నారక్కయ్యా! వట్టు వేయించుకున్నారు.” అంది అమాయకంగా..
ఇంత జరిగినా తనకు జరిగిన అన్యాయం తెలుసుకోలేని అమాయకస్థితిలో వున్న శారదని చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో అర్ధం కాలేదు రాధకి.
“శారదా! ఏడు ఎనిమిది నెలలనించి నా కళ్ళు కప్పి ఎంతపని చేశావు. శారదా యిది తప్పని, దీనివల్ల నష్టపోయేది నువ్వని తెలియదా శారదా! పుస్తకాలు చదువుతున్నావు. సినిమాలు చూస్తున్నావు. ఇలా కాలుజారిన ఆడపిల్లల గతి ఏమవుతుందో అర్ధం కాలేదా?” అంది.
యిప్పుడిప్పుడే శారదకి మాధవ్ ఎవరికీ చెప్పవద్దనడం, తన వికారం వాంతులు చూసి తల్లి తిట్టి ఏడవడం, రాధ మందలించి బాధపడడం అన్నీ చూశాక తను తప్పుపని చేసిందని అర్ధం అయింది. బేలగా చూస్తూ “అక్కయ్యా! నా మీద కోపం వచ్చిందా నీకు చెప్పలేదని” అంది అమాయకంగా.
“శారదా నీకెలా చెప్పను.. యిప్పటికన్నా నీకు అర్ధం కాలేదా? శారదా నీకు పాప పుడుతుంది తెలుసా? పెళ్ళికాకుండా పాపని కనకూడదమ్మా. నీకు పెళ్ళి కాలేదు. నీ భర్త ఎవరని చెప్తావు? నీ పాపకి తండ్రి ఎవరు అని అందరూ అడిగితే? ఈ దేశంలో పెళ్ళికాని తల్లిని లోకులు కాకులు పొడిచినట్టు పొడుస్తారమ్మా!”
“మాధవ్ అని చెప్తాను” శారద చటుక్కున అంది.
రాధ విషాదంగా నవ్వింది. “అలా చెప్పలేవమ్మా! చెపితే నిన్నే అందరూ తిడ్తారు. మాధవ్ నా భర్త, నీకు భర్త కాడు. సాధ్యమైనంత విపులంగా శారదకి తను చేసిన పనివల్ల జరిగిన అనర్ధం చెప్పింది అరగంట కూర్చుని.
అంతా విన్నాక శారద మొహంలో భయం పొడచూపింది. “మరి యిప్పుడెలా అక్కయ్యా.. పోనీ మాధవ్‌ని పెళ్ళాడమనేయ్” అంది.
ఆమె అమాయకంగా అన్న మాటలే తన కర్తవ్యం అని తట్టింది రధకి. శారదకి జరిగిన అన్యాయం సరిదిద్దాలంటే అదొకటే మార్గం. లేకపోతే అబార్షన్ చేయించి చేతులు కడుక్కోవాలా? ఆ తర్వాత ఇక శారద గతేమిటి? ఆమెని వాడుకుని వదిలేసేటంత నీచానికి దిగజారాడా మాధవ్. అంతకంటే ఏం చెయ్యాలి? శారదన్నట్టు మాధవ్‌ని పెళ్లాడమంటే.. మాధవ్ తన భర్త. శారదను ఎలా చేసుకుంటాడు తనుండగా? హుం! మా యిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఏం మిగిలింది? లోకంకోసం కల్సి కాపురం చేస్తూ నటించేకంటే శారదకి న్యాయం చేకూర్చటం న్యాయం కాదా.. ఆలోచనలతో మాధవ్ వచ్చేవరకు సతమతమయింది రాధ. మాధవ్‌తో మాట్లాడి ఏదో చెప్తానని పార్వతమ్మకి చెప్పింది.

****************

రాత్రి పదిగంటలకి యిల్లు చేరాడు మాధవ్. రాధని తప్పించుకోవడానికని తిన్నగా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోబోయాడు. రాధ చటుక్కున గదిలోకి వచ్చింది. “మీతో మాట్లాడాలి” అంది సూటిగా.
మాధవ్ మొహం చిట్లించి “మనమధ్య యింకా ఏం మాటలున్నాయి” అన్నాడు.
“మన మధ్య లేవు. శారదకి మీకు మధ్య వున్నాయి. శారద నెల తప్పింది. యిప్పుడామెను ఏం చెయ్యదలిచారు. ఆ అమాయకురాలి తరఫున నేనడుగుతున్నాను. జవాబు చెప్పండి.” తీవ్రంగా అంది.
మాధవ్ ఒక్కక్షణం తెల్లబోయాడు. అతని కళ్లలో బెదురు స్పష్టంగా కనిపించింది అతని మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. “అబద్ధం. నన్ను.. నా మీద కోపంతో యిది పుట్టించావు నీవు. నన్ను అందరిలో అల్లరిపెట్టి నీకోపం తీర్చుకోవాలని….”
రాధ తిరస్కారంగా చూసింది. “అబద్ధం అయితే పార్వతమ్మగారినే పంపిస్తాను మాట్లాడటానికి” అంది.
ఆ మాట విని మాధవ్ “ఆవిడకెలా తెలిసింది? నీవు చెప్పావు అవునా?” అన్నాడు తీక్షణంగా.
“హు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుంది. ఎంతకాలం ఇలాంటి విషయాలు దాగుతాయి. శారద నెల తప్పింది. చేసిందానికి కాక చేయవల్సింది ఆలోచించండి.” గంభీరంగా అంది రాధ.
“ఎలా.. ఎలా అయింది? అసంభవం .. పిల్స్ యిచ్చాను.”
“అవును యిచ్చారు. అవి ఎందుకు వేసుకోవాలో మీరు చెప్పలేదు. తెలుసుకోగలిగే తెలివితేటలు ఆ అమ్మాయికి లేవు. కారణం చెప్పకుండా వేసుకోమంటే రెండు మూడు నెలలు వేసుకుని విసుగెత్తి మానేసిందా అమ్మాయి.”
“మైగాడ్.. వేసుకుంటున్నానని చెప్పిందే”
ఆ సిగ్గుచేటు విషయం అతని ముందు నిలబడి చర్చించడమే కంపరంగా వుంది రాధకి. ఇది కేవలం అతని ఒక్కడి విషయం అయితే తను పట్టించుకోకపోను. కాని శారద.. ఏం తెలియని అమాయకురాలు. చూస్తూ ఎలా వూరుకోగలదు. “జరిగిందాన్ని గురించి యింక విచారణ అనవసరం. జరగబోయేది ఏమిటని అడుగుతున్నాను” రాధ రెట్టించింది.
మాధవ్ జవాబుకి తడుముకున్నాడు.” ఏముంది, డాక్టరు దగ్గిరకు తీసుకెళ్ళు”
ఆమె హేళనగా నవ్వింది. “ఎంత సుళువుగా చెప్పారు. నా భర్త ఎవరికో కడుపు చేస్తే నేను తీసికెళ్ళి తీయించాలన్నమాట.”
“నీవు కాకపోతే వాళ్ళమ్మని తీసికెళ్లమను. చెల్లి, అక్కయ్య అనుకుంటారు కదా అందుకు అన్నాను” మొహం గంటుపెట్టుకుని అన్నాడు.
“గర్భం తీయించినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోతుందా? యింక ఆ అమ్మాయి గతి ఏమిటి? ఆ అమ్మాయిని అవసరానికి వాడుకుని అలా వదిళేస్తారా?
“అయితే ఏం చెయ్యమంటావు యింకా. డబ్బిస్తను డాక్టరు దగ్గిరకు తీసికెళ్ళండి అంటున్నాను. అంతకంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు?” అసహనంగా అన్నాడు.”ఎంత ఉదారూ?డబ్బన్నా యిస్తానంటున్నారు”వ్యంగ్యంగా అంది.
“రాధా! నీ వ్యంగ్యాలు, విసుర్లు కట్టిపెట్టు. ఇది నీకు సంబంధించని విషయం. ఆ సంగతి నేను చూసుకుంటాను వెళ్లవతలికి” రాధ హేళన భరించలేక కోపంగా అరిచాడు.
“నాకు సంబంధించని విషయ్మా యిది? నా భర్త విషయం నాకు సంబంధించనిదని నాకు తెలియదు. మీ విషయం నాకు సంబంధించకపోయినా, శారద నాతోటి స్త్రీ. నా తోబుట్టువులాంటిది. ఆమెకి అన్యాయం జరగడానికి వీల్లేదు.”నిష్కర్షగా అంది.
మాధవ్ కోపం మరోమెట్టు ఎక్కింది.”న్యాయం జరగాలంటే ఏం చెయ్యాలి” వ్యంగ్యంగా అన్నాడూ.
“ఆమెని మీరు పెళ్ళాడాలి. మీరు చేసిన తప్పుకి పరిహారం అది”
“ఏమిటి! శారదని పెళ్లాడాలా? ఆ పిచ్చిమొద్దుని పెళ్లాడాలా?” ఆశ్చర్యపోయినట్లన్నాడు.
రాధ ఏహ్యంగా అతనివంక చూసింది. “హు.. ఆ పిచ్చిమొద్దు దొంగచాటుగా సుఖం అందించటానికి పనికివచ్చింది గాని పెళ్లికి పనికిరాలేదా మిస్టర్ మాధవ్? శారదతో ఈ విధంగా ప్రవర్తించేముందే ఆలోచించవలసిన ఆలోచన అది. ఇప్పుడూ టూలేట్. ఇప్పూడు శారదని పెళ్ళి చేసుకోవాలి మీరు” కఠినంగా అంది.
“మతిపోయిందా నీకు? భార్య వుండగా మరో పెళ్ళి ఎలా చెల్లుతుందనుకుంటున్నావు?” వంక పెట్టాడు.
“భార్య! హు. నన్నింకా మీ భార్యగా చూస్తున్నారా? మనమధ్య ఆ బంధం ఏనాడో తెంపారు మీరు. లోకం కోసం కలిసి వుంటూ, మనల్ని మనం మోసం చేసుకుంటూ, లోకాన్ని మోసం చేసుకునే కంటే ఎవరి దారి వారు చూసుకోవడం మంచిది. ఇన్నాళ్ళుమీరు నన్నెంత దూరం చేసినా,నన్ను ఎంత చీదరించుకున్నా, నన్నూ నా పిల్లవాడిని ఎంత హీనంగా చూసినా మిమ్మల్ని ప్రేమించిన నేరానికి, వివాహబంధానికి కట్టుబడి మీ దగ్గిర వున్నాను. కాని యిప్పుడు నన్ను యింత మోసం చేసి నా వెనక ఇంత నాటకం ఆడిన మిమ్మల్ని క్షమించలేను. మీరీపని చేశారని తెల్సిన క్షణంలోనే మీ మీద వున్న కాస్త ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడింక మనమధ్య బంధానికింక అర్ధం లేదు. నేను ఎలాగూ నష్టపోయాను. శారదనికి అన్యాయం జరగడానికి వీలు లేదు. ఆమెకోసం నా స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నాను.” ఆమె స్థిరంగా అంది.
“నీవు నిర్ణయించుకున్నా ఆ స్థానంలోకి ఆ పిచ్చిదాన్ని ఆహ్వానించలేను. నీవి వెడితే నాకింక పెళ్ళేకాదనా దాన్ని పెళ్లాడాలి? అసంభవం”
“మాధవ్! నీవిలా మాట్లాడడానికి సిగ్గుపడాలి. అమాయకురాలిని మోసం చేసి వలలో వేసుకుని పాడుచేసి యిప్పుడు పెళ్లనగానే నీకు సరిపోలేదనడం అమానుషం.. శారదని నీవు పెళ్ళిచేసుకోకపోతే…”
“ఏం చేస్తావు?” ఆమె కంఠంలో బెదిరింపు మాధవ్‌క్8ఇ అవమానంగా అంపించి సవాల్ చేశాడు.
“డైవోర్స్‌కి కోర్టుకి ఎక్కుతాను” అంది నిశ్చలంగా అతని కళ్ళలోకి చూసింది.
మాధవ్ అదిరిపడ్డాడు. డైవోర్స్.. కోర్టు.. అతని శరీరం కోపంతో వణికింది. అమాయకంగా తన మాటకి ఎదురు చెప్పని రాధ ఎంతలా బెదిరిస్తుంది? ఆమె ముందు తగ్గిపోవడానికి అహం అడ్డువచ్చింది. “కోర్టుకెక్కితే నష్టపోయేది నీవే, నాకేం” బింకంగా అన్నాడు.
“నష్టపోవడానికి నాకేం మిగలలేదు మాధవ్. ఇప్పుడిక నష్టపోయేది నీవే. నేను విడాకులు కోరితే అంతా బయటకు వస్తుంది. అన్ని కారణాలు తెలుస్తాయి. నీవు శారద బిడ్డకు తండ్రివని,నా బిడ్డకి తండ్రి ఎవడో రౌడీ అని. దాంతో నీవు, మీవాళ్లు కావాలనుకునే పరువు, ప్రతిష్ట మంట కల్సుతాయి. నన్నన్యాయం చేసినందుకు కోర్టు నాకు నష్టపరిహారం యిమ్మంటుంది..”
“యూ.. ఎంత ధైర్యం నీకు? నా మీద కసి యిలా తీర్చుకుంటావా?. నిన్ను .. ఏం చేస్తానో.. రాక్షసీ…”
“మాధవ్.. ఆడదానికి మగాడినించి కావల్సింది పిసరంత ప్రేమ,రవ్వంత సానుభూతి. ఆ రెండూ పురుషుని దగ్గిర దొరకనినాడు ఆమె హృదయం కరుడు కడుతుంది. ప్రేమకి బానిస అవుతుంది కాని నిరసిస్తే రాక్షసే అవుతుంది. నేనిలా అవడానికి కారణం నీవే మాధవ్. నేను చేయని నేరానికి నన్ను శిక్షించావు. ఆల్‌రైట్! అది పాత కథ. శారద చెయ్యని నేరానికి శిక్ష అనుభవించనీయను. ఆలోచించి రెండురోజులలో జవాబు చెప్పు..” రాధ యింక మాట్లాడవలసింది ఏమీ లేనట్టు గదిలోకి వెళ్లిపోయింది.
**************
“అయ్యో ఖర్మ.. మళ్లీ యీ గోల ఏమిట్రా బాబూ. నీ ప్రాణం శాంతిగా వుండకుండా నీమీద కక్ష కట్టినట్లు యిలా సాధిస్తుందేమిటిరా ఆ మహాతల్లి” మాధవ్ చేసిన నేరం కంటే రాధ కోర్టుకెక్కుతానని బెదిరించడం ఆ తల్లికి కష్టంగా వుంది. కొడుకు చేసిన సిగ్గుమాలిన పనిని “మగాడు ఏం చేస్తాడు. వయసులో వున్నాడు. పెళ్లాం వుండి లేనిదయినప్పుడు” అని సమర్ధించుకుంది. కాని రాధ కత్తికట్టినట్టు కోర్టుకెక్కుతానని బెదిరించడం ఆవిడకి అవమానంగా వుంది. అవధానిగారు దీర్ఘాలోచనలో వున్నట్టు కూర్చున్నారు. మాధవ్ ఏం చేస్తారో, ఏం చెప్తారో అలా చేస్తాను అన్నట్టు తన సమస్య తల్లిదండ్రుల ముందు పెట్టి తలదించుకుని కూర్చున్నాడు.
రాధ రెండురోజులలో జవాబివ్వమన్న క్షణం నించి ఎంత ఆలోచించినా అతనికి ఏం చెయ్యాలో అర్ధంగావడం లేదు. రాధది ఉత్త బెదిరింపు కాదని అతనికి అర్ధమైంది. చూస్తూ చూస్తూ శారదలాంటి అనాకారిని, వెర్రిదాన్ని పెళ్ళాడాలంటే అతని మనసు ససేమిరా అంటుంది. కాదంటే రాధ డైవోర్స్‌కి అప్లయ్ చేస్తే.. యిప్పటికే సగం చచ్చి వున్నాడు. ఇంకా కోర్టులు కేసులు బోనులో నిలబెట్టి వేసే ప్రశ్నలు, అందరికీ అంతా తెలియడం, యింక తను మొహం ఎత్తుకుని ఎలా నిలబడగలడు!.. ఈ విషయంలో ఎవరి సలహా అడగాలో కూడా తెలియలేదు అతనికి. తల్లిదండ్రుల్ని కాదని ఒకసారి దెబ్బతిన్నాడు. తన మేలు కోరేవారు తల్లిదండ్రులకంటే ఎవరుంటారు? తను చేసినపని నెమ్మదిగా, డొంకతిరుగుడుగా, రాధ కోర్టుకెడుతుందని బెదిరిస్తూందని చెపుతూ అసలు సంగతి బయటపెట్టాడు. ఆవిడ స్త్రీ కనక అన్నపూర్ణమ్మ లబలబలాడింది. అవధానిగారు మగవాడు కనక స్థిరంగా, శాంతంగా ఆలోచించాడు. కొడుకు ఎలాంటి ఊబిలో యిరుక్కున్నదీ అర్ధం చేసుకొన్నాడు. ఆలోచించి, ఆలోచించి ఆఖరికి “కానీ, ఇదీ ఒకందుకు మంచిదే మాధవ్.. రాధతో నీవెలాగూ సంసారం చేయడం లేదు. లోకంకోసం ఎన్నాళ్లు నటిస్తావు? అన్ని సుఖాలకి దూరం అయి ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తావు? రాధంతట రాధ నీకు అవకాశం యిస్తున్నప్పుడు ఆమెని వదుల్చుకోవదానికి నీకిది మంచి అవకాశం. ఆ కులం గోత్రం లేనిదాన్ని, చెడిపోయినదానితో నీ బంధాలు తెంచుకునే అవకాశం వచ్చింది. నీవు ఆమెతో కాపురం చేయకపోయినా రాధకి విడాకులు యివ్వందే మరో పెళ్ళి చేసుకునే వీలు లేదు నీకు. ఇప్పుడు ఆ అవకాశం ఆమే యిస్తుంది కనక నీవీ పెళ్ళి చేసుకో..”
“కాని.. కాని.. శారద… శారదనా?”
“కులమింటి కోతిమేలు మాధవ్.. అందరిని కాదని రాధని చేసుకొని నీవనుభవించిన ఆనందం ఏమిటి? ఈ పిల్ల మన కులం పిల్ల. కాస్త అమాయకంతా వుంటేనేం. మంచిది. నీవంటే ప్రాణం పెడుతుంది. ఆమె బిడ్డకి తండ్రివి కాబోతున్నావు. ఇప్పుడు తప్పించుకుంటే ఆ రాధ వూరుకోదు. నిన్ను బయటపెట్టి అల్లరిపాలు చేస్తే ఆ తరువాత నీవు కావాలంటే మాత్రం అయినింటి పిల్ల ఎలా దొరుకుతుంది? ఈనాటి ఆడపిల్లలు చదువుకున్నవాళ్లు నీ సంగతి తెలిసీ ఎవరు చేసుకోవడానికి ముందుకు వస్తారు? ఆలోచించు బాగా. ఆ శారదని చేసుకోవడమే మంచిది. అందం కొరుక్కుంటామా? సంసారం చేసేదానికి అందం ఎందుకు?” అవధానిగారు రాధని వదిలించుకునే అవకాశం వచ్చినందుకు ఆనందిస్తూ ఆ అవకాశం వృధా పోనివ్వలేదు.
“అవునురా నాయనా, యిప్పటికన్నా ఈ ఊబిలోంచి బయటపడరా బాబూ. ఎన్నాళ్ళురా ఓ అచ్చటా ముచ్చటా లేని కాపురం చేస్తావు దానితో. పట్టుమని పాతికేళ్లకే అన్ని సుఖాలు వదులుకుని ఎలా బతుకుతావురా? ఆ శారద కాస్త అమాయకురాలేగాని మంచిదిరా. మాట కాదనకు మాధవా” తల్లి బతిమిలాడింది. మాధవ్ ఆలోచనలో పడ్డాడు. అయిష్టంగా తలాడించక తప్పలేదు అతడికి.

***************
ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *