May 4, 2024

విశ్వనాధ నవలలపై విహంగవీక్షణం – ధూమరేఖ

రచన-ఇందిరా గుమ్ములూరి, పి.హెచ్.డి. (తెలుగు లిట్.)

Dhoomarekha

పురాణవైరగ్రంధమాలలో ఈ నవల మూడవది. దీని రచనాకాలం 1959. దీనిని కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు ఆశువుగా చెపుతుండగా శ్రీ పాలావజ్జల రామశాస్త్రిగారు లిపిబద్ధం చేసేరు.

నందివర్ధనుడు ప్రద్యోతవంశంలో చివరి రాజు. ఈతని పదవీచ్యుతుని గావించి, శిశునాగవంశజుడు, కాశీ రాజైన శిశునాగుడు మగధరాజ్యాన్ని ఆక్రమించిన వృత్తాంతమే ధూమరేఖ అనే ఈ నవలకు ఇతివృత్తం. ప్రద్యోతుడు, పాలకుడు, విశాఖయూపుడు, జనకుడు, నందివర్ధనుడు అనే పంచప్రద్యోతులు మగధదేశాన్ని నూటముప్ఫై సంవత్సరాలు పాలించారు. అనంతరం కలిశకం పదకొండు వందల ఎనభై నుండి పద్నాలుగు వందల అరవై ఎనిమిది వరకు శిశునాగులు మూడువందల అరవై సంవత్సరాలు పదిమంది పాలించారు. అంటే క్రీ.పూ. పందొమ్మిదివందల తొంభైనాలుగు మొదలు పదహారు వందల ముప్పైనాలుగు వరకు వీరు మగధని పాలించారు. వీరిలో మొదటివాడు శిశునాగుడు చివరివాడు మహానంది.

శిశునాగుడు కాశీరాజ్యానికి యువరాజు. కాశీరాజ్యం మగధకు సామంతరాజ్యం. మగధరాజైన నందివర్ధునుని కుమార్తె వేదమరీచి. తల్లి చిన్నతనానే చనిపోవటం చేత ఆడదిక్కులేని ఈమె పోషణ తండ్రి దగ్గర సరిగా జరుగదని ఎంచి, ఆ భారాన్ని తన నెత్తిన వేసికొని కాశీరాజ్యపు మారాణి చంద్రమతీదేవి వేదమరీచిని కాశీకి తీసుకొని వస్తుంది. చంద్రమతీదేవి నందివర్ధునుని పినతల్లి. వేదమరీచికి నాయనమ్మ. కనుక శిశునాగుడు వేదమరీచికి పినతండ్రి వరుస. వయసు తారమత్యం తక్కువ కావటం, కాశీనగరాన బాల్యాది ఒకటైన క్రీడాసాహచర్యం కారణాన వేదమరీచీ, శిశునాగులమధ్య ఒక అనూహ్యమైన, అసంస్కృతమైన సంబంధం పెంపొందుతుంది. ఆ రహస్యం వారిద్దరి మధ్యనే గూడు కట్టుకొని ఉండిపోయింది. ఈ కారణాన మగధ ప్రజలు, మంత్రులు ఎన్నిమార్లు పిలిచినా శిశునాగుడు వేదమరీచిని మగధకి వెళ్ళనీయలేదు. చివరకు తండ్రి నందివర్ధనుడు, వృద్ధమంత్రుల అభ్యర్ధన మేరకు వేదమరీచికి మగధకు పయనం కాకతప్పలేదు. ఈ ప్రయాణానికి శిశునాగుని అనుమతి లేదు.

వేదమరీచి చూపిన అలక్ష్యవైఖరికి తానామె పట్ల కావించిన పాపానికి మనస్సులో క్రుంగి, తీవ్ర అలజడికి లోనైన శిశునాగుడు సాయం సమయాన కాశీపురపు కోటను దాటి, గంగానది ప్రవహించని శ్మశానం దిక్కుగా అగ్నికాంతి లక్ష్యంగా వెళ్తాడు. అక్కడ ఒక పిశాచాకారం కర్రకు నిప్పటించి, దానినుండి వస్తున్న ధూమాన్ని పానం చేస్తూండటం చూస్తాడు. శిశునాగుని పరిస్థితిని గమనించిన పిశాచరూపుడు అతని ప్రతీకారాన్ని తను తీర్చిపెడతాననీ, తద్ధూమాన్ని పానం చేయమనీ ప్రోత్సహిస్తాడు. శిశునాగుడు ఆ పిశాచరూపుని గురువుగా స్వీకరించి, ధూమాన్ని పానం చేస్తాడు. ధూమపానానంతరం తాను చేసింది పాపం కాదనీ అది సహజమనీ అనుకొంటాడు శిశునాగుడు.

రాత్రంతా శిశునాగుని కోసం అన్వేషించిన భటులు చివరకు తత్ప్రదేశాన్ని కనిపెట్టి, యువరాజుని కోటకు చేరుస్తారు. శిశునాగుని కోసం పరితపిస్తూ, అకారణంగా వృద్ధుడైన తండ్రి వద్దకు వెళ్ళి, ఆశ్చర్యంతో “అయ్యో!తండ్రీ! అని సంబోధిస్తాడు కాష్టగత ధూమరేఖా పరిమళభరిత వాయు సహితమయిన తచ్చబ్దం వృద్ధుడైన రాజు నాసాపుటాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ సమయాన రాజు కంటిలో ఒక విపరీతమైన భావాన్ని చూసింది శిశునాగొక్కడే. అంతవరకూ ఒక్కమాట కూడా పలుకని రాజు “నీ రాజ్యమును నీవు పాలించుకొనుము. నీ శత్రువులని నీవు దండించుకొనుము. నీ సుఖములను నీవంభవింపుము. నీ ప్రతీకారమును నీవు పాటింపుము” అని పలుకుతాడు. ఇది ఏదో గూఢమైన విషయంగా భావించిన రాణి, గూఢచారి చిత్రశిఖండిని పిలిపించి, యువరాజు కోటవదిలిన రాత్రి జరిగిన ఉదంతాన్నంతటినీ తెలుసుకొని రావలసిందిగా ఆజ్ఞాపిస్తుంది. మహామంత్రవేత్త, ఖగోళశాస్త్ర విద్వాంసుడు, సాముద్రికవేత్త అయిన పరాశరశాస్త్రి అనే వృద్ధబ్రాహ్మణుని చిత్రశిఖండి కలిసి జరిగిన విషయమంతా వివరిస్తాడు. అవైధికభావాలకి, అసంస్కృతకార్యాలకి ప్రతీకయైన జయద్రధుడు ధూమపానంద్వారా శిశునాగునిలోనూ, వృద్ధుడూ, రోగగ్రస్థుడైన తండ్రిని పరామర్శింపనేగిన శిశునాగ ముఖనిర్గత శబ్దం ద్వారా రాజులోనూ ప్రవేశించి, తనకు రూపాన్ని, ఉపాధిని కల్పించుకొన్నాడని పరాశరశాస్త్రి గ్రహిస్తాడు. రాజులో ప్రవేశించిన దిష్టపిశాచాన్ని ఎదుర్కొనటానికి, రాజ్యాన్ని అభౌమశక్తులనుండి రక్షించటానికి పరాశరశాస్త్రి తాను చిన్ననాడు నేర్చిన ఒకానొక మ్లేచ్ఛ మంత్రాన్ని ఉపాసింప మొదలెడతాడు.

ఈ మ్లేచ్ఛ మంత్ర ప్రభావంతో ప్రద్యోత వంశ చివరిరాజైన రిపుంజయుని కాలమ్నాటి వింధ్యగిరిస్వామి (జటాధారి) ని, వింధ్యపర్వతారణ్యాలలో విరిగి పడియున్న భైరవీదేవతా విగ్రహాన్ని, ఆమె ఎదుట ఇంధనవిద్యతో ఆహుతియైన వింధ్యగిరిస్వామిని, ఆ చితినుండి వచ్చే ధూమాన్ని, ఆ ధూమం కారణంగా పెరిగిన కొన్ని దుబ్బులని పరాశరశాస్త్రి చూసి, శిశునాగుడు పీల్చిన ధూమం ఈ దుబ్బులదేనని గ్రహిస్తాడు. అంతేకాక కాశీనగర ప్రాంతంలో కనబడ్డ దుబ్బులకున్న దుంపలను ఒకానొక కాలసర్పం కోసుకొని అతి త్వరితగతిని ఆంధ్రదేశానికి వెళ్ళటం, వాటి ధూమాన్ని నిద్రపోతున్న ఆంధ్రరాజ దుహిత వంకజాబిల్లి నాసాపుటల్లోకి ప్రవేశపెట్టటం తన మనోనేత్రాలతో చూస్తాడు.

వింధ్యపర్వత ప్రాంతంలో దుబ్బులను, దుంపలను, కాశీనగరప్రాంతంలో మిగిలి ఉన్న దుబ్బులను తీసుకొని రావలసిందిగా పరాశరశాస్త్రి చిత్రశిఖండిచే నియమితులైన నలుగురు సేవకులనాజ్ఞాపిస్తాడు, ఆ దుబ్బులని రుబ్బించి గంగానదిలో కలిపిస్తాడు. ఆ దుంపలను కాల్చగా వినిర్గతమైన ధూమాన్ని ఒక రేచుక్కని మచ్చిక చేసుకొని, దాని నాసాపుటల్లోకి ప్రవేశపెట్టి దాన్ని తన గృహంలోనే పెంచుతూ ఉంటాడు. రిపుంజయుని పాలనాకాలంలో వింధ్యాకాంతారాల్లో జరిగిన విషయాలని, జయద్రధుని దుష్టసంస్కారయుత జీవితాన్ని బ్రతికియున్న నాటి పల్యంకికా వాహకులలో ఒకని ద్వారా ప్రాశరశాస్త్రి తెలుసుకొంటాడు. జయద్రధుడు సిద్ధాంతాలని ప్రచారం చేసే ఉద్ధేస్యంతోనే రాజులోకి పరకాయప్రవేశం చేసేడనీ, శిశునాగునిలోకి ధూమరూపాన ప్రవేశించాడనీ గ్రహిస్తాడు. పరాశరశాస్త్రి రాజు వద్దకు వెళ్ళి, ఆంధ్రరాజ దుహితతో శిశునాగునికి జతకూర్చటానికి అనుమతికోరి, ఆమెతో వివాహానికి అంగీకరింపజేస్తాడు. శిశునాగుడు గురువుకోసం ప్రతీక్షించనక్కరలేదనీ, తానే సర్వం సమకూరుస్తానని రాజు శరీరంలోని జయద్రధుడు పలుకుతాడు. ఆంధ్రరాజ పరివారం పెళ్ళికై కాశీరాజ్యానికి తరలివస్తుంది. వారు నగరంలోకీడుగుపెట్టక ముందే నగరంలోనున్న జయద్రధాత్మను, నగరంలోకి ప్రవేశింపబోయిన యోగిరూపజయద్రధుని పరాశరశాస్త్రి తనమంత్రశక్తి చేత అష్టదిగ్బంధనం కావిస్తాడు.

వంకజాబిల్లికి, శిశునాగునికి వివాహమవుతుంది. తనతండ్రికి సన్నిహితుడుగా ఉండి, సర్వరాచకార్యాలను నిర్వహిస్తున్న అజాతశత్రువనే వానితో వేదమరీచికి అనివార్య పరిస్థితుల్లో వివాహమవుతుంది. వేదమరీచికి వివాహమయిన విషయం తెలుసుకొన్న తరువాత వంకజాబిల్లి కాకవర్ణుడనే కుమారుని కంటుంది. కుమారుని జననంతో ఆమెలోని మన: కాలుష్యం తొలగగా, ఆమె బుద్ధి పాదరస సదృశంకాగా రాజ్యాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొంటుంది. మగధ ప్రభువైన నందివర్ధనుడు, వృద్ధమంత్రి కాలం చేస్తారు. కాశీరాజు శరీరాన్ని అంటిపెట్టుకొనియున్న జయద్రధుడు వంకజాబిల్లిచే ప్రేరితుడై, రాజు శరీరాన్ని వదిలి, మగధలో శిశునాగుడు రాజయేందుకు వలసిన అనుకూల పరిస్థితులని వేదమరీచి ద్వారా చేయించవలసిందిగా ప్రభోధితుడై, రాజు శరీరాన్ని వదిలి మరొక యోగి శరీరాన్ని పొంది, మగధని చేరుకుంటాడు. నాటినుండి మగధలో సర్వం జటాధారికి అనుకూలం అవుతుంది. రాజ్యంలో అజాతశత్రువు ప్రాబల్యం క్రమంగా తగ్గటం మొదలు పెడుతుంది.

పరాశరశాస్త్రి మరణిస్తేగాని కాశీరాజశరీరగతుడైన జయద్రధుడు తచ్చరీరాన్ని వదలలేడు. ఈ కారణంగా వంకజాబిల్లిచే మరణోపదేశం పొంది పరాశరశాస్త్రి ధూమపానం చేయించి సిద్ధం చేయబడ్డ శ్వానాన్ని జయద్రధునిపై ప్రయోగించటానికి సమాయత్త పరిచి, దానిని వంకజాబిల్లి, శిశునాగులకి మచ్చిక చేసి తాను మరణిస్తాడు. శిశునాగుడు కాశీకి రాజవుతాడు. మగధను చేరిన యోగి మగధలో అరాచకాన్ని సృష్టించగా అజాతశత్రువు పూర్వపు గౌరవాన్ని కోల్పోతాడు. శిశునాగుడు సతీసమేతుడై వేదమరీచిని పరామర్శించటానికి మగధకి వస్తాడు. యోగి కారణంగా వేదమరీచి హత్యకి గురై ఆ హత్యానేరం అజాతశత్రువుపై ఆరోపితమవటంతో ప్రజలకు అజాతశత్రువుపై వైముఖ్యం, శిశునాగునిపై ఆదరం ఏర్పడతాయి. శిశునాగ అజాతశత్రువులు చేసిన ద్వంద్వయుద్ధంలో శిశునాగుడు డస్సిపోగా, జయద్రధుడు తన ఖడ్గంతో అజాతశత్రుని ఖండించివేస్తాడు. పరాశరశాస్త్రి పెంచిన రేచుకుక్క, కాష్టగత ధూమనిపీత, వంకజాబిల్లికి మచ్చికైన కుక్క, ఆ వాసన ఉన్న వాని రక్తాన్ని పీల్చేకుక్క వంకజాబిల్లి కారణంగా జటాధారి రక్తాన్ని పీల్చిచంపి, ఆ జటాధారి ఖడ్గానికే ఎర అయి మరణిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *