May 3, 2024

కళా చికిత్స (ఆర్ట్ థెరపీ, Art therapy) ఒక ఆత్మ వైద్యము – రాధికా వెంకట్

ముఖాముఖి జరిపినవారు:-శ్రీసత్య గౌతమి

జీవనపరుగులో మనిషి ఎన్నో భావోద్వేగాల మధ్య ఊగిసలాడుతుంటాడు, మానసిక ఒత్తిళ్ళకు గురవుతుంటాడు. అటువంటప్పుడు తనలో ఉన్న కళ అది ఏదయినా కావొచ్చు నృత్యం, గానం, మిమిక్రీ, క్రీడలు, చిత్రలేఖనం, కవిత్వం, హ్యాండ్ క్రాఫ్ట్స్ గుర్తించి సాధన చేసినప్పుడు ఆ సాధనే మానసిక పరివర్తనకు దారితీస్తుంది, అందుకే ఇది ఒక వైద్యము అంటారు కాలిఫోర్నియా, అమెరికా నుండి రాధికా వెంకట్.
Radhika Pic

రాధికా వెంకట్ భారత్ లో క్యాన్సర్ బయాలజీ ఫీల్డ్ లో పి.హెచ్.డి పట్టా పొంది కొన్నేళ్ళ క్రితమే అమెరికా వచ్చి పరిశోధనలు సాగిస్తున్నారు. తానొక తీరికలేని సైంటిస్టే కాదు ఒక గృహిణి కూడా. తనకంటూ ఉండే ఆ కొద్ది సమయంలోనే తనదీ అనే అందమైన రంగు రంగుల ప్రపంచంలోకి సీతాకోకచిలుకలా ఎగిరి వెళ్తుంటారు. ఆ ప్రపంచంలో విహరిస్తూ తన మనస్సుని తట్టిలేపి రంగు రంగుల కుంచెలతో క్రొత్త క్రొత్త సృష్టులకు పూనుకుంటారు. అంతేకాదు దసరా బొమ్మల కొలువులకు కూడా తను సేకరించే అందమైన బొమ్మలను చక్కటి నేపధ్యాల (థీమ్స్, themes) తో అలంకరిస్తారు. మానసిక ఒత్తిళ్ళనుండి ఇది ఒక గొప్ప నివారిణి అంటారు రాధికగారు.

మాలిక ద్వారా తన చిన్ననాటి అనుభవాలని, తన ఆయిల్ పెయింటింగ్స్ మరియు అందమైన కళాత్మక రంగోలీలను మనతో ఇలా పంచుకుంటున్నారు.
రాధికా వెంకట్ తో ముఖాముఖి-1_oil paintings

“అవును … ఈ ఆర్ట్ థెరపీ మానసిక ఒత్తిళ్ళనుండి మనిషిని బయట పడేసే ఔషధం. మనిషికి క్రొత్త ఉత్తేజాన్ని తెచ్చి పునర్జీవాన్ని పోసే సంజీవిని. నాలో ఉన్న ఒక చిన్న ఆసక్తిని గుర్తించి, వెలికి తీసినవారు మా అమ్మగారు. నేను చిన్నతనము నుండీ ఒక దగ్గిర కూర్చొని క్రేయాన్స్ పట్టుకొని బొమ్మలు గీస్తూ ఉండేదాన్నట. పెద్దగా పరుగులెత్తి ఆడే ఆటల్లో పాల్గొనేదాన్ని కాదట. అప్పుడు మా అమ్మగారు బొమ్మలు గీసే నా ఆసక్తిని ప్రోత్సహించారు. పాత తమిళ పత్రికల్లో అందమైన చిత్రాలనీ, కార్టూన్ బొమ్మలనీ, క్యాలండర్ బొమ్మల్నీ నా ముందు పెట్టి వాటిని వెయ్యమంటుండేవారు. నేనలాగే వాటిని వేస్తూ, మెరుగులు దిద్దుతూ ఆనందిస్తుండేదాన్ని. మా అమ్మగారి ఎంబ్రాయిడరీ మరియు ఫాబ్రిక్ పెయింటింగ్స్ ని మోడల్స్ గా తీసుకొని వాటర్ కలర్స్ తో వేస్తూ సాధన చేస్తూ వుండేదాన్ని. అమ్మ మంచి మంచి డిజైన్స్ సేకరిస్తూ ఉండేవారు. ఆ డిజైన్స్ ని కూడా వాటర్ కలర్స్ తో వేస్తూ గ్రీటింగ్ కార్డ్స్ తయారుచేసేదాన్ని. చదువులు పెరిగాక ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినప్పటికీ వీటిపైన వ్యామోహాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు నేను. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కేమెల్ బ్రాండు పెన్సిళ్ళతో అందమైన డిజైన్లు, బొమ్మలతో గ్రీటింగ్ కార్డులు తయారుచేసి స్నేహితులకు ఇస్తుండేదాన్ని.

రాధికా వెంకట్ తో ముఖాముఖి-3_oil paintings
నా పధ్నాల్గవయేట అమెరికా లో ఉండే మా కుటుంబసభ్యుల్లో ఒకరు నాకు స్టెడ్లర్ బ్రాండ్ రంగు పెన్సిళ్ళను కానుకగా ఇచ్చారు. ఇండియాలో అవప్పుడు చాలా ఖరీదయినవి. కొనమని నాన్నగారిని అడిగితే- బాగా చదువుకొని, సంపాదించి ఆ పెన్సిళ్ళు కొనుక్కో అన్నారు. నాన్నగారు సరదాగా అన్నా నేను మాత్రం చాలా సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకున్నాను. ఆ పెన్సిళ్ళ మీదా, ఆర్ట్ మీద నాకున్న వ్యామోహమటువంటిది.

క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ముంబాయ్ లో పి.హెచ్.డి చేస్తున్న రోజుల్లో లోకల్ ట్రైన్స్ లోనే వెళ్ళడం, ఇంటికి రావడం. ప్రతిరోజూ ఈ ప్రయాణం చాలా స్ట్రెస్ ఫుల్ గా వుండేది. ఈ ప్రయాణకాలంలో బోర్ కొట్టకుండా ఆ సమయంలో కూడా చక్కగా డ్రాయింగ్స్ వేసుకుంటూ వుండేదాన్ని. సమయ పరిమితులవల్ల నేను పెయింటింగ్ క్లాసెస్ కి వెళ్ళి టెక్నికల్ గా క్రొత్త పద్ధతుల్లో ఆర్ట్ వెయ్యడాన్ని నేర్చుకోలేకపోయాను ఎంత నా మనసు ఉబలాట పడినా.

మొదటిసారిగా ఫెలోషిప్ మీద ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్ కి జపాన్ వెళ్ళాను. వెళ్ళగానే హోటల్ లో లగేజ్ పడేసి మొట్టమొదట మొదట చేసిన పని రిసెప్షన్ లో అడిగిన ప్రశ్న- “ఆర్ట్ స్టోర్ ఇక్కడ దగ్గిరలో ఎక్కడ ఉంది” అని. వాళ్ళ దగ్గిరనుండి అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళి నా చిన్నప్పటి కోరిక మేరా మనసారా 64 స్టెడ్లర్ కలర్ పెన్సిళ్ళను కొనుక్కున్నాను. అది నాకు నేనుగా కానుకిచ్చుకున్న క్షణం. అది నాకెంత ఆనందాన్ని పంచిందో మాటల్లో చెప్పలేనిది, ఇప్పటికీ ఆ అనుభూతి మర్చిపోలేనిది.

ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మరికొద్ది సమయాన్ని సంగీతం నేర్చుకోవడానికి కూడా పెట్టాననుకోండి. పి.హెచ్.డి పూర్తి అయ్యాక పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ మీద రీసెర్చ్ చెయ్యడానికి అక్టోబర్ నెలలో వచ్చాను అమెరికాలో ఫిలడెల్ఫియా అనే సిటీకి. అది ఫాల్ (ఆకు రాలు) కాలము. ఆ కాలము ఫిలడెల్ఫియా మరియు చుట్టు ప్రక్కల ప్రదేశాలన్నీ ఆకుల రంగులు మారి అందమైన చెట్లతో చాలా సుందరంగా ఉంటాయి. ఆ రంగులన్నిటినీ నా కుంచెలలో బంధించాలని చాలా ఆత్రుత పడ్డాను గానీ కోరుకున్నంత సమయం ఇవ్వలేకపోయేదాన్ని. ఈ సమయ పరిమితులవల్ల నా సంగీతానికి గానీ, పెయింటింగ్స్ కి గాని దాదాపు ఏడు సంవత్సరాలు సమయాన్ని సరిగ్గా కేటాయించలేకపోయాను. కానీ అప్పుడప్పుడు ఆర్ట్ స్టోర్స్ వెళ్ళినప్పుడు అక్కడ రంగు రంగుల కళాత్మక వస్తువులు ఆఖరికి ప్లాస్టిక్ పువ్వులను చూసివచ్చినా కూడా ఒక అద్వితీయమయిన అనుభూతిలో పడిపోయేదాన్ని.
రాధికా వెంకట్ తో ముఖాముఖి-4_oil paintings

పెళ్ళయ్యి కాలిఫోర్నియాకి వెళ్ళిపోయాక క్రొత్తగా మారిన ఉద్యోగం, క్రొత్త జీవితము మరింత ఒత్తిడి తీసుకువచ్చినా క్రొత్త బంధాలతో అందమైనవి. నాకింట్లో ఉన్న ప్రోత్సాహాలతో మళ్ళీ నా టాలెంట్స్ కి పదును పెట్టండం మొదలు పెట్టాను. సంగీతం స్కూల్ లో జాయిన్ అయ్యాను. నా చిత్ర కళను కూడా మళ్ళీ మొదలు పెట్టాను. మావారితో కలిసి అవుట్ డోర్ వెకేషనింగ్ కి వెళ్ళినప్పుడు కూడా మొదట నా బ్యాగ్ లో సర్దుకొనేది నా స్టెడ్లర్ కలర్ పెన్సిళ్ళు. అప్పుడప్పుడు మా వారు ఏదైనా కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు నాకు తోడుగా ఉండేది నా కలర్ పెన్సిళ్ళు, రంగు కుంచెలు. ఈ సమయంలోనే నా కిష్టమయిన దేవుడు గణేశుని అలాగే నెమలి డ్రాయింగ్స్ వేసాను, మీతో పంచుకుంటున్నాను.

ఇంటికి దగ్గిరలోనే ఒక ఆర్ట్ స్కూల్ ని కనుగొన్నాను, అందులో జాయిన్ అయ్యాను. నా టీచర్ చిత్ర నుండి పెయింటింగ్స్ వెయ్యడంలో రక రకాల టెక్నిక్స్ ని నేర్చుకుంటున్నాను. పెయింటింగ్సే కాక అందమైన కళాత్మకమైన ముగ్గులు వేసి మురిసిపోతుంటాను. సంగీత సాధన కూడా మర్చిపోలేదు. అంతేకాకుండా మంచి మంచి వంటలు చెయ్యడం కూడా నాకిష్టమే. నాకున్న ఈ ఇష్టాలన్నీ నాకు తోడుగానే ఉంటూ ఒత్తిళ్ళ నుండి బయటపెట్టి ఎప్పటి కప్పుడు నన్ను మనిషిని చేస్తూనే ఉన్నాయి.

రాధికా వెంకట్ తో ముఖాముఖి-6_free hand rangoli
నా స్నేహితులందరికీ నా సందేశము- ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉండి తీరుతుంది. దాన్ని గుర్తించండి. కొనసాగించండి. జీవితం ఎన్ని మలుపులు తిరుగుతున్నా దొరికిన సమయంలోనే మీ టాలెంట్స్ లోనే మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆనందాన్ని పొందండి. జీవితమంటే జీవితమంతా ఆనందం గా ఉండడానికి ప్రయత్నించడమేగా after all !!!

నా పైయింటంగ్స్ ని, రంగోలీలను కొన్నిటిని మీ ముందుంచుతున్నాను. Hope, you all will like it!!!”

రాధికా వెంకట్ తో ముఖాముఖి-7_free hand rangoli
రాధికా వెంకట్ తో ముఖాముఖి-8_free hand rangoli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *