May 3, 2024

బ్రహ్మలిఖితం – 1

రచన: మన్నెం శారద

మార్గశిర మధ్యం…
బ్రహ్మీ ముహూర్తపు వేళ!
వెన్నెల ఎర్రబారుతున్న సమయం.
భువిపై కురుస్తోన్న మంచు – చంద్రకిరణాలతో సఖ్యం పెంచుకొని మరింత ఘనీభవించి నేలంతా తెల్లని గొంగళి పరచినట్లుంది.
సృష్టిలోని యావత్ ప్రాణికోటి వెచ్చదనం కోసం గదుల్లోకి, నెరియల్లోకి, గుహల్లోకి దూరి ముడుచుకొని ఆదమరచి నిదురపోతున్న ఆ సమయంలో వాల్తేరు అప్‌లాండ్స్‌లోని ఒక ఇంటి రెండో అంతస్తులోని ఈశాన్య భాగపు గదిలో చెదరని ఏకాగ్రతతో కనులు మూసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తోంది కేయూరవల్లి.
తడి తలకి పిడచ కట్టి, భావతీక్షణతని సూచిస్తున్న కనుబొమ్మల మధ్య సింధూరం అలది, నిటారుగా కూర్చుని వున్న ఆమె ఆకృతిని పరికిస్తే కొంపతీసి ఆమె యోగనిద్రలోకి వెళ్ళిపోలేదు కదా అనిపిస్తుంది. ఎదురుగా వెలుగుతోన్న అఖండ దీపపు కాంతి కిరణాలు మూలపీఠం మీద అమర్చిన పంచలోహ విగ్రహాల మీద పడి పరావర్తనం చెంది ఆమె నాసికాగ్రాన వున్న రవ్వల ముక్కుపుడక మీద పడి వెలుగు బిందువులుగా మారి క్రిందకి జారుతున్నాయి.
ఆమెకి నలబయి సంవత్సరాల వయసుండొచ్చు. శరీరాకృతిలో కొంత బొద్దుతనముంది. కొద్దిగా నోటి దగ్గరగా జారుతున్న బుగ్గలు ఆమె యౌవనంలో అందమైన స్త్రీ అయి ఉంటుందన్న నిజాన్ని తేటబరుస్తున్నాయి.
స్తోత్రం ముగించి, ఆమె కళ్ళు తెరచి లేచి దేవుడికి హారతినిచ్చింది. కుడిచేతితో హారతిస్తూ ఎడం చేతితో ఆమె వాయించిన గంట శబ్దం తరంగాలై ఆ గదినుండి హాల్లోకి అక్కడనుండి ఆమె కూతురు పడుకున్న పడక గదిలోకి ప్రవహించింది.
ఆ నిశ్శబ్ద నీరవంలో ఆ ఘంటానాదం నాడీమండలం మీద పని చేయడంతో ఒక రకమైన ఉత్తేజంతో మంచం మీద గబుక్కున లేచి కూర్చుంది లిఖిత.
సరిగ్గా అప్పుడే హారతి పళ్ళెంతో ఆ గదిలోకి ప్రవేశించింది కేయూరవల్లి.
లిఖిత లేచి నిలబడి హారతి కళ్లకద్దుకుంటూ తల్లి మొహంలోకి చూసింది. హారతి జ్వాలలో ఆవహించిన దుర్గలా వుందామె ఆకృతి.
లిఖిత కిటికి తలుపు తెరచి బయటకి చూసింది.
చీకటింకా చెక్కు చెదరలేదు. భూమిని స్పర్శించడానికి వెలుగుకింకా ధైర్యం చిక్కలేదు. చలిగాలి మాత్రం తీసిన తలుపు రెక్క సందులోంచి దొంగలా జొరబడి లిఖిత మొహం మీద తీవ్రంగా దాడి చేసింది.
లిఖిత తలుపు గబుక్కున మూసి “నీకెన్ని సార్లు చెప్పాలి. ఇంత తొందరగా లేవడమెందుకు చెప్పు?” అంది కోపంగా.
“నాకలవాటైపోయింది. ఈ వేళప్పుడు పూజ చేయకపోతే పిచ్చెక్కినట్లుంటుంది. అది సరే. నువ్వు లేచి మొహం కడుక్కో. నేను కాఫీ తెస్తాను” అంటూ లోనికెళ్లిపోయింది కేయూరవల్లి.
లిఖిత లేచి దుప్పటి మడిచి బాత్రూంలోకి నడిచింది. గీజర్ ఆన్ చేసి బ్రష్ చేసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చిందామెకు. ఆరోజు కాన్వకేషన్ అని. మనసులోకి ఉత్సాహం పంప్ చేసినట్టు తన్నింది.
ఈరోజు తాను బి.ఎ. పట్టా తీసుకోబోతోంది మామూలుగా కాదు.. గోల్డ్‌మెడల్‌తో. తను యూనివర్సిటీ ఫస్టు వచ్చింది అదీ లిటరేచర్‌తో. ఈరోజు ఎన్నో కళ్ళు తనని ఆరాధనగా చూస్తాయి. గవర్నర్ ప్రశంసిస్తూ మెడల్‌ని తన మెడలో వేస్తాడు. వేలాది పట్టభద్రుల్లో తనకి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం.
ఆ విషయం స్ఫురించగానే లిఖిత మొహమంతా సంతోషం అందుకొంది.
వయసు తెచ్చిన అందం, ఆనందంతో కలిసి ఆమె మరింత అందంగా కనిపించింది ఎదురుగా వున్న అద్దంలో.
“అమ్మా!” అంటూ గట్టిగా అరచింది లిఖిత ఉషారుగా.
“ఊ”.
“ఇలారా”
“ఉండొస్తున్నా!”
“వెంటనే ప్లీజ్!”
కేయూరవల్లి ఆందోళనగా వంట గదిలోంచి బయటకొచ్చి “ఏం జరిగింది? ఎందుకలా అరిచేవ్?” అని అడిగింది అర్ధం కాక.
“ఏవీ లేదా? సరిగ్గా చూసి చెప్పు!” అంది లిఖిత
“ఏమో నాకేం కనిపించడం లేదు. నీ మొహం తప్ప!”
“అదే నా మొహమే ఎలా వుంది?”
లిఖిత ప్రశ్నకి చిరాకు పడుతూ “ఎలా వుంటుంది, నీ మొహంలానే వుంది” అంటూ వెనుతిరిగింది కేయూర.
లిఖిత గబుక్కున తల్లి భుజాలు పట్టుకొని తనవైపు తిప్పుకుని “ఏంటి? నా మొహం నా మొహంలానే వుందా? హెలెన్ అఫ్ ట్రాయి, క్లియోపాట్రాల్లా వెలిగిపోవడం లేదూ!” అండిగింది సీరియస్‌గా.
లిఖిత చిలిపి మాటలకు కేయూర నవ్వలేదు.
“ఏమో వాళ్లని నేను చూడలేదు. నేనీ రోజు ఫాక్టరీకి త్వరగా వెళ్లాలి. నువ్వొచ్చి కాఫీ తాగు” అంది ఎంతో ఉదాసీనంగా.
లిఖిత తల్లివైపు నివ్వెరబోతున్నట్లుగా చూసి “ఏంటీ! ఈ రోజు కూడా ఫాక్టరీ కెల్తావా? ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా మెడల్ తీసుకోబోతున్న విషయమన్నా గుర్తుందా నీకు?” అంది నిష్టూరంగా.
“దానికి నేనేం చేయను? ఈ రోజు స్టాక్ సింగపూర్‌కి ఎక్స్‌పోర్టవుతున్నది. నేను దగ్గర లేకపోతే గల్లంతు చెస్తారు” అంది కేయూర.
తల్లి జవాబుకి లిఖిత కళ్లలో నీళ్లు చిమ్మేయి.
ఇంకేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లి మనస్తత్వం ఆమెకి బాగా తెలుసు. ఇంకేం మాట్లాడినా నిష్ప్రయోజనమనీ తెలుసు.
పగలు గాజువాకలో వున్న కేయూర ప్రింట్స్ ఫాక్టరీలో ఒక యంత్రంలా పని చేసి ఏమాత్రం టైము దొరికినా మిగతా కాలాన్ని పూజగదిలో మంత్రోచ్చారణకే జీవితాన్ని అంకితం చేసిన తన తల్లిని కదలించడం చాలా కష్టమని లిఖితకి ఎన్నో సార్లు అర్ధమయింది.
అందుకే లిఖిత తల్లితో తర్కించదు.
కేయూరవల్లి కాఫీ తెచ్చి కూతురికందించి వెళ్లిపోయింది.
అప్పుడు కూడా ఆమె కూతురు చిన్నబుచ్చుకుందేమో ఊరడించాలన్న వూహకి కూడా అందకుండా వెనుతిరిగి వెళ్లిపోయింది.
లిఖిత కప్పు తీసుకుని మెల్లిగా తలుపు తీసి బయటకొచ్చింది.
అప్పుడే చిన్నగా తెల్లవారుతోంది.
ఎదురుగా వున్న సముద్రం – ఆకాశం బూడిద రంగులో కనిపిస్తున్నాయి. పక్షులు చాలా అవసరమైన పనులున్నట్లు కువకువలాడుతూ రెక్కలు సాచి గూళ్ళొదిలి వెళ్ళిపోతున్నాయి.
రాత్రి కురుసిన మంచి బిందువులు నేలపై మొలిచిన గరిక కొసలపై నిలబడి సూదితో గుచ్చిన ముత్యాల్లా మెరుస్తున్నాయి.
క్రమంగా చీకటి ఛాయల్ని పూర్తిగా తరిమికొట్టి ప్రకృతినంతా పరిపాలించసాగింది వెలుగు.
మరి కాస్సేపటిలో సప్తవర్ణాశ్వరధారూఢుడైన సూర్యుడు సముద్ర గర్భంలోంచి బయటికి రావడం ఎంతో సంతోషంగా గమనించింది లిఖిత.
ఆ దృశ్యాన్నామె ఇంచుమించు ప్రతిరోజూ చూస్తోంది. అయిన ఏ రోజు కా రోజు దృశ్యం ఆమె కనులకి పండుగ చేస్తూనే వుంటుంది.
సూర్యోదయానికి ముందు ఆకాశంలో అతి త్వరితంగా మారే రంగులు గమనిస్తే దేవుడు ఒక అద్భుతమైన చిత్రకారుడనిపించక మానదు. అంతే కాదు – ప్రపంచంలో ఏ చిత్రకారుడు అంత గొప్పగా రంగుల్ని మిశ్రమం చేయలేడు. అనుకుంది లిఖిత.
క్రింత గేటు చప్పుడు వినిపించి ఆలోచనల నుండి బయటపడి క్రిందకి తొంగి చూసిందామె.
గేటుని బార్లా తెరిచి స్టీరింగ్ సీట్లో కూర్చుని కారుని డ్రైవ్ చేస్కుని వెళ్ళిపోతున్న తల్లిని చూసి నిర్లిప్తంగా లోనికి నడిచింది.
తన తల్లి చాలా చిత్రమైన మనిషి. ఆమె మనసులో ఏముంటుందో ఎవరికీ అర్ధం కాదు. తన పనులు తాను యంత్రంలా చేసుకుపోతుంది. బాధ్యతల్ని తు.చ తప్పక పాటిస్తుంది. ఆమె ప్రవర్తన చూస్తే ఆమె జీవితంలో బాగా దెబ్బ తిన్న మనిషిలా ఆనిపిస్తుంది. అదీ పరిస్తితులతో కాదు మనుషులతో!
అదీ భర్తతో!
అతని గురించామెప్పుడూ మాట్లాడదు.
ఇంతకీ తనకి తండ్రున్నాడో లేదో…
*********
టైమెంతో తెలియదు.
తెలియదనే కన్నా తెలుసుకోవాలన్న ఆసక్తిని మరచి ఎదురుగా వున్న టేబుల్‌వైపే చూస్తున్నాడు డాక్టర్ కార్తికేయన్.
టేబుల్ మీద బోర్లించిన ఆరడుగుల పొడవు, రెండున్నరడుగుల వెడల్పుగల రెక్టాంగులర్ పెట్టె లోపలంతా లేత ఊదారంగు పరచుకొనుంది. సరిగ్గా పరికించి చూస్తే ఆ పెట్టెలో ఒక ప్రాణి వున్న ఉనికిని తెలియజేస్తూ పైకి క్రిందికి ఎగసిపడుతున్న పొట్ట భాగం – ఉచ్చ్వాసనిశ్వాసాలని తెలియజేస్తూ చిన్నగా కదులుతోంది.
కార్తికేయన్ కళ్లలో ఒకలాంటి సంతృప్తి – విజయం తాలూకు గర్వం – మరోపక్క అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఓటమి తాలూకు భయసందేహాలు వెలుగునీడల్లా దోబూచులాడుతున్నాయి.,
అతని పక్కనే కూర్చుని ఒకసారి గాజుఫలకంలోని ప్రాణివైపు – మరోసారి కార్తికేయన్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు మీనన్.
అతని కళ్లలో ఆందోళన మాత్రమే కదలాదుతున్నది.
కారణం ఆ పెట్టెలో ప్రాణంతో గత రెండురోజులుగా పోరాడుతున్నది అతను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య కావడం.
కార్తికేయన్ మీనన్ భార్యకి అమర్చిన ట్యూబులు మరోసారి పరీక్షించి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
మరో గంట గడిచింది. అతి స్తబ్దంగా – ప్రతి క్షణం రబ్బరులా సాగుతూ.
అంత టెన్షన్‌లోనూ అతనికొక్కసారి నిద్ర వచ్చినట్లయింది. కళ్లు తెలియకుండానే మూసుకున్నాయి. మనిషి జయించలేనిది మరణమే కాదు – నిద్ర కూడా. ప్రతి ప్రాణి ప్రతిరోజు కొన్ని గంటల కాలమైనా నిద్ర రూపంలో తాత్కాలిక మరణానికి గురికాక తప్పదు. నిద్రని జీవితం నుండి విభజిస్తే మనిషి బ్రతికే కాలం అతిస్వల్పం. ఆ స్వల్పానికే మనిషి శాశ్వతంగా వుండిపోతున్నట్లు పక్కమనిషిని దోచుకుంటాడు. కలహిస్తాడు. విపరీత స్వార్ధానికి గురయి అన్నం పెట్టిన చేతినే కొరకాలని ప్రయత్నిస్తాడు. అందలాలెక్కాలని కలగంటాడు. ఇంకా యింకా బాగుపడాలని దొంగ పూజలు చేస్తాడు. తన ప్రగతి కోసం పక్కవాడికి సమాధి కడ్తాడు. అబద్ధాలడతాడు. కృతజ్ఞతని మరచి మృగంలా బతుకుతాడు.
ఈ ఆలోచనలేమీ పట్టని కార్తికేయన్ గత ఇరవై సంవత్సరాలుగా మనిషికి మరణమనేది శాశ్వతంగా లేకుందా చెయాలని ప్రయోగశాలలో అకుంఠిత దీక్షతో ఒక తపస్సులా నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. అక్కడే అతనికి పొద్దు పొడిచింది. చీకటి గ్రుంకింది. అక్కడే అతని యౌవనం నిర్వీర్యమై వృద్దాప్యం ఆవరించింది. అక్కడే అతని వత్తయిన నల్లని ఉంగరాల జుత్తు తెల్లబారి రాలిపోయింది. అక్కడే అతని మెరిసే కళ్లు గాజుగోలీల మాదిరి కళావిహీనమై పేలవంగా మారిపోయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే అతని విలువైన జీవితమంతా కర్పూర హారతిలా కరిగిపోయిందా ప్రయోగశాలలోనే!
కార్తికేయన్‌కే స్వార్ధమూ లేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. అతనికీ ఆశ వుంది. బలమైన కోరిక వుంది.
అది మనిషి జీవిత నిఘంటువు నుండి మరణమనే పదాన్ని పూర్తిగా తొలగించాలని!
ఆ ఘనత ప్రపంచ దేశాలన్నింటిలోనూ తనకే దక్కాలని.
అంత బలమైన కోరిక శుభ్రంగా తిని, హాయిగా పడుకుని నిద్రపోతూ కాలం గడిపే ఏ మనిషికీ పుట్టదు.
రాపిడి నుండే అగ్ని పుడుతుంది.
అనంతమైన కష్టాలు, కన్నీటి నుందే మనిషి నిష్ణాతుడవుతాడు.
కార్తికేయన్‌కి తను చాలా ప్రేమించే తల్లి నాల్గు రోజుల జ్వరానికే చనిపోయింది.
ఎంటొ అభిమానించే తండ్రి రైలు ప్రమాదంలో మరణించేడు. మిగిలిన ఒక్క చెల్లి డయేరియాతో ఈ లోకాన్ని విడిచింది.
అప్పటికి కార్తికేయన్ వయసు పదమూడు సంవత్సరాలు మాత్రమే. వరుసగా ఒకే సంవత్సరంలో అతని జీవితంలో జరిగిన విపత్కారాలు అతని లేత హృదయాన్ని చిద్రం చేసేయి. గుండెలవిసేలా ఏడ్చేడు కొన్నాళ్లు. తర్వాత్తర్వాత కన్నీళ్లు కూడా రావడం మానేసేయి.
గుండె మీద ఏదో బరువు పడేసి బలంగా నొక్కుతున్న బాధ. చదువు సరిగ్గా చదవలేకపోయేవాడు. స్కూలు ఎగ్గొట్టి ఊరి పొలిమేరలు దాటి మైళ్ళ కొద్ది అగమ్యంగా నడిచేవాడు.
వెళ్లగా వెళ్ళగా ఏదో పరిష్కారం దొరుకుతుందనే వెర్రి ఆశకి గురయ్యేదతని మనసు. శూన్యంలోకి చూపులు నిగిడ్చి తనకి కావల్సిందాన్ని వెదుక్కునేవాడు.
నీలాకాశంలో పేర్చినట్లున్న తెల్లని మబ్బులు వెనుకనుండి అతని తల్లి తనని చేతులు సాచి ఆర్తిగా పిలిచినట్లనిపించేది.
పసి వయసులోనే తన బాధ్యత తీర్చుకోకుండా కార్తికేయన్‌ని ఒంటరిగా వెళ్లిపోయినందుకి విచారిస్తున్నట్లుగా కనిపించేదతని తండ్రి రూపం.
దిక్కులేని అన్నని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించేదతని చెల్లి.
కార్తికేయన్ లేత హృదయం వేటు తిన్న గువ్వలా గిలగిల్లాడేది. గుండెలో లుంగ చుట్టుకుని గొంతు కడ్డంపడి కరగని మంచు ముక్కలాంటి దుఃఖం అతన్ని అణువణువునా నలిపేసేది!
అప్పుడే అతని హృదయంలో మరణం పట్ల ఒక రకమైన ద్వేషం – దాన్ని జయించాలన్న బలమైన కోరిక ప్రోది చేసుకోనారంభించేయి.
ఎలా?
ఏ విధంగా?
అస్పష్టమైన భావాలు.
నిర్దుష్టత నెరుగని ఆలోచనలు.
జవాబు దొరకని ప్రశ్నలు.
అప్పుడే సరిగ్గా తనని లాలించి ఇంతన్నం పెడుతున్న మేనత్త కూడా ఉన్నట్టుండి విరుచుకుపడి చనిపోయింది.
హార్టెటాక్ అన్నారందరూ!
మేనమామ ఆమె మీద పడి ఏడుస్తుంటే కార్తికేయన్ ఆ దృశ్యాన్ని చూడలేకపోయేడు.
మనసు మెలితిప్పి పిండుతున్న గుడ్డలా తల్లడిల్లిపోయింది.
ఎందుకిలా – తనకి ఎవర్నీ లేకుండా చెయ్యడం.
ఈ చావనేది యింత చెప్పా పెట్టకుండా – ఎలాంటి సూచననివ్వకుండా ఒక్కసారి కలుగులోంచి అకస్మాత్తుగా బయటకొచ్చిన కాలసర్పంలా మనిషి మనుగడనెందుకు కాటేసి వెళ్లాలి?
అసలీ చావెందుకు?
ఇదింత అనివార్యమా?
దీన్నుండి మనిషికి విముక్తి లేదా?
భూమి గుండ్రంగా వుందని – దాన్ని పాములా అనంతమైన జలరాశి చుట్టుకుని వుందని – సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని – ఆకాశం శూన్యమని ఎందుకీ అనవసరపు జ్ఞానం?
విమానంలో కొన్నివేల మైళ్ళని కొన్ని గంటల్లోనే చేరుకోగలనని, టి.విలో ఎక్కడెక్కడివో చూడగలనని, వినగలనని, ఎన్నెన్నో తన మేధస్సుతో కనుక్కుని సుఖపడుతున్నానని మిడిసిపడే మనిషి – మరణం తన మెడలో పాములా చుట్టుకునే కూర్చుందని – దాన్ని అధిగమించలేని తన తెలివి బూడిదలో పోసిన పన్నీరని గ్రహించలేకపోతున్నాడే!
అకస్మాత్తుగా అతని దృష్టి మేనత్త సాంప్రదాయ సిద్ధంగా శిష్టాచారాలతో, అనంత భక్తిభావంతో తెల్లవరాగానే పూజించే దేవుడి పటాల మీద పడింది. అనేక రూపాలతో, అనేక చేతులతో ఆశీర్వదిస్తూ, స్మిత వదనాలతో వున్నాయి దేవుడి రూపాలు.
ఈ యావత్ ప్రకృతిని, ప్రాణుల్ని శాసించే ఒక అద్భుత శక్తి వుందని నమ్మి పూజించిన అత్తని ఈ దేవుళ్లెవరూ మరణం నుండి కాపాడలేకపోయారే?
అసలు దేవుడనే వాడున్నాడా?
ఉంటే..! వాడి పని కేవలం మనిషిని ఏడిపించడమేనా?
స్థితిని వదిలేసి సృష్టి, లయలు చేయడమేనా అతని వృత్తి.
అంటే దేవుడొక శాడిస్టన్నమాట.
అంతే!
కార్తికేయన్ హృదయం భగ్గున తాటాకులా మండింది.
అతను ఆవేశంతో తన చేతికందిన వస్తువుని తీవ్రంగా పూజాపటాలకేసి కొట్టేడు.
పటాలన్నీ మేకుల నుండి వూడిపడి భళ్ళున పగిలి గాజు ముక్కలు చెల్లాచెదురయ్యాయి. అందులోని సూదిగా వున్న ఒక పెంకు వేగంగా వచ్చి అతని మేనమామ నుదుటకి తీవ్రంగా గుచ్చుకుని వెచ్చని రక్తం జలజలా బయటకి దూసుకొచ్చింది.
అతన్ని పరామర్శించడానికొచ్చిన చాలామంది దృష్టి కార్తికేయన్ మీద పడింది.
“ఈ నష్టజాతకున్నెందుకు కొంపలో తెచ్చిపెట్టుకున్నావ్? వాడు రాగానే లక్షణంగా వున్న అన్నపూర్ణమ్మ ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ఠక్కున చచ్చిపోయింది. వాణ్ణి ముందు వెళ్లగొట్టు” అన్నారు.
“అవును. కొందరు కాలుపెడితే అంతే.”
“ఆవిడ పాలిట మృత్యువు వీడు”
“అమ్మా బాబుని, చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు మేనత్తని. ఇంకో నాల్రోజులుంటె…”
వాళ్ల మాటలతో అసలే భార్య చనిపోయి రోదిస్తున్న అతని మేనమామ హృదయంలో సహనం పూర్తిగా చచ్చిపోయింది.
ఒక చేత్తో నెత్తురు ఓడుతున్న నుదుటిని అదిమి పట్టుకుని లేచొచ్చి, మరో చేత్తో కార్తికేయన్ మెడ పట్టుకుని బలం కొద్దీ తోసేస్తూ “పోరా దరిద్రుడా!” అన్నాడు తీవ్రంగా.
కార్తికేయన్ విసురుగా గుమ్మం అవతల పడ్డాడు.
మోచేతులు, మోకాళ్లూ గీసుకుపోయి రక్తం చిప్పిల్లింది. వెన్నెముక బెణికి “అమ్మా” అన్నాడు బాధగా. అతని స్థితి చూసి ఏ ఒక్కరికీ జాలి కలగలేదు. కార్తికేయన్ మెల్లిగా లేచి దూరంగా వెళ్లి కూర్చున్నాడు.
ప్రాణాన్ని వదిలేసిన మేనత్త శరీరానికి స్నానం చేయించి పట్టుచీర కట్టేరు. నిండుగా బొట్టు పెట్టి పూలు ముడిచేరు. మెడలో దండ వేసి పాడెక్కించేరు.
“గోవిందా.. గోవిందా” అంటూ పాడె లేచింది.
మేనమామ నిప్పు వేసిన కుండ తీసుకుని ముందు నడుస్తుంటే.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం తన తల్లికి చేసిన అంతిమ యాత్రం గుర్తొచ్చిందతనికి.
కడుపులో పేగులన్నీ మెలేసి తిప్పేస్తున్నట్లయింది.
“అమ్మా! అమ్మా!” అంటూ ఏడుస్తూ మేనత్త నిర్జీవ రధాన్ని వెంబడించి పరిగెత్తేడు తను స్మశాన వాటిక దాక.
చితి అంటుకుంది. రెండు గంటల మునుపువరకు కదలాడి, నవ్వి, మాట్లాడిన మనిషి క్షణాల్లో బూడిదగా మారిపోయింది.
అందరూ వెళ్ళిపోయేరు.
అక్కడే మోకాళ్ల మీద తలపెట్టుకుని చూస్తూ కూర్చున్నాడతను. కాలమెంతయిందో తెలియదు. తూర్పు నుండి చీకటి కోరలు సాచి పైపైకి వస్తున్న ఆ సాయం సంధ్యలో అతని భుజమ్మీదొక చెయ్యి పడింది.
ఉలిక్కిపడి చూసాడతను..

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *