May 3, 2024

బ్లాక్ మెయిల్ – హాస్యకథల పోటి – మూడవ బహుమతి

రచన: వి.శశి కళ

‘త్వరగా కానీ ” పులిపిరి మొహం తొందర పెట్టింది
పబ్లిక్ ఫోన్ డైల్ చేస్తున్న కోర మీసం వేళ్ళు వణికాయి .
”ఉండరా! చేస్తున్నాను ”
”రింగ్ అవుతుందా ?”
”హా ” తలూపాడు
”మాట్లాడు మాట్లాడు ” తొందర చేసాడు .
ఊరుకోరా అన్నట్లు చేయి ఆడించాడు ,
”హలో ఎవరు ?” అవతలనుండి ఆడ గొంతు .
”నేను ఎవరైతే ఏంటి ? చెప్పేది విను ” కటినంగా అన్నాడు కోర మీసం
”నువ్వు ఎవరో తెలీకుండా నేను వినడం ఏమిటి? వెధవ మొహం నువ్వూను ”
విసుగ్గా అంది అవతలి గొంతు
ఎలా తెలిసిందబ్బా !మనసులో అనుకోని
”నాది వెధవ మొహం అని నువ్వు చూసావా? చెప్పేది వినకపొతే”
“నీకే నష్టం ” అన్నాడు
”సరే ఏడువు ”
పెద్దగా నవ్వాడు .
”పెట్టేయ్యమంటావా ?” వటాలి నుండి అసహనం
”కాదు కాదు ఉండు ఉండు . చెప్పేస్తాను .
నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ”
”ఉంచుకో . దానికి నాకు చెప్పడం ఎందుకు ?”
ఛీ ఛీ బ్లాక్ మెయిలర్స్ కి వాల్యు లేకుండా పోయింది . పళ్ళు పట పటలాడించాడు .
”బటానీ లు నమిలే శబ్దం అంటే నాకు అసహ్యం ” అంది ఆమె .
”సరే పాయింట్ కు వచ్చేస్తున్నా, నీ ఫోటోలు మామూలువి కాదు
“బెత్తెడు బట్టలతో , అసలు లేకుండా ఉండేవి నా దగ్గర ఉన్నాయి ”
”అయితే ఏమి చేస్తావు ?” ఆమె గొంతులో కొంత మెత్తదనంతో
కోర మీసానికి ధైర్యం వచ్చింది .
”మర్యాదగా నేను అడిగిన డబ్బులు ఇయ్యకపొతే ,ఈ ఫోటోలున్న మెమరీ కార్డ్ మీ అమ్మా నాన్నలకు పంపెస్తాను ”
”పంపుకో ! వాళ్లకు పంపితే ఏమవుతుంది ? వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి సాకారు కదా ” చెప్పింది
కోర మీసం మొహం లో కంగారు ,”ఏమైంది ?” అడిగాడు పులిపిరి .
ఇష్ వేలుతో సైగ చేసాడు
”సరే అయితే ఇంటర్ నెట్ లో పెట్టేస్తాను . మొత్తం ప్రపంచం నీ దేహాన్ని చూస్తుంది ”
” నీ మొహం ఇలాంటి ఫోటోలు లక్షలు ఉన్నాయి అక్కడ . ఇవి ఎవరికి తెలుస్తాయి . ఎవరు చూస్తాడు . అయినా ఫోటో షాప్ ఇప్పుడు అందరికి వచ్చు . నేను ఎవరికి తెలుసు ?” కేర్ లెస్ గా ఉంది అమ్మాయి గొంతు .
కోర మీసానికి కంగారుగా ఉంది . చేతులు చల్లబడుతున్నాయి .
ఈ డబ్బులు మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు .
పక్క నున్న పులిపిరికి వీడి స్థితి చూసి కంగారుగా ఉంది .
రిసీవర్ లాక్కున్నాడు .
”చూడు పాప! ఇవన్నీ నీ లవర్ కి పంపిస్తాము ” చెప్పాడు పులిపిరి .
” నువ్వు ఇంకొకడివా !ఎవరైతే ఏంటి , ఎన్నో లవర్ కి పంపిస్తావు ? ”
” 93 వాడికి !” చెప్పాడు గట్టిగా
”కావాలి అంటే 95 కు పంపు . 93 కి వద్దు ” కంగారు అమ్మాయి గొంతులో .
అలా రా దారికి , మమ్మల్నే బెదిరిస్తే మేము ఏమి కావాలి అనుకున్నాడు
మనసులో పులిపిరి .
”కుదరదు 93 కె పంపిస్తాము ”
”వద్దు అలా చేయొద్దు . నా మేకప్ కిట్ మైంటైన్ చేసేది వాడే .
సరే యెంత డబ్బు కావాలో చెప్పు . ఇస్తాను ”
”అలా రా దారికి ” పక్కకు చూసాడు కోర మీసం వైపు , వాడింకా పిచ్చి చూపులు చూస్తున్నాడు .
”వంద లక్షలు కావాలి.. అదీ రేపటికల్లా ” చెప్పాడు పులిపిరి .
”వాట్ ”
”వాట్ లేదు ఏమి లేదు వంద లక్షలు ఇయ్యాక పొతే తెలుసు కదా ఏమి జరుగుద్దో !” అన్నాడు .
”అసలు వంద లక్షలకు ఎన్ని సున్నాలో తెలుసా నీకు ?”
”ఒక్క నిముషం ” పక్కకు చూసాడు అడుగుదాము అని
“అలాగే” ఉన్నాడు కోర మీసం
”సరే తరువాత ఫోన్ చేసి చెపుతాను ” అన్నాడు

”’ఏమిటి ?”
”ఎన్ని సున్నాలో ” పెట్టేసాడు .

******************

కోర మీసానికి తెలివి వచ్చేసరికి ఎదురుగా పులిపిరి కాళ్ళు చాపుకొని , చేతి వెళ్ళు కాలి వెళ్ళు లెక్క పెడుతూ
నేల మీద సున్నాలు వ్రాస్తూ కనిపించాడు .
ఏమైంది వీడికి ? మెంటల్ ఎక్కిందా ? ఏమో అ పిల్ల దెబ్బకి ఎక్కేసుంటుంది .
” ఏమి చేస్తున్నావు రా ?” అడిగాడు
”ఒకటి రెండు ఆరు ….. కాదు ఐదు ” లెక్క పెడుతూ, గొంతు విని పక్కకు చూసాడు .
”రా రా నీ కాళ్ళు చాపు , నీ కాలి వేళ్ళు కూడా కావాలి ”
”దేనికి రా ?”
”వంద లక్షలకు ఎన్ని సున్నాలో లెక్క పెడుతున్నాను ”
” దేనికి ? ”
” ఆ అమ్మాయి అడిగింది . చెప్పేస్తే డబ్బులు ఇచ్చేస్తుంది ”
మళ్ళీ కోర మీసం కాలి వెళ్ళు కూడా లెక్క పెడుతూ చెప్పాడు .
”లాభం లేదురా ఏమి చేద్దాము ? ”
”ఐడియా ” చెప్పాడు కోర మీసం .
”ఏడువు ”
” మా లెక్కల అయ్యోరిని అడుగుతాను ”
”సరే అడుగు ” చెప్పాడు పులిపిరి
ఫోన్ పెట్టేస్తున్న కోర మీసాన్ని చూస్తూ అడిగాడు పులిపిరి
” ఏమన్నాడు ? ఏమన్నాడు ?”
”స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అన్నాడు ”
”హ్మ్ కనుక్కోలేక పోయావు అన్న మాట ”
”నేను ఒదులుతానా ? సార్! నా జీవితం దీని మీదే ఆధార పడి ఉంది అన్నాను . చెప్పేసాడు ”
”సరే చెప్పు ”
” నీకు కాదు ఆ అమ్మాయికి చెపుతాను . డబ్బు ఎక్కడికి తీసుకుని రావాలో కూడా చెపుతాను ” అన్నాడు కోర మీసం
”ఒక్క నిముషం ” ఆపాడు పులిపిరి
జేబులో చిల్లర, నోట్లు నేలపై పోసి రూపాయలు , రెండు రూపాయలు చిల్లర నోట్లు విడదీసి పోగులు పెట్టాడు .
”ఏమి చేస్తున్నావురా ? ”
ఆగమని ”పది , పది , పది , నాలుగు , మొత్తం ముప్పై నాలుగు రూపాయలు ” చెప్పాడు .
”ఇప్పుడు ఇది దేనికి ?”
”దేనికి ఏమిటి ?ఇంతే మన దగ్గర ఉండేది . పదిహేను రూపాయల టికట్ లో ఉండే ప్లేస్ చెప్పు . లేకుంటే డబ్బులు చాలవు వెళ్ళడానికి ,ఇంకా ఫోన్ కూడా నాలుగు రూపాయలు లోనే మాట్లాడాలి జాగ్రత్త ” చెప్పాడు పులిపిరి
”శేబాష్ఔ వీపు తట్టాడు . ఫోన్ రింగ్ చేస్తూ
”ఎవరు ”అదే ఆడగొంతు ఆత్రుతగా.
”నువ్వు అడిగింది చెపుతాము ” చెప్పాడు కోర మీసం
”ఏమిటది ?”
”వంద లక్షలకు ఎన్ని సున్నాలో ”
”అది ఇప్పుడు ఎందుకు ?”
”అడిగి కనుక్కునాక ఎందుకు అంటే ఊరుకొనేది లేదు వినాల్సిందే ”
”సరే ఏడువు ”
ఛీ ఛీ బ్లాక్ మైలర్స్ విలువ లేకుండా పోయింది .
ఇక ఈ బతుకు బతకడం కష్టమే !
” లక్షకు ఉండే సున్నాల పక్కన ఇంకో రెండు పెట్టుకో ”
గర్వంగా అన్నాడు
”మరి లక్షకు ఎన్ని? ” అడిగింది
”ఇంక కనుక్కొనే ఓపిక లేదు , మర్యాదగా మేము చెప్పిన చోటుకు తీసుకొని రాక పోయావో నీ బొడ్డు పక్కన పుట్టు మచ్చ ఫోటోలు నీ 93 ప్రియుడికి పంపెస్తాము , జాగ్రత్త ”
”ఎక్కడ పుట్టు మచ్చ ? ”
” చెప్పను . ఇక్కడ ఫోన్ బిల్లు నాలుగు రూపాయలు కావొస్తుంది . ఫలానా ప్లేస్ కి వచ్చెయ్యి . పోలీసులకు
చెప్పావో ! జాగ్రత్త ” పెట్టేసాడు ఫోన్
**********
”అయితే డబ్బులు ఇస్తాను రమ్మని పోలీసులకు పట్టించింది అన్న మాట ”
పక్కన ఖైది జాలిగా అడుగుతుంటే భోరు మన్నారు పులిపిరి , కోరమీసం
”కాదన్నా ”
” మరేం జరిగింది ”
ఒక్క సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళారు .
బస్ స్టాప్ చివర ఉన్న రెడ్ చున్నీ దగ్గరకు వెళ్ళాడు
కోర మీసం ”డబ్బులు తెచ్చావా ?” అడిగాడు
”ఫోటోలు ఉన్న మెమరీ కార్డ్ తెచ్చావా ?”
చూపించాడు .
అంతే !ఒక్క సారి మైండ్ బ్లాక్ అయిపొయింది
చేతిలోని బ్రీఫ్కేస్ తో ఆ అమ్మాయి ఒక్కటి ఇచ్చేసరికి
అడ్డం వచ్చిన పులిపిరి కి కూడా నాలుగు తగిలాయి
ఇద్దరినీ కింద పడేసి కాళ్ళతో పొట్టలో తంతూ ”రేయ్ ” ఊగిపోతూ కాళ్ళతో , బ్రీఫ్కేస్ తో ఎడా పెడా
తంతూ ఉంది
” వెదవల్లారా రాఘవేంద్రరావుకు పంపుదాము అని నేను చేయించుకున్న ఫోటో షూట్ కాపీతో నన్నే
బ్లాక్ మెయిల్ చేస్తారా ?”
ఆగకుండా ఒకటే తన్నులు
”అన్యాయం ,బ్లాక్ మెయిలర్స్ ని పోలీస్ లకు పట్టించాలి కాని ఇలా మొగుడ్ని తన్నినట్లు తన్నడం చట్ట రీత్యా నేరం ” కోర మీసం
మళ్ళీ గుద్దులు
”పోలీస్ పోలీస్ ” అరిచాడు పులిపిరి
హ్మ్ ….. పోనీండి కధ సుఖాంతం అన్నాడు ఖైది.
”’అవును ” ప్లేట్ లో సాంబారు జుర్రుకుంటూ చెప్పారు ఇద్దరు
@@@@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *