May 1, 2024

ఓ చెట్టు పజ్యం

రచన: శ్రీనివాస్ వాసుదేవ్

images
ఒళ్ళంతా పూలుచేసుకుని, మరి
కళ్ళకెదురుగా ఎప్పుడూ అక్కడొక గంభీరమైన చెట్టు
హాయిగా, వర్షించినప్పుడల్లా స్నానిస్తూ!
ఆకులల్లాడినప్పుడల్లా ఓ ఆకుపాట పరిభాష
ఎగిరిపోతున్న పక్షులని పిలుస్తున్నాయనే అమాయకత్వం
ఆకుచివర్ననుంచి పడుతున్న ప్రతీ బొట్టూ నాలోని ఘనీభవించినదేదో
వెతికి మరీ బయటకులాగినట్టు….తడిమినట్టూ
బొట్టుకొక కహానీ, కహానీకొక కలలాంటి కవిత
కొన్ని కుర్రబెంగలనెప్పుడూ ఓదార్చే ఆ చెట్టంటే నాకు
ఓ మూర్తిమంతమైన అమూర్తభావన
***
దుర్జనలో, సజ్జనలో ఆమె నీడలో మనసుదాచుకున్న మనుషులెందరో
క్రిమికీటకాదుల బాధలేదామెకు, పక్షుల ఆవాసాల గురించి తప్ప
మనుషుల దాడిలో నొచ్చుకున్నా, పిల్లలే కదా అన్న ప్రేమా లేకపోలేదు
“మనిషిని ప్రేమగా చూడ్డమే నా జీవితం”
ఇదొక్కటె ఆమెలో రోజూ కన్పించే సవ్వడుల తాత్పర్యం
సూర్యుణ్ణీ చూసి దేవుడనుకుని నమస్కరిస్తుందో
చంద్రుణ్ణి చూసి మనిషికి ఇతడు కావాలనుకుని వేడుకుంటుందొ కాని
ఎప్పుడూ ఆకాశం వైపే మొగ్గుచూపుతూ ఎదుగుతూనే ఉంటుంది
కానీ తనపిల్లల్ని మాత్రం భూమివైపే వెళ్ళమంటుంది
వయసుచూసింది కదా మరి
***
ఆ మాహావృక్షంలో వక్షమెక్కడో, నడుమెక్కడో వెతికే ప్రయత్నంలోనే
జీవితమంతా సుగంధమయమని బ్లిస్ఫుల్ ఫీల్
ఇంత నగ్నత్వంలోనూ ఎన్ని ఆచ్ఛాదనలో అన్న అసూయా
ఏంచేస్తుంటూంది రాత్రంతా ఈ చెట్టులాంటి మనిషి
ఒడలంతా పూసుకున్న మంచుతుమురుతో
కలలు కనని రాత్రులతో తొలివేకువ మయూఖాలకై ఎదురుచూపులా?

images2

నిన్ననే తెల్సింది
“ఇక నేనుండనని–
రేపోమాపో నన్నునేలకొరిగేస్తారని
మోడువారాననీ, ఎప్పుడైనా ప్రమాదమనీ ఎవరో అన్నారంట
ఇక వారి కత్తి నాదేహంపై పడటమే ఆలస్యమనుకుంటా
ఏమో ఎక్కడ తేల్తానో,
పొయ్యిలోకో, ద్వారబంధానికో
ఏ మహాపురుషుడి పాడెపైనో
ఓ నలుగురి భుజాలపైనో”
***
ఇక నాకు మిగిలేది
మనిషిలేని ఓ ఖాళీ ఈజీ చెయిర్ లాంటి దృశ్యం
క్షమించు మిత్రమా, నిన్ను కాపాడుకోలేనేమో!

***

(బెంగుళూరు మహానగరంలో చెట్లకి కొదవలేదు. కొన్ని మహా ముసలి చెట్లూ, మరి కొన్ని నవయవ్వనంతో వయసు గాంభీర్యంతో ఊగిసలాడేవి. ఆ చెట్లే ఈ నగరాన్ని సిటీ ఆఫ్ గార్డెన్స్ అని పిలవబడేలా చేసాయంటే అతిశయోక్తి కాదేమొ. దేశంలో ఉన్న నగరాలన్నింటిలోనూ ఎండాకాలంలోనూ కాస్తో కూస్తో చల్లగా ఉండె బెంగళూరు సిటీ ఓ అద్భుతం. ఎండ తాపానికి భయపడే నాలాంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వటానికి ప్రధాన కారణమయిన చెట్లంటే నాకు ఇష్టం. ఇక్కడ ఓ కానూన్ ఉంది. ఇక్కడున్న నగరపౌరులెవ్వరూ ఈ చెట్లని ఆస్వాదించాలే కానీ వాటిపై చెయ్యేసే అవకాశం కూడా లేదు.
ఐ మీన్ కనీసం ఓ కొమ్మని కూడా కొట్టటానికి వీల్లేదు. అలా ఓ కొమ్మని నరికిన మరు రోజు మనం కోర్ట్ లో ఉంటాం…సో
ఓ చెట్టు వృధ్యాప్యంలోకొచ్చి మన ఇంటికో, మనింట్లో వారి ప్రాణానికో నష్టమని తలచి మున్సిపాలిటీ వారికి చెప్తే వారే వచ్చి ఆ “ముసలి” చెట్టుని నరికి పోతారు. అలా జరిగిన ఓ సంఘటన నేపధ్యమే ఈ కవిత….)

09bgtree_cutting_1138166f

కానీ ఈ మధ్య ఈ నగరంలో జరుగుతున్న సంఘటనలు మరింత అలజడికి కారణమయ్యాయి. టింబర్ మాఫియా చేతుల్లో ప్రభుత్వం బానిసయ్యాక ఓ ఆరు కిలోమీటర్ల అనవసర ఫ్లై ఓవర్ కోసమని కొన్ని వేల చెట్లు నరికిస్తున్నారు ప్రభుత్వమే! ప్రభుత్వమే చెట్లని నరికిస్తుందనడమంటే ప్రకృతినీ దానీ అందాలపై అఘాయిత్యం చెయ్యడమే! దాన్ని అడ్డుకునే భాగంలో నా బోటివాళ్ళందరూ ఓ హ్యూమన్ చెయిన్ అయి మరీ ఈ ఘోరాన్ని ఆపే ప్రయత్నం చేసాం–కానీ మా గోడు పట్టించుకునేవాడెవ్వడు? ఇక్కడె కాదు ఈ దేశంలో ఇలాంటి అకృత్యాలన్నీ జరుగుతూనే ఉంటాయి. మేం ఇలా రాస్తూనే ఉంటాం. చెట్లూ నరకబడతాయి, మనుషులూ జ్వాలాజిహ్వ నరకంలోకి నెట్టబడుతూ ఉంటారు. అక్కడే చెట్ల రక్త రసిలో మమ్మల్ని మేం వెతుక్కుంటూ ఉంటాం……..

1 thought on “ఓ చెట్టు పజ్యం

  1. తన ఇష్టంతో ఆపలేని అనుభవాన్ని తన హృదయం లోతుల్లోకి అనువదించుకొనేందుకు కవి వారు చేసిన ఈ అద్భుతం రీడర్ ని అందులోకి సాక్షిలా తీసుకెళ్ళిపోవడం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెందవచ్చు… వండర్ఫుల్ సర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *