May 1, 2024

మాటల మనిషి కాడీయన, చేతల మనిషి! -ముఖాముఖి

నిర్వహణ: శ్రీసత్య గౌతమి పి.హెచ్.డి.

మాటలమనిషిని కాను, చేతల మనిషిని అంటూ డబ్బుకు వెరయక తనదనే శైలిలో “శ్రమదానం” అంటూ మార్గమేసిన మార్గదర్శి శ్రీ గంగాధర్ తిలక్ కాట్నంగారితో మెన్స్ డే సంధర్భంగా నా ముఖాముఖి.

ప్రొద్దున్న లేస్తూనే అలవాటుగా ఎప్పుడూ ప్రక్కనే ఉండే సెల్ ఫోన్ మీదకి దృష్టి సారించాను. దాంట్లో మొదటి మెసేజ్ జ్యోతీవలబోజు గారిది. మాలిక “మెన్స్ డే” వార్షికోత్సవం జరుపబోతోంది. ఒక స్పెషల్ కేటగిరీ పెర్సన్ ది ఇంటర్వ్యూ తీసుకొని మాలికకు పంపగలవా, ప్రచురిస్తాను అని.
వెంటనే నాకు మెదడులో వెలిగిన వ్యక్తి గంగాధర్ గారు. అక్కడినుండి ఇంటర్వ్యూ ఇలా …

14803050_971988499578233_929234193_o

గౌతమి: హలో సార్. హౌ ఆర్ యూ?

గంగాధర్: ఐ యాం ఫైన్. మీరెలా ఉన్నారు?

గౌతమి: బావున్నామండి. మీరు అమెరికాలోనే ఉండడంతో త్వరగా కనెక్ట్ అవ్వగలిగాను. అదే మీరు హైదరాబాదులో ఉండి ఉంటే నేను ఫోన్ చేసే టైంకి ఏ ట్రాఫిక్కులో ఇరుక్కునో, శ్రమదాన కార్యక్రమాల్లోనో బిజీగా వుండి దొరక్కపోయేవారు నాకు.

గంగాధర్: హ హ హ. కార్యక్రమాలన్నిటినీ తమ్ముడికి అప్పజెప్పొచ్చాను. కేవలం ఫోన్ల మీదే నా కార్యక్రమం అంతా ప్రస్తుతానికి.

గౌతమి: మన నాయకులే గాదు, అసలు ప్రజలు కూడా ఎప్పుడూ నిర్మాణాత్మక చర్యల గురించే ఆలోచించి పాటుపడుతున్నారుగానీ, మీలా పాడయినదాన్ని బాగుచేసుకోవడం అనే కాన్సెప్ట్ ని ఎవరూ కలిగిలేరని ఘంటాపదంగా నేను చెప్పగలను. ఇది నాకు చాలా బాగా నచ్చిన అంశం మీలో. అందుకే మీ ఆలోచన్ల, ఆచరణల గురించి కొన్ని ప్రశ్నలను అడిగుదామనుకుంటున్నానండి.

గంగాధర్: తప్పకుండా అమ్మా …నాకస్సలు రాజకీయాల్లోకి రావాలని లేదు, ఎవరిదగ్గిరా డొనేషన్స్ తీసుకోవాలని కూడా అనుకోవడంలేదు. అందువల్ల హైదరాబాద్ రోడ్లను పాడయిన చోట నా స్వంత డబ్బుతో బాగుచేస్తున్నాను.
గౌతమి: అదే చాలా విచిత్రమైన అంశం సార్. అసలు మనిషి సర్వకాల సర్వావస్థలయందు డబ్బుకూడబెట్టుకునే విషయంలో బిజీగా వుంటే … అదొక్కటే కాదు మన్సిపాలిటీకి గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నా కూడా చేపట్టని కార్యాల్ని అంత సింపుల్ గా మీరెలా సాధించేశారు? మీలో ఈ రెండు అంశాలు ఎవరినైనా ఆశ్చర్యపరిచే విషయాలు.

గంగాధర్: (మళ్ళీ నవ్వు). నేను నా పెన్షనంతా ఈ కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నానమ్మా. ఇంటిని నా కొడుకు చూసుకుంటున్నాడు. ఈ రోడ్లమీద గోతులవల్ల ఏ మనిషయినా యాక్సిడెంట్ కు గురయ్యి ప్రాణాలు కోల్పోతే అతని మీద ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి? అనేటటువంటి ఆలోచన నన్నీ పనికి పురికొల్పింది.

గౌతమి: ఊ… మీరా నిర్ణయం తీసుకోవడానికి ఏవైనా సంఘటనలు జరిగాయా?

గంగాధర్: నేను సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో సిగ్నల్ ఇన్స్పెక్టర్ గా పని చేసి రిటైర్ అయ్యాను విజయవాడనుండి. 2010 లో సాఫ్ట్ వేర్ డిజైన్ ఇంజినీర్ (కన్సెల్టంట్) గా, ఇన్ ఫోసిస్ కంపెనీలో (మణికొండ బ్రాంచ్) ఉద్యోగం వస్తే హైదరాబాద్ వచ్చి, అక్కడే సెటిల్ అయ్యాను. రోడ్ల మీద గతుకుల్లో నీరు బాగా నిలిచి ఉంది. మొదటిరోజు కారులో ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నా కారు ఆ గతుకుల్లో పడి వెళ్తుండగా ప్రక్కనుండి పోతున్న పిల్లల మీద బురద పడి వాళ్ళ బట్టలు ఖరాబయ్యాయి. పాపం వాళ్ళు అలాగే దులుపుకుంటూ నాకేసి అలా చూసి వెళ్ళిపోయారు “ఇది మామూలే” అన్నట్లు. ఆ సంఘటన నన్ను చాలా వేధించింది.

13438963_889849617792122_3528051735674119124_n

మరుసటిరోజే 6 ట్రక్కుల మట్టిని కొని మూడువందల మీటర్ల దూరం వరకు పూడ్చుకుంటూ వెళ్ళాను. ఇది ఆ పిల్లల్లో ఎవరో చూసి మిగితా పిల్లలకి చెప్పినట్లున్నారు. వాళ్ళు నా కారు దగ్గిరకి వచ్చి అభిమానంగా మాట్లాడి, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు. ఆ పసిమనసులని చూసాక ఎంతో ఇదిగా అనిపించింది. ఆ వయసులో వాళ్ళు చూసినది నమ్ముతారు, ఆ నిజంలోనే బ్రతుకుతారు వాళ్ళకి రాజకీయాలేమీ తెలియవు.

కొన్ని వారాలయ్యాక లంగర్ హౌస్ దగ్గిర ఒక యాక్సిడెంట్ చూశాను. ఒక బైకర్ తన దారిలో వచ్చిన ఒక గోతిని తప్పించడానికి ఒక షార్ప్ రైట్ టర్న్ తీసుకొని అట్నుండి స్పీడుగా వస్తున్న కారుకు గుద్ది కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్నాడు. అక్కడికి వచ్చిన పోలీసులు యాక్సిడెంట్ జరిగింది అని వ్రాసుకుంటున్నారే తప్పా… ఈ గోతుల వల్ల జరిగిందని మాత్రం వ్రాయటంలేదు. నేను వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసాను, ఎఫ్.ఐ.ఆర్ లో ఈ గోతులవల్ల జరిగిందని వ్రాసి, సంబంధిత జి.హెచ్.యం.సి/పి.డబ్ల్యూ.డి ఇంజినీర్స్ ద్వారా ఈ గోతులను పూడ్పించమని. కాని వాళ్ళు వినలేదు.
దీని తర్వాత మరో యాక్సిడెంట్ కూడా చూసాను మరోచోట. ఆర్.టీ.సీ బస్ కి గుద్దేసి ఒక వ్యక్తి మరణం.

ఇవన్నీ చూసాక, వీటన్నిటికీ కారణం రోడ్లు బాగుకు నోచుకోకపోవడమే. దీనివల్ల మనుషులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా రోడ్ల మీద గతుకుల వల్ల … రోజూ బళ్ళ మీద ప్రయాణించే వాళ్ళు శరీరంలోపల వాళ్ళకి తెలియకుండానే ఆ కుదుపులకు అంతర్గాయాలకు గురవ్వొచ్చు. దీనంతటికీ కారణం ఒకటే ప్రజలయొక్క దృష్టి బాగుచేసుకోవడం మీద లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో అధికారులులేరు. ఓకే… పరిస్థితి నాకర్ధమయ్యింది
కాబట్టి నాకు చేతనయినది నేను చేస్తాను నా డబ్బు, నా శ్రమ ఉపయోగించి అని నిర్ణయించుకున్నాను.

గౌతమి: మరి దీనికి స్టార్టింగ్ మెటీరియల్ ఏమి తీసుకున్నారు?

గంగాధర్: ఓల్డ్ రోడ్ రిమూవ్డు తార్ ముక్కలు కలెక్ట్ చేసానమ్మా. చేసి ఈ గోతుల్లో వేసాను. దానిపైనుండి వాహనాలు పోగానే నిముషాల్లో చక్కగా అణిగి కూర్చుంది. అక్కడితో ఆ గొయ్యి పూర్తిగా పూడిపోయింది. ఇక అప్పటి నుండి కార్లో కొన్ని గోనెసంచులు, పార అంతా పెట్టుకొని వెళ్తుండేవాడిని. ఎక్కడా ఏ రోడ్డుపక్కన ఇటువంటి డెబ్రిస్ కనబడినా వెంటానే సంచుల్లోకి ఎత్తుకుండేవాడిని (నవ్వు)

గౌతమి: (నవ్వు) బావుంది. మరీ ఇంట్లోవాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మీరు చేసే వాటికి?

గంగాధర్: (మళ్ళీ నవ్వు) ఇంట్లో ఎక్కడయినా చిన్నది సరిగ్గా లేకపోతే అక్కడికి పోనే పోరు, చెయ్యిపెట్టరు. మరి ఈ రోడ్లమీద చేతులు పెట్టి అవన్నీ తీస్తారేమిటీ అని మా భార్య ఒకటే గోల.

గౌతమి:హహహ … మరి మీరిలా ఎన్నాళు కొనసాగించారు మీకు మీరుగా? కమీషనర్ తో మాట్లాడలేకపోయారా?

గంగాధర్: నేనలాగే ఒక సంవత్సరం వరకూ కొనసాగించాను. మధ్యలో లంచ్ టైంలో కూడా వెళ్ళి గోతులను మూసి వచ్చేవాడిని. ఆ తర్వాత ఉద్యోగం మానేసాను. నాకు ఒకటే మనసులోకి వచ్చేసింది. నెల 30 రోజులూ ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి 70,000 జీతం తీసుకెళ్ళి ప్రమాదానికి గురయ్యిన మనిషికి, ఆ మనిషి కుటుంబానికీ నేనిచ్చినా కూడా వాళ్ళ సమస్య శాశ్వతంగా తీరదు. అదే నెల 30 రోజులూ ఈ శ్రమదానం చేసి 30 పాట్ హోల్స్ ని పూడిస్తే కొన్ని వందల కుటుంబాలను రక్షించగలను అనేటటువంటి ఆలోచన రాగానే ఇక ఉద్యోగంలో ఉండలేకపోయాను.

కానీ ఉద్యోగం మానేయడం వల్ల ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యాను. ముఖ్యంగా నా ఇన్ష్యూరెన్స్ పాలసీలన్నీ స్టేక్
లో పడ్డాయి. దాచుకున్న సేవింగ్స్ కూడా నా ఆశయం కోసం వాడేసాను, పైగా మండే ఎండలో పాటుపడుతున్నాను. ఇక ఇది చూడలేక నా భార్య అమెరికాలోఉన్న నా కొడుక్కి నా మీద ఫిర్యాదు చేసింది (నవ్వు). రిటైర్ అయ్యాక ఇలాంటి కష్టమైన పన్లు ఎండల్లోపడి చేస్తే ఏమవ్వాలి … వెంటనే మానిపించమని!

కొడుకు అమెరికా నుండి ఇండియా వచ్చినప్పుడు, నా పన్లకు కొంచెం అడ్డుపడుతూ శతవిధాలా మానిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో మేమిద్దరం అక్కడే రోడ్డు మీద ఉంటుండగానే గచ్చీ బౌలీ దగ్గర ఈ గోతుల వల్లే యాక్సిడెంట్ అయ్యింది ఒక వ్యక్తికి. అది చూసి నా కొడుకు కూడా నాతో ఇది మానిపించేయాలనే ఆలోచనను మానుకొని, నాకు సహకరించడానికి పూనుకున్నాడు. ఇది 2012 లో జరిగింది.
14799760_971988929578190_2078074317_o

దీని తర్వాత నా కొడుకు నన్ను కూడా తీసుకొని GHMC కమీషనర్ ని కలిసాడు. పరిస్థితులన్నీ వివరించాడు, నేను వాళ్ళ మాట వింటం లేదని కూడా వివరించాడు. అప్పుడు కమీషనర్ వెంటనే ఆర్డర్స్ తయారు చేయించాడు. ఎక్కడ పాట్ హోల్స్ (గోతులు) కనిపిస్తే అక్కడికి వెంటనే మెటీరియల్ నాకు సప్ప్లై చెయ్యడానికి. అలాగే నేనెక్కడ పాట్ హోల్
ఉందో వాళ్ళకి ఇన్ ఫాం చెయ్యగానే మ్యునిసిపాలిటీ వాళ్ళు అక్కడికి మెటీరియల్ తెచ్చి ఇచ్చేసేవారు. నేను శ్రమదానం చేసేవాడిని.

గౌతమి: చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అండి. మరీ ఇలా రెండేళ్ళు శ్రమిస్తున్నా మీకు అండగా ప్రజలు గానీ, ప్రజా సంస్థలు గానీ ముందుకు రాలేదా?

గంగాధర్: రాలేదమ్మా. అలా చూసేవారు కుర్రాళ్ళందరూ.

గౌతమి: ఏంటంటారూ? కాన్సెప్ట్ అర్ధం కాక? లేజీనెస్ వల్లా?

గంగాధర్: లేజీ గా తయారవ్వడానికి మన వ్యవస్తే కారణం. ఎందుకంటే నిస్వార్ధంగా పనిచెయ్యడానికి కుర్రాళ్ళు వస్తారు, రారని కాదు. రాకుండా నాయకులు, వ్యవస్థే తయారుచేస్తున్నది. ఎలా అంటే… నిస్వార్ధంగా పనిచేసే కుర్రాళ్ళని ఉపయోగించుకొని పని చేయించుకొని పేరు వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు. పార్టీనాయకులూ అంతే, మా పార్టీ చేసిందంటారు. అందువల్ల ఎవరూ ముందుకు రావడం లేదు.

గౌతమి: ఊ.. పేరుకి ఇది డెమాక్రటిక్ దేశమైనప్పటికీ, ట్రూ డెమాక్రసీ లేదు, ఇంకా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ.
పోనీ సోషల్ వర్కర్స్ అయినా ముందుకు రాలేదా?
గంగాధర్: మొదట్లో కుర్రాళ్ళెవరూ రాలేదమ్మా. మెల్ల మెల్లగా రావడం, నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళని మోటివేట్ చేసి … ఎక్కడెక్కడికో ఎవరూ వెళ్ళిపోవక్కర్లేదు మీరు నివసించే పేటల్లొనే ఎన్నో అవసరాలుంటాయి. అవన్నీ స్వయంగా మీరే చేసుకోండి అని చెప్పి పంపేవాడిని. అలా … చాలా గ్రూపులు తయారయ్యాయమ్మా ఇప్పుడు.

సోషల్ వర్కర్లు కూడా ఇప్పుడు ముందుకొచ్చారు సుమన్ సయాని లాంటివారు. తాను కూడా నాతో పాటు శ్రమదానం చేసారు. ఇలా ఇండివిడ్యువల్ గా మొదలుపెట్టినా కూడా … దీనికంటూ ఒక పేరుండాలని ప్రోత్సహించి “శ్రమదాన్” అని నామకరణం చేసారు. దీన్ని అదే పేరుమీద ఎన్.జీ.ఓ/ఎన్.పీ.ఓ. సంస్థ గా రిజిస్టర్ కూడా చెయ్యడం జరిగింది.

14796091_971988982911518_1308245955_o

అంతేకాదు, ఫేస్ బుక్ ద్వారా శ్రమదాన్ కార్యక్రమాల గురించి తెలుసుకొని ఎంతోమంది యువతీ యువకులు, విద్యార్ధులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు ముందుకొచ్చి వారి వారి ప్రాంతాల్లోకూడా సమాజసేవ మొదలుపెట్టారు. ఇది ఇప్పుడు జపాన్, చైనా దేశాలలో కూడా ప్రాకి అక్కడి యువతీ యువకులు కూడా వారి ప్రాంతాలు బాగు చేసుకోవడం మొదలు పెట్టారు. మీడియాకూడా ఈ విషయాలను పరిశీలించి నన్ను వేదికమీదకు పిలిచారు. చలనచిత్ర రంగ ప్రముఖులు శ్రీ అమితాబ్ బచ్చన్ కూడా స్టార్ ప్లస్ టీ.వి. లో నన్ను అభినందించారు.

గౌతమి: చాలా సంతోషమండి. మీ మిషన్ మోడీగారి స్వచ్చ్ భారత్ కి దగ్గిర పోలి ఉంది అంటారా? మీ పద్ధతిలో మీరు సాధించినది వాళ్ళు సాధించిన దానికన్నా ఎక్కవ మోతాదులో ఉందని నమ్ముతున్నారా?

గంగాధర్: స్వచ్చ్ భారత్ అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్. కానీ దాన్ని అమలుపరచడంలో చాలా లోపాలున్నాయి. ఎవరైనా ఫేక్ట్స్ ని ఒక సరియైన వ్యక్తివరకూ తీసుకెళ్తే … దాన్ని అమలుపరచడం చాలా ఈజీ. మోడీ గారు చెయ్యాలనుకునేవి కొన్ని పార్టీ గురించి, ప్రజల వోట్లగురించి ఆలోచించాల్సిన పరిస్థితి కాబట్టి కొన్ని చెయ్యలేకపోవచ్చు.

గౌతమి: మీరు ప్రజలకిచ్చే సందేశం ఏంటి?

గంగాధర్: ఒక నిర్ణీత సిస్టం ని ప్రవేశపెట్టి ఎన్నో డిపార్ట్మెంట్స్ ని కంట్రోల్ చెయ్యవచ్చు. బ్లాక్ మనీ గురించి మాట్లాడుతూ, దాన్ని వెనక్కి ఎలా రాబట్టాలా అనే అలోచిస్తారే తప్పా దేశంలో ప్రతీ నెలా పదింతలవరకూ వృధా అవుతున్న డబ్బు గురించి మాత్రం పట్టించుకోవడంలేదు. ఈ వృధాని నియంత్రిస్తే చాలా మంచి ఫలితాలనిస్తుంది. నిజానికి ఎంతో మంది మంచివాళ్ళున్నారు, ఏమయినా చెయ్యాలని ముందుకొచ్చే వాళ్ళున్నారు. కానీ ఎక్కడ ఎటువంటి విమర్శలకు గురయ్యి ఏ కష్టాల్లో పడతారో అనే భయం వాళ్ళను కుదిపి ముందుకు రానివ్వకుండా చేస్తున్నది. వ్యవస్థలో ఈ భయం అనేది నశించినరోజున చాలా మంచి మార్పులు వస్తాయమ్మా.

మన కళ్ళముందు ఎన్నో సమస్యలున్నవి. ఏ ఒక్కరూ ఆ సమస్యల్ని తీర్చలేరు. కానీ ప్రతి మనిషిలో ఒక నేర్పు, అవగాహన, ప్రతిభ ఉంటాయి. వాటితో పరిష్కారాలకు దారివేస్తూ ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళాలనేది నా ముఖ్య సందేశము. మీరు కూడా రచనలు చేస్తుంటారు, కవితలు వ్రాస్తుంటారు. నేటి సమస్యల్ని, పరిష్కారాల్ని వాటిలో చొప్పించండి. అలాగే ఒకరినుండి ఒకరు చదివి, ఈ నోటా ఆ నోటా పలికి అదే ఒక మిషన్ లా ఏర్పడుతుంది.

గౌతమి: హహహ.. థాంక్స్ అండి మీ సందేశాలకి. చాలా చక్కటి విషయాలు వివరించారు. ఒక మంచి పనికి మీకు మీరుగా మోటివేట్ అవ్వడమే కాకుండా దాన్ని ఒక మిషన్ లా చేసి అందరిలో ఆ ఉత్తేజాన్ని నింపగలగడం చాలా మంచి విషయమండి. అందులోనూ ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నాయి, అటువంటి సమయంలో చాలా స్మూత్ గా మీ మిషన్ ని ప్రజల మధ్య లాంచ్ చేసారు. గొప్ప విషయమండి. మీకు ధన్యవాదాలు. మీకు హ్యాపీ మెన్స్ డే! …

గంగాధర్: థాంక్యూ అమ్మా (నవ్వుతూ)

(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *