April 28, 2024

మాయానగరం – 31

రచన: భువనచంద్ర

ఆనందరావు బోంబేకి వెళ్ళాడు. అందరిలా హోటల్ ఫుడ్డు కాకుండా “సామూహిక వంట ‘ తో విందుని ఇచ్చాడు. మాధవి, శోభ, మదాలస, సుందరీబాయే కాక సౌందర్య, వసుమతి కూడా విందులో పాల్గొన్నారు. ఏ కళనుందో గానీ సుందరీబాయి అందరిలోనూ మామూలుగానే వుంది. అది ఆనందరావుకి చాలా ఆనందాన్నిచ్చింది. “మీకు జాబ్ దొరికింది! మాకు చాలా చాలా ఆనందం ఆనందరావుగారూ, నేనూ ఏదో ఓ జాబ్ సంపాయించుకోవాలి ! ” ఆనందరావుని అభినందిస్తూ అంది మదాలస.
“తప్పకుండా దొరుకుతుంది ” స్నేహం చిప్పిల్లుతుండగా అన్నాడు ఆనందరావు. మాధవి ఇంట్లోనే ఓ పక్క సౌందర్య, వసుమతి కూరలు తరుగుతుంటే , శోభ పచ్చడి దినుసులు మిక్సీ లో వేస్తోంది. సుందరీబాయి లడ్డులూ తయారు చేసే పనిని స్వయంగా తీసుకుంది. అసలు సుందరీబాయికి వంటొచ్చొన్న సంగతి కిషన్ చంద్ జరీవాలాకే తెలీదు. మాధవికి అంతకన్నా తెలీదు. లడ్డులు చేయించడానికి కావల్సిన పచారీ సరుకులూ పాత్రలు కూడా డ్రైవర్ని పంపి తానే తెప్పించుకుంది. అంతే కాదు ” ఆనంద్ జీ.. మీ చుట్టుపక్కల ఆడాలందరూ మీకు టిఫిన్లు అవీ తెగ పంపిస్తుంటారుగా, ఇప్పుడు నేను చేసే లడ్డుల్ని మాంచి స్వీట్ పాకెట్లో పాక్ చేసి వారి నోరు తీపి చేయండి. ” అని కూడా అన్నది. ఇంకేం కావాలీ? ఆనందరావు మహదానంద పడ్డాడు.
“ఇంతకీ మెను ఏంటి తమ్ముడు? ” చనువుగా అడిగింది వసుమతి.
“తరుగుతూనే వున్నారుగా అక్క. ఫస్టు క్లాసైన టమాటా పప్పు, ఎర్రగా వేయించిన బంగాళాదుంప వేపుడు. బెండకాయ పొట్ట చీల్చి ఉల్లి,కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కూరి అందంగా సున్నితంగా కాయలకి కాయల్ని సన్నని సెగ మీద వేయిస్తే .. నా సామి రంగా, అదొకటి కంది పచ్చడి, బ్రహ్మాండమైన ముల్లకాడల చారు ఎలానో వుంటుందనుకోండి .. లోపం రాకుండా వాము గుండ కూరిన మిర్చిబజ్జీలు, పాయసం, పెరుగు! ఇంకేం కావాలి?” నవ్వి అన్నాడు ఆనందరావు.
” ఆ పిచ్చి బేంకు వుద్యోగానికి ఇప్పటికిప్పుడు టాటా చెప్పి హాయిగా మనవూళ్ళోనే ఓ ప్యూర్ వెజ్ రెస్టారెంటు పెడితే యాడాది తిరిగే పాటికల్లా పాతిక మందికి నువ్వే వుద్యోగం ఇవ్వచ్చు. నందూజీ… పెట్టుబడి మొత్తం పైసా వడ్డిలేకుండా నే ఇస్తా! అన్నట్టు నా ‘మోతీలడ్డు ” మెనుతో బాటు చెప్పలేదేం? ” ముగ్ధమనోహరంగా నవ్వి అన్నది సుందరి.
“యీ గుజ్జి(గుజరాతి) కి ఆనందరావు అంటే చాలా ‘ఇది ‘ అనుకుంటా. రెప్పవాల్చకుండా మింగేసేలా చూస్తోంది. ” గుసగుసగా సౌందర్య చెవిలో అన్నది వసుమతి. ఎంత సన్నగా అన్నా, ఆ మాట మిక్సీ వేస్తున్న శోభకి వినిపించనే వినిపించింది. వినగానే టక్కున సుందరి వంక చూసింది. వసుమతి అన్నమాట ముమ్మాటికీ నిజమే. అమితమైన ‘దాహం ‘ తో ఆనందరావు వంక చూస్తోంది సుందరి. శోభ మనసు కలుక్కుమంది.
ఆనందరావు గురించి తాను ఇంకా మాధవితో మాట్లాడలేదు… యీ లోపలే అతనికి ఉద్యోగం వచ్చింది. అతను ఊరు వెళ్ళెమందు మాట్లాడటం ఏం బాగుంటుంది? మెల్లగా చెబుదామనుకుంటే యీ సుందరి చూపులొకటీ. సుందరి మనస్తత్వాన్ని శోభ కూడా బాగానే అంచనా వేసింది. ఆమె అహంకారమూ, మొండితనమూ, కూడా కొద్దో గొప్పో శోభకి తెలుసు. తెలీనిదల్లా అతనికీ, సుందరిబాయికి జరుగుతున్న కోల్డ్ వార్ గురించి.
“మీరుంటే ఏదో తెలియని ధైర్యంగా వుండేది ఆనందుగారు. మీరు వెళ్ళిపోతారంటే ఎందుకో.. దిగులుగా వుంది. ” అన్నది మాధవి.
“ఆ మాట నిజమే అక్కా… నేనూ మళ్ళీ చదువు మొదలుపెడతాననగానే మొత్తం పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. నిష్కల్మమైన మనిషి, నిష్కల్మమైన ప్రవర్తనా ” అన్నది మదాలస.
“మీరు బయటకి చెప్పారు, నేను చెప్పలేకపోతున్నా, తేడా అంతే, కానీ, దూరమయ్యేది దగ్గర అవ్వడానికేగా” గుంభనంగా అన్నది సుందరి.
“ఏమిటీ.. గువ్వా గోరింకతో పాటలో లైను .. దూరముంటానులే దగ్గరయ్యేందుకు ‘ లాగానా ” నవ్వింది సౌందర్య.
“ఓ.కె.. ఓ.కే.. ఆల్ ద లెజండరీ లేడీస్ , ఇదిగో నేను వంటలో దిగుతున్నా ” గరిట పట్టుకొని అన్నాడు ఆనందరావు.
************************
వెంకటస్వామి అయోమయం వున్నాడు. మొదట్లో ‘డబ్బు సంపాదించడం ‘ తప్ప అతనికి మరో యావ లేదు. నందినిని లేపుకుపోవడం కూడా ఆమె నగల కోసమే కానీ, చచ్చేంత ప్రేమతో కాదు. నిజం చెబితే డబ్బు మీద వ్యామోహం , నందిని శరీరం మీదున్న వాంఛ తప్ప ‘ప్రేమ ‘ స్పర్శ అతని హృదయాన్ని తాకలేదు.
ఫాదర్ డేవిడ్ తో వున్న కొద్ది పరిచయమూ అతనిలో కొంచం మార్పు తెచ్చిన మాట వాస్తవం. మరో విధంగా చెప్పాలంటే పరమశివం మానసిక వికళాంగుడు కావడం అతన్ని ఒకరకమైన ఆలోచనలో ముంచింది. తన వల్లనే ఒకడు జీవితాంతం ఇతరుల మీద వారి దయాదాక్షిణాల మీద బతకాల్సి రావడం వల్ల వచ్చిన పశ్చాతాపమూ కావొచ్చు. మనసు ఎంత తొందర చేస్తున్నా , అతను మహదేవన్ ని మోసగించి నందినితో ఉడాయించే ప్రయత్నం చెయ్యలేకపోతున్నాడు.
కానీ తను తొందర పడకపోతే తండ్రీ కూతుర్లు కేరళకి వెళ్ళిపోతారని, అప్పుడు నందినీ, నందిని ఆస్తి తనకి ఏమాత్రమూ దక్కవని కూడా తెలుసు.
“వెంకటస్వామీ.. ఎవరో రాత్రిళ్లు యీ వీధిలో తిరుగుతున్నాడు, ఎక్కువ సేపు మీ హోటల్ ని గమనిస్తున్నాడయ్యా… జాగ్రత్త! ” హెచ్చరించాడు వీధి చివర్న వుండే ‘కాప్టన్ ఫర్నీచర్ ‘ కంపనీ వాచ్ మాన్.
‘ఎలా వున్నాడు ” అడిగాడు వెంకటస్వామి.
“కాలు ఈడుస్తూ నడుస్తున్నాడు, ఒక విధంగా చెబితే పక్షవాతం వచ్చిన ‘పరమశివం ‘ లా వున్నాడు. ఇంతకీ ఆ పరమశివం ఎక్కడకి పోయాడు? ” అడిగాడు వాచ్ మాన్.
“ఏదో.. అదే… వాళ్ళ వూరు కేరళాలో వుంది కదా… అక్కడికి! ” అతుకుల బొంతలా సమాధానం ఇచ్చాడు వెంకటస్వామి. అతని మనసులో ఆలోచనలు ఒక్కసారి గుప్పుమన్నాయి.
“పరమశివం వచ్చాడా? ఎలా వస్తాడు? నడవలేడు, మాటలు రావు అసలెలా రాగలడు? వాచ్ మాన్ చెప్పిన ప్రకారం , రాత్రిళ్ళు తిరుగుతున్నవాడు పరమశివంలా ఉన్నాడు. అదీ పక్షవాతం వచ్చిన వాడిలా నడుస్తున్నాడు. అంటే పరమశివం నడవగలుగుతున్నాడా? వాడే అయితే డైరెక్టుగా లోపలికి రావొచ్చుగా? వాడి విషయం మహదేవన్ కి చెప్పి వుంటానని అనుకున్నాడా? అంటే వాడికి బ్రేన్ మళ్ళీ పని చేస్తోందా? ఒక వేళ పని చేస్తే ఎంత? గతంలో జరిగినవన్నీ పూసగుచ్చినట్టు గుర్తున్నాయా? అసలు రాత్రిళ్ళు హోటల్ ని గమనించడంలో వాడి వుద్దేశ్యం ఏమైవుంటుంది? ” ఇన్ని ప్రశ్నలు తుఫానులో సంద్రపు అలలల్లా వెంకటస్వామి మనసులో ఎగసిపడ్డాయి.
“ఏంటీ బ్రదరూ ఆలోచిస్తున్నావు? వర్రీ ఆ? డోంట్ వర్రీ, వాడి సంగతేంటో ఇవాల్టి నైట్ డ్యూటిలో పూర్తిగా కనుక్కుంటాగా!” భరోసా ఇచ్చాడు వాచ్ మాన్.
మళ్ళీ వెంటకస్వామిలో ఆలోచన “వాచ్ మాన్ కి జాగ్రత్తలు చెప్పాలా? వద్దా? ” అని. చెబితే మీ ఇద్దరికీ వైరం ఎందుకు వచ్చిందని అడుగుతాడు. చెప్పకపోతే?
వెంకటస్వామి చెప్పలేదు. ఎంతటి దుర్మార్గుడైనా ఇతరుల ముందు మంచివాడనే అనిపించుకోవాలని అనుకుంటాడు. తన మనసులో గుట్టు కాపాడుకోవడం కోసం వెంకటస్వామి మౌనం పాటించి తన అంతరాత్మకి తానే ద్రోహం చేసుకున్నాడు.
*****************
“అయ్యా! గతించినవాటి గురించి ఆలోచించడం మానండి. నిన్నటిది హిస్టరీ.. రేపటిది మిస్టరీ. నేడే మనది ” సోడా విస్కీ లో కలిపి శామ్యూల్ రెడ్డి కి అందించాడు సర్వనామం.
గొప్పవాళ్ళింటిలో గొప్పవాడిగా పుట్టడం వేరు. పేదవాడింటిలో పేదవాడిగా పుట్టి గొప్పవాడిగా చెలామణీ అవుతున్న వాడి ‘గొప్ప ‘ వేరు. మొదటిది సహజం. రెండోది కృత్రిమం.
శామ్యూల్ రెడ్డికి రెండుమూడు ఇళ్ళే కాక, ఒక ఫామ్ హౌజ్ ఉంది. ఫామ్ హౌజ్ ఉండటం ఒక ప్రెస్టేజి. అదీ పొలం మధ్యలో వూరికి దూరంగా సకల సౌకర్యాలతో వుండటం మరింత ప్రెస్టేజి. ఇక అక్కడ జరిగే విచిత్రాలకు అంతే వుండదు. ఒకసారి ఫామిలీ మొత్తం పిక్నిక్ గా గడపడానికి వెళ్తారు. ఒక్కోసారి ఇంటికొచ్చిన సెలబ్రిటీలకి చూపించడానికి ,మర్యాదలు వగైరా చేయడానికి వాడతారు. రహస్య సమావేశాలకి ఎలాగో పనికొస్తుంది. అంతే కాదు, నైట్ గనక అక్కడ గడపదల్చి వాచ్ మాన్ కి సెలవిచ్చి ఇంటికి పంపితే ‘ఐటం డాన్స్ ల షో ‘ లకి ‘నగ్న నృత్యాలకి ‘ కూడా పనికొస్తుంది.
ఇప్పుడు శామ్యూల్ రెడ్డి గెస్టు హౌజ్ ‘విజయాన్ని సెలబ్రేట్ ‘ చెసుకొనే వెదికగా ఉపయోగపడుతోంది. కారణం గుడిసెల కల్తీ సారా మరణాలు, తద్వారా శామ్యూల్ కొచ్చిన పరపతి.
“ఇంతకీ ఇదంతా ఎలా చేశా…వూ..రూ… ” అన్నాడు శామ్యూల్ రెడ్డి.
“అయ్యా విత్తనం ఎక్కడిది… మొక్క ఎవరు నాటారు, నీళ్ళు ఎవరు పోశారు.. కాపలా ఎవరు కాశారు.. అనేది కాదు ముఖ్యం. సారాలో కల్తి ఎవరూ కలిపితే ‘ మనకెందుకు, ఎవరు ‘కలిపిస్తే ‘ మనకెందుకు? పేరొచ్చింది . రెండు లక్షలు రాయల్ హాస్పటల్ కి ఖర్చు పెట్టి పన్నెండు మందిని బ్రతికిస్తే అవయవదానం పేరిట మీ ఖాతాలోకి వచ్చింది ఆరులక్షలు. అంతే కాదు ఆ డబ్బు హాస్పటల్ ఖర్చులు పోనూ . ఇహ పరపతి సంగతంటారా ? బోసు బాబు జండా కిందకు దిగి, మీ జండా ఇంతెత్తున రెపరెపలాడింది. ” నవ్వాడు సర్వనామం. ఆ నవ్వు ఎంత చిత్రంగా వుందంటే శామ్యూల్ రెడ్డి లాంటి వాడు షాక్ తిన్నాడు. ‘లెక్కలు ‘ పూర్తిగా నాకు తెలుసు అన్న నవ్వది.
అప్రయత్నంగా ఓ గాజు గ్లాసులో ఓ లార్జ్ విస్కీ పోసి కొద్దిగా నీళ్ళు మిగతా సోడా పోసి సర్వనామానికి అందించాడు శామ్యూల్ రెడ్డి. ఆ వొక్క చర్యా చాలు సర్వనామానికి.
“బాస్.. మీరెప్పుడూ బాసే. నేనెప్పుడూ మీ సేవకుడ్నే. ఒక్కటే నా కండీషన్. సేవకుడ్ని ‘బానిస ‘ గా చూడకుండా వుంటే చాలు. ఇహ లాభనష్టాల సంగతంటారా, నా 20% మీరు ఎలాగో నాకు అందిస్తారని తెలుసు! ” విస్కీ సిప్ చేస్తూ తన పెర్సెంట్ ని నిర్మొహమాటంగానూ, అత్యంత తెలివిగా చెప్పాడు సర్వనామం.
‘ట్వంటీ పెర్సెంట్ ఆ? … అఫ్ట్రాల్… కుండెడు సారాలో గ్లాసుడు కెమికల్ కలిపి నందుకు అంత డబ్బా? ” శామ్యూల్ షాక్ తిన్నాడు. అయితే బయటకి ఒక్క మాట అనలేదు.
“చాలా ఎక్కువంటారా? ఇంత పేరు మీరు సంపాదించుకొనాలంటే పాతిక లక్షలన్నా ఖర్చు పెట్టాలి. నేను మీ చేత పైసా ఖర్చు చేయించలేదు కదా? ఆరు + కొన్ని లక్షల్ని ఆదాయం వచ్చేట్టు చేశా. ఖర్చైన సొమ్ము బోసు ది.. సోకు మీది! గిట్టుబాటు కోసం 30% ఇచ్చినా తప్పులేదు ” క్షణాలలో శామ్యూల్ రెడ్డి మనసుని చదివేసి మరో 10% పెంచే ప్రయత్నం చేశాడు సర్వనామం.
“అతడన్న దానిలో అక్షరం అబద్ధం లేదు ” ఆలోచించాడు శామ్యూల్ . “ఛీర్స్ ” గ్లాసు గ్లాసు ఢీకొన్నాయి.
“మామూలుగా చెప్పలేని మాటలెన్నో మందులో యీజీగా చెప్పగలమనే ” మాట అలా ఆ రోజున మరోసారి మళ్ళీ రుజువైంది.
***********

నవనీతం ఒంటరిగా కూర్చొని మాటిమాటికి కళ్ళు వొత్తుకుంటోంది. ఎంత ఆలోచించినా జరిగింది ఏమిటో ఎలానో ఆమెకి అర్ధం కావడం లేదు. సారాలో కల్తీ ఎలా జరిగింది?
ఇదే ప్రశ్న వందసార్లు వేశాడు బోసుబాబు. మొదట కొంచం సాఫ్ట్ గా అడిగినా, రాన్రాను అది తీవ్రంగా మారింది. చివరిసారి అడగటం మామూలుగా కాదు … చెంప పగలుగొట్టి . తెలియని విషయాన్ని ఎవరు ఎవరిని ఎన్నిసార్లు అడిగినా జవాబు ఏం చెప్పగలరూ?
చెంపపగలు గొట్టి వెళ్ళిపోయాడు బోసుబాబు. అసలేం బతుకు ఇది? బోసు పక్కన , పోనీ, పంచన చేరింది. పక్క పంచుకుంది, సారా అమ్మింది, ఎంత దిగజారింది.
ఆకాశంబునుండి శంభుని శిరస్సు మీదికి.. అక్కడి నుండి శీతాద్రికి జారి.. జారి… ఉప్పు సముద్రంలో కలిసిన గంగలా.. తప్పు తప్పు.. ముమ్మాటికీ తప్పు.
అసలు జీవితంలో అత్యున్నతస్థానాన్ని చూసిందెప్పుడు గనక, దిగజారానని బాధపడటానికి? జీవితంలో ‘రాణి ‘ లా ఎప్పుడుంది? ఎప్పుడూ ‘రాజీ ‘ నే!
చెంపదెబ్బ తిన్నప్పుడు చెంప పగిలిపోయినంత నొప్పి, ఇప్పుడు నొప్పి లేదు, కేవలం బుగ్గ మీద బోసు తాలూకు వేళ్ళ గురుతులున్నాయి… కనిపించీ కనిపించనట్టు.
మనసు మీద పడ్డ ముద్ర మాత్రం మహాఘోరంగా వుంది. అది ముద్ర కాదు పగిలి భిన్నాభిన్నమైన గాయం. ఆ పుండు పైకి కనిపించేది కాదు. అక్కడ రక్తమో, మరోటొ పైకి స్రవించేది కాదు. అక్కడి బాధ మాటల్తో వ్యక్తమయ్యేది కాదు. జీవితానంతా మరోసారి సమీక్షించుకుంటే?
కొత్తగా ఏమీ యాడ్ అవదుగా! పోనీ ‘డిలీట్ ‘ అయ్యే క్షణాలూ వుండవుగా. నా పేరు నవనీతం. మనసు నవనీతం. వొళ్ళు నవనీతం. ఇంతకీ నేనెవరి దాన్ని? నాకెవరున్నారు? నాదైనది నాకేముందీ లోకంలో? ఒక్కసారి పొగిలిపొగిలి ఏడ్చింది.
మనిషికి భగవంతుడు నాలుగు వరాలు ఇచ్చాడంటారు. అవి ఆశ, నిద్ర, మరపు, మృత్యువు. అన్నిటికన్న గొప్ప వరం సంగతి ఎవరూ ఎత్తలేదు. భగవంతుడు మనిషికిచ్చిన గొప్పవరం కన్నీళ్ళు. బాధని కన్నీళ్ళు పూర్తిగా తగ్గించలేకపోవచ్చు. కానీ చాలా(?)మంటని ఆర్పి చల్ల బరుస్తాయి.
నవనీతం ఏడ్చి ఏడ్చి తనకి తెలీకుండానే నిద్దురపోయింది. ఎంతగా అంటే ఒంటి మీద సృహ లేనంతగా. చీర పక్కకు తొలగిందన్న ధ్యాసే లేదు. అంటే గొప్పవరమైన కన్నీటితో బాటు మరో గొప్ప వరమైన ‘నిద్ర ‘ ఆమెకి లభించిందన్న మాట.
చీర తొలగిన సంగతి ఆమెకి తెలీదు. అక్కడికి వచ్చిన సర్వనామానికి తెలుసు. మనుషుల కోరికల్లో కూడా ఎక్కువ తక్కువలుంటాయి. ‘అతి ‘ కాముకత ఒకరిదైతే ‘మిత ‘ కాముకత మరొకరిది. కొందరికసలు కోరిక వున్నట్టు వారికే తెలీదు. వారి ధ్యాస ఇతర సుఖాల మీద వుంటుందేమో గానీ, ‘సృస్టి కార్యం ‘ మీదుండదు. అలా వుండని వాళ్లలో సర్వనామం ఒకడు. లోకంలో అన్నీ పాపాలని కొద్దో గొప్పో తాకి చూసినా , యీ సుఖమిచ్చే పాపాన్ని మాత్రం తాకి చూడలేదు.
అందగత్తే ఏడ్చినా నవ్వినా కూడా అందంగా వుంటుంది. హీరోయిన్స్ ని చూడండి. వాళ్ళు ఏడ్చినప్పుడు మామూలువాళ్ళలాగా భోరుమనో, వెక్కిళ్లు పెడుతూనో, చొంగ కారుస్తూనో ఛండాలంగా ఏడవరు.
ఒకటికి పది సారు ‘ఎలా ‘ ఏడిస్తే గ్లామరెస్ గా వుంటుందో పెదవులు ఎంతవరకు తెరచి వుంచాలో , పలువరుసలు ఏ యాంగిల్ నుంచి చూపితే అందంగా వుంటుందో , ఇలాంటి లక్ష విషయాలు అద్దం ముందు నిలబడి, కూర్చొని ప్రాక్టీస్ చేసి గానీ కెమరా ముందుకు రారు. సీనియర్ & జూనియర్ శ్రీరంజని సిస్టర్స్ ఇద్దరూ ఆ కలంలో ‘ ఏడుపు సీన్ల ‘ కి ఫేమస్.
వాళ్ళిద్దర్లో ఎవరు సినిమాలో వున్నా హాళ్ళన్నీ కన్నీటితో నిండిపోయేవి. కన్నీరు కార్చడంలో వారు స్పెషలిస్టులని ఆ రోజుల్లో పత్రికలు ఘోషించేవి.
అలాగే హింది నటి సైరాబాను (దిలీప్ కుమార్ గారి భార్య) ఏడుపు ఎంత ముద్దుగా వుండేదంటే , కొందరైతే ఆ బుడిబుడి దీర్ఘాలు చూడ్డానికే మరోసారి ఆవిడ సినిమాలు చూసేవారు.
ఆ విషయం తెలిసిన దర్శకమహాశయులు అవసరమున్నా లేకపోయినా ఒకటో రెండో ఏడుపు సీన్లు కావాలనే ఇరికించేవారని కూడా జనాలు చెప్పుకునేవారు.
ఇంతకీ , విషయానికొస్తే ఏడ్చి ఏడ్చి ఒళ్ళు తెలీకుండా పడుకొన్న నవనీతం సర్వనామానికి గంధర్వ కన్యలా కనిపించింది. ఎక్కడికక్కడే తీర్చిదిద్దినట్టున్న అవయవాలు మొట్టమొదటి సారిగా సర్వనామాన్ని అవాకయ్యేటట్టు చేశాయి. కోమాలో పడి వున్నవాడు కరెంటు షాకు కొట్టి దిక్కున లేచినట్టు సర్వనామంలోని నవనాడులన్నీ ఒక్కసారి ఉత్తేజం పొందాయి. పిల్లిలా తలొంచుకొని పైకి గుడిసెలా కనిపించే ‘లోపలి ‘ కి వెళ్ళాడు. తలుపేసి నిశబ్ధంగా పక్కకు చేరాడు.
ఆ తరవాత ఏం జరిగిందో వివరించడం అనవసరం. ఒకటి మాత్రం నిజం. మొదటిసారి నవనీతం ‘ చెరచ ‘ బడింది. అంతకు ముందువన్నీ అవసరం కోసమో , ఇష్టమయ్యో, మనసు తెలిసి చేసినవి. ఇప్పుడు మాత్రం ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా చెరచబడింది.
అంత బాధలోనూ ఆమెకి ఆశ్చర్యం . చెరిచినవాడెవడో కూడా ఆమెకు తెలియదు. అంతటి నేరం చేసిన వాడు వెంటనే పారిపోతాడు. కానీ వీడు నింపాదిగా కూర్చొని వున్నాడు.
“ఎవరు నువ్వు? ” గొంతుకు పెగల్చుకొని అడిగింది.
“నా పేరు సర్వనామం , ఒక్క విషయం మాత్రం నిజం , ఈ జీవితంలో నేను తాకిన మొట్టమొదటి ఆడదానివి నువ్వే. నేనిక్కడకి వచ్చినప్పుడు నీ చీర కొద్దిగా తొలగివుంది. ఏనాడు నాకు స్త్రీ అంటే ఏ అభిప్రాయమూ లేదు. కానీ నిన్నా స్థితిలో చూశాక నాకు పిచ్చెక్కింది. ఎంత పిచ్చంటే ‘రేప్ ‘ కి ఎన్నాళ్లు శిక్ష పడుతుందో తెలిసి కూడా నన్ను నేను ఆపుకోలేక పోయాను. నీ పేరు నవనీతం, నాకు ఎలా తెలుసో అని అడగకు. నవనీతం… నిజంగా మరోసారి చెబుతున్నా. నా జీవితంలో ముట్టుకున్న మొట్టమొదటి ఆడదానివి నువ్వే. నువ్వొప్పుకుంటే నా జీవితాంతం నిన్ను నాదానిగా చేసుకుంటా. ఎలా చూసుకుంటానని అడక్కు. లోకంలో ఏం చేసి అయినా నిన్ను మహారాణిలా చూస్తా. ఇది సత్యం. ఇప్పుడు నేనంటే నీకు కోపమూ, ద్వేషమూ, ఎన్నెన్నో వుండచ్చు. నీకోపం వచ్చింది కనుక నన్ను పోలీసులకి పట్టిస్తానన్నా నేను భయపడను. ఇక్కడే వుంటాను కేవలం నీ మీద ‘ప్రేమ’ తో మాత్రమే. అసలు దీనికి ప్రేమ అనే పదం ఉపయోగించ వచ్చో లేదో కూడా నాకు తెలియదు. నేను ఏ పేరూ పెట్టను.” అంటూ ఓ కాగితం మీద టెలిఫోన్ నంబర్ రాసి “ఇది నా ఫోన్ నంబరు , నేను చేసిన పనికి నిన్ను క్షమార్పణ అడగను, ఎందుకంటే అంత సుఖం పొందాక , ఏ శిక్షైనా నాకు తృణప్రాయమే. ఒకటి గుర్తుంచుకో.. ఏ క్షణం నువ్వు నాకు కాల్ చేసినా మరుక్షణం నీకోసం పరుగు పెడుతూ వస్తా. నువ్వే నా దగ్గరకు రాదల్చుకుంటే , ఒక్క కాల్ చేసి ‘ వస్తున్నా ‘ అని చెప్పు చాలు. సూర్యచంద్రులు గతులు మార్చుకున్నా నేనన్న మాటని మార్చను. ” నంబర్ రాసి కాయితం ముక్కని ఆమె చేతిలో పెట్టి లేచి, ఓ క్షణం నిలబడి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు సర్వనామం.
జీవితంలో మొట్టమొదటిసారి అతనికి ఆకాశంలో ఏదో తెలీని అందం కనిపించింది. వరసల్లో సాగుతున్న మబ్బుల్ని చూస్తూ అక్కడే నిలబడ్డాడు.
“ఎవరు నువ్వు? ఇక్కడెందుకు నిలబడ్డావు? నీకేం పని? ” అప్పుడే మోటర్ సైకిల్ ఆపిన బోసు బాబు అడిగాడు సర్వనామాన్ని. ఉలిక్కిపడి బోసుబాబుని చూసి ” ఆకాశం అద్భుతంగా వుంది కదూ? అబ్బా.. జన్మలో ఇంత అందమూ, ఇంత ఆనందమూ ఎరుగను. ” అని నవ్వాడు సర్వనామం.
“ఇంతకీ నువ్వెవరూ? ”
“జస్ట్ మామూలు మనిషిని. సారా తాగడానికి మనిషి ఎందుకొస్తాడో నేనూ అందుకే వచ్చా. కానీ సర్ జీ, ఆ పైన కనిపించే మబ్బుల మత్తు కన్నా యీ సారాలో వుండే మత్తు ఎందుకూ పనికి రాదని నిర్ణయించుకున్నాను. అందుకే వెళుతున్నా.. సలాం ! ” అంటూ ముందుకి నడిచాడు సర్వనామం.
అయోమయంగా వెళ్తోన్న సర్వనామం వంక చూశాడు బోస్ . అతనికేమీ అర్ధం కాలేదు. గుడిస వైపు చూస్తే పైకి గుడిసెలా కనిపించే నవనీతం గుడిసె తలుపులు తీసి వున్నై. పొద్దున్న నవనీతాన్ని కొట్టడం అతనికి సడన్ గా జ్ఞప్తికి వచ్చింది. లోపలకి వెళ్ళాడు. కళ్ళుమూసుకొని దిక్కులేనిదానిలా పడున్న నవనీతం అతనికి కనిపించింది. ఉప్పెనలా బోసుకి జాలి ముంచుకొచ్చింది.
“సారీ ” అంటూ మెల్లగా పక్కకు చేరబోయాడు. “వద్దు ” అరచింది నవనీతం. కళ్ళ నిండి జారిన కన్నీటి ధారలు బుగ్గ మీద చారల్లా కనిపిస్తూనే వున్నాయి.
“వద్దు బాబూ వద్దు ” రెండు చేతులు ముఖాన్ని కప్పుకొని భోరుమని ఏడుస్తూ “నేనెవర్ని బాబూ నీకు ? పెళ్ళాన్ని కాదు, అలాగనీ వుంచుకున్నదాన్ని కాదూ, కేవలం నీ సారాయి దుకాణంలో కూర్చొని జనాలకి సారా అమ్మే బజారుముండని. నేనమ్మిన సారాలో కల్తీ ఎలా కలిసిందో కూడా తెలియని వెర్రిలంజని. తీసుకెళ్ళు బాబూ… నన్ను చిత్రవధ చేయించు లేదా కత్తి పెట్టి పొడిచి చంపెయ్ ” అరుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అరుస్తూ తన చెంపలు తానే పగులగొట్టుకుంటోంది నవనీతం.
బోసు బాబు నిర్ఘాంతపోయాడు. కొండంత అండగా వుంటూ దేనికి చెక్కుచెదరకుండా దేన్ని లెక్క చెయ్యకుండా వుండే నవనీతమే అతనికి తెలుసు కానీ, ఇలా బేలగా ఏడ్చే నవనీతాన్ని అతను ఎరుగడు.
“క్షమించు నన్ను, నన్ను క్షమించు” అంటూ గొణిగి మాట్లాడకుండా బయటకెళ్ళిపోయాడు బోసు.
ఆమెని ఎలా ఓదార్చాలో నిజంగా అతనికి తెలీదు.
పది నిమిషాల తరవాత సమాధాన పడింది నవనీతం. అదృష్టం ఏమిటంటే సర్వనామం ఇచ్చిన కాయితం ముక్క బోసు బాబు కంట పడలేదు. మౌనంగా ఆ కాయితం ముక్కని తను చీరలు పెట్టుకునే పెట్టె అడుగున పెట్టి బాత్ రూం కి వెళ్ళింది నవనీతం. గంట సేపు స్నానం చేస్తూనే వుంది. కంటికి కనిపించని పాపాలు ఒంటి నిండా అంటుకున్నట్టు అనిపించడమే ఆ సుదీర్ఘ స్నానానికి కారణం.
“ఇప్పుడు నేనేమి చెయ్యాలి? ” మరో ప్రశ్న ఆమె రవిక తొడుకుంటూ వుండగా , మనసులో మొలకెత్తింది.
సమాధానం చెప్పేదెవరూ? ఓ కాలమా నువ్వెంత జాణవే!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *