April 27, 2024

“కళాఖండం – A Work Of Art”

రచన: వంశీ మాగంటి

కాగితం పొట్లం ఒకటి చంకలో పెట్టుకుని ఆ కుర్రాడు మెల్లగా డాక్టరు గారి రూములోకి అడుగుపెట్టాడు.
“నువ్వా అబ్బాయ్! రా రా! తేలికగా వుందా ? ఏమిటి విశేషాలు”
“మా అమ్మ మీకు నమస్కారాలు చెప్పమంది. నేను మా అమ్మకి ఒక్కణ్ణే కొడుకుని. భయంకరమైన జబ్బు నుంచి కాపాడి నా ప్రాణం నిలబెట్టారు. మీ ఋణం ఎలా తీర్చుకోగలమో తెలియట్లేదు”
“నాన్సెన్స్ . నేను చేసిందేముంది? నా స్థానంలో ఎవరున్నా చేసేదే నేనూ చేశాను. దానికేనా ఇంత హడావిడి?”
“మా అమ్మకి నేనొక్కణ్ణే కొడుకుని. మేము పేదవాళ్ళం, మీ ఉపకారానికి ఏం ప్రతిఫలం ముట్ట చెప్పుకోలేనందుకు సిగ్గుగా ఉంది. మా అమ్మా నేనూ మిమ్మల్ని కోరేదేమంటే..ఈ చిన్న కానుకను మీరు కాదనకుండా స్వీకరించాలి. ఈ విలువైన వస్తువు… దీని విలవ ఇంత అని చెప్పటానికి వీలుకాదు…కంచుతో చేసిన అరుదైన కళాత్మక వస్తువు… ”
“ఏమిటిదంతా ? దేనికి?”
“అలా అనకండి. ఇది పుచ్చుకోకపోతే అమ్మకీ, నాకూ మనసుకు చాలా కష్టంగా వుంటుంది. అరుదైన కంచు వస్తువు. పాతకాలం నాటిది. మా నాన్న జ్ఞాపకంగా ఇన్నాళ్ళు ఎంతో భద్రంగా దాచుకున్నాం. మా నాన్న పాత కంచు విగ్రహాలు కొని, కళారాధకులకు అమ్మేవాడు. నాన్న పోయాక ఆ వ్యాపారం అమ్మా నేనూ చూసుకుంటున్నాం ఇప్పుడు”అంటూ పొట్లం ఊడతీస్తున్నంతసేపు ఊపిరి సలపకుండా ఉపోద్ఘాతం చెపుతూనే, పొట్లంలో ఉన్న ఆ శిల్పాన్ని తీసి ఉత్సాహంగా బల్లమీద నిలబెట్టాడు.

[అది కొవ్వొత్తులు పెట్టుకునే దీపపు సెమ్మె, మాంచి కళగా ఉన్నది. అయితే ఆ దీపపు సెమ్మె పీఠం మీద ఉన్న దిగంబర విగ్రహ సౌందర్యాన్ని వర్ణించగల శక్తిగాని, సామర్థ్యంగాని ఎవరికీ లేవనే చెప్పవచ్చునేమో.ఆ పీఠం మీద ఉన్న దిగంబర విగ్రహాన్ని చూసి డాక్టరుగారు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యి మెల్లగా చెవి గోక్కుని గొంతు సవరించుకున్నాడు.]

“అవునబ్బాయ్, చాలా గొప్పగా ఉంది. కాని – కాని – ఏం చెప్పటానికీ మాటలు రావట్లా… ఇల్లాంటి బొమ్మని ఆసుపత్రిలో పెట్టుకుంటే తలకొట్టేసినట్టుంటుంది. అంతకంటే మరేమీ లేదు”
“అలాగనేసారేమండి?”
“సాతాను కూడా ఇంతకన్నా గొప్ప బొమ్మ సృష్టించలేడేమో. ఈ మాయా దిగంబర విగ్రహం ఆ బల్ల మీద ఉంటే ఆసుపత్రి మొత్తం భ్రష్టుపట్టిపోతుంది…………”
“మీరనేది చాలా వింతగా ఉంది డాక్టరుగారూ! ఇది సామాన్యమైన శిల్పం కాదు. ఆహా! ఏం అద్భుత సౌందర్యం. ఒక్క క్షణం రెప్పవాల్చకుండా దానికేసి చూడండి. మీ ఆత్మ ఆనందంతో నిండిపోవలసిందే. లౌకికవిషయాలన్నీ క్షణంలో మరిచి పోవలసిందే! ఒక్కసారి చూడండి. ఏం జీవం! ఏం భావం! ఏం విన్యాసం! ”
“అంతా బాగానే వుంది. నువ్వు చెప్పిందంతా నిజమే అబ్బాయ్. కాని – నేను పెళ్ళాం పిల్లలూ కలవాణ్ణి. ఇక్కడికి పసిపిల్లలు ఆడవాళ్ళు ఎంతోమంది వస్తూ వుంటారు..పదిమందీ వచ్చిపోయే చోటు …”
“డాక్టరుగారూ! కళల సంగతి తెలియని వాళ్ళకి ఇందులో వున్న అందం కనిపించకపోవచ్చును. కాని మీరు గొప్పవారు. బాగా చదువుకున్నవారు. మీరూ అందరిలాగే చూస్తే ఎల్లా చెప్పండి? ఏమైనా కాని మీరు ఇది పుచ్చుకోవాలి. పుచ్చుకోకపోతే మా అమ్మకీ, ఆమెకి ఒక్కడినే కొడుకునైన నాకూ మనసుకు చాలా కష్టం వేస్తుంది. మీరు నన్ను బ్రతికించారు. బదులుగా మాకు ఎంతో ప్రియమైన వస్తువును కానుకగా ఇస్తున్నాం. కాదనకండి. నా విచారం ఏమిటంటే దీని జత విగ్రహాన్ని కూడా తెచ్చి మీకు సమర్పించుకోలేకపోయానే అని..”
“ఒకటి తెచ్చింది చాలక రెండోది కూడా తీసుకురాలేదని బాధా? చాలా సంతోషం నాయనా, చాలా సంతోషం. కానీ నేనేం చెప్పేది? నువ్వే ఆలోచించు. పసిపిల్లలు వస్తూ పోతూ వుంటారు. ఆడవాళ్ళు వస్తూ వుంటారు. పదిమందీ వచ్చిపోయే చోటు….సరేలే అయినా నీతో వాదం ఎందుకు. ఆ బొమ్మని అక్కడ పెట్టి వెళ్ళు”
“వాదం మాట చెప్పకండి డాక్టరుగారూ. ఆ పూలకుండి పక్కన పెట్టుకోండి ఈ బొమ్మను . దీని జతకి రెండోదాన్ని తీసుకురాలేకపోయాననే నా బాధ. శలవు”
“హమ్మయ్యా! వెళ్ళిపోయాడు. బొమ్మ బాగుంది; చాలా బాగుంది. చేతులారా అవతల పారెయ్యటానికి మనసొప్పటం లేదు.కాని ఇక్కడ వుంచుకోటానికి అంతకంటే మనసొప్పకుండా వుంది. ఏమిటి చెయ్యటం ? దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇచ్చేస్తే? అవును కాని ఎవరికివ్వటం? ఆ మధ్యన కేసులో డబ్బులు పుచ్చుకోకుండా సాయం చేసిన లాయరుగారు ఉన్నాడుగా. స్నేహం మూలాన డబ్బు ఇవ్వటం బాగానూ వుండదు, ఇస్తే పుచ్చుకోడు కూడానూ. ఇక్కడ పెట్టుకోటానికి వీలేని ఈ పాపిష్టి బొమ్మని అతనికి బహుమతిగా ఇచ్చేస్తే సరిపోయె. ఒక్క తుపాకి. రెండు పిట్టలు. బాగుందీ ఉపాయం. అదీకాక లాయరుకి పెళ్లీ పెటాకులు లేవు. ఒంటరిగాడు. నిమ్మళమైన మనిషి”.
“ఓ లాయరు బాబూ ఎలా వున్నావ్? నువ్వు నా కేసు కోసం పడిన శ్రమకి కృతజ్ఞతలు తెలుపుకుందామని వచ్చాను. నీతోనేమో పెద్ద తలకాయనొప్పి. డబ్బు పేరు చెబితేనే మండిపడతావు. అందుకని నీకో కానుక తెచ్చాను. నువ్వు కాదు కూడదనకుండా పుచ్చుకోవాలి. చూడు… ఏం జీవం! ఏం భావం! ఏం విన్యాసం!”
“డాక్తరూ – బొమ్మ మైమరపుగా, మనోహరంగా ఉన్నది. ఎక్కడ కొన్నావ్ ఈ నమూనా? ఎవరు చేసారో కానీ, ఏం ఊహ, ఏం అందం! ఎంత ఆకర్షణ!….అయినా వొద్దు బాబూ, వొద్దు. నువ్వు నాకేమీ ఇవ్వద్దు. బొమ్మ వొద్దు బెడ్డరాళ్ళు వొద్దు. నాకొద్దిది. దీన్ని ఇక్కణ్ణుంచి తీసుకుపో”
“ఎందుకు ? అంత భయం దేనికి వకీలు సాబుగారూ?”
“ఎందుకా…మా అమ్మ తరుచు ఇక్కడికి వస్తూ వుంటుంది. క్లయింట్లు వస్తూ వుంటారు. అదీకాక ఇంట్లో పనివాళ్ళు ఈ బొమ్మని చూస్తే నామర్దా కాదుటయ్యా? ”
“నాన్సెన్స్! నాన్సెన్స్! నువ్వు పుచ్చుకుని తీరాల్సిందే. లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది…సరిగ్గా చూడు. ఏం జీవం! ఏం భావం! ఏం విన్యాసం!” అని లాయరు గారి నోట్లోంచి మారుమాట రాకముందే బొమ్మను అక్కడే వొదిలేసి, హమ్మయ్య పీడ వొదిలిపోయిందని తొందర తొందరగా నిష్క్రమించాడు.
“సెమ్మె చాలా బాగుంది కాని, దీన్ని ఏం చెయ్యాలో తెలియటం లేదు. చెత్త బుట్టలో పారేద్దామా అంటే మనస్సు పీకుతోంది. పోనీ ఇంట్లో వుంచుకుందామా అంటే పరువు పోతుంది. ఎవరికైనా దీన్ని బహుమతుగా ఇచ్చేస్తే పోతుంది. ఎవరున్నారూ ? ఆ…నాటకాల్లో విదూషకుడి వేషాలు వేసేవాడున్నాడుగా! వాడికిచ్చేస్తే పోయె. అతను ఇవ్వాళ రాత్రే ఏదో విరాళం పోగుచేసేందుకు ఉచితంగా నాటకం వేస్తున్నానని మొన్న చెప్పినట్టు గుర్తు. ఆ నాటకాన్ని, అతన్నీ మెచ్చుకుంటూ దీన్ని కానుకగా ఇచ్చేస్తే వదిలిపోతుంది. అదీకాక అతనికిటువంటివంటే బాగా ఇష్టం కూడాను.”

[ఆ సాయంకాలమంతా ఆ నటుడి డ్రెస్సింగు రూము ఈ అసాధారణ శిల్పాన్ని చూడటానికి వచ్చేపోయే మగవారితో కోలాహలంగా మారిపోయింది. ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి తలుపు తడితే, లోపలికి రావొద్దు. బట్టలు వేసుకుంటున్నా అని తిప్పి పంపించేసాడు]

“నాటకం పూర్తి. ఇప్పుడు ఈ బొమ్మని నేనేం చేసుకోవాల్రా దేవుడా? నేనుండేదేమో అద్దెకొంప. నటీమణులు వస్తూ పోతూ ఉంటారు. పోనీ ఇది ఫోటో అయినా కాకపోయె, దబాలున ఎక్కడన్నా దాచి పారెయ్యటానికి! ఇప్పుడు నాకేది దారి? ఓ హెయిరు డ్రెస్సరూ, కాసింత ఉపాయం చెప్పవయ్యా!”
“అంత ఇదైపోయేందుకేముంది? దీని తీసుకుపోయి ఏదో ఒక రేటుకి బయట అమ్మిపారెయ్యి. ఇల్లాంటి పాత సామాన్లు కొనే ముసలమ్మ కొట్టు ఈ పక్కనే వుంది.”

[రెండు రోజుల తర్వాత డాక్టరు గారు ఆసుపత్రిలో ఉండగా ఎవరో తలుపు దబాలున తోసినట్లు చప్పుడైంది. చూస్తే చేతిలో కాగితం పొట్లంతో యమదూతలాగా తన తల్లికి ఏకైక పుత్రుడైన ఆ కుర్రాడు. డాక్టరుగారికి పై ప్రాణాలు పైనే పోయినై.]

“డాక్టరుగారూ! ఏం చెప్పమంటారు నా సంతోషం? అదృష్టవశాత్తు దాని జతకి రెండో బొమ్మ దొరికింది. అమ్మ సంతోషానికి అవధుల్లేవ్. మీకు ఇచ్చి రమ్మని పంపించింది. మా అమ్మకి నేనొక్కణ్ణే కొడుకును. నా ప్రాణం నిలిపారు. దీన్ని కూడా పుచ్చుకోండి” అంటూ ఆనందంతో ఉప్పొంగిపోతూ డాక్టరు గారి ముందు పెట్టాడు.
డాక్టరు గారి ముఖం పాలిపోయింది. ఏదో చెపుదామనుకున్నాడు కాని, నోటమాటే రాలా.

ఆంటోన్ చెహోవ్ రాసిన చిన్న కథ “ఎ వర్క్ ఆఫ్ ఆర్టు” కు 2009లో చేసిన స్వేచ్ఛానువాదం

Original రిఫరెన్సు ఇక్కడ
http://www.eldritchpress.org/ac/jr/093.htm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *