April 28, 2024

పురుషులలో పుణ్యపురుషులు

రచన: MSV గంగరాజు

ఢిల్లీ అనగానే నాకు స్ఫురించేవి కుతుబ్‌ మీనారూ, ఇండియా గేటూ, పార్లమెంట్‌ హౌసూ`ఇత్యాది కట్టడాలు కాదు. మనసున్న మంచి మిత్రుడు క్రాంతికుమార్‌! భగవంతుడు సృష్టించిన జీవకోటికి మకుటాయమైన వాడు మానవుడైతే, ఆ మకుటాలలో పొదగబడిన మణులు క్రాంతికుమార్‌ లాంటి వాళ్ళు. నేనూ, అతడూ బాపట్లలో అగ్రిక్చరల్‌ బి.యస్‌.సి. చదువుకున్నాం. కాలేజీలో నాలుగు సంవత్సరాలు సహపాఠులమైతే, హాస్టల్‌ గదిలో రెండేళ్ళు సహవాసులం. ఇక మా ఇద్దరి ఆర్ధిక స్థితిగతులు ఎటువంటివంటే ` కాడెద్దులూ ఎకరం నేల జీవనోపాదిగా గల సామాన్య కుటుంబం మాది ఐతే, కోట్లతో వ్యాపారం ఢిల్లీలోనూ, వందల ఎకరాల సుక్షేత్రాలు హర్యానాలోనూ విరాజిల్లుతుండగా కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాది కలిగిస్తున్న సంపన్న కుటుంబం అతడిది! అతడు ఉద్యోగం చెయ్యడం కోసం చదవడం లేదు. వారి వ్యవసాయ క్షేత్రాలను ఆధునిక పద్ధతులో ఇంకా అభివృద్ధి చేయానే తపన అతడి తండ్రి గారిది. ఇతడి అన్నగారిని ఎమ్‌.బి.ఏ. చదివించి వ్యాపార రంగంలో దించితే, ఇతడ్ని ఏజీ బియస్సీ చదివించి వ్యవసాయ రంగంలో దించాలనే అభిలాష గల అభ్యుదయ వాది ఇతడి తండ్రి! మూడు తరాల క్రితం కృష్ణా జిల్లా నుండి ఢిల్లీకి వలస వెళ్ళిపోయిన తెలుగు కుటుంబం అంచెంలంచెలుగా ఎదిగి ఆ స్థాయికి చేరింది.
రెండు సంవత్సరా తర్వాత ఢిల్లీ వెళ్తున్నాను. ఇది మూడోసారి ఢిల్లీ ప్రయాణం. మూడు తడవలూ క్రాంతికుమార్‌ కి సంబంధించినవే! మొదటిసారి కాలేజీ సెలవలు అతడింట్లో గడపడానికీ, రెండోసారి అతడి వివాహానికీ, ఇప్పుడు మూడోసారి నా వివాహానికి అతడ్ని ఆహ్వానించడానికి.
నడుస్తున్న ట్రెయిన్‌లో కిటికి పక్కన కూర్చుని వెనక్కి పోతున్న చెట్లనీ, చేమల్నీ గమనిస్తూ రెండు సంవత్సరా క్రితం జరిగిన సంఘటనని తలుచుకుంటున్నాను.
నా ఉనికి ఎలా కనుక్కున్నాడో ఏమో! ఆ రోజు నా సీటుకెదురుగా నిబడిన క్రాంతికుమార్‌ని చూడగానే ఉలికిపడ్డాను. ఊహించని సంఘటన ఎదురు పడితే విస్మయం చెందడం మానవ సహజం. క్షణకాలం నివ్వెరబోయిన తర్వాత తేరుకుని సీటులోంచి లేచి వెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకున్నాను. అప్పుడు నాకింకా ప్రమోషన్‌ రాలేదు. మరో కుర్చీ తీసుకుని వచ్చి నా పక్కనే కూర్చోబెట్టు కున్నాను.
ఖరీదైన దుస్తుల్లో దొరబాబులా ఉన్నాడతడు. ‘‘ఎప్పుడొచ్చారు? ఏమిటీ హఠాత్తు సందర్శనం?’’ అన్నాను ఒకవైపు సంతోషమూ, మరోవైపు సందేహమూ ముఖంలో ప్రస్ఫుటమౌతూండగా.
అతడు చిన్నబుచ్చుకున్నట్టు కనిపించాడు. ‘‘ఏమిటీ బహువచన సంబోధన, రాజూ?’’ అన్నాడు కాస్త నిరుత్సాహపడుతున్నట్టుగా.
‘‘చాలా కాలమైపోయింది కదా! బాగోదేమో అనిపించినట్టుంది మనసుకి. నా ప్రమేయం లేకుండానే వచ్చేసాయి మాటలు.’’ అన్నాను నవ్వేస్తూ.
‘‘ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. నా పనుల్లో పడిపోయి నీతో మాట్లాడడం తగ్గించేసాను. బహుసా, అదే కారణం కావచ్చు మన మధ్య దూరం పెరగడానికీ, నువ్వలా సంబోధించడానికీ.’’ అన్నాడు నొచ్చుకుంటూ.
ఆఫీస్‌ స్టాఫ్‌ మమ్మల్ని ఇద్దర్నీ మార్చిమార్చి చూస్తున్నారు. ‘ఈ అక్కుపక్షి గాడికి ఇంత ఖరీదైన మిత్రుడెవరా?’ అని వారి సందేహం కావచ్చు.
‘‘అలా కేంటీన్‌ కెళ్ళి కాఫీ తాగి వద్దాం.’’ అన్నాను వారి పరిశీనా దృక్కులకు దూరమవ్వాలనే తలంపుతో.
‘‘ ఇది నీకిచ్చి వెళ్దామని వచ్చాను.’’ అన్నాడు చేతిలో శుభలేఖ పెడుతూ కేంటీన్‌లో కూర్చున్నాక. కుతూహలంగా చూస్తూ దానినందుకున్నాను.
‘‘నా పెళ్ళి శుభలేఖ.’’ అన్నాడు కవర్లోంచి కార్డు తీస్తూండగా. జరగబోయే శుభకార్యాలు ఏ స్థాయిలో ఉంటాయో శుభలేఖల్ని చూసి గ్రహించవచ్చు. అతని హోదాకి తగ్గట్టే ఉంది ఆహ్వాన పత్రిక!
‘‘చాలా సంతోషం! తప్పకుండా వస్తాను.’’ అన్నాను కాఫీ చప్పరిస్తూ. చదువుకునే రోజుల్లో అయితే అతడ్ని చనువుగా ‘నువ్వు’ అనేవాడ్ని. కాని ఆ చనువు ప్రదర్శించ లేకపోతున్నాను. నా మాటల్లో ‘నువ్వు, మీరు’ అనే పదాలు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నాను.
‘‘బాపట్ల వెళ్ళి రామం సార్‌ కి కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతాను. తప్పకుండా వస్తావు కదూ!’’ అని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు.
‘‘అతను మీకు బాల్యమిత్రుడా? అంత చనువుగా మాట్లాడుతున్నాడు. బాగా సంపన్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిలా ఉన్నాడు. పెళ్ళికి వెళ్తారా?’’ నా సహోద్యోగులు ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు అతను వెళ్ళిపోయాక. క్రాంతికుమార్‌ తో పరిచయం తెలుసుకున్నాకా నా కొలీగ్స్‌ కి నాపై ఆసక్తి కాస్త పెరిగినట్టే అనిపించింది.
ఆ పరిస్థితులో ఢిల్లీ ప్రయాణం కట్టడం ఇబ్బందికరమే నాకు. ఏదో అవసరముందని నాన్న ఉత్తరం రాసారు. మూడువందలు మాత్రమే ఉంచుకుని జీతం అంతా నాన్నకి పంపించేసాను. ఢిల్లీ ప్రయాణమంటే కనీసం వెయ్యిరూపాయలైనా కావాలి. ఎవరినైనా అడగాంటే తలకొట్టేసినట్టనిపిస్తుంది. ‘అయినను పోయి రావలయు హస్తినకు.’ క్రిష్ణ పరమాత్మ మాటలు నెమరు వేసుకున్నాను.
వెళ్ళక తప్పదు! అతడు నాకు ప్రాణ స్నేహితుడు. చదువుకునే రోజులో ఎన్నోసార్లు నాకు సాయపడ్డాడు. ఒక్కోసారి నా పట్లగల అతడి అభిమానం అబ్బుర పరచేది. అతడ్ని ఆకట్టుకున్న గుణం ఏమిటా అని తర్జన భర్జన పడేవాడ్ని అనేకసార్లు.
సెలవల్లో ఓ సారి అతడి బలవంతం మీద అతడితో కసి ఢిల్లీ వెళ్ళేను. అంతటి సంపన్న కుటుంబాన్ని ఎన్నడూ చూసి ఎరుగను. ఇంద్ర భవనంలాంటి సౌధం, సినిమా సెట్టింగులలా అలంకరించ బడ్డ గదులూ, ఇంటినిండా పనివాళ్ళూ` అదో అద్భుత ప్రపంచం! అపురూపమైన అనుభూతి! అక్కడ ఉన్న వారం రోజులు అతడు మాత్రమే కాదు! కుటుంబ సభ్యుందరూ అభిమానంగా చుశారు. అంతటి సంపన్నులో కూడా అంత ఔదార్యం గల వారుంటారా అనిపించింది.
చిన్నప్పుడు, ‘ఆకాశం మనమీద పడిపోవడం లేదెందుకూ?’ అని అమాయకంగా అడిగితే తాతయ్య చెప్పేవాడు` ‘లోకంలో కొందరు మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళు అకాశానికి గుంజ లాంటి వాళ్ళు. వాళ్ళవల్లనే ఆకాశం మనమీద పడిపోకుండా ఉంది.’ అని. అవును! క్రాంతికుమార్‌, అతడి కుటుంబ సభ్యులు నిజంగా ఆకాశానికి గుంజలే!
సత్సంకల్పానికి సర్వేశ్వరుని సహాయం లభిస్తుంది అంటారు. అనుకోకుండా డి.ఏ. బకాయిు పన్నెండు వందలు మర్నాడే చేతికందాయి. నాల్రోజులు సెలవు పెట్టి బయలుదేరేను. ఉన్నవాటిలోనివే కాస్త మంచిగా ఉన్నవి రెండు జతల బట్టలు పెట్టుకున్నాను. అతడికి కానుకలిచ్చే తాహతు నాకెలాగూ లేదు. అందుకే కానుక జోలికి పోలేదు.
అంతవరకూ బాగానే ఉంది. ఢిల్లీ చేరిన తర్వాతే తప్పుపని చేశాను. నా జీవితంలో దర్శించదగ్గ ఒక ప్రధాన ఘట్టాన్ని తిలకించ లేకపోయాననే నిర్వేదం శాశ్వతంగా మిగుల్చుకున్నాను.
వచ్చీరాని హిందీలో అడ్రసు చెప్పి ఆటో ఎక్కేను ఢిల్లీ స్టేషన్‌లో. ఇంద్రప్రస్థ మార్గ్ లో ఇంద్ర భవనంలాంటి సౌధం ముందు ఆగింది ఆటో. అందమైన ఆ భవనం, కాంతులు వెదజ్లుతున్న తోరణాలతో మరింత శోభాయమానంగా ఉంది. బాలులు తీరి పార్క్‌ చేయబడి ఉన్నాయి కారులు.
తమతమ హోదాల్ని ప్రదర్శింప జేసే దుస్తులతోనూ, చిత్రమైన అలంకరణలతోనూ కారుల్లోంచి దిగుతున్నారు జనాలు. ఆ తేజోమూర్తులను సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఆటోవాడికి డబ్బులిచ్చేసి ధైర్యం కూడదీసుకుని గేటువైపు నడిచాను.
పాపిట్ట గుంపులో కత్తెర పిట్టలా కనిపించానేమో! నావైపు నిశితంగా దృష్టి సారించాడో సెక్యూరిటీ వాడు. ‘‘క్రాంతికుమార్‌… దోస్త్‌… ఆంధ్రాసే ఆయాహూ…’’ అన్నాను తడబడుతూ. లోనికెళ్ళ మన్నట్టుగా సైగచేశాడు.
ఖరీదైన వ్యక్తులు జరుపుకునే తిరణాళ్ళలా వుంది అక్కడి వాతావరణం. గుంపులు గుంపులుగా చేరి హాసాల్లోస సంభాషణలలో తేలియాడుతున్నారు అందరూ. సాఫ్ట్‌ డ్రిరక్‌ బాటిల్స్‌ ట్రేలలో పెట్టుకుని అతిథులకు అందిస్త్తున్నారు బేరర్లు. నేనూ ఒక బాటిల్‌ అందుకుని ఓ మూ చేరుకుని నిలబడ్డాను.
‘ఈ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని నేను క్రాంతికుమార్‌ని చేరడం ఎలా?’ అనేది ఆ క్షణానికి జీవన్మరణ సమస్యలా తోచింది.
ఖాళీ బాటిల్‌ బేరర్‌కి అందించి ‘షాదీ కిదర్‌?’ అన్నాను.
‘బగల్‌ మే కల్యాణ్‌ మండప్‌ హై.’ అని ఏదో చెప్పి గుంపులోకెళ్ళిపోయాడు. ఇక్కడ ఆతిధ్యం స్వీకరించి ఆ ‘బగల్‌మే’ కల్యాణ మండపం చేరాలన్నమాట. అది నాకు సాధ్యమయ్యే పనేనా? నాలో ప్రాదుర్భవించిన శంక ‘ఇంతింతై వటుడింతై’ నట్టుగా క్షణాల్లో స్థూల పరిమాణంలోకి పెరిగిపోయింది. వేల సంఖ్యలో ఉన్న తేజోమూర్తుల మధ్య నేను మనజాలనని గ్రహించాను.
*****
తెలతెలవారు తూండగా ఢిల్లీ చేరింది ట్రెయిన్‌. రిసీవ్‌ చేసుకోడానికి స్టేషనుకొచ్చాడు క్రాంతికుమార్‌.
‘‘వస్తానని ప్రామిస్‌ చేసి నా పెళ్ళికి రాలేదు నువ్వు. ఇప్పుడు నీ పెళ్ళిపిలుపుకి వచ్చేవు.’’ అన్నాడు కారులో కూర్చున్నాక.
‘‘మామ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడం వలన రాలేకపోయాను.’’ అన్నాను దోషం చేసిన వాడిలా ముఖం పెట్టి.
‘‘అయ్యో! అలాగా?’’ అన్నాడు నా ముఖంలోకి సూటిగా చూసి.
కారు గేట్‌లోకి ప్రవేశించింది. ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని లోనికి దారితీసాడు. ఇ్లంతా ఖాళీగా ఉంది. తల్లీ, తండ్రీ, అన్నా, వదినా, పిల్లల్లూ ` అంతా ద్వారకా ధామ్‌ దర్శించడానికి వెళ్ళేరట. ఇతడూ భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. హాల్లో సోఫాలో కుర్చోబెట్టి భార్యని పిలిచాడు.
పాల సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవిలా ఆమె హాలులోకి ప్రవేశించింది. ఆమె రాకతో హాలు మరింత కాంతివంతమైనట్టనిపించిది.
‘‘ఇతడు నా మిత్రుడు రాజు.’’ అన్నాడు నన్ను ఆమెకు పరిచయం చేస్తూ.
ఆమె నమస్కారం చేసి, ‘‘ మిమ్మల్ని తరుచూ తలుచుకుంటూ ఉంటారండీ.’’ అంది చిన్నగా నవ్వి.
‘‘అతడి మామ్మగారికి ఒంట్లో బాగులేదని మన పెళ్ళికి రాలేక పోయాడట!’’ నా భుజాన్ని గట్టిగా తట్టి అన్నాడు. అతడి మాటల్లో ఎక్కడో వ్యంగ్యం ధ్వనిస్తున్నట్టే అనిపించింది.
‘‘టీ తీసుకున్నాక కాస్త విశ్రమించుదువు గాని.’’ అని లోనికెళ్ళాడు.
హాంతా నిశ్శబ్దం ఆవహించింది. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా దుర్భరంగా ఉంటుంది కాబోలు! కాస్త అసౌకర్యంగా కూర్చున్నాను.
కొద్ది క్షణానంతరం ఆమె ట్రేలో బిస్కెట్లూ, టీ కప్పులు తీసుకుని వచ్చింది. ఇంట్లో అంత మంది పనివాళ్ళుండగా ఆమె స్వయంగా తీసుకురావడం ఆశ్చర్యం కలిగించింది. సంస్కారం అనేది ఆ ఇంటిలో సంచరించే ప్రతీ ప్రాణికీ సొంతంలా అనిపించింది.
ఆమె వెనుకనే అతనూ వచ్చాడు. అతడి చేతిలో చిన్న గిఫ్ట్‌ బాక్సులాంటిదుంది.
నేను టీ కప్పు అందుకున్నాను. అతడు నా పక్కనే కూబడ్డాడు.
‘‘ఇది నా పెళ్ళికి వచ్చిన అపురూపమైన కానుక!’’ అన్నాడు నవ్వుతూ.
అందుకోబోతూంటే, ‘‘ముందు టీ త్రాగడం పూర్తి కానీ. చూద్దువుగాని.’’ అన్నాడు. టీ తాగుతున్నాను కాని దృష్టి ఆ బాక్సు మీదనే ఉంది.
కుతూహంగా బాక్సును అందుకున్నాను టీ తాగడం ముగించి.
‘‘దానిని చాలా అపురూపంగా భద్రపరుచుకున్నారండీ, మావారు.’’ అందే ఆమె.
బాక్సు తెరచి చూసి ఉలికిపడ్డాను. క్షణ కాం నిశ్చేష్టుణ్ణయ్యాను. విహ్వలంగా చూస్తూ ఉండిపోయాను బాక్సులోని వస్తువుని! అది నేను వ్రాసిన పోష్టు కార్డు!
‘‘దీనిని ఇంత అపురూపంగా… దాచు… కున్నారా?’’ అన్నాను ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరౌతూ.
‘‘అది సామాన్య వస్తువనుకుంటున్నావా? ఒక సత్యవాది ఓ అసత్యాన్ని సత్యంగా నిరూపణ చేయడంలో ఎలా వైఫ్యల్యం చెందేడో తెలియజేసే ప్రత్యక్ష సాక్షి ` ఈ పోష్టు కార్డు!’’ అన్నాడు నవ్వుతూ నా కళ్ళలోకి చుస్తూ.
‘‘ఇందులో ఆసత్యమేముందీ?’’ అన్నాను విస్మయంగా.
‘‘ అంతా అసత్యమే! మీ మామ్మగారు మనం ఫైనలియర్‌లో ఉండగా పోయారు. ఆవిడకి అనారోగ్యంగా ఉందనడం అసత్యం. ఇక మరో అసత్యమేమిటంటే ` ఢిల్లీలోనే పోష్టుకార్డు కొని ఢిల్లీలోనే పోష్టు చేశావు. సత్యసంధుడివీ, అమాయక పక్షివీ అయిన నీవు ఆసత్య మాడడంలో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయావు. నిజాయతీగా ఆ రోజు డేటు వేసి పోష్టుచేశావు. మర్నాడే చేరింది నాకు. విజయవాడనుండి ఢిల్లీ చేరడానికి కనీసం మూడు రోజులు పడుతుంది ఉత్తరానికి.’’ అతడి మాటలు విని సిగ్గుతో తల దించుకున్నాను. రెడ్‌హేండెడ్‌ గా పట్టుబడిన రెడిమేడ్‌ దొంగనయ్యాను.
‘‘నన్ను క్షమించండి.’’ అనగలిగాను లేచి నిలబడి.
‘‘ఛ! మనమధ్య క్షమాపణలేమిటి? కుర్చో.’’ అంటూ ఆప్యాయంగా భుజం తట్టేడు.
‘‘కార్డు చూశాక నువ్వు ఢిల్లీ వచ్చి వెళ్ళి పోయావనే నిర్ధారణకు వచ్చాను. రిసెప్షన్‌ హడావిడి అంతా వీడియోలో పరిశీలించాను. నువ్వు మొహమాటంగా సంచరించడం గమనించి బాధ పడ్డాను. నేనే స్వయంగా నిన్ను తీసుకు రానందుకు నిందించుకున్నాను. నన్ను నువ్వే మన్నించాలి, రాజూ!’’
‘‘అవునండీ. ఆయనదే పొరపాటు.’’ అంది ఆమె కూడా.
‘ఆకాశానికి గుంజ!’ తాతయ్య మాటలు చెవుల్లో మారుమ్రోగుతుండగా కళ్ళలో పలుచటి నీటిపొర కమ్మింది!
‘పురుషులలో పుణ్యపురుషులు!’ అనుకుని తలవంచుకున్నాను.

1 thought on “పురుషులలో పుణ్యపురుషులు

  1. మాలిక పత్రిక మొత్తము లో ఈ కధ హై లైట్……
    చాలా బాగా వ్రాసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *