May 2, 2024

ఆంధ్ర శాకంబరీమాత గోంగూర

రచన: ఎమ్మెస్వీ గంగరాజు

gongura
చల్లని తల్లిగ విలసిలు
అల్లన శాకాంబరీ ప్రసాదితవమ్మా
జిల్లని నాల్కల తుప్పును
మళ్లించెడి మాతవమ్మ మా గోంగూరా!

ఏ తెలుగు పర్వమందున
లాతులుగా పిండివంట లన్నియు వున్నా
మూతికి నీ రుచి తగలక
మాతా! అది విందు కాదు! మా గోంగూరా!!

ఎంగిలి పండ్లను తినుచూ
చెంగల్వల తోడ పూజ సేవయు నొందీ
మంగళ మూర్తగు రాముడు
అంగన! నిను తలచె నంట మా గోంగూరా!

మాయా బజారు చిత్రము
శ్రేయోదాయకము నయ్యె సినిమా కంతన్
ఆయా విజయము కంతను
మాయాన్విత చర్చ నీది మా గోంగూరా!

మచ్చిక సేయగ మోడీ
కిచ్చిరి మనవారు విందు మిమ్మును మరచీ
చచ్చిన హోదా రాదని
అచ్చముగా శాపమిచ్చి నావుగ తల్లీ!

హెచ్చుగ కోపము చెందకు
మెచ్చుచు మీ కూర్మి నంత మేమే పొందన్
నచ్చిన విధమున కొలుతుము
మచ్చుకు హోదాను తెమ్ము మా గోంగూరా!

అమ్మా! సత్యా దేవీ!
తెమ్మంటివి పారిజాత తీరుగ కృష్ణున్
ఝమ్ముగ నోరూరించే
కమ్మని గోంగూర మొక్క కావాలనవే!

ఈజీగా లభియించెడి
భాజీ గోంగూర కన్న భద్రము సుధయా?
వాజమ్మలు దేవాదులు
భేజించిరి సంద్రమంత భీతికి వెరచీ

వెస్ట్రను ఫుడ్డే మష్టను
ఫీస్టులు చేసేరు గాని ఫేక్టుని కనరే
టేస్టుకి గోంగూరన్నము
బెష్టని నుడివేసినారు బెమ్మం గారే!

చచ్చీ చెడి సాధించిన
స్వచ్ఛత నొప్పారు సుధను స్వాహా చేసీ
పిచ్చెత్తిన దేవతలకు
పచ్చడి గోంగూర మెతుకు ప్రాజ్ఞత నిచ్చున్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *